ప్రజానాడి తెలిసిన పాలనాదక్షుడు
{డాక్టర్ మర్రి చెన్నారెడ్డి లేకుండా తెలంగాణ ఉండేది కాదు}
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (30-11-2024)
{తెలంగాణ ఉద్యమానికి ఆయన దిశానిర్దేశం, నాయకత్వ నైపుణ్యం, ప్రజలతో సన్నిహితంగా మమేకం కావడం వంటి ప్రత్యేకతలు ఆయనను అసాధారణ నేతగా నిలిపాయి. రాజకీయ చతురతతోనూ, ప్రగతిశీల ఆలోచనలతోనూ, అత్యున్నత ప్రజాసేవా దృక్పథంతోనూ ఆయన తన సేవలను అందించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర అపూర్వం, అపురూపం. దీనిని తర్కించలేము. వర్తమాన తెలంగాణ విజయగాథలో చెన్నారెడ్డి స్ఫూర్తి ప్రతిబింబిస్తున్నది. ఆయన విలువలు, ఆలోచనల నుంచి మనం ఎన్నో, ఎన్నెన్నో పాఠాలు నేర్చుకోవాలి. మర్రి చెన్నారెడ్డి లేకుండా తెలంగాణ ఉండేది కాదు.} -సంపాదకుడి వ్యాఖ్య
తెలంగాణ రాష్ట్ర సాధనకు కారణభూతుడు, పది సంవత్సరాలు తొలి ముఖ్యమంత్రిగా అధికారంలో వున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని ‘తెలంగాణ మహానాయకుడు’ గా కొనియాడేవారు. 1969 ఉద్యమాన్ని పతాక స్థాయికి చేర్చిన చెన్నారెడ్డి, మలిదశ ఉద్యమానికి మార్గం సుగమం చేసి, రాష్ట్ర సాధనకు కారకుడయ్యాడని కేసీఆర్ అనేవారు. 1971 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) అఖండ విజయం సాధించినప్పటికీ, సీపీఐ నేత ఎస్‌ఏ డాంగే సలహాతో ఇందిరాగాంధీ రాష్ట్ర ఏర్పాటుకు నిరాకరించారని కేసీఆర్ అనేవారు. కొన్ని రక్షణలను హామీగా పొందడంతో సరిపెట్టుకొని, చెన్నారెడ్డి టీపీఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తెలంగాణలోని ఆయన ప్రత్యర్థులు ఆంధ్ర కాంగ్రెస్ నేతలతో కుమ్ముక్కై ఆయనను విమర్శించేవారు.
చెన్నారెడ్డి, ‘తెలంగాణ అభిమాని, నిర్ద్వందంగా తెలంగాణ వాది.’ 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ముందుగానే, అమృతసర్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశానికి, తెలంగాణ అంశంపై అభిప్రాయం వెల్లడించడానికి ఆయనను ఆహ్వానించారు. ఆ సమావేశంలో, దూరదృష్టితో, సాక్ష్యాధారాలతో ఆయన అభిప్రాయం తెలిపిన వెంటనే, వాటితో తాను ఏకీభవిస్తూనే, భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు తాను అనుకూలమని జవహర్‌లాల్ నెహ్రూ స్పష్టం చేశారు. అప్పుడు అక్కడే వున్న మౌలానా అజాద్, నెహ్రూతో, ‘మీ జమీర్ (మనస్సు) ఫిల్ఫిలా (నీరసంగా) అయిందని’ చమత్కరించారు.
పాత్రికేయ మిత్రుడు వెంకట్ పార్సా ద్వారా, డాక్టర్ చెన్నారెడ్డితో 1988లో పరిచయం, తరచూ కలిసే అవకాశం కలిగింది. మేమిద్దరం తరచు చెన్నారెడ్డి తార్నాకా నివాసానికి వెళ్లేవాళ్లం. ఆయన తన అనుభవాలను, అరుదైన రాజకీయ జ్ఞాపకాలను పంచుకునేవారు. అవి ఎంతో ప్రేరణాత్మకంగా, ఆసక్తికరంగా, ఉల్లాసంగా ఉండేవి. రాజకీయాలలో ఎదుగుతున్న, ఎదగాలనుకున్న యువ నాయకులు, వీటిని తెలుసుకోవడం ఎంతో అవసరం.
1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు, నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ‘వీబీ రాజును లోపల పెట్టవద్దు-డాక్టర్ చెన్నారెడ్డిని బయట పెట్టవద్దు’ అనే నానుడిని విస్మరించి, దానికి భిన్నంగా వ్యవహరించడంతో, చెన్నారెడ్డి కాంగ్రెస్‌ను విడిచి, కొద్దికాలం తరువాత చేరి, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.
చెన్నారెడ్డి రెండవసారి (1989-90) ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆయన పీఆర్వోగా పనిచేసే అవకాశం కలిగింది నాకు. అప్పుడూ, అంతకుముందు ఆయన్ను ఏపీసీసీ అధ్యక్షుడిగా నియమించబడటానికి ముందు, తరువాత, నేను ఆయనను దగ్గరగా పరిశీలించే వీలు కలిగింది. ఒక సీనియర్ నాయకుడిగా, సమస్యలను నిజాయితీగా, నిబద్ధతతో ఎదుర్కొని, ప్రజలతో మమేకమై వ్యవహరించడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉన్నదన్న అభిప్రాయం నా మొదటి పరిచయంలోనే ఏర్పడింది. ఆయనతో అనుభవాలు జీవితంలో చెరగని అక్షరాలుగా, స్ఫూర్తిని అందించే పాఠాలుగా నిలిచాయి. డాక్టర్ చెన్నారెడ్డికి వున్న రాజకీయ పరిజ్ఞానం, నేతృత్వ లక్షణాలు, సంక్షోభ నిర్వహణలో నైపుణ్యత, క్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించే తీరు ఇతరులలో అరుదుగా కనిపిస్తుంది.
1950లో ప్రొవిజనల్ పార్లమెంట్‌కు నామినేట్ కావడం, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ విప్‌గా నియమితులవడం కాక ముందు, చెన్నారెడ్డి మూడు సంవత్సరాలు వైద్యవృత్తిలో వున్నారు. 1952లో, హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికై, బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అప్పటి ఆయన ‘అధిక దిగుబడి’ నినాదం, భవిష్యత్తులో ‘హరిత విప్లవం’ రూపుదిద్దుకుని, దేశం ఆహార ధాన్యాల విషయంలో స్వయంసమృద్ధిని సాధించడానికి దోహదపడింది. 1967 సాధారణ ఎన్నికల తరువాత, ఇందిరాగాంధీ కేంద్ర కేబినెట్‌లో చేరమని సూచించినప్పటికీ, ముఖ్యమంత్రిగా కొనసాగడానికే మోగ్గుచూపిన బ్రహ్మానందరెడ్డి తనకు బదులుగా చెన్నారెడ్డి పేరును ప్రతిపాదించారు.
అందివచ్చిన అవకాశాన్ని దక్కించుకుని, ఉక్కు-గనుల శాఖ కేంద్ర మంత్రిగా చేరడం, రాజ్యసభ సభ్యుడిగా (1967) ఎన్నిక కావడం ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపులు. అత్యున్నత న్యాయస్థానం ఆయన శాసనసభ ఎన్నికను రద్దు చేసి, ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల పదవులు చేపట్టకుండా అనర్హత విధించడం వల్ల, 1968లో కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి హైదరాబాద్‌కు వచ్చారు. ఇందిరాగాంధీ 1970లో ప్రకటించిన విశాఖ ఉక్కు కర్మాగారం బ్లూప్రింట్‌ను కేంద్రమంత్రిగా తయారు చేసిన ఘనత చెన్నారెడ్డిదే.
ముల్కీ ఉద్యమాన్ని నడిపేందుకు ‘తెలంగాణ ప్రజా సమితి’ (టీపీఎస్)ను స్థాపించిన ఏ మదన్ మోహన్, తన అధ్యక్ష స్థానాన్ని చెన్నారెడ్డికి అప్పగించారు. ఇది చెన్నారెడ్డి నేతృత్వ సామర్థ్యాలను, నాయకత్వ పటిమను ప్రజలు తెలుసుకోవడానికి, తరువాత జరిగిన 1971 లోక్‌సభ, 1978 అసెంబ్లీ, 1980 లోక్‌సభ, 1989 లోక్‌సభ-అసెంబ్లీ ఎన్నికలలో ‘భారీ విజయాలు’ సాధించడానికి మార్గం సుగమం చేసింది. ఈ విజయాల వల్ల చెన్నారెడ్డి ‘అద్భుతమైన నాయకత్వ నైపుణ్యం’ ఉన్న వ్యక్తిగా నిరూపితమయ్యారు.
ఈ విజయ పరంపరకు మూలాలు 1970 నవంబర్‌లో జరిగిన సిద్ధిపేట అసెంబ్లీ ఉపఎన్నిక. టీపీఎస్ అభ్యర్థిగా మదన్ మోహన్‌ను రంగంలోకి దించిన చెన్నారెడ్డి, ఆ ఎన్నిక ప్రాముఖ్యత దృష్ట్యా, దాని ఫలితం తెలంగాణ సాధన ప్రక్రియకు ముందడుగు కావడం దృష్ట్యా, ఆయన విజయాన్ని ఖాయం చేసేందుకు సుమారు రెండు నెలల పాటు సిద్ధిపేటలోనే మకాం వేశారు. అదే రోజుల్లో ఆయన కేసీఆర్ నివాసంలో భోజనం చేసి, అక్కడే ఒకటి-రెండు సార్లు బస కూడా చేశారని కేసీఆర్ చెప్పారు. పెద్దనాన్న రంగారావుతో పాటు చెన్నారెడ్డితో తమ కుటుంబ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, కేసీఆర్, తన నేతృత్వంలో తెలంగాణ మలి ఉద్యమం విజయవంతం కావడానికి, చెన్నారెడ్డి దీక్ష, పట్టుదల, ఆకాంక్షల స్ఫూర్తి ప్రభావం వున్నదని చెప్పేవారు. ‘చెన్నారెడ్డి ఆత్మ నాలో ప్రవేశించింది’ అనేవారు. మదన్ మోహన్ 20,000 మెజారిటీతో గెలిచారు.
ఆరు సంవత్సరాల అనర్హత కాలం 1974లో ముగియగానే, తన స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్న హేమవతి నందన్ బహుగుణ కాంగ్రెస్ అధిష్ఠానానికి తలనొప్పిగా మారిన నేపధ్యంలో, అక్కడి రాజకీయ సమస్యలను చక్కదిద్దడానికి, చెన్నారెడ్డిని ఆ రాష్ట్ర గవర్నర్ గా నియమించింది ఇందిరాగాంధీ. దరిమిలా, బహుగుణ స్థానంలో నారాయణ దత్ తివారీని రావడం జరిగింది. చెన్నారెడ్డి ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఉండగా రెండు సార్లు అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. 1977లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న పూర్వరంగంలో, చెన్నారెడ్డి గవర్నర్ పదవికి రాజీనామా చేసి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. పుట్టపర్తి వెళ్లి సత్యసాయి బాబా ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇదిలా వుండగా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. 1978 జనవరిలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికవగా, చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఐ) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్‌కు ఆవుదూడ గుర్తు లభించడంతో, ఇందిరాగాంధీ కాంగ్రెస్‌కు చెన్నారెడ్డి చొరవతో చేతి గుర్తును లభించింది. అసెంబ్లీ ఎన్నికలలో, చెన్నారెడ్డి నేతృత్వంలోని ఇందిరా కాంగ్రెస్, బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్‌ను, అలాగే మొగ్గలో వున్న జనతా పార్టీని ఓడించి ఘన విజయం సాధించింది. 1978 మార్చి నెలలో ఆయన మొదటి కాంగ్రెస్ (ఐ) ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1980 లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ నుండి 42 స్థానాలలో 41 స్థానాలను గెలిపించి, ఇందిరాగాంధీ తిరిగి ప్రధాని కావడానికి దోహద పడినప్పటికీ, చెన్నారెడ్డిని తొలగించి ఆయన స్థానంలో అంజయ్యను సీఎం చేసింది అధిష్టానం.
1982లో పంజాబ్ గవర్నర్‌గా నియామకమైనప్పటికీ, ముఖ్యమంత్రి దర్బారా సింగ్‌తో విభేదాల కారణంగా, 1983 ఫిబ్రవరిలో గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత, హైదరాబాద్‌కు తిరిగివచ్చి కాంగ్రెస్ పార్టీని వీడారు చెన్నారెడ్డి. నేషనల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్డీపేఐ) స్థాపించి, 1984 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుండి పోటీ చేసి ఓటమి పొందారు. కొంతకాలం ఇంటికే పరిమితమైన ఆయన, 1986 అక్టోబర్‌లో, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జికే మూపనార్ విజ్ఞప్తికి స్పందించి, కాంగ్రెస్ పార్టీలో పునఃప్రవేశించారు.
1986లో కాంగ్రెస్‌లో తిరిగి చేరిన తర్వాత, డాక్టర్ చెన్నారెడ్డి నిర్వహించిన రెండు ప్రధాన కార్యక్రమాల పర్యవసానంగా మరోమారు కాంగ్రెస్ అధిష్టానం ఆయన సేవలు ఉపయోగమని అభిప్రాయపడింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జలగం వెంగళరావు, ఎన్ జనార్ధన్ రెడ్డి ఏపీసీసీ అధ్యక్షులుగా తమ ప్రభావం చూపించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఎన్టీ రామారావు ప్రభావాన్ని ధీటుగా అధిగమించడానికీ, 1989 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చడానికి చాలరని భావించింది. పటిష్టమైన నాయకుడిని రాజీవ్ గాంధీ అన్వేషిస్తున్న సమయంలో, డాక్టర్ చెన్నారెడ్డి ఆ స్థానానికి రావడానికి మార్గం సుగమం అయింది.
అయినప్పటి అప్పుడున్న ఏపీసీసీ అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డిని తొలగించాలంటే, చెన్నారెడ్డికి, జలగం వెంగళరావు, ద్రోణంరాజు సత్యనారాయణ, హెచ్‌కేఎల్ భగత్, (గవర్నర్) కుముద్ బెన్ జోషి వంటి వారి బలమైన మద్దతు కావాల్సి వచ్చింది. వారి సహకారాన్ని ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా కోరారు. అసమాన ప్రతిభా పాటవాలు, అద్భుతమైన పరిచయాలున్న పాత్రికేయుడు ఆదిరాజు వెంకటేశ్వరరావు, గత సంగతులు మర్చిపోయి, ఢిల్లీలోని కాంగ్రెస్ వర్గాల్లో, ముఖ్యంగా రాజీవ్ గాంధీ లాంటి పెద్దల వద్ద తనదైన శైలిలో ఇతరులకు అనుమానం రాకుండా ద్రోణంరాజు సత్యనారాయణతో కలిసి చెన్నారెడ్డికి అనుకూలంగా లాబీయింగ్ చేశారు. పదేళ్ల విరామం తరువాత ఆదిరాజును, చెన్నారెడ్డిని కలపడానికి నేను, వెంకట్ పార్సా చొరవ తీసుకున్నాం.
ఏదేమైతేనేం, వ్యూహం ఫలించింది. సత్య సాయిబాబా ఆశీర్వాదాలు పనిచేశాయి. 1989 ఏప్రిల్ మూడవ వారంలో, రాజీవ్ గాంధీ సూచనల మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, అంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్, కేఎన్ సింగ్, చెన్నారెడ్డిని ఢిల్లీకి రమ్మని ఆహ్వానించారు. యూపీ గవర్నర్ గా వున్నప్పుడు, కేఎన్ సింగ్ నాయకుడిగా ఎదగడానికి చెన్నారెడ్డి తోడ్పడం అనుకూలమైంది. ఆ కీలక సమావేశానికి చెన్నారెడ్డి చాలా జాగ్రత్తగా, భవిష్యత్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుల జాబితాతొ సహా (ఈ విషయాలు ఆయనే స్వయంగా చెప్పారు) అన్నీ సిద్ధం చేసుకుని మరీ వెళ్లారు. ఢిల్లీకి వెళ్లే ముందు, బేగంపేట విమానాశ్రయంలో చెన్నారెడ్డికి వీడ్కోలు చెప్పేందుకు నాతో సహా కేవలం ఐదుగురు మాత్రమే హాజరయ్యారు, ఢిల్లీలో ఆయన సుమారు మూడు వారాలు స్నేహితుల ఇంట్లో గడిపారు. ప్రతిరోజూ పరిస్థితిని నాకు వివరించేవారు.
కథ సుఖాంతం. 1989 మే 1న, చెన్నారెడ్డిని ఏపీసీసీ(ఐ) అధ్యక్షుడిగా నియమించారు. ఢిల్లీకి వెళ్లేనాటి పరిస్థితికి పూర్తి భిన్నంగా, మే 3న ఆయన హైదరాబాద్ చేరుకున్న సమయంలో, బేగంపేట విమానాశ్రయం కిక్కిరిసి పోయింది. ఇసుక వేస్తే రాలనంతమంది జనం. చెన్నారెడ్డికి ప్రొటోకాల్ తో సమానంగా, టాప్ లేని జీప్‌ను విమానం దగ్గరికి పోవడానికి అనుమతివ్వడం జరిగింది.
ఒక నెల తర్వాత, జూన్ 3, 1989న, ‘జవహర్ రోజ్గార్-పంచాయత్ రాజ్: గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం’ అనే అంశంపై ‘నేషనల్ ఇన్ఫర్మేషన్ సర్వీస్’ ఆధ్వర్యంలో, బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో చెన్నారెడ్డి అధ్యక్షత నేను ఏర్పాటు చేసిన సమావేశంలో, సివి నరసింహన్ (ఐసీఎస్), మోహిత్ సేన్ (సీపీఐ నాయకుడు), మదన్ మోహన్, ఉమా గజపతి రాజు తదితరులు ఘాటుగా ప్రసంగించారు. ఎన్టీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ, జైలు భరో కార్యక్రమం ఆద్భుతంగా ఆయన నిర్వహించడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ను ఉత్తేజపరిచాయి. 1989 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 294 సీట్లలో 181 సీట్లు గెలుచుకుంది.
సీఎల్పీ నేతగా చెన్నారెడ్డి ఎంపిక సులభంగా జరగలేదు. గవర్నర్ కుముద్ బెన్ జోషిని చెన్నారెడ్డి కలిసి తనకు మద్దతు కోరారని అప్పట్లో కథనాలు వినిపించాయి. చివరికి, కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలకుల రాకతో, అధిష్టానం ఆశీస్సులతో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. ఎన్నికల ముందు ఒక సందర్భంలో మాటవరసకు అన్న ప్రకారం, చెన్నారెడ్డి నన్ను తన నివాసానికి పిలిచి, పీఆర్వోగా గా నియమించారు.
మర్రి చెన్నా రెడ్డి వంటి మహానేతలు రాజకీయాల్లోకి రావడం అనేది అరుదైన భాగ్యం. తెలంగాణ ఉద్యమానికి ఆయన దిశానిర్దేశం, నాయకత్వ నైపుణ్యం, ప్రజలతో సన్నిహితంగా మమేకం కావడం వంటి ప్రత్యేకతలు ఆయనను అసాధారణ నేతగా నిలిపాయి. రాజకీయ చతురతతోనూ, ప్రగతిశీల ఆలోచనలతోనూ, అత్యున్నత ప్రజాసేవా దృక్పథంతోనూ ఆయన తన సేవలను అందించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర అపూర్వం, అపురూపం. దీనిని తర్కించలేము. వర్తమాన తెలంగాణ విజయగాథలో చెన్నారెడ్డి స్ఫూర్తి ప్రతిబింబిస్తున్నది. ఆయన విలువలు, ఆలోచనల నుంచి మనం ఎన్నో, ఎన్నెన్నో పాఠాలు నేర్చుకోవాలి. మర్రి చెన్నారెడ్డి లేకుండా తెలంగాణ ఉండేది కాదు.
డిసెంబర్ 2, 2024 న చెన్నారెడ్డి 28వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు.
(వెంకట్ పార్సా సహకారంతో)
(డిసెంబర్ 2, 2024 న చెన్నారెడ్డి 28వ వర్ధంతి)
No comments:
Post a Comment