ఏమో … గుర్రం ఎగరావచ్చు!
(కాంగ్రెస్ పార్టీ మార్క్ క్రమశిక్షణ)
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిట్ పేజీ
(04-02-2025)
ఐదారు నెలల క్రితం, యాధృచ్చికంగానో, మనసులో మాటో, ‘అధిష్టానం కోయిల ముందే కూసిందో’ కాని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహచరమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తనతో సమానంగా సిఎం అయ్యే అర్హతలున్నాయని, ఆయన నిజమైన ‘పోరాట యోధుడుని ప్రశంసించారు. ఆ మర్నాడే మరో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సహితం ఇలాంటి అర్థం వచ్చే వ్యాఖ్యలే చేశారు.
ముఖ్యమంత్రి, మంత్రి వ్యాఖ్యల అర్థం ఏదైనా కావొచ్చు. ‘కాంగ్రెస్ పార్టీ మార్క్ (ఒక) వారసుడి పరోక్ష నిర్ణయం’ జరిగి వుండాలని, వీరి వ్యాఖ్యల నిగూఢార్థం, అంతరార్థం కావచ్చు. కాకపోనూ వచ్చు. ఈ వ్యాఖ్యానాల్ని ‘రీడ్ బిట్వీన్ ద లైన్స్’ విధానంలో విశ్లేషిస్తే, ‘పార్టీ-ప్రభుత్వ స్టీరింగ్’ మీద ‘చేతులు మారే’’ అవకాశాలున్నాయేమో అన్న అభిప్రాయం కలగడం సహజం. అది ఐదారునెలల క్రితం జరిగిన ఈ సంగతి, ఆ తర్వాత పూవు పూసి, కాయ కాసి, ఇప్పుడు దోరపండు స్థాయికి చేరుకున్నది. ఎప్పుడైనా పూర్తిగా పక్వానికి రావచ్చు!!
ఇటీవలి కొన్ని పరిణామాలు, వాటి పర్యవసానాలను నిశితంగా విశ్లేషిస్తే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథ సారథ్యం సంక్షోభంలో కూరుకుపోతున్నదా? అన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతున్నది. పరిస్థితి నాయకుడి అదుపులోంచి శీఘ్రంగా జారిపోతున్నదనే భావన విశ్లేషకుల్లో వినిపిస్తున్నది. ఊపిరాడనివ్వకుండా అస్మదీయ, తస్మదీయ ఎమ్మెల్యేల వేరుకుంపటి సెగలు-పొగలు, పార్టీమారివచ్చిన ఎమ్మెల్యేలలో అపోహలు, అసహనం, ఏ మంత్రి పదవికి ఎప్పుడు ఎసరు వస్తుందోనన్న ఆందోళన, కొందరు మంత్రుల మీద ఆ పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిని బాహాటంగా ప్రకటిస్తున్న సందర్భాలు, ఆ క్రమంలో తొలి అడుగుగా కలకలం రేపిన పదిమంది శాసనసభ్యుల రహస్య భేటీ వార్త, వీటన్నిటినీ తలదన్నే, కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్ (ఎక్స్) హ్యాండిల్ నిర్వహించిన సర్వేలో దాదాపు 70-80 శాతం మంది కాంగ్రెస్ పాలనను వ్యతిరేకించడం....ఇంకా...మరెన్నో... దేనికి దారితీయనున్నదో?
కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే, అధినాయకత్వంమీద భయంతో కూడుకున్న అపార విశ్వాసం, గౌరవం, ‘విచిత్రమైన క్రమశిక్షణ’ జగద్వితం. కాంగ్రెస్ పాలిత ఏ రాష్ట్రంలోనైనా, ‘తుమ్మితే వూడే ముక్కులాగా’ నాయకత్వ మార్పు అలవోకగా ఏ క్షణంలోనైనా జరగవచ్చు. నాటి నుండి నేటి వరకు, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నాయకుని ఎంపికైనా, నామినేషనైనా అధిష్టానం కనుసన్నల్లో, ఇష్టానుసారం జరిగేదననేది అక్షరసత్యం! అధిష్టానాన్నే ‘పార్లమెంటరీ బోర్డ్’ అనీ, ‘హైకమాండ్’ అని సమయ-సందర్భాన్ని బట్టి ‘పాజిటివ్’ లేదా ‘నెగెటివ్’ అర్థం వచ్చేట్లు ముద్దు-ముద్దుగా పిలుచుకుంటారు కాంగ్రెస్ పార్టీ చోటా-బడా నాయకులు.
ఉమ్మడి రాష్ట్రం రోజుల నుండి, ఉభయ తెలుగు రాష్ట్రాలలో నిరాడంబరంగా, సాదాసీదాగా, ఉన్నతమైన విలువలతో, ముఖ్యమంత్రి, లోక్ సభ స్పీకర్, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రుల స్థాయికి ఎదిగి, హంగూ-ఆర్భాటం లేని సాధారణ జీవితం గడిపిన అగ్రశ్రేణి ప్రముఖుల స్ఫూర్తి, విలువలు, క్షీణించిపోతున్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి, ముఖ్యమంత్రులుగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న బూర్గుల రామకృష్ణారావు ఆకోవకు చెందిన వారే. ప్రతిపక్ష నాయకుడుగా వున్న పుచ్చలపల్లి సుందరయ్య ఒక మహామనీషని ప్రత్యర్థులు సహితం అంగీకరిస్తారు. అలాగే వావిలాల, తెన్నేటి.
కాంగ్రెస్ పార్టీకి చెంది, ముఖ్యమంత్రులుగా పనిచేసిన తెలుగువారెందరో రాజకీయ ఉద్దండులుగా, దేశరాజకీయాలను శాసించే స్థాయికి, ప్రధాని అభ్యర్థినే నిర్ణయించే స్థాయికి చేరుకున్న సందర్భాలున్నాయి. నీలం సంజీవ రెడ్డి అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి, కేంద్రమంత్రి, లోక్ సభ స్పీకర్, రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. దామోదరం సంజీవయ్య అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యాడు. కాసు బ్రహ్మానంద రెడ్డి కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించి, అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. పీవీ నరసింహారావు కేంద్రమంత్రిగా, ప్రధాన మంత్రిగా వున్నారు. జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, విజయభాస్కరరెడ్డి, టంగుటూరి అంజయ్యలు కేంద్ర మంత్రులయ్యారు. తెలుగుదేశానికి చెందిన ఎన్టీరామారావు కేంద్ర రాజకీయాల నిర్దేషకుడయ్యాడు. చంద్రబాబునాయుడు కేంద్రంలో చక్రం తిప్పాడు. రాష్ట్ర విభజన అనంతరం, తెలంగాణ మొదటి సిఎంగా తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంతకు ముందే కేంద్రమంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రిగా అధిష్టానం ఎంపిక చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి భవిష్యత్తులో వీరి స్థాయికే చేరుకోవాలి.
ఎన్టీరామారావు ముఖ్యమంత్రి కావడానికి పూర్వం, రాష్ట్ర రాజకీయాలంటే, కాంగ్రెస్ పార్టీ అంతర్గత, బహిర్గత, సమ్మతి, అసమ్మతి, రాజకీయాలే. స్వపక్షంలోని అసమ్మతి నాయకులకు, విమర్శలు చేసే విపక్ష నాయకులకు, అధికారంలో వున్న పెద్దలు సముచితమైన గౌరవం ఇచ్చేవారు. నిస్వార్ధంగా, గౌరవప్రదంగా, విద్వేషరహితంగా రాజకీయాలలో రాణించిన మహనీయులెందరో నడయాడిన తెలుగురాష్ట్రాలలో, వర్తమాన రాజకీయాలు జుగుప్స, అసహనం, అసహ్యం, నిస్సహాయాత, తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలా వుండగా, వేగంగా మారుతున్న రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల నేపధ్యంలో నాయకత్వ మార్పు వుండవచ్చా? లేకపోవచ్చా? గత ఏడు దశాబ్దాల అనుభవాలను చర్విత చరణం చేసుకుంటే ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సామెత గుర్తుకు వస్తుంది.
ముఖ్యమంత్రి కావడానికి ముందు సీఎల్పీ నాయకుడి ఎంపిక ఆసక్తికరంగా వుండేది. 1956 లో సంజీవరెడ్డి ఎన్నికైనప్పుడు రాజకీయం చేయకుండా ఐక్యతకు, క్రమశిక్షణకు ‘అధిష్టానం’ ప్రాధాన్యత ఇచ్చింది. బూర్గుల అభ్యర్థిత్వానికి వ్యతిరేకత వ్యక్తం కావడంతో, పోటీ సంజీవరెడ్డి, బెజవాడల మధ్యనే జరిగింది. బూర్గుల, జేవీ నరసింగరావుల మద్దతు నీలంకు లభించగా, చెన్నారెడ్డి వర్గం బెజవాడను బలపర్చారు. రహస్య ఓటింగ్ ద్వారా సంజీవరెడ్డిని ఎన్నుకున్నారు. 1957 సార్వత్రిక ఎన్నికల తరువాత కూడా, చెన్నారెడ్డి అభ్యంతరాన్ని కాదని, నీలం సంజీవరెడ్డినే సీఎల్పీ నాయకుడిగా ఎన్నుకున్నారు. సంజీవరెడ్డి అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావడంతో, సంజీవరెడ్డి రాజీపడి దామోదరం సంజీవయ్యకు మద్దతు పలికారు. 1962 ఎన్నికల అనంతరం, నీలం, దామోదరం పోటీలో నిలిచినప్పటికీ, సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి అధిష్టానం ఆదేశించింది. నీలం సిఎం అయ్యారు. 1964 లో సిఎం పదవికి రాజీనామా చేసిన సంజీవరెడ్డి, సీఎల్పీ నాయకుడిగా కొనసాగుతూనే, బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రిగా ‘నామినేట్’ చేయించగలిగాడు. లాల్ బహదూర్ మంత్రివర్గంలో సభ్యుడైన తరువాత సంజీవరెడ్డి సీఎల్పీ నాయకత్వానికి రాజీనామా చేస్తే, బ్రహ్మానందరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతా అధిష్టానం చలవే!
1967 సార్వత్రిక ఎన్నికల నంతరం, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం వల్ల, అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచి, సీఎల్పీ నాయకుడిగా, బ్రహ్మానందరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1971 లోక్ సభ మధ్యంతర ఎన్నికల తరువాత, ‘అధిష్టానం’ ఆదేశం మేరకు, బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేశారు. ‘బలపడుతున్న సిఎంలను తొలగించాలన్న’ ఇందిరాగాంధీ వ్యూహంలో భాగంగానే కాసు రాజీనామా చేయాల్సి వచ్చిందనేవారు. ఇందిరాగాంధీ (ఏకవ్యక్తి అధిష్టానం) నిర్ణయం మేరకు నీలం, కాసులకు ‘విదేయుడిగా పేరుతెచ్చుకుని’ అనుచరవర్గం లేదని భావించిన, పీవీ నరసింహావును ఏకగ్రీవంగా శాసనసభా పక్షం నాయకుడిగా ఎన్నిక చేయించి ముఖ్యమంత్రిని చేసింది అధిష్టానం.
1972 ఎన్నికలు జరిగిన తరువాత, పీవీ ఏకగ్రీవంగా సీఎల్పీ నాయకుడిగా ఎన్నికై, ముఖ్యమంత్రి అయ్యారు. ఏకవాక్య తీర్మానం ద్వారా, నాయకత్వం ఎంపిక ప్రధాని ‘ఇందిరాగాంధీ’కి (పార్టీ అధ్యక్షురాలికి, అధిష్టానానికి) వదిలిపెట్టే సాంప్రదాయం, ‘సీల్డ్ కవర్ రాజకీయాలు’ ఊపందుకున్నాయి. రాష్ట్ర విభజన ఆందోళన నేపధ్యంలో సిఎం పదవికి రాజీనామా చేయాల్సివచ్చిన పీవీ, సీఎల్పీ నాయకుడిగా కొనసాగారు. రాష్ట్రపతి పాలనలో శాసనసభ రద్దుకాలేదు. దరిమిలా, పీవీని సీఎల్పీ నాయకుడిగా రాజీనామా చేయమని ఆదేశించిన అధిష్టానం, ఆయన స్థానంలో వ్యక్తిని ఎంపిక చేసే అధికారం, 1973 అక్టోబర్ చివరలో సమావేశమైన కాంగ్రెస్ శాసనసభా పక్షం, ‘ఇందిరాగాంధీ’కి అప్పచెప్పింది. ‘ఇందిరాగాంధీ ఆశీస్సులు’ వుంటే చాలనే సాంప్రదాయం బలపడ సాగింది.
ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పేరును ఢిల్లీలో ప్రకటించారు ఇందిరాగాంధీ. మరో సాంప్రదాయానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. అదే ఇప్పటికీ కొనసాగుతున్నది. భవిష్యత్తులోనూ కొనసాగి తీరుతుంది. అంటే, ఏ క్షణంలో ఎవరి పేరైనా అప్పటివరకున్న సిఎం కు తెలియకుండానే ఢిల్లీలో ప్రకటన రావచ్చు. వెంగళరావు సిఎంగా వున్నప్పుడే అత్యవసర పరిస్థితి విధించడం, ఎత్తివేయడం, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, కేంద్రంలో కాంగ్రెసేతర జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగాయి. కాంగ్రెస్ పార్టీ చీలిపోయి, ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ (ఐ) ఆవిర్భావం జరిగింది. 1978 జనవరిలో రాష్ట్ర శాసనసభకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉన్న చెన్నారెడ్డి రాజీనామా చేసి ఇందిరా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. ఫిబ్రవరి 24న జరిగిన ఎన్నికలలో ఇందిరా కాంగ్రెస్ 175 స్థానాల్లో ఘన విజయం సాధించింది. వెంగళరావు నాయకత్వంలోని బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ వర్గం ఓడిపోయింది.
చెన్నారెడ్డి, రాజారాంలు సీఎల్పీ నాయకత్వ పోటీకి సిద్ధమయ్యారు. ఆధిపత్యానికి తిరుగులేని ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు, రాజారాం పోటీనుండి తప్పుకోవడంతో సీఎల్పీ నాయకుడిగా చెన్నారెడ్డి ఎన్నిక ఏకగ్రీవమయింది. కాంగ్రెస్ పార్టీ ‘సమ్మతి-అసమ్మతి’ వర్గపోరు తీవ్రమై, 19 నెలల తరువాత ఇందిరాగాంధీ ఆదేశం మేరకు చెన్నారెడ్డి రాజీనామా చేయడం, ఆయన వారసుడిగా ఆమే ‘స్వయంగా’ ఎంపికచేసిన కేంద్ర కార్మికశాఖ మంత్రి, తెలంగాణ ప్రాంత వ్యక్తి, టంగుటూరి అంజయ్య నియామకం జరగడం కేవలం లాంఛనమే. అనుకోని పరిణామాల నేపధ్యంలో రాజీనామా చేసిన అంజయ్య స్థానం ఇందిరాగాంధీ అనుగ్రహంతో భవనం వెంకట్రాంరెడ్డికి దక్కింది.
ఇంతలో ఎన్టీ రామారావు రాజకీయ రంగప్రవేశం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, పదవిలో ఏడు నెలలు కూడా నిండని భవనం రాజీనామా, ఐదేళ్లలో నాలుగో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కరరెడ్డి నామినేట్ కావడం, 1983 లో ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడం, ఎన్టీ రామారావు అఖండ విజయం సాధించి సిఎంగా మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు కావడం, సమకాలీన రాజకీయ చరిత్ర. ఆ సమకాలీన చరిత్రలోనే విఫలమైన నాదెండ్ల భాస్కర రావు తిరుగుబాటు ఒక దురదృష్ట అధ్యాయం.
1989 శాసనసభ ఎన్నికలలో చెన్నారెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఢిల్లీ పెద్దల అండతో, సీఎల్పీ నాయకుడిగా ఎన్నికై రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయ్యారు (నేను ముఖ్యమంత్రి పీఆర్వోగా ఆయన దగ్గర పనిచేశాను). సంవత్సరం గడవక ముందే, కాంగ్రెస్ పార్టీ సంస్కృతీ, సాంప్రదాయాలైన, ‘ఢిల్లీ పెద్దల వ్యవహారశైలి’ వల్ల చెన్నారెడ్డి రాజీనామా చేయక తప్పలేదు. ఆ తరువాత ముఖ్యమంత్రైన నేదురుమల్లి జనార్ధనరెడ్డికి అసమ్మతి సెగ తగలడంతో రాజీనామా చేయక తప్పలేదు. తరువాత కోట్ల విజయభాస్కరరెడ్డిని రెండోమారు ముఖ్యమంత్రిని చేసింది అధిష్టానం. ఆ నిర్ణయమే 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి దారితీసింది. ఎన్టీఆర్ రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయినప్పటికీ, ఆయన మీద తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన చంద్రబాబునాయుడు, 1999 ఎన్నికలలోనూ గెలిచి ముఖ్యమంత్రి కాగలిగారు.
2004 ఎన్నికలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డి శ్రీనివాస్ ల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ, అధిష్టానం (సోనియాగాంధీ) ఆశీస్సులు రాజశేఖరరెడ్డికి లభించి సీఎల్పీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడానికి వీలైంది. 2009 లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి, ‘ఆటోమేటిక్ చాయిస్’ గా మరోమారు సీఎల్పీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ఆర్ అకాల మరణంతో రోశయ్య, తరువాత కిరణ్ కుమార్ రెడ్డిలను నామినేట్ చేసింది అధిష్టానం. తెలంగాణ ఆవిర్భావం తరువాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు బీఆర్ఎస్) రెండు పర్యాయాలు (2014, 2018 ఎన్నికలలో) అధికారంలోకి రావడం, కె చంద్రశేఖర్ రావు సిఎం కావడం జరిగింది. ఎన్టీ రామారావుకు, చంద్రబాబునాయుడుకు, చంద్రశేఖర్ రావుకు వారికి వారే అధిష్టానం. వారిదే నిర్ణయం.
పీసీ అధ్యక్షుడిగా వున్న ఎనుముల రేవంత్ రెడ్డి సారధ్యంలో, 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆయనే కాంగ్రస్ పార్టీ శాసనసభా పక్షం నాయకుడిగా ఎన్నికవుతారని అందరూ భావించినా, అలవాటు, ఆచారం, సాంప్రదాయం ప్రకారం, అధిష్టానం నుంచి ‘క్లియరెన్స్’ వచ్చేవరకు ప్రకటన రాలేదు. తెలుగురాష్ట్రాలలో ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యంత్రులుగా అయినవారందరూ నీలం నుండి కిరణ్, రేవంత్ వరకూ అధిష్టానం కనుసన్నలలో మెలిగినవారే, మెలగాల్సినవారే.
సిఎంలు అయిన వారినెవరినీ కాంగ్రెస్ అధిష్టానం ‘సాధారణంగా’ పూర్తికాలం పదవిలో’ వుండనీయలేదు. చెస్ బోర్డులో, పచ్చీసు పట్టాలో పావులను కదిలించినట్లు సిఎంలను మార్చడం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం. దీనికి భిన్నంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పూర్తికాలం పదవిలో కొనసాగగలరా? కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి, అసహనం, అసమ్మతి సహజం. దీనికి అతీతులెవరూ లేరు. ‘శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు’ అంటారు. ‘శివుడి ఆజ్ఞ’ అంటే ‘అధిష్టానం ఆజ్ఞ.’ ఎమ్మెల్యేల వేరుకుంపట్లు, రహస్య భేటీలు కాంగ్రెస్ పార్టీకి చెందినంతవరకు ‘అధిష్టానం ఆశీస్సులు’ లేకుండా జరగవు!!! ఇంతకీ అధిష్టానం పనుపున చక్రం తిప్పుతున్న ఆ వ్యక్తి ఎవరనేది ప్రశ్న?