Saturday, February 22, 2025

కేసీఆర్ రాక అనివార్యం : వనం జ్వాలా నరసింహా రావు

 కేసీఆర్ రాక అనివార్యం 

వనం జ్వాలా నరసింహా రావు

నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిట్ పేజీ (23-02-2025) 

తెలంగాణ, ఒక కల, ఒక లక్ష్యం, ఒక పోరాటం! ఆపోరాటంలో గెలిచింది ప్రజలు, వారికి నాయకత్వం అందించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఇది చరిత్ర. పోరాటం ద్వారా సిద్ధించిన తెలంగాణ, పురోగమనం, అభివృద్ధి, స్వాభిమానం అనే విలువలతో ముందుకెళ్లిన వేళ, దాన్ని వెనక్కు మళ్లించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో, ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా ఆ చర్యలను అడ్డుకోవాల్సిన ఆవశ్యకత మరింత పెరిగింది.

అజరామరమైన ఈ భూమి సుదీర్ఘ చరిత్రలో, ఎన్నో తరాలు అనుకున్నది ఒకటైతే, అయింది మరొకటి. ఆ నానుడికి భిన్నంగా, తొలివిడత ఉద్యమ పునాదుల మీద సాగిన మలివిడత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఒక సమకాలీన విప్లవం మాత్రమే కాదు, ఒక ప్రజా శక్తి ప్రతిధ్వని, ప్రతిభింబం. ఈ రోజు తెలంగాణ జాతి ముందున్న ప్రధాన ప్రశ్న: ఆవిర్భావం నుండి అప్రతిహతంగా ఇది సాధించిన పురోగమాన్ని కొనసాగించాలా? లేక వ్యూహరహిత పాలనలో సీమాంధ్రుల పాలనలోలాగా మళ్లీ వెనుకబడాలా? నాయకత్వం అంటే కేవలం పదవి కాదు, భవిష్యత్తును నిర్మించే శక్తి. 

తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణ అభివృద్ధికి అవిరళ కృషిచేసిన నాయకుడు, తిరిగి అదే దారిలో ప్రజలకు మార్గదర్శకత్వం అందించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుత తరుణంలో తెలంగాణకు అవసరమైన నాయకత్వం ఎవరు అందించగలరన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. ఫిబ్రవరి 19, 2025 బుధవారం రోజున, హైదరాబాద్ తెలంగాణ భవన్ లో  బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి,  కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. తెలంగాణ చారిత్రక సామాజిక సాంస్కృతిక రాజకీయ పరిణామక్రమాన్ని కేసీఆర్ ఆ సమావేశంలో సమగ్రంగా, సోదాహరణంగా వివరించారు. తెలంగాణ సమాజం చారిత్రక అవసరం దృష్ట్యా ప్రసవించిన బిడ్డ నాటి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), నేటి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని నెలలు నిండకుండానే నలిపివేయాలని ఎన్నో కుట్రలు జరిగాయని, అయినా వాటన్నిటిని అధిగమించి, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించి, రాష్ట్రాన్ని సాధించామని ఆ సమావేశంలో కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.

తెలంగాణ ఇప్పుడు మళ్లీ వలసవాద కుట్రలకు బలయ్యే ప్రమాదంలో వున్నది. గత అనుభవాల గాయాలనుంచి కోలుకుంటున్న తరుణంలో, వలసవాద పాలకుల చేతిలో పడితే తెలంగాణ ఎప్పటికీ కోలుకోకుండా ఇబ్బందుల పాలయ్యే ప్రమాదం పొంచి వున్నది. అలా జరుగకుండా వుండాలంటే, తెలంగాణ కు శాశ్వతంగా న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ ప్రజలను పూర్తి స్థాయిలో చైతన్యపరచాలి. తెలంగాణకు  రక్షణకవచం బిఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఆ బాధ్యత ప్రతి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త మీద వున్నది. సమావేశం విశిష్టత గురించి కూడా కేసీఆర్ వివరించారు.

 ‘తెలంగాణ జాతి ప్రస్థానం లో తలెత్తిన గాయాల బాధలు పూర్తిగా మానిపోయి, స్వేచ్ఛవాయువులు పీల్చుకునేలా, తెలంగాణ తనకు తాను నిలబడాలన్న ఆశయంతో పుట్టినదే మన పార్టీ అని, అటువంటి చారిత్రక పాత్రను పోషించేందుకు సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు కేసీఆర్. అందుకు లోతైన చర్చ కోసం నిర్వహిస్తున్నదే ఈ ప్రత్యేక సమావేశమని చెప్పారు. పార్టీని గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి దాకా పటిష్ట నిర్మాణం చేసి, అటు పార్టీ విజయం కోసం, ఇటు తెలంగాణ ప్రజల శాశ్వత విజయం కోసం, సమాంతరంగా పని చేయాలని, సమావేశంలో పాల్గొన్న  నాయకులకు కేసీఆర్ తనదైన శైలిలో దిశా  నిర్దేశం చేశారు.

ఈ సమావేశానికి సరిగ్గా రెండు రోజుల ముందు, ఫిబ్రవరి 17, 2025 న, కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు, ఆయన వుంటున్న ఫామ్‌హౌస్‌కు వెళ్లిన స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ పొందిన డాక్టర్ అంజనేయ గౌడ్, అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్య పోయారు. దాన్ని తనదైన శైలిలో ఆ సన్నివేశాన్ని అద్భుతంగా ఆయన ఆవిష్కరించారు. వేలాదిమంది అభిమానులు, అనుచరులు, వివిధ రంగాల ప్రజలు కేసీఆర్‌ను కలసి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారని, వారి రాక ఏకంగా ఓ అద్భుతమైన సంకేతంగా మారిందని, ‘కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావడం అనివార్యం, అత్యంత అవశ్యమని’ అర్థమైందని రాశారు. అలా,  జనాదేశం స్పష్టంగా వెల్లడైంది.

టీఆర్ఎస్-బీఆర్ఎస్ వ్యవస్థాపకుడిగా, అధ్యక్షుడిగా, 25 ఏండ్లకు పైగా కేసీఆర్ తెలంగాణ సమకాలీన రాజకీయాలను శాసించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు బ్రహ్మాండమైన శాంతియుత ఉద్యమాన్ని, తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రాన్ని పునర్నిర్మించారు. ఆయన అమలుపరచిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సామాన్యులకు ఎంతో మేలు చేకూర్చాయి. అయినప్పటికీ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా తాత్కాలిక ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన పునరాగమనానికి ఏవిధమైన ఆటంకాలు లేవనే విషయం  త్వరితగతిన మారుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 

ప్రజల్లో కేసీఆర్ పట్ల పెరుగుతున్న అభిమానానికి అదనంగా, ఆయన అమలుపరచిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, పాలనా సంస్కరణలను ఒక పథకం ప్రకారం, ప్రస్తుతం అధికారంలో వున్న ప్రభుత్వం తిలోదకాలు ఇవ్వడం గమనిస్తే, ఆయన తిరిగి అధికారంలోకి రావడం తథ్యం అనేది స్పష్టం. నాయకత్వం అంటే అది చూపే ప్రభావం. అలాగే, అది లేకపోవడంలో ఏర్పడే శూన్యత. కేసీఆర్ పాలనలో తెలంగాణ అనూహ్య ‘సంక్షేమ, అభివృద్ధి కేంద్రిత సుపరిపాలన, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన’ చవిచూసింది. 

రైతు బంధు, దళితులకు దళిత బంధు, యావన్మంది ప్రజలకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం లాంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం,  మొదలైన అనేక చారిత్రక కార్యక్రమాలు అమలు చేసి, రాష్ట్రాన్ని ఆత్మనిర్భరంగా తీర్చిదిద్దారు కేసీఆర్. కానీ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్థవంతమైన ఈ పథకాలను, కార్యక్రమాలను, అర్థరహితంగా రద్దు చేస్తూ, పథకం ప్రకారం రాష్ట్రాన్ని మరోసారి సంక్షోభం దిశగా నడిపిస్తున్నది. ఒక్కో పథకాన్ని, ఒక్కో నిర్ణయాన్ని రద్దు చేయడం ద్వారా, తెలంగాణను తిరిగి ‘రైతు సంక్షోభం, సామాజిక అనిశ్చితి’ వైపు లాక్కుని వెళ్లడం జరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో, కేసీఆర్ పునరాగమనం మినహా, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, భవిష్యత్తుకు బలమైన భరోసా మరోటి లేదు.

పరిపాలన అనేది కేవలం విధానాలు లేదా రాజకీయ కుతంత్రాల కాదు. అది బాధ్యతలు నెరవేర్చే, సత్ఫలితాలు అందించే, పవిత్ర కార్యం. పాలన అంటే అమలు, అనుసంధానం, ప్రజా సంక్షేమం పట్ల అంకితభావం. పురోగమనం స్థానంలో తిరోగమనం జరుగుతుంటే, చరిత్ర మనకు చెప్పిన సత్యం ఒక్కటే. మార్గదర్శకమైన నాయకత్వం తిరిగి రావడం అనివార్యమనే, ఆవశ్యకత అనే నగ్న సత్యం. ఇలా జరగడం, కేవలం ఎన్నికలలో విజయం మాత్రమే కాదు. ఇది చారిత్రకంగా తప్పనిసరి. కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాల అర్హత, ప్రాధాన్యత, సామాజిక-ఆర్ధిక ఆవశ్యకతల ప్రాముఖ్యత గుర్తించకుండా, వక్రీకరించి చెప్పడం, ఆర్థికంగా వెనుకబడిన సామాజికవర్గాల లబ్దిదారులకు నష్టం కలిగించడం, తెలంగాణ రాష్ట్రం గతంలో సాధించిన పురోగతికి స్వస్రి వాక్యం పలకడమే. ఇదిలా కొనసాగాలా? అనేది తక్షణం జవాబు దొరకాల్సిన ప్రశ్న.

‘చరిత్ర పునరావృతమవుతుంది, తప్పును సరిదిద్దుకోవడం తప్పదనే విషయం భారతదేశ ప్రజలకు అనుభవమే. ఇలాంటి సందర్భాలు ’భారతదేశ రాజకీయ చరిత్ర’ లో అనేకం వున్నాయి. పాలన వైఫల్యానికి ప్రతిస్పందనగా ప్రజలు పునరాగమనానికి తలొగ్గారు. ‘ఎర్రగులాబి’ ఇందిరా గాంధీ, ఘోర ఓటమి తర్వాత ప్రజా మద్దతుతో మళ్లీ గెలిచి, రెండవ పర్యాయం ప్రధానమంత్రి కావడం గమనార్హం. పాలన వైఫల్యం చోటుచేసుకున్నప్పుడు, మార్గాన్ని సరిదిద్దేందుకు ప్రజా తీర్పులు ముందుకు వస్తాయి. సమాజాలను మార్చిన నాయకులు చరిత్రలో కనుమరుగు కారు. వారు మరింత బలంగా, మరింత పరిష్టంగా తిరిగి వస్తారు.’ 

తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు (చౌరాస్తాలో) నాలుగు రహదారుల, లేదా టీ-జంక్షన్ కూడలిలో వున్నది. స్థిరమైన, సంక్షేమాధారిత పాలన ప్రయోజనాలను అనుభవించిన రాష్ట్ర ప్రజలు, చేసిన తప్పును సరిదిద్దుకునే దశలో ఉన్నారు. నాయకత్వం అంటే కేవలం పాలన మాత్రమే కాదు, అది రాష్ట్ర భవిష్యత్తును మలిచే అంశం. ఇది రాజకీయంగా మాత్రమే కాదు, తెలంగాణ సంక్షేమం, అభివృద్ధి కొరకు కేసీఆర్ తిరిగి రావడం అవసరం, అనివార్యం. 

బీఆర్‌ఎస్, తిరిగి పుంజుకునే శక్తి వున్నది. ఈ పార్టీ ఇప్పటికీ గ్రామస్థాయిలో బలమైన క్యాడర్ కలిగి వుండి. కేసీఆర్ పుట్టినరోజు, ఫిబ్రవరి 17, 2025న ఆయన వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన ప్రజలు, బీఆర్‌ఎస్ మద్దతుదారులు, సంస్థాగత శక్తికి ఒక ఉద్దాహరణ. కేసీఆర్‌కి అపారమైన పరిపాలనానుభవం తెలంగాణ నాయకత్వానికి అప్రతిమమైన అస్థ్రం. ఆయన మళ్లీ అధికారంలోకి రావడమే తెలంగాణకు అనుకూలమైన ఒకే ఒక్క సమర్థమైన ఎంపికగా నిలుస్తుంది. తెలంగాణ ఉద్యమంపై, నిర్మాణంపై కేసీఆర్ కు ఉన్న భావోద్వేగ అనుబంధం, ఆయన దూరదృష్టి, రాజకీయ మేధస్సు, బీఆర్‌ఎస్ పునరాగమనాన్ని సుసాధ్యం చేయడమే కాకుండా సమీప భవిష్యత్తులో రాజకీయ పునరేకీకరణకు, సమీకరణకు మార్గనిర్దేశనం చేయవచ్చు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమవ్వడం వల్ల రైతులు, నిరుద్యోగ యువత, సంక్షేమ పథకాల లబ్దిదారుల్లో పెరుగుతున్న అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ అసంతృప్తిని బీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా క్రోడీకరించి, ప్రజలకు వారు కోరుకున్న రీతిలో బలమైన ప్రత్యామ్నాయాన్ని అందించగలమన్న భరోసా కల్పించగలుగుతే, కేసీఆర్‌ తిరిగి కచ్చితంగా సిఎం అవుతారు.

మారుతున్న రాజకీయ పరిస్థితులను అనుసరించి బీఆర్‌ఎస్ తన విధానంలో అత్యవసరమైన సృజనాత్మక మార్పులు-చేర్పులు చేసుకోవాలి. కాంగ్రెస్ పాలన ఎలా కొనసాగుతుందో కూడా ఒక నిర్ణయాత్మక అంశంగా మారుతుంది. ఈ దిశగా గతంలో ఏవైనా లోపాలు జరిగి వున్నట్లయితే, వాటిని హృదయపూర్వకంగా, సైద్ధాంతికంగా విశ్లేషించాలి. వివిధ రంగాల నిపుణుల సలహాలను స్వీకరించి, వారిచ్చే వ్యూహాత్మక సూచనలను భేరీజువేయాలి. వీటన్నిటి ఆధారంగా, ప్రజల ముందుకు నూతన ఆవిష్కరణలను, ప్రత్యామ్నాయాలను ఉంచాలి. అంతేకాదు, మారుతున్న రాజకీయ సమీకరణాలను బీఆర్‌ఎస్ అనుకూలంగా మలచుకోవాలి. తెలంగాణ చరిత్రాత్మకమైన మలుపులో నిలిచివున్న ఈ సమయంలో, అనుభవజ్ఞత, దూరదృష్టి, సంక్షేమ ప్రధానమైన కేసీఆర్ నాయకత్వం అత్యంత అవసరం.

కేసీఆర్ కేవలం ప్రాంతీయ నాయకుడు మాత్రమే కాదు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులకు అతీతంగా, పరిమితులను అతీతంగా, జాతీయ స్థాయి అవసరాలను అవగాహన చేసుకుంటూ, తెలంగాణకు అతీతంగా దూరదృష్టి కలిగిన జాతీయ స్థాయి రాజకీయ శక్తిగా ఎదిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్న రాజనీతిజ్ఞుడు. భారతదేశంలో సమాఖ్య స్ఫూర్తికి ఆయన  ఇచ్చిన ప్రాధాన్యత దానికి నిదర్శనమని తెలియచేయాల్సిన బాద్యత బీఆర్ఎస్ కింది స్థాయి నాయకుల మీద వున్నది. సవాళ్లను అధిగమించే ఆయన సామర్థ్యం, కేసీఆర్ తెలంగాణ పాలనా మోడల్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం బహుళ ప్రచారంలోకి తేవాలి.  తెలంగాణలో ప్రస్తుతం పెరుగుతున్న అసంతృప్తి కేవలం పాలనపైనే కాదు; అది గతంలో సాధించిన అభివృద్ధి వారసత్వాన్ని, దాని ప్రాముఖ్యతను కాపాడుకోవడానికి కూడా సంబంధించినది. దశాబ్దంపాటు సాధించిన పురోగమనాన్ని నాశనం చేసే ప్రమాదం పొంచి వున్నది! 

తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వ ప్రభావాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు. తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటాన్ని, పాలనలో అతను పాటించిన వ్యూహాత్మక సమతుల్యతను, రాష్ట్రాన్ని అభివృద్ధి పధాన  ముందుండి నడిపించిన తీరును ప్రజలు మళ్లీ గుర్తు చేసుకోవాలి. ఈ తరుణంలో ప్రజలు మేల్కొనాలి. మరోసారి ఆలోచించాలి. మార్గాన్ని సరిదిద్దుకోవాలి. ఇదే లోతైన ఆలోచన చేసేందుకు సమయం! ధైర్యవంతమైన నిర్ణయం తీసుకునేందుకు సమయం! నిజమైన నాయకత్వాన్ని తిరిగి తెచ్చేందుకు సమయం! పది ఏళ్లలో అనుభవించిన అభివృద్ధిని మరీమరీ జ్ఞప్తికి తెచ్చుకోవాలి. వాస్తవాలను విశ్లేషించాలి, బలమైన మార్గాన్ని ఎంచుకోవాలి. కెసిఆర్ నాయకత్వం తెలంగాణ ఆత్మగౌరవానికి నిలయం. తెలంగాణ భవిష్యత్తు, అభివృద్ధి, పునాది విలువల పునర్నిర్మాణం. తెలంగాణ ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణకు అవసరమైన నాయకత్వాన్ని తిరిగి సంపాదించుకోవాలి. జరిగిన తప్పును సరిదిద్దుకోవడం తప్పనిసరి. కేసీఆర్ రాక చరిత్రలో లిఖించినదే. మార్గదర్శి తిరిగి రావాల్సిందే.

(కల్వకుంట్ల చంద్రశేఖరరావు తిరిగి వస్తున్నారు. అవును, కేసీఆర్ తిరిగి వస్తున్నారు!)  

No comments:

Post a Comment