శ్రీరామరాజ్యం
వనం జ్వాలా నరసింహారావు
భక్తి మాసపత్రిక (ఏప్రియల్, 2025)
శ్రీరామాయణాన్ని దీర్ఘశరణాగతి అని అంటారు. రామాయణంలో కనిపించే పరతత్వం శ్రీరామచంద్రమూర్తిగా అవతరించిన విష్ణువే. అయినా మానవుడిగానే నడుసుకున్నాడు. ఆ శ్రీరామచంద్రుడే మానవ విలువలకు అద్భుతమైన ఉదాహరణ. ఎవ్వరికీ వెరువని శ్రీరాముడు, ఏనాడూ తన కర్తవ్యాన్ని వీడలేదు. ‘మానవులు’గా వుండాలనుకునేవారు తప్పక శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎన్నో గొప్ప సుగుణాలు, ధర్మాలు, కలగలిసిన రామరాజ్యాన్ని మించినది ఏ లోకంలోనూ మరోటి లేదు.
ఇవన్నీ వివరంగా తెలుసుకోవాలంటే సంస్కృతంలోని వాల్మీకి శ్రీరామాయణాన్ని, లేదా, తెలుగులో వున్న ఆంద్రవాల్మీకి రామాయణం మందరాన్ని చదవాల్సిందే. కావ్యాలలో అగ్రస్థానంలో నిలిచి, ప్రబంధ వైలక్షణ్యాన్ని తెలియచేసే వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణం (‘సీతాయా శ్చరితం మహత్’) ఆసాంతం ప్రణవార్థాన్నే తెలియచేస్తుంది. ఇందులో నాయిక, నాయకులు సాక్షాత్తు శ్రీదేవైన సీతాదేవి, మహావిష్ణువైన శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామాయణానికి మొట్ట మొదలు బీజ రూపంలో వాల్మీకి నోట వెలువడ్డ శ్లోకం: ‘మానిషాద ప్రతిష్ఠాం త్వ! మగ మ శ్శాశ్వతీ స్సమాః ; యత్క్రౌంచ మిథునాదేక! మవధీః కామమోహితం.’ ఆంధ్రవాల్మీకి వాసుదాసుగారు దీనిని ‘తెలియు మా నిషాదుండ ప్రతిష్ఠ నీక ప్రాప్తమయ్యెడు శాశ్వతహాయనముల; గ్రౌంచ మిథునంబునందు నొక్కండు నీవు కామమోహిత ముం జంపు కారణమున’ అని తెనిగించారు: ఆ శ్లోకం శాపంకాదని, శ్రీరామచంద్రుడి మంగళాశాసనమని అంటారు. వాల్మీకి నోట అలా శ్లోకం రావడానికి కారణం వివరించాడు చతుర్ముఖ బ్రహ్మ.
రామాయణం ప్రారంభంలో వాల్మీకి మహర్షి, తన ఆశ్రమానికి వచ్చిన నారదుడిని, పదహారు ప్రశ్నలు వేశాడు. నిజానికి ఆ పదహారూ కలిపి ఒక్కటే ప్రశ్న. వరుసగా పదహారు గుణాలు చెప్పి, ఈ గుణాలన్నీ కలిగినవాడు ఒక్కడైనా ఉన్నాడా? అనేది వాల్మీకి వెలిబుచ్చిన సందేహం. ఆ గుణాలేమిటంటే... ‘గుణవంతుడు, అతివీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యశీలుడు, సమర్థుడు, నిశ్చలసంకల్పుడు, సదాచారం మీరనివాడు, సమస్త ప్రాణులకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, కోపాన్ని స్వాధీనంలో వుంచుకున్నవాడు, ఆశ్చర్యకరమైన కాంతిగల వాడు, అసూయ లేనివాడు, రణరంగంలో దేవదానవులను గడ-గడలాడించ గలవాడు’ ఎవరైనా వున్నారా ఈ భూలోకంలో?’ ఇలా వాల్మీకి వేసిన ప్రశ్న భగవంతుడి గురించే కాబట్టి, నారదుడు అదే రీతిలో సమాధానం ఇచ్చాడు.
ఆ గుణాలున్న వ్యక్తి రామచంద్రమూర్తి ఒక్కడే అని చెప్పాడు నారదుడు. రాముడు, అతివీర్యవంతుడని, అసమానమైన శక్తిగలవాడని, స్వయంప్రకాశి అని, అతిశయంలేని ఆనందం కలవాడని, ఇంద్రియాలను వశపర్చుకున్నవాడని, సర్వజ్ఞుడని, ధర్మజ్ఞానంగలవాడని, బ్రహ్మజ్ఞాన సంపన్నుడని, నీతిమంతుడని, పరులకు హితవచనాలను చెప్తాడని, ఋజుస్వభావం గలవాడని, ఎవరిపై శత్రుభావం లేనివాడని, చేసిన ప్రతిజ్ఞ తప్పనివాడని, సమస్త భూజనులకు మేలైన కార్యాలనే చేసేవాడని, ఆత్మతత్వం ఎరిగినవాడని, దానధర్మాలు విరివిగా చేసేవాడని, ఆశ్రిత రక్షకుడని, స్వాశ్రితరక్షణ వల్ల లభించిన యశస్సు, శత్రువులను అణచినందున వచ్చిన కీర్తిగలవాడని, ఆశ్రితులకు, మాత-పిత-ఆచార్యులకు-వృద్ధులకు వశ పడినవాడని, విష్ణువుతో సమానుడని, లోకాలను పాలించ సమర్థుడని నారదుడు జవాబిచ్చాడు.
శ్రీరాముడు ధర్మాన్ని తానాచరిస్తూ, ఇతరులతో ఆచరింపచేసేవాడని, స్వధర్మ పరిపాలకుడని, స్వజనరక్షకుడని, వేదవేదాంగాలను రహస్యార్థాలతో ఎరిగినవాడని, కోదండ దీక్షాపరుడని, సర్వ శాస్త్రాల అర్థాన్ని నిర్ణయించగల నేర్పరని, జ్ఞాపకశక్తిగలవాడని, విశేషప్రతిభగలవాడని, సమస్త ప్రపంచానికి ప్రియం చేసేవాడని, సాధువని, గంభీర ప్రకృతిగలవాడని, సమస్త విషయాలను చక్కగా బోధించగలవాడని, మనోహరంగా ప్రజలకు ఎల్లప్పుడూ దర్శనమిచ్చేవాడని, సమస్తభూతకోటికి పూజ్యుడని, అన్నింటా గుణ శ్రేష్ఠుడని, కౌసల్యా నందనుడని పేరు తెచ్చుకున్నాడని నారదుడు చెప్పాడు. శ్రీరాముడు ధర్మానికి మారుపేరని, అతడిలాంటి పురుషోత్తముడికి సరితూగేవారు లోకంలో ఎవరూ లేరని నారదుడు అంటాడు.
సీతాయా:చరితం మహత్
కౌసల్యా గర్భసంభూతుడు రాముడు. అయోనిజ సీతను పెళ్లాడాడు. వివాహానంతరం సర్వసుఖాలు అనుభవించి, భార్యాభర్తల అన్యోన్యత, అనురాగం ఎలా ఉండాలో ప్రపంచానికి తెలియచేసి, పితృవాక్య పాలన చేసి, అరణ్యాలకు పోయి, సత్యవ్రతుడై, రావణాది దుష్టులను సంహరించి, కర్మయోగిగా, స్వధర్మ నిష్ఠయే అందరికీ శ్రేయస్కరమని తన నడవడిద్వారా శ్రీరాముడు బోధించాడు. అందుకే శ్రీరామావతారం అనుష్టానావతారం. పితృవాక్య పాలనకు శ్రీరాముడు అడవులకు వెళ్తే, పతిభక్తితో, ఎండకన్నెరుగని సుకుమారి సీత భర్త వెంట పోయింది. స్వతంత్రుడై, శక్తుడై, తోడున్నవాడై, దుఃఖం అనుభవించాడు రాముడు. రాక్షసుడికి బందీగా, ప్రాణ భయంతో, నిరాహారిగా, అశక్తిగా, ఒంటరిగా దుఃఖపడింది సీత. భక్తుల దోషాలను క్షమిస్తానన్నాడు రాముడు. భక్తుల్లో దోషాలే లేవన్నది సీత. కాకాసురుడికి శిక్ష విధించి క్షమించాడు రాముడు. తనను బాధించిన రాక్షస స్త్రీలను క్షమించింది సీత. లోకపిత రాముడైతే, లోకమాత సీత. తన చరిత్రకంటే సీతాదేవి చరిత్రే శ్రేష్ఠమైందని రామచంద్రమూర్తే స్వయంగా అంటాడొకసారి. అందుకే వాల్మీకి కూడా ‘ప్రణతి ప్రసన్న జానకి ..... స్మరణ మాత్ర సంతుష్టాయ రామ’ అని చెప్పాడు.
కళ్యాణ గుణాభిరాముడు
శ్రీరామచంద్రమూర్తిలోని వాత్సల్యాది సకల కల్యాణగుణాలను (స్వామిత్వ, సౌశీల్య, సౌలభ్య, సర్వజ్ఞత్వ, సర్వశక్తిత్వ, సర్వసంకల్పత్వ, పరమకారుణికత్వ, కృతజ్ఞత్వ, స్థిరత్వ, పరిపూర్ణత్వ, పరమోదారత్వలు) శ్రీరామాయణంలో వాల్మీకి వర్ణించాడు. జ్ఞాన వృద్ధులైన సజ్జనులు, వయోవృద్ధులైన సజ్జనులు, సదాచార సంపన్నులైన సజ్జనులు, జ్ఞానశీల వయోవృద్ధులు, శీలజ్ఞాన వృద్ధులు, శ్రీ రాముడి దగ్గరకు, ఆయన ఎలాంటి పనిలో నిమగ్నమై వున్నప్పుడు వచ్చినప్పటికీ, తనపని తాను చేసుకుంటూనే, వారి సందేహాలను తీర్చే గుణవంతుడు. వచ్చేవాడు శత్రువైనప్పటికీ, తీయని మాటలతో ప్రియంగా మాట్లాడతాడు. అసత్యం పలుకడు. పరుల దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేవాడు. సామాన్య ధర్మంలోను, విశేష ధర్మంలోను సరిసమానమైన ప్రీతికలవాడు. శరణాగత రక్షణనే తన నియమాన్ని ఎప్పుడూ ఉల్లంఘించలేదు. ధర్మ విరుద్ధమైన కథలను వినడంలో కూడా ఆసక్తి కనబర్చేవాడు కాదు.
వేదాధ్యయనాన్ని, పరిపూర్ణంగాచేసి స్నాతకుడైనాడు. వేదాలను అంగాలతో సహా చదివాడు. శస్త్రాస్త్ర ప్రయోగజ్ఞానంలో తండ్రిని మించిన తనయుడనిపించుకున్నాడు. తండ్రి వంశాన్ని, తల్లి వంశాన్ని, లోకంలో ప్రసిద్ధి పొందేవిధంగా చేశాడు. దోషరహితుడు. ఎలాంటి సంకట సమయంలోను క్షోభ చెందనివాడు. సత్యసంధుడు. ఋజువర్తనుడు. ధర్మార విషయాలు బాగా తెలిసినవాడు. ఎప్పటికప్పుడు వికసించే ప్రజ్ఞకలవాడు. లౌకికాచారాలను, సమయాచారాలను సంస్థాపనములతో ఆచరించగల సమర్ధుడు. వినయవంతుడు. మిత్ర సహాయ సంపత్తికలవాడు. తలపెట్టిన కార్యాన్ని సాధించేంతవరకు తన ఆలోచనలను బహిర్గతం చేయకుండా దాచిపెట్టగల నేర్పరి. ఆర్జించే విధానం, వ్యయం చేసే విధానం తెలిసిన బుద్ధిమంతుడు.
క్రోధాన్ని జయించినవాడు
శ్రీ రామచంద్రుడికి గురుదేవులయందు దృఢమైన భక్తి వుండి. ఆ భక్తిలోను చలనం లేని స్థిర బుద్ధి కలవాడు. పరుష వాక్యాలను నాలుకమీదకు కూడా రానీయడు. చెడ్డవారి విషయంలోను, చెడ్డ పనులలోను ఎంతమాత్రం ఆసక్తి కనబర్చడు. శాస్త్రాధ్యయనంలో, దానికి అనుగుణంగా పనులు చేయడంలో నేర్పరి. తన దోషాలను, ఎదుటివారి దోషాలను కనుక్కొనగలిగే తెలివిమంతుడు. ముఖం చూడగానే ఎవరు దుష్టుడో, ఎవరు శిష్టుడో తెలుసు కొనగలిగే సామర్ధ్యం కలవాడు. ధర్మశాస్త్రానికి అనుగుణంగానే మిత్రులను ఎంపిక చేసుకుంటాడు. ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో ఆ విధంగానే చేయగల సమర్ధుడు.
శాస్త్ర పద్ధతిలో సంపాదన, వ్యయం చేయగల నేర్పరి. ఆదాయంలో నాలుగవ భాగమో, మూడవ భాగమో, ఆరవ భాగమో ఖర్చు చేస్తాడు. తర్క-న్యాయ-మీమాంసాలలో, నాటక విద్యలో, చిత్ర రచనలో శ్రేష్టుడు. ధర్మాన్ని, అర్థాన్ని అనుసరించి సుఖపడాలనుకుంటాడేకాని, కామాన్ని కోరడు. ధనాన్ని ఐదు భాగాలుగా ఎలా విభజించాల్నో తెలిసినవాడు. దుష్టులను సాదువులుగా మార్చగలడు. ధనుర్వేదాన్ని సమర్మముగా తెలిసిన గొప్పవాడు. అతిరథులకందరికీ పూజ్యుడు. శత్రువును వాడివద్దకే పోయి అణచగల సమర్ధుడు. సేనలను నడిపించడంలోనూ కడు నేర్పరి. దేవదానవులు కలిసి వచ్చినా ఓడించగల శక్తిమంతుడు.
శ్రీ రాముడిలో అసూయ లేదు. ఆయన రమ్మంటేనే కోపం వస్తుంది. పొగరంటే ఏమిటో అసలే ఎరుగడు. తానెంత బలవంతుడైనప్పటికీ, అసాధ్య కార్యాలను చేయగల వాడైనప్పటికీ, ఎవరిని, దేనిని అవమానంగా చూడడు. శుద్ధసత్త్వ స్వరూపుడై, ప్రకృతి గుణాలకు, కాలమునకు లోబడి వుండేవాడు కాడు. ఇతరులు అభివృద్ధి చెందుతుంటే సంతోషపడేవాడు. ద్వేషించడు. బుద్ధిలో బృహస్పతితో, వీర్యంలో ఇంద్రుడితో, ఓర్పులో భూమితో పోల్చదగినవాడు. ముల్లోకాలను సంతోషపెట్టగల వాడు. సూర్యవంశంలో పుట్టి, సూర్యుడిలా అన్ని లోకాలవారిచే పూజించబడేవాడు.
దశరథుడు చెప్పిన మాట
శ్రీరాముడిని అడవులకు పంపమని కైక భర్తను కోరినప్పుడు, రాముడు అడవులకు పోదగిన వాడు కాదని తెలపడానికి ఆయన గుణాలను వర్ణించాడు ఇలా దశరథుడు. ‘శ్రీరాముడు మిక్కిలి కోమలమైన దేహం కలవాడు. నీతికి స్థానమైన వాడు. ప్రజల మేలు కోరే విషయంలో ప్రీతి కలవాడు. ధర్మ స్వరూప స్వభావుడు. ఒకరు కన్న తల్లి అని, మరొకరు సవతి తల్లి అని భేద బుద్ధి లేకుండా అందరినీ సమానంగా గౌరవిస్తాడు. తన బలంతో ఇతరులను లోబర్చుకోడు. నిర్మలమైన, కలుషితం లేని మనసుతో, తాను కష్టపడ్డప్పటికీ, మంచిమాటలతో వారు కోరిన కోరికలు తీర్చుకుంటూ, తన త్యాగగుణం వల్ల ఇతరులను వశపర్చుకుంటాడు. సత్యంతో పద్నాలుగు లోకాలను, దానబలంతో పేదవారిని, శుశ్రూషతో మెప్పించి, తల్లి, దండ్రి, ఆచార్యులను, వింటిని చూపుతూ, యుద్ధంలో శత్రువులను రాముడు వశపరుచుకుంటాడు. శ్రీరాముడిలో నిర్వ్యాజ సత్యం, దానం, గొప్ప తపస్సు, శుచిత్వం, మైత్రి, అర్జవం, గురు శుశ్రూష, జ్ఞానం, త్యాగం అనే గుణాలు సర్వకాలాలలో స్థిరంగా నెలకొని కాపురం చేస్తున్నాయి. రుజు గుణమే సంపదగా కలవాడు, నిగ్రహానుగ్రహ శక్తి కలవాడు.’
అడవులకు పోవాలని కైక ద్వారా తండ్రి ఆజ్ఞాపించినప్పుడు, శ్రీరాముడికి సర్వ సుఖాలు పోతున్నప్పటికీ, రాజ్య భోగాలకు దూరమవుతున్నప్పటికీ, అయన ముఖంలో కాంతి చెదిరిపోలేదు. అరణ్యవాసాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన కౌసల్యా లక్ష్మణులను ఓదార్చిన శ్రీరాముడు పితృవాక్య పాలన గురించి చెప్తాడు. ‘తండ్రి మాట జవదాటగల శక్తి నాకు లేదు. తండ్రి ఆజ్ఞ పరమ ధర్మం. దేవతలతో సమానమైన ఎందరో మహానుభావులు, తండ్రి వాక్యాన్ని పాలించి, కీర్తి సంపాదించుకున్నారు. ధర్మ శాస్త్రం ఇలా చెప్తుంటే, తండ్రి ఆజ్ఞ నెరవేరచకుండా ఎలా వుంటాను? పూర్వీకులు నడిచిన మార్గాన్నే నేను ఎంచుకున్నాను. వేరే తోవలో పోవడం లేదు. తండ్రి ఆజ్ఞా పాలించడమే తగిన పని. తండ్రి మాట వినకుంటె పాపం కలుగుతుంది. కాబట్టి నిశ్చయంగా అడవులకే పోతాను’ అని అంటాడు. రామరాజ్యం అంటే, ఇలాంటి మరెన్నో సుగుణాల రాజు రాజ్యమే!
{వావిలికొలను సుబ్బారావు గారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా}
No comments:
Post a Comment