ఖాండవ వన దహనం
కృష్ణుడితో కాలింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణల
వివాహం
శ్రీ మహాభాగవత కథ-70
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (26-01-2026)
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
ఒకనాడు పాండవులను చూడాలన్న కోరికతో శ్రీకృష్ణుడు సాత్యకితో సహా ఇంద్రప్రస్థ
పురానికి వెళ్లాడు. ఆయన్ను చూడగానే, తమ ప్రాణాలు లేచి వచ్చాయా అన్నట్లుగా పాండవులు శ్రీకృష్ణుడిని కౌగలించుకుని
సంతోషంతో ఉప్పొంగిపోయారు. శ్రీకృష్ణుడు కూడా పెద్దవారైన ధర్మజుడికి, భీముడికి పాదాభివందనం చేసి, తోటివాడైన ఆర్జునుడిని ఆలింగనం చేసుకుని, చిన్నవారైన నకుల సహదేవులను ఆశీర్వదించాడు. ఇంతలో
ద్రౌపదీదేవి వచ్చి, సిగ్గుతో తలవంచుకుని, శ్రీకృష్ణుడికి నమస్కారం చేసింది. పాండవులు సాత్యకిని గౌరవించి ఆసనం మీద
కూచోబెట్టారు. కృష్ణుడు మేనత్త కుంతీదేవికి పాదాభివందనం చేశాడు. క్షేమ సమాచారాలు
అడిగి తెలుసుకున్నారు.
దుర్యోధనుడు చేసిన అపకారానికి కుంతీదేవి కళ్లవెంట నీళ్లు కారాయి. తాము పడ్డ
కష్టాలన్నీ చెప్పుకుంది. కృష్ణుడు అనుక్షణం తమను తలచుకుంటూ తమ కష్టాలు
పోగొడుతున్నాడని అన్నది. ఆయన దయ అపారం అన్నది. పూర్వజన్మలో ఎంతో తపస్సు చేయబట్టి
ఆయన కరుణ తమకు లభించిందని స్తుతించింది. ధర్మరాజు ప్రార్థించడం వల్ల కృష్ణుడు
ఇంద్రప్రస్థ పురంలో కొన్ని నెలలపాటు పాండవుల దగ్గర వుండిపోయాడు.
ఒకనాడు అర్జునుడు కృష్ణుడితో కలిసి అడవికి వేటకు వెళ్లాడు. వేటలో అలసిపోయిన
అర్జునుడికి దాహం వేసింది. కృష్ణుడు, ఆయన దప్పిక తీర్చుకోవడానికి యమునానదికి వెళ్లారు. ఆచమనం చేసి తృప్తి తీరా
యమున నీరు తాగారు. తరువాత పక్కనే వున్న ఇసుక తిన్నె మీద కూర్చున్నారు. వారికి
యమునానది దగ్గర ఒక సుందరీమణి కనిపించింది. ఆమె కడు శోభాయమానంగా వున్నది.
శ్రీకృష్ణుడు ఆమె వివరాలను తెలుసుకోవాలనుకున్నాడు. దానికోసం ఆర్జునుడిని పంపాడు
ఆమె దగ్గరికి. అర్జునుడు ఆమె వివరాలు అడిగాడు.
సమాధానంగా ఆ సుందరి, తాను సూర్యదేవుడి పుత్రికనని, పేరు కాళింది అని, యమునా నదిలో తన తండ్రి తనకొరకు చక్కటి ఇల్లు కట్టించాడని, దాని మందిరంలో నిలబడి విష్ణువు కొరకు తపస్సు చేస్తున్నానని, విష్ణు అంశ అయిన కృష్ణుడు అక్కడికి వచ్చి తనను వరిస్తాడని
తన తండ్రి తనకు చెప్పాడని అంటుంది. ఈ విషయాలను అర్జునుడు కృష్ణుడికి చెప్పగానే, కాళింది మనోభావాన్ని గ్రహించిన ఆయన, ఆమెను రథం మీద
ఎక్కించుకుని ధర్మరాజు దగ్గరికి వెళ్లాడు.
పాండవుల కోరిక మేరకు శ్రీకృష్ణుడు విశ్వకర్మని పిలిపించి ఇంద్రప్రస్థ పురాన్ని
బహు సుందరంగా మార్చాడు. ఒకనాడు కృష్ణుడు, దేవేంద్రుడి అధీనంలో వున్న ఖాండవ వనాన్ని అగ్నిహోత్రుడికి వ్యాధి నివారణార్థం
ఇవ్వాలనుకున్నాడు. ఆర్జునుడిని తీసుకుని తాను రథసారథిగా ఖాండవ వనానికి
చేరుకున్నారు. కృష్ణార్జునుల సహాయంతో అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహించి తన ఆకలి
బాధను, రోగ బాధను నివారించుకున్నాడు. అగ్ని
దేవుడు సంతోషించి, అర్జునుడికి అక్షయతూణీరమనే అమ్ములపొదిని, అభేద్యమైన కవచాన్ని, గాండీవమనే ధనుస్సును, దివ్యరథాన్ని, తెల్లటి గుర్రాలను ప్రసాదించాడు. దహన సమయంలో రక్షించబడ్డ మయుడు అర్జునుడు
చేసిన ఉపకారానికి ఒక విచిత్రమైన, వినూత్నమైన సభను నిర్మించి అతడికి కానుకగా ఇచ్చాడు. ఆ సభలోనే దుర్యోధనుడు
అవమానాల పాలైనాడు.
ఆ తరువాత శ్రీకృష్ణుడు ద్వారకానగరం చేరాడు ఒకనాడు. ఒక పుణ్య తిథినాడు
కాళిందిని వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు మేనత్త కూతురైన మిత్రవిందను స్వయంవర
మంటపంలో కృష్ణుడు తన శౌర్యప్రతాపాలతో గెల్చుకున్నాడు. వివాహం చేసుకున్నాడు.
ఇదిలా వుండగా, కోసలదేశ రాజు నగ్నజిత్తు తన కూతురు నాగ్నజితిని వివాహం చేసుకోదలచిన వాడు, బాగా
మదించిన ఏడు ఆబోతులను, తన బాహుబలంతో కట్టి పడేయాలని నిబంధన పెట్టాడు. ఇది విని
శ్రీకృష్ణుడు కోసలపురానికి వెళ్ళాడు. అతిథి సత్కారాలను అందుకున్నాడు. నాగ్నజితి
వివాహానికి తాను విధించిన నిబంధన చెప్పాడు నగ్నజిత్తు. ఆయన చూపించిన వృషభాలను
అవలీలగా పట్టుకున్నాడు. తన కుమార్తె నాగ్నజితిని ఇచ్చి వివాహం చేశాడు నగ్నజిత్తు.
నూతన దంపతులను రథం ఎక్కించి ద్వారకా నగరానికి సాగనంపాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు
నాగ్నజితిని వివాహం చేసుకుని మామగారిచ్చిన ఆభరణాలన్నీ పుచ్చుకుని, సతీసమేతంగా ద్వారకా నగరానికి వచ్చి నాగ్నజితీదేవితో
సంతోషంగా గడిపాడు.
శ్రీకృష్ణుడి మేనత్త శ్రుతకీర్తి. ఆమెకు, కేకయ రాజైన ధృతకేతుడికి జన్మించిన భద్ర అనే అమ్మాయిని
పెళ్లి చేసుకున్నాడు శ్రీకృష్ణుడు. అదే విధంగా శ్రీకృష్ణుడు తన బలపరాక్రమాలను
ప్రదర్శించి, శత్రు రాజులను జయించి, మద్రదేశపు రాజైన బృహత్సేనుడి కూతురు లక్షణను ద్వారకకు
తీసుకు వచ్చి వివాహమాడాడు.
ఈ విధంగా రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ అనే సద్గుణ సౌశీల్యవతులు
శ్రీకృష్ణుడికి అష్ట భార్యలుగా ప్రసిద్ధి చెందారు. ఆ తరువాత నరకాసురుడిని సంహరించి
ఆయన బంధించిన రోహిణి మొదలైన పదహారు వేలమంది కన్యలను పెళ్లి చేసుకున్నాడు.
(బమ్మెర
పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)


No comments:
Post a Comment