పీవీ కలలుగన్న పరిస్థితులేవీ?
డాక్టర్ మోంటెక్ సింగ్ అహ్లూవాలియా
వనం
జ్వాలా నరసింహారావు
నమస్తేతెలంగాణ
దినపత్రిక (02-01-2025)
{{మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఊహించుకొన్నట్టు ప్రస్తుతం దేశంలో
పరిస్థితులు లేవు. మతపరమైన కాఠిన్యత నైతికంగానే కాదు. ఆర్థికంగానూ దేశానికి
హానికరం. ప్రజాస్వామ్యమనేది ప్రకటనల్లో ఉండదు. ప్రజల సమస్యలను శాంతితో వినే
నాయకత్వంలోనే ఉంటుంది. దేశంలో ఆర్థిక మార్పు అనేది ఒక్క కేంద్రంతో మాత్రమే సాధ్యం
కాదు.}} -సంపాదకుడి క్లుప్త వ్యాఖ్య
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఊహించుకొన్నట్టు ప్రస్తుతం దేశంలో
పరిస్థితులు లేవు. మతపరమైన కాఠిన్యత నైతికంగానే కాదు, ఆర్థికంగానూ దేశానికి హానికరం. ప్రజాస్వామ్యమనేది
ప్రకటనల్లో ఉండదు. ప్రజల సమస్యలను శాంతితో వినే నాయకత్వంలోనే ఉంటుంది. దేశంలో
ఆర్థిక మార్పు అనేది ఒక్క కేంద్రంతో మాత్రమే సాధ్యం కాదు. కేంద్రం, రాష్ర్టాల మధ్య సమన్వయం, పరస్పర విశ్వాసం అనేది దీనికి అత్యవసరం. రానున్న
రోజుల్లో దేశ ఆర్థిక ప్రగతి ముందుకుసాగాలంటే,
కేంద్రం, రాష్ర్టాల మధ్య సహకారం అవసరం.
ఎవరి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు
లొంగని, స్వతంత్రంగా
నడిచే శక్తివంతమైన సంస్థలు ఇప్పుడు ప్రతీరంగంలో ఉండాల్సిన అవసరం ఉంది. కూటమి
ప్రభుత్వాలు అస్థిరత్వంతో కొనసాగినప్పటికీ,
దేశ
రాజకీయాల్లో సంతులత్వ భావనను పరిచయం చేశాయి. రాజకీయ ధర్మాన్ని నిలబెట్టాయి. ఆర్థిక
సంస్కరణలనేవి సిద్ధాంతపరమైన ప్రయోగాలు కావు. సంక్షోభ నివారణకు మార్గాలు.
గ్రామాల్లోని ప్రజలకు ఉపాధిని కల్పించడం ప్రభుత్వ నైతిక బాధ్యత.
హైదరాబాద్‌లో బుధవారం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారక సభ
జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రఖ్యాత ఆర్థికవేత్త డాక్టర్ మోంటెక్ సింగ్
అహ్లూవాలియా పీవీ హయాంలో జరిగిన ఆర్థిక సంస్కరణల గురించి కీలక ప్రసంగం చేశారు.
భవిష్యత్తు భారతం ఎలా ఉండాలన్న దానిపై అహ్లూవాలియా చేసిన పలు సూచనలు సభికులను
ఆకట్టుకొన్నాయి. పీవీ ఓ ఆర్థిక సంస్కరణకర్తే కాదని, ఆయన
నాయకత్వం, ఆర్థిక నిర్వహణ
పాఠాలు, భవిష్యత్తు
భారతానికి పీవీని ఓ మార్గదర్శకుడైన రాజనీతిజ్ఞుడిగా నిలబెట్టాయని అహ్లూవాలియా
కొనియాడారు.
పీవీ గొప్పతనం ఆయన తీసుకొనే నిర్ణయాల్లో మాత్రమే లేదన్న అహ్లూవాలియా, దేశం బలహీనస్థితిలో ఉన్నప్పుడు ధైర్యంగా నాయకత్వం
వహించడంలో కూడా ఉన్నదని పేర్కొన్నారు. తన మేథోసంపత్తిని రాజకీయ వాస్తవిక
పరిస్థితులకు అద్ది నిర్ణయాలు తీసుకోవడంలో పీవీ అందెవేసిన చెయ్యి అని ఆయన గుర్తు
చేశారు.
బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభం గురించి ఆయన వివరంగా మాట్లాడారు. 1991లో ‘బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్’ సంక్షోభం
నెలకొన్నది. అత్యవసరమైన దిగుమతులను కూడా చేసుకోలేని దుర్భర స్థితిలో దేశం ఉన్నది.
అప్పులు చుట్టుముట్టాయి. ధరలు కొండెక్కాయి. విదేశీ మారకనిల్వలు అడుగంటాయి. అలాంటి
పరిస్థితుల్లోనూ పీవీ ఎంతమాత్రం బెదరకుండా, ఎంతో ధైర్యాన్ని చూపించి సమస్యలను
చక్కదిద్దారని అహ్లూవాలియా గుర్తు చేసుకొన్నారు. ఆ నిర్ణయాలే దేశ ఆర్థిక దిశను
మార్చివేశాయని తెలిపారు.
ఆర్థిక సంస్కరణలనేవి సిద్ధాంతపరమైన ప్రయోగాలు కావని, సంక్షోభ నివారణకు మార్గాలని పేర్కొన్నారు.
రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఉన్నప్పటికీ, పీవీ ఈ
నిర్ణయాలను ఎంతో సాహసోపేతంగా తీసుకొన్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మాజీ
ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా అప్పట్లో ఎంపిక చేయడం పీవీ
తీసుకొన్న అత్యంత కీలక నిర్ణయంగా అహ్లూవాలియా అభివర్ణించారు. ఈ ఇద్దరి కలయికే
దేశంలో ఆర్థిక సంస్కరణలకు పునాది వేసిందని కొనియాడారు.
పీవీ-మన్మోహన్ శక్తివంతమైన కలయిక అవసరాన్ని గురించి అహ్లూవాలియా
మాట్లాడారు. ‘పీవీ-మన్మోహన్ కలయిక,’ ఓ అరుదైన,
శక్తివంతమైన
ఘటనగా అహ్లూవాలియా అభివర్ణించారు. భవిష్యత్తు భారత నాయకత్వానికి కూడా ఇలాంటి
ధైర్యం, మేధస్సు, పరిపాలనా క్రమశిక్షణ, నైతికత అవసరమని ఆయన అన్నారు. పీవీ సంస్కరణలను, నాయకత్వాన్ని కొనసాగించడానికి రాజకీయ ఒత్తిళ్లకు
వెరవకుండా ముందుకు వెళ్లడం, సమర్థవంతమైన
ఆర్థిక నైపుణ్యాలనే రెండు లక్షణాలు కచ్చితంగా ఉండాలన్నారు. వీటిలో ఒకదానికోసం
మరొకదాన్ని పణంగాపెడితే సంస్కరణల లక్ష్యం గాడితప్పుతుందని పేర్కొన్నారు.
ఈ రెండింటినీ సమకూర్చగల నాయకులు ఇప్పుడు దేశానికి అవసరమని
పేర్కొన్నారు. సంస్కరణల సమయంలో వెలుగులోకి వచ్చిన హర్షద్ మెహతా ఎపిసోడ్, దాని కారణంగా సంభవించిన రాజకీయ, ఆర్థిక దుమారం, భయాందోళనలను
అహ్లూవాలియా గుర్తుచేసుకొన్నారు. ఈ ఎపిసోడ్ అందరి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని, ఆ సమయంలో దేశనాయకత్వం ఆర్థిక సంక్షోభాన్నే
కాకుండా రాజకీయ ఒత్తిళ్లను కూడా ఎదుర్కొవల్సి వచ్చిందన్నారు. ఆర్థిక సంస్థల
నమ్మకాన్ని బలపరచడం ఎంత ముఖ్యమో ఈ ఎపిసోడ్ అందరికీ బోధపడేలా చేసిందని
పేర్కొన్నారు.
ఆర్థిక మార్పు కేంద్రంతోనే కాదన్నారన్నారాయన. సంస్కరణల సమయంలో డాక్టర్
మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలనుకున్న సందర్భాన్ని అహ్లూవాలియా ప్రత్యేకంగా
ప్రస్తావించారు. ఆర్థికమంత్రిగా తాను రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్న మన్మోహన్,
అప్పుడు రెండు రోజులు ఆఫీసుకు రాకుండా ఉన్నారని అహ్లూవాలియా పేర్కొన్నారు. ఈ
విషయంలో జోక్యం చేసుకొన్న పీవీ ఎంతో నిర్ణయాత్మకంగా వ్యవహరించి సంస్కరణల బండిని
ముందుకు నడిపించారని తెలిపారు. సంక్షోభ సమయాల్లో సమర్థవంతులైన వ్యక్తులను కాపాడటం
పీవీ ప్రత్యేకత అన్న అహ్లూవాలియా పీవీ నాయకత్వ గుణాలకు ఈ ఘటన ప్రతీకగా నిలిచిందని
వ్యాఖ్యానించారు.
దేశ పరిపాలనలో సమాఖ్య సమతౌల్యానికి, సంస్థల
బలోపేతానికి పీవీ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని అహ్లూవాలియా అన్నారు. దేశంలో ఆర్థిక
మార్పు అనేది ఒక్క కేంద్రంతో మాత్రమే సాధ్యం కాదని, కేంద్రం-రాష్ర్టాల
మధ్య సమన్వయం, పరస్పర
విశ్వాసం అనేది దీనికి అత్యవసరమని చెప్పారు. ఈ సమతుల్యతను పీవీ సహజ సిద్ధంగా అర్థం
చేసుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో దేశ ఆర్థిక ప్రగతి
ముందుకుసాగాలంటే కేంద్రం, రాష్ర్టాల మధ్య సహకారం అవసరమని పేర్కొన్నారు.
ప్రజలకు ఉపాధి ప్రభుత్వ బాధ్యతన్నరాయన. ఈ సభ జరుగడానికి ముందు రోజు
అత్యంత తక్కువ మందితో ఓ చిన్న భేటీ జరిగింది. ఆ సమావేశానికి హాజరైన అహ్లువాలియాకు
నేను రాసిన ‘డెమోక్రసీ అండ్ గవర్నెన్స్ త్రూ లెన్స్ అండ్ బ్లర్డ్ గ్లాసెస్:
ఏ జర్నీ ఇన్‌టూ డిస్టార్టెడ్ విజన్స్ ఆఫ్ మోడర్న్-డే పాలిటిక్స్’ పుస్తకాన్ని
బహూకరించాను. ఆ వెంటనే అహ్లువాలియా మాట్లాడుతూ, ‘ఈ పుస్తకంలో పీవీకి సంబంధించిన
విషయాలు ఉన్నాయా?’ అని అడిగారు.
అక్కడ జరిగిన చర్చలోనూ పీవీ ప్రజాస్వామ్య విలువలు, సంస్థాగత
ధైర్యం గురించి అహ్లువాలియా స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో పార్టీలకతీతంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి చూపించిన
రాజకీయ పరిపక్వతను అహ్లువాలియా ప్రత్యేకంగా గుర్తు చేశారు. మహాత్మాగాంధీ ఉపాధి
హామీ పథకం పేరును వీబీ-జీ రామ్ జీ పథకంగా కేంద్రం మార్చడంపై అహ్లువాలియా
స్పందిస్తూ మాజీ కేంద్రమంత్రి శరద్ యాదవ్‌ను,
ఉపాధిహామీ
కార్మికుల కోసం ఆయన గొంతెత్తడాన్ని గుర్తు చేసుకొన్నారు. గ్రామాల్లోని ప్రజలకు
ఉపాధిని కల్పించడం ప్రభుత్వ నైతిక బాధ్యత అని యాదవ్ పేర్కొన్న విషయాన్ని
స్పృశించారు.
స్వతంత్రంగా నడిచే సంస్థలు అవసరమన్నారాయణ. మతపరమైన కాఠిన్యత
నైతికంగానే కాదు ఆర్థికంగానూ హానికరమని అహ్లువాలియా హెచ్చరించారు. పీవీ
ఊహించుకొన్నట్టు ప్రస్తుతం దేశంలో పరిస్థితులు లేవని స్పష్టం చేశారు. ఎవరి ప్రభావానికి
లొంగని, స్వతంత్రంగా
నడిచే శక్తివంతమైన సంస్థలు ఇప్పుడు ప్రతీరంగంలో ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి
చెప్పారు. ఎలక్షన్ కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించిన సమయంలో టీఎన్ శేషన్ చూపించిన
ధైర్యం, రాజకీయాలకు
తలొగ్గకుండా రాజీపడని ధోరణితో ఆయన ముందుకు వెళ్లిన వైనాన్ని అహ్లువాలియా గుర్తు
చేశారు.
కూటమి ప్రభుత్వాలు అస్థిరత్వంతో కొనసాగినప్పటికీ, దేశ రాజకీయాల్లో సంతులత్వ భావనను పరిచయం చేశాయని, రాజకీయ ధర్మాన్ని నిలబెట్టాయని గుర్తు చేశారు.
ప్రజాస్వామ్యమనేది ప్రకటనల్లో ఉండదని, ప్రజల సమస్యలను
శాంతిగా వినే నాయకత్వంలోనే ఉంటుందని అహ్లువాలియా అన్నారు. ఇది గుర్తుంచుకొంటే, అలాంటి ప్రజాస్వామ్యమే సమస్యలను తొలగిస్తూ దారిచూపిస్తుందన్నారు.
చివరిగా, పీవీని వేదికల
మీద స్మరించుకోవడానికే పరిమితం కాకుండా, మేధస్సు, వినయం, రాజకీయ వాస్తవికత, నైతిక
ధైర్యం కలిగిన ఆయన నాయకత్వాన్ని కొనసాగిస్తేనే ఆయనకు అసలైన నివాళి ఇచ్చినట్టు
అవుతుందని, కొత్త సవాళ్లను
అధిగమించడానికి పీవీ మార్గమే ఉత్తమమని కొనియాడారు.
‘అమర్ చిత్రకథ’
మోడల్:
పీవీ జీవిత కథను, ఆయన
తీసుకొచ్చిన సంస్కరణలను యువతకు అర్థమయ్యేలా చెప్పే పరిస్థితి ఉండాలని
ఆకాంక్షించారు. ‘అమర్ చిత్రకథ’ మోడల్ వంటి విధానంలో ఆయన కథను వివరించాల్సిన
ఆవశ్యకత ఉన్నదన్నారు. పీవిది కేవలం విధాన చరిత్ర కాదన్న అహ్లూవాలియా, ధైర్యం, మేధస్సు, పట్టుదల ఓ
చక్కని కథగా చెప్పాలని సూచించారు. పీవీ చరిత్రను, సంస్కరణలను
విద్యాసంస్థల్లో పాఠ్యాంశాలుగా చేర్చి బోధించాల్సిన అవసరం ఉన్నదన్నారు.
అప్పుడే చారిత్రాత్మకంగా నిర్లక్ష్యానికి గురవుతున్న పీవీ చరిత్ర, భవిష్యత్తు
తరాలకు ఓ స్ఫూర్తిగా నిలిచి జాతి నిర్మాణానికి సాయపడుతుందన్నారు. ఆర్థిక సంస్కరణలు
ఒకసారి జరిగి ముగిసే కార్యక్రమం కాదని, అవి నిరంతర
ప్రక్రియ అని ఆయన పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలాంటి ఆర్భాటాలకు, ఒత్తిళ్లకు తలొగ్గకుండా సరైన కఠినమైన నిర్ణయాలను
ఎలా తీసుకోవాలో పీవీ నాయకత్వం చూపించిందని కొనియాడారు.


No comments:
Post a Comment