పశ్చిమ బెంగాల్లో అసాధారణ రాజకీయ మార్పు
వనం జ్వాలా నరసింహరావు
(మే నెల 9, 2026)
యాభై ఏడు సంవత్సరాల క్రితం, 1969 సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో, నేను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, బర్ద్వాన్
జిల్లాలోని బోర్సెల్ గ్రామానికి అఖిల భారత కిసాన్ సభ (AIKS) సమావేశంలో పాల్గొనడానికి ఒక విద్యార్థిగా వెళ్లాను. ఆ సమయంలో పశ్చిమ బెంగాల్
రాష్ట్రం,
వామపక్ష కూటమి సారథ్యం ప్రభావంతో, గణనీయమైన రాజకీయ, సామాజిక మార్పుల దశను ఆస్వాదిస్తున్నది. అదే సమయం, మావో సిద్ధాంతాల ప్రభావంతో చారు మజుందార్, కానూ సన్యాల్ నాయకత్వంలో నక్సల్బరి
ఉద్యమం రూపుదిద్దుకుని, ఊపందుకుంటున్న సందర్భం కూడా.
బంగ్లా కాంగ్రెస్‌కు చెందిన అజోయ్
కుమార్ ముఖర్జీ,
యునైటెడ్ ఫ్రంట్‌కు రెండోసారి నాయకత్వం వహిస్తూ
ముఖ్యమంత్రిగా ఉన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) {సీపీఐ(ఎం)}
ప్రధాన భాగస్వామ్య శక్తిగా ఉన్న ఐక్య కూటమిలో
ఆల్-ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్
పార్టీ, సోషలిస్ట్ పార్టీ వంటి పార్టీలు కూడా భాగస్వాములయ్యాయి. మొదటిసారి 1967లో, మళ్లీ రెండవ వపర్యాయం 1969లో అధికారంలోకి వచ్చిన ఈ
కూటమి, పశ్చిమ బెంగాల్లో దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న వామపక్ష రాజకీయాల బలాన్ని
ప్రతిబింబించింది. అది అప్పటి వామపక్ష సిద్ధాంతాల పశ్చిమ బెంగాల్. ఆ సందర్భానికి
పూర్తి భిన్నంగా నేడు, సిద్ధాంత పరంగా వామపక్షాలకు విరుద్ధమైన హిందుత్వ
సిద్ధాంతానికి ప్రతీకైన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం భారత
ప్రజాస్వామ్యానికి వున్నా ప్రత్యేకత.
చరిత్ర పుటలు తిరగేస్తేనే గాని పశ్చిమ
బెంగాల్ రాజకీయ సంపూర్ణ ముఖచిత్రం అర్థంకాదు. ఆ రాష్ట్రానికి ఉద్యమాలు ఈ నాటివి
కాదు. స్వాతంత్ర్య పోరాట కాలంలో, సామ్రాజ్యవాదానికి
వ్యతిరేకంగా కార్మిక, శ్రామిక శక్తులను ఐక్యం చేసిన ఘనత పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి
వున్నది. స్వాతంత్ర్యం రాక ముందే కమ్యూనిస్ట్ పార్టీ బెంగాల్ లో ఉద్యమాలకు
నాయకత్వం వహించింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కాంగ్రెస్
ముఖ్యమంత్రిగా డాక్టర్ బి సి రాయ్ వున్నప్పుడే, ట్రామ్ చార్జీలు పెంచినప్పుడు, కరవు వచ్చినప్పుడు, కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది. పి ఎల్
480
పథకానికి వ్యతిరేకంగా విద్యార్థి పోరాటం, భారత-చైనా యుద్ధం జరిగినప్పుడు ద్వైపాక్షిక చర్చలు జరపాలని చేసిన ఎన్నో
ఉద్యమాల ఫలితంగానే అక్కడి ప్రజల్లో కమ్యూనిస్ట్ పార్టీ పట్ల అభిమానం ఏర్పడి పెరుగుతూ
వచ్చింది.
అలాగే, వామపక్ష,
కాంగ్రేసేతర రాజకీయ పార్టీలు, 1952 నుంచి, పశ్చిమ బెంగాల్ లో బలపడ సాగాయి. వామ పక్ష రాజకీయ పార్టీలన్నీ ఐక్యమై, ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులపై ఉమ్మడి పోరాటం చేయాలని సంకల్పించుకున్న
నేపధ్యంలో,
అనేక కష్ట, నష్టాలను అధిగమించుకుంటూ కొనసాగించిన సుదీర్ఘ
ప్రజా పోరాటం ఫలితంగా,
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ నాయకత్వంలో, వామ పక్ష కూటమి,
ఐదారు దశాబ్దాల క్రితమే మొదటిసారి అధికారంలోకి
వచ్చినప్పటికీ,
స్థిరపడ గలిగింది మాత్రం ఆ తర్వాత ఏడేళ్ల నుంచి మాత్రమే. కాంగ్రెస్
పార్టీ, కాంగ్రెస్ నుంచి విడిపోయిన తృణమూల్ కాంగ్రెస్ సవాళ్లను ఎదుర్కుంటూ, నాలుగు దశాబ్దాలపాటు ‘ఎర్రకోటకు బీటలు’ పడకుండా వామపక్షాలు
జాగ్రత్త పడ్డాయి.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రఫుల్ల
చంద్ర (పీసీ) ఘోష్ మొదటి ముఖ్యమంత్రికాగా, బిధాన్
చంద్ర (బీసీ) రాయ్ 1948 లో పశ్చిమ బెంగాల్ మొదటి అధికారిక ముఖ్యమంత్రి అయ్యారు.
ఆ తర్వాత రాజకీయ అస్థిరత ఏర్పడింది. ఆ నేపధ్యంలో 1967 లో పశ్చిమ బెంగాల్ శాసన సభకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ‘యునైటెడ్
లెఫ్ట్ ఫ్రంట్’ పేరుతో ఒక కూటమి, ‘పీపుల్స్ యునైటెడ్
లెఫ్ట్ ఫ్రంట్’ పేరుతో మరో కూటమి ఎన్నికల బరిలో దిగాయి. ఎన్నికల అనంతరం రెండూ కలిసి
‘యునైటెడ్ ఫ్రంట్ గా,
బంగ్లా కాంగ్రెస్ నాయకుడు అజోయ్ ముఖర్జీ ముఖ్యమంత్రిగా
కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ నాయకుడు
జ్యోతి బాసు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారప్పుడు. అజోయ్ ముఖర్జీ 15 మార్చ్,
1967 నుండి 2 నవంబర్ 1967 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు.
కేవలం తొమ్మిది నెలల కాలంలోనే
యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసింది.
మూడు నెలల పాటు (2
నవంబర్, 1967-20 ఫిబ్రవరి, 1968 వరకు) పిసి ఘోష్ ను మరో పర్యాయం ముఖ్యమంత్రి పీఠం పై కూచోబెట్టారు. ఆయన పదవిలో
నిలదొక్కుకోవడం కష్టం కావడంతో, ఏడాది కాలంపాటు రాష్ట్రపతి
పాలన విధించింది కేంద్ర ప్రభుత్వం. ఏడాది తర్వాత, 1969 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో, యునైటెడ్ ఫ్రంట్ ఉమ్మడిగా
ఎన్నికల బరిలో దిగి,
మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. ఆ ప్రభుత్వాన్నీ ఎక్కువ
కాలం అధికారంలో వుండనీయలేదు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 25, 1969 నుంచి మార్చ్ 19,
1970 వరకు ముఖ్యమంత్రిగా వున్న అజోయ్ ముఖర్జీ ప్రభుత్వాన్ని
రద్దుచేసింది.
అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో
ప్రత్యేకంగా ‘పశ్చిమ బెంగాల్ వ్యవహారాల’ కాబినెట్ మంత్రిగా నియమించబడిన సిద్ధార్థ
శంకర్ రే చాణక్య నీతిలో భాగంగా, యునైటెడ్ ఫ్రంట్
ప్రభుత్వాన్ని కేవలం 13
నెలల కాలంలోనే రెండో పర్యాయం రద్దు చేసింది కేంద్రం. తిరిగి
మరి కొంతకాలం (మార్చ్ 19,
1970-ఏప్రిల్ 2, 1971) రాష్ట్రపతి పాలన
విధించింది. ఏదేమైనా,
1971 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో గతంలో మాదిరి "యునైటెడ్
ఫ్రంట్" గా కాంగ్రేసేతర రాజకీయ పక్షాలు కలిసి పోటీకి దిగలేదు. సీపీఎం పార్టీ
ఆలోచనా ధోరణికి అనుకూలమైన కొన్ని పార్టీలు సీపీఎం తో జతకట్టి పోటీ చేశాయి. ఫలితాలు
కాంగ్రెస్ కు అనుకూలంగా రాకపోయినా, సీపీఎం అతి పెద్ద
పార్టీగా, ఎక్కువ స్థానాలను గెలుచుకున్న పార్టీగా అవతరించినా, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, అప్పటి గవర్నర్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడ్డారు. మరో పర్యాయం పి సి ఘోష్
ను ముఖ్యమంత్రి పీఠం పై కూచోబెట్టారు (ఏప్రిల్ 2, 1971-జూన్ 28,
1971).
సీపీఎం రాష్ట్ర వ్యాప్త ఆందోళనను
చేపట్టింది. ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ప్రజాస్వామ్య పోరాటమే మార్గమని
భావించింది. ఘోష్ మనుగడ కష్టమై పోవడంతో మళ్లీ రాష్ట్రపతి పాలన (జూన్ 28, 1971 నుంచి మార్చ్ 19,
1972 వరకు) విధించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పకడ్బందీ
వ్యూహంతో మరో మారు ఎన్నికల్లో దిగి, సీపీఎం ప్రాబల్యాన్ని
ఎలాగైనా తగ్గించాలన్న ఆలోచన చేసింది ఇందిరా గాంధి ప్రభుత్వం. ఆమె కనుసన్నల్లో
సిద్ధార్థ శంకర రే ఆ ప్రణాళికను అమలు పరిచాడు. అధిష్టానం ఆశీస్సులతో ఐదేళ్లు
ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు. 1972 ఎన్నికలు
ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చే రీతిలో జరిగాయి. బూతుల ఆక్రమణ, దొంగ ఓట్ల స్వైర విహారం, ఓట్ల లెక్కింపులో
అవకతవకలు భారీ ఎత్తున జరిగింది. ఎట్టి పరిస్థితిలలోను సీపీఎం పార్టీ అధికారంలోకి
రాకుండా కట్టుదిట్టమైన అ నైతిక చర్యలన్నీ అవలంబించింది అలనాటి కేంద్ర
ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ.
సీపీఎం పార్టీ వామపక్ష కూటమికి
సారధ్యం వహించి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ, ఎన్నికలలో జరిగిన అక్రమాల
కారణంగా,
రిగ్గింగుకు వ్యతిరేకంగా, ఎన్నికలు జరిగిన రోజున దాదాపు
ఎన్నికలను బహిష్కరించినప్పటికీ, ఆ పార్టీకి స్థానాలు
తక్కువే వచ్చినా,
ఓటింగ్ శాతం మాత్రం 28% వరకు వుండడం
పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఓటింగు శాతానికి అనుగుణంగా సీట్లు వచ్చి
వుంటే, సీపీఎం స్థానాల సంఖ్య 80
వరకుండేది. బలమైన ప్రతిపక్షంగా వుండి వుండేది. వాస్తవానికి
కాంగ్రెస్ పార్టీకి 216
స్థానాలు, సీపీఎం కు కేవలం 14 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇంత జరిగిన తర్వాత, ప్రజాస్వామ్యం అవహేళనకు గురైన
తర్వాత, ఆ నేపధ్యంలో ఏర్పడిన శాసనసభలోకి ప్రవేశించరాదని తీర్మానించుకుంది సీపీఎం. శాసన
సభ్యులుగా గెలిచిన ఆ పార్టీకి చెందిన వారెవరూ ప్రమాణ స్వీకారం చేయలేదు. నైతిక
విలువలకు అనుగుణంగా ఐదేళ్లు జీతభత్యాల జోలికి పోలేదు.
ఇందిరా గాంధి అత్యవసర పరిస్థితిని
సడలించి 1977
లో సాధారణ ఎన్నికలు నిర్వహించినప్పుడు, జనతా కూటమితో కలిసి పోటీ చేసిన సీపీఎం, ఘన విజయాన్ని సాధించింది.
ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికలలో వామ పక్ష కూటమి విడిగా పోటీ చేసి, 243 స్థానాలను గెలుచుకుని,
జ్యోతిబసు నాయకత్వంలో కాంగ్రేసేతర లెఫ్ట్ ఫ్రంట్
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వరుసగా ఐదు పర్యాయాలు లెఫ్ట్ ఫ్రంట్ ను ఎన్నికల్లో
గెలిపించి,
23 సంవత్సరాలు (జూన్ 21, 1977-నవంబర్ 6,
2000) ముఖ్యమంత్రిగా కొనసాగిన జ్యోతిబసు, స్వచ్చందంగా పదవి నుంచి తప్పుకుని, బుద్దదేబ్ భట్టాచార్యకు
వారసత్వం అప్పగించారు. ఒక రాష్ట్రానికి అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన
రికార్డును జ్యోతి బసు స్వంతంచేసుకున్నాడు.
1997
లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసి, అఖిల భారత తృణమూల్
కాంగ్రెస్ ను స్థాపించిన కుమారి మమత బెనర్జీ, అచిర కాలంలోనే, సీపీఎం కు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు తెచ్చుకుంది. సీపీఎం ను గద్దె
దింపడానికి అవకాశం వున్న అన్ని వనరులను ఉపయోగించుకుంటున్నది. ఎన్డీయే తో
జతకట్టింది. పడకపోతే బయటకొచ్చింది. 2001 ఎన్నికల్లో
కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసింది. కమ్యూనిస్ట్-లెఫ్ట్ ఫ్రంట్ ను ఓడించ లేకపోయింది.
లోక్ సభ సభ్యురాలిగా 2004
లో కేంద్ర మంత్రివర్గంలో చేరింది. పశ్చిమ బెంగాల్
పారిశ్రామిక విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఆందోళన చేసింది. 2006 శాసన సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచిన స్థానాలు తక్కువే అయినా, పోరాటం కొనసాగించింది. అదే సంవత్సరం కేంద్ర మంత్రి పదవికి
రాజీనామా చేసి ఆందోళనలు చేపట్టింది. 2009 లోక్ సభ ఎన్నికలలో
కాంగ్రెస్ తో కలిసి ఉమ్మడిగా పోటీ చేసి, ఇరువురు కలిసి 26 స్థానాలను గెల్చుకున్నారు. తదనంతరం జరిగిన మునిసిపల్ ఎన్నికలు, కలకత్తా కార్పొరేషన్ ఎన్నికలు, తృణమూల్ కాంగ్రెస్ కు ఘన
విజయాన్ని చేకూర్చాయి.
నవంబర్ 6, 2000 నుంచి ముఖ్యమంత్రిగా బుద్దదేబ్ పదవిలో కొనసాగుతూ, తృణమూల్ కాంగ్రెస్ కు శాసనసభలో గెలుపు దక్కకుండా కాపాడుతూ వచ్చినా తప్పుకోక
తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ యోధానుయోధుడు, సిద్ధాంత
కర్త, ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడు అని పేరు
తెచ్చుకున్న సిద్ధార్థ శంకర రే మార్చి 19, 1972 నుంచి, జూన్ 21, 1977 వరకు పశ్చిమ బెంగాల్
ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యం వహించిన తర్వాత కాంగ్రెస్
పార్టీకి అక్కడ స్థానం లేకుండా పోయిందనాలి. 34 సంవత్సరాలపాటు తన అధికారాన్నంతా
పణంగా పెట్టినా కాంగ్రెస్ సాధించలేనిదాన్ని, అచిర
కాలంలోనే మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సాధించి 2011 ఎన్నికల్లో
మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చింది.
మమతా బెనర్జీ ఆషామాషీగా, హఠాత్తుగా అధికారంలోకి రాలేదు. ఎంతో కృషి, నిరంతర పోరాట ఫలితంగానే ఆమెకు ఆ అవకాశం ఇచ్చారు ఓటర్లు 2011 ఎన్నికల్లో.
అలాగే మరో ఐదేళ్లపాటు తమ భవిష్యత్‌ను ఆమె చేతుల్లోనే పెట్టారు 2016, 2021 ఎన్నికలలో
కూడా పశ్చిమ బెంగాల్ ఓటర్లు. మమత కేవలం ముప్ఫై ఏళ్ల వయస్సులోనే సీపీఎం దిగ్గజం
సోమ్‌నాథ్ ఛటర్జీని ఓడించి తొలిసారి ఎంపీగా గెలిచింది. ఆ తరువాత ఓడినా, గెలిచినా, గెలిచినప్పుడు కేంద్రంలో మంత్రి పదవి
అనుభవించినా, కాంగ్రె్‌సతో కొంతకాలం, బీజేపీతో కొంతకాలం జతకట్టినా, వేరుపడినా, బెంగాల్ రాజకీయాలలో మాత్రం సుస్థిర స్థానాన్ని కాపాడుకుంటూనే వచ్చింది.
అదే ఆమెకు ఇప్పుడు విజయం చేకూర్చింది.
సీపీఎం పాలన పగ్గాలు జ్యోతిబసు చేతిలో
వున్నంత కాలం మమత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇరవయ్యేడు సంవత్సరాలు
పశ్చిమ బెంగాల్ లో ప్రజలు స్వర్ణ యుగం చూసి వుండవచ్చు. దరిమిలా బుద్దదేబ్ పాలనలో
తృణమూల్ ఎదుగుదలకు ఆస్కారం లభించింది. ఇటీవల వెలువడిన శాసనసభ ఎన్నికల ఫలితాలు, ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని అలనాటి కాంగ్రెస్ ఆధిపత్యం
నుండి, వామపక్ష సిద్దాంతానికి, తదనంతరం
తృణమూల్ కాంగ్రెస్ నాయకత్త్వానికి మారి, ఇప్పుడు ఏకంగా
మతతత్త్వ భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో అధీనంలోకి రావడం, బహుశా భారత దేశ
ప్రజాస్వామ్యానికే స్వంతమేమో! తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం మిగిలింది.
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో మమతా
బెనర్జీ (టీఎంసీ) నుండి సువేందు అధికారి (బీజేపీ) వరకు జరిగిన పరిణామాలు అత్యంత నాటకీయమైనవి. 15 ఏళ్ల
తృణమూల్ కాంగ్రెస్ పాలనకు ముగింపు పలకడం, 2026 నాటికి
సువేందు అధికారి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎదగడం ఇందులో కీలక ఘట్టాలు. కీలక పరిణామంలో భాగంగా, ఒకప్పుడు మమతా బెనర్జీకి
అత్యంత నమ్మకస్తుడిగా, నందిగ్రామ్ ఉద్యమంతో తృణమూల్
కాంగ్రెస్ బలోపేతానికి కారణమైన సువేందు అధికారి, TMC నాయకత్వంతో
విభేదాల కారణంగా 2020 డిసెంబర్లో పార్టీని వీడి భారతీయ
జనతాపార్టీలో చేరారు.
2021 ఎన్నికల్లో, మమతా
బెనర్జీని ఆమె సొంత నియోజకవర్గం నందిగ్రామ్‌లో సువేందు అధికారి ఓట్ల తేడాతో ఓడించారు. తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలో గెలిచినప్పటికీ,
సువేందు ‘జెయింట్ కిల్లర్’గా నిలిచి, బీజేపీ శాసనసభాపక్ష
నేతగా బాధ్యతలు చేపట్టారు. సువేందు అధికారి ఆధ్వర్యంలో, బీజేపీ
రాష్ట్రవ్యాప్తంగా తన సంఘటనను బలోపేతం చేసుకుంది. టీఎంసీ పాలనపై అవినీతి, శాంతిభద్రతల సమస్యలు, చొరబాటు వంటి అంశాలను బలంగా
ప్రజల్లోకి తీసుకెళ్లారు. 2026 అసెంబ్లీ
ఎన్నికలు మరో చారిత్రాత్మక మార్పుకు దారి తీశాయి. సువేందు అధికారి మరోసారి మమతా
బెనర్జీని భవానీపూర్ నియోజకవర్గంలో 15 వేల పైన ఓట్ల
భారీ తేడాతో ఓడించారు.
BJP 200కు పైగా స్థానాలతో చారిత్రాత్మక
విజయాన్ని సాధించింది, టీఎంసీ 15 ఏళ్ల
పాలనకు ముగింపు పలికింది. నందిగ్రామ్ నుండి భవానీపూర్ వరకు మమతా బెనర్జీని వరుసగా
రెండుసార్లు ఓడించిన సువేందు అధికారి, పశ్చిమ బెంగాల్ తొలి
బీజేపీ ముఖ్యమంత్రిగా 2026 మే 9న ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. మమతా
బెనర్జీ దశాబ్దాల పట్టు, సువేందు అధికారి నాయకత్వంలో బీజేపీ చేతిలోకి
వెళ్ళింది. నందిగ్రామ్ ఉద్యమ నాయకుడే, ఆ ఉద్యమం ద్వారా
వచ్చిన ముఖ్యమంత్రిని పదవి నుండి దించి, ఆ స్థానాన్ని కైవసం
చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మార్క్సిజం-కమ్యూనిజం నుండి సుదీర్ఘ
ప్రయాణం సాగించి చివరగా ‘జాతీయ హిందూత్వ’
వైపు మళ్లాయి.


Sickularism + hypocrisy + selective outrage + hiding inconvenient facts. Art of journalism. Well done.
ReplyDeleteYes “Anonymous’ please
Delete