ముక్కంటికైనా .... గెలుపు అసాధ్యం
వనం జ్వాలా నరసింహారావు
భక్తి పత్రిక (అక్టోబర్ నెల, 2026)
ఉధృతంగా కొనసాగుతున్న ఏడవ
రోజు కురుక్షేత్ర సంగ్రామంలో, చేకితానుడు, కృపాచార్యుడు ఒకరినొకరు ఎదురెదురుగా ఢీకొన్నారు. ఒకరినొకరు
నొప్పించుకున్నారు. ఇద్దరు మూర్ఛపోయి నేలమీదికి ఒరిగారు. వారిద్దరినీ సహాయకులు వచ్చి
తీసుకుపోయారు. ధృష్టకేతుడికి, భూరిశ్రవుడికి
మధ్య భీకరమైన పోరు జరిగింది. దుశ్శాసనుడు, చిత్రసేనుడు, వికర్ణుడు కలిసి అభిమన్యుడితో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో అభిమన్యుడు ఆ ముగ్గురి రథాలను ధ్వంసం
చేశాడు. భీముడి శపథం గుర్తుకు వచ్చి
... అభిమన్యుడు, వారిని బాధపెట్టాడే కాని చంపలేదు. వారి దుస్థితి చూసిన భీష్ముడు అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. ఇది గమనించిన
అర్జునుడు అభిమన్యుడికి సాయంగా పోతుంటే, త్రిగర్తపతైన సుశర్మ ఆర్జునుడిని ఎదుర్కొన్నాడు; కాని దెబ్బతిన్నాడు. అర్జునుడు స్వైరవిహారం
చేశాడు.
అర్జునుడు భీష్ముడి మీదికి
యుద్ధానికి వెళ్ళాడు. ధర్మరాజు భీమనకుల సహదేవులతో కలిసి అర్జునుడికి అండగా వెళ్లారు. ఇంతలో
దుర్యోధనుడు, సైంధవుడు పాండవులను ఎదుర్కున్నారు. ఆ సమయాన
శిఖండి భీష్ముడిని ఎదుర్కున్నాడు. అప్పుడు శల్యుడు ఆగ్నేయాస్త్రాన్ని శిఖండి మీద
ప్రయోగించాడు. శిఖండి వారుణాస్త్రాన్ని
వేశాడు. భీష్ముడు ధర్మారాజును ఇబ్బందికి గురిచేశాడు. భీముడు దుర్యోధనుడి మీదికి ఉరికాడు. దుర్యోధనుడు కూడా భీముడిమీద
దాడి చేశాడు. మధ్యలో తన మీదికి వచ్చిన
చిత్రసేనుడి మీద భీముడు గదను విసిరాడు. అది చిత్రసేనుడి రథాన్ని, గుర్రాలను, సారథిని
పిండిపిండి చేసింది. రథం లేని
చిత్రసేనుడిని వికర్ణుడు తీసుకునిపోయాడు.
ధర్మరాజు, నకుల సహదేవులు భీష్ముడి చేతిలో దెబ్బ తిన్నారు. ఇంతలో శిఖండి భీష్ముడి సమీపానికి వచ్చాడు. వాడిని
లెక్కచేయకుండా భీష్ముడు పాండవ సేనను బాధించాడు. సాత్యకి, ధృష్టద్యుమ్నుడు బాగా విజృంభించి కౌరవ సైన్యాన్ని కలత
పెట్టారు. అప్పుడు దుర్యోధనుడు స్వయంగా యుద్ధానికి దిగాడు.
భీష్ముడితో కలిసి ధర్మరాజు సేనలను కమ్మివేశారు. అదే సమయంలో అక్కడ అర్జునుడు ప్రత్యక్షమయ్యాడు.
అంతలో ద్రోణాచార్యుడు విజృంభించి, అర్జునుడిని ఎదిరించి, పాండవుల మీద పడ్డాడు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. కౌరవ, పాండవ సేనలు తమతమ విడిదులకు చేరుకున్నారు.
భీష్ముడి వివరణ
కురుక్షేత్రంలో ఎనిమిదవ
రోజున భీష్ముడు ‘కూర్మవ్యూహాన్ని’ ఏర్పరిచాడు. పాండవుల సేనాపతి ధృష్టద్యుమ్నుడు ‘శృంగాటకవ్యూహాన్ని’ పన్నాడు. ఇలా ఉభయ సైన్యాలు వ్యూహాలు ఏర్పాటు చేసుకుని
యుద్ధానికి సిద్ధమై ఒకరినొకరు
తలపడ్డారు. భీష్ముడి విజృంభణకు ఆయన్ను ఎదిరించలేక పాండవ సేనలోని మహావీరులంతా మారుమూలలకు తొలగారు. భీముడు ఒక్కడు మాత్రం
భీష్ముడిని ఎదిరించాడు. అతడి సారథిని
హతమార్చగా గుర్రాలు రథాన్ని లాక్కొని పరుగెత్తాయి. దుర్యోధనుడి తమ్ముడు సునాభుడు భీముడిని ఎదుర్కున్నప్పుడు, భీముడు అతడి తల నరికాడు. అతడి ఏడుగురు సోదరులు దొమ్మిగా భీముడి మీదికి దూకారు. భీముడు ఆ ఏడుగురిని చంపాడు. మిగతా
కురుకుమారులు భయంతో తొలగిపోయారు.
భీముడి చేతుల్లో తన తమ్ములు
చావడం చూసిన దుర్యోధనుడు దుఃఖంతో
భీష్ముడి దగ్గరికి వెళ్లి, ఆయన వారిని కాపాడలేదని, బాగా యుద్ధం చేయలేదని ఎత్తిపొడుపు మాటలన్నాడు. ఇలాంటి
ఆపత్తు వస్తుందని తాను, ద్రోణాచార్యుడు, విదురుడు దుర్యోధనుడికి ఏనాడో చెప్పామని, కాని తమ మాటలను అప్పుడు ఆయన ఏమాత్రం లెక్కచేయలేదని, మహాపరాక్రమవంతులైన ‘పాండవులకు ఎదురుగా నిలిచి జయించడానికి ఈశ్వరుడికి కూడా అసాధ్యం’ అని, ఇక కౌరవులు ఏపాటని, భీష్ముడు పలికాడు దుర్యోధనుడితో. కౌరవ కుమారులలో ఎవరైనా భీముడికి ఎదురైతే
వాడిని కాపాడడం ఎలాంటి శూరుడికైనా
సాధ్యం కాదని, కూడా అన్నాడు భీష్ముడు. ఇక ముందు వీరస్వర్గాన్నే
ధనంగా కోరి యుద్ధం చేయమని, రాజ్యం మీద ఆశలు వదలమని, తానైతే చేతనైనంత తెగించి యుద్ధం చేస్తానని స్పష్టం చేశాడు.
ఇలా చెప్పిన భీష్ముడు
భీముడున్న వైపుకు రథాన్ని పోనిచ్చాడు. అది చూసి ధృష్టద్యుమ్నుడు, శిఖండి, భీష్ముడితో
తలపడ్డారు. అంతకు ముందే అర్జునుడు, చేకితానుడు, ద్రౌపదీ పుత్రులు ఒకవైపు కౌరవులతో పోరాడుతుంటే, మరో వైపున అభిమన్యుడు, ఘటోత్కచుడు దుర్యోధనుడి మీదికి ఉరికారు. ఆ విధంగా మూడు గట్టి సైన్యాలు చాలా కఠోరంగా యుద్ధం సాగించాయి.
కౌరవుల పక్షాన ద్రోణాచార్యుడు, పాండవుల పక్షాన భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు విజృంభించారు.
అర్జునుడికి, ఉలూచికి పుట్టిన ఇరావంతుడు విజృంభించి కురుసేనమీద దూకడంతో, శకుని ఆరుగురు తమ్ముళ్లు అతడిని ఎదుర్కున్నారు. అయినా ఇరావంతుడు చాలా నైపుణ్యంతో
వారితో యుద్ధం చేశాడు. ఒక దశలో ఇరావంతుడు నేలమీద నిలబడి యుద్ధం చేస్తుంటే, ఆ ఆరుగురు కూడా
కిందికి దిగారు. ఆ ఆరుగురు శకుని తమ్ముళ్లను పన్నెండు తునకలుగా నరికేశాడు ఇరావంతుడు.
దుర్యోధనుడప్పుడు అలంబసుడిని ఇరావంతుడి మీదికి పురికొల్పాడు.
మాయాబలంతో అలంబసుడు యుద్ధం చేసినప్పటికీ, ఇరావంతుడు ధైర్యంగా ఎదిరించాడు. ఇద్దరూ ఒక దశలో ఆకాశానికి ఎగిరి మాయా యుద్ధం
చేశారు. ఇద్దరూ ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలను ప్రదర్శించి యుద్ధం చేశారు.
ఇరావంతుడు ఆదిశేషుడి రూపాన్ని ధరిస్తే, అలంబసుడు
గరుత్మంతుడి ఆకారం ధరించాడు. అప్పుడు ఇరుకున పడ్డ ఇరావంతుడి మెడ అలంబసుడు నరికేశాడు.
ఘటోత్కచుని యుద్ధం
సోదరుడి మరణం చూసిన ఘటోత్కచుడు కురుసైన్యంలో చొరబడ్డాడు. అతడిని
దుర్యోధనుడు ఎదుర్కుని, వేగవంతుడు, విద్యుజ్జిహ్వుడు, బహ్వాశి అనే ముగ్గురు రాక్షసులను కూడా అతడి మీదికి పంపాడు. ఘటోత్కచుడు తన బాణాలతో దుర్యోధనుడి శరీరాన్నంతా నింపేశాడు.
ఆ తరువాత శక్త్యాయుదాన్ని ప్రయోగించడానికి పూనుకోగా, దుర్యోధనుడు ఒక గొప్ప ఆయుధాన్ని అతడి మీదికి వేశాడు. కాని దాన్ని మధ్యలోనే
ముక్కలు చేశాడు ఘటోత్కచుడు. తరువాత పెద్దగా సింహనాదం చేశాడు. అది విన్న భీష్ముడు
పన్నెండు మంది ద్రోణాది వీరులను
(కృపాచార్యుడు, అశ్వత్థామ, చిత్రసేనుడు, బాహ్లికుడు మొదలైనవారు) దుర్యోధనుడి చుట్టూ రక్షణగా నిలపాగా, వారంతా ఘటోత్కచుడిని ఎదిరించారు. ఘటోత్కచుడు విజృంభించి ద్రోణాది వారందరితో యుద్ధం చేసి, సారథులను చంపి, ధనుస్సులను విరిచాడు. కౌరవసైన్యాన్ని చీల్చి చెండాడాడు. అతిరథ మహారథ వీరులను చిక్కుపెట్టాడు.
అప్పుడు ద్రోణుడాదిగాగల
పన్నెండు మంది వీరులు ఘతోత్కచుడిని ఒక్కడిని చేసి చుట్టుముట్టారు. ఘటోత్కచుడు ఆకాశానికి ఎగిరి
యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడక్కడికి భీముడు వచ్చాడు. అదే సమయంలో వచ్చిన దుర్యోధనుడికి, భీముడికి మధ్య యుద్ధం జరిగింది. దుర్యోధనుడి దెబ్బకు భీముడు ఒళ్లు మరిచి
ఒరిగిపోయాడు. అతడి దుస్థితి చూసి ఉప పాండవులు విజృంభించారు. ఇంతలో భీముడు
తెప్పరిల్లుకుని ద్రోణుడిని కొట్టి మూర్ఛపోయేలా చేశాడు. వెంటనే అశ్వత్థామ, దుర్యోధనుడు భీముడిని ఎదుర్కున్నారు. ఘటోత్కచుడు, ఉప పాండవులు, అభిమన్యుడు అంతా యుద్ధానికి దిగారు.
ఘటోత్కచుడు మాయా యుద్ధం
చేయడం మొదలు పెట్టాడు. కౌరవ యోధులంతా చచ్చిపడి వున్నట్లు సైనికులకు కనబడేలా మాయ చేశాడు.
అదంతా రాక్షసమాయ అని భీష్ముడు
చెప్పినా వారు వినిపించుకోలేదు. అప్పుడు దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వచ్చి ఎప్పటి మాదిరిగానే నిష్టూరాలు పలికాడు. ఆయన లాంటి, ద్రోణుడు లాంటి గొప్ప వీరులు కౌరవ పక్షంలో ఉన్నప్పటికీ
శత్రువుల చేతుల్లో కష్టాలు పడుతున్నానని, ఇక తానే స్వయంగా పాండవులతో పోరాడి చావనైనా చస్తానని, లేదా జయాన్నైనా
పొందుతానని అన్నాడు. భీష్ముడు దుర్యోధనుడి మాటలు విని పాండవులను ఎదిరించడానికి
పాండవులంతటి వారే వుండాలి కాని దుర్యోధనుడి లాంటి వాడికి సాధ్యం కాదని, అసాధ్యమైన యుద్ధంలో కౌరవుల పక్షాన యుద్ధం చేయడానికి తన లాంటి
వారున్నారని, దుర్యోధనుడు యుద్ధం చేయనక్కరలేదని అన్నాడు.
తరువాత భీష్ముడు
ప్రోత్సహించగా భగదత్తుడు ఏనుగును ఎక్కి పాండవ సేనతో యుద్ధానికి దిగాడు. ఇది చూసి ఘటోత్కచుడు పెద్ద
ఏనుగునెక్కి, తన రాక్షస సైన్యాన్ని తీసుకుని భగదత్తుడి మీదకు పోరాటానికి వచ్చాడు.
అతడికి అండగా భీముడు, అభిమన్యుడు, ద్రౌపది కొడుకులు వచ్చారు. అయినా భగదత్తుడు విజృంభించి యుద్ధం చేయసాగాడు. ద్రోణాచార్య, కృపాచార్య యోధులు పాండవ సేనను వెంటబడి తరిమారు. కౌరవ సేనలో కోలాహలం
పుట్టింది. అది చూసి ధర్మరాజు, అర్జునుడు, ద్రుపదుడు అటు వెళ్లారు యుద్ధం చేయడానికి. అలా వచ్చిన వారిలో
అర్జునుడు విజృంభించి యుద్ధం చేయసాగాడు. అప్పుడు భీముడు అర్జునుడికి ఇరావంతుడి మరణం
గురించి చెప్పాడు. అర్జునుడు విధిని నిందించాడు. శ్రీకృష్ణుడు
తత్త్వబోధ జ్ఞప్తికి తెచ్చుకున్న అర్జునుడు దుఃఖాన్ని మరచి కౌరవ సేన వైపు రథాన్ని పోనిమ్మని
శ్రీకృష్ణుడిని కోరాడు.
అర్జునుడు బాణాలను కౌరవ
సేనమీద ప్రయోగించాడు. భీముడు కూడా యుద్ధంలో విచ్చలవిడిగా విహరిస్తూ కౌరవులను ఏడుగురిని చంపగా
మిగిలినవారు భయపడి పారిపోయారు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. అయినప్పటికీ, దుర్యోధనుడు యుద్ధం చేయడానికి పూనుకోగా, పాండవులు కూడా వెనక్కు తగ్గకుండా ఉత్సాహంగా పోరు సాగించారు.
ఇంతలో చీకటి అంతా వ్యాపించగా, పాండవులు, కౌరవులు యుద్ధాన్ని చాలించి తమ తమ నివాసాలకు వెళ్లిపోయారు. తన
సైన్యం చాలా నష్టం కావడం వల్ల, ఆ ఎనిమిదోనాటి రాత్రి, దుర్యోధనుడి మనస్సు కలత చెందింది.
దుర్యోధనాదుల సమావేశం
ఆ సాయంత్రం, దుర్యోధనుడు దుశ్శాసనుడు, కర్ణుడు, శకునిలతో
సమావేశమయ్యాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ
మధ్యస్థంగా వుంటూ పాండవ సైన్యాలను చంపడం లేదని, ఏం చేస్తే మంచిదని వారిని అడిగాడు దుర్యోధనుడు. మున్ముందు
భీష్ముడిని యుద్ధానికి తీసుకుపోవద్దని, తాను పాండవులను ఎదుర్కుని వారిసైన్యాన్ని హతమారుస్తానని కర్ణుడు అన్నాడు. భీష్ముడి యుద్ధాన్ని
నిలిపివేద్దాం అని దుశ్శాసనుడితో అన్నాడు దుర్యోధనుడు. ఇలా అంటూ
కర్ణుడిని, శకునిని వారి ఇళ్లకు పంపించి వేశాడు. స్నానాది
కార్యక్రమాలు ముగించుకుని దుశ్శాసనుడిని తీసుకుని భీష్ముడి దగ్గరికి పోయాడు. భీష్ముడు యుద్ధం చేస్తున్న తీరు గమనిస్తే, పాండవుల పట్ల మెతకదనం కనిపిస్తుందని, వారికి నొప్పి కలిగించడంలేదని, చేత చిక్కినా వారిని ఏమీ చేయడం లేదని అన్నాడు దుర్యోధనుడు.
యుద్ధం మొదలయ్యి ఎనిమిది
రోజులైనా, దేవదానవులు కూడా ఎదిరించలేని భీష్ముడు ఆర్జునుడిని చంపలేదని, ఇక ఆయన యుద్ధం విరమిస్తే కర్ణుడిని యుద్ధానికి పంపిస్తానని అన్నాడు దుర్యోధనుడు. భీష్ముడు ఆ మాటలకు బాధపడి, అలా కఠినంగా మాట్లాడడం న్యాయం కాదన్నాడు. అర్జునుడి పరాక్రమాన్ని ఖాండవ వన దహనం, శివుడిని మెప్పించడం, పాశుపతం ఇతర దివ్యాస్త్రాలు సంపాదించడం, గంధర్వుల బారి నుండి దుర్యోధనుడిని విడిపించడం, ఉత్తరగోగ్రహణంలో అర్జునుడు విజయం మొదలైన ఉదాహరణలతో గుర్తు చేశాడు. జయింపరాని పాండవులతో విరోధం తెచ్చుకున్నాడని, తాను ఆర్జునుడిని జయించలేనని, శిఖండిని చంపలేనని, తక్కినవారు ఎంతమందైనా చీల్చి చెండాడుతానని స్పష్టం చేశాడు.
తాను, తన సైన్యం కలిసి ద్రుపద, విరాట, యాదవ సైన్యాన్ని
ఎదుర్కొని యుద్ధం చేస్తామని, తక్కిన కౌరవ వీరులంతా దుర్యోధనాదులతో కలిసి పాండవులను గెలవడానికి ప్రయత్నించమని అన్నాడు భీష్ముడు. తన
బాహుబలాన్ని మర్నాడు చూడవచ్చని
చెప్పాడు భీష్ముడు. ఆ మాటలకు దుర్యోధనుడు సంతోషించాడు. మర్నాటి యుద్ధానికి సిద్ధం కాసాగాడు.
తొమ్మిదోనాటి విశేషాలు
తొమ్మిదవ నాటి యుద్ధం
ప్రారంభమయ్యే ముందర, యుద్ధానికి సిద్ధపడి, కవచం తొడుక్కుని, సేనతో బయల్దేరి వెళ్లి, భీష్ముడి సమీపంలో వున్న రాజులతో క్రితం రాత్రి భీష్ముడు అన్న మాటలను చెప్పాడు. ద్రుపద, విరాట, యాదవుల
సైన్యాన్ని భీష్ముడు చంపుతానన్నాడని, కాబట్టి తామందరం తమతమ సామర్థ్యం, బలం చూపించి భీష్ముడికి అండగా పాండవులను గెలవాలని అన్నాడు. దుర్యోధనుడి మాటలను
విన్న భీష్ముడికి అతడి పట్ల ఏవగింపు, లజ్జ, మనోదుఃఖం కలిగాయి. అయినా తనను తానే ఓదార్చుకున్నాడు. అంతా భీష్ముడి
సమీపంలోనే వుందామని, ఆయనకు సహాయంగా అనేకమంది రథికులను ఆయన దగ్గర
ఉంచుదామని, ఆయన దరిదాపుల్లోకి శిఖండిని రాకుండా చూద్దామని దుర్యోధనుడు
దుశ్శాసనుడితో, కృపాశ్వత్థామలతో అన్నాడు. వారంతా ఆయన మాటలకు
సమ్మతించారు.
భీష్ముడు
సర్వతోభద్రవ్యూహాన్ని ఏర్పాటు చేశాడు. ఆ వ్యూహంలో కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, శకుని, సుదక్షిణుడు, సైంధవుడు, కౌరవులు, భీష్ముడు ముందు భాగంలో నిలిచారు. భీష్ముడి ఆజ్ఞానుసారం ద్రోణుడు, భూరిశ్రవుడు, భగదత్తుడు కుడి భాగంలోను, సోమదత్తుడు, అశ్వత్థామ, విందుడు, అనువిందుడు ఎడమవైపున నిలుచున్నారు. హలాయుధుడు, అలంబసుడు, శ్రుతాయువు వెనుకవైపున వున్నారు. దుర్యోధనుడు త్రిగర్త సైన్యంతో సహా
మధ్యభాగంలో నిలిచాడు.
అర్జునుడు భీష్ముడి
వ్యూహాన్ని చూసి, శిఖండిని భీష్ముడికి ఎదురుగా నిలబెట్టమని, అతడి చుట్టూ అంతా గుంపుగా నిలబడుదామని ధృష్టద్యుమ్నుడికి చెప్పాడు. దానికి తగిన వ్యూహాన్ని ఏర్పాటు చేయమనగా కౌరవుల
వ్యూహానికి ప్రతిగా ఒక అసాధ్యమైన
వ్యూహాన్ని ఏర్పరచాడు ధృష్టద్యుమ్నుడు. దానిలో కుడివైపున సాత్యకి, విరాటుడు, ఎడమవైపున
అభిమన్యుడు, ద్రుపదుడు, కేకయులు, నకులుడు, సహదేవుడు, ఉపపాండవులు, వారి వెనుక ధర్మరాజు, ధర్మరాజుకు వెనుకగా చేకితానుడు, కుంతిభోజుడు, ముందు భాగంలో శిఖండి, అతడికి ఒక పక్కన భీముడు, ఘటోత్కచుడు, మరొక పక్కన అర్జునుడు, ధృష్టద్యుమ్నుడు, మిగిలిన యోధులు వేరేవేరే చోట్లలో వుండే విధంగా వ్యూహరచన జరిగింది.
అభిమన్యుడు వీర విహారం
చేస్తూ కౌరవ సైన్యాన్ని తరమడం చూసిన దుర్యోధనుడు అలంబసుడిని పురికొల్పాడు. అతడప్పుడు పాండవ
సేనను తరుముతుంటే ద్రౌపది కొడుకులు ఎదుర్కున్నారు. అయితే ఎప్పుడైతే అలంబసుడిది పైచేయి
అవుతున్నదని అభిమన్యుడు గమనించాడో, అప్పుడే అభిమన్యుడు ఆ రాక్షసుడి మీదికి దూకాడు. వారిద్దరూ
యుద్ధానికి తలపడ్డారు. అలంబసుడి రాక్షసమాయకు యుద్ధభూమిలో
చీకట్లు కమ్ముకోగా, అభిమన్యుడు సూర్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ
చీకటిని పటాపంచలు చేశాడు. అలంబసుడి రాక్షస మాయలన్నీ వీగిపోవడంతో వాడు రథం దిగి
పారిపోయాడు. కౌరవ సైన్యం కూడా పరుగెత్తి వెళ్లింది.
అభిమన్యుడు భీష్ముడి ధాటికి
ఏమాత్రం చలించకుండా చాకచక్యంగా యుద్ధం చేస్తుంటే, అర్జునుడు అటువైపుగా భీష్ముడిని ఎదిరించడానికి వచ్చాడు. అదే
సమయంలో సాత్యకి ప్రయోగించిన ఒక బాణానికి అశ్వత్థామ
మూర్ఛపోయాడు. కాసేపైన తరువాత తేరుకుని సాత్యకిని నొప్పించసాగాడు. వెంటనే తన బాణాలతో అశ్వత్థామను
కప్పివేయడంతో, అతడి తండ్రి ద్రోణాచార్యుడు కొడుకు ప్రాణాలను
కాపాడడానికి సాత్యకి మీదికి దూకాడు.
అప్పుడు అర్జునుడు మధ్యలో చొరబడ్డాడు. ద్రోణుడు, అర్జునుడు యుద్ధానికి పూనుకున్నారు. ఒకరిమీద ఇంకొకరు
బాణవర్షం కురిపించారు. ద్రోణుడికి సాయంగా దుర్యోధనాది
రథికులు ఆర్జునుడిని తాకారు. అంతా అర్జునుడితో యుద్ధంలో తలమునకలై పోయారు.


No comments:
Post a Comment