Thursday, July 8, 2010

అధిష్టానం మాటలకు అర్థాలే వేరయా: వనం జ్వాలా నరసింహారావు


భారత పునరుజ్జీవన రాజకీయ పర్యవసానమే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం. ఆవిర్భావ కాలం నాటి కాంగ్రెస్, తొలినాళ్లలో కొన్ని దశాబ్దాల పాటు, సమాజంలోని ఉన్నత-మధ్య తరగతి వర్గాల వారినే ఆకర్షించినప్పటికీ, 1905 నాటి స్వదేశీ ఉద్యమం ఫలితంగా, మధ్యతరగతి దిగువనున్న వర్గాల వారినీ కలుపుకుని పోయినప్పటికీ, ఈ నాటికీ, కుల-మతాల విషయం పక్కన పెడితే, ధనవంతుల-బలవంతుల పార్టీగానే మనుగడ సాగిస్తున్నదనవచ్చు. వారసత్వ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగం అనడం అతిశయోక్తి కాదు. కాకపోతే, అధిష్టానం దృష్టిలో, వారసత్వ రాజకీయాలకు ఎవరు అర్హులో-ఎవరు కాదో అనే విషయంలో, సమయానుకూలంగా మారుతూ వుంటుంది. రాజేష్ పైలట్, మాధవరావు సింధియాల పిల్లలకు ఒక నీతి, రాజశేఖర రెడ్డి తనయుడికొక నీతిని ఎంచుకుంది అధిష్టానం. అధిష్టానం బహిరంగంగా చెప్పినా-చెప్పక పోయినా, అడ్డంగా-నిలువుగా తల వూపి, నిమిషానికొక మాట మార్చడం కాంగ్రెస్ నాయకులకు పరిపాటై పోయింది.

జాతీయోద్యమానికి ఎప్పుడైతే మహాత్మాగాంధి నాయకత్వం లభించిందో, అప్పటినుంచి, అశేష జన వాహిని, తారతమ్యాలు మరిచి, కాంగ్రెస్ వెంట నడిచారు. ఏ గాంధి "సత్యాగ్రహం"-"నిరాహార దీక్ష" సిద్ధాంతాలకు అల నాడు కాంగ్రెస్ పట్ల ఆకర్షితులయ్యారో, ఆ సిద్ధాంతమే, నేడు వ్యక్తిగత అవసరాలను నెరవేర్చుకునేందుకు, అదే కాంగ్రెస్ వారసులకు ఆయుధంగా ఉపయోగపడుతున్నదనాలి. మహాత్మా గాంధి రాజకీయ వారసుడు జవహర్లాల్ నెహ్రూ, బ్రిటీష్ వలస విధానాన్ని-సామ్రాజ్య వాదాన్ని తుదముట్టించేందుకు, భారత ప్రజాశక్తిని, కాంగ్రెస్ అనే కవచం కింద కు చేర్చారు. బ్రిటీష్ పాలన అంతరించి, నవ భారత శకం ఆరంభమయిన పిదప, కాంగ్రెస్ రూపురేఖలే మారిపో సాగాయి. నెహ్రూ నాయకత్వంలోనే, భిన్న స్వరాల కాంగ్రెస్ పెద్దలు, మహాను భావుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వతంత్ర ఫలితాలను, తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. కాకపోతే, పార్టీలో సంభవిస్తున్న పరిణామాలను గమనించిన నెహ్రూ సహితం, అన్ని దృక్ఫదాల వారిని కలుపుకుని పోవాలన్న ఆరాటంతో, మౌనంగా, అన్నింటినీ సహించాల్సి వచ్చింది. స్వార్థపర శక్తులు తమ అవసరాలకు ఆ రోజుల్లోనే పార్టీని ఉపయోగించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, విలువలకు కట్టుబడ్డ ఎందరో మహాను భావులు మాత్రం సిద్ధాంత పరంగా ఒకరినొకరు విభేదించారే తప్ప, ఇప్పటి లాగా నిమిషానికొక మాట మార్చలేదు.

స్వాతంత్రోద్యమం నాటి భారత జాతీయ కాంగ్రెస్ కు ఇప్పటి భారత జాతీయ కాంగ్రెస్ (ఐ) కు పోలికే లేదనాలి. అలనాటి కాంగ్రెస్ లో అభిప్రాయ భేదాలకు, మైనారిటీ వ్యక్తుల సూచనలకు గౌరవం లభించేది. ఇక ఇప్పుడో, అధిక సంఖ్యాకుల మద్దతున్న వారికి, ప్రజా బలం వున్న వారికి, అధిక సంఖ్యాకుల ప్రజా ప్రతినిధుల ఆదరణ వున్న వారికి, ఏదో ఒక నెపంతో, పార్టీ దూరం చేసుకుంటున్నది. ఒక నాడు పార్టీ అనుసరించిన మద్యే మార్గం, అతివాద-మితవాద శక్తులను కలుపుకుని పార్టీని పటిష్టం చేయడమైతే, ఈ నాటి మద్యే మార్గం, భిన్నాభిప్రాయాలను వెల్లడించమని పరోక్షంగా అధిష్టానం ప్రోత్సహించడమే. అధిష్టానంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు, అధినేత్రి దగ్గర పలుకుబడిని సంపాదించుకునేందుకు, ప్రత్యక్షంగానో-పరోక్షంగా నో ప్రతి రాష్ట్రంలోని, సమ్మతి-అసమ్మతి వాదులను పురికొల్పడం ఈ నాటి మద్యే మార్గం. కింది స్థాయినుంచి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనని వారిని, స్థానికంగా ప్రజల మద్దతు లేని వారిని, పోటీ చేసి గెలవలేని వారిని, అధిష్టానం దగ్గర చెవులు కొరుకుతూ తిరిగే వారిని చేర దీయడం పార్టీకి అలవాటుగా మారింది. కాంగ్రేసేతర పార్టీలలో ప్రముఖ పాత్ర పోషించి, అన్నీ అనుభవించి, అక్కడ తమ అవసరాలన్నీ తీర్చుకుని, అక్కడ వున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇష్టమొచ్చినట్లు తూలనాడిన వారంతా పార్టీలో ప్రముఖులవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అంటూ గొంతు చించుకుంటున్న వారంతా, ఎప్పుడో ఒకప్పుడు పార్టీని దుయ్యబట్టిన వారో, ఇతర పార్టీలనుంచి వలస వచ్చిన వారో కావడం విశేషం.

స్వర్గీయ పర్వత నేని ఉపేంద్ర తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ కీలకమైన వ్యక్తిగా వుండి, పార్టీ పక్షాన, కేంద్ర మంత్రివర్గంలో ప్రముఖ పాత్ర వహించారు. ఆయన పార్లమెంటులో తనకు వ్యతిరేకంగా మాట్లాడాడన్న నెపంతో, "నీ అంతు చూస్తాను"అని ఒకసారి హైదరాబాద్ పర్యటన కొచ్చిన సోనియా ఉపేంద్రను ఉద్దేశించి అన్నట్లు అప్పట్లో (డిసెంబర్ 22, 1987) పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. స్వయంగా తనను అలా అన్నదని ఉపేంద్ర గారే విలేకరులకు తెలియ చేశారప్పుడు. కానీ, తర్వాత ఏమైంది? అదే ఉపేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధాన భూమిక వహించి, చివరకు కాంగ్రెస్ రాజకీయాల్లోకి తన వారసుడిగా స్వయాన అల్లుడిని తీసుకొచ్చారు. తెలుగుదేశంలో వున్నన్నాళ్లు కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించారాయన. అసలాయన కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కారణం సోనియాగాంధి కాదా ?ఆయన లాగా కాంగ్రెస్ పార్టీని జగన్ విమర్శించలేదే !

ఈ నాడు కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన పదవిలో వున్న జైపాల్ రెడ్డి సోనియా గాంధి భర్త రాజీవ్ గాంధిని అనని మాట లేదు. ఎన్ని రకాల దూషించడానికి వీలుందో అన్ని రకాలుగా, బోఫోర్స్-ఫెయిర్‌ ఫాక్స్ విషయాల్లో, రాజీవ్ గాంధిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషించారు జైపాల్ రెడ్డి గారు. జనతా పార్టీనుంచి గెలిచి కేంద్రంలో మంత్రి పదవిని అనుభవించారు. మరిప్పుడాయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తి. అదృష్టం కలిసి వస్తే ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ కూడా వుండొచ్చు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో, కాంగ్రెస్ పార్టీలో మొదటి సారి చీలిక వచ్చినప్పుడు, వ్యవస్థాగత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, నంద్యాల లోక సభ స్థానానికి నామినేషన్ కూడా వేసి, రాత్రికి రాత్రే పార్టీ ఫిరాయించి, ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ (ఆర్) పక్షాన గెలిచిన స్వర్గీయ పెండేకంటి వెంకట సుబ్బయ్య సంగతేంటి ? అంతెందుకు సాక్షాత్తు ఇందిరా గాంధి మీద ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వీరేంద్ర పాటిల్ కాంగ్రెస్ (ఐ) లో చేరి తన స్థానాన్ని బల పర్చుకోలేదా ? తెలంగాణ ప్రజా సమితి పేరుతో కాంగ్రెస్ ను ధిక్కరించి, ఎన్నికల్లో పోటీ చేసి, పది మందికి పైగా అభ్యర్థులను పార్లమెంటుకు గెలిపించుకున్న స్వర్గీయ మర్రి చెన్నా రెడ్డిని అధిష్టానం ఏం చేయ గలిగింది. ఒక్క సారి కాదు ... కనీసం మూడు సార్లు ఆయన అధిష్టానాన్ని ధిక్కరించారు. ఇంతెందుకు.. ఎన్నికలు జరిగిన ప్రతి సారి, టికెట్ దొరకని పలువురు నేతలు, ఇండిపెండెంటుగా పోటీ చేయడం, ఆరేళ్లు బహిష్కరించ బడడం, స్వగృహ ప్రవేశం చేయడం, లోగడ కంటే, మంచి పదవులు పొందడం తెలిసిన విషయమే.

జగ్జీవన్ రాం, ఎన్డీ తివారి, అర్జున్ సింగ్ లను కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయగలిగింది ? శరద్ పవార్ గురించి ఏమనాలి ? సోనియా గాంధి విదేశీయ తను తెర పైకి తెచ్చిన మొదటి వ్యక్తి ఆయన కాదా ? ఇవ్వాళ ఆయన లేకపోతే భారత జాతీయ కాంగ్రెస్ మనుగడే లేదు. మమత బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ను కాదనే ధైర్యం సోనియా గాంధీకి వుందా? తమిళ నాడులో పీవీ నరసింహా రావు పొత్తుల నిర్ణయానికి వ్యతిరేకంగా "తమిళ మానిల కాంగ్రెస్" ను స్థాపించి, పార్లమెంటుకు ఎన్నికై, కాంగ్రేసేతర ప్రభుత్వంలో ప్రధాన కేంద్ర మంత్రిత్వ శాఖను నిర్వహించిన చిదంబరం కాంగ్రెస్ క్రమ శిక్షణకు లోబడినట్లా ? కాదా? వీరందరి ధిక్కారం కంటే జగన్ ధిక్కారం గొప్పదా?

జగన్ పట్ల కాంగ్రెస్ అధిష్టానం వైఖరి ఎందుకిలా వుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం దరిమిలా రాష్ట్రంలోనూ-రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోనూ ఊహించని పరిణామాల నేపధ్యంలో, రోశయ్యకు ముఖ్య మంత్రి పీఠం దక్కింది. జగన్ కు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ (దాదాపు) మద్దతు లభించినా అధిష్టానం మద్దతు కరువయింది. ఒక సమయంలో రోశయ్య మంత్రివర్గంలోని పలువురు బహిరంగంగానే జగన్ పక్షాన నిలిచారు. ఎవరు అవునన్నా-కాదన్నా, అభిమానుల అండ దండలు, గతంలో ఏ కాంగ్రెస్ నాయకుడికి లభించనంత మోతాదులో జగన్ కు లభించాయి. ముఖ్య మంత్రి రోశయ్య గారు తన పీఠాన్ని పదిల పర్చుకునే దిశగా అడుగులు వేస్తున్న సంకేతాలు జగన్ పసిగట్టడంతో, ప్రజలకు చేరువయ్యే దిశగా అతను పావులు కదిలించ సాగాడు. పరోక్షంగా పార్టీ (రాష్ట్రంలో) శ్రేణుల మద్దతు, ప్రత్యక్షంగా ప్రజల-పార్టీ కార్యకర్తల అండదండలు విరివిగా లభించడంతో అధిష్ఠానానికి ఫిర్యాదులు మోయడం మొదలయింది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయ లేని వారు, ఏళ్ల తరబడి పార్టీలో వున్నా పైకెదగ లేక పోయిన వారు, ఈర్ష్యాసూయలకు అలవాటు పడ్డ వారు, రాజ శేఖర రెడ్డిగారి హయాంలో నోరు మెదపడానికి కూడా భయ పడేవారు, అధిష్టానం కనుసన్నల్లో మెలిగే వారు, రోశయ్య గారి దృష్టిలో పడాలనుకునే వారు, ఇలా... ఒక్కో విధంగా.. ఎదురుపడి నిలిచి జగన్ ను ఎదిరించే శక్తిలేని వారందరు, తమ బాణాలను ఆయన పైకి ఎక్కుపెట్టారు. మహ బూబాబాద్ పర్యటనకు పోతున్న జగన్ ను అధిష్టానం ప్రతినిధులు సందిగ్ధంలో పడవేశారే గాని, ఇదమిద్ధంగా పోవద్దని-పొమ్మని చెప్పలేదు. తెలంగాణ వాదం బలంగా వున్న నేపధ్యంలో, ఆయన మహబూబాబాద్ పర్యటన అధిష్టానానికి సాకుగా దొరికింది. అంతవరకు బాగుంది... ఎందుకాయన కోస్తాంధ్ర పర్యటనను అడ్డుకోవాల్సి వచ్చిందో అర్థం కాని విషయం.

చివరకు అధిష్టానం తలవంచక తప్పలేదు. రోశయ్యతోనే అధిష్టానం ఆంతరంగాన్ని బహిష్కరించారు. హైదరాబాద్ లో ఆయన ఉదయం చేసిన ప్రకటనకు విరుద్ధంగా, ఢిల్లీలో ఆయన నోట వేరే మాట పలికించింది అధిష్టానం. బహుశా ముఖ్య మంత్రి రోశయ్య కూడా అధిష్టానాన్ని అర్థం చేసుకోలేక పోతున్నాడేమో ! బహుశా జగన్ కుటుంబ సభ్యులు సోనియాను కలిసినప్పుడే, ఇరువురి మధ్య ఒక అవగాహన కుదిరుండ వచ్చేమో ! జగన్ మీడియాకు రాసిన లేఖ ఆంతర్యం బహుశా, తనకు అయిష్టంగానన్నా సోనియా మద్దతుందని చెప్పడమేనేమో ? జగన్ ధిక్కార ధోరణిని అవలంభించాడని భావించినా, అధిష్టానం చేయగలిగిందేమీ లేదు. కాంగ్రేసేతర పార్టీలలో ప్రముఖ పాత్ర వహించి ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్న వారిని ఏమీ చేయలేని సోనియా, పార్టీని ధిక్కరించి బయటకు పోయి వేరు కుంపటి పెట్టుకున్న వారిపై ఆధార పడ్ద సోనియా, ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ లాంటి చురుకైన యువ నాయకుడిని వదులుకునే సాహసం చేస్తుందా? ఒక వేళ దుస్సాహసం చేస్తే, ఇటు రాష్ట్రంలోను-అటు కేంద్రంలోను పార్టీ సంక్షోభంలో పడదా? అవకాశం కొరకు ఎదురు చూస్తున్న పవార్లు, మమతలు తమ మద్దతును జగన్ కు ఇవ్వకుండా వుంటారా? ఏదేమైనా, రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు ఒకరిపై మరొకరు నిప్పులు కురిపించుకుంటూ మాట్లాడడం పార్టీకి శ్రేయస్కరం కానే కాదు.

Wednesday, July 7, 2010

108 అత్యవసర సహాయ సేవలతో రాజశేఖర రెడ్డి అనుబంధం: వనం జ్వాలా నరసింహారావు

(జులై 8, 2010 న డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి
అరవై ఒకటో పుట్టినరోజు సందర్భంగా)

ఇ.ఎం.ఆర్.ఐ-108, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య
మాజీ సలహాదారుడు

భారత దేశ చరిత్రలో, గత అరవై సంవత్సరాలలో తీసుకున్న విధాన నిర్ణయాలన్నింటిలో, అత్యంత కీలకమైంది "లాభాపేక్ష రహిత ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం". ఆ ప్రక్రియను ఆరోగ్య వైద్య రంగంలో "రాజీవ్ ఆరోగ్య శ్రీ" పథకంగా ప్రవేశపెట్టి, యావత్ భారతదేశానికి మార్గదర్శకంగా మలిచిన ఘనత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ది. ఆ గొడుగు కింద అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న 108 అత్యవసర సహాయ సేవలు రాజశేఖరరెడ్డికి మరీ ప్రీతిపాత్రమైనది. ఆ సేవల ఆవిర్భావం జరిగిన ఆంధ్ర ప్రదేశ్ లో, రాజశేఖరరెడ్డి మరణించిన అచిర కాలంలోనే అవే సేవలు ఒడిదుడుకుల్లో పడుతున్నాయన్న వార్తలు అత్యవసర సహాయ సేవల లబ్దిదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అధ్యయనంలో "కరుణామయి-కారుణ్య దేవతగా" వర్ణించబడిన" 108 అంబులెన్స్-అత్యవసర సహాయ సేవల” తో రాజశేఖర రెడ్డి కి ఉన్న అనుబంధం ఎన్ని విధాలుగానో గుర్తు చేసుకోవచ్చు.

ఇ.ఎం.ఆర్.ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు రామలింగ రాజు, సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో జైలుకెళ్లాల్సి వచ్చింది. తక్షణమే 24 గంటల వ్యవధిలో, జనవరి 8, 2009 న, వైద్య-ఆరోగ్య శాఖ అధికారుల- ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య సమక్షంలో, రాజశేఖరరెడ్డి, ఇ.ఎమ్.ఆర్.ఐ అధికారులను పిలిపించి 108 అత్యవసర సహాయ సేవలందించే విషయంలో నిశితంగా సమీక్షించారు. మిన్ను విరిగి మీద పడ్డా-ఎటువంటి పరిస్థితులెదురైనా ఆ సేవలు ఆగిపోకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలను అటు ప్రభుత్వాధికారులకు-ఇటు మాకూ ఇచ్చారాయన. అవసరమైతే, ప్రభుత్వం అప్పటివరకూ భరిస్తున్న 95% నిర్వహణ వ్యయాన్ని నూటికి నూరు శాతానికి పెంచడానికి సిద్ధమేనన్నారు. యాజమాన్య వాటాగా (ప్రయివేట్ భాగస్వామ్యంగా) అప్పటివరకూ ఇ.ఎం.ఆర్.ఐ భరిస్తున్న ఖర్చులను కూడా, తప్పదను కుంటే ప్రభుత్వమే సమకూరుస్తుందని హామీ కూడా ఇచ్చారాయన. అయితే అప్పట్లో ఆర్థిక మంత్రిగా వున్న రోశయ్య, పూర్తిగా ప్రభుత్వమే భరించడమంటే, అది ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు విరుద్ధమవుతుందని, విమర్శలకు దారితీస్తుందని సూచించారు.

ఎన్నికల రణరంగంలో తలమునకై వున్నా, ఎప్పటికప్పుడు, 108 అత్యవసర సహాయ సేవలందించే సంగతి మరిచిపోలేదాయన. 108 సేవలు తమ పార్టీ గెలుపుకు కారణమయ్యాయని, 108-104 సేవలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశానని కూడా చెప్పారప్పుడు. బహుశా ప్రపంచ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా, అత్యవసర సహాయ సేవలకు ప్రత్యేకంగా ఒక మంత్రివర్గ శాఖను ఏర్పాటు చేయడం మన రాష్ర్ట్రంలోనే జరిగిందనాలి.

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మొదటి సారి 2004లో అధికారంలోకి రావడంతోనే అత్యవసర సహాయసేవల అమలు కార్యరూపం దాల్చడం మొదలైంది. ఆరోగ్య-వైద్య-అగ్నిమాపకదళ సంబంధిత అత్యవసర సహాయ సేవలను అందించేందుకు నెలకొల్పిన ఇ.ఎం.ఆర్.ఐ, ఏప్రియల్ 2, 2005 న, (దివంగత) ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సమక్షంలో, ప్రభుత్వంతో మొట్టమొదటి "అవగాహనా ఒప్పందం" కుదుర్చుకుంది. ఆగస్ట్ 15, 2005 న హైదరాబాద్ లో అంబులెన్సుల ప్రారంభోత్సవానికి (దివంగత) ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి, అప్పటి ఆరోగ్య-ఆర్థిక శాఖల మంత్రి (ఆ తర్వాత ముఖ్యమంత్రి) రోశయ్య వచ్చారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా ఆరంభమైన సేవలను, వరుసగా, తిరుపతి-విశాఖపట్నం-విజయవాడ-వరంగల్ పట్టణాలలో కూడా ప్రారంభించింది ఇ.ఎం.ఆర్.ఐ. ఆ క్రమంలో. అత్యవసర సహాయ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడానికి జనవరి 26, 2007 న రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం జరిగింది. ఆ నాటి సభలో, ఆయనతో పాటు, ఇప్పటి ముఖ్యమంత్రి రోశయ్య, ప్రస్తుతం హోం శాఖను నిర్వహిస్తున్న సబిత ఇంద్రారెడ్డి కూడా హాజరయ్యారు.

ఆగస్ట్ 14, 2007 న, (దివంగత) ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో నిర్వహణ వ్యయం విషయం చర్చకొచ్చింది. 108-అత్యవసర సహాయ సేవలందించడానికి ఇ.ఎం.ఆర్.ఐ కి, "ప్రత్యక్ష నిర్వహణ వ్యయం" కింద 95% వరకు ప్రభుత్వం భరించడానికి అంగీకరించిందని, యాజమాన్య పరమైన వ్యయాన్ని సంస్థ భరించాల్సి వుంటుందని అంటూనే, 2007-2008 ఆర్థిక సంవత్సరంలో మాత్రం, ప్రధాన కార్యదర్శి తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఆ వ్యయం కింద రు. 68, 700 ప్రభుత్వం భరిస్తుందని, 2008-2009 ఆర్థిక సంవత్సరం నుండి 95% నిర్ణయం అమల్లోకి వస్తుందని, అప్పటికి 502 అంబులెన్సులు రాష్ట్ర వ్యాప్తంగా సేవలందిస్తాయని అన్నారు ముఖ్యమంత్రి. అత్యవసర సహాయ సేవలను "రాజీవ్ ఆరోగ్య శ్రీ" పథకం గొడుకు కిందకు తేవాలన్న నిర్ణయం కూడా ఆ రోజునే తీసుకున్నారు రాజశేఖర రెడ్డి.

డిసెంబర్ 18, 2007 న (దివంగత) ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మరో సమీక్షా సమావేశంలో ఇ.ఎం.ఆర్.ఐ ఆధ్వర్యంలో అమలవుతున్న అత్యవసర సహాయ సేవల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం సూత్రప్రాయంగా మరో నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి కట్టుబడ్డ ప్రభుత్వం, సంబంధిత అధికారులు, అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి సంభాని చంద్రశేఖర్, దరిమిలా తొలుత 150 అంబులెన్సులు, మలి విడతగా మరో 150 అంబులెన్సులు, మొత్తం 802 అంబులెన్సులు సమకూర్చారు. అయితే వీటిలో కనీసం 100 వరకు తిరగక పోవడం వివిధ కారణాల వల్ల సేవలందించలేని స్థితిలో వుండడంతో అలా ఎందుకు "ఒడిదుడుకులకు లోను కావాల్సి వచ్చిందో" అర్థం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది ప్రభుత్వం ప్రస్తుతం.

అసలేం జరుగుతున్నది?ప్రభుత్వ హామీలు-జీ.వీ.కె హామీలు కాగితాలకే పరిమితమా? లేక యాజమాన్య నిర్వహణలో లోపాలున్నాయా? అధికారులు రాజశేఖర రెడ్డి లేని లోటును పరోక్షంగా ప్రదర్శిస్తున్నారా? ఒకవైపేమో "నిబద్ధత“ను కలిగున్న జీ.వీ.కె-మరో వైపే మో రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేరుస్తానంటున్న ముఖ్యమంత్రి రోశయ్య, 108 శాఖను నిర్వహిస్తున్న మంత్రి సాక్షాత్తు రాజశేఖర రెడ్డి అనుయాయుడు. అన్నింటికన్నా మించి పాతికేళ్ళ పైబడి యాజమాన్య నిర్వహణ అనుభవం, కష్ట కాలంలో బాధ్యతలు నైపుణ్యంతో నెరవేర్చిన సీ.ఇ.ఓ వెంకట్. ఈ సేవల కొన సాగింపు ప్రభుత్వ (లాభాపేక్ష లేని) ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకే ఒక పెను సవాలు. వ్యక్తిగత పట్టింపులకు-పంతాలకు అతీతంగా నిర్వహించాల్సిన-అమలు చేయాల్సిన ఈ సేవలు కేవలం ఏ ఒక్కరి సొత్తో-సొమ్మో కావు-కాకూడదు.

108 అంబులెన్సుల ద్వారా అత్యవసర సహాయ సేవలందిస్తున్న ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఇ.ఎం.ఆర్.ఐ) పని తీరుపై ఏప్రియల్ 2010 చివరి వారంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. 108-అత్యవసర వైద్య సహాయ సేవలను పౌరులకు అందించే విషయంలో ప్రభుత్వ ఆలోచనా సరళిలో కొంత మార్పు వస్తున్నట్లు భావించాల్సి వస్తుంది. కమిటీని నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులో... "ప్రస్తుతం లభిస్తున్న అత్యవసర రవాణా సేవలకు ప్రత్యామ్నాయాలే మన్నా వున్నాయేమో పరిశీలించడంతో సహా అన్ని అంశాలను సమీక్షించి, సరైన సూచనలను-సలహాలను ఇవ్వాల్సింది" గా పేర్కొనడం భవిష్యత్ పరిణామాలకు సంకేతంగా భావించాల్సి వస్తుంది.

ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు ఇంతకంటే "పెను సవాలు" మరోటి లేదు. ఈ ఆలోచనా ధోరణిలో మార్పురానంత కాలం అత్యవసర సహాయ సేవల అమలు గతంలో మాదిరి జరిగే అవకాశం లేదు. ఇరువురు భాగస్వాముల మధ్య "విశ్వాసం"-"నమ్మకం" కలగడం ముఖ్యం గాని కమిటీ సిఫార్సులు ముఖ్యంకానేకావు. అలాంటి (లోగడ వున్న మాదిరిగానే) విశ్వాసం-నమ్మకం ఇరువురు భాగస్వాముల మధ్య పునరుద్ధరించడానికి అవసరమైన తక్షణ చర్యలకు ప్రభుత్వం నియమించిన కమిటీ శ్రీకారం చుట్టడం ప్రధానం. అది జరక్కుండా, కాలయాపనకు దారితీసే "ప్రత్యామ్నాయాలను" ప్రతిపాదించడమే జరిగితే భవిష్యత్ లో 108-అత్యవసర సహాయ సేవలు కొనసాగినప్పటికీ, నాణ్యతా లోపం-పౌరులకు గతంలో మాదిరి సేవలు లభ్యం కాకపోవడం తప్పదేమో !

రెండో విడత అధికారం చేపట్టి, మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరిపించిన మర్నాడు-మే నెల 26, 2009 న, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇజ్రాయిల్ పర్యటనకు బయల్దేరడానికి ముందర, అత్యవసర సహాయ సేవల సంగతి తెలుసుకునేందుకు మమ్మల్ని రమ్మన్నారు. సంస్థా పరంగా-యాజమాన్య నిర్వహణ పరంగా ఇ.ఎమ్.ఆర్.ఐ ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులను అర్థం చేసుకున్న రాజశేఖర రెడ్డి, జీ.వీ.కె సంస్థల అధ్యక్షుడికి ఫోన్ చేసి, ప్రయివేట్ పరంగా లోగడ సత్యం కంప్యూటర్స్ చైర్మన్ ఇచ్చిన విధంగానే ఇ.ఎం.ఆర్.ఐ కి నిధులను సమకూర్చమని చెప్పారు. ఆయన ఒప్పుకోవడం. ఇ.ఎం.ఆర్.ఐ దరిమిలా జీ.వీ.కె ఇ.ఎం.ఆర్.ఐ గా మార్పు చెందడం జరిగింది. రాజశేఖర రెడ్డి సూచనమేరకు-బోర్డ్ సభ్యుల కోరిక మేరకు, ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ గా జీ.వీ.కె ఆ రోజునే పదవీ బాధ్యతలు స్వీకరించారు.

సమావేశం పూర్వ-ఉత్తర రంగాల్లో అత్యవసర సహాయ సేవల విషయంలో విలువైన సూచనలు చేశారు. అందులో ఎన్ని అమలుకు నోచుకున్నయో-ఎన్ని నోచుకోలేదో అన్న విషయం తేల్చాల్సింది ప్రభుత్వం (ఏప్రియల్ 2010 లో) నియమించిన కమిటీనే. కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో ఆ ప్రస్తావన లేకపోవడానికి కారణాలేంటి ?

రాజీవ్ ఆరోగ్య శ్రీ గొడుగు కింద పనిచేస్తున్న 108, 104, ఆరోగ్య శ్రీ పథకాలకు సంబంధించి నిరంతర ప్రభుత్వ మానిటరింగ్ జరగాలని, ఇవన్నీ ఒకే శాఖాధిపతి కింద వుండే వీలు గురించి పరిశీలన జరగాలని ఆ రోజున ముఖ్యమంత్రి సూచించారు. ఇ.ఎం.ఆర్.ఐ, హెచ్.ఎం.ఆర్.ఐ, ఆరోగ్య శ్రీ లకు కలిపి ఒక ప్రత్యేకమైన "ట్రస్ట్" ఎందుకు ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించారు. అలా చేస్తే సేవలందించడంలో నైపుణ్యం, సామర్థ్యం, వృత్తి పరమైన దక్షత పెరిగే అవకాశం వుందన్నారు. అయితే, నియంత్రణల విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్య-వైద్య శాఖలకు చెందిన ఒక ప్రభుత్వాధికారిని ఇ.ఎం.ఆర్.ఐ గవర్నింగ్ బోర్డు సభ్యుడిగా చేయాలని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయం వెలిబుచ్చారు. ఆర్థిక పరమైన యాజమాన్య వ్యవహారాలను, వ్యయ నియంత్రణలను, నిర్వహణ సమస్యలను, ప్రభుత్వంతో సమన్వయం-సంఘటితం విషయాలను, సంస్థాగత నిర్మాణాన్ని, అధికారాలను, విధులను, బాధ్యతలను, పారదర్శకతను, జవాబుదారీ తనాన్ని, సంబంధిత ఇతర విషయాలను పర్యవేక్షించేందుకు ఎలాంటి కమిటీ వుంటే బాగుంటుందో పరిశీలించమని అధికారులను-ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యాన్ని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా నిధులను సమకూర్చడంలో ఒక్కో ఏడాది గడిచినా కొద్దీ భారం పెరుగుతుంది కాబట్టి, నిధుల సేకరణ విషయంలోను, కమ్యూనికేషన్ విషయంలోను, చేసిన తప్పులు సరి దిద్దుకునే విషయంలోను జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి.

ప్రభుత్వంతో ఇ.ఎం.ఆర్.ఐ కుదుర్చుకున్న ఎంఓయు గడువు మే నెల 5, 2008 తో ముగిసినందున, దాని అమలును, తగు సవరణలతో అవసరమైనంత కాలవ్యవధి వరకు పొడిగించాలని, కొత్త ఎంఓయు పై సంతకాలు కావాలని ఆయన చేసిన సూచన ఇంతవరకు అమలు జరగలేదు. లక్షలాది ప్రాణాలను కాపాడవలసిన సంస్థ నిర్వహణ వ్యయం కొరకు విడుదల చేయాల్సిన నిధులను తెచ్చుకోవడంలోనే సంస్థ అధికారులు నెలంతా కాలం వెళ్లబుచ్చాల్సిన పరిస్థితులున్నాయిప్పుడు. నిర్వహణ వ్యయం భరించే విషయంలో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యం సిద్ధాంత ప్రక్రియకు అనుగుణంగా, ప్రభుత్వం-ఇ.ఎం.ఆర్.ఐ తమ-తమ వంతు వాటాగా 95%-5% నిష్పత్తి విధానాన్ని పాటించాలని, యాజమాన్య పరమైన వ్యయం కింద ఇ.ఎం.ఆర్.ఐ పెడుతున్న ఖర్చును సంస్థ సమకూర్చాల్సిన 5% వాటాగా పరిగణించాలని, రాజశేఖర రెడ్డి సూచించారు. ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్య నిర్వహణ బాధ్యతలు స్వీకరించబోయే భావి సంస్థల-వ్యక్తుల నుంచి, లోగడ ఇ.ఎం.ఆర్.ఐ కున్న రుణాల మొత్తాన్ని తీర్చేందుకు తగు ఆర్థిక సహాయాన్ని పొందే ఏర్పాటు చేసుకోవాలని ఆయన స్పష్టంగా సూచించారు. అత్యవసర సహాయ సేవల నిర్వహణకు నియమించబడిన ఆపరేషన్స్ సిబ్బంది జీతభత్యాలు, ప్రతి నెల మొదటి తేదీన చెల్లించే విధంగా, ప్రభుత్వం అంగీకరించిన నిధులను విడుదల చేస్తుందని మినిట్స్ లో నమోదుచేశారు. వాస్తవానికి ఇరువురి మధ్య గతంలో కుదుర్చుకుని, ఇంతవరకు అమల్లో వున్న ఎంఓయు ప్రకారం మూడు నెలల నిర్వహణ వ్యయాన్ని ముందుగానే అడ్వాన్సుగా చెల్లించాలి. ఇవెంతవరకు పాటిస్తున్నారనేది ప్రశ్నార్థకమే !

ఇ.ఎం.ఆర్.ఐ. పాటించాల్సినవి మినిట్స్ లో పొందుపరిచారు. పారదర్శకతను మరింత స్పష్టంగా పాటించడానికి "వెబ్ సైట్" ను రూపొందించి, అందులో ప్రతి ట్రిప్పుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు చూపాలని సూచించారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ 108-అత్యవసర సహాయ సేవలకు సమకూరుస్తున్న నిధులను తగ్గించే ప్రయత్నం చేయకుండా-లోగడ మాదిరిగానే బడ్జెట్ కేటాయింపులు జరగాలని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యమంత్రి సంతకంతో ప్రధాన మంత్రికి లేఖ పంపమని రాజశేఖర రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారానాడు. మినిట్స్ లో పొందుపరిచిన అంశాలు, పొందు పరచకపోయినా ముఖ్యమంత్రి చేసిన సూచనలు, ఎంత మేరకు అమలుకు నోచుకున్నాయన్న విషయాన్ని ధృవీకరించాల్సింది అటు ప్రభుత్వం-ఇటు ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం.

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైన అత్యవసర సహాయ సేవలు, అలసత్వం వల్లనో, నిధుల కొరత వుందనో, కేంద్రం నుంచి నిధులు సకాలంలో అందడం లేదనో, సంస్కరణలు అమలు పరచడంలో భాగంగా సేవలను కుదించాలనీ-కొత్త భాష్యం చెప్పాలనీ.... మరింకేదో తలపెట్టే ప్రయత్నం చేయడమో జరుగుతే, ఆ ప్రయత్నం రాజశేఖర రెడ్డి ఆశయాలకు విరుద్ధంగా చేసినట్లే అవుతుంది. ఆయన తలపెట్టిన అత్యవసర సహాయ సేవలను అరమరికలు లేకుండా కొనసాగించడమే, మనం ఆయన పుట్టిన రోజున ఇచ్చే కానుక !

Tuesday, July 6, 2010

XI-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-11) : వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-11
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం
ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు

అధునాతన సౌకర్యాలున్న రెండంతస్తుల ఇ.ఎం.ఆర్.ఐ ప్రధాన కార్యాలయం-ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ లో "ఉన్నత శిక్షణ” ను ఇచ్చేందుకు నిర్వహిస్తున్న పోస్టు గ్రాడ్యుయేట్ తరగతి విద్యార్థుల వసతి కొరకు నిర్మించిన (అర్థాంతరంగా ఆగిపోయిన) భారీ హాస్టల్ భవన సముదాయం-అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్-సత్యం పబ్లిక్ స్కూల్ నాటి (తర్వాత ఆధునీకరించిన) ప్రధాన కార్యాలయం-ఇండిపెండెంట్ ’తరగతి గదులు’-కొంతమంది ఉద్యోగులుండడానికి అనువుగా వున్న రెసిడెన్షియల్ క్వార్టర్స్..... ...... ఇలా "విలువైన ఆస్తులు"న్న, కోట్లాది రూపాయల విలువ చేసే, సుమారు నలభై ఎకరాల భూమి పూర్వాపరాల గురించి తెలుసుకునే ముందర, రాజు గారి సారధ్యంలో రూపు దిద్దుకున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ "నియమావళి" గురించి, "సంఘం స్థాపన పత్రం" లోని చిత్ర-విచిత్రమైన అంశాల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఇంతకు ముందే తెలియచేసినట్లు, తన కుటుంబీకులే ప్రమోటర్ సభ్యులుగా సంస్థను రిజిస్టర్ చేయించడమే కాకుండా, సంస్థ నియమావళికి, భవిష్యత్ లో ఎంత ప్రయత్నం చేసినా, అంత సులభంగా సవరణలు తేలేని విధంగా, అతి చాకచక్యంగా దాన్ని తయారు చేయించారు రాజు గారు. యాదృచ్చికంగా అలా జరిగిందో, లేక, కావాలనే ఆయనో-ఆయన సలహాదారులో అలా చేయించారో తెలుసుకోవాలంటే, సమాధానం చెప్పాల్సింది రాజు గారే. సంస్థ "ఉజ్వల భవిష్యత్" ను దృష్టిలో వుంచుకుని, "నీతి విచక్షనలేని"వారి చేతుల్లోకి అది ఎట్టి పరిస్థితుల్లోనూ జారిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాటుగా అలా చేసి వుండాలి రాజు గారు బహుశా. రామ లింగరాజు గారి "వ్యూహాత్మక ఆలోచన" కు సరితూగే ఆలోచన చేయగలవారు బహుశా అరుదుగా వుంటారేమో ! ఈ సందర్భంగా "వ్యూహం-వ్యూహ రచన" అంటే కొంత తెలుసుకోవాల్సిన అవసరముంది.

సీ.ఇ.ఓ వెంకట్, అక్కడ పనిచేసే సీనియర్ లీడర్లలో ఆత్మ స్థయిర్యాన్ని పెంపొందించే దిశగా తీసుకున్న చర్యల్లో ప్రధానమయింది "వ్యూహాత్మకంగా సంస్థ ఎలా ముందుకు సాగాలి" అన్న అంశంపై ప్రొఫెసర్ రంజన్ దాస్ తో ఇప్పించిన శిక్షణా పరమైన ఉపన్యాసం అని ఇంతకుముందు పేర్కొన్నాను. అదిక్కడ మరి కొంచెం వివరంగా తెలుసుకుందాం. "సరైన అసలు-సిసలు వ్యూహ రచనే లక్ష్యసాధనకు తొలి మెట్టు" అన్న సందేశం ఆ ఉపన్యాసంలో రంజన్ దాస్ వివరించారు.

వ్యక్తైనా, వ్యవస్థ అయినా, లాభాపేక్ష లేని ఇ.ఎం.ఆర్.ఐ లాంటి స్వచ్చంద సంస్థ అయినా, లాభాలను ఆర్జించే చిన్నా-పెద్దా వ్యాపారమైనా, చివరకు రాజకీయ పార్టీ అయినా-రాజకీయేతర కార్య కలాపాలైనా... ... ఆ మాటకొస్తే, లక్ష్యం-గమ్యం-ధ్యేయం ఎంచుకున్న ఎవరైనా, వాటిని చేరుకునేందుకు-అధిగమించేందుకు, రూపొందించుకునే ప్రణాళికాబద్ధమైన-శాస్త్రీయ పద్ధతిలో అనుసరించాల్సిన కార్యక్రమాన్ని, మేనేజ్‌మెంట్ పరిభాషలో "వ్యూహం" అనో, "వ్యూహ రచన" (Strategy) అనో అంటారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించిన సత్యం కంప్యూటర్స్ సంస్థ చైర్మన్ "జనవరి 7, 2009 నాటి ప్రకటన" దరిమిలా, ఆయన సమకూర్చిన "వ్యక్తిగత నిధులతో", ఆయనే వ్యవస్థాపక అధ్యక్షుడిగా నెలకొల్పబడి-అచిరకాలంలోనే లక్షలాది ప్రాణాలను కాపాడేందుకు దోహద కారైన ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ, భవిష్యత్ లో, రాజు గారు లేని లోటు కనపడకుండా అత్యవసర సహాయ సేవలు అందించడానికి అవసరమైన నిధుల సేకరణకు, ఎలాంటి వ్యూహం అనుసరించాలనేదే నాటి ఉపన్యాసం ముఖ్య ఉద్దేశం. ఆంధ్ర ప్రదేశ్ తో సహా సహాయ సేవలు పొందుతున్న ఇతర రాష్ట్ర ప్రజలు కూడా ఏం జరుగబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపధ్యంలో వెంకట్ గారు "వ్యూహాత్మకంగా" ఏర్పాటు చేసిన కార్యక్రమం అది.

సేవా దృక్ఫదంతో అత్యవసర సహాయ సేవలను అందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ లాంటి సంస్థలు, "ప్రభుత్వం పైనా", "నిధులను సమకూర్చే ఒకరిద్దరి దాతృత్వ విరాళాల పైనా" ఎల్లకాలం ఆధార పడడం కంటే, "వ్యూహాత్మకంగా" ఆదాయ వనరుల సేకరణకు పూనుకోవాలని ఆ రంగంలో నిష్ణాతుడుగా పేరున్న రంజన్ దాస్ అన్నారు. అంబులెన్సుల "సరాసరి నిర్వహణ వ్యయం" ప్రభుత్వం భరించినంత మాత్రాన అదే “శాశ్వత పరిష్కారం అని” అనుకోకూడదని ఆయన హెచ్చరించారు. ఇ.ఎం.ఆర్.ఐ కేవలం అంబులెన్సుల నిర్వహణ మాత్రమే చేపట్టలేదని, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్-పరిశోధన-శిక్షణ కూడా సంస్థ కార్యకలాపాల్లో ప్రధానమయినవేనని, అన్నింటికీ నిధులను ఒక వ్యక్తో-సంస్థో-ప్రభుత్వమో సమకూర్చడం కష్టమని ఆయన అభిప్రాయ పడ్డారు.

ఇ.ఎం.ఆర్.ఐ ప్రధాన లక్ష్యాలను-ధ్యేయాలను ఎంతమాత్రం నీరు కార్చమంటూ నిధులను సమకూర్చేందుకు ముందుకొచ్చే దాతలు, సంస్థ విలువలను గౌరవించినప్పటికీ-మంచి మనసుతో, సేవా దృక్ఫదంతో నిధులిచ్చినప్పటికీ, అంతర్లీనంగా, తద్వారా తమకు కలగబోయే లాభం ఏంటని తప్పక ఆలోచిస్తారని స్పష్టం చేస్తూ, "సొంత కాళ్ల మీద నిలబడ గలగడమే" మెరుగైన పద్ధతిగా పేర్కొన్నారు రంజన్ దాస్. అదో సవాలుగా వర్ణించిన ఆయన, సీనియర్లు ఆ సవాలును స్వీకరించి, మారిన పరిస్థితుల్లో సంస్థ మనుగడకు తమవంతు తోడ్పడగలిగినప్పుడే "లీడర్లు-నాయకులు" కాగలుగుతారని, "మేధావి" గా పిలువబడతారని, అలాంటి వారికే ఇ.ఎం.ఆర్.ఐ లో స్థానం వుండాలని నిర్ద్వందంగా-నిర్మొహమాటంగా చెప్పారు. సవాలును స్వీకరించడమంటే "బిక్షాపాత్ర"తో ప్రయివేట్ భాగస్వామిని అన్వేషించడం కానే కాదని, "నిధులను సమీకరించగల కార్యాచరణ పథకాన్ని ఎందుకు నేను రూపొందించి అమలు చేయలేను" అని ప్రశ్నించుకుని, సమాధానం వెతుకు తే, అదే క్రమేపీ "వ్యూహ రచన" గా మారి లక్ష్యాన్ని చేరుకునేందుకు దోహదపడుతుందని తొలి పాఠం చెప్పారు రంజన్ దాస్. అదే జరిగినప్పుడు ఆబాల గోపాలానికి అత్యవసర సహాయ సేవలు దేశవ్యాప్తంగా మరింత మెరుగ్గా లభించి, మరెన్నో ప్రాణాలను కాపాడగలిగే వీలు కలుగుతుంది.

"లీడర్లు” గా పిలిపించుకున్న మాలో సంస్థ పెరుగుదలకు-ఆదాయ వనరుల సేకరణకు వ్యూహాత్మకంగా ఎంతమంది తోడ్పడగలిగారనేది ప్రశ్నార్థకం. తోడ్పడగల నైపుణ్యం వున్న ఒకరిద్దరిని, యాజమాన్యం ఎంతవరకు ప్రోత్సహించి-అవకాశం ఇచ్చిందనేదీ ప్రశ్నార్థకమే. మేధావులని, నిపుణులని, నిష్ణాతులని సంస్థలో తీసుకున్న వారు-కష్ట కాలంలో సంస్థను అంటిపెట్టుకుని వున్న వారు, యాజమాన్యం మారిన అతి కొద్ది కాలంలోనే వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయి ? వీటన్నిటి సమాధానాలలోనే "ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు కూడా వుంటాయి". ఆ వివరాలు మరో సందర్భంలో తెలుసుకుందాం.

వ్యూహ రచనకు ప్రధానమైన మౌలికాంశాలను నిర్ధారించిన ఆ రంగంలోని నిపుణులు, ఐదు రకాల "షరతులను (నిబంధనలు-నియమాలు)" ఆ ప్రక్రియలో భాగంగా విధిగా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. వ్యూహ రచనను తయారుచేసేవారు చేయాల్సిందల్లా, ఆ ఐదు రకాల షరతులను, సంస్థను విజయపథంలో నడిపించు కోవడానికి, సందర్భోచితంగా అన్వయించు కోవడమే. ఇక్కడ "సందర్భం" అనేది చాలా ముఖ్యమైంది. "సమయం-సందర్భం" లేకుండా చేప్పేది-చేసేది అప్రస్తుతంగా భావించాలి. ఆ ప్రధాన షరతులను ఇ.ఎం.ఆర్.ఐ కి అన్వయించి విశ్లేషించారు రంజన్ దాస్.

108-అత్యవసర సహాయ సేవలను పొందాల్సిన ఖాతాదారులకు-లబ్దిదారులకు (వినియోగదారులు), ఆ సేవలను మరింత మెరుగైన రీతిలో-నాణ్యమైన పద్ధతిలో పొందే హక్కుందని, ఆ విషయంలో "తుది అభిమతం-నిర్ణయం" వారిదే అవుతుందని ఇ.ఎం.ఆర్.ఐ గుర్తించడం మొదటి షరతు. ప్రభుత్వం అంగీకారంతో నోడల్ ఏజన్సీగా తమ సంస్థ అందిస్తున్న సహాయ సేవల తరహా సేవలనే అందించగల "పోటీదారులు" వున్నారని-వుండవచ్చని, ఆ పోటీ ముమ్మరం కానున్నదని, ఆ పోటీని వ్యూహాత్మకంగా సవాలు చేయాల్సిన అవసరం ఆసన్నమవుతున్నదని-లేదా ఆసన్నమయిందని ఇ.ఎం.ఆర్.ఐ గుర్తించి తీరాలి. ఒకవేళ పోటీకి ఎవరూ లేనిపక్షాన, సవాలు విసిరి మరీ పోటీదారులను తయారుచేయాలనేది రెండో షరతు. మానవ-ఆర్థిక వనరులు పోను-పోనూ, పరిమితంగానే లభ్యమయ్యే స్థితి కలగవచ్చని గుర్తించడం మూడో షరతు. సంస్థ కార్య కలాపాలకు (యాజమాన్య పరమైన-నిర్వహణా పరమైన-ఇతర అవసరాలకు) నిధులు (ప్రస్తుతం) సమకూరుస్తున్నవారు, ప్రభుత్వమైనా-ప్రయివేట్ వారైనా, వారి పెట్టుబడికి తగిన ప్రతిఫలం రావడం లేదని, సహనం కోల్పోయే ప్రమాదముందని ముందుగానే ఊహించడం మరో షరతు. లాభాపేక్ష లేని సంస్థల విషయంలో, ఆ ప్రతిఫలం "ధన రూపేణా" వుండాల్సిన అవసరం లేదు. "పేరు-ప్రతిష్టలు" కావచ్చు, తద్వారా మరో రకమైన "ప్రతిఫలం" కావచ్చు. హఠాత్తుగా భారీ నష్టమో-లాభమో (రాజు గారు బరువు-బాధ్యతలు వెంకట్ గారిమీద పెట్టి హఠాత్తుగా తప్పుకున్న తరహాలో!) సంభవించవచ్చని ఊహించడం ఐదో షరతు. వ్యూహాత్మకంగా సంస్థను "ఒడిదుడుకులకు" లోనుకాకుండా నడిపించాలంటే, ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్య స్థాయి "లీడర్లు" ఈ ఐదు షరతులను విధిగా పరిగణలోకి తీసుకుని ముందుకు సాగాలి. ఈ ఐదింటిలో ఒకటి గాని-ఒకటికంటే ఎక్కువగాని షరతులు సంస్థకు అన్వయించాల్సి వచ్చిందంటే, తదనుగుణంగా వ్యూహ రచన చేయాల్సిందే.

యాజమాన్య స్థాయి "లీడర్లు" సమిష్టి గా ఆలోచించి, ఒక్కో అంశంపై వివరణాత్మక వ్యూహ రచన చేయాలంటే, అందులోని ప్రతి వ్యక్తి, తనకు సంబంధించిన-తన వంతు బాధ్యతను నిబద్ధతతో-నైపుణ్యంతో చేపట్టాలి. "బాధ్యతారాహిత్యం" వున్న చోట వ్యూహరచనకు తావులేదు. వ్యూహరచన చేయడమంటే, పరోక్షంగా-ప్రత్యక్షంగా ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు సౌభాగ్యం కలిగించడమే. సందర్భాన్ని బట్టి వ్యూహరచన వుంటుందంటే, దానర్థం, ఎటువంటి అవసరానికి ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవాలన్న ఆలోచన చేయడమే. ఆలోచనలలోని వ్యత్యాసాలు, లేదా, భిన్నాభిప్రాయాలు వ్యూహరచనగా భావించరాదు. ఒకరి వ్యూహరచన మరొకరి దానికంటే భిన్నంగా వుండొచ్చు, అందుకే సందర్భ ప్రాధాన్యం చాలా ముఖ్యం. "వ్యూహ రచన బాధ్యత సంస్థదే-నాది కాదు" అని ఎవరికి వారే ప్రతి లీడర్ తప్పించుకుంటే వారిలో నాయకత్వ లక్షణాలు లేనట్లు గానే భావించాలి. సంస్థ అంతర్గత విధానాలు-నెల కొన్న పద్ధతి-నిర్మాణ వ్యవస్థ వ్యూహరచనకు తోడ్పడతాయి. నాయకుడన్న వాడు "సమస్యలో భాగస్వామి కాకుండా" "పరిష్కారంలో పాలుపంచుకోవాలి".

ఉదాహరణకు, ఇ.ఎం.ఆర్.ఐ కి ప్రభుత్వమో, లేక, ప్రయివేట్ భాగస్వామో సమయానికి కావాల్సిన నిధులను విడుదల చేయకపోతే, ఆ సమస్యను "జటిలం" చేయకుండా, ఏం చేస్తే ఆ సమయానికి నిధుల కొరత లేకుండా చేయగలుగుతామని ఆలోచన చేయడమే "వ్యూహ రచన". అది చేయగల వారే "లీడర్లు". వ్యూహాత్మకంగా రూపొందించిన ప్రణాళికను సంస్థ (ఇ.ఎం.ఆర్.ఐ) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీ.ఇ.ఓ) అంగీకరించడంలేదనో-సూచనను వినిపించుకోవడంలేదనో, సాకులు చూపించడం నాయకత్వ లక్షణం కాదు. సరైన వ్యూహకర్త తాను చేసిన ఆలోచన మిగతా వారందరి ఆలోచనకంటే మెరుగైనదని ధృఢంగా విశ్వసించగలిగి, పై అధికారిని ఒప్పించగలగాలి. సందర్భాన్నిబట్టి వ్యూహరచనలో వ్యత్యాసం వుంటుంది. ఈ వ్యత్యాసం కనీసం మూడు అంశాల్లో వుండితీరుతుంది.

వినియోగదారుల పరిధి ఏమిటి-ఎలా నిరంతరం మార్పుచెందుతుంది అని ఆలోచన చేయడం మొదటి అంశం. వినియోగదారుల (ఇ.ఎం.ఆర్.ఐ అందిస్తున్న అత్యవసర సహాయ సేవలను పొందే లబ్దిదారుల) సంఖ్య పెరుగుతున్న కొద్దీ, సమస్యలు కూడా పెరుగుతాయి. వాస్తవ వినియోగదారులను గుర్తించడం కూడా క్లిష్టం కావచ్చు. ఉదాహరణకు, అత్యవసర సహాయం కొరకు ఎదురుచూచేవారు-అందులో ఖచ్చితంగా తక్షణం సహాయం కావల్సినవారు-సహాయం కావాలని ఫోన్ చేయగలవారు-ఫోన్ చేయలేనివారు-ఒక విధంగా పౌరులందరూ-ప్రభుత్వంలోని అధికార, అనధికార గణం-పోలీసు, వైద్య, ఆరోగ్య, అగ్నిమాపకదళ సిబ్బంది.... ఇలా అందరు కూడా ఇ.ఎం.ఆర్.ఐ వినియోగదారులే. అత్యవసర సమయాల్లో "రోగి బంధువులు" కూడా వినియోగదారులే. వినియోగదార్ల పరిధిని అర్థం చేసుకున్న తర్వాత, వారికి లభించబోయే లాభాన్ని ఎలా "విలువ" కట్టాల్నో కూడా వ్యూహంలో భాగమే. ఇది రెండో అంశం. చిట్ట చివరలో, చిట్ట చివరి వినియోగదారుడి చిట్ట చివరి అవసరానికి లభించిన పరిష్కారానికి-మొట్టమొదటి సారి, మొట్టమొదటి వినియోగదారుడికి అలాంటి సమస్యకు లభించిన పరిష్కారానికి తేడా వుండకూడదు. అలాంటి వ్యూహరచనే "విలువ ప్రాధాన్యతగల ప్రతిపాదన" అంటారు.

"కస్టమర్" ఎల్ల వేళలా దేముడితో సమానమే. ఆ కస్టమర్ లబ్దిదారుడు కావచ్చు, లేదా, నిధులను సమకూరుస్తున్న ప్రభుత్వమే కావచ్చు. తనకు అర్థమయ్యే పరిభాషలో, సేవలు లభ్యమవ్వాలని వినియోగదారుడు కోరుకుంటాడు. తప్పైనా-ఒప్పైనా కస్టమర్ చెప్పిందే "వేదం". అంటే, ఇ.ఎం.ఆర్.ఐ "ప్రధాన కస్టమరైన" ప్రభుత్వం చెప్పింది, ఖండించకుండా, నచ్చచెప్పే ధోరణిలో ఇ.ఎం.ఆర్.ఐ వ్యవహరించాలి.

రంజన్ దాస్ సలహాలను-సూచనలను ఎంతమంది సీరియస్ గా తీసుకున్నారనేది-ఎంతమంది అమలులో పెట్టగలిగారనేది చెప్పడం అంత తేలికైన విషయం కాదు. బహుశా ఆయన చెప్పింది పాటించి వుంటే, ఒడిదుడుకులు కొన్నైనా తప్పేవేమో !

Sunday, July 4, 2010

కృతజ్ఞతాభివందనాలు: వనం జ్వాలా నరసింహా రావు

కృతజ్ఞతాభివందనాలు
వనం జ్వాలా నరసింహా రావు

జై శ్రీమన్నారాయణ
ఓం అస్మద్గురుభ్యో నమః

నేను రామాయణం చదువుతానని, అదీ వాసు దాసు గారి శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం చదవ గలుగుతానని ఎప్పుడు అనుకోలేదు. ఏడేళ్ల క్రితం, అనుకోకుండా, శ్రీ రంగనాద స్వామిని దర్శించుకునే భాగ్యం కలిగింది. హైదరాబాద్ తిరిగొచ్చి ఇంటికి చేరుకోగానే, పొరుగు నున్న శ్రీమాన్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు, సుందర కాండ మందరం చేతిలో పెట్టి చదవమని ప్రోత్సహించారు. అది నేను ఊహించని విషయం. చదివి తెలుసుకున్న విషయాన్ని పదిమందితో పంచుకోవాలని, సాధ్యమైనంత శిష్ట వ్యావహారిక భాషలో, సుందర కాండ మందర మకరందంగా రాశాను. స్నేహితుల సహాయంతో రెండు ముద్రణలకు నోచుకుందా పుస్తకం. అనుకున్న తడవుగానే దాన్ని ముద్రించ గలనని నేను ఊహించలేదు. అంతా దైవానుగ్రహం. ఆ అనుగ్రహంతోనే బాల కాండ మందరం కూడా చదవ గలిగాను. చదివిన విషయాన్ని మందర మకరందంగా రాయ గలిగాను.

ప్రత్యక్ష దైవమైన "శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి" మంగళా శాసనముల కొరకు, ఆయన ప్రియ శిష్యుడు శ్రీ ఎర్నేని రామారావు తోడ్పాటుతో, బాల కాండ మందర మకరందం డమ్మీ కాపీని స్వామి వారికి అందచేయడానికి ఆశ్రమానికి వెళ్లాను సతీ సమేతంగా. దైవానుగ్రహం వల్ల, ఆశీస్సులతో పాటు, నా కోరిక మేరకు, ఉపోద్ఘాతం రాయడానికి స్వామి వారు అనుగ్రహించారు. వారం రోజుల తర్వాత శ్రీరాం నగర్ లోని జీయర్ ఇంటెగ్రేటెడ్ వేదిక్ అకాడమీ ప్రాంగణంలోని దివ్య సాకేతంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంలో వెళ్లిన మా దంపతులను, దగ్గరకు పిల్చిన జీయర్ స్వామి, నేనూహించని విధంగా అనుగ్రహించారు. "జీయర్ శతాబ్ది శత గ్రంథ ముద్రణ పథకం” లో భాగంగా, ఒక పుష్పంగా, "బాల కాండ మందర మకరందం" ముద్రించు తామని స్వయంగా తెలియచేశారు. అంత కంటే అదృష్టం ఏం కావాలి? స్వామి వారి ఆదేశం మేరకు పుస్తకం సాఫ్ట్ కాపీని సీతా నగరంలోని జెట్ కార్యాలయానికి అంద చేశాను.

స్వామి వారి ఆదేశాల మేరకు పుస్తక ముద్రణ చేపట్టిన తర్వాత మరొక్క మారు స్వామిని కలిసే అవకాశం దొరికింది. ఆ సందర్భంలో, స్వామి వారి సూచన మేరకు, దివ్య సాకేతంలో, మందర మకరందం పుస్తకం కవర్ పేజీకి, స్వయంగా వారే ఎంపిక చేసిన. ముఖ చిత్రం నమూనాను చూశాను. స్వామి వారి అనుగ్రహం మరోసారి ఆ విధంగా కలిగినందుకు అదృష్టవంతుడిగా భావించాను.

అడగందే అమ్మైనా పెట్టదంటారు. కాని, అడక్కుండానే, మాతృ వాత్సల్యంతో, నేను రాసిన "బాల కాండ మందర మకరందం" పుస్తకాన్ని ముద్రించి, పలువురికి, ఆ పుస్తకాన్ని చదివే అవకాశం కలిగించిన ప్రత్యక్ష దైవం "శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారికి" శిరస్సు వంచి పాదాభి వందనం చేసుకుంటూ, అనేకానేక కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను. ఆయన ఆశీస్సులతో, మంగళా శాసనములతో, అనుగ్రహంతో వెలుగు చూసిన ఈ పుస్తకం పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటుందని భావిస్తూ, మరొక్క మారు జీయర్ స్వామికి కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను.

జ్వాలా నరసింహా రావు
అనువక్త-వాచవి, బాల కాండ మందర మకరందం
జులై 1, 2010
శ్రీ వికృతినామ సంవత్సర జ్యేష్ఠ మాసం
బహుళ పంచమి

Friday, July 2, 2010

భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ దిద్దుబాటు ఉద్యమం: వనం జ్వాలా నరసింహారావు

(జులై 3-4, 2010 తేదీలలో సిపిఎం పోలిట్ బ్యూరో
సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో.....)

భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ దిద్దుబాటు ఉద్యమం
వనం జ్వాలా నరసింహారావు


ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి విడిపోయిన భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్), వేలాదిమంది కార్యకర్తల త్యాగాల ఫలితంగా ఎదుగుతూ, కేరళ-పశ్చిమ బెంగాల్-త్రిపుర రాష్ట్రాలలో బలమైన పట్టు సాధించి, గత కొద్ది కాలంగా తిరోగమన దిశగా పయనించడానికి దారి తీసిన పరిస్థితులను అగ్రనాయకత్వం సరి దిద్దుకునే ప్రయత్నం చేయడం ఆరంభించింది. పార్టీ తలపెట్టిన విప్లవ లక్ష్యాలను-ధ్యేయాలను చేరుకుని, అధిగమించేందుకు, రాజకీయ పరంగా-సిద్ధాంత పరంగా చోటుచేసుకున్న బలహీనతలను, నిర్మాణ పరంగా జరిగిన అపరాధాలను అన్వేషించ సాగింది. నిరంతర దిద్దుబాటు ప్రక్రియ ద్వారా, పార్టీ కేడర్లు-లీడర్లు తాము చేస్తున్న తప్పులు సరి దిద్దుకునే మార్గాలను సూచించింది.

దిద్దుబాటు ఉద్యమం తీరుతెన్నులను, పార్టీ అగ్రశ్రేణి నాయకత్వానికి చెందిన పోలిట్ బ్యూరో-కేంద్ర కమిటీ సభ్యులకు అన్వయించి అమలుపర్చే పద్ధతిని, అలాంటి ప్రక్రియనే జిల్లా-గ్రామ శ్రేణి కేడర్‌లకు వర్తింపజేసే విధానాన్ని, 2010 జూన్ నెల చివరికల్లా పూర్తిచేయాలని అక్టోబర్ 2009లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఆ నిర్ణయం ఎంత మేరకు అమలుకు నోచుకుందో ఇదమిద్ధంగా ఇంతవరకు బయట పడలేదు. పదిహేనవ సాధారణ ఎన్నికల్లో సిపిఎం గెల్చుకున్న లోక్ సభ సభ్యుల సంఖ్య 2004 ఎన్నికలలో గెల్చుకున్న 42 నుంచి గణనీయంగా పడిపోయి కేవలం 16 కు కుదించుకుని పోవడంతో, పార్టీ నాయకత్వం ఆత్మ విమర్శ చేసుకోవడంలో భాగంగా, "దిద్దుబాటు ఉద్యమం" బాట పట్టాలని భావించింది. ఇంతలో పశ్చిమ బెంగాల్ మునిసిపల్ ఎన్నికల చేదు అనుభవం ఎదురైంది.

భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, చైనా-రష్యాల మధ్య బెడిసికొట్టిన సంబంధాల, భారత-చైనా యుద్ధ పరిణామాల నేపధ్యం, భారత కమ్యూనిస్ట్ పార్టీలో 1962 లో చీలికకు దారితీశాయి. నూతనంగా ఏర్పాటైన భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్)-సిపిఎం పార్టీ, సభ్యత్వ సంఖ్యాపరం గాను, ఎన్నికల్లో సాధించిన ఫలితాల పరం గాను, బలీయమైన శక్తిగా గుర్తింపు పొంద సాగింది. పార్టీలో చీలిక వచ్చిన తర్వాత కూడా కొంతకాలం, ఉభయ పార్టీలకు ట్రేడ్ యూనియన్ పరంగా ఒకే ఐక్య వేదిక వుండేది. అప్పట్లో పార్టీలో చీలికైనా, ట్రేడ్ యూనియన్ లో చీలికైనా, సైద్ధాంతిక పరమైన అభిప్రాయ భేదాల వల్ల వచ్చిందే కాని, వ్యక్తిగత కారణాల వల్ల వచ్చింది కాదు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఆస్తులు కూడగట్టుకోడానికి, అంతస్తులు పెంచుకోవడానికి, చట్టసభల్లో ప్రవేశించేందుకు, ప్రవేశించి-బూర్జువా పార్టీకి చెందినవారితో సమానంగా అంతస్తులు పెంచుకునేందుకు, పార్టీ టికెట్ పొందడానికి, కాంట్రాక్టర్ల కొమ్ము కాయడానికి, పార్టీని ఉపయోగించుకునే అలవాటుండేది కాదు. ఏది జరగకూడదని పార్టీ ఆవిర్భావపు రోజుల్లో అనుకున్నా రో, దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుండడంతో, "దిద్దుబాటు ఉద్యమాల" అవసరం కలిగిందనాలి.

1964 లో ఆవిర్భవించిన సిపిఎం, ప్రజా ఉద్యమాలు నిర్వహించడంలో ముందు వరుసలో వుండేది అలనాటి పార్టీ నాయకత్వం కింద. వామ పక్షాలలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. మూడు రాష్ట్రాలలో వామ పక్ష ఐక్య సంఘటన ప్రభుత్వాలకు సారధ్యం వహించే స్థాయికి ఎదిగింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ చేతిలో పశ్చిమ బెంగాల్ మునిసిపల్ ఎన్నికలలో ఘోర పరాజయం పొందినప్పటికీ, అదింకా బలమైన వామ పక్షం అన్న విషయంలో అనుమానం లేదు. అంత మాత్రాన, పార్టీ బలం పది కాలాల పాటు మిగులుతుందన్న ధీమాతో వుండే అవకాశమూ లేదు.

రాజకీయ-సైద్ధాంతిక బలహీనతలను, వ్యవస్థాగత లోటుపాటులను సరి దిద్దుకుని ముందుకు సాగినప్పుడే, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ విప్లవ లక్ష్యాలను సాధించగలదని పార్టీ నాయకత్వం భావించింది. వర్గ ప్రాధాన్యతల సమాజంలో, పాలకవర్గం మాట చెల్లుబాటు కావడమే కాకుండా, దాని ప్రభావం సమాజంపై పడుతుంది. అలాంటి సమాజంలో, బూజుపట్టిన సిద్ధాంతాలను ఇతరులపై రుద్దే ప్రయత్నంలో కమ్యూనిస్ట్ పార్టీని కూడా వదలదు పాలక వర్గం. ఆ ప్రభావానికి లోనైన కమ్యూనిస్టులను దిద్దుబాటులో పయనించేలా చర్యలు నిరంతరం చేపట్టాల్సిన బాధ్యత నాయకత్వానిదే. కాకపోతే, ఆ నాయకత్వంలోని కొందరు అదే మంచిదని ఆ ప్రభావంలో పడిపోతే, కంచే చేనును మేసినట్లవుతుంది.

భారత దేశంలో కమ్యూనిస్టులు అధికారంలోకి రావాలంటే అనుసరించతగిన మార్గాలకు సంబంధించి, ఆదినుంచీ భిన్నాభిప్రాయలుండేవి. ఎవరు నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా వారు మసలుకున్నారు. అంత మాత్రాన అవసరం వచ్చినప్పుడు విమర్శలకు గురికాక తప్పలేదు. 1964 నుంచి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా వున్న మాకినేని బసవ పున్నయ్య, తన బాధ్యతలను విస్మరించి-పోరాట మార్గాన్ని విడనాడి, కేవలం సలహాలు ఇవ్వడానికే పరిమితమై పోయాడని, సాక్షాత్తు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య ఆగస్ట్ 1975 లో పదవికి రాజీనామా చేస్తూ పోలిట్ బ్యూరో-కేంద్ర కమిటీ సభ్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారంటే, అప్పట్లో పెద్దా-చిన్నా తేడా లేకుండా పార్టీకి చెందిన ప్రతివారిని ఎంత నిశితంగా పరిశీలించడం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు... అందరూ.. పార్టీ క్రమశిక్షణకు అతీతులే !

వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట విప్లవ రథ సారధులలో ముఖ్యుడు, సిపిఎం వ్యవస్థాపకుల్లో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య లాగా కమ్యూనిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన వారు అరుదుగా కనిపిస్తారు. ఆయన పేరు చివర నున్న కుల ప్రాధాన్యతను గుర్తుచేసే "రెడ్డి" పదాన్ని శాశ్వతంగా తన పేరునుంచి తొలగించు కోవడంతో పాటు, సమాజ సేవే లక్ష్యంగా జీవించాలన్న తలంపుతో-భార్య అంగీకారంతో, తమకు సంతానం వద్దని నిర్ణయం తీసుకున్నారాయన. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో 1936 లోనే కేంద్ర కమిటీ సభ్యుడైన సుందరయ్య 1948-1952 మధ్య కాలంలో అజ్ఞాతంలో గడిపారు. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడయ్యారు. పార్టీ పక్షాన పార్లమెంటుకు ఎన్నికైన సుందరయ్య గారు, ప్రతిపక్ష నాయకుడి హోదాలో సైకిలెక్కి పార్లమెంటు భవనానికి వెళ్లేవారు. ఇప్పుడేమో స్కార్పియోలకు తక్కువ లేకుండా పార్టీ పక్షాన ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఉపయోగిస్తున్నారు. సిపిఎం ఆవిర్భావం నుంచి 1976 వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సుందరయ్య గారు, దేశంలో ఇందిరా గాంధి అత్యవసర పరిస్థితి విధించిన నేపధ్యంలో, పార్టీ అలవరచుకుంటున్న "అభివృద్ధి నిరోధక అలవాట్ల" కు నిరసనగా రాజీనామా చేశారు.

సుందరయ్య గారు రాజీనామా సమర్పించి పాతిక సంవత్సరాలు కావస్తున్న సందర్భంలో, ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాల తరహా దిద్దుబాటు చర్యలకు, ఏడాది క్రితం పార్టీ కేంద్ర కమిటీ సూచించిన దిద్దుబాటు చర్యలకు మధ్యనున్న తేడాను, కమ్యూనిజం కోణంలోంచి పరిశీలించి చూడాల్సిన అవసరం చాలా వుంది. ఆయన సూచనలను ఆనాడు పరిగణలోకి తీసుకుంటే, ఈనాడు అసలు “దిద్దుబాట” పట్టాల్సిన అవసరమే లేదు. సుందరయ్య గారి రాజీనామా లేఖలో ఇతర అంశాలతో పాటు ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలు మరొక్కమారు మననం చేసుకోవడం మంచిదే మో. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో, "జనసంఘ్" పార్టీతో కలిసి సిపిఎం ఉమ్మడి ఉద్యమాలను చేపట్టడాన్ని ఆయన తప్పు పట్టారు. నిశితంగా విమర్శించారు. జనసంఘ్ తో కలిసిన వారు, ఆ పోకడలను వంట పట్టించుకోక ఎలా వుండగలుగుతారు? పార్టీ వ్యూహాత్మక పంథాను పోలిట్ బ్యూరో చిత్తశుద్ధితో వాస్తవ రూపంలో అమలు పర్చలేకపోవడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. పార్టీని కాదనే శైలిలో ట్రేడ్ యూనియన్ విభాగం పనిచేసే విధానం ఆయనకు నచ్చలేదు. వ్యవసాయిక విప్లవాన్ని ఆచరణలో పెట్టడం విషయంలో అలసత్వం ప్రదర్శించడానికి తాను వ్యతిరేకం అన్నారు. పార్టీ సంస్థాగత ఎదుగుదలకు అవసరమైన రహస్య వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం మంచిది కాదన్నారు. బసవ పున్నయ్య లాంటి కొందరు బాధ్యతలను విస్మరించడంతో సహా, పోలిట్ బ్యూరో సభ్యులు సమష్టిగా పనిచేయకపోవడం-రణ దివే తో తనకు తలెత్తుతున్న తీవ్ర వి బేధాలు కూడా ఆయన ప్రస్తావించారు.

ఒకదానికి మరొక టి పొంతనలేని తరహా రాజకీయ-సంస్థాగత దృక్ఫదంతో సిపిఎం పోలిట్ బ్యూరో వ్యవహార ధోరణి వుండడం తనకు నచ్చడం లేదని స్పష్టం చేశారు సుందరయ్య గారు. తనకే గనుక కనీసం మూడొంతులమంది కేంద్ర కమిటీ సభ్యుల మద్దతు లభించినట్లయితే, పార్టీ కాంగ్రెస్ నిర్వహించి కొత్త ప్రధాన కార్యదర్శిని-పోలిట్ బ్యూరోను ఎన్నుకోవాల్సిందిగా డిమాండ్ చేసేవాడినని ఆయన తన లేఖలో పేర్కొన్నారంటే, ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవాలి. తనకు నచ్చని అంశాలను బహిరంగంగా లేఖలో పేర్కొనకుండా, రాజీ ధోరణిని అవలంభించినట్లయితే, పది కాలాల పాటు పదవిలో కొనసాగ వచ్చునన్న భావన ఆయనకు ఏనాడు రాలేదు. ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ నిర్మాణాన్ని చేసుకుంటూ, చనిపోయేంతవరకు, పార్టీ రాష్ట్ర విభాగం కార్యదర్శిగా పనిచేశారు. ఆయన మరణానంతరం సిపిఎం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే, సుందరయ్య గారి అనుమానాలు నిజమవుతున్నాయనే అనుకోవాలి.

సుందరయ్య గారైనా, బసవ పున్నయ్యైనా, చండ్ర రాజేశ్వర రావైనా, మోటూరి హనుమంతరావైనా, జిల్లా-రాష్ట్ర స్థాయి నాయకులైన చిర్రావూరి లక్ష్మీనరసయ్య అయినా, మంచి కంటి రామ కిషన్ రావైనా, బోడేపూడి వెంకటేశ్వర రావైనా.... ... ఆ మాట కొస్తే, అలనాటి కమ్యూనిస్ట్ నాయకులెవరైనా, కేవలం "పార్లమెంట్ దృక్ఫదం" తోను, "ఎన్నికల అవకాశ వాదం" తోను పనిచేయడం గాని, తద్వారా లభించబోయే లాభాలకు ఆకర్షితులవడం గాని జరగలేదు. వాళ్లకున్నదంతా త్యాగం చేశారే గాని, ఆస్తులు కూడగట్టుకోలేదు. ఇప్పుడదొక అలవాటుగా, సాంప్రదాయంగా మారిపోయింది. అలా మారిందని సాక్షాత్తు పార్టీ కాంగ్రెసే అభిప్రాయపడిందంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

1996 లో పార్టీ రూపొందించిన దిద్దుబాటు ఉద్యమం డాక్యుమెంటుకు కొన్ని సవరణలు చేసి, ఉద్యమాన్ని మరింత పటిష్టంగా అమలు పరిచేందుకు, నూతన విధానాన్ని తయారుచేయాలని కోయంబత్తూర్ లో మార్చ్29-ఏప్రిల్ 3, 2008 లో జరిగిన పంతొమ్మిదవ పార్టీ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. గతంలో పార్టీ నిర్ణయించిన విధంగా, దిద్దుబాటు చర్యలు పటిష్టంగా అమలు చేయడం జరగలేదని, ఆత్మ విమర్శ కూడా చేసుకుంది పార్టీ నాయకత్వం. ఏవో కొన్ని చెదురు-ముదురు సంఘటనలకు సంబంధించిన తప్పొప్పులను సరిదిద్దడం జరిగినా, ఆశించిన మేర ఫలితం కలగలేదని పార్టీ భావించింది. అసలా మాటకొస్తే, దిద్దుబాటు కార్యక్రమం అమలు ప్రక్రియలో అగ్రశ్రేణి నాయకత్వానికి చెందిన పోలిట్ బ్యూరో-కేంద్ర కమిటీ సభ్యులను చేర్చే వ్యవహారంలో బలహీనతలు చోటుచేసుకున్నాయని కూడా పార్టీ అభిప్రాయ పడింది.

గత 12-14 సంవత్సరాల కాలంలో అమలైన దిద్దుబాటు చర్యలు అనుకున్న ఫలితాలు సాధించ లేకపోయిందని పార్టీ భావించింది. సిపిఎం కేడర్లను, లీడర్లను బూర్జువా రాజకీయ పార్టీలనుసరిస్తున్న విధానాలు గతంలోకంటే మరింతగా ప్రభావితం చేస్తున్నాయని, వారు ఆస్తులను సమకూర్చుకోవడంతో పాటు వారి వ్యాపార-వాణిజ్యాలకు తమ రాజకీయ పలుకుబడిని సంధానం చేస్తున్నారని, ఎన్నికలలో పార్టీ పరంగా ధనాన్ని పెద్దమొత్తంలో వ్యయం చేస్తున్నారని, పార్టీ కేంద్ర కమిటీ భావించింది. ఎన్నికల అవగాహన నెపంతో, అభివృద్ధి నిరోధక-బూర్జువా విధాన పార్టీల అలవాట్లను అలవరచుకుంటూన్నారని అగ్ర నాయకత్వం వాపోయింది. 2001 తర్వాత పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్మిక వర్గానికి చెందిన అనేక మందికి పార్టీ పట్ల-ప్రజా ఉద్యమాల పట్ల కనీస అవగాహన లేదని, ఆ పరిస్థితి కొనసాగితే, భవిష్యత్ లో ప్రమాదం వుందని పార్టీ అభిప్రాయ పడింది. కార్మిక వర్గానికి చెందిన వారి శాతం 75 వర కుండగా, కేవలం 30 శాతం మంది మాత్రమే వివిధ కమిటీలలో స్థానం పొందగలుగుతున్నారని, ఇది కూడా బూర్జువా విధానాలకు అనుగుణంగానే వుందని పార్టీ నాయకత్వం భావిస్తున్నది.

గత పది-పన్నెండు సంవత్సరాలలో అవకాశ వాదం, ఆస్తులు సమకూర్చుకునే పద్ధతి, విపరీతంగా పెరిగిపోతున్నదని, ఆంధ్ర ప్రదేశ్ లో దీని ప్రభావం తీవ్రంగా వుందని, పార్టీ నియమావళి ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, తమకు ప్రభుత్వం ద్వారా లభించే జీతాలను-అలవెన్సులను పార్టీకిచ్చే సంప్రదాయం కూడా కొందరు పాటించడం లేదని, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు బాధ్యతల నిర్వహణలో పార్టీని అనుసంధానం చేయడం జరగడం లేదని, ఇవన్నీ పార్టీకి లాభించని విషయాలని కేంద్ర కమిటీ భావించింది. ధన బలం, మద్యం వాడకం, అవినీతి చర్యలు పార్టీలో బాగా పెరిగిఫొయాయని, ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్నికలలో డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారని, పార్టీ నియమ-నిబంధనలను-విలువలను పాటించేవారి సంఖ్య తరిగిపోతున్నదని, పార్టీ సభ్యుల జీవన శైలిలోనే మార్పొచ్చిందని, భవంతుల్లో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడుతున్నారని, వివాహాల్లో విపరీతంగా ఖర్చు చేస్తున్నారని, పండుగలు-పబ్బాలు సమృద్ధిగా జరుపుకుంటున్నారని, ఆదాయానికి మించిన ఖర్చు చేస్తున్నారని, అలాంటి వారిపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ, పార్టీ కమిటీలు చర్యలు తీసుకునే పరిస్థితులు లేవని కేంద్ర కమిటీ దిగులుపడింది.

భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీలో చోటుచేసుకుంటున్న విపరీత ధోరణులు పార్టీని ఎటు వైపుగా తీసుకెళ్తాయో నాయకత్వానికే అర్థం కావాలి. ప్రాణాలను-ఆస్తులను-కుటుంబ బాధ్యతలను లెక్క చేయకుండా, సుందరయ్య గారి లాంటి నాయకులు, పార్టీని పటిష్టం చేశారు. వీర తెలంగాణ సాయుధ పోరాటంలో అల నాడు అంతమంది పాల్గొనడానికి కారణం ప్రజల్లో పార్టీ పట్ల-పార్టీ నాయకుల పట్ల వున్న విశ్వాసమే. క్రమేపీ, ప్రజలకు దూరం కా సాగింది కమ్యూనిస్ట్ పార్టీ. ప్రజలే న్యాయమూర్తులని, వారికే తాము జవాబుదారులమని మరిచిపోతోంది పార్టీ నాయకత్వం. వాస్తవాలన్నీ ప్రజలు గమనించుతున్నారని కూడా గ్రహించలేని స్థితికి పోతుందా పార్టీ అనిపిస్తుంది. పార్టీలో ఏం జరుగుతుందో సామాన్యుడికి తెలిసే అవకాశమే లేదిప్పుడు. దానికి కావాల్సిన యంత్రాంగం లేనప్పుడు, ప్రజలతో సంబంధాలు తెగిపోవడం సహజం. పార్టీ కేంద్ర కమిటీ ఆత్మ విమర్శ చేసుకున్న పద్ధతి నిశితంగా గమనిస్తే, పార్టీ ఎంత ఊబిలో కూరుకుపోయిందో-పోబోతోందో అర్థం చేసుకోవడం కష్టం కాదు. దిద్దుబాటు ఉద్యమం పరిస్థితులను కొంత మేరకు సరిదిద్దగలదేమో గాని, ప్రక్షాలణ చేయడం సాధ్యమవుతుందా? ప్రశ్నార్థకమే.