Friday, July 2, 2010

భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ దిద్దుబాటు ఉద్యమం: వనం జ్వాలా నరసింహారావు

(జులై 3-4, 2010 తేదీలలో సిపిఎం పోలిట్ బ్యూరో
సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో.....)

భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ దిద్దుబాటు ఉద్యమం
వనం జ్వాలా నరసింహారావు


ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి విడిపోయిన భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్), వేలాదిమంది కార్యకర్తల త్యాగాల ఫలితంగా ఎదుగుతూ, కేరళ-పశ్చిమ బెంగాల్-త్రిపుర రాష్ట్రాలలో బలమైన పట్టు సాధించి, గత కొద్ది కాలంగా తిరోగమన దిశగా పయనించడానికి దారి తీసిన పరిస్థితులను అగ్రనాయకత్వం సరి దిద్దుకునే ప్రయత్నం చేయడం ఆరంభించింది. పార్టీ తలపెట్టిన విప్లవ లక్ష్యాలను-ధ్యేయాలను చేరుకుని, అధిగమించేందుకు, రాజకీయ పరంగా-సిద్ధాంత పరంగా చోటుచేసుకున్న బలహీనతలను, నిర్మాణ పరంగా జరిగిన అపరాధాలను అన్వేషించ సాగింది. నిరంతర దిద్దుబాటు ప్రక్రియ ద్వారా, పార్టీ కేడర్లు-లీడర్లు తాము చేస్తున్న తప్పులు సరి దిద్దుకునే మార్గాలను సూచించింది.

దిద్దుబాటు ఉద్యమం తీరుతెన్నులను, పార్టీ అగ్రశ్రేణి నాయకత్వానికి చెందిన పోలిట్ బ్యూరో-కేంద్ర కమిటీ సభ్యులకు అన్వయించి అమలుపర్చే పద్ధతిని, అలాంటి ప్రక్రియనే జిల్లా-గ్రామ శ్రేణి కేడర్‌లకు వర్తింపజేసే విధానాన్ని, 2010 జూన్ నెల చివరికల్లా పూర్తిచేయాలని అక్టోబర్ 2009లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఆ నిర్ణయం ఎంత మేరకు అమలుకు నోచుకుందో ఇదమిద్ధంగా ఇంతవరకు బయట పడలేదు. పదిహేనవ సాధారణ ఎన్నికల్లో సిపిఎం గెల్చుకున్న లోక్ సభ సభ్యుల సంఖ్య 2004 ఎన్నికలలో గెల్చుకున్న 42 నుంచి గణనీయంగా పడిపోయి కేవలం 16 కు కుదించుకుని పోవడంతో, పార్టీ నాయకత్వం ఆత్మ విమర్శ చేసుకోవడంలో భాగంగా, "దిద్దుబాటు ఉద్యమం" బాట పట్టాలని భావించింది. ఇంతలో పశ్చిమ బెంగాల్ మునిసిపల్ ఎన్నికల చేదు అనుభవం ఎదురైంది.

భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, చైనా-రష్యాల మధ్య బెడిసికొట్టిన సంబంధాల, భారత-చైనా యుద్ధ పరిణామాల నేపధ్యం, భారత కమ్యూనిస్ట్ పార్టీలో 1962 లో చీలికకు దారితీశాయి. నూతనంగా ఏర్పాటైన భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్)-సిపిఎం పార్టీ, సభ్యత్వ సంఖ్యాపరం గాను, ఎన్నికల్లో సాధించిన ఫలితాల పరం గాను, బలీయమైన శక్తిగా గుర్తింపు పొంద సాగింది. పార్టీలో చీలిక వచ్చిన తర్వాత కూడా కొంతకాలం, ఉభయ పార్టీలకు ట్రేడ్ యూనియన్ పరంగా ఒకే ఐక్య వేదిక వుండేది. అప్పట్లో పార్టీలో చీలికైనా, ట్రేడ్ యూనియన్ లో చీలికైనా, సైద్ధాంతిక పరమైన అభిప్రాయ భేదాల వల్ల వచ్చిందే కాని, వ్యక్తిగత కారణాల వల్ల వచ్చింది కాదు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఆస్తులు కూడగట్టుకోడానికి, అంతస్తులు పెంచుకోవడానికి, చట్టసభల్లో ప్రవేశించేందుకు, ప్రవేశించి-బూర్జువా పార్టీకి చెందినవారితో సమానంగా అంతస్తులు పెంచుకునేందుకు, పార్టీ టికెట్ పొందడానికి, కాంట్రాక్టర్ల కొమ్ము కాయడానికి, పార్టీని ఉపయోగించుకునే అలవాటుండేది కాదు. ఏది జరగకూడదని పార్టీ ఆవిర్భావపు రోజుల్లో అనుకున్నా రో, దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుండడంతో, "దిద్దుబాటు ఉద్యమాల" అవసరం కలిగిందనాలి.

1964 లో ఆవిర్భవించిన సిపిఎం, ప్రజా ఉద్యమాలు నిర్వహించడంలో ముందు వరుసలో వుండేది అలనాటి పార్టీ నాయకత్వం కింద. వామ పక్షాలలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. మూడు రాష్ట్రాలలో వామ పక్ష ఐక్య సంఘటన ప్రభుత్వాలకు సారధ్యం వహించే స్థాయికి ఎదిగింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ చేతిలో పశ్చిమ బెంగాల్ మునిసిపల్ ఎన్నికలలో ఘోర పరాజయం పొందినప్పటికీ, అదింకా బలమైన వామ పక్షం అన్న విషయంలో అనుమానం లేదు. అంత మాత్రాన, పార్టీ బలం పది కాలాల పాటు మిగులుతుందన్న ధీమాతో వుండే అవకాశమూ లేదు.

రాజకీయ-సైద్ధాంతిక బలహీనతలను, వ్యవస్థాగత లోటుపాటులను సరి దిద్దుకుని ముందుకు సాగినప్పుడే, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ విప్లవ లక్ష్యాలను సాధించగలదని పార్టీ నాయకత్వం భావించింది. వర్గ ప్రాధాన్యతల సమాజంలో, పాలకవర్గం మాట చెల్లుబాటు కావడమే కాకుండా, దాని ప్రభావం సమాజంపై పడుతుంది. అలాంటి సమాజంలో, బూజుపట్టిన సిద్ధాంతాలను ఇతరులపై రుద్దే ప్రయత్నంలో కమ్యూనిస్ట్ పార్టీని కూడా వదలదు పాలక వర్గం. ఆ ప్రభావానికి లోనైన కమ్యూనిస్టులను దిద్దుబాటులో పయనించేలా చర్యలు నిరంతరం చేపట్టాల్సిన బాధ్యత నాయకత్వానిదే. కాకపోతే, ఆ నాయకత్వంలోని కొందరు అదే మంచిదని ఆ ప్రభావంలో పడిపోతే, కంచే చేనును మేసినట్లవుతుంది.

భారత దేశంలో కమ్యూనిస్టులు అధికారంలోకి రావాలంటే అనుసరించతగిన మార్గాలకు సంబంధించి, ఆదినుంచీ భిన్నాభిప్రాయలుండేవి. ఎవరు నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా వారు మసలుకున్నారు. అంత మాత్రాన అవసరం వచ్చినప్పుడు విమర్శలకు గురికాక తప్పలేదు. 1964 నుంచి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా వున్న మాకినేని బసవ పున్నయ్య, తన బాధ్యతలను విస్మరించి-పోరాట మార్గాన్ని విడనాడి, కేవలం సలహాలు ఇవ్వడానికే పరిమితమై పోయాడని, సాక్షాత్తు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య ఆగస్ట్ 1975 లో పదవికి రాజీనామా చేస్తూ పోలిట్ బ్యూరో-కేంద్ర కమిటీ సభ్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారంటే, అప్పట్లో పెద్దా-చిన్నా తేడా లేకుండా పార్టీకి చెందిన ప్రతివారిని ఎంత నిశితంగా పరిశీలించడం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు... అందరూ.. పార్టీ క్రమశిక్షణకు అతీతులే !

వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట విప్లవ రథ సారధులలో ముఖ్యుడు, సిపిఎం వ్యవస్థాపకుల్లో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య లాగా కమ్యూనిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన వారు అరుదుగా కనిపిస్తారు. ఆయన పేరు చివర నున్న కుల ప్రాధాన్యతను గుర్తుచేసే "రెడ్డి" పదాన్ని శాశ్వతంగా తన పేరునుంచి తొలగించు కోవడంతో పాటు, సమాజ సేవే లక్ష్యంగా జీవించాలన్న తలంపుతో-భార్య అంగీకారంతో, తమకు సంతానం వద్దని నిర్ణయం తీసుకున్నారాయన. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో 1936 లోనే కేంద్ర కమిటీ సభ్యుడైన సుందరయ్య 1948-1952 మధ్య కాలంలో అజ్ఞాతంలో గడిపారు. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడయ్యారు. పార్టీ పక్షాన పార్లమెంటుకు ఎన్నికైన సుందరయ్య గారు, ప్రతిపక్ష నాయకుడి హోదాలో సైకిలెక్కి పార్లమెంటు భవనానికి వెళ్లేవారు. ఇప్పుడేమో స్కార్పియోలకు తక్కువ లేకుండా పార్టీ పక్షాన ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఉపయోగిస్తున్నారు. సిపిఎం ఆవిర్భావం నుంచి 1976 వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సుందరయ్య గారు, దేశంలో ఇందిరా గాంధి అత్యవసర పరిస్థితి విధించిన నేపధ్యంలో, పార్టీ అలవరచుకుంటున్న "అభివృద్ధి నిరోధక అలవాట్ల" కు నిరసనగా రాజీనామా చేశారు.

సుందరయ్య గారు రాజీనామా సమర్పించి పాతిక సంవత్సరాలు కావస్తున్న సందర్భంలో, ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాల తరహా దిద్దుబాటు చర్యలకు, ఏడాది క్రితం పార్టీ కేంద్ర కమిటీ సూచించిన దిద్దుబాటు చర్యలకు మధ్యనున్న తేడాను, కమ్యూనిజం కోణంలోంచి పరిశీలించి చూడాల్సిన అవసరం చాలా వుంది. ఆయన సూచనలను ఆనాడు పరిగణలోకి తీసుకుంటే, ఈనాడు అసలు “దిద్దుబాట” పట్టాల్సిన అవసరమే లేదు. సుందరయ్య గారి రాజీనామా లేఖలో ఇతర అంశాలతో పాటు ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలు మరొక్కమారు మననం చేసుకోవడం మంచిదే మో. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో, "జనసంఘ్" పార్టీతో కలిసి సిపిఎం ఉమ్మడి ఉద్యమాలను చేపట్టడాన్ని ఆయన తప్పు పట్టారు. నిశితంగా విమర్శించారు. జనసంఘ్ తో కలిసిన వారు, ఆ పోకడలను వంట పట్టించుకోక ఎలా వుండగలుగుతారు? పార్టీ వ్యూహాత్మక పంథాను పోలిట్ బ్యూరో చిత్తశుద్ధితో వాస్తవ రూపంలో అమలు పర్చలేకపోవడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. పార్టీని కాదనే శైలిలో ట్రేడ్ యూనియన్ విభాగం పనిచేసే విధానం ఆయనకు నచ్చలేదు. వ్యవసాయిక విప్లవాన్ని ఆచరణలో పెట్టడం విషయంలో అలసత్వం ప్రదర్శించడానికి తాను వ్యతిరేకం అన్నారు. పార్టీ సంస్థాగత ఎదుగుదలకు అవసరమైన రహస్య వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం మంచిది కాదన్నారు. బసవ పున్నయ్య లాంటి కొందరు బాధ్యతలను విస్మరించడంతో సహా, పోలిట్ బ్యూరో సభ్యులు సమష్టిగా పనిచేయకపోవడం-రణ దివే తో తనకు తలెత్తుతున్న తీవ్ర వి బేధాలు కూడా ఆయన ప్రస్తావించారు.

ఒకదానికి మరొక టి పొంతనలేని తరహా రాజకీయ-సంస్థాగత దృక్ఫదంతో సిపిఎం పోలిట్ బ్యూరో వ్యవహార ధోరణి వుండడం తనకు నచ్చడం లేదని స్పష్టం చేశారు సుందరయ్య గారు. తనకే గనుక కనీసం మూడొంతులమంది కేంద్ర కమిటీ సభ్యుల మద్దతు లభించినట్లయితే, పార్టీ కాంగ్రెస్ నిర్వహించి కొత్త ప్రధాన కార్యదర్శిని-పోలిట్ బ్యూరోను ఎన్నుకోవాల్సిందిగా డిమాండ్ చేసేవాడినని ఆయన తన లేఖలో పేర్కొన్నారంటే, ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవాలి. తనకు నచ్చని అంశాలను బహిరంగంగా లేఖలో పేర్కొనకుండా, రాజీ ధోరణిని అవలంభించినట్లయితే, పది కాలాల పాటు పదవిలో కొనసాగ వచ్చునన్న భావన ఆయనకు ఏనాడు రాలేదు. ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ నిర్మాణాన్ని చేసుకుంటూ, చనిపోయేంతవరకు, పార్టీ రాష్ట్ర విభాగం కార్యదర్శిగా పనిచేశారు. ఆయన మరణానంతరం సిపిఎం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే, సుందరయ్య గారి అనుమానాలు నిజమవుతున్నాయనే అనుకోవాలి.

సుందరయ్య గారైనా, బసవ పున్నయ్యైనా, చండ్ర రాజేశ్వర రావైనా, మోటూరి హనుమంతరావైనా, జిల్లా-రాష్ట్ర స్థాయి నాయకులైన చిర్రావూరి లక్ష్మీనరసయ్య అయినా, మంచి కంటి రామ కిషన్ రావైనా, బోడేపూడి వెంకటేశ్వర రావైనా.... ... ఆ మాట కొస్తే, అలనాటి కమ్యూనిస్ట్ నాయకులెవరైనా, కేవలం "పార్లమెంట్ దృక్ఫదం" తోను, "ఎన్నికల అవకాశ వాదం" తోను పనిచేయడం గాని, తద్వారా లభించబోయే లాభాలకు ఆకర్షితులవడం గాని జరగలేదు. వాళ్లకున్నదంతా త్యాగం చేశారే గాని, ఆస్తులు కూడగట్టుకోలేదు. ఇప్పుడదొక అలవాటుగా, సాంప్రదాయంగా మారిపోయింది. అలా మారిందని సాక్షాత్తు పార్టీ కాంగ్రెసే అభిప్రాయపడిందంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

1996 లో పార్టీ రూపొందించిన దిద్దుబాటు ఉద్యమం డాక్యుమెంటుకు కొన్ని సవరణలు చేసి, ఉద్యమాన్ని మరింత పటిష్టంగా అమలు పరిచేందుకు, నూతన విధానాన్ని తయారుచేయాలని కోయంబత్తూర్ లో మార్చ్29-ఏప్రిల్ 3, 2008 లో జరిగిన పంతొమ్మిదవ పార్టీ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. గతంలో పార్టీ నిర్ణయించిన విధంగా, దిద్దుబాటు చర్యలు పటిష్టంగా అమలు చేయడం జరగలేదని, ఆత్మ విమర్శ కూడా చేసుకుంది పార్టీ నాయకత్వం. ఏవో కొన్ని చెదురు-ముదురు సంఘటనలకు సంబంధించిన తప్పొప్పులను సరిదిద్దడం జరిగినా, ఆశించిన మేర ఫలితం కలగలేదని పార్టీ భావించింది. అసలా మాటకొస్తే, దిద్దుబాటు కార్యక్రమం అమలు ప్రక్రియలో అగ్రశ్రేణి నాయకత్వానికి చెందిన పోలిట్ బ్యూరో-కేంద్ర కమిటీ సభ్యులను చేర్చే వ్యవహారంలో బలహీనతలు చోటుచేసుకున్నాయని కూడా పార్టీ అభిప్రాయ పడింది.

గత 12-14 సంవత్సరాల కాలంలో అమలైన దిద్దుబాటు చర్యలు అనుకున్న ఫలితాలు సాధించ లేకపోయిందని పార్టీ భావించింది. సిపిఎం కేడర్లను, లీడర్లను బూర్జువా రాజకీయ పార్టీలనుసరిస్తున్న విధానాలు గతంలోకంటే మరింతగా ప్రభావితం చేస్తున్నాయని, వారు ఆస్తులను సమకూర్చుకోవడంతో పాటు వారి వ్యాపార-వాణిజ్యాలకు తమ రాజకీయ పలుకుబడిని సంధానం చేస్తున్నారని, ఎన్నికలలో పార్టీ పరంగా ధనాన్ని పెద్దమొత్తంలో వ్యయం చేస్తున్నారని, పార్టీ కేంద్ర కమిటీ భావించింది. ఎన్నికల అవగాహన నెపంతో, అభివృద్ధి నిరోధక-బూర్జువా విధాన పార్టీల అలవాట్లను అలవరచుకుంటూన్నారని అగ్ర నాయకత్వం వాపోయింది. 2001 తర్వాత పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్మిక వర్గానికి చెందిన అనేక మందికి పార్టీ పట్ల-ప్రజా ఉద్యమాల పట్ల కనీస అవగాహన లేదని, ఆ పరిస్థితి కొనసాగితే, భవిష్యత్ లో ప్రమాదం వుందని పార్టీ అభిప్రాయ పడింది. కార్మిక వర్గానికి చెందిన వారి శాతం 75 వర కుండగా, కేవలం 30 శాతం మంది మాత్రమే వివిధ కమిటీలలో స్థానం పొందగలుగుతున్నారని, ఇది కూడా బూర్జువా విధానాలకు అనుగుణంగానే వుందని పార్టీ నాయకత్వం భావిస్తున్నది.

గత పది-పన్నెండు సంవత్సరాలలో అవకాశ వాదం, ఆస్తులు సమకూర్చుకునే పద్ధతి, విపరీతంగా పెరిగిపోతున్నదని, ఆంధ్ర ప్రదేశ్ లో దీని ప్రభావం తీవ్రంగా వుందని, పార్టీ నియమావళి ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, తమకు ప్రభుత్వం ద్వారా లభించే జీతాలను-అలవెన్సులను పార్టీకిచ్చే సంప్రదాయం కూడా కొందరు పాటించడం లేదని, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు బాధ్యతల నిర్వహణలో పార్టీని అనుసంధానం చేయడం జరగడం లేదని, ఇవన్నీ పార్టీకి లాభించని విషయాలని కేంద్ర కమిటీ భావించింది. ధన బలం, మద్యం వాడకం, అవినీతి చర్యలు పార్టీలో బాగా పెరిగిఫొయాయని, ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్నికలలో డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారని, పార్టీ నియమ-నిబంధనలను-విలువలను పాటించేవారి సంఖ్య తరిగిపోతున్నదని, పార్టీ సభ్యుల జీవన శైలిలోనే మార్పొచ్చిందని, భవంతుల్లో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడుతున్నారని, వివాహాల్లో విపరీతంగా ఖర్చు చేస్తున్నారని, పండుగలు-పబ్బాలు సమృద్ధిగా జరుపుకుంటున్నారని, ఆదాయానికి మించిన ఖర్చు చేస్తున్నారని, అలాంటి వారిపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ, పార్టీ కమిటీలు చర్యలు తీసుకునే పరిస్థితులు లేవని కేంద్ర కమిటీ దిగులుపడింది.

భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీలో చోటుచేసుకుంటున్న విపరీత ధోరణులు పార్టీని ఎటు వైపుగా తీసుకెళ్తాయో నాయకత్వానికే అర్థం కావాలి. ప్రాణాలను-ఆస్తులను-కుటుంబ బాధ్యతలను లెక్క చేయకుండా, సుందరయ్య గారి లాంటి నాయకులు, పార్టీని పటిష్టం చేశారు. వీర తెలంగాణ సాయుధ పోరాటంలో అల నాడు అంతమంది పాల్గొనడానికి కారణం ప్రజల్లో పార్టీ పట్ల-పార్టీ నాయకుల పట్ల వున్న విశ్వాసమే. క్రమేపీ, ప్రజలకు దూరం కా సాగింది కమ్యూనిస్ట్ పార్టీ. ప్రజలే న్యాయమూర్తులని, వారికే తాము జవాబుదారులమని మరిచిపోతోంది పార్టీ నాయకత్వం. వాస్తవాలన్నీ ప్రజలు గమనించుతున్నారని కూడా గ్రహించలేని స్థితికి పోతుందా పార్టీ అనిపిస్తుంది. పార్టీలో ఏం జరుగుతుందో సామాన్యుడికి తెలిసే అవకాశమే లేదిప్పుడు. దానికి కావాల్సిన యంత్రాంగం లేనప్పుడు, ప్రజలతో సంబంధాలు తెగిపోవడం సహజం. పార్టీ కేంద్ర కమిటీ ఆత్మ విమర్శ చేసుకున్న పద్ధతి నిశితంగా గమనిస్తే, పార్టీ ఎంత ఊబిలో కూరుకుపోయిందో-పోబోతోందో అర్థం చేసుకోవడం కష్టం కాదు. దిద్దుబాటు ఉద్యమం పరిస్థితులను కొంత మేరకు సరిదిద్దగలదేమో గాని, ప్రక్షాలణ చేయడం సాధ్యమవుతుందా? ప్రశ్నార్థకమే.

1 comment:

  1. yawwwwaaaans ((((
    vinee vinee chastunnaam kaani, ee dESamlO kamyoonijam enduku arakora seats techchukunTunnaarO meerO vyaasam raayanDi. vini taristaam.

    ReplyDelete