భారత పునరుజ్జీవన రాజకీయ పర్యవసానమే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం. ఆవిర్భావ కాలం నాటి కాంగ్రెస్, తొలినాళ్లలో కొన్ని దశాబ్దాల పాటు, సమాజంలోని ఉన్నత-మధ్య తరగతి వర్గాల వారినే ఆకర్షించినప్పటికీ, 1905 నాటి స్వదేశీ ఉద్యమం ఫలితంగా, మధ్యతరగతి దిగువనున్న వర్గాల వారినీ కలుపుకుని పోయినప్పటికీ, ఈ నాటికీ, కుల-మతాల విషయం పక్కన పెడితే, ధనవంతుల-బలవంతుల పార్టీగానే మనుగడ సాగిస్తున్నదనవచ్చు. వారసత్వ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగం అనడం అతిశయోక్తి కాదు. కాకపోతే, అధిష్టానం దృష్టిలో, వారసత్వ రాజకీయాలకు ఎవరు అర్హులో-ఎవరు కాదో అనే విషయంలో, సమయానుకూలంగా మారుతూ వుంటుంది. రాజేష్ పైలట్, మాధవరావు సింధియాల పిల్లలకు ఒక నీతి, రాజశేఖర రెడ్డి తనయుడికొక నీతిని ఎంచుకుంది అధిష్టానం. అధిష్టానం బహిరంగంగా చెప్పినా-చెప్పక పోయినా, అడ్డంగా-నిలువుగా తల వూపి, నిమిషానికొక మాట మార్చడం కాంగ్రెస్ నాయకులకు పరిపాటై పోయింది.
జాతీయోద్యమానికి ఎప్పుడైతే మహాత్మాగాంధి నాయకత్వం లభించిందో, అప్పటినుంచి, అశేష జన వాహిని, తారతమ్యాలు మరిచి, కాంగ్రెస్ వెంట నడిచారు. ఏ గాంధి "సత్యాగ్రహం"-"నిరాహార దీక్ష" సిద్ధాంతాలకు అల నాడు కాంగ్రెస్ పట్ల ఆకర్షితులయ్యారో, ఆ సిద్ధాంతమే, నేడు వ్యక్తిగత అవసరాలను నెరవేర్చుకునేందుకు, అదే కాంగ్రెస్ వారసులకు ఆయుధంగా ఉపయోగపడుతున్నదనాలి. మహాత్మా గాంధి రాజకీయ వారసుడు జవహర్లాల్ నెహ్రూ, బ్రిటీష్ వలస విధానాన్ని-సామ్రాజ్య వాదాన్ని తుదముట్టించేందుకు, భారత ప్రజాశక్తిని, కాంగ్రెస్ అనే కవచం కింద కు చేర్చారు. బ్రిటీష్ పాలన అంతరించి, నవ భారత శకం ఆరంభమయిన పిదప, కాంగ్రెస్ రూపురేఖలే మారిపో సాగాయి. నెహ్రూ నాయకత్వంలోనే, భిన్న స్వరాల కాంగ్రెస్ పెద్దలు, మహాను భావుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వతంత్ర ఫలితాలను, తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. కాకపోతే, పార్టీలో సంభవిస్తున్న పరిణామాలను గమనించిన నెహ్రూ సహితం, అన్ని దృక్ఫదాల వారిని కలుపుకుని పోవాలన్న ఆరాటంతో, మౌనంగా, అన్నింటినీ సహించాల్సి వచ్చింది. స్వార్థపర శక్తులు తమ అవసరాలకు ఆ రోజుల్లోనే పార్టీని ఉపయోగించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, విలువలకు కట్టుబడ్డ ఎందరో మహాను భావులు మాత్రం సిద్ధాంత పరంగా ఒకరినొకరు విభేదించారే తప్ప, ఇప్పటి లాగా నిమిషానికొక మాట మార్చలేదు.
స్వాతంత్రోద్యమం నాటి భారత జాతీయ కాంగ్రెస్ కు ఇప్పటి భారత జాతీయ కాంగ్రెస్ (ఐ) కు పోలికే లేదనాలి. అలనాటి కాంగ్రెస్ లో అభిప్రాయ భేదాలకు, మైనారిటీ వ్యక్తుల సూచనలకు గౌరవం లభించేది. ఇక ఇప్పుడో, అధిక సంఖ్యాకుల మద్దతున్న వారికి, ప్రజా బలం వున్న వారికి, అధిక సంఖ్యాకుల ప్రజా ప్రతినిధుల ఆదరణ వున్న వారికి, ఏదో ఒక నెపంతో, పార్టీ దూరం చేసుకుంటున్నది. ఒక నాడు పార్టీ అనుసరించిన మద్యే మార్గం, అతివాద-మితవాద శక్తులను కలుపుకుని పార్టీని పటిష్టం చేయడమైతే, ఈ నాటి మద్యే మార్గం, భిన్నాభిప్రాయాలను వెల్లడించమని పరోక్షంగా అధిష్టానం ప్రోత్సహించడమే. అధిష్టానంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు, అధినేత్రి దగ్గర పలుకుబడిని సంపాదించుకునేందుకు, ప్రత్యక్షంగానో-పరోక్షంగా నో ప్రతి రాష్ట్రంలోని, సమ్మతి-అసమ్మతి వాదులను పురికొల్పడం ఈ నాటి మద్యే మార్గం. కింది స్థాయినుంచి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనని వారిని, స్థానికంగా ప్రజల మద్దతు లేని వారిని, పోటీ చేసి గెలవలేని వారిని, అధిష్టానం దగ్గర చెవులు కొరుకుతూ తిరిగే వారిని చేర దీయడం పార్టీకి అలవాటుగా మారింది. కాంగ్రేసేతర పార్టీలలో ప్రముఖ పాత్ర పోషించి, అన్నీ అనుభవించి, అక్కడ తమ అవసరాలన్నీ తీర్చుకుని, అక్కడ వున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇష్టమొచ్చినట్లు తూలనాడిన వారంతా పార్టీలో ప్రముఖులవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అంటూ గొంతు చించుకుంటున్న వారంతా, ఎప్పుడో ఒకప్పుడు పార్టీని దుయ్యబట్టిన వారో, ఇతర పార్టీలనుంచి వలస వచ్చిన వారో కావడం విశేషం.
స్వర్గీయ పర్వత నేని ఉపేంద్ర తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ కీలకమైన వ్యక్తిగా వుండి, పార్టీ పక్షాన, కేంద్ర మంత్రివర్గంలో ప్రముఖ పాత్ర వహించారు. ఆయన పార్లమెంటులో తనకు వ్యతిరేకంగా మాట్లాడాడన్న నెపంతో, "నీ అంతు చూస్తాను"అని ఒకసారి హైదరాబాద్ పర్యటన కొచ్చిన సోనియా ఉపేంద్రను ఉద్దేశించి అన్నట్లు అప్పట్లో (డిసెంబర్ 22, 1987) పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. స్వయంగా తనను అలా అన్నదని ఉపేంద్ర గారే విలేకరులకు తెలియ చేశారప్పుడు. కానీ, తర్వాత ఏమైంది? అదే ఉపేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధాన భూమిక వహించి, చివరకు కాంగ్రెస్ రాజకీయాల్లోకి తన వారసుడిగా స్వయాన అల్లుడిని తీసుకొచ్చారు. తెలుగుదేశంలో వున్నన్నాళ్లు కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించారాయన. అసలాయన కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కారణం సోనియాగాంధి కాదా ?ఆయన లాగా కాంగ్రెస్ పార్టీని జగన్ విమర్శించలేదే !
ఈ నాడు కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన పదవిలో వున్న జైపాల్ రెడ్డి సోనియా గాంధి భర్త రాజీవ్ గాంధిని అనని మాట లేదు. ఎన్ని రకాల దూషించడానికి వీలుందో అన్ని రకాలుగా, బోఫోర్స్-ఫెయిర్ ఫాక్స్ విషయాల్లో, రాజీవ్ గాంధిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషించారు జైపాల్ రెడ్డి గారు. జనతా పార్టీనుంచి గెలిచి కేంద్రంలో మంత్రి పదవిని అనుభవించారు. మరిప్పుడాయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తి. అదృష్టం కలిసి వస్తే ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ కూడా వుండొచ్చు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో, కాంగ్రెస్ పార్టీలో మొదటి సారి చీలిక వచ్చినప్పుడు, వ్యవస్థాగత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, నంద్యాల లోక సభ స్థానానికి నామినేషన్ కూడా వేసి, రాత్రికి రాత్రే పార్టీ ఫిరాయించి, ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ (ఆర్) పక్షాన గెలిచిన స్వర్గీయ పెండేకంటి వెంకట సుబ్బయ్య సంగతేంటి ? అంతెందుకు సాక్షాత్తు ఇందిరా గాంధి మీద ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వీరేంద్ర పాటిల్ కాంగ్రెస్ (ఐ) లో చేరి తన స్థానాన్ని బల పర్చుకోలేదా ? తెలంగాణ ప్రజా సమితి పేరుతో కాంగ్రెస్ ను ధిక్కరించి, ఎన్నికల్లో పోటీ చేసి, పది మందికి పైగా అభ్యర్థులను పార్లమెంటుకు గెలిపించుకున్న స్వర్గీయ మర్రి చెన్నా రెడ్డిని అధిష్టానం ఏం చేయ గలిగింది. ఒక్క సారి కాదు ... కనీసం మూడు సార్లు ఆయన అధిష్టానాన్ని ధిక్కరించారు. ఇంతెందుకు.. ఎన్నికలు జరిగిన ప్రతి సారి, టికెట్ దొరకని పలువురు నేతలు, ఇండిపెండెంటుగా పోటీ చేయడం, ఆరేళ్లు బహిష్కరించ బడడం, స్వగృహ ప్రవేశం చేయడం, లోగడ కంటే, మంచి పదవులు పొందడం తెలిసిన విషయమే.
జగ్జీవన్ రాం, ఎన్డీ తివారి, అర్జున్ సింగ్ లను కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయగలిగింది ? శరద్ పవార్ గురించి ఏమనాలి ? సోనియా గాంధి విదేశీయ తను తెర పైకి తెచ్చిన మొదటి వ్యక్తి ఆయన కాదా ? ఇవ్వాళ ఆయన లేకపోతే భారత జాతీయ కాంగ్రెస్ మనుగడే లేదు. మమత బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ను కాదనే ధైర్యం సోనియా గాంధీకి వుందా? తమిళ నాడులో పీవీ నరసింహా రావు పొత్తుల నిర్ణయానికి వ్యతిరేకంగా "తమిళ మానిల కాంగ్రెస్" ను స్థాపించి, పార్లమెంటుకు ఎన్నికై, కాంగ్రేసేతర ప్రభుత్వంలో ప్రధాన కేంద్ర మంత్రిత్వ శాఖను నిర్వహించిన చిదంబరం కాంగ్రెస్ క్రమ శిక్షణకు లోబడినట్లా ? కాదా? వీరందరి ధిక్కారం కంటే జగన్ ధిక్కారం గొప్పదా?
జగన్ పట్ల కాంగ్రెస్ అధిష్టానం వైఖరి ఎందుకిలా వుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం దరిమిలా రాష్ట్రంలోనూ-రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోనూ ఊహించని పరిణామాల నేపధ్యంలో, రోశయ్యకు ముఖ్య మంత్రి పీఠం దక్కింది. జగన్ కు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ (దాదాపు) మద్దతు లభించినా అధిష్టానం మద్దతు కరువయింది. ఒక సమయంలో రోశయ్య మంత్రివర్గంలోని పలువురు బహిరంగంగానే జగన్ పక్షాన నిలిచారు. ఎవరు అవునన్నా-కాదన్నా, అభిమానుల అండ దండలు, గతంలో ఏ కాంగ్రెస్ నాయకుడికి లభించనంత మోతాదులో జగన్ కు లభించాయి. ముఖ్య మంత్రి రోశయ్య గారు తన పీఠాన్ని పదిల పర్చుకునే దిశగా అడుగులు వేస్తున్న సంకేతాలు జగన్ పసిగట్టడంతో, ప్రజలకు చేరువయ్యే దిశగా అతను పావులు కదిలించ సాగాడు. పరోక్షంగా పార్టీ (రాష్ట్రంలో) శ్రేణుల మద్దతు, ప్రత్యక్షంగా ప్రజల-పార్టీ కార్యకర్తల అండదండలు విరివిగా లభించడంతో అధిష్ఠానానికి ఫిర్యాదులు మోయడం మొదలయింది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయ లేని వారు, ఏళ్ల తరబడి పార్టీలో వున్నా పైకెదగ లేక పోయిన వారు, ఈర్ష్యాసూయలకు అలవాటు పడ్డ వారు, రాజ శేఖర రెడ్డిగారి హయాంలో నోరు మెదపడానికి కూడా భయ పడేవారు, అధిష్టానం కనుసన్నల్లో మెలిగే వారు, రోశయ్య గారి దృష్టిలో పడాలనుకునే వారు, ఇలా... ఒక్కో విధంగా.. ఎదురుపడి నిలిచి జగన్ ను ఎదిరించే శక్తిలేని వారందరు, తమ బాణాలను ఆయన పైకి ఎక్కుపెట్టారు. మహ బూబాబాద్ పర్యటనకు పోతున్న జగన్ ను అధిష్టానం ప్రతినిధులు సందిగ్ధంలో పడవేశారే గాని, ఇదమిద్ధంగా పోవద్దని-పొమ్మని చెప్పలేదు. తెలంగాణ వాదం బలంగా వున్న నేపధ్యంలో, ఆయన మహబూబాబాద్ పర్యటన అధిష్టానానికి సాకుగా దొరికింది. అంతవరకు బాగుంది... ఎందుకాయన కోస్తాంధ్ర పర్యటనను అడ్డుకోవాల్సి వచ్చిందో అర్థం కాని విషయం.
చివరకు అధిష్టానం తలవంచక తప్పలేదు. రోశయ్యతోనే అధిష్టానం ఆంతరంగాన్ని బహిష్కరించారు. హైదరాబాద్ లో ఆయన ఉదయం చేసిన ప్రకటనకు విరుద్ధంగా, ఢిల్లీలో ఆయన నోట వేరే మాట పలికించింది అధిష్టానం. బహుశా ముఖ్య మంత్రి రోశయ్య కూడా అధిష్టానాన్ని అర్థం చేసుకోలేక పోతున్నాడేమో ! బహుశా జగన్ కుటుంబ సభ్యులు సోనియాను కలిసినప్పుడే, ఇరువురి మధ్య ఒక అవగాహన కుదిరుండ వచ్చేమో ! జగన్ మీడియాకు రాసిన లేఖ ఆంతర్యం బహుశా, తనకు అయిష్టంగానన్నా సోనియా మద్దతుందని చెప్పడమేనేమో ? జగన్ ధిక్కార ధోరణిని అవలంభించాడని భావించినా, అధిష్టానం చేయగలిగిందేమీ లేదు. కాంగ్రేసేతర పార్టీలలో ప్రముఖ పాత్ర వహించి ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్న వారిని ఏమీ చేయలేని సోనియా, పార్టీని ధిక్కరించి బయటకు పోయి వేరు కుంపటి పెట్టుకున్న వారిపై ఆధార పడ్ద సోనియా, ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ లాంటి చురుకైన యువ నాయకుడిని వదులుకునే సాహసం చేస్తుందా? ఒక వేళ దుస్సాహసం చేస్తే, ఇటు రాష్ట్రంలోను-అటు కేంద్రంలోను పార్టీ సంక్షోభంలో పడదా? అవకాశం కొరకు ఎదురు చూస్తున్న పవార్లు, మమతలు తమ మద్దతును జగన్ కు ఇవ్వకుండా వుంటారా? ఏదేమైనా, రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు ఒకరిపై మరొకరు నిప్పులు కురిపించుకుంటూ మాట్లాడడం పార్టీకి శ్రేయస్కరం కానే కాదు.
No comments:
Post a Comment