Friday, May 18, 2012

క్షీణిస్తున్న పార్లమెంట్ జవాబుదారీతనం: వనం జ్వాలా నరసింహారావు


క్షీణిస్తున్న పార్లమెంట్ జవాబుదారీతనం
నమస్తే తెలంగాణ (15-05-2012)
వనం జ్వాలా నరసింహారావు
భారత పార్లమెంట్ షష్టిపూర్తి జరుపుకుంది. ఆంధ్ర ప్రదేశ్‍కు చెందిన అలనాటి ఇద్దరు తొలితరం పార్లమెంటేరియన్లతో సహా మరో ఇద్దరు మాజీ పార్లమెంటేరియన్లను ఆ సందర్భంగా రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ సత్కరించారు. అరుదైన అరవై ఏళ్ల ప్రస్తానం పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో, 1952 మే నెల 13 వ తేదీ నుంచి నేటి వరకు, భారత పార్లమెంటు, ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ప్రజస్వామ్య దేశపు పార్లమెంటుగా అనేకానేక మేలైన శాసనాలను, ప్రజారంజకమైన చట్టాలను తీసుకొచ్చి తనకంటూ ఒఅక్ గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యేకతను సంతరించుకున్న వ్యవస్థగా గుర్తుచేసుకోవాలి. బాంకుల జాతీయీకరణ, రాజాభరణాల రద్దు, స్థానిక సంస్థలకు సంబంధించిన సవరణలు, సమాచార హక్కు చట్టం లాంటి ఎన్నో శాసనాలను మన పార్లమెంటు చేసింది. ఈ సుదీర్ఘ కొద్ది కాలంలో అది సాధించింది స్వల్పమేమే కాకపోయినా సాధించాల్సింది ఇంకా ఎంతో వుందనేది మాత్రం వాస్తవం.
చట్టాల రూపకల్పనకు సంబంధించి పూర్తి అధికారాలను కలిగున్న ఏకైక వ్యవస్థ పార్లమెంటు. పార్లమెంటు సార్వభౌమాధికారం విషయంలో ఎవరికీ ఏవిధమైన అనుమానాలకు తావు లేదు. అదుపులు అన్వయాలకు లోబడి పార్లమెంటు ప్రజాస్వామ్య వ్యవస్థలైన చట్ట సభలు, కార్య నిర్వాహక అధికారి, న్యాయ వ్యవస్థలు పని చేస్తాయి-చేయాలి. ఈ మూడింటి లో ఒకటి ఎక్కువ మరోటి తక్కువ అనలేం. వాస్తవానికి, రాజ్యాంగానికి లోబడి చట్టాలను చేసే నిర్ణయాధికారం-సార్వభౌమాధికారం, నూటికి నూరుపాళ్లు పార్లమెంటు దే అయినా, ఒక సంస్థగా-వ్యవస్థగా, భారత పార్లమెంటుకు రాజ్యాంగ పరంగా సంక్రమించిన అధికారాలను కార్య నిర్వహణ సంస్థ చేతుల్లో పెట్టడంతో, పరోక్షంగా ఉనికిని కోల్పోతున్న నేపధ్యంలో, భవిష్యత్ లో దాని ప్రధాన బాధ్యతైన జవాబుదారీతనంతో వ్యవహరించడం క్లిష్టమౌతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టయిన పార్లమెంటు ఉభయ సభల, రాజ్యాంగపరమైన శాసనాధికార పర్యవేక్షణా సామర్థ్యం, జవాబుదారీ, క్రమేపీ క్షీణ దశకు చేరుకుంటున్నాయనవచ్చు. జవాబుదారీకి ప్రతీకలుగా, పార్లమెంటులో ప్రవేశ పెట్టి చర్చించాల్సిన వివిధ తీర్మానాలు, రాజ్యాంగ పరమైన పార్లమెంటు పర్యవేక్షణా బాధ్యతలు, సభా సంఘాల పనితీరు లాంటివి, నిర్వీర్యమై పోతున్నాయి. ప్రపంచీకరణ దిశగా దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ, పార్లమెంటు అధికారాలను హరించి వేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న పలు అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించి పార్లమెంటుకు సరైన పర్యవేక్షణ లేదు. ఆ ఒప్పందాల విషయంలో పార్లమెంటు వెలుపల తీసుకున్న నిర్ణయాలు తిరుగులేని విగా వుండడంతో, పార్లమెంటు  ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తోంది. ఎన్నికల ద్వారా రాకుండా బాధ్యతాయుతమైన విధులు నిర్వహించే పలు వ్యవస్థలకు బదలాయించిన అధికారాలపై కూడా పార్లమెంటు పర్యవేక్షణ బలహీనంగా వుంది. అదుపులు-అన్వయాల విషయంలో పార్లమెంటుతో సమానమైన అధికారాలను కలిగున్న కార్య నిర్వహణ వ్యవస్థ తనను శాసించే దిశగా పార్లమెంటు అడుగులు వేస్తోంది. అలానే న్యాయ వ్యవస్థ కూడా పార్లమెంటును ఆదేశించే సందర్భాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. శాసనాధికారాలున్న చట్టసభల పరిస్థితి ఇలా కావడానికి కారణాలను రాజకీయ విశ్లేషకులు, విద్యావేత్తలు, పార్లమెంటరీ అధ్యయన నిపుణులు అన్వేషించే ప్రయత్నం చేశాయి.
శాసన సంబంధమైన ప్రక్రియలో జాప్యం జరుగుతున్నదనే సాకుతో, చట్టాల రూపకల్పన-నిర్ణయాధికారం కలిగిన పార్లమెంటు, చట్టం స్థానంలో "ఆర్డినెన్సుల" ను తెచ్చేందుకు, కార్య నిర్వహణ వ్యవస్థకు (నిర్వహణాధికారికి-ప్రధానికి), అధికారాలను కట్టబెడుతూ పోవడం, భారత పార్లమెంటుకున్న అతి పెద్ద బలహీనతనాలి. మరో విధంగా చెప్పుకోవాలంటే, ఎగ్జిక్యూటివ్ అధికారాలను సమీక్షించే విషయంలో పార్లమెంటు నిష్ఫలత స్పష్టంగా కనిపిస్తోంది. పెరుగుతున్న సామాజిక అవసరాలకు-ఆధునిక పార్లమెంటరీ పద్ధతులకు అనుగుణంగా వ్యవహరించగల సామర్థ్యం-అభిరుచి చాలామంది పార్లమెంటు సభ్యులలో అంతగా లేకపోవడం కూడా జవాబుదారీ క్షీణించడానికి దోహదపడుతోంది. రోజు-రోజుకు పుట్టుకొస్తున్న రాజకీయ పార్టీలు సంస్థాగతంగా పటిష్ఠంగా వ్యవహరించలేక పోవడం, ఆ పార్టీల ప్రతినిధులు స్థానిక అవసరాల దృష్ట్యా చట్ట సభలకు ఎన్నిక కావడంతో, పార్లమెంటు సమిష్టి కార్యాచరణకు అవరోధాలు కలుగుతున్నాయి. జవాబుదారీ తనం తగ్గడానికి ఇది మరో కారణం.
పార్లమెంటు నిర్వర్తించాల్సిన విధులను, దానంతటదే పరిత్యజించడం ఆశ్చర్యకరమైన అంశంగా పరిగణించాలి. ఎన్నికల-పార్టీల రాజకీయాల కారణాన తప్పనిసరిగా తలెత్తే పరిస్థితులు, చట్టాల రూపకల్పనలో అలసత్వం-ఆలశ్యం జరగడానికి దోహదపడుతున్నాయి. పార్లమెంటు సభ్యులు, సరైన కారణాలు లేకపోయినా, చట్ట సభలో అవరోధాలు కలిగించి శాసన ప్రక్రియను ఆలశ్యం చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, క్రమం తప్పకుండా ఎన్నికలు జరగడం, శాంతియుతంగా అధికార మార్పిడి జరగడం, నిష్పాక్షికంగా వ్యవహరించే స్వతంత్ర న్యాయ వ్యవస్థ రూపు దిద్దుకోవడం, చైతన్యవంతమైన పౌర సమాజం బలీయం కావడం లాంటివి భారత దేశ ప్రజాస్వామ్యాన్ని కొంత మేరకైనా పటిష్టం చేశాయి. తరతరాలుగా, గుత్తాధిపత్యంతో కొందరు మాత్రమే రాజ్యాధికారం చలాయించే స్థితిలో వుండే భారతీయ సమాజంలో, నెమ్మదిగా సామాజిక చైతన్యం-విప్లవం వస్తుందని, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాధమిక హక్కులు కాపాడబడతాయని, సార్వజనీన ఓటు హక్కు మార్పుకు సంకేతమని భావించిన దేశ పౌరుల నమ్మకం వమ్మైందని అనాలి. తమ ఓటు హక్కు ద్వారా గెలిపించిన ప్రజా ప్రతినిధులుండే చట్ట సభల (పార్లమెంట్-శాసన సభలు) పని తీరు అసంతృప్తికి గురి చేస్తున్నాయన్న భావన కలుగుతోంది పౌరులకు.
భారత దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో చోటుచేసుకుంటున్న వైఫల్యాలకు-సాఫల్యాలకు, పార్లమెంటు బాధ్యత ఎంతనేది చర్చనీయాంశం. పార్లమెంటు పనితీరుకు సంబంధం లేకుండా, ప్రజాస్వామ్యం మనుగడ సాగే వీలు లేదు. అదే విధంగా పలు ప్రజాస్వామ్య సంస్థల పని తీరు కూడా పార్లమెంటు నిర్వహణా విధానంపైనే ఆధార పడి వుంటుంది. తమకు టికెట్ ఇచ్చి అవకాశం కలిగించిన రాజకీయ పార్టీల ఆలోచనా సరళి-ప్రభావం, పార్లమెంటు సభ్యులపై ప్రస్ఫుటంగా వుంటుంది. ఈ నేపధ్యంలో, తప్పైనా-ఒప్పైనా, అర్హతల-యోగ్యతల దృష్ట్యా కాని, నిబద్ధత దృష్ట్యా కాని, పార్లమెంటేరియన్ పనిలో నాణ్యత క్షీణిస్తున్నదనే నిపుణుల అభిప్రాయం. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లతో పోల్చి చూస్తే, ఈ నాటి పార్లమెంటు సభ్యులలో చాలా మంది విద్యార్హతలు ఉన్నత స్థాయిలో వున్నప్పటికీ, ఎన్నికైన వారిలో గణనీయమైన సంఖ్యలో, నేరచరిత్ర కలిగినవారు కూడా వుండడంతో, దాని ప్రభావం కూడా పార్లమెంటు పనితీరుపై పడుతోంది.
భారతీయ ఓటర్లు తమదైన ప్రత్యేక శైలిలో, వారి-వారి ప్రాధాన్యతలను బట్టి, రాజకీయ అనుబంధాలకు అనుగుణంగా, మారుతున్న పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ, ఎన్నుకునే విభిన్న మనస్తత్వాల కలగూరగంప పార్లమెంటు-అందునా ప్రత్యేకించి లోక్ సభ. మామూలు సాదాసీదా అభ్యర్థులను ఓటర్లు గెలిపించిన సందర్భాలు, యోధానుయోధులను మట్టి కరిపించిన ఉదాహరణలు కోకొల్లలు. ఒక గుర్తింపు పొందిన రాజకీయ పక్షాన పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలిచిన వ్యక్తి, పార్టీ వీడిన మరు క్షణం ఘోరంగా ఓటమి పాలైన సందర్భాలున్నాయి. ఎన్ని పార్టీలు మారినా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా, అఖండమైన మెజారిటీతో గెలిచిన వారూ వున్నారు. ఎవరిని, ఎప్పుడు ఎందుకు భారతీయ ఓటరు గెలిపించుతాడో-ఓటమి పాలు చేస్తాడో తెలుసుకోవడం అంత సులువైన విషయం కాదు. ఇలాంటి ప్రాధాన్యతలే, పార్లమెంటుకు గెలిచే అభ్యర్థుల సామాజిక కూర్పును ఒక్కో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేసరికి మారుస్తున్నది. ఒక నాడు ఆంగ్ల విద్యను అభ్యసించ గలిగిన లాయర్లు, అగ్రకులాలకు చెందిన విద్యావేత్తలు, ధనవంతులు మాత్రమే పార్లమెంటులో అడుగు పెట్టగల సత్తా వుండేది. కాలం మారింది. ధన బలం, అంగ బలం, కుల బలం వున్న అన్ని సామాజిక వర్గాల వారితో సహా, రిజర్వేషన్ల మూలాన, వెనుక బడిన వర్గాలకు, షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డు తెగలకు చెందిన వారు కూడా పార్లమెంటుకు-చట్ట సభలకు ఎన్నిక కాగలుగుతున్నారు. మహిళలకు ఇంకా రిజర్వేషన్లు కలిగించ లేకపోవడంతో, అనుకున్నంత మంది ఎన్నికవడం లేదు. మొత్తం మీద, మారుతున్న సామాజిక-ఆర్థిక-రాజకీయ పరిస్థితులకనుగుణంగా, వైవిధ్యంతో కూడిన సామాజిక ప్రయోజనాలను ప్రతిబింబించే విభిన్న వ్యక్తులతో పార్లమెంటు ఏర్పాటవుతోందిప్పుడు.
ఇందిరా గాంధి హయాంలో 1975 లో విధించిన అత్యయిక పరిస్థితి, భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత విషాద సంఘటనగా పేర్కొనాలి. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా తీసుకున్న దురదృష్టమైన నిర్ణయమది. అంతకు ఐదారు సంవత్సరాల క్రితం నుంచే, కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు బలమైన ముఠా నాయకులు, రాజకీయంగా లబ్ది పొందాలని పట్టుదలతో, జాతి ప్రయోజనాలను భంగం వాటిల్లే విధంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం మొదలైంది. అదే క్రమంలో, కాంగ్రెస్ పార్టీతో సహా పలు రాజకీయ పార్టీలు సంస్థాగతంగా బలహీన పడడం, పార్లమెంటులోకి అడుగు బెట్టే రాజకీయ పార్టీల సంఖ్య ఒక నాటి ఐదు నుంచి సుమారు నలభైకి పెరగడం, ఒక సారి గెలిచిన వ్యక్తి మళ్ళీ గెలుస్తారో-లేదో అన్న అపనమ్మకంతో, "ఆయారం-గయారాం" రాజకీయాలకు ఒడిగట్టడం, పార్లమెంటు వ్యవస్థ జవాబుదారీ కుదించసాగాయి.
రాజ్యాంగ, ఆర్థిక, పాలనా పరమైన అధికారాలున్నప్పటికీ, పార్లమెంటు మౌలిక లక్ష్యం, చట్టాలను రూపొందించడం. రాజ్యాంగాన్ని సవరించే ఏకైక శక్తి పార్లమెంటు. పన్నులు విధించాలన్నా, నిధులు ఖర్చు చేయాలన్నా, పార్లమెంటు ఆమోదం తప్పని సరి. ఇంత పటిష్టమైన అధికారాలు కలిగిన పార్లమెంటును, 1975 లో ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో, పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకుంది ఎగ్జిక్యూటివ్. ఎమర్జెన్సీ విధింపుతో సమాంతరంగా, ప్రాధమిక హక్కులను హరించి వేసే, రాష్ట్రపతి ఉత్తర్వులకు పార్లమెంటు ఆమోద ముద్ర వేయించుకో కలిగింది ఇందిరా గాంధి. అవిశ్వాస తీర్మానాల ద్వారా, ఇతర రకాలైన సభా తీర్మానాల ద్వారా, రాజ్యాంగ పరంగా సంక్రమించిన అధికారాలతో ప్రభుత్వాలను ఇబ్బందికి గురిచేయగల పదునైన ఆయుధాలు, తమ చేతులో వుంచుకున్న ప్రతి పక్షాలు సహితం, పార్లమెంటును జవాబుదారీగా వుంచడంలో విఫలమవుతున్నాయి. ఒకప్పుడు అధికారంలో కొచ్చిన రాజకీయ పార్టీలు కూడా, ప్రతిపక్ష పాత్ర సక్రమంగా పోషించలేక పోవడానికి కారణం, సంస్థాగతంగా సరైన నిర్మాణం లేకపోవడమే.
పార్లమెంటులో శాసన నిర్మాణానికి అంచలంచలుగా ప్రక్రియ వుంది. బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత, ముసాయిదాను చర్చకొరకు పరిశీలించేందుకు తక్షణమే ఓటింగు పెట్టవచ్చు. లేదా, ప్రవేశపెట్టిన సభా సభ్యుల సెలెక్ట్ కమిటీకి కాని, ఉభయ సభల సంయుక్త సెలెక్ట్ కమిటీకి కాని పంపవచ్చు. ప్రజాభిప్రాయ సేకరణకొరకు కూడా పంపవచ్చు. కాకపోతే ఈ ప్రక్రియ అరుదుగా జరుగుతుంటుంది. లోక్ పాల్ బిల్లు విషయంలో, ఈ ప్రక్రియకు అవకాశం వుండొచ్చేమో! సింహభాగం బిల్లులను సెలెక్టు కమిటీలకే పంపి తాత్కాలికంగా చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం. క్లాజు వారీగా బిల్లుపై చర్చ, సవరణల పరిశీలన, సవరణలకు మంత్రివర్గం ఆమోదం-తిరస్కారం, తర్వాత ఓటింగు జరుగుతుంది. సంబంధిత సభలో నెగ్గిన తర్వాత, మరో సభకు పంపి ఇదే ప్రక్రియను అనుసరిస్తారు. ఉభయ సభలలో ఓటింగు తర్వాత, రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపడం జరుగుతుంది. ఆమోదం పొందినంత మాత్రాన యాంత్రికంగా-స్వయం చలనంగా చట్టం కాదు. చాలా సందర్భాలలో (కావాలనే?) మరిచి పోవడంతో, రాజ్యాంగపరంగా జారీ చేయాల్సిన గెజెట్ నోటిఫికేషన్ ఆలశ్యం కావడం, చట్టం కాగితాలకే పరిమితమై పోవడం జరుగుతుంటుంది.
పార్లమెంటు సభా సమావేశాల సమయం క్రమేపీ తగ్గుతోంది. వాయిదా తీర్మానాల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతోంది. అనేక సందర్భాలలో సభ్యులు మూకుమ్మడిగా నిల్చొని, ఎవరేం మాట్లాడుతున్నారో తెలియనందున, సభ నిర్వహణకు అంతరాయాలు కలగడం సభా సమయం తగ్గిపోవడానికి మరో కారణం. రాజ్యాంగపరంగా విధిగా కావాల్సిన "కోరం" లేకుండా కూడా సభను నిర్వహించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి ఒక్కో సారి. విధి లేని సందర్భాలలో సభాపతి వాయిదా మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తోంది. పార్లమెంటు సభ్యులకు తమ నియోజకవర్గ ఓటర్లతో నిరంతరం సంబంధాలుండడం తప్పనిసరి. నియోజక వర్గానికి పోవడం చేస్తున్నారు కాని, తమకు కేటాయించిన నియోజకవర్గ అభివృద్ధి నిధులను సక్రమంగా ఉపయోగించుకోలేక పోతున్నారు. దురదృష్టవశాత్తు, నియోజకవర్గానికి చెందిన పలువురి దృష్టిలో ఎంపీ అంటే, తమకు కావాల్సిన సొంత పనులు చేసిపెట్టే మనిషి మాత్రమే అన్న అభిప్రాయం వుంది. పార్లమెంటు సభ్యులకు కూడా వారి అవసరం వుండడంతో, వారు కూడా దానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. వెరసి ఇవన్నీ కూడా, జాతీయ ప్రాముఖ్యత సంతరించుకున్న అంశాలపై వారు శ్రద్ధ వహించకుండా వ్యవహరించేందుకు దోహద పడుతున్నాయి. జవాబుదారీ లోపించడానికి ఇవి కూడా కారణాలవుతున్నాయి.
భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుందేమో కాని, ఆ వ్యవస్థకు మూలస్థంభమైన పార్లమెంటు జవాబుదారీ ప్రశ్నార్థకంగా మారిపోతోంది.

ఎన్సీుటీసీ ఏర్పాటు వ్యవహారంలో తప్పుడు సంకేతాలిచ్చిన చిదంబరం: వనం జ్వాలా నరసింహారావు


ఎన్‍సీటీసీ ఏర్పాటు వ్యవహారంలో తప్పుడు సంకేతాలిచ్చిన చిదంబరం
సూర్య దినపత్రిక (12-05-2012)
వనం జ్వాలా నరసింహారావు
"జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం"-ఎన్‍సీటీసీ ఏర్పాటు వ్యవహారాన్ని కూలంకషంగా చర్చించి అనుకూలమైన నిర్ణయం రాబట్టేందుకు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల ఐదో తేదీన కేంద్ర ప్రభుత్వం ఒక కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో వాడిగా-వేడిగా చర్చలు సాగాయి. ఎన్‍సీటీసీ ఏర్పాటు ప్రతిపాదనపై సీఎంల ఆమోదం పొందేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. తన ముందున్న సమస్త  అవకాశాలను ఉపయోగించుకుంది. వివిధ రాష్ట్రాలలో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్‍సీటీసీ చర్య ప్రారంభించే ముందు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదిస్తామని కేంద్రం హామీ ఇచ్చినా, కాంగ్రేసేతర పాలనలోని రాష్ట్రాలు విశ్వసించడం లేదు. ఎన్‍సీటీసీని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రులకు దానిపట్ల ఉన్న భయాందోళనల్ని తొలగించేందుకు ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌, హోంమంత్రి చిదంబరం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాష్ట్రాల అధికారాలను కబళిస్తుందని, ఫెడరల్‌ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆందోళన చెందిన ముఖ్యమంత్రులు తమ పట్టు వీడలేదు. సమావేశం జరగడానికి ముందే, ఎన్‍సీటీసీ అమలుకు సంబంధించి రెండు ముసాయిదా పత్రాల్ని రాష్ట్రాలకు పంపింది కేంద్రం. ముఖ్య మంత్రులు ఆ ముసాయిదాల్ని చదివితే వారి సందేహాలు చాలావరకు తీరిపోతాయని హోంమంత్రి చిదంబరం భావించారు. ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం అధికారాలు, విధు లేమిటో ఆ ముసాయిదాలలో వున్నాయి. అలాగే ఎన్‍సీటీసీ ఏర్పాటు చేయాల్సిన అవసరం గురించి, ఎన్‍సీటీసీ అమలుచేయబోయే వివిధ సెక్షన్లు ఏంటి అన్నది కూడా ముందస్తుగానే వివరణ ఇచ్చింది కేంద్రం.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సహా పది రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి అభ్యంతరాలు రావడంతో "జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం"-ఎన్‍సీటీసీ ప్రస్తుతానికి ఆగిపోయింది. ముఖ్యమంత్రుల సబ్‌ కమిటీ వేసి.. దాని నివేదిక ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు, ఒడిసా సీఎంలు జయలలిత, నవీన్ పట్నాయక్ డిమాండ్ చేయగా, అసలు ఇది వద్దే వద్దని కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మమతా బెనర్జీ పట్టుబట్టారు. అసలు ఎన్‍సీటీసీ అనేది అక్కర్లేదని చెబుతూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ దాన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకించారు. అరెస్టులు, స్వాధీన అధికారాలతో ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటుచేయడం వల్ల దేశంలోని సమాఖ్య స్ఫూర్తి దారుణంగా దెబ్బతింటుందని, ఇది రాష్ట్రాలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కానందున కేంద్రం దాని ఏర్పాటు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆమె అన్నారు. చివరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన తరుణ్‌ గొగోయ్ కూడా, కొన్ని సవరణలు చేసిన తర్వాత మాత్రమే ఎన్‍సీటీసీని ఆమోదిస్తామని స్పష్టం చేశారు. గుజరాత్ సీఎం నరేంద్రమోడీ లాంటివారి నుంచి దీనికి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. కేంద్రం పురాతన కాలం నాటి వ్యవహారాలు చేస్తోందని, ఎన్‍సీటీసీ ఏర్పాటు వల్ల కేంద్రం అన్ని రాష్ట్రాల్లో పాలిస్తున్నట్లు, రాష్ట్రాలు దానిమీద ఆధారపడినట్లు తయారవుతుందని ఆయన అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్‍సీటీసీని పూర్తిగా సమర్థించారు. ఉగ్రవాదం విషయంలో రాజకీయాలకు అతీతంగా పరస్పర సర్దుబాటు చేసుకోవాలని, భౌతిక సరిహద్దులకు అతీతంగా ఆలోచించినప్పుడే ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కోగలమని ఆయన చెప్పారు.  ఎన్‍సీటీసీని సమర్థించుకోడానికి కేంద్రం యథాశక్తిగా ప్రయత్నించింది. అయినా, విస్తృత ఏకాభిప్రాయం సాధనలో ప్రధాని మన్మోహన్‌సింగ్, హోం మంత్రి చిదంబరం విఫలం కావడంతో ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనను పక్కన పెట్టక తప్పలేదు. కేంద్ర హోం మంత్రి చిదంబరం మానస పుత్రిక ఇక ఇప్పటికి ఇలా కొనసాగాల్సిందే! ఉగ్రవాద నిరోధం అనేది అందరూ పంచుకోవాల్సిన విషయమని, రాజ్యాంగం కూడా ఇదే చెబుతోందని, ఇదే బాధ్యతాయుతమైన మార్గం అని చిదంబరం అంటే, కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఉన్న అధికారాల పంపిణీని మార్చాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని ప్రధాని మన్మోహన్ అన్నారు. ఎన్‍సీటీసీ ఉగ్రవాదాన్ని నిరోధించడానికే గానీ, రాష్ట్రాల అధికారాలను అతిక్రమించేందుకు కాదని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారాయన.
అంటే దానర్థం ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు కేంద్ర హోంమంత్రి చిదంబరం తలపెట్టిన ఎస్‌సీటీసీకి చికాకులు తొలగలేదని. సీఎంల అనుమానాలను నివృత్తి చేయడానికి నిర్వహించిన సమావేశంలో ఏకాభిప్రాయం కుదర లేదనేది స్పష్టమైంది. ముఖ్యంగా కాంగ్రేసేతర పార్టీల సీఎంలు గట్టిగా వ్యతిరేకించారు. దీంతో ఎన్‍సీటీసీ ఏర్పాటు అనిశ్చితిలో పడింది. ముంబయిలో ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత, ఇకముందు ఇలాంటి దాడులు జరగకుండా, ఉగ్రవాదంపై పోరాటానికి "జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం"-ఎన్‍సీటీసీ (నేషనల్‌ కౌంటర్‌ టెర్రరిజం సెంటర్‌) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచించింది. కేంద్ర హోంమంత్రి పి చిదంబరానికి ఎంతో ఇష్టమైన ఈ ప్రాజెక్టుకు ముంబయి దాడుల తర్వాత రూపకల్పన చేశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు నిజానికి మార్చి 1న ప్రారంభం కావలసి ఉంది. కానీ, ఎన్‍సీటీసీ పట్ల భయాలు, సందేహాలు వ్యక్తం చేస్తూ, దీన్ని వ్యతిరేకిస్తూ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రికి రాయడంతో దీనికి బ్రేక్‌ పడింది. "జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం"-ఎన్‍సీటీసీ, ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఒక విభాగంగా పనిచేస్తుంది. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను నిర్వహిస్తుంది. ఉగ్రవాదానికి సంబంధించిన వివరాల్ని సేకరిస్తుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి వివిధ ఏజెన్సీల ద్వారా ఉగ్రవాద సమాచారాన్ని సేకరిస్తుంది. టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. భారతదేశంలో ఎక్కడైనా, ఉగ్రవాదానికి సంబంధించి సోదాలు జరిపేందుకు, అరెస్టులు చేసేందుకు ఎస్‌సీటీసీకి అధికారం ఉంటుంది. అయితే, ఎస్‌సీటీసీకి ఉండే అధికారాలపట్ల రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఎన్‍సీటీసీ వేర్పాటు విషయంలో, రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి నెలలో నిర్వహణ పరమైన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌‍ను విడుదల చేయడం ఒక విధంగా ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధమే. రాష్ట్రాల పరిధిలో ఉండే విషయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం అంత సబబు కాదేమో! ఇలాంటి చర్యలు కేంద్రం-రాష్ట్రాల మధ్య విశ్వాస రాహిత్యాన్ని ఎక్కువ చేస్తుంది. అందుకే వివాదాస్పద జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. కాంగ్రేసేతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు ఈ ప్రతిపాదనను ససేమిరా అంగీకరించడం లేదు. యూపీఏ సంకీర్ణంలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు సైతం తమ వ్యతిరేకతను వెలిబుచ్చాయి. ఈ ప్రాజెక్టును ఎప్పటిలోగా అమలు చేస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నలకు హోం మంత్రి చిదంబరం దగ్గర సమాధానం లేదు. సమాధానాన్ని దాటవేశారు. ఎన్‍సీటీసీ అధికారాల పై ముఖ్యమంత్రులు వెలిబుచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని చిదంబరం తెలిపారు. రాష్ట్రాలపై కేంద్రం ఆధిక్యత పొందటానికి ఇది ఏర్పాటు చేయటం లేదని ప్రధాని మన్మోహన్ ఎంతగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినా, ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించటానికే దేశం చేసే ఉమ్మడి ప్రయత్నాల్లో ఎన్‍సీటీసీ ఏర్పాటు ఒక భాగమని తెలియచెప్పినా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో రాష్ట్రాల సామర్థ్యాలకు ఇది అదనపు బలం చే కూరుస్తుందని నమ్మ బలికినా, ఉగ్రవాదాన్ని నిర్మూలించటంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలని అభ్యర్థించినా ఫలితం కనపడలేదు.
ఏదేమైనప్పటికీ, ఒకటి మాత్రం వాస్తవం. చిదంబరం చెప్పినట్లు, ఉగ్రవాదం ఎదుర్కోవడం తప్పకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యతే. చిదంబరం మాటల్లో అర్థం చేసుకోవాలంటే, ప్రధాని మన్మోహన్ ప్రతిపాదన మేరకే ఎన్‍సీటీసీ ఏర్పాటుకు కేంద్రం సమాయత్తమయింది. ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉగ్రవాదులు సరిహద్దులను గుర్తించరు. దేశ రక్షణ కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిందే. అదే విధంగా, ప్రతిపక్షాలు- ప్రభుత్వం, పౌర సమాజ సంస్థలు-ప్రభుత్వ సంస్థలు కలిసి పనిచేసినప్పుడే, దేశానికి మరింత రక్షణ కల్పించడానికి వీలవుతుంది. అందులో సందేహం ఏ మాత్రం లేదు. అదే కాకుండా, చిదంబరం చెప్పినట్లు, ఉగ్రవాద కేసులు నమోదయినప్పటికి, సామర్థ్యం-నిర్ణయాత్మక శక్తి లోపించటంతో భద్రత ఏజెన్సీలు క్రియాశీలంగా పనిచేయలేక పోతున్నాయి.  ఈ పరిస్థితులలో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలంటే జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం ఆవశ్యకత ఎంతైనా వుంది. ఎన్‍సీటీసీ రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఉగ్ర వాదాన్ని తిప్పికొట్టే బలమైన వ్యవస్థగా రూపొందాల్సిందే. కాకపోతే, నిఘా సంస్థల సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకుంటూ బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. ఉగ్రవాద నిరోధానికి చేస్తున్న ప్రయత్నాలలో కేంద్ర, రాష్ట్రాల మధ్య వాహకంగా ఎన్‍సీటీసీ పనిచేయాలి. ఎన్‍సీటీసీ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపట్టే రాష్ట్రాలకు అనుబంధంగా పనిచేయాలి. జాతీయ భద్రతకు తీవ్రవాదం అత్యంత ముప్పుగా పరిణమించుతున్న నేపధ్యంల్లోనే, జాతీయ, రాష్ట్రాల స్థాయిలో సమర్ధవంతమైన తీవ్రవాద వ్యతిరేక యంత్రాంగం ఏర్పాటు సముచితమే.
ఇంత సముచితమైన, సహేతుకమైన నిర్ణయాన్ని, దేశ బధ్రత దృష్ట్యా తీసుకొస్తున్న ఈ చట్టాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలకు-ముఖ్యంగా కాంగ్రేసేతర రాష్ట్ర ప్రభుత్వాలకు, సరైన పద్ధతిలో వివరించడంలో కేంద్ర హో మంత్రి చిదంబరం పూర్తిగా విఫలమయ్యారు. ఆ మాటకొస్తే ఈ ఒక్క విషయంలోనే కాదు చిదంబరం అలా విఫలమవుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాని, అధిష్టానం వైఖరిని కాని సంబంధిత వ్యక్తులకు, రాజకీయ పార్టీలకు వివరించడంలోనూ చిదంబరం పూర్తిగా విఫలమయ్యారు. చంద్రబాబు నాయుడు తనను కలిసిన విషయాన్ని, తెలంగాణ వ్యవహారాన్ని తనతో సంప్రదించిన విషయాన్ని విశదీకరించడంలోనూ తప్పుడు సమాచారాన్ని సాక్షాత్తు పార్లమెంటుకే అందచేసిన ఘనత చిదంబరానిది. చిదంబరమే కనుక, ఉగ్రవాద నిరోధానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను, జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం ఆవశ్యకతను సరైన రీతిలో, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయానా వివరించి వున్నట్లైతే ఈ సమస్య తలెత్తేదే కాదు. భవిష్యత్‍లో ఎన్‍సీటీసీ అమలు జాప్యమైనా, అసలు చట్టంగా రాలేకపోయినా దానికి పూర్తి బాధ్యత చిదంబరానిదే. అందుకే ఎన్‍సీటీసీ ఏర్పాటు వ్యవహారంలో తప్పుడు సంకేతాలిచ్చిన చిదంబరం ఇప్పటికైనా జాగ్రత్త వహించి తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చే చర్యలు చేపట్టాలి. End 

Sunday, May 13, 2012

Athirathram-2012 at Etpaka Village: Vanam Jwala Narasimha Rao


Athirathram the world's oldest surviving 4000-year old fascinating, complex and the greatest Vedic Ritual was performed as per the Vedic Ritual hierarchy from Saturday the 21st April 2012 to Wednesday the 2nd May 2012 at Etpaka Village near Bhadrachalam in AP. 
About 15 Lakhs of people visited the Yajnashala and did Pradakshina during the time. Free Meals was provided to each and every one symbolizing social equality. Seetarama Kalyanam was performed during the time on one of the days at the site witnessed by a lakh of people.
On the last day when Poornahuti was performed the yajnasala was set to fire and lakhs of people did pradakshina at the time.
These are few photographs taken at the time. 
Jwala

Jwala in front of Yagasala

 
 Jwala in front of Yagasala

 Bricks brought from Kerala arranged in Garudakara

 Jwala with Deputy Speaker Bhatti Vikramarka

 Yagasala set to fire on 12th day-Poornahuti
 Yagasala set to fire on 12th day-Poornahuti

 Visaitors sitting in front of yagasala on 12th day evening

With Governor of AP while giving Yaga Prasadam

Saturday, May 5, 2012

Athirathram Yajna Prasadam given to Governor AP


PVRK Prasad and Jwala Narasimha Rao 
handing over Yajna Prasadam to Governor



Governor releasing Yajna Vaibhavam Special Issue

Saturday, April 7, 2012

"చేతులు" కలిసినట్టేనా?: వనం జ్వాలా నరసింహారావు




సూర్య దినపత్రిక (07-04-2012)


వనం జ్వాలా నరసింహారావు

మొత్తం మీద అంతా అనుకున్నట్లు గానే-అనుకున్న విధంగానే జరిగింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య తలెత్తిన వివాదాన్ని గులాం నబీ ఆజాద్ తనదైన అధిష్టానం దూత శైలిలో ప్రస్తుతానికి సమసిపోయేట్లు చేశారు. ఇకపై వారిద్దరిలో ఎవరు కూడా ఒకరికంటే మరొకరి అధికులు కారని, ఇద్దరూ ఆజాద్‍ కనుసన్నలలో పనిచేయాలని నిర్ణయం జరిగినట్లు మీడియా కధనాలొచ్చాయి. తగాదా లేకుండా కలిసిమెలిసి పనిచేయాల్సిన వారిద్దరూ, అనవసరంగా ఒకరితో మరొకరు తగవులా డి, తానెక్కువంటే తానే ఎక్కువని కయ్యానికి కాలుదువ్వి, చివరకు, ఇద్దరూ తక్కువనే రీతిలో ఆజాద్ కింద పనిచేయాల్సిన స్థితికి చేరుకున్నారు. రాజీ కుదిరించే మార్గంలో, ఆజాద్ పదే-పదే మేడం ప్రస్తావన తీసుకొచ్చారు. ఆమె గారు కిరణ్-బొత్సలపై కోపంగా వున్నారని కూడా చెప్పాడు. త్వరలో జరగబోయే ఉపఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి ధీటుగా పోటీ ఇవ్వకపోతే. వారిద్దరితో పాటు తానూ ఇంటిదారి పట్టాల్సి వస్తుందని కూడా హెచ్చరించినట్లు వార్తలొచ్చాయి. పనిలో పనిగా కిరణ్ కుమార్‌కు మరికొన్ని పాఠాలు కూడా చెప్పారట. అదే విధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల పేర్ల జాబితా తయారుచేసి తన ఆమోదం కొరకు పంపాలని బొత్సకు సూచించారు. నామినేటెడ్ పదవుల పందేరాలు మొదలెట్టాలని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం విషయంలో ఉపముఖ్యమంత్రితో, బొత్సతో చర్చించాలని సీఎంను ఆదేశించారు. ఉపఎన్నికలలో విజయం సాధించడానికి, నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. అంటే, ఇక అంతా ఆజాద్ పాలనే కొనసాగనున్నదన్న మాట! ఏదేమైనా, తామంతా ఒకటే జట్టు అని, అంతా కలిసి కట్టుగా వుంటామని బొత్స-కిరణ్ ప్రకటించడం గమనించాల్సిన విషయం!

ఈ తతంగం నమ్మాలంటే, బొత్స-కిరణ్ "కలిసి పోయారని" భావించాలంటే, కనీసం ఒక్క సారన్నా, వారిద్దరూ ఢిల్లీకి "కలిసి పోవాలి". అదెలాగూ జరుగదు కనుక వీరిద్దరి మధ్య రాజీ తాత్కాలికమే! దానికి ఉదాహరణగా, ఏసిబి లో చోటుచేసుకుంటున్న పరిణామాలనే తీసుకోవాలి. బాధ్యతాయుతమైన పదవిలో వున్న ఒక ఏసిబి అధికారిని పదోన్నతిపై బదిలీ చేయడం, ఆయనను రిలీవ్ చేసేది లేనేలేదని ఆయన పై అధికారి అనడం, అవసరమైతే తానే శెలవుపై వెళ్తాననడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోక్యంతో సర్దుమణిగినట్లే కనిపించి మరింత వివాదానికి దారి తీయడం, ఇదంతా జరుగుతుండగానే బొత్స మనుషులు అనుకున్న తెల్ల రేషన్ కార్డుల వారిపై మరి కొన్ని దాడులు జరగడం, కిరణ్‌కు-బొత్సకు మధ్య రాజీ పెట్టిందే కాని అతుక్కున్నది కాదని అర్థం చేసుకోవడానికి అవకాశం కలిగిస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు సంక్షోభం వచ్చినా, అది కేవలం వచ్చినంత వేగంగా సర్దుమణగడానికేనేమో అనిపిస్తుంది. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి కూడా ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వుంది. అదే మళ్లీ మరో మారు జరుగుతోందిప్పుడు. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, దామోదర రాజనర్సింహ మధ్య చిచ్చు పుట్టినట్లే పుట్టి, వెంటనే ఆరినట్లే ఆరిపోయింది. కనీసం పైకన్నా అలా జరిగింది. ఇక ముసళ్ల పండుగ ముందుందా? ప్రస్తుతానికి కథ కంచికేనా? అంటే దానికి సమాధానం అంత తేలిగ్గా దొరికేది కాదు. మొత్తం మీద అధిష్టానం ముగ్గురినీ ఢిల్లీకి పిలిచి, పెట్టాల్సిన చివాట్లు పెట్టి, పనిలో పనిగా గుంజాల్సినంత గుంజి, తలంటు పోసి, రాజకీయ రాజీ కుదిర్చి, ఇక ఇప్పటికిది చాలులే అని హైదరాబాద్‌కు సాగనంపారు. అధిష్టానానికి కావాల్సింది రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మధ్య, దాని కనుసన్నలలో కొనసాగే వైరం కాని, సయోధ్య కానే కాదన్న సంగతి, కిరణ్‍కూ, బొత్సకూ, దామోదరకూ తెలుసు. అందుకే వారు ఈ తతంగాన్ని పెద్ద శిక్షగా కానీ, అభిశంసనగా కానీ భావించడం లేదు. వెళ్లిన పని ఇప్పటికి ఐందికదా అని ఊపిరి పీల్చుకుని తిరుగు ప్రయాణం అయ్యారు.

ఇంతకూ రాష్ట్ర కాంగ్రెస్-సంబంధిత రాజకీయాలలో ఏం జరుగుతోంది? ఏం జరుగబోతోంది? కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేతగా ఏడాదిన్నర కింద కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసి, ముఖ్యమంత్రిగా ఇన్నింగ్స్ ప్రారంభించమని అనడం వెనుక కొంత నేపధ్యం వుండి తీరాలి. ఆ నేపధ్యం ఆయనంటే గిట్టనివారికి ప్రతికూలంగా వుండి వుండాలి. ఆ ప్రతికూలతే, ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పుడో-ఎప్పుడో ఒకప్పుడు ఆశించిన వారికి, మధ్య మధ్య గుర్తుకొస్తుండవచ్చు. దాని పర్యవసానమే, కిరణ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తికి కారణమై వుండి వుండవచ్చు. ఇంతకీ ఆ నేపధ్యం ఏమై వుండవచ్చు?

రాజశేఖర రెడ్డి అకాల మరణంతో సుమారు మూడేళ్ల కింద రాష్ట్ర రాజకీయాలలో, అందునా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో, అర్థంకాని శూన్యత హఠాత్తుగా చోటుచేసుకుంది. ఆయన స్థానంలో, అంతటి పటిష్టమైన నాయకుడు అప్పట్లో (ఆ మాటకొస్తే ఇప్పటికీ!) ఎవరూ అధిష్టానానికి కనపడలేదు. ఆయన వారసుడుగా వద్దామనుకున్న పటిష్టమైన (వై ఎస్ జగన్మోహన్ రెడ్డి?) నాయకుడు అధిష్టానానికి పనికి రాలేదు. మధ్యేమార్గంగా, సీనియారిటీని తెర పైకి తెచ్చి, అనధికారికంగా రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో "నంబర్ టు" గా వున్న రోశయ్యను ముఖ్యమంత్రిని చేసింది అధిష్టానం. అది గిట్టని వారు గింజుకున్నారు-గొణిగారు కాని అసంతృప్తి స్థాయికి ఎదగలేదు. మధ్యలో జగన్ గొడవ కొంత సాగింది. ఆయనకు మద్దతు ప్రకటించిన అనేక మంది మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారానికి రామని కూడా మారాం చేశారు. రోశయ్యగారు, ఆయనకు మద్దతుగా అధిష్టానం దూతలు, నయానో-భయానో నచ్చ చెప్పి, అప్పట్లో-ఆ తరువాత ఒక ఏడాది కాలం పాటు అసంతృప్తిని ఎవరి గుండెలలో వారే పదిలంగా వుంచుకునేట్లు చేయగలిగారు. అడుగడుగునా అధిష్టానం పేరు చెప్పుకుంటూ రోశయ్య, అత్యంత భారంగా, ఒక ఏడాది పాటు పదవిలో వుండగలిగారు. తన సీనియారిటీకి రాష్ట్ర రాజకీయాలు తగవని నిర్ధారించుకున్న మరుక్షణం, రోశయ్య అత్యంత గౌరవ ప్రదంగా, స్వచ్చందంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని, అనతి కాలంలోనే గవర్నర్‍గా స్థిరపడిపోయారు. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలని ఆలోచన చేసిన అధిష్టానం దృష్టికి వచ్చిన పేర్లలో, ఆసక్తికరంగా, కిరణ్ కుమార్ రెడ్డి ముందు వరుసలో నిలబడ్డాడు. ఆయన ముఖ్యమంత్రి కావడం, పరిశీలనలోకి వచ్చిన ఇతర పేర్లలో ఒకరు ఉప ముఖ్యమంత్రి కావడం, మరొకరు దరిమిలా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కావడం అందరికీ తెలిసిందే. ఐతే, అందరిలోకి కిరణ్ కుమార్ రెడ్డికి ఎందుకు ఎక్కువ మార్కులొచ్చాయి?

ఈ ప్రశ్నకు సమాధానం అంత సులువు కాదు. ఐనా దొరకబుచ్చుకున్నారు విశ్లేషకులు. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో సభ్యులు కానివారికి మొదటి ప్రాధాన్యత ఇద్దామనుకుంది అధిష్టానం. దానికి సరైన కారణం లేకపోలేదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన చేసిన భూపందేరాలలాంటి అనేకానేక అవినీతి వ్యవహారాలు ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పవన్న భావనలో వుంది అధిష్టానం. ఆ వ్యవహారం బయటపడిన తరువాత, కేవలం అది రాజశేఖర రెడ్డితోనే ఆగదని, అది ఆయన మంత్రివర్గంలో పనిచేసిన అందరి మెడలకీ చుట్టుకుంటుందని అధిష్టానం నమ్మింది. ఆ క్రమంలోనే రోశయ్యను తప్పించినప్పుడు, వైఎస్‌కు సన్నిహితుడిగా వున్నప్పటికీ, ఆయన మంత్రివర్గంలో సభ్యుడు కాని కిరణ్ కుమార్ రెడ్డిమీద కు దృష్టి మరల్చింది. వాస్తవానికి అదే బొత్సకు మైనస్ పాయింట్ అయింది. ఇక దామోదర రాజ నరసింహకు రాకపోవడానికి కారణం ఆయన తెలంగాణ నేపధ్యమే! ఆ నేపధ్యమే ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. ఇంతవరకూ బాగానే వుంది కాని, ఆ తరువాత జరుగుతున్న కథే అర్థం కావడం లేదు అధిష్టానానికి. తమవాడనుకున్న కిరణ్ కుమార్ రెడ్డి తామనుకుంటున్న తరహాలో-మోతాదులో, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోవడం లేదన్న అనుమానం రాసాగింది. బొత్సను రంగంలోకి దింపింది. ఆయన కూడా వైఎస్ జగన్‌ను డీ కొట్టడానికి బదులు కిరణ్‌తో తల పడ్డాడు. ఇక దామోదర రాజనర్సింహ ఎందుకు పెంచుకున్నాడో-ఏమో కాని ఆయన కూడా కిరణ్ కుమార్ రెడ్డి మీద ద్వేషం పెంచుకున్నాడు. ఈ ముగ్గురి మధ్య ఇతరులు తలదూర్చడం మొదలైంది. ఇక శంకర రావు లాంటి వారు, డీఎల్ రవీంద్రారెడ్డి లాంటి వారు ఎలాగూ ఎప్పుడూ వుంటూనే వుంటారు. ఈ నేపధ్యంలో మొదలైంది అవినీతి నిరోధక శాఖ వారి మద్యం ముడుపుల దాడులు. దాంతో వాతావరణం మరింత వేడెక్కింది.

గత ఆరు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సిండికేట్‌ల పైన, ఎక్సైజ్ అధికారుల పైన, శాంతిభద్రతల విభాగం పోలీసులపైన, అవినీతి నిరోధక శాఖ చేస్తున్న దాడుల విషయంలో, మిగతా వారి సంగతి ఎలా వున్నా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పరిస్థితి మాత్రం, అంటకాగుతున్న పెనంలో పెట్టిన వస్తువులాగా తయారైంది. ఆ దాడులకు ప్రధాన బాధ్యుడైన పోలీసు అధికారిని ఆ పోస్టులోంచి తొలగించే దాకా బొత్సకు నిద్దురపట్టలేదనాలి. తనవారనుకున్న వారిపై దాడులకు ప్రేరణ ముఖ్యమంత్రి నుంచేనని ఆయన అనుమానం. ఆ సందర్భంగానే, ఒకానొక సందర్భంలో ఢిల్లీనుంచి ముఖ్యమంత్రికి ఫోన్ చేసి, నిష్టూరాలు ఆడాడని మీడియాలో కధనాలొచ్చాయి. సరే, ఆ తరువాత, బొత్స వాటిని ఆనవాయితీ ప్రకారం ఖండించడం కూడా జరిగింది. ఆ నేపధ్యంలోనే, తనపై వచ్చిన అపవాదునుంచి తప్పించుకోవడానికి, కిరణ్ కుమార్ రెడ్డి, ఏసిబి అదనపు డైరెక్టర్‌ను ఆ స్థానం నుంచి తప్పించారంటున్నారు. ఏదేమైనా మద్యం సిండికేట్‌ల పైనా ఈ పాటికే చాలా లోతుగా దర్యాప్తు జరిగింది. మద్యం సిండికేట్‌ల వెనుక భారీ ఆర్థిక కుంభకోణం వుందని కూడా అనుమానాలు వచ్చాయి. ఎప్పుడైతే సిండికేట్‌ల భాగోతం విజయనగరం జిల్లాకు చేరుకుందో అప్పుడే రాజకీయ దుమారం మొదలైంది. ఆ దుమారంలో కీలక అంశం బొత్స మనుషులుగా చెప్పుకుంటున్న ముప్పై మందికి పైగా తెల్ల రేషన్ కార్డుల వారి పేరుతో షాపులుండడం. సహజంగానే బొత్సకు ఈ వ్యవహారం నచ్చలేదు. అలా మొదలైన బొత్స-కిరణ్ ప్రచ్చన్న-పరోక్ష యుద్ధం ప్రస్తుతానికి వాయిదా పడ్డా, ఇద్దరిలో ఏ ఒక్కరన్నా-లేదా ఇద్దరన్నా పదవి కోల్పోయిందాకా ఆగదనేది అక్షర సత్యం. అందుకే అటు బొత్స ఇటు కిరణ్ ఇద్దరూ కూడా ఆ తరువాత తమ పరిస్థితి ఏంటి అన్న దానిపైనే దృష్టి సారించారని, రాష్ట్రంలో కోల్పోనున్న పదవుల స్థానంలో రాబోయే ఎన్నికలలో వారిద్దరూ లోక్ సభ నుంచి రంగంలోకి దిగాలని ఆలోచిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే, అవసరమైతే ప్రస్తుతం ప్రత్యర్థులని భావిస్తున్నవారి మద్దతును కూడా కూడగట్టే ప్రయత్నంలో వున్నారని ఒక వార్త ప్రచారంలో వుంది. వారిద్దరూ ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం లేదని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల వారితో విచారణ జరిపిస్తున్నది అధిష్టానం అని కూడా వార్త ప్రచారంలో వుంది. పాపం-పుణ్యం భగవంతుడికే తెలియాలి!