Friday, May 18, 2012

ఎన్సీుటీసీ ఏర్పాటు వ్యవహారంలో తప్పుడు సంకేతాలిచ్చిన చిదంబరం: వనం జ్వాలా నరసింహారావు


ఎన్‍సీటీసీ ఏర్పాటు వ్యవహారంలో తప్పుడు సంకేతాలిచ్చిన చిదంబరం
సూర్య దినపత్రిక (12-05-2012)
వనం జ్వాలా నరసింహారావు
"జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం"-ఎన్‍సీటీసీ ఏర్పాటు వ్యవహారాన్ని కూలంకషంగా చర్చించి అనుకూలమైన నిర్ణయం రాబట్టేందుకు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల ఐదో తేదీన కేంద్ర ప్రభుత్వం ఒక కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో వాడిగా-వేడిగా చర్చలు సాగాయి. ఎన్‍సీటీసీ ఏర్పాటు ప్రతిపాదనపై సీఎంల ఆమోదం పొందేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. తన ముందున్న సమస్త  అవకాశాలను ఉపయోగించుకుంది. వివిధ రాష్ట్రాలలో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్‍సీటీసీ చర్య ప్రారంభించే ముందు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదిస్తామని కేంద్రం హామీ ఇచ్చినా, కాంగ్రేసేతర పాలనలోని రాష్ట్రాలు విశ్వసించడం లేదు. ఎన్‍సీటీసీని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రులకు దానిపట్ల ఉన్న భయాందోళనల్ని తొలగించేందుకు ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌, హోంమంత్రి చిదంబరం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాష్ట్రాల అధికారాలను కబళిస్తుందని, ఫెడరల్‌ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆందోళన చెందిన ముఖ్యమంత్రులు తమ పట్టు వీడలేదు. సమావేశం జరగడానికి ముందే, ఎన్‍సీటీసీ అమలుకు సంబంధించి రెండు ముసాయిదా పత్రాల్ని రాష్ట్రాలకు పంపింది కేంద్రం. ముఖ్య మంత్రులు ఆ ముసాయిదాల్ని చదివితే వారి సందేహాలు చాలావరకు తీరిపోతాయని హోంమంత్రి చిదంబరం భావించారు. ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం అధికారాలు, విధు లేమిటో ఆ ముసాయిదాలలో వున్నాయి. అలాగే ఎన్‍సీటీసీ ఏర్పాటు చేయాల్సిన అవసరం గురించి, ఎన్‍సీటీసీ అమలుచేయబోయే వివిధ సెక్షన్లు ఏంటి అన్నది కూడా ముందస్తుగానే వివరణ ఇచ్చింది కేంద్రం.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సహా పది రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి అభ్యంతరాలు రావడంతో "జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం"-ఎన్‍సీటీసీ ప్రస్తుతానికి ఆగిపోయింది. ముఖ్యమంత్రుల సబ్‌ కమిటీ వేసి.. దాని నివేదిక ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు, ఒడిసా సీఎంలు జయలలిత, నవీన్ పట్నాయక్ డిమాండ్ చేయగా, అసలు ఇది వద్దే వద్దని కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మమతా బెనర్జీ పట్టుబట్టారు. అసలు ఎన్‍సీటీసీ అనేది అక్కర్లేదని చెబుతూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ దాన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకించారు. అరెస్టులు, స్వాధీన అధికారాలతో ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటుచేయడం వల్ల దేశంలోని సమాఖ్య స్ఫూర్తి దారుణంగా దెబ్బతింటుందని, ఇది రాష్ట్రాలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కానందున కేంద్రం దాని ఏర్పాటు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆమె అన్నారు. చివరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన తరుణ్‌ గొగోయ్ కూడా, కొన్ని సవరణలు చేసిన తర్వాత మాత్రమే ఎన్‍సీటీసీని ఆమోదిస్తామని స్పష్టం చేశారు. గుజరాత్ సీఎం నరేంద్రమోడీ లాంటివారి నుంచి దీనికి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. కేంద్రం పురాతన కాలం నాటి వ్యవహారాలు చేస్తోందని, ఎన్‍సీటీసీ ఏర్పాటు వల్ల కేంద్రం అన్ని రాష్ట్రాల్లో పాలిస్తున్నట్లు, రాష్ట్రాలు దానిమీద ఆధారపడినట్లు తయారవుతుందని ఆయన అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్‍సీటీసీని పూర్తిగా సమర్థించారు. ఉగ్రవాదం విషయంలో రాజకీయాలకు అతీతంగా పరస్పర సర్దుబాటు చేసుకోవాలని, భౌతిక సరిహద్దులకు అతీతంగా ఆలోచించినప్పుడే ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కోగలమని ఆయన చెప్పారు.  ఎన్‍సీటీసీని సమర్థించుకోడానికి కేంద్రం యథాశక్తిగా ప్రయత్నించింది. అయినా, విస్తృత ఏకాభిప్రాయం సాధనలో ప్రధాని మన్మోహన్‌సింగ్, హోం మంత్రి చిదంబరం విఫలం కావడంతో ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనను పక్కన పెట్టక తప్పలేదు. కేంద్ర హోం మంత్రి చిదంబరం మానస పుత్రిక ఇక ఇప్పటికి ఇలా కొనసాగాల్సిందే! ఉగ్రవాద నిరోధం అనేది అందరూ పంచుకోవాల్సిన విషయమని, రాజ్యాంగం కూడా ఇదే చెబుతోందని, ఇదే బాధ్యతాయుతమైన మార్గం అని చిదంబరం అంటే, కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఉన్న అధికారాల పంపిణీని మార్చాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని ప్రధాని మన్మోహన్ అన్నారు. ఎన్‍సీటీసీ ఉగ్రవాదాన్ని నిరోధించడానికే గానీ, రాష్ట్రాల అధికారాలను అతిక్రమించేందుకు కాదని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారాయన.
అంటే దానర్థం ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు కేంద్ర హోంమంత్రి చిదంబరం తలపెట్టిన ఎస్‌సీటీసీకి చికాకులు తొలగలేదని. సీఎంల అనుమానాలను నివృత్తి చేయడానికి నిర్వహించిన సమావేశంలో ఏకాభిప్రాయం కుదర లేదనేది స్పష్టమైంది. ముఖ్యంగా కాంగ్రేసేతర పార్టీల సీఎంలు గట్టిగా వ్యతిరేకించారు. దీంతో ఎన్‍సీటీసీ ఏర్పాటు అనిశ్చితిలో పడింది. ముంబయిలో ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత, ఇకముందు ఇలాంటి దాడులు జరగకుండా, ఉగ్రవాదంపై పోరాటానికి "జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం"-ఎన్‍సీటీసీ (నేషనల్‌ కౌంటర్‌ టెర్రరిజం సెంటర్‌) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచించింది. కేంద్ర హోంమంత్రి పి చిదంబరానికి ఎంతో ఇష్టమైన ఈ ప్రాజెక్టుకు ముంబయి దాడుల తర్వాత రూపకల్పన చేశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు నిజానికి మార్చి 1న ప్రారంభం కావలసి ఉంది. కానీ, ఎన్‍సీటీసీ పట్ల భయాలు, సందేహాలు వ్యక్తం చేస్తూ, దీన్ని వ్యతిరేకిస్తూ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రికి రాయడంతో దీనికి బ్రేక్‌ పడింది. "జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం"-ఎన్‍సీటీసీ, ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఒక విభాగంగా పనిచేస్తుంది. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను నిర్వహిస్తుంది. ఉగ్రవాదానికి సంబంధించిన వివరాల్ని సేకరిస్తుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి వివిధ ఏజెన్సీల ద్వారా ఉగ్రవాద సమాచారాన్ని సేకరిస్తుంది. టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. భారతదేశంలో ఎక్కడైనా, ఉగ్రవాదానికి సంబంధించి సోదాలు జరిపేందుకు, అరెస్టులు చేసేందుకు ఎస్‌సీటీసీకి అధికారం ఉంటుంది. అయితే, ఎస్‌సీటీసీకి ఉండే అధికారాలపట్ల రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఎన్‍సీటీసీ వేర్పాటు విషయంలో, రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి నెలలో నిర్వహణ పరమైన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌‍ను విడుదల చేయడం ఒక విధంగా ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధమే. రాష్ట్రాల పరిధిలో ఉండే విషయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం అంత సబబు కాదేమో! ఇలాంటి చర్యలు కేంద్రం-రాష్ట్రాల మధ్య విశ్వాస రాహిత్యాన్ని ఎక్కువ చేస్తుంది. అందుకే వివాదాస్పద జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. కాంగ్రేసేతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు ఈ ప్రతిపాదనను ససేమిరా అంగీకరించడం లేదు. యూపీఏ సంకీర్ణంలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు సైతం తమ వ్యతిరేకతను వెలిబుచ్చాయి. ఈ ప్రాజెక్టును ఎప్పటిలోగా అమలు చేస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నలకు హోం మంత్రి చిదంబరం దగ్గర సమాధానం లేదు. సమాధానాన్ని దాటవేశారు. ఎన్‍సీటీసీ అధికారాల పై ముఖ్యమంత్రులు వెలిబుచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని చిదంబరం తెలిపారు. రాష్ట్రాలపై కేంద్రం ఆధిక్యత పొందటానికి ఇది ఏర్పాటు చేయటం లేదని ప్రధాని మన్మోహన్ ఎంతగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినా, ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించటానికే దేశం చేసే ఉమ్మడి ప్రయత్నాల్లో ఎన్‍సీటీసీ ఏర్పాటు ఒక భాగమని తెలియచెప్పినా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో రాష్ట్రాల సామర్థ్యాలకు ఇది అదనపు బలం చే కూరుస్తుందని నమ్మ బలికినా, ఉగ్రవాదాన్ని నిర్మూలించటంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలని అభ్యర్థించినా ఫలితం కనపడలేదు.
ఏదేమైనప్పటికీ, ఒకటి మాత్రం వాస్తవం. చిదంబరం చెప్పినట్లు, ఉగ్రవాదం ఎదుర్కోవడం తప్పకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యతే. చిదంబరం మాటల్లో అర్థం చేసుకోవాలంటే, ప్రధాని మన్మోహన్ ప్రతిపాదన మేరకే ఎన్‍సీటీసీ ఏర్పాటుకు కేంద్రం సమాయత్తమయింది. ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉగ్రవాదులు సరిహద్దులను గుర్తించరు. దేశ రక్షణ కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిందే. అదే విధంగా, ప్రతిపక్షాలు- ప్రభుత్వం, పౌర సమాజ సంస్థలు-ప్రభుత్వ సంస్థలు కలిసి పనిచేసినప్పుడే, దేశానికి మరింత రక్షణ కల్పించడానికి వీలవుతుంది. అందులో సందేహం ఏ మాత్రం లేదు. అదే కాకుండా, చిదంబరం చెప్పినట్లు, ఉగ్రవాద కేసులు నమోదయినప్పటికి, సామర్థ్యం-నిర్ణయాత్మక శక్తి లోపించటంతో భద్రత ఏజెన్సీలు క్రియాశీలంగా పనిచేయలేక పోతున్నాయి.  ఈ పరిస్థితులలో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలంటే జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం ఆవశ్యకత ఎంతైనా వుంది. ఎన్‍సీటీసీ రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఉగ్ర వాదాన్ని తిప్పికొట్టే బలమైన వ్యవస్థగా రూపొందాల్సిందే. కాకపోతే, నిఘా సంస్థల సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకుంటూ బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. ఉగ్రవాద నిరోధానికి చేస్తున్న ప్రయత్నాలలో కేంద్ర, రాష్ట్రాల మధ్య వాహకంగా ఎన్‍సీటీసీ పనిచేయాలి. ఎన్‍సీటీసీ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపట్టే రాష్ట్రాలకు అనుబంధంగా పనిచేయాలి. జాతీయ భద్రతకు తీవ్రవాదం అత్యంత ముప్పుగా పరిణమించుతున్న నేపధ్యంల్లోనే, జాతీయ, రాష్ట్రాల స్థాయిలో సమర్ధవంతమైన తీవ్రవాద వ్యతిరేక యంత్రాంగం ఏర్పాటు సముచితమే.
ఇంత సముచితమైన, సహేతుకమైన నిర్ణయాన్ని, దేశ బధ్రత దృష్ట్యా తీసుకొస్తున్న ఈ చట్టాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలకు-ముఖ్యంగా కాంగ్రేసేతర రాష్ట్ర ప్రభుత్వాలకు, సరైన పద్ధతిలో వివరించడంలో కేంద్ర హో మంత్రి చిదంబరం పూర్తిగా విఫలమయ్యారు. ఆ మాటకొస్తే ఈ ఒక్క విషయంలోనే కాదు చిదంబరం అలా విఫలమవుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాని, అధిష్టానం వైఖరిని కాని సంబంధిత వ్యక్తులకు, రాజకీయ పార్టీలకు వివరించడంలోనూ చిదంబరం పూర్తిగా విఫలమయ్యారు. చంద్రబాబు నాయుడు తనను కలిసిన విషయాన్ని, తెలంగాణ వ్యవహారాన్ని తనతో సంప్రదించిన విషయాన్ని విశదీకరించడంలోనూ తప్పుడు సమాచారాన్ని సాక్షాత్తు పార్లమెంటుకే అందచేసిన ఘనత చిదంబరానిది. చిదంబరమే కనుక, ఉగ్రవాద నిరోధానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను, జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం ఆవశ్యకతను సరైన రీతిలో, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయానా వివరించి వున్నట్లైతే ఈ సమస్య తలెత్తేదే కాదు. భవిష్యత్‍లో ఎన్‍సీటీసీ అమలు జాప్యమైనా, అసలు చట్టంగా రాలేకపోయినా దానికి పూర్తి బాధ్యత చిదంబరానిదే. అందుకే ఎన్‍సీటీసీ ఏర్పాటు వ్యవహారంలో తప్పుడు సంకేతాలిచ్చిన చిదంబరం ఇప్పటికైనా జాగ్రత్త వహించి తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చే చర్యలు చేపట్టాలి. End 

No comments:

Post a Comment