Wednesday, June 27, 2012

రాహుల్ కోసం అధిష్ఠానం కౌటిల్యం!: వనం జ్వాలా నరసింహారావు


రాహుల్ కోసం అధిష్ఠానం కౌటిల్యం!
సూర్య దినపత్రిక (28-06-2012)
వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్న పరిశీలకులు అసలా రాష్ట్రంలో ఏం జరుగుతోందా అన్న మీమాంసతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రత్యేకించి, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను వివిధ కోణాలనుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర-రాష్ట్రేతర విశ్లేషకులకు, ఆ ఫలితాల మర్మం ఏంటో? అన్న చిక్కుముడిని విప్పే పనిలో పడిపోయారానక తప్పదు. ఈ మొత్తం వ్యవహారంలో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చాలా తేలికగా కనిపించవచ్చు కాని వాస్తవానికి అంత చిన్న విషయమేమీ కాదనాలి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతావనికి, ప్రభుత్వ పదవి లేకపోయినా-ప్రధాని కాకపోయినా, మకుటం లేని మహారాణిగా చెలామణి అవుతున్న సోనియా గాంధీ-ఆమె కుమారుడు, ఢిల్లీ పీఠం బావి వారసుడు రాహుల్ గాంధీల ఆధిపత్యం ఏం కాబోతున్నదా అన్న అనుమానం ఈ ఉప ఎన్నిక ఫలితాల ద్వారా కలగక మానదంటునారు ఆ పరిశీలకులు. పాద రసంలాగా ఎగబాకుతున్న యువ నాయకుడు, వైఎస్సార్ తనయుడు, "రెబెల్" వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగు రీతిలో రాజకీయ గుణపాఠం చెప్పి తీరాల్సిందే అన్న పట్టుదలతో యావత్ కాంగ్రెస్ అధిష్ఠానం ముందడుగు వేస్తోంది. తాను నమ్ముకున్న-తననే నమ్ముకున్నారని భావిస్తున్న రాష్ట్ర ప్రజలను "ఓదార్పు యాత్ర" పేరుతో కలవాలనుకున్న జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరిని-తిరుగుబాటు ధోరణిని అల నాడు అధిష్ఠానం సహించే స్థితిలో లేదు. ఆయన కోరుకున్న విధంగా చేయడానికి ఆయనను అనుమతి ఇచ్చినట్లయితే, ప్రజల సానుభూతి-సహానుభూతి పొంది, ఒక ప్రజానాయకుడుగా జగన్ ఎదిగేందుకు దోహదపడుతుందని అప్పట్లో అధిష్ఠానం భావించి, ఆయనకు ముక్కుతాడు వేసే ప్రయత్నం చేసింది. మొన్న జరిగిన ఉప ఎన్నికలను కూడా, తమకు అనుకూలంగా, ఒక ఆయుధంలాగా మలచుకుందామని, జగన్ పార్టీలోకి వలసలను ఆపు చేద్దామని అపోహపడింది అధిష్ఠానం. వీటన్నింటి నేపధ్యం ఒకటే! సామ-దాన-భేద-దండోపాయాలను ఉపయోగించి సోనియా-నెహ్రూ-గాంధీ కుటుంబాల వారసత్వానికి, ఆధిపత్యానికి తిరుగులేని అవకాశం కలిగించి, రాహుల్ గాంధీని ఢిల్లీ గద్దె ఎక్కించడమే! భావి భారత ప్రధానిగా చూడడమే! అది ఇలా సాధ్యపడుతోందా? లేదా? అంటే అది వేరే సంగతి!


అధిష్ఠానంకు ఈ తరహా ఆలోచన రావడం, అమలుచేయడం, కొత్తేమీకాదు. గతంలో కూడా, అధిష్ఠానానికి ఎదురుతిరిగిన మహామహులను-ఉద్దండ పిండాలను నిరంకుశంగా కాల రాసింది. రాజగోపాలాచారిని రాష్ట్రపతి కాకుండా చేయగలిగింది. ఎదురుతిరిగిన వైబి చవాన్ ను, మొరార్జీ దేశాయ్ ని, ఆ మాటకొస్తే ఎంతో మంది అతిరధ-మహారధులను అర్థ రధులుగా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, "సమిష్ఠి నాయకత్వం" అన్న మాటే గిట్టదు అధిష్ఠానానికి. అధిష్ఠానం అంటే ఎవరో కాదు. ఒకనాడు నెహ్రూ అయితే, ఆ తర్వాత ఇందిర, రాజీవ్ (మధ్యలో సంజయ్) లు కాగా ఇప్పుడు సోనియా. ఆ ఏక వ్యక్తుల అభిప్రాయమే ఏకాభిప్రాయం-సమిష్ఠి అభిప్రాయం. ఆ సుప్రీం లీడర్‌కు అంతా సలాం కొట్టాల్సిందే! అడుగుజాడలలో నడవాల్సిందే!వారెంత ప్రజాదరణ కల నాయకులైనా, పరిణితి చెందిన నాయకులైనా, ఎన్ని రకాల శక్తి సామర్ధ్యాలున్న వారైనా, తలవంచక-దాసోహం అనక తప్పదు. అలాంటప్పుడు జగన్ స్థాయి నాయకుడిని, ఆయన ఇష్టం వచ్చినట్లు చేయనివ్వడానికి అధిష్ఠానం ఎలా అంగీకరించుతుంది? అది గతం. ఇక ఇప్పుడో? రెండేళ్ల తరువాత రానున్న సార్వత్రిక ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీకి అంతగా అనుకూలంగా లేని ప్రస్తుత పరిస్థితులలో, మరో ప్రాంతీయ పార్టీని బ్రతికి బట్ట కట్టనిస్తుందా? ఇప్పటికే ఉప ఎన్నిక ఫలితాల ద్వారా, పరువు-ప్రతిష్ఠలను పూర్తిగా కోల్పోయిన కాంగ్రెస్ అధిష్ఠానం, జగన్ పార్టీని మనుగడ చేయనిస్తుందా? పోనీ ఏం చేయగలుగుతుంది? అన్నింటికన్నా ముఖ్యమైంది, పవర్ పాలిటిక్స్ ను అర్థం చేసుకోగలగడం. పవర్ పాలిటిక్స్ ను అనుసరించాలంటే, ఊహ కందని వ్యూహాలను పన్నాలి. వాటికి నైతికత అక్కర లేదు. సోక్రటీస్ దగ్గర నుంచి అరిస్టాటిల్ వరకు వాటి రుచి ఎరిగినవారే.
పవర్ పాలిటిక్స్ అనే ఆట ఆడడంలో ఢిల్లీ అధినాయకత్వానికి తెలియని కిటుకు లేదు. ఆ ఆట ఆడడానికి అనుసరించని నిరంకుశ ధోరణి లేదు. ఆ మాటకొస్తే, భారతీయ సంస్కృతీ-సాంప్రదాయాలలో పవర్ పాలిటిక్స్ అనాదిగా వస్తున్న ఆచారమేనేమో! రామాయణ , మహాభారత కావ్యాలలో, భగవద్గీతలో, చాణక్యుడి అర్థశాస్త్రంలో, కుటిల రాజకీయాల గురించి అనేకానేక విషయాలు చెప్పడం జరిగింది. "నారద మహా మునులు", "మామ శకునిలు", "కౌటిల్యులు" మనకు కనిపించుతారు సందర్భోచితంగా. "నెహ్రూ-ఇందిర-గాంధీ" వారసత్వ సంపదను పదికాలాలపాటు పదిలంగా ఉంచడానికి, కాంగ్రెస్ అధిష్టానం, పురాతన-ఆధునిక కాలపు పవర్ పాలిటిక్స్ ను , అవసరమైతే, జాతీయ అవసరాలను పక్కన పెట్టినా సరే, తమకు అనుకూలంగా మలచుకుంటూ వస్తున్నది. కాకపోతే, అన్నివేళలా అధిష్ఠానం ఆలోచనలు విజయవంతమవుతున్నాయా అంటే, బెడసి కొట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఉప ఎన్నికల ఫలితాలు దానికొక ఉదాహరణ మాత్రమే! ఈ ఆటలో ఏకైక వ్యూహం ఒక్కటే. ఏదో విధంగా రాహుల్‌ను ప్రధాని పీఠం ఎక్కించడమే! దానిని అడ్డగించినవారికి చుక్కలు చూపించే ప్రయత్నం చేయడమే! ఈ పరంపరలో జారి ప్రయోజనాలు దెబ్బతిన్నా పర్వాలేదు.
ఢిల్లీ దర్బారులో జగన్మోహన్ రెడ్డికి "గాడ్ ఫాదర్" గా కొందరు భావిస్తున్న బెంగాల్ దాదా ప్రణబ్ కుమార్ ముఖర్జీ, మరో నెల రోజుల లోపు భారత రాష్ట్రపతి కాబోతున్నారు. వాస్తవానికి, ప్రణబ్ కున్న అనుభవం రీత్యా, పరిణితి రీత్యా, సీనియారిటీ రీత్యా, రాజకీయ స్థితప్రజ్ఞత రీత్యా, ఏ కోణం నుంచి చూసినా, మన్మోహన్ సింగ్‌కు ఆయనే వారసుడు కావాలి. ప్రధాన మంత్రి పదవికి ఆయనకంటే అర్హుడు మరెవ్వరూ లేరనాలి. ఆయన ఆ పీఠాన్ని అధిరోహించితే అడ్డు చెప్పేవారు కాని, చెప్పగలిగేవారు కాని పార్టీలో ఎవరూ లేరు. అందుకే, రాహుల్‍కు దారి సుగమం చేయడానికి ప్రణబ్‌కు మరో విధంగా పదోన్నతి కలిగించి రాష్ట్రపతి పదవి కట్టబెట్తున్నది నెహ్రూ-ఇందిర-గాంధీ వారసత్వం. ఇప్పుడిప్పుడే రాజకీయ పాఠాలు నేర్చుకునేవారు సైతం ఈ కుట్రను అర్థం చేసుకోవడం తేలికే! యుపిఎ భాగస్వామ్య పార్టీల నాయకులు శరద్ పవార్, అజిత్ సింగ్, మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, కరుణానిధి లాంటి కాకలు తీరిన యోధుల పాదాలు చల్లబడేట్లు చేసింది సోనియా నిర్ణయం. ఒకవేళ వీరిలో ఎవరన్నా నోరు మెదిపితే, ఎల్లప్పుడూ వాడే సిబిఐ దర్యాప్తు లాంటి బ్లాక్ మెయిల్ ఆయుధం వారిపై కూడా ప్రయోగించే వీలుందని అందరికీ తెలిసిన విషయమే! ఇక రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదరడానికి అన్నీ అడ్డంకులే. బిజెపి, దాని మిత్ర పక్షాలలో కూడా అలజడి రేగింది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల్లోనే ఏకాభిప్రాయం లేదు. కుదరదు కూడా. ఇక రాష్ట్రం విషయానికొస్తే, జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు బావుటాను ఎదుర్కునేందుకు అధిష్ఠానం తనముందున్న తురుఫ్ ముక్కలన్నింటినీ బయటకు తెచ్చింది. ఎప్పుడైతే పద్దెనిమిది మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యులు పార్టీ ఫిరాయించనున్నారని పసికట్టిందో, అప్పుడే, చిరంజీవిని గుంజుకుంది. కీలకమైన ఉప ఎన్నికల సమయంలో జగన్ జైలు పాలయ్యాడు. ఆయన జైలుకు పోతే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ లబ్ది పొందేందుకు బదులుగా, సానుభూతి పవనాలతో భారీగా నష్టపోయింది. ఓటర్ల మనోగతాన్ని పసికట్టడంలో దారుణంగా విఫలమైంది. విజయమ్మ కన్నీళ్లు వైఎస్సార్ సీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లను సంపాదించిపెట్టాయి. షర్మిల హావభావాలు రాజశేఖర రెడ్డిని తలపించాయి. జగన్ కుటుంబ సభ్యులు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టనుందని కాంగ్రెస్ అధిష్ఠానం ఊహించలేకపోయింది. నష్టం జరిగిపోయింది. ఘోరంగా ఓటమి పాలైంది. పది స్థానాలలో డిపాజిట్ కోల్పోయింది. ఓటు బాంకుకు గండి పడింది. ప్రధాన ప్రతిపక్షం కూడా మట్టి కరిచింది.
జగన్ తల్లీ-కూతురు, గాయపడ్డ కొదమ సింహాలలా ఓటర్ల ముందు రెచ్చి పోయారు. భర్తను పోగొట్టుకుని, కొడుకును జైలు పాలు చేస్తుంటే ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో వున్నాననని విజయమ్మ అంటే, తండ్రిని పోగొట్టుకుని అన్నను జైలులో చూడాల్సి వస్తున్నదని షర్మిల వాపోయింది. ఓటర్లు సానుభూతి విపరీతంగా పోగైంది. మరో పక్కన జగన్‌పై సిబిఐ దర్యాప్తు కూడా ముమ్మరమైంది. దారుణ పరాభవం తప్పదనుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం జాతీయ-రాష్ట్ర స్థాయి కీలకమైన నాయకులను ప్రచార రంగంలోకి దింపింది. గులాం నబీ ఆజాద్, చిరంజీవి, పురంధరేశ్వరి, రేనుకా చౌదరి, వైలార్ రవి లాంటి వారెందరో తమ వంతు పాత్ర పోషించినా ఫలితం శూన్యం. జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు సంవత్సరాలు జైలులోనే వుంటాడన్న ప్రచారమూ జరిగింది. డబ్బు విషయంలో అటు కాంగ్రెస్ పార్టీకి కాని , ఇటు జగన్మోహన్ రెడ్డికి కాని ఎదురే లేదు. "ఓటుకు నోటు" అన్న నినాదం ఓటర్లను కించపరిచే స్థాయి వరకూ పోయింది. నిజంగా డబ్బు ఓట్లను తెచ్చిందా? లేదా? అన్నది ఎవరికి వారే ఊహించుకోవాలి. ఒక్క నెల్లూరు లోక సభ పరిధిలోనే వందల కోట్లు ఖర్చైందని వార్తలొచ్చాయి. పట్టుబడ్డ పైకమే అరవై కోట్లకు పగా వుందంటే ఖర్చైంది ఎంతో అంచనా వేసుకోవచ్చు. కేజీల కొద్దీ బంగారం, లీటర్ల కొద్దీ మద్యం కూడా పట్టుబడింది. ఇంత జరుగుతున్నా, న్యాయస్థానానికి వచ్చేటప్పుడు-పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి కులాసాగా నవ్వుకుంటూ-చేతులు ఊపుకుంటూ వుండడం గమనించాల్సిన విషయం.
ఇదంతా పరిశీలుస్తున్న విశ్లేషకులకు అంతా గమ్మత్తుగా వుంది.

Friday, June 22, 2012

Jwala and Bujji Family Photographs

 Kishan, Kinnera, Yashwin, Jwala, Medha and Bujji

 Kishan, Kinnera, Yashwin, Jwala, Medha and Bujji
 Kishan, Kinnera, Aditya, Parul, Bunti, Vijay, Jwala, Bujji,
Mihira, Kanak, Ansh, Medha and Yashwin
 Kishan, Kinnera, Aditya, Parul, Bunti, Vijay, Jwala, Bujji,
Mihira, Kanak, Ansh, Medha and Yashwin
Kishan, Kinnera, Aditya, Parul, Bunti, Vijay, Jwala, Bujji,
Mihira, Kanak, Ansh, Medha and Yashwin
 Aditya and Parul with Ansh and kanak
 Aditya, Parul, Ansh and kanak with Jwala and Bujji
 Jwala and Bujji
 Vijay and Bunti with Mihira
 Vijay, Bunti and Mihira with Jwala and Bujji
Jwala with Hyndavi

Monday, May 28, 2012

ఒక్క మోపిదేవేనా!: సమిష్ఠి బాధ్యత సంగతేమిటి?: వనం జ్వాలా నరసింహారావు


ఒక్క మోపిదేవేనా!: సమిష్ఠి బాధ్యత సంగతేమిటి?
సూర్య దినపత్రిక (27-05-2012)
వనం జ్వాలా నరసింహారావు

మనసులో చెప్పుకోలేని అనుమానంతో, మే నెల 24 గురువారం ఉదయం తన అధికారిక వాహనంలో దిల్‌కుషా అతిథి గృహానికి రెండో రోజు విచారణకు వచ్చిన రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం అందరూ ఊహించిందే. ఆయన ముఖంమీద ఎప్పుడూ కనిపించే చిరునవ్వు... మాయమైంది! ఆ స్థానంలో ఉత్కంఠ కనిపించింది! ఇక అరెస్ట్ తరువాత కధ మామూలే. ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, ప్రత్యేక కోర్టుకు తరలించడం, కస్టడీకి తీసుకోవడం, దరిమిలా... మంత్రి పదవికి రాజీనామా చేయడం చకచకా జరిగింది. మోపిదేవి మొదట్లో రాజీనామా చేయడానికి విముఖత వ్యక్త పరిచారని, స్నేహితుల సలహా మేరకు రాజీనామాతో పాటు ఒక సుదీర్ఘమైన లేఖను ముఖ్యమంత్రికి రాశారని వార్తలొచ్చాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒత్తిడి వల్లే తాను వాన్ పిక్ వ్యవహారంలో ప్రభుత్వ ఉత్తర్వులపై సంతకం చేసానని, తనకు ఇష్టం లేకపోయినా అల నాడు నెలకొన్న ప్రత్యేక రాజకీయ నేపధ్యంలో ఫైలుపై సంతకం చేయకుండా వుండలేకపోయానని లేఖలో పేర్కొంటూ, తన నిర్దోషిత్వాన్ని బలపరిచేలా అనేక అంశాలను అందులో ప్రస్తావించారు. సహజంగానే ఆయన చేసిన రాజీనామాను ముఖ్యమంత్రి గవర్నర్ ఆమోదం కొరకు పంపడం, ఆమోదించడం జరిగిపోయింది. ఇదింతటితో ఆగుతుందా? ఇరవయ్యారు జీవోలతో సంబంధం వున్న మిగతా ఐదుగురు మంత్రులకు కూడా ఇది చుట్టుకుంటుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశమై పోయింది. మోపిదేవి అరెస్టు అనంతరం అందుబాటులో వున్న మంత్రులతో సమావేశమైన ముఖ్యమంత్రితో ఈ విషయాన్నే సమావేశంలో పాల్గొన్న పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు వార్తలొచ్చాయి. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కన్నేసిన మంత్రుల్లో ప్రత్యేకించి కలవరం పుట్టింది. "ఇలాగైతే మన గతి ఎలా?" అనే ఆందోళన వారంతా ముక్తకంఠంతో వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మంత్రులే అరెస్టయితే, ఇక ప్రభుత్వం పరువు-ప్రతిష్ట ఏం కావాలి? అన్న మీమాంస మొదలైంది. మంత్రులే కటకటాల వెనక్కి వెళితే... సర్కారుకు చేటే అని హెచ్చరించేవరకు వెళ్లారు మంత్రులు. ముఖ్యమంత్రిని నిలదీశారనే అనాలి . పాపం....ఆయన మాత్రం ఏం చేయగలుగుతారు?
మోపిదేవి వెంకటరమణ అరెస్ట్ సబబా? కాదా? ఆయన దోషి అవునా?కాదా? అన్న మీమాంస లేవదీసే ముందు మంత్రి మండలికి, వ్యక్తిగతంగా మంత్రులకు ఏ విధమైన బరువు బాధ్యతలు వుంటాయో చర్చించుకోవడం మంచిది.  రాజ్యాంగం ప్రకారం, రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ముగిసిన వెంటనే, శాసనసభలో మెజారిటీ స్థానాలను పొందిన రాజకీయ పార్టీ-లేదా-సంకీర్ణ కూటమికి చెందిన నాయకుడిని (నాయకురాలిని) ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించడం ఆనవాయితీ. ఆ నాయకుడినే ముఖ్యమంత్రిగా గవర్నర్ నియమిస్తారు. అలా ముఖ్యమంత్రిగా నియమించబడిన వ్యక్తి సూచనమేరకు మాత్రమే, గవర్నర్ ఇతర మంత్రులను, మంత్రి మండలి సభ్యులుగా నియమించడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే, ముఖ్యమంత్రి తనతో "సమాన హోదా కలిగిన ఇతర మంత్రులలో ప్రథముడు" మాత్రమే (First among the equals). ఇక అప్పటినుంచి, విధాన పరమైన ప్రభుత్వ పాలన యావత్తు "మంత్రి మండలి సమిష్టి బాధ్యత" అన్న రాజ్యాంగ ప్రాధమిక సూత్రం ఆధారంగానే జరుగుతుంది-జరిగి తీరాలి. ఈ నిబంధనకు ఎవరూ అతీతులు కాదు. అలా కావడం అంటే రాజ్యాంగ సూత్రాలకు భిన్నంగా నడచుకున్నట్లే! ఇక మంత్రిగా కాబినెట్‌లో చేరిన వ్యక్తికి రెండు రకాల బాధ్యతలుంటాయి. అందులో మొదటిది ఆయనకు అప్పజెప్పిన శాఖాపరమైన దైనందిన బాధ్యత. దానికి పూర్తి బాధ్యుడు స్వయంగా ఆ మంత్రి మాత్రమే. రెండోది విధానపరమైన నిర్ణయాలలో యావత్ మంత్రి మండలి సభ్యులతో పాటుగా సమిష్టి బాధ్యత. అంటే, ఒకటి వ్యక్తిగతమైంది మరొకటి సమిష్టిది. రొటీన్‌గా వెలువడే ప్రభుత్వ ఉత్తర్వుల విషయంలో బాధ్యత మొత్తం తనది, సంబంధిత అధికారి(రులది)ది అవుతుంది. కాబినెట్ నిర్ణయం తీసుకునే ఉత్తర్వుల విషయంలో తనకు, తనతో పాటుగా ఇతర మంత్రులకు బాధ్యత వుంటుంది. దానర్థం, వాన్ పిక్ వ్యవహారంలో, వ్య్తక్తిగతంగాను-సమిష్టిగాను తన బాధ్యత నుంచి మోపిదేవి తప్పించుకునే ప్రసక్తే లేదు. ఆ నిర్ణయం కాబినెట్ నిర్ణయం అవుతే, ఆయనతో పాటు ఇతర మంత్రులకు కూడా బాధ్యత వుండి తీరుతుంది.
          వివరాలలోకి పోతే, స్టాంపులు-రిజిస్ట్రేషన్ చట్టం కింద ఇచ్చిన మినహాయింపులు కాని, వాన్ పిక్ రాయితీల ఆమోదం కాని, భూసేకరణ ముసాయిదాకు అనుమతి కాని, ప్రకాశం-గుంటూరు జిల్లాలలో వేలాది ఎకరాల భూ కేటాయింపు కాని, ఇండియా సిమెంట్స్ కు భూమి లీజుల పొడిగింపు కాని-కృష్ణా నదీ జలాల కేటాయింపు కాని, పెన్నా సిమ్మెంట్స్ కు భూ కేటాయింపు-సున్నపు రాయి గనుల లైసెన్స్ మంజూరు కాని, రఘురాం సిమెంట్స్ వ్యవహారం కాని, సరస్వతీ పవర్ లిమిటెడ్ కు సున్నపు రాయి గనుల లీజు కాని, రాంకీ ఫార్మా సిటీ విషంలో కాని, ఈశ్వర సిమెంట్స్ సంగతి కాని, బ్రాహ్మణి ఇన్ ఫ్రా టెక్ కు సీలింగ్ చట్టం నుంచి మినహాయింపు వ్యవహారంలో కాని విడుదలైన వివాదాస్పద ప్రభుత్వ జీవోలు ఒక విధంగా సంబంధిత శాఖా మంత్రిని వ్యక్తిగతంగా బాధ్యుడిని చేస్తే, మరో రకంగా అదే మంత్రిని ఇతర సహచర మంత్రులతో పాటు సమిష్టి గా బాధ్యుడిని చేస్తాయి. "ముఖ్యమంత్రి సంతకం పెట్టమంటే పెట్టాను కాని తనదేం తప్పు లేద" ని వాదించడం సబబు కాదు. ముఖ్యమంత్రితో పాటు, తనది-తనతో పాటు ఇతర మంత్రులది సమిష్టి బాధ్యత కింద తప్పే!
అందుకే జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో కింది నుంచి పైదాకా చాలామందిది-మంత్రులందరిది తప్పే. జగన్ తో పాటు వీరందరిని విచారించాల్సిందే. మోపిదేవి వెంకటరమణను ఏ విధంగానైతే వాన్ పిక్ రాయితీల ఆమోదం విషయంలో కాని, భూసేకరణ ముసాయిదాకు అనుమతి విషయంలో కాని, ప్రకాశం-గుంటూరు జిల్లాలలో వేలాది ఎకరాల భూ కేటాయింపు వ్యవహారంలో కాని, ఆరోపణలకు గురి చేశారో, అదే విధంగా, మిగతా ఐదుగురు మంత్రులను కూడా, అదే బాట పట్టించాలి. వారందరినీ, సిబిఐ దర్యాప్తుకు పిలిచే లోపుగానే మంత్రి మండలి నుంచి తొలగించాలి. సిబిఐ పిలవడం, విచారణ మొదలవడం, అరెస్ట్ పర్వం ఆరంభమవడం, అప్పుడు రాజీనామా కోరడం కన్నా ఇదే సరైన మార్గం. అంతే కాదు... సమిష్టి బాధ్యత కింద, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన ఇతర మంత్రులందరిని కూడా తొలగించి, మంత్రి మండలిని పునర్వ్యవస్థీకరించాలి. అప్పుడే దీనికి ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. లేకపోతే, ఒక్క మోపిదేవిని మాత్రమే బలి పశువును చేసినట్లవుతుంది.
ఇదిలా వుండగా...ఇక...జగన్ వ్యవహారం...ఇప్పుడిప్పుడే ముదిరి పాకాన పడుతున్నట్లుంది. "విచారణకు పిలిపించిన సీబీఐ ఈనెల 25 జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయొచ్చు" అన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఐతే, సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు ఒకరోజు క్రితం ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో జగన్‌ను అరెస్టు చేసే పరిస్థితి ఉత్పన్నం కాకపోవచ్చనే ఊహాగానాలూ మొదలయ్యాయి. అనుకున్నట్లు గానే 25వ తేదీన న విచారణకే పరిమితం చేసి, 26న కూడా రమ్మని ఆదేశాలిచ్చింది సిబిఐ. వాస్తవానికి, జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ప్రారంభమై తొమ్మిది నెలలు దాటుతోంది. ఈ కేసులో ప్రథమ ముద్దాయి అయిన జగన్ సీబీఐ ఎదుట హాజరు కావడం ఇదే తొలిసారి. కాకపోతే, ఓబులాపురం మైనింగ్ కేసులో గతంలో సీబీఐ ముందుగా సాక్షిగా ఒక సారి హాజరయ్యారు జగన్. "అరెస్టు తప్పదు" అన్న నిర్ణయానికి వచ్చిన జగన్ ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆయన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్టు చేస్తుందనే ఆందోళన ఆయన భయం నుంచే పుట్టిందని, ఈ ఆందోళనకు కారణాలేవీ కనిపించడం లేదని తెలిపింది. కేసు దర్యాప్తు కీలక సమయంలో కూడా జగన్‌ను సీబీఐ అరెస్టు చేయలేదని, మే నెల 28న కోర్టుకు హాజరు కమ్మని సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయనను అరెస్టు చేస్తుందని కోర్టు భావించడం లేదని స్పష్టం చేసింది. అంతే కాకుండా, మధ్యంతర ముందస్తు బెయిల్ ఇస్తే సీబీఐకి జగన్ సహకరించకపోవచ్చేమోనన్న సందేహం కూడా కోర్టు వ్యక్తం చేసింది.
సీబీఐ విచారణకు జగన్ హాజరైన సందర్భంగా అంతా హై డ్రామానే. జగన్ అనుచరులు సీబీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే, "రాజు వెడలె రవి తేజము వెడలె" అన్న చందాన, జగన్ తన బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియోలో విచారణ జరగాల్సిన దిల్ కుషా అతిధి గృహానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని,  టీడీపీ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ఎంవి మైసూరా రెడ్డి కూడా జగన్ నివాసానికి వెళ్లారు. తొలి రోజు విచారణ ముగిసిన తర్వాత జగన్ దిల్ కుషా నుంచి నేరుగా తన నివాసానికి చేరుకున్నారు. అప్పుడు కూడా పెద్దఎత్తున పార్టీ నేతల వాహనాలు ఆయన వాహన శ్రేణిని అనుసరించాయి. విచారణ అనంతరం బయటికి వచ్చిన జగన్... బయట వేచి చూస్తున్న మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. "సీబీఐ విచారణ చాలా కూల్‌గా జరిగింది. సీబీఐ అడిగిన ప్రశ్నలకు వివరణాత్మక సమాధానాలు ఇచ్చాను. రేపు ఉదయం పదిన్నర కు మళ్లీ వస్తున్నాను'' అని మీడియాకు చెప్పారు. ఇంతకీ సిబిఐ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తుందా? చేయదా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదమిద్ధంగా సమాధానం ఇదీ అని అనలేం కాని విశ్లేషణ చేయవచ్చు. తొమ్మిది నెలల పాటు అరెస్ట్ చేయని సిబిఐ ఇప్పుడు జగన్‌ను అరెస్టు చేయాల్సిన ఆగత్యం ఏంటి? అన్న ప్రశ్న ఉదయించక మానదు.
ఏదైనా నేరారోపణ మీద ఒక వ్యక్తిని అరెస్టు చేసే ముందర అరెస్టు అనివార్యమా? కాదా? అన్న విషయాన్ని దర్యాప్తు సంస్థ తప్పక ఆలోచిస్తుంది. ఆ వ్యక్తిని అరెస్ట్ చేయకపోతే, తప్పించుకు పోతాడన్న అనుమానం కానీ, సాక్ష్యాలను తారుమారు చేస్తాడని కానీ, విదేశాలకు పారిపోతాడని కానీ భావించినప్పుడు అరెస్టు చేసి తీరుతుంది. జగన్ కేసు మొదలై తొమ్మిది నెలలు దాటింది. ఆయన మొదటి ముద్దాయి కూడా. ఐనా, ఇంతవరకు ఆయనను, కారణాలేవైనా, అరెస్టు చేయలేదు. పైగా సహ నిందితులను కొందరిని అరెస్టు చేసింది సిబిఐ. వారిలో కొందరిని సుదీర్ఘంగా విచారించింది కూడా. విజయ సాయి రెడ్డి లాంటి వారి బెయిల్ పిటీషన్‌ను కూడా వ్యతిరేకించింది. ఐనా, మొదటి ముద్దాయి జగన్‌ను అరెస్ట్ చేయలేదు. అంటే, అరెస్టు చేయకపోవడానికి బలవత్తరమైన న్యాయపరమైన కారణాలుండి తీరాలి.
ఇదిలా వుంటే, వైఎస్సార్సీపి లోకి వలసల భయం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు తమకు నష్టమేనని ఇరు పార్టీల నాయకత్వాలు విశ్లేషించు కొంటున్నాయి.
(ఈ వ్యాసం ప్రచురించిన నాడే-ఆదివారం సాయంత్రం-జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. ఆ మర్నాడు కోర్టు ఆయనను 14 రోజుల జుడిషియల్ రిమాండు విధించి చంచల్‍గుడా జైలుకు పంపింది)

Tuesday, May 22, 2012

అతిరాత్రం యజ్ఞ నిర్వహణకు సహాయ సహకారాలందించిన వారెందరో....అందరికీ ధన్యవాదాలు: వనం జ్వాలా నరసింహారావు


అతిరాత్రం యజ్ఞ నిర్వహణకు
సహాయ సహకారాలందించిన వారెందరో....
అందరికీ ధన్యవాదాలు
        వనం జ్వాలా నరసింహారావు           
ఆరేడు నెలల క్రితం...నాకు దగ్గర బంధువైన రవిని తీసుకుని, కేసా ప్రగడ హరిహరనాధ శర్మ, ఆయన కుమారుడు రాజశేఖర శర్మ, మరికొందరు మా ఇంటికొచ్చారు. అంతకు రెండు-మూడురోజుల క్రితం ఈ-మెయిల్ ద్వారా నన్ను సంప్రదించారు హరిహరనాధ శర్మ. గత ఏడాది పంజాల్‍లో జరిగిన అతిరాత్రంకు తాను వెళ్ళి వచ్చానని, ఆ యజ్ఞాన్ని తాము కూడా ఎందుకు మన రాష్ట్రంలో చేయకూడదని అనుకున్నామని, ఆ క్రమంలో కేరళలో కొందరిని సంప్రదించామని, వారి సలహా మేరకు నన్ను కలవడానికి వచ్చామని చెప్పారు శర్మ గారు. కారణం అర్థం ఐంది. పంజాల్‍లో జరిగిన యజ్ఞం గురించి నేను రెండు-మూడు వ్యాసాలను రాయడం వల్ల నాకు ఇందులో ప్రమేయం వుందన్న భావనతో వారు నా దగ్గరకు వచ్చారు. నన్ను వారితో కలిసి-మెలిసి పనిచేయాలని కోరారు. అదొక అంది వచ్చిన అదృష్టంలా భావించిన నేను, నా అంగీకారాన్ని తెలిపాను. నాకు చేతనైనంత సహాయాన్ని చేస్తానని, యజ్ఞం పూర్తయ్యేంతవరకు వారితో కల్సి పనిచేస్తానని హామీ ఇచ్చాను. తక్షణమే, రెండు-మూడు రోజుల్లో నాకు బాగా పరిచయమున్న ఆప్తులు దర్శనం శర్మ గారిని, ఆర్.వి.ఆర్ కృష్ణా రావుగారిని, మరో ఇద్దరు-ముగ్గురిని నాకు జతగా అతిరాత్రం పుణ్య యజ్ఞంలో భాగస్తులను చేశాను. అలా మొదలైంది కేవలం పది-పదిహేను మందితో మా అతిరాత్రం ప్రయాణం ఆరేడు నెలల క్రితం. పదిహేను మందితో ఆరంభమైన ఆ కార్యక్రమాన్ని వీక్షించడానికి పదిహేను లక్షల మంది వచ్చారంటే దానికి కారణం అచిర కాలంలోనే సహాయ సహకారాలను అందించిన వారెందరో కావడమే.
అందరిలోకి యాగ రక్షా పురుషుడుగా వ్యవహరించిన కేసా ప్రగడ హరిహరనాధ శర్మ మనో ధైర్యం, సడలని పట్టుదల, కార్యదీక్ష, అవసరమైనప్పుడు "మంకుతనం" బహుశా అతిరాత్రం ద్విగ్విజయంగా పూర్తవడానికి ప్రధాన కారణం అనడంలో అతిశయోక్తి లేదు. మిన్ను విరిగి మీద పడ్డ సందర్భాలలో కూడా ఆయనలో కొంచెమైనా నైరాశ్యం కనిపించలేదు. రూపాయి లేనప్పుడూ, లక్షలొచ్చినప్పుడూ ఒకే మనో ధైర్యం ఆయనలో వుండడం గొప్పగా చెప్పుకోవాలి. ఇక ఆయన కుమారుడు రాజశేఖర శర్మ తన అద్భుతమైన పాండిత్యంతో వెళ్ళిన ప్రతిచోటా-ప్రతివ్యక్తినీ ఆకర్షించు కోవడం నన్ను అబ్బుర పరిచింది. భూదేవికున్నంత ఓర్పు ఆయనది. ఆయనకెన్ని పనులు అప్పగించినా "ఇది నా చేత కాదు" ఆని ఒక్క నాడూ అనలేదు. ఆలశ్యంగానైనా ఆ పని చేసేవాడు. అన్నింటికన్నా మించింది ఆయన కున్న కంప్యూటర్ నాలెడ్జ్. అతిరాత్రానికి సంబంధించినంతవరకు ఆయనే సాఫ్ట్ వేర్, ఆయనే హార్డ్ వేర్ ఇంజనీర్. వెబ్ డిజైనర్ కూడా ఆయనే. అదనంగా అనేకానేక అదనపు బాధ్యతలు.
మాకు తోడుగా మరికొందరిని చేర్చుకున్నాం. స్నేహితుడు కళాధర్ కుమారుడు అనిరుధ్‌ను పబ్లిక్ రిలేషన్స్ అధికారిగా తీసుకున్నాం. అనిరుధ్ ఆ పనీ-ఈ పనీ అని కాకుండా అన్ని పనులు చేయడమే కాకుండా, చివరకు, యజ్ఞం జరిగిన పన్నెండు రోజులు జనరేటర్‌కు కావాల్సిన డీజిల్ సరఫరా బాధ్యతను నెత్తిన వేసుకున్నాడు. అలాగే ఖమ్మంలో వుండే భండారు రమేష్. హైదరాబాద్ లో అనిరుధ్ ఎలాగో, ఖమ్మం జిల్లాలో రమేష్ అలా. జిల్లా అధికారులతో, అనధికారులతో సంప్రదింపులు జరపడం దగ్గర నుంచి, కేరళ నుంచి వచ్చే వారిని భద్రాచలం తీసుకెళ్ళడం లాంటి పనుల వరకు రమేష్ చూసుకునేవాడు.
హైదరాబాద్‌లో మా బృందంలో ప్రధానంగా బాధ్యతలు నిర్వహించింది (నాకు తెలిసినంతవరకు) దర్శనం శర్మ, ఆర్.వి.ఆర్. కృష్ణారావు, బుచ్చయ్య చౌదరి, రమాదేవి దంపతులు, ఆచార్య రాజారెడ్డి ప్రభృతులు. వీరిలో దర్శనం శర్మ ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలానే కృష్ణా రావు, చౌదరిగారు కూడా. ఏదేమైనా మా ఈ చిన్ని బృందంతో పని అయ్యేటట్లు లేదని భావించిన మేము, ఒక కార్య నిర్వాహక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మాజీ టిటిడి కార్య నిర్వహణ అధికారి శ్రీ పీవీఆర్‍కె ప్రసాద్ సారధ్యంలో ఆయన చైర్మన్‌గా, నేను కో ఆర్డినేటర్ గా మరి కొందరు ప్రముఖులతో ఏర్పాటు చేసుకున్నాం సారధ్య సంఘాన్ని. శ్రీయుతులు రమణాచారి, ఎమ్ వీఎస్ ప్రసాద్, కె.ఎస్.శర్మ, సీవిఎస్‍కె శర్మ, శివశంకర రెడ్డి, గోపీనాధ్ రెడ్డి, ఎన్వీఎసెస్ ప్రభాకర్, రాయపాటి సాంబశివరావు, వుండవల్లి అరుణ్ కుమార్, కూనంనేని సాంబశివరావు, రామిరెడ్డి వెంకట రెడ్డి, సత్యవాణి, ఉప్పల శారద ప్రభృతులు సారధ్య సంఘం సభ్యులు. అందరూ ఎవరికి తోచిన సహకారం వారందించారు. పీవీఆర్‍కె ప్రసాద్ గారిని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అనుక్షణం సారధ్య సంఘానికి అసలు సిసలైన నాయకత్వం అందించిన ఘనత ఆయనది. ఆయన అధ్యక్షతన నిర్వహించిన ప్రతి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుకు ఆయనే స్వయంగా మా వెంట వుండేవారు. ప్రభుత్వ ఆర్థిక సహాయం కాని, టిటిడి సహాయం కాని, ఐటీసీ-సింగరేణి కాలరీస్, ఆ మాటకొస్తే, మాకందిన ప్రతి సహాయం వెనుక ఆయన హస్తం ప్రస్ఫుటంగా వుంది. చివరి మూడు రోజులు భద్రాచలంలోనే మకాం వేసి, అను క్షణం జిల్లా యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతూ, పూర్ణాహుతి అయ్యేంతవరకు మా వెంటే వున్న ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. రమణాచారి గారి అధ్యక్షతన కూడా ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఎప్పటికీ మరువలేనిది. అలానే మావెంట వివిధ కార్యాలయాలకు వచ్చిన ఐఎఫెస్ అధికారి శివశంకర రెడ్డి గారు కూడా.
ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మా దాయ శాఖ నుంచి కామన్ గుడ్ ఫండ్ నుంచి రు. 50 లక్షల సహాయం అందించినందుకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి చిత్రారామచంద్రన్‍కు, కమీషనర్ బలరామయ్యకు, మంత్రి సి. రామచంద్రయ్యకు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సంబంధిత ఫైలును చకచకా కదిలించడంలో తోడ్పడిన ముఖ్యమంత్రి ప్రిన్సిపాల్ కార్యదర్శి బినోయ్ కుమార్‍కు, ఆయన ఆంతరంగిక కార్యదర్శులు స్వామి-రంగాచారి గార్లకు ధన్యవాదాలు. ఇక టిటిడి నుంచి పాతిక లక్షల నిధులను మంజూరు చేసినందుకు ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం గారికి, బోర్డు సభ్యులకు ధన్యవాదాలు. టిటిడి మంజూరు చేసిన నిధులను విడుదల చేయించడంలో దర్శనం శర్మ, రాజశేఖర శర్మ తీసుకున్న చొరవను ప్రత్యేకంగా అభినందించాలి.
ఇక భద్రాచలం విషయానికొస్తే,  రామాలయం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కురిచేటి పాండురంగారావు గారు, ఆయన కుమారుడు డీసీఎంఎస్ ఛైర్మన్ రామచంద్రమూర్తి ఒంటిచేత్తో అక్కడి కార్యక్రమాన్ని నడిపించారు. వారి బృందం సభ్యులైన కృష్ణయ్య ప్రభృతులను ప్రత్యేకంగా అభినందించాలి. అన్నదానం విషయంలో వారు తీసుకున్న శ్రద్ధ అజరామరంగా వుండిపోతుంది. మీడియా సహకారం లభించడానికి ప్రధాన కారణం రామచంద్రమూర్తి మాత్రమే.


"ఈవెంటు” ను ఏర్పాటుచేసిన శ్రీనివాసరావు బృందం, ఆ పక్కనే తడికలను ఏర్పాటు చేయించిన భద్రాచలం టెంపుల్ ఈవో బదరీ నారాయణాచార్యులు బృందం, ఇంజనీర్ దయాకరరెడ్డిని అభినందించాలి.
ఖమ్మం జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్, ఎస్పీ హరికుమార్, అడిషనల్ ఏస్పీ గజరాజ్ భూపాల్, పీవో ఐటిడిఏ ప్రవీణ్ కుమార్, సిఐ రామోజీ రమేశ్, ఎస్సై షుకూర్, ఆర్డీఓ పాల్వంచ, ఆర్డీవో కొత్తగూడెం, తహసీల్దార్ నరసింహారావు లకు ధన్యవాదాలు.
చివరిగా...కాకపోతే..అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నదైన, మీడియాకు అతిరాత్రం సారధ్య సంఘం ధన్యవాదాలు తెలుపుకుంటున్నది. మీడియా-ఎలెక్ట్రానిక్, ప్రింట్-వారి సహకారం వల్లే, ఇన్ని లక్షల మందికి తెలియడం, ఇంతమంది ఎటపాక రావడం జరిగింది. మీడియాకు సంబంధించినంతవరకు భద్రాచలంలో రాము చేసిన సమన్వయం మరువలేనిది. అలానే హైదరాబాద్‌లో "సూర్య యాడ్ సిస్టమ్స్", దాని అధినేత సూర్య, మీడియా కోఆర్డినేటర్ కృష్ణమోహన్ చేసిన సహాయం అపూర్వం. ఇక ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే... ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, నమస్తే తెలంగాణ ఛైర్మన్ రాజం ముందు వరుసలో వుంటారు. రెండు రోజులు ఉచితంగా వారిద్దరూ, వారి పత్రికలలో అడ్వర్టైజ్‌మెంట్లు ఇవ్వడం వల్లనే అంతమంది ప్రజానీకానికి అతిరాత్రం గురించి తెల్సిందంటే అతిశయోక్తి కాదు. అలానే భక్తి ఛానల్, ఎన్టీవి, ఐ న్యూస్ ఛానళ్ల ఛైర్మన్ నరేంద్ర చౌదరి గారు కూడా. వారి ఛానళ్లలో నిరంతరం లైవ్ ప్రసారాలు అందించడమే కాకుండా, ఆర్నెల్ల ముందునుంచే అతిరాత్రం ప్రచారానికి శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి వారు. వారికి మా ధన్యవాదాలు. ఇక ఎస్వీబీసీ ఛానల్ అలానే. ఆ ఛానల్ కు, టిటిడి ఈవో సుబ్రహ్మణ్యం గారికి మరోమారు ధన్యవాదాలు.
ఇక అతిరాత్రం యజ్ఞానికి విచ్చేసిన పదిహేను లక్షల మందికి ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చిన ప్రతివారూ, ప్రదక్షిణ చేసి తరించినందుకు మరీ-మరీ కృతజ్ఞతలు. పదిహేను లక్షల మందిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వారూ వున్నారు. మంత్రులు రాం రెడ్డి వెంకట రెడ్డి, రామ చంద్రయ్య, శ్రీధర్ బాబు, రఘువీరారెడ్డి; మాజీమంత్రి జలగం ప్రసాద రావు; మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు; శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క; శాసనమండలి అధ్యక్షులు చక్రపాణి; పార్లమెంటు సభ్యులు హనుమంతరావు, బలరాం నాయక్; శాసనసభ్యులు కుంజ సత్యవతి, తుమ్మల నాగేశ్వర రావు, సండ్ర వెంకట వీరయ్య, కూనంనేని సాంబశివరావు, రేగా కాంతారావు, మిత్ర సేన, అవంతి శ్రీనివాస్; శాసనమండలి సభ్యులు సుధాకరరెడ్డి, బాలసాని, పోట్ల నాగేశ్వరరావు ప్రభృతులున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి, వైస్రాయ్ హోటెల్ యజమాని ప్రభాకరరెడ్డి, కస్టమ్స్-సెంట్రల్ ఎక్సైజ్ కమీషనర్ రఘు చారి, న్యూమరాలజిస్ట్ దైవజ్ఞ శర్మ, ఇతర ప్రముఖులున్నారు. వారందరికీ ధన్యవాదాలు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులున్నారు. సహాయ సహకారాలందించిన వారందరికీ పేరుపేరునా మా ధన్యవాదాలు.

Friday, May 18, 2012

జగన్ ఆస్తులకు ఏం జరుగబోతోంది?: వనం జ్వాలా నరసింహారావు


జగన్ ఆస్తులకు ఏం జరుగబోతోంది?
సూర్య దినపత్రిక (19-05-2012)
వనం జ్వాలా నరసింహారావు
అక్రమ మార్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తులను కూడగట్టుకున్నారంటూ, హైకోర్టు ఆదేశాల మీదకు దర్యాప్తు చేపట్టి కొనసాగిస్తున్న సిబిఐ ఒకటి వెంట మరొక చార్జ్ షీట్ వేసే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టింది. మొదటి చార్జ్ షీట్ కు సంబంధించిన కేసు వ్యవహారంలో ఒక అడుగు ముందుకు వేసి, కోర్టు ద్వారా నిందితులకు సమన్లు జారీ కూడా చేయించింది. సమన్లు అందుకున్న వారిలో సాక్షాత్తు మొదటి ముద్దాయిగా నమోదైన జగన్మోహన్ రెడ్డి కూడా వున్నారు. గత తొమ్మిది నెలలుగా కాశీ-రామేశ్వరం మజిలీ కథలలాగా అంచలంచలుగా మలుపులు తిరుగుతున్న సిబిఐ దర్యాప్తులో కీలకమైన అంశం జగన్‌కు చెందిన సాక్షి పత్రిక, సాక్షి ఛానళ్లను నడుపుతున్న ఆర్థిక సంస్థల అకౌంట్‌లను స్థంబింప చేయడం. సుమారు వారం రోజుల క్రితం సిబిఐ తీసుకున్న ఈ నిర్ణయానికి అనేకులు మద్దతు తెలిపితే, కొందరు మాత్రం ఇదేదో పత్రికా స్వాతంత్ర్యాన్ని హరించుకుని పోయే చర్య అని పబ్లిక్ గానే వాపోయారు. ధర్నాలు, ర్యాలీలు కూడా నిర్వహించారు. ఐనా అంతగా స్పందన రాలేదు. సిబిఐ మరో అడుగు ముందుకు వేసింది. సంబంధిత జగన్ ఆస్తుల జప్తుకు అనుమతిని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేక రాసింది. ఇదిలా వుండగా, సిబిఐ కోర్టులో అకౌంట్ల స్థంభనకు వ్యతిరేకంగా జగన్ దాఖలు చేసిన పిటీషన్‌కు చుక్కెదురవడంతో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.
సాక్షి గ్రూపు సంస్థల బ్యాంక్ ఖాతాలను స్తంభింప చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లు విచారణకు వచ్చాయి. బ్యాంక్ ఖాతాలు (కరెంట్ అకౌంట్స్) స్తంభింప చేయడంవల్ల సంస్థ రోజువారీ కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతోందని, సంస్థల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 20వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారికి నెలసరి వేతనాల కోసం రూ.8కోట్లు, న్యూస్ ప్రింట్ కోసం రూ.20 కోట్లు, పరిపాలన (అడ్మినిస్ట్రేషన్) కోసం రూ.7కోట్లు కలిపి మొత్తం నెలకు రూ. 35కోట్లు వ్యయం అవుతోందని, ప్రకటనలు, పత్రిక అమ్మకాల ద్వారా ఆమేరకు ఆదాయం కూడా ఉందని సాక్షి మీడియా సంస్థల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. హైకోర్టులో విచారణలో భాగంగా, సాక్షి పత్రిక, సాక్షి టీవీల్లో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారో చెప్పాలని, ఇతర ఆదాయ, వ్యయాల వివరాలను తమ ముందు ఉంచాలని జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలను హైకోర్టు ఆదేశించింది. సీబీఐ తమ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. సాక్షి పత్రికలో దాదాపు 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని  కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కింది కోర్టు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండానే తమ పిటిషన్లను తోసిపుచ్చిందని సాక్షి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఐతే, సాక్షిలో 20 వేల మంది ఉద్యోగులు లేరని, కేవలం 4,457 మంది మాత్రమే ఉన్నారని, ఇందుకు సంబంధించిన వివరాలను కార్మిక శాఖ నుంచి తీసుకున్నామని సిబిఐ న్యాయవాది పేర్కొన్నారు. బ్యాంక్ అకౌంట్లు స్తంభింప చేయడం వల్ల ఆ సంస్థలకు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం ఏమీలేదు. నెల మధ్యలోనే ఉంది. ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపులకు ఇంకా చాలా రోజుల సమయం ఉంది. బ్యాంక్ అకౌంట్లు ఎందుకు స్తంభింప చేయాల్సి వచ్చిందో వివరిస్తూ కౌంటర్ వేస్తాం. అందుకు గడువు కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరారు. దీంతో ఉద్యోగుల సంఖ్య, ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచాలని పిటిషనర్లను న్యాయమూర్తి ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు.
ఇదిలా వుండగా, సాక్షి దినపత్రిక, సాక్షి టెలివిజన్లకు ప్రభుత్వ ప్రకటనలను నిలుపుదల చేస్తూ జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో కొంత ఎదురుదెబ్బ తగిలింది. ప్రకటనలు ఆపేస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకటనల నిలుపుదల మార్గదర్శకాలకు విరుద్ధంగా జీవో ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఒకవైపు హైకోర్టులో ఖాతాల స్తంభన వ్యవహారం నడుస్త్రుండగానే, ఖాతాల స్తంభనతో ఈ పాటికే అదరగొట్టిన సిబిఐ మరో అడుగు వేసింది. జగన్ మీడియా ఆస్తులను జప్తు చేసే దిశగా పావులు కదిపింది. ఆ విధంగా ప్రభుత్వాన్ని సిబిఐ కోరడం, దానికి దాదాపుగా అనుమతి లభించడం చకచకా జరిగిపోయింది. తరువాయి భాగం, న్యాయస్థానాల అనుమతి లభించడమే. ఇలా గత రెండు-మూడు రోజులుగా కాశీ మజిలీ కథలో మరికొన్ని కీలక  పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ అక్రమాస్తుల, ఎమ్మార్ కుంభకోణంపై తాము జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఆస్తులను కూడా అటాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐ లేఖ పంపింది. ఈ కేసులతో సంబంధమున్న ఆస్తుల జాబితాను కూడా లేఖతో పాటు జత చేసింది. లేఖ తన దృష్టికి వచ్చిన వెంటనే, ముఖ్యమంత్రి స్పందించారని, నిశితంగా పరిశీలించారని, చట్టపరమైన చర్యలకు అనుమతించారని మీడియా కధనాలొచ్చాయి. ముఖ్యమంత్రి సూచనల మేరకు హో మంత్రి కూడా సంబంధిత ఫైలును పరిశీలించి తగు ఉత్తర్వులు జారీ చేసారని కూడా వార్తలొచ్చాయి. హోంమంత్రి, సీఎం సంతకాలు పూర్తి కావడంతో, అధికారిక కసరత్తు పూర్తయిందని, న్యాయశాఖ నుంచి కొన్ని వివరణలు తీసుకున్నారని, సిబిఐ కోరిన విధంగానే, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్‌ఫ్రా కంపెనీల ఆస్తుల అటాచ్‌ మెంట్‌కు అనుమతి లభించిందని పత్రికలు రాశాయి.  
అసలేం జరుగుతుంది? ఇదింతటితో ఆగుతుందా? ఇంకా ముందుకు సాగుతుందా? ఇంతటితో ఆగితే ఇంత గొడవెందుకు? ఖాతాల స్తంభన నాటినుంచి నేటిదాకా తీసుకుంటే, కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్‍లో జగన్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం-రాష్ట్ర ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించబోతోందో దాఖలాలతో సహా కనిపిస్తోంది. ఖాతాల స్తంభనతో సిబిఐ ద్వారా కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన స్పష్టమైన సంకేతం, ఇక జగన్‌ను ఏ మాత్రం సహించేది లేదని. పార్టీని, చివరకు సోనియాను దూషించినా మౌనం వహించిన అధిష్టానం ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నదంటే దానికి కారణాలు అనేకం వుండవచ్చు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అతి ప్రధానమైన ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్ పేరిట ఒక అసంతృప్తి జ్వాల ఆకాశమంత ఎత్తుకు ఎదిగి, చివరకు, ఇంతై-ఇంతింతై-వటుడింతై అన్న చందాన, యావత్ కాంగ్రెస్ పార్టీనే కబళించి వేసే స్థాయికి ఎదుగుతుంటే చూసి సహించే స్థితిలో అధిష్టానం లేదని నిరూపించాలనుకుందేమో చక చకా ఒకటి వెంట మరొకటి జరిగిపోసాగాయి. మొదట్లో ఒక చిన్న సమిధ అనుకున్న జగన్, పక్కలో బల్లెం అయిపోయాడు. ఇక లాభం లేదనుకున్న అధిష్టానం, ముఖ్యమంత్రిని, బొత్స సత్యనారాయణను, చిరంజీవిని ఉమ్మడిగా-కలిసి కట్టుగా రంగంలోకి దింపింది రాజకీయ పరంగా. ఒకవైపు వారి ముప్పేట రాజకీయ దాడి సాగుతుండగానే, మరొక వైపు ఆర్థిక మూలాలపై సిబిఐ దాడిని పురికొల్పింది అనుకోవాలి. ఎంత స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఏజన్సీ అని సర్ది చెప్పుకున్నా కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో మెలిగేదే కదా సిబిఐ!
జగన్‌కు ఎన్ని ఆస్తులున్నా తరగని ఆస్తి-ఆయన తండ్రి ఆలోచించి ఈయన చేతికిచ్చిన అపురూపమైన ఆస్తి "సాక్షి" పత్రిక, "సాక్షి" చానల్. జగన్ ఎప్పుడు, ఎక్కడ, ఏం చేసినా, ఏం చేయదల్చుకున్నా, అతనికి అనుకూలంగా ప్రచారం చేసే ఏకైక సాధనం ఆ రెండూను. జగన్ మీద ఎక్కడ ఈగ వాలినా, ఆ ఈగ వివరాలను తుచ తప్పకుండా అఖిలాంధ్ర ప్రేక్షకులకు, శ్రోతలకు, పాఠకులకు తెలియచెప్పే పదునైన ఆయుధం అది. ఆ రెండింటినీ ఎంతో ఆలోచించి మరీ జగన్‌కు సమకూర్చాడు రాజశేఖరరెడ్డి. జగన్ మిగిలిన ఆస్తుల వ్యవహారంలో, ప్రభుత్వం ఏ విధమైన జోక్యం చేసుకున్నా గొంతు చించుకుని అరిచే ఈ ఆయుధాలను నిరుపయోగం చేయకపోతే, ప్రయోజనం లేదనుకుంది కేంద్ర ప్రభుత్వం-దాని కనుసన్నలలో నడిచే సిబిఐ. అది తప్పా-ఒప్పా అంటే యుద్ధం మొదలైతే, ధర్మం-అధర్మం అనేవి రెండూ సమానమే అన్న నానుడి ఇక్కడ వర్తింప చేసుకోవాలి. అందుకే, గురిచూసి మరీ దెబ్బ కొట్టింది సిబిఐ. మూడింటి లో చార్జ్ షీట్లు, ఒక చార్జి షీట్లో సమన్లు, మరో వ్యవహారంలో ఖాతాల స్తంభన, ఈ లోపుగా మరో చార్జ్ షీట్. వెంట-వెంట మరికొన్ని చార్జ్ షీట్లు. ఇదే వ్యూహం. ముప్పేట దాడి. ఊపిరి సల్పుకోకుండా దాడి. దెబ్బమీద దెబ్బ. కోలుకునే లోపుగా మరో దెబ్బ. దెబ్బ తెలియకుండా మరో దెబ్బ. దిమ్మ తిరిగి పడిపోయీ-పడిపోకుండా దెబ్బ. ఇదీ పరిస్థితి.
ఖాతాల స్తంభనతో, తన వెంట జర్నలిస్టు సంఘాలను చేర్చుకుంది జగన్ మీడియా. పత్రికా స్వాతంత్ర్యానికి ముప్పు వాటిల్లిందని వారితో ప్రచారం చేయించింది. పాత్రికేయులు రోడ్డున పడ్డారని వారితో గగ్గోలు పెట్టించింది. వాస్తవానికి పత్రికా స్వాతంత్ర్యానికి ఖాతాల స్తంభనకు సంబంధమే లేదు. జగన్ అక్రమంగా ఆస్తులను సమకూర్చుకున్నారని, అలా సమకూర్చుకున్న ఆస్తులతో పత్రికను, ఛానల్‌ను పెట్టారన్న ఆరోపణతో ఖాతాల స్తంభన జరిగింది. పత్రికలో ఫలానాది రాయాలనో-రాయొద్దనో ఆంక్షలు విధించితే అది పత్రికా స్వాతంత్ర్యానికి భంగం వాటిల్లినట్లవుతుంది కాని ఖాతాల స్తంభన ఎలా అవుతుంది? సమాధానం ఇవ్వకపోగా ఎదురుదాడికి దిగారు మద్దతు దార్లు. దెబ్బకు ఎదురుదెబ్బ అంటారు. అలాగే జరిగింది ఇప్పుడు. ఖాతాల స్తంభనతో ఆగకుండా, ఎదురుతిరిగిన నేరానికి, ఆస్తుల జప్తుదాకా వెళ్లింది వ్యవహారం ఇప్పుడు. అంతటితో ఆగకుండా, పెట్టుబడులు పెట్టిన వారి గుట్టు రట్టు చేయడం కూడా వేగంగా జరగ సాగింది. ఎనిమిదివందల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్‍ను, ఆయనకు సహకరించిన బ్రహ్మానందరెడ్డిని అరెస్టు చేసింది సిబిఐ. ఒక బడా పారిశ్రామిక వేత్తను అరెస్టు చేయడమంటే, దాని వెనుక ఎంతో పకడ్బందీ వ్యూహం వుండి తీరాలి. తీగ కదిలితే డొంక కదిలినట్లుగా, ఒక్క నిమ్మగడ్డ ప్రసాద్‍తోనే ఆగకుందా, జగన్ కంపెనీలలో పెట్టుబడులు (అక్రమంగా) పెట్టిన ఇతరుల బండారం కూడా సిబిఐ బయటపెట్టే పనిలో పడింది. ఇక ముందుంది ముసళ్ల పండుగ!
ఇదంతా ఒక రాజకీయ-ఆర్థిక వ్యూహం. తనను దెబ్బ తీయాలనుకునే వారిని ఎదురు దెబ్బ తీయకుండా ఎవరూ వుండరు. అదే జరుగుతుందిప్పుడు. కాంగ్రెస్ పార్టీని వీడిన జగన్మోహన్ రెడ్డి, తన మానాన తానున్నట్లయితే, అది వేరే సంగతి. అనవసరంగా పుట్టలో వేలు పెట్టాడు. "నా బంగారు పుట్టలో వేలు పెట్టితే నేను కుట్టనా" అంటోంది సోనియాగాంధీ! కుట్టించుకుంటాడా? కుడతాడా జగన్?End