జగన్
ఆస్తులకు ఏం జరుగబోతోంది?
సూర్య
దినపత్రిక (19-05-2012)
వనం
జ్వాలా నరసింహారావు
అక్రమ మార్గంలో వైఎస్సార్ కాంగ్రెస్
అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తులను కూడగట్టుకున్నారంటూ, హైకోర్టు
ఆదేశాల మీదకు దర్యాప్తు చేపట్టి కొనసాగిస్తున్న సిబిఐ ఒకటి వెంట మరొక చార్జ్ షీట్
వేసే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టింది. మొదటి చార్జ్ షీట్ కు సంబంధించిన కేసు
వ్యవహారంలో ఒక అడుగు ముందుకు వేసి, కోర్టు ద్వారా నిందితులకు
సమన్లు జారీ కూడా చేయించింది. సమన్లు అందుకున్న వారిలో సాక్షాత్తు మొదటి
ముద్దాయిగా నమోదైన జగన్మోహన్ రెడ్డి కూడా వున్నారు. గత తొమ్మిది నెలలుగా
కాశీ-రామేశ్వరం మజిలీ కథలలాగా అంచలంచలుగా మలుపులు తిరుగుతున్న సిబిఐ దర్యాప్తులో
కీలకమైన అంశం జగన్‌కు చెందిన సాక్షి పత్రిక, సాక్షి ఛానళ్లను
నడుపుతున్న ఆర్థిక సంస్థల అకౌంట్‌లను స్థంబింప చేయడం. సుమారు వారం రోజుల క్రితం
సిబిఐ తీసుకున్న ఈ నిర్ణయానికి అనేకులు మద్దతు తెలిపితే, కొందరు
మాత్రం ఇదేదో పత్రికా స్వాతంత్ర్యాన్ని హరించుకుని పోయే చర్య అని పబ్లిక్ గానే
వాపోయారు. ధర్నాలు, ర్యాలీలు కూడా నిర్వహించారు. ఐనా అంతగా
స్పందన రాలేదు. సిబిఐ మరో అడుగు ముందుకు వేసింది. సంబంధిత జగన్ ఆస్తుల జప్తుకు
అనుమతిని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేక రాసింది. ఇదిలా వుండగా, సిబిఐ కోర్టులో అకౌంట్ల స్థంభనకు వ్యతిరేకంగా జగన్ దాఖలు చేసిన పిటీషన్‌కు
చుక్కెదురవడంతో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.
సాక్షి గ్రూపు సంస్థల బ్యాంక్ ఖాతాలను స్తంభింప చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు విచారణకు వచ్చాయి. బ్యాంక్ ఖాతాలు (కరెంట్ అకౌంట్స్) స్తంభింప చేయడంవల్ల సంస్థ రోజువారీ కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతోందని, సంస్థల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 20వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారికి నెలసరి వేతనాల కోసం రూ.8కోట్లు, న్యూస్ ప్రింట్ కోసం రూ.20 కోట్లు, పరిపాలన (అడ్మినిస్ట్రేషన్) కోసం రూ.7కోట్లు కలిపి మొత్తం నెలకు రూ. 35కోట్లు వ్యయం అవుతోందని, ప్రకటనలు, పత్రిక అమ్మకాల ద్వారా ఆమేరకు ఆదాయం కూడా ఉందని సాక్షి మీడియా సంస్థల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. హైకోర్టులో
విచారణలో భాగంగా, సాక్షి
పత్రిక,
సాక్షి
టీవీల్లో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారో చెప్పాలని, ఇతర ఆదాయ, వ్యయాల వివరాలను తమ ముందు
ఉంచాలని జగతి పబ్లికేషన్స్,
ఇందిరా
టెలివిజన్,
జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
సంస్థలను హైకోర్టు ఆదేశించింది. సీబీఐ తమ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేస్తూ తీసుకున్న
నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. సాక్షి పత్రికలో దాదాపు 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని
కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కింది కోర్టు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండానే తమ పిటిషన్లను తోసిపుచ్చిందని సాక్షి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఐతే, సాక్షిలో
20 వేల మంది ఉద్యోగులు లేరని, కేవలం 4,457 మంది మాత్రమే ఉన్నారని, ఇందుకు సంబంధించిన వివరాలను కార్మిక శాఖ నుంచి తీసుకున్నామని సిబిఐ న్యాయవాది పేర్కొన్నారు. బ్యాంక్ అకౌంట్లు స్తంభింప చేయడం వల్ల ఆ సంస్థలకు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం ఏమీలేదు. నెల మధ్యలోనే ఉంది. ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపులకు ఇంకా చాలా రోజుల సమయం ఉంది. బ్యాంక్ అకౌంట్లు ఎందుకు స్తంభింప చేయాల్సి వచ్చిందో వివరిస్తూ కౌంటర్ వేస్తాం. అందుకు గడువు కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరారు. దీంతో ఉద్యోగుల సంఖ్య, ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచాలని పిటిషనర్లను న్యాయమూర్తి ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా
వేశారు.
ఇదిలా
వుండగా, సాక్షి
దినపత్రిక, సాక్షి టెలివిజన్లకు ప్రభుత్వ ప్రకటనలను నిలుపుదల చేస్తూ జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో కొంత ఎదురుదెబ్బ తగిలింది. ప్రకటనలు ఆపేస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకటనల నిలుపుదల మార్గదర్శకాలకు విరుద్ధంగా జీవో ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఒకవైపు హైకోర్టులో ఖాతాల స్తంభన వ్యవహారం
నడుస్త్రుండగానే, ఖాతాల
స్తంభనతో ఈ పాటికే అదరగొట్టిన సిబిఐ మరో అడుగు వేసింది. జగన్ మీడియా ఆస్తులను జప్తు చేసే దిశగా పావులు కదిపింది. ఆ విధంగా
ప్రభుత్వాన్ని సిబిఐ
కోరడం, దానికి దాదాపుగా
అనుమతి లభించడం చకచకా జరిగిపోయింది. తరువాయి భాగం, న్యాయస్థానాల
అనుమతి
లభించడమే. ఇలా
గత రెండు-మూడు రోజులుగా కాశీ మజిలీ కథలో మరికొన్ని కీలక పరిణామాలు చోటు
చేసుకున్నాయి. జగన్ అక్రమాస్తుల, ఎమ్మార్ కుంభకోణంపై తాము జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఆస్తులను కూడా అటాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐ లేఖ పంపింది. ఈ కేసులతో సంబంధమున్న ఆస్తుల జాబితాను కూడా లేఖతో పాటు జత చేసింది. లేఖ తన దృష్టికి వచ్చిన
వెంటనే, ముఖ్యమంత్రి స్పందించారని, నిశితంగా పరిశీలించారని,
చట్టపరమైన చర్యలకు అనుమతించారని మీడియా కధనాలొచ్చాయి. ముఖ్యమంత్రి
సూచనల మేరకు హో మంత్రి కూడా సంబంధిత ఫైలును పరిశీలించి తగు ఉత్తర్వులు జారీ
చేసారని కూడా వార్తలొచ్చాయి. హోంమంత్రి, సీఎం సంతకాలు
పూర్తి కావడంతో, అధికారిక కసరత్తు పూర్తయిందని, న్యాయశాఖ నుంచి కొన్ని వివరణలు తీసుకున్నారని, సిబిఐ కోరిన విధంగానే, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్‌ఫ్రా కంపెనీల ఆస్తుల అటాచ్ మెంట్‌కు అనుమతి లభించిందని పత్రికలు రాశాయి.
అసలేం జరుగుతుంది? ఇదింతటితో ఆగుతుందా? ఇంకా
ముందుకు సాగుతుందా? ఇంతటితో ఆగితే ఇంత గొడవెందుకు? ఖాతాల స్తంభన నాటినుంచి నేటిదాకా తీసుకుంటే, కొన్ని
విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్‍లో జగన్ వ్యవహారంలో కేంద్ర
ప్రభుత్వం-రాష్ట్ర ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించబోతోందో దాఖలాలతో సహా
కనిపిస్తోంది. ఖాతాల స్తంభనతో సిబిఐ ద్వారా కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన స్పష్టమైన
సంకేతం, ఇక జగన్‌ను ఏ మాత్రం సహించేది లేదని. పార్టీని,
చివరకు సోనియాను దూషించినా మౌనం వహించిన అధిష్టానం ఎందుకు ఈ నిర్ణయం
తీసుకున్నదంటే దానికి కారణాలు అనేకం వుండవచ్చు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అతి
ప్రధానమైన ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్ పేరిట ఒక అసంతృప్తి జ్వాల ఆకాశమంత ఎత్తుకు ఎదిగి,
చివరకు, ఇంతై-ఇంతింతై-వటుడింతై అన్న చందాన,
యావత్ కాంగ్రెస్ పార్టీనే కబళించి వేసే స్థాయికి ఎదుగుతుంటే చూసి
సహించే స్థితిలో అధిష్టానం లేదని నిరూపించాలనుకుందేమో చక చకా ఒకటి వెంట మరొకటి
జరిగిపోసాగాయి. మొదట్లో ఒక చిన్న సమిధ అనుకున్న జగన్, పక్కలో
బల్లెం అయిపోయాడు. ఇక లాభం లేదనుకున్న అధిష్టానం, ముఖ్యమంత్రిని,
బొత్స సత్యనారాయణను, చిరంజీవిని ఉమ్మడిగా-కలిసి
కట్టుగా రంగంలోకి దింపింది రాజకీయ పరంగా. ఒకవైపు వారి ముప్పేట రాజకీయ దాడి
సాగుతుండగానే, మరొక వైపు ఆర్థిక మూలాలపై సిబిఐ దాడిని
పురికొల్పింది అనుకోవాలి. ఎంత స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఏజన్సీ అని సర్ది
చెప్పుకున్నా కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో మెలిగేదే కదా సిబిఐ!
జగన్‌కు ఎన్ని ఆస్తులున్నా తరగని ఆస్తి-ఆయన తండ్రి ఆలోచించి ఈయన
చేతికిచ్చిన అపురూపమైన ఆస్తి "సాక్షి" పత్రిక, "సాక్షి"
చానల్. జగన్ ఎప్పుడు, ఎక్కడ, ఏం చేసినా,
ఏం చేయదల్చుకున్నా, అతనికి అనుకూలంగా ప్రచారం
చేసే ఏకైక సాధనం ఆ రెండూను. జగన్ మీద ఎక్కడ ఈగ వాలినా, ఆ ఈగ
వివరాలను తుచ తప్పకుండా అఖిలాంధ్ర ప్రేక్షకులకు, శ్రోతలకు,
పాఠకులకు తెలియచెప్పే పదునైన ఆయుధం అది. ఆ రెండింటినీ ఎంతో ఆలోచించి
మరీ జగన్‌కు సమకూర్చాడు రాజశేఖరరెడ్డి. జగన్ మిగిలిన ఆస్తుల వ్యవహారంలో, ప్రభుత్వం ఏ విధమైన జోక్యం చేసుకున్నా గొంతు చించుకుని అరిచే ఈ ఆయుధాలను
నిరుపయోగం చేయకపోతే, ప్రయోజనం లేదనుకుంది కేంద్ర
ప్రభుత్వం-దాని కనుసన్నలలో నడిచే సిబిఐ. అది తప్పా-ఒప్పా అంటే యుద్ధం మొదలైతే,
ధర్మం-అధర్మం అనేవి రెండూ సమానమే అన్న నానుడి ఇక్కడ వర్తింప చేసుకోవాలి.
అందుకే, గురిచూసి మరీ దెబ్బ కొట్టింది సిబిఐ. మూడింటి లో
చార్జ్ షీట్లు, ఒక చార్జి షీట్లో సమన్లు, మరో వ్యవహారంలో ఖాతాల స్తంభన, ఈ లోపుగా మరో చార్జ్
షీట్. వెంట-వెంట మరికొన్ని చార్జ్ షీట్లు. ఇదే వ్యూహం. ముప్పేట దాడి. ఊపిరి
సల్పుకోకుండా దాడి. దెబ్బమీద దెబ్బ. కోలుకునే లోపుగా మరో దెబ్బ. దెబ్బ తెలియకుండా
మరో దెబ్బ. దిమ్మ తిరిగి పడిపోయీ-పడిపోకుండా దెబ్బ. ఇదీ పరిస్థితి.
ఖాతాల స్తంభనతో, తన వెంట జర్నలిస్టు సంఘాలను చేర్చుకుంది
జగన్ మీడియా. పత్రికా స్వాతంత్ర్యానికి ముప్పు వాటిల్లిందని వారితో ప్రచారం
చేయించింది. పాత్రికేయులు రోడ్డున పడ్డారని వారితో గగ్గోలు పెట్టించింది.
వాస్తవానికి పత్రికా స్వాతంత్ర్యానికి ఖాతాల స్తంభనకు సంబంధమే లేదు. జగన్ అక్రమంగా
ఆస్తులను సమకూర్చుకున్నారని, అలా సమకూర్చుకున్న ఆస్తులతో
పత్రికను, ఛానల్‌ను పెట్టారన్న ఆరోపణతో ఖాతాల స్తంభన
జరిగింది. పత్రికలో ఫలానాది రాయాలనో-రాయొద్దనో ఆంక్షలు విధించితే అది పత్రికా
స్వాతంత్ర్యానికి భంగం వాటిల్లినట్లవుతుంది కాని ఖాతాల స్తంభన ఎలా అవుతుంది?
సమాధానం ఇవ్వకపోగా ఎదురుదాడికి దిగారు మద్దతు దార్లు. దెబ్బకు
ఎదురుదెబ్బ అంటారు. అలాగే జరిగింది ఇప్పుడు. ఖాతాల స్తంభనతో ఆగకుండా, ఎదురుతిరిగిన నేరానికి, ఆస్తుల జప్తుదాకా వెళ్లింది
వ్యవహారం ఇప్పుడు. అంతటితో ఆగకుండా, పెట్టుబడులు పెట్టిన
వారి గుట్టు రట్టు చేయడం కూడా వేగంగా జరగ సాగింది. ఎనిమిదివందల కోట్లకు పైగా
పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్‍ను, ఆయనకు సహకరించిన
బ్రహ్మానందరెడ్డిని అరెస్టు చేసింది సిబిఐ. ఒక బడా పారిశ్రామిక వేత్తను అరెస్టు
చేయడమంటే, దాని వెనుక ఎంతో పకడ్బందీ వ్యూహం వుండి తీరాలి.
తీగ కదిలితే డొంక కదిలినట్లుగా, ఒక్క నిమ్మగడ్డ ప్రసాద్‍తోనే
ఆగకుందా, జగన్ కంపెనీలలో పెట్టుబడులు (అక్రమంగా) పెట్టిన
ఇతరుల బండారం కూడా సిబిఐ బయటపెట్టే పనిలో పడింది. ఇక ముందుంది ముసళ్ల పండుగ!
ఇదంతా ఒక రాజకీయ-ఆర్థిక వ్యూహం. తనను దెబ్బ తీయాలనుకునే వారిని ఎదురు
దెబ్బ తీయకుండా ఎవరూ వుండరు. అదే జరుగుతుందిప్పుడు. కాంగ్రెస్ పార్టీని వీడిన
జగన్మోహన్ రెడ్డి, తన మానాన తానున్నట్లయితే, అది
వేరే సంగతి. అనవసరంగా పుట్టలో వేలు పెట్టాడు. "నా బంగారు పుట్టలో వేలు
పెట్టితే నేను కుట్టనా" అంటోంది సోనియాగాంధీ! కుట్టించుకుంటాడా? కుడతాడా జగన్?End
Antenantaaraa!!! repati rojuna jagan adhikaaram loki vaste, veellandariki tadi aari poyiddi..taruvaata alochinchadaaniki emi migaladu..every dog has its own day..wait for some time
ReplyDeleteso you agreed mr. anonymous that Jagan is a dog!
ReplyDeleteand.., That Dog won't come into power...!!
ReplyDeleteJagan is not a normal dog but a rabid dog.
ReplyDelete