Tuesday, May 22, 2012

అతిరాత్రం యజ్ఞ నిర్వహణకు సహాయ సహకారాలందించిన వారెందరో....అందరికీ ధన్యవాదాలు: వనం జ్వాలా నరసింహారావు


అతిరాత్రం యజ్ఞ నిర్వహణకు
సహాయ సహకారాలందించిన వారెందరో....
అందరికీ ధన్యవాదాలు
        వనం జ్వాలా నరసింహారావు           
ఆరేడు నెలల క్రితం...నాకు దగ్గర బంధువైన రవిని తీసుకుని, కేసా ప్రగడ హరిహరనాధ శర్మ, ఆయన కుమారుడు రాజశేఖర శర్మ, మరికొందరు మా ఇంటికొచ్చారు. అంతకు రెండు-మూడురోజుల క్రితం ఈ-మెయిల్ ద్వారా నన్ను సంప్రదించారు హరిహరనాధ శర్మ. గత ఏడాది పంజాల్‍లో జరిగిన అతిరాత్రంకు తాను వెళ్ళి వచ్చానని, ఆ యజ్ఞాన్ని తాము కూడా ఎందుకు మన రాష్ట్రంలో చేయకూడదని అనుకున్నామని, ఆ క్రమంలో కేరళలో కొందరిని సంప్రదించామని, వారి సలహా మేరకు నన్ను కలవడానికి వచ్చామని చెప్పారు శర్మ గారు. కారణం అర్థం ఐంది. పంజాల్‍లో జరిగిన యజ్ఞం గురించి నేను రెండు-మూడు వ్యాసాలను రాయడం వల్ల నాకు ఇందులో ప్రమేయం వుందన్న భావనతో వారు నా దగ్గరకు వచ్చారు. నన్ను వారితో కలిసి-మెలిసి పనిచేయాలని కోరారు. అదొక అంది వచ్చిన అదృష్టంలా భావించిన నేను, నా అంగీకారాన్ని తెలిపాను. నాకు చేతనైనంత సహాయాన్ని చేస్తానని, యజ్ఞం పూర్తయ్యేంతవరకు వారితో కల్సి పనిచేస్తానని హామీ ఇచ్చాను. తక్షణమే, రెండు-మూడు రోజుల్లో నాకు బాగా పరిచయమున్న ఆప్తులు దర్శనం శర్మ గారిని, ఆర్.వి.ఆర్ కృష్ణా రావుగారిని, మరో ఇద్దరు-ముగ్గురిని నాకు జతగా అతిరాత్రం పుణ్య యజ్ఞంలో భాగస్తులను చేశాను. అలా మొదలైంది కేవలం పది-పదిహేను మందితో మా అతిరాత్రం ప్రయాణం ఆరేడు నెలల క్రితం. పదిహేను మందితో ఆరంభమైన ఆ కార్యక్రమాన్ని వీక్షించడానికి పదిహేను లక్షల మంది వచ్చారంటే దానికి కారణం అచిర కాలంలోనే సహాయ సహకారాలను అందించిన వారెందరో కావడమే.
అందరిలోకి యాగ రక్షా పురుషుడుగా వ్యవహరించిన కేసా ప్రగడ హరిహరనాధ శర్మ మనో ధైర్యం, సడలని పట్టుదల, కార్యదీక్ష, అవసరమైనప్పుడు "మంకుతనం" బహుశా అతిరాత్రం ద్విగ్విజయంగా పూర్తవడానికి ప్రధాన కారణం అనడంలో అతిశయోక్తి లేదు. మిన్ను విరిగి మీద పడ్డ సందర్భాలలో కూడా ఆయనలో కొంచెమైనా నైరాశ్యం కనిపించలేదు. రూపాయి లేనప్పుడూ, లక్షలొచ్చినప్పుడూ ఒకే మనో ధైర్యం ఆయనలో వుండడం గొప్పగా చెప్పుకోవాలి. ఇక ఆయన కుమారుడు రాజశేఖర శర్మ తన అద్భుతమైన పాండిత్యంతో వెళ్ళిన ప్రతిచోటా-ప్రతివ్యక్తినీ ఆకర్షించు కోవడం నన్ను అబ్బుర పరిచింది. భూదేవికున్నంత ఓర్పు ఆయనది. ఆయనకెన్ని పనులు అప్పగించినా "ఇది నా చేత కాదు" ఆని ఒక్క నాడూ అనలేదు. ఆలశ్యంగానైనా ఆ పని చేసేవాడు. అన్నింటికన్నా మించింది ఆయన కున్న కంప్యూటర్ నాలెడ్జ్. అతిరాత్రానికి సంబంధించినంతవరకు ఆయనే సాఫ్ట్ వేర్, ఆయనే హార్డ్ వేర్ ఇంజనీర్. వెబ్ డిజైనర్ కూడా ఆయనే. అదనంగా అనేకానేక అదనపు బాధ్యతలు.
మాకు తోడుగా మరికొందరిని చేర్చుకున్నాం. స్నేహితుడు కళాధర్ కుమారుడు అనిరుధ్‌ను పబ్లిక్ రిలేషన్స్ అధికారిగా తీసుకున్నాం. అనిరుధ్ ఆ పనీ-ఈ పనీ అని కాకుండా అన్ని పనులు చేయడమే కాకుండా, చివరకు, యజ్ఞం జరిగిన పన్నెండు రోజులు జనరేటర్‌కు కావాల్సిన డీజిల్ సరఫరా బాధ్యతను నెత్తిన వేసుకున్నాడు. అలాగే ఖమ్మంలో వుండే భండారు రమేష్. హైదరాబాద్ లో అనిరుధ్ ఎలాగో, ఖమ్మం జిల్లాలో రమేష్ అలా. జిల్లా అధికారులతో, అనధికారులతో సంప్రదింపులు జరపడం దగ్గర నుంచి, కేరళ నుంచి వచ్చే వారిని భద్రాచలం తీసుకెళ్ళడం లాంటి పనుల వరకు రమేష్ చూసుకునేవాడు.
హైదరాబాద్‌లో మా బృందంలో ప్రధానంగా బాధ్యతలు నిర్వహించింది (నాకు తెలిసినంతవరకు) దర్శనం శర్మ, ఆర్.వి.ఆర్. కృష్ణారావు, బుచ్చయ్య చౌదరి, రమాదేవి దంపతులు, ఆచార్య రాజారెడ్డి ప్రభృతులు. వీరిలో దర్శనం శర్మ ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలానే కృష్ణా రావు, చౌదరిగారు కూడా. ఏదేమైనా మా ఈ చిన్ని బృందంతో పని అయ్యేటట్లు లేదని భావించిన మేము, ఒక కార్య నిర్వాహక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మాజీ టిటిడి కార్య నిర్వహణ అధికారి శ్రీ పీవీఆర్‍కె ప్రసాద్ సారధ్యంలో ఆయన చైర్మన్‌గా, నేను కో ఆర్డినేటర్ గా మరి కొందరు ప్రముఖులతో ఏర్పాటు చేసుకున్నాం సారధ్య సంఘాన్ని. శ్రీయుతులు రమణాచారి, ఎమ్ వీఎస్ ప్రసాద్, కె.ఎస్.శర్మ, సీవిఎస్‍కె శర్మ, శివశంకర రెడ్డి, గోపీనాధ్ రెడ్డి, ఎన్వీఎసెస్ ప్రభాకర్, రాయపాటి సాంబశివరావు, వుండవల్లి అరుణ్ కుమార్, కూనంనేని సాంబశివరావు, రామిరెడ్డి వెంకట రెడ్డి, సత్యవాణి, ఉప్పల శారద ప్రభృతులు సారధ్య సంఘం సభ్యులు. అందరూ ఎవరికి తోచిన సహకారం వారందించారు. పీవీఆర్‍కె ప్రసాద్ గారిని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అనుక్షణం సారధ్య సంఘానికి అసలు సిసలైన నాయకత్వం అందించిన ఘనత ఆయనది. ఆయన అధ్యక్షతన నిర్వహించిన ప్రతి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుకు ఆయనే స్వయంగా మా వెంట వుండేవారు. ప్రభుత్వ ఆర్థిక సహాయం కాని, టిటిడి సహాయం కాని, ఐటీసీ-సింగరేణి కాలరీస్, ఆ మాటకొస్తే, మాకందిన ప్రతి సహాయం వెనుక ఆయన హస్తం ప్రస్ఫుటంగా వుంది. చివరి మూడు రోజులు భద్రాచలంలోనే మకాం వేసి, అను క్షణం జిల్లా యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతూ, పూర్ణాహుతి అయ్యేంతవరకు మా వెంటే వున్న ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. రమణాచారి గారి అధ్యక్షతన కూడా ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఎప్పటికీ మరువలేనిది. అలానే మావెంట వివిధ కార్యాలయాలకు వచ్చిన ఐఎఫెస్ అధికారి శివశంకర రెడ్డి గారు కూడా.
ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మా దాయ శాఖ నుంచి కామన్ గుడ్ ఫండ్ నుంచి రు. 50 లక్షల సహాయం అందించినందుకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి చిత్రారామచంద్రన్‍కు, కమీషనర్ బలరామయ్యకు, మంత్రి సి. రామచంద్రయ్యకు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సంబంధిత ఫైలును చకచకా కదిలించడంలో తోడ్పడిన ముఖ్యమంత్రి ప్రిన్సిపాల్ కార్యదర్శి బినోయ్ కుమార్‍కు, ఆయన ఆంతరంగిక కార్యదర్శులు స్వామి-రంగాచారి గార్లకు ధన్యవాదాలు. ఇక టిటిడి నుంచి పాతిక లక్షల నిధులను మంజూరు చేసినందుకు ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం గారికి, బోర్డు సభ్యులకు ధన్యవాదాలు. టిటిడి మంజూరు చేసిన నిధులను విడుదల చేయించడంలో దర్శనం శర్మ, రాజశేఖర శర్మ తీసుకున్న చొరవను ప్రత్యేకంగా అభినందించాలి.
ఇక భద్రాచలం విషయానికొస్తేరామాలయం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కురిచేటి పాండురంగారావు గారు, ఆయన కుమారుడు డీసీఎంఎస్ ఛైర్మన్ రామచంద్రమూర్తి ఒంటిచేత్తో అక్కడి కార్యక్రమాన్ని నడిపించారు. వారి బృందం సభ్యులైన కృష్ణయ్య ప్రభృతులను ప్రత్యేకంగా అభినందించాలి. అన్నదానం విషయంలో వారు తీసుకున్న శ్రద్ధ అజరామరంగా వుండిపోతుంది. మీడియా సహకారం లభించడానికి ప్రధాన కారణం రామచంద్రమూర్తి మాత్రమే.


"ఈవెంటు” ను ఏర్పాటుచేసిన శ్రీనివాసరావు బృందం, ఆ పక్కనే తడికలను ఏర్పాటు చేయించిన భద్రాచలం టెంపుల్ ఈవో బదరీ నారాయణాచార్యులు బృందం, ఇంజనీర్ దయాకరరెడ్డిని అభినందించాలి.
ఖమ్మం జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్, ఎస్పీ హరికుమార్, అడిషనల్ ఏస్పీ గజరాజ్ భూపాల్, పీవో ఐటిడిఏ ప్రవీణ్ కుమార్, సిఐ రామోజీ రమేశ్, ఎస్సై షుకూర్, ఆర్డీఓ పాల్వంచ, ఆర్డీవో కొత్తగూడెం, తహసీల్దార్ నరసింహారావు లకు ధన్యవాదాలు.
చివరిగా...కాకపోతే..అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నదైన, మీడియాకు అతిరాత్రం సారధ్య సంఘం ధన్యవాదాలు తెలుపుకుంటున్నది. మీడియా-ఎలెక్ట్రానిక్, ప్రింట్-వారి సహకారం వల్లే, ఇన్ని లక్షల మందికి తెలియడం, ఇంతమంది ఎటపాక రావడం జరిగింది. మీడియాకు సంబంధించినంతవరకు భద్రాచలంలో రాము చేసిన సమన్వయం మరువలేనిది. అలానే హైదరాబాద్‌లో "సూర్య యాడ్ సిస్టమ్స్", దాని అధినేత సూర్య, మీడియా కోఆర్డినేటర్ కృష్ణమోహన్ చేసిన సహాయం అపూర్వం. ఇక ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే... ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, నమస్తే తెలంగాణ ఛైర్మన్ రాజం ముందు వరుసలో వుంటారు. రెండు రోజులు ఉచితంగా వారిద్దరూ, వారి పత్రికలలో అడ్వర్టైజ్‌మెంట్లు ఇవ్వడం వల్లనే అంతమంది ప్రజానీకానికి అతిరాత్రం గురించి తెల్సిందంటే అతిశయోక్తి కాదు. అలానే భక్తి ఛానల్, ఎన్టీవి, ఐ న్యూస్ ఛానళ్ల ఛైర్మన్ నరేంద్ర చౌదరి గారు కూడా. వారి ఛానళ్లలో నిరంతరం లైవ్ ప్రసారాలు అందించడమే కాకుండా, ఆర్నెల్ల ముందునుంచే అతిరాత్రం ప్రచారానికి శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి వారు. వారికి మా ధన్యవాదాలు. ఇక ఎస్వీబీసీ ఛానల్ అలానే. ఆ ఛానల్ కు, టిటిడి ఈవో సుబ్రహ్మణ్యం గారికి మరోమారు ధన్యవాదాలు.
ఇక అతిరాత్రం యజ్ఞానికి విచ్చేసిన పదిహేను లక్షల మందికి ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చిన ప్రతివారూ, ప్రదక్షిణ చేసి తరించినందుకు మరీ-మరీ కృతజ్ఞతలు. పదిహేను లక్షల మందిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వారూ వున్నారు. మంత్రులు రాం రెడ్డి వెంకట రెడ్డి, రామ చంద్రయ్య, శ్రీధర్ బాబు, రఘువీరారెడ్డి; మాజీమంత్రి జలగం ప్రసాద రావు; మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు; శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క; శాసనమండలి అధ్యక్షులు చక్రపాణి; పార్లమెంటు సభ్యులు హనుమంతరావు, బలరాం నాయక్; శాసనసభ్యులు కుంజ సత్యవతి, తుమ్మల నాగేశ్వర రావు, సండ్ర వెంకట వీరయ్య, కూనంనేని సాంబశివరావు, రేగా కాంతారావు, మిత్ర సేన, అవంతి శ్రీనివాస్; శాసనమండలి సభ్యులు సుధాకరరెడ్డి, బాలసాని, పోట్ల నాగేశ్వరరావు ప్రభృతులున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి, వైస్రాయ్ హోటెల్ యజమాని ప్రభాకరరెడ్డి, కస్టమ్స్-సెంట్రల్ ఎక్సైజ్ కమీషనర్ రఘు చారి, న్యూమరాలజిస్ట్ దైవజ్ఞ శర్మ, ఇతర ప్రముఖులున్నారు. వారందరికీ ధన్యవాదాలు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులున్నారు. సహాయ సహకారాలందించిన వారందరికీ పేరుపేరునా మా ధన్యవాదాలు.

2 comments:

  1. ఈ మహాయాగానికి వెన్నుదన్నుగా నిలిచి నడిపించిన మీవంటి మహానుభావులకు శతసహస్ర వందనములు జైశ్రిరాం

    ReplyDelete