Monday, December 7, 2015

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-2

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-2

 ధర్మపురి క్షేత్ర నరసింహ స్వామికి మహా భక్తుడైన శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలోని పద్యాలను యధాతధంగా నా బ్లాగ్ పాఠకులకు అందించే ప్రయత్నం ఇది. పదిరోజులకొకసారి పది పద్యాల చొప్పున వంద రోజులు వంద రోజులయ్యేసరికి వీటన్నింటినె నా బ్లాగ్ లో చదవ వచ్చు. (ఇవి రెండో విడత పది పద్యాలు)

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-11

సీII       గార్ధభంబున కేల కస్తూరి తిలకంబు ?
మర్కటంబున కేల మలయజంబు ?
శార్దూలమున కేల శర్కరాపూపంబు ?
సూకరంబున కేల చూతఫలము ?
మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి ?
గుడ్లగూబల కేల కుండలములు ?
మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్ ?
బకసంతతికి నేల పంజరంబు ?
తేII       ద్రోహచింతన జేసెడి దుర్జనులకు
మధురమైనట్టి నీ నామ మంత్రమేల ?
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-12

క II       పసరంబు పంజైన బసులకాపరితప్పు,
ప్రజలు దుర్జనులైన బ్రభుని తప్పు,
భార్య గయ్యాళైన బ్రాణనాథుని తప్పు,
తనయుడు దుడుకైన దండ్రి తప్పు,
సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు,
కూతురు చెడుగైన మాత తప్పు,
అశ్వంబు దురుసైన నారోహకుని తప్పు,
దంతి మదింప మావంటి తప్పు
తే II      ఇట్టి తప్పు లెరుంగక యిచ్చవచ్చి
నటుల మెలగుదు రిప్పు డీ యవని జనులు;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !

 శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-13

సీII       కోతికి జలతారు కుళ్లాయి యేటికి ?
విరజాజి పూదండ విటుల కేల ?
ముక్కిడి తొత్తుకు ముత్తెంపు నత్తేల ?
యుద్ధమేమిటికి జాత్యంధునకు ?
మాచకమ్మకు నేల మౌక్తికహారముల్ ?
క్రూరచిత్తునకు సద్గోష్ఠులేల ?
రంకుబోతుకు నేల రమ్యంపు నిష్ఠలు ?
వావి యేటికి దుష్ట వర్తనునకు ?
తేII       మాటనిలకడ సుంకరి మోటుకేల ?
చెవిటివానికి సత్కథా శ్రవణమేల ?
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-14

సీII       మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు,
మాన్యముల్ చెరుప సమర్థులంత;
యెండిన యూళ్ళ గోడెరిగింప డెవ్వడు;
బండిన యూళ్ళకు బ్రభువులంత;
యితడు పేద యటంచు నెరిగింప డెవ్వడు;
గలవారి సిరులెన్నగలరు చాల;
దన యాలి చేష్టల దప్పెన్న డెవ్వడు;
బెరకాంత తప్పెన్న బెద్దలంత;
తేII       యిట్టి దుష్టుల కధికార మిచ్చినట్టి
ప్రభువు తప్పులటంచును బలుకవలెను,
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-15

సీII       తల్లి గర్భమునుండి ధనము దేడెవ్వడు,
వెళ్ళి పోయెడినాడు వెంటరాదు;
లక్షాధికారైన లవణ మన్నమెకాని,
మెరుగు బంగారంబు మ్రింగబోడు;
విత్తమార్జనజేసి విర్రవీగుటె కాని,
కూడబెట్టిన సొమ్ము గుడువబోడు;
పొందుగా మరుగైన భూమిలోపల బెట్టి,
దానధర్మము లేక దాచి దాచి;
తేII       తుదకు దొంగల కిత్తురో ? దొరల కవునొ ?
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు ?
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !


శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-16

సీII       లోకమం దెవడైన లోభిమానవుడున్న
బిక్షమర్థికి జేత బెట్టలేడు;
తాను బెట్టకయున్నదగవు పుట్టదుకాని
యొరులు పెట్టగజూచి యోర్వలేడు;
దాతదగ్గర జేరి తన ముల్లె చెడినట్లు
జిహ్వతో జాడీలు చెప్పుచుండు
ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు;
మేలుకల్గిన జాల మిణుకుచుండు;
తేII       శ్రీరమానాథ ! యిటువంటి క్రూరునకును
బిక్షకుల శత్రువని పేరు బెట్టవచ్చు;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-17

సీII       తనువులో బ్రాణముల్ తరలిపోయెడి వేళ
నీ స్వరూపమును ధ్యానించు నతడు
నిమిషమాత్రములోన నిన్ను జేరునుగాని,
యమునిచేతికి జిక్కి శ్రమలబడడు;
పరమసంతోషాన భజన జేసెడివాని
పుణ్య మేమనవచ్చు భోగిశయన !
మోక్షము నీ దాస ముఖ్యుల కగు గాని
నరక మెక్కడిదయ్య నళిననేత్ర !
తేII       కమలనాభుని మహిమలు కానలేని
తుఛ్చులకు ముక్తి దొరకుట దుర్లభంబు;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-18

సీII       నీల మేఘశ్యామ ! నీవె తండ్రివి మాకు,
కమలవాసిని మమ్ము గన్నతల్లి,
నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్,
నీ కటాక్షము మా కనేక ధనము,
నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు,
నీ సహాయము మాకు నిత్య సుఖము,
నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య,
నీ పద ధ్యానంబు నిత్య జపము
తేII       తోయజాతాక్ష ! నీ పాద తులసిదళము
రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత !
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !

 శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-19

సీII       బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని,
మరణకాలమునందు మరతునేమొ ?
యావేళ యమదూత లాగ్రహంబున వచ్చి
ప్రాణముల్ పెకలించి పట్టునపుడు
కఫ వాత పైత్యముల్ కప్పగా భ్రమచేత
గంప ముద్భవమంది , కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను నారాయణా ! యంచు
బిలుతునో ! శ్రమచేత బిలువలేనో ?
తేII       నాటికిప్పుడె చేసెద నామ భజన
దలచెదెను జేరి వినవయ్య ! ధైర్యముగను,
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-20

సీII       పాంచభౌతికము దుర్భరమైన కాయం బి
దెప్పుడో విడుచుట యెరుకలేదు,
శతవర్షములదాక మితము జెప్పిరి కాని,
నమ్మరాదామాట నెమ్మనమున !
బాల్యమందో; మంచి ప్రాయమందో, లేక
ముదిమియందో, లేక ముసలియందొ,
యూరనో, యడవినో, యుదక మధ్యముననో,
యెప్పుడో యేవేళ నే క్షణంబొ ?
తేII       మరణమే, నిశ్చయము ; బుద్ధిమంతుడైన
దేహమున్నంతలో మిమ్ము దెలియవలయు ;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !

Sunday, December 6, 2015

సంధ్యావందనం..ఆచరణ అవశ్యం : వనం జ్వాలా నరసింహారావు

సంధ్యావందనం..ఆచరణ అవశ్యం
ఆంధ్ర భూమి దినపత్రిక (07-12-2015)
వనం జ్వాలా నరసింహారావు

          "సంధ్యావందనం ద్విజాతులకెంతో ముఖ్యమైంది. సంధ్యావందనం చేయని బ్రాహ్మణుడు ప్రాణం లేని దేహంతో సమానం. ఇలా ఆలోచిస్తే, బహుశా, ఈ రోజుల్లో బ్రాహ్మణ జాతి సంధ్యావందనం చేయని స్థితికి చేరుకుని, ఒక విధంగా పతనమై పోతున్నదనాలి. బ్రాహ్మణులమని అనుకునేవారు తమ స్వరూపాన్నే మరచి, భ్రష్టులై పోవడానికి, వారి భోగలాలసయే కారణమనాలి". ఇలా మనవి చేసుకుంటూ, వాసు దాస స్వామిగా పలువురు ఎరిగిన స్వర్గీయ వావిలికొలను సుబ్బారావు గారు రాసిన "సంధ్యావందనం" అనే టీకా తాత్పర్య సహిత అమూల్య గ్రంధాన్ని అంగలకుదురులోని శ్రీ కోదండ రామ సేవక ధర్మ సమాజానికి చెందిన దాస శేష స్వామివారు, ఏనాడో అరవై ఏళ్ల క్రితమే, పరిచయం చేశారు. అందులో పేర్కొన్న పలు అంశాలు నేటికీ, ఆ మాటకొస్తే, ఏ నాటికైనా బ్రాహ్మణులమని అనుకునే వారందరూ విధిగా తెలుసుకుని తీరాల్సిందే....అనుసరించాల్సిందే. వివరాల్లోకి పోతే.....

          సంధ్యావందనానికి మొదటగా కావాల్సింది యజ్ఞోపవీత ధారణ. ఆచమనం, సంకల్పం చేసి "యజ్ఞోపవీతం పరమం పవిత్రం, ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్, ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం, యజ్ఞోపవీతం బలమస్తు తేజః" అని జపిస్తూ మొదటి జంధ్యం వేసుకోవాలి. తరువాత తిరిగి ఆచమించి రెండవ జంధ్యం వేసుకోవాలి. మరల ఆచమించి మూడోది వేసుకోవాలి. అలానే పాతది తేసి వేయడానికీ మంత్రం వుంటుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సంధ్యావందనం చేయడానికి వేదోక్త కర్మాధికారం వుంది. ప్రాత స్నానం చేసిన తరువాతే సంధ్య వార్చాలి. సూర్య బింబం ఎర్ర్తబారే సమయంలో సాయం సంధ్య చేయాలి. ఇక మధ్యాహ్న సంధ్య మధ్యాహ్నం చేయాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వున్న సమయాన్ని ఐదు భాగాలు చేయాలి. మొదటిది, అంటే, ఆరు గంటల నుంచి సుమారు రెండున్నర గంటల సమయం ప్రాతః కాలం. ఒంటి గంట సమయంలో మధ్యాహ్న కాలం. సాయంత్రం ఆరు గంటలకు సాయంకాలం. సాయం సంధ్యల కాలంలో, ప్రాతః సంధ్యా కాలంలో, మూడేసి అర్ఘ్యాలను విడవాలి. ఉదయం అర్ఘ్యం విడిచేటప్పుడు సూర్యుడికి ఎదురుగా నిలబడి, వంగి విడవాలి. మధ్యాహ్నం చక్కగా నిలబడి, సాయంత్రం కూర్చుండి సంధ్య చేయాలి. జపం కూడా అలానే చేయాలి. ఉదయం ఈశాన్య దిక్కుగా, సాయంకాలం వాయువ్య దిశగా, మధ్యాహ్నం తూర్పు దిక్కుగా తిరిగి సంధ్య వార్చాలి. సరైన కాలంలో సంధ్య వార్చితే 10 మార్లు గాయత్రి జపం చేస్తే చాలు. సమయం తప్పితే 108 మార్లు చేయాలి.

          సంధ్యావందనం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు ముఖ్యంగా బ్రాహ్మణులకు సంపాదించి ఇచ్చిన వంశ పరంపరాగతమైన నిక్షేపం. అంటే, బ్రాహ్మణుడనేవాడు, గాయత్రీ జపం ద్వారానే, నిస్సంశయంగా ముక్తి పొందుతాడు. ఇతర జపాలేవి చేసినా, చేయక పోయినా, గాయత్రి జపించిన వాడు భూతదయ గలవాడిగాను, బ్రాహ్మణుడి గాను పిలవబడటానికి అర్హుడవుతాడు. అసలు "సంధ్య" అంటే ఏమిటి? సందిలో చేయడానికి యోగ్యమైంది సంధ్య. అలానే, సంధ్యా కాలం అంటే, రాత్రి-పగలు కలిసే కాలం. ఆ కాలంలో చేయబడే కర్మను సంధ్య అంటారు. అంత మాత్రాన సంధికాలంలో చేసే ప్రతి కార్యం సంధ్య అని పిలవాలని లేదు. కాకపోతే, కొన్ని స్మృతులు మధ్యాహ్న సంధ్యను కూడా పేర్కొన్నాయి. ఆ విధంగా సంధ్యలు మూడయ్యాయి. బ్రాహ్మణుడు సంధ్య వార్చకపోతే, గొప్ప కీడు కలుగుతుందని అనేక స్మృతులలో చెప్పబడింది. కీడు కలుగుతుంది అంటే, ధన నష్టం-ధాన్య నష్టం అని మాత్రమే కాదు. సంధ్యను ఉపాసించని ద్విజుడు సూర్యుడిని హింసించినట్లే!

          ఇంతకీ సంధ్యలో ఉపాసించబడే దేవత ఎవరు? స్త్రీయా? పురుషుడా? "గాయత్రీం చింతయే ద్యస్తు" అని జప కాలంలో "గాయత్రీ" ధ్యానం చెప్పబడింది. సంధ్యా గాయత్రీ, సావిత్రీ, సరస్వతీ శబ్దాలు మహతీ వాచకాలు. కాబట్టి, ఆ దేవతలు స్త్రీలే అని చెప్పుకోవాలి. ఐనప్పటికీ, సంధ్యాది దేవత స్త్రీ యని ఉపాసించాలా? పురుషుడని ఉపాసించాలా? అని సందేహం వచ్చినప్పుడు, వసిష్ట మహర్షి జవాబుగా, "ఏది సంధ్యయో, అదే ప్రపంచాన్ని ప్రసవించే శక్తి. అది మాయాతీతం. నిష్కల ఈశ్వరుడి ముఖ్య శక్తి. తత్వ త్రయాల వల్ల కలిగేది. అందువల్ల, సంధ్యా ది దేవత భగవచ్చిచ్ఛక్తి అని గ్రహించాలి" అని చెప్పారు.

          దేహం అత్యంత మలినమై తొమ్మిది రంధ్రాలతో కూడి వుంటుంది. రాత్రి-పగలు దాని నుంచి మురికి వెలువడుతూనే వుంటుంది. కాబట్టి ప్రాతః కాల స్నానంతో దేహం పైనున్న మురికి పోగొట్టుకోవాలి. స్నానం చేసి మాత్రమే సంధ్య వార్చాలి. ఇక సాయం సంధ్య విషయానికొస్తే, గురువు ద్వారా ఉపదేశం పొందిన గాయత్రిని నిలుచుండి జపించుకుంటూ, సూర్యుడు అస్తాద్రికి చేరగానే సాయం సంధ్య ప్రారంభించాలి. సూర్యుడు, నక్షత్రాలు లేని రే పగటి సంధికాలం సాయం సంధ్య వార్చాలి. అంటే, సూర్యుడు అస్తమించిన తరువాత, నక్షత్ర దర్శనం కాక ముందు, సాయం కాల సంధ్య; నక్షత్రాలు కనబడకుండా పోయిన తరువాత సూర్యుడు ఉదయించక ముందు ప్రాత సంధ్య, వార్చాలి. ఉత్తమ కాలంలో వార్చబడిన సంధ్య స్వర్గాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్య కాలంలో సంధ్య వార్చని వాడు పూర్ణ బ్రాహ్మణుడు కాడు. పన్నెండు రోజులు వరుసగా సకాలంలో సంధ్య వార్చకపోతే, నాలుగు వేదాలు చదివిన బ్రాహ్మణుడైనా, బ్రాహ్మణేతరుడితో, నాస్తికుడితో సమానమైన వాడే! కాకపోతే వీటన్నింటికీ శాస్త్రోక్తంగా ప్రాయశ్చిత్తాలు సూచించిబడినాయి.


          సంధ్యావందనంలో అనుష్టించాల్సిన మార్గాలలో ప్రాణాయామం ఒకటి. ఆసనం మీద కూర్చుండి, నడుం, వీపు, కంఠం, శిరస్సు సమంగా వుంచి, వంపు లేకుండా చేసి, మొదట ఎడమ వైపు ముక్కు భాగాన్ని కుడిచేతి బొటన వేలితో మూసి, కుడి వైపున్న ముక్కు భాగంతో తనలో వున్న గాలినంతా విడిచిపెట్టాలి. ఇలా చేసి, కుడి ముక్కు రంధ్రాన్ని బిగించి, ఎడమ ముక్కుపై వున్న వేలిని తొలగించి, మెల్లగా గాలిని లోపలికి పీల్చాలి. పీల్చి, వెంటనే ఆ ముక్కును కూడా కడపటి రెండు వేళ్లతో బిగించాలి. అలా బిగించి, గాలిని లోపల కొంచెం సేపు నిలిపి కుడి వైపు ముక్కు మీద వేలు తొలగించి, మెల్లగా గాలిని విడవాలి. ప్రాణాయామం చేసేటప్పుడు పెదవులు తెరవరాదు. పన్ను-పన్ను తాకకూడదు. దిక్కులు చూడ కూడదు. దృష్టి ముక్కు కొనపైనే వుండాలి. మూలాధారం బిగించాలి. శ్రీమన్నారాయణుడుని హృదయంలో నిలిపి ధ్యానించాలి. ఆ ధ్యానంలో గాయత్రిని జపించాలి. ఒక మంత్రాన్ని అర్థాను సంధానంతో మనస్సులో పలుమార్లు వల్లించుకుంటూ, ఆ మంత్రాధిష్ఠాన దేవతను, హృదయంలో మనస్సు చలించకుండా నిలపడాన్ని "జపం" అంటారు. జపం చేయడానికి ముందు, మూడు మార్లు ప్రాణాయామం చేయాలి. గాయత్రిని 10 మార్లు కాని, 108 మార్లు కాని జపించాలి. ఇది జప సంఖ్య. జపమాలిక సహాయంతో కాని, వ్రేళ్లతో కాని లెక్కించాలి. కుడి చేతి ఉంగరపు వేలు నడిమి గణుపు నుంచి కింది కొచ్చి, కడపటి వేలు కింది గణుపు నుంచి పైకి పోయి, ఉంగరపు వేలి పై గణుపు, నడిమి వేలి పై గణుపు, చూపుడు వేలు పై గణుపు, దాని కింది గణుపు, ఆ దాని కింది గణుపు....ఇలా పది లెక్కించాలి.

          ఆ తరువాత చేయాల్సింది ఆచమనం...అంటే, శాస్త్ర ప్రకారం చేయాల్సిన జలపానాది కార్యం. అజ్ఞానంతో ఆచమనం చేయకుండా కార్యాలు చేసేవాడు నాస్తికుడితో సమానం. వాడు చేసే పనులన్నీ వ్యర్థమే. నిలబడి కాని, వంగి కాని ఆచమనం చేయకూడదు. కూర్చుండి మూడు మార్లు జలాన్ని తాగాలి. "కేశవ", "నారాయణ", "మాధవ"...ఈ మూడు అనుకుంటూ వేరు-వేరుగా జలాన్ని తాగాలి. ఒక్క సారి నీళ్లు తీసుకుని మూడు పేర్లు చెప్పకూడదు. అక్కడి నుంచి వరుసగా "గోవింద", "విష్ణు" అంటూ చేతులు కడుక్కోవడంతో మొదలెట్టి, "మధుసూధన", "త్రివిక్రమ", "వామన", "శ్రీధర", "హృషీకేశ", "పద్మనాభ", "దామోదర", "సంకర్షణ", "వాసుదేవ", "ప్రద్యుమ్న", "అనిరుద్ధ", "పురుషోత్తమ", "అధోక్షజ", "నారసింహ", "అచ్యుత", "జనార్ధన", "ఉపేంద్ర" అను స్తుతిస్తూ, చివరగా "హరయే శ్రీ కృష్ణాయ" అంటూ పూర్తి చేయాలి.

          ఓం కేశవాయ స్వాహా...ఓం నారాయణాయ స్వాహా.......ఓం హరయేనమః...ఓం శ్రీకృష్ణాయనమః అంటూ, వారి వారి సంప్రదాయం ప్రకారం, ఆచమనం చేయాలి. ఆ తరువాత, "ఓం భూః! ఓం భువః! ఓం సువః! ఓం మహః! ఓం జనః! ఓం తపః! ఓం సత్యం! ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ! ఓ మాపో జ్యోతీ రసో మృతం బ్రహ్మ భూర్భువస్సువ రోమ్ !" అని ప్రాణాయామం చేయాలి. చేసి, ఇలా సంకల్పం చెప్పుకోవాలి. "శ్రీ గోవింద గోవింద మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమాన స్సాద్య బ్రహ్మణో ద్వితీయపరార్థే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్యే ….. ప్రదేశే, కృష్ణా గోదావరీ మధ్యప్రదేశే, సమస్త దేవతా బ్రాహ్మణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన.....సంవత్సరే....ఆయనే...ఋతౌ.....మాసే.....పక్షౌ....తిధౌ.....వాసరే.....శ్రీవిక్ష్ణునక్షత్రే శ్రీ విష్ణు యోగో, శ్రీ విష్ణు కరణే, ఏవం గుణ విశేషణ విశిష్టాయాం, శుభతిధౌ, శ్రీ పరమేశ్వరముద్దిశ్య మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం....సంధ్యా ముపాసిష్యే". అలానే, "ఓం అచ్యుతాయనమః, ఓం అనంతాయనమః, ఓం గోవిందాయనమః....." అనే ద్వాదశ నామాలు చెప్పాలి. ఆ తరువాత మార్జన మంత్రాలొకటి రెండు ఉచ్ఛరించాలి. మార్జన మంత్రాలన్నీ చెప్పిన తరువాత, పరిశుద్ధుడై, అర్ఘ్యం విడవాలి. ఇలా విడవడానికి ముందు స్మృత్యాచమనం చేయాలి. తరువాత, దోసిట్లో నీళ్లుంచుకుని, సూర్యుడికి ఎదురుగా నిలుచుండి, ""ఓం భూః! ఓం భువః! ఓం సువః! ఓం మహః! ఓం జనః! ఓం తపః! ఓం సత్యం! ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్" అన్న గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ, మూడుసార్లు అర్గ్యం విడవాలి.


          సర్వ వేదాలను అధ్యయనం చేస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో, సమస్త తీర్థాలలో స్నానం చేస్తే ఏ ఫలం కలుగుతుందో, అటువంటి ఫలమే జనార్ధనుడైన దేవుడిని స్తుతిస్తే పురుషుడికి కలుగుతుంది. అందుకే, చివరగా...ఇలా అనుకోవాలి...."వాసుదేవుడవగు నీవు నివసించిన కారణం వల్ల మూడు లోకాలు నిలుస్తున్నాయి. సర్వాంతర్యామివైన ఓ వాసుదేవా! నువ్వు సర్వ భూతాలకు నివాస స్థానానివి. అలాంటి నీకు నమస్కారం" అని అంటూ, "చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు......ప్రవరాన్విత....గోత్రః....సూత్రః....శాఖాధ్యాయీ, అహంభో అభివాదయే" అంటూ ముగించాలి.End

హిందూ వివాహం కడు రమ్యం : వనం జ్వాలా నరసింహారావు

హిందూ వివాహం కడు రమ్యం
నవ తెలంగాణ దినపత్రిక (07-12-2015)
వనం జ్వాలా నరసింహారావు

వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై, సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొదటిది నిశ్చితార్థం- "నిశ్చయ తాంబూలం". ఒక శుభ ముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించిన తదుపరి, వధూవరుల తల్లి-తండ్రులు లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకుంటారు. దీన్నే ఇప్పుడు "ఎంగేజ్ మెంట్" అంటున్నారు. నిర్ణయించబడిన ముహూర్తానికి వరుని తరపువారూ, వధువు తరపువారూ వారి వారి కులాచారానుసారం "శుభ లేఖలు” గా పిలువబడే ఆహ్వానపత్రికలు ముద్రించుకుంటారు. బంధుగణాన్ని పిలుచు కోవడం పెళ్లిళ్లలో సర్వ సాధారణం. ఎక్కడెక్కడో ఉంటూ, అరుదుగా కలిసే చుట్టపక్కాలతో సహా బంధువులందరూ కలుసుకోగలిగే "సామాజిక ఏర్పాటు" పెళ్ళిళ్లు.

పెళ్లిరోజుకు ఒకరోజు ముందర "స్నాతకం" అనే ముఖ్యమైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. స్నాతకం అనే ఈ "సంస్కారం", ప్రధానంగా, వరుడిని "బ్రహ్మచర్యం" నుండి "గృహస్థాశ్రమం" స్వీకరించడానికి సిద్ధంచేస్తున్న కార్యక్రమం. గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో-అంగీకారంతో "గృహస్థాశ్రమం" స్వీకరించే ఏర్పాటిది. ఆ సమయంలో గురువు ఒక శ్లోక రూపంలో హిందూ వివాహ సంప్రదాయ పద్ధతిలో భారతీయ ఆలోచనా విధానాన్ని తెలియచేస్తాడిక్కడ. కాశీ యాత్ర, హోమ కార్యాలు నిర్వర్తించి, దండాన్ని ధరించి, గొడుగు పట్టుకొని కాశీ యాత్రకు బయలుదేరే ఘట్టం సాంప్రదాయంలో మరో ముఖ్యమైన ఆచారం. కోలాహలంగా పెళ్ళికి "తరలి పోయే ముందర" కాశీ యాత్ర ఘట్టం స్నాతకంలో చాలా సరదాగా జరిగే కార్యక్రమం.

పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ, స్నాతకం-అంకురార్పణల రోజున గానీ పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును చేయడం ఆచారం. మంగళ స్నానాలతో ఆ ఉదయం కార్యక్రమం మొదలవుతుంది. తెల్లవారక ముందే, ముత్తైదువలు పెళ్ళి కూతురుకు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. అలానే వరుడికి కూడా జరుగుతుంది. అంకురార్పణగా పిలిచే ఆ వేడుకకు కన్యా దాత దగ్గరి బంధువులందరూ వస్తారు. నవ ధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి మొలకెత్తే విధంగా అమర్చడాన్ని "అంకురార్పణ" లో చేస్తారు. స్నాతకం చేసుకున్న రోజునే మగ పెళ్లివారు ఆడ పెళ్ళివారి వూరికి తరలి పోతారు. ఒక్కోసారి అక్కడకు పోయి స్నాతకం చేసుకుంటారు.

మగ పెళ్ళి వారు విడిదికి చేరుకోగానే, అప్పటికే వారికొరకు ఎదురు చూస్తున్న ఆడ పెళ్లి వారు, "ఎదురు కోలు" పలికే ఆచారం సరదాగా-సందడిగా జరుపుకునే మరో వేడుక. మేళ-తాళాలతో ఆహ్వానించి కాబోయే అత్తగారు, మామ గారు, వారి సమీప బంధువులు ఎదురుకోలలో భాగంగా, విడిదిలోకి ప్రవేశించే ముందర కాళ్లు కడుక్కోవడానికి మగ పెళ్ళి వారందరికీ నీళ్లిస్తారు. పెళ్ళికొడుకు ఆ పనిని బావమరిదితో చేయిస్తారు. వివాహం ముహూర్తం నాడు పెళ్లికి ముందు-పెళ్ళిలో-పెళ్లైన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలెన్నో వున్నాయి. తెలుగు వారి పెళ్ళిళ్లలో ఉండే సందడి, సంతోషం ఎంత మోతాదులో వుంటుందో ఎవరూ చెప్పలేరు. సకుటుంబ పరివార సమేతంగా, బాజా భజంత్రీల నడుమ, సంతోషంగా జరిగే ఆ కళ్యాణ మహోత్సవం అందరి జీవితాలలో ఒక మరవలేని సంఘటన. ఒక వైపు వధువు గౌరీ పూజ, మరో వైపు వరుడున్న విడిదిలో వర పూజకు సన్నాహాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయం ప్రకారం వధువుని "లక్ష్మి, పార్వతి, సరస్వతి” ల ఉమ్మడి రూపంగా భావిస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి ప్రతిరూపంగా వధువుని అలంకరిస్తారు. ఇక వరుడిని త్రిమూర్తుల దివ్యస్వరూపంగా, విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషుడుగా భావిస్తారు.

బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని పొందేందుకు కన్యా వరణానికి వచ్చే వరుడికి ఎదురేగి "నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్ధిల్ల” మని కన్యా దాత దీవించే కార్యక్రమంతో వివాహ మండపం వద్ద జరగబోయే వేడుక మొదలవుతుంది. హిందూ వివాహ సంప్రదాయం ప్రకారం, "నారాయణ స్వరూపుడైన వరుడికి" పాద ప్రక్షాళన లాంటివి జరిపించి, కన్యా దాత ఆతిధ్యం ఇస్తారు. దీనినే "మధు పర్కం" అని పిలుస్తారు. మధు పర్కాలుగా ఇచ్చిన నూతన వస్త్రాలను ధరించి వరుడు వివాహ వేదిక మీద జరగాల్సిన వేడుకకై వేచి వుంటాడు. వరుడు ఆ పనిలో వున్నప్పుడు, తర్వాత కార్యక్రమం జరిపించడానికి, కన్యా దాత వరుడు నాన్న గారిని తీసుకొని వధువు గౌరీ పూజ చేస్తున్న చోటుకెళ్తారు.

గౌరీ పూజ జరిగే చోట ఒక్క సారి, లాంఛనంగా, ఇరు పక్షాల వారి గోత్రం-ప్రవర చెప్పే కార్యక్రమం, పురోహితుల చాతుర్యాన్ని బట్టి అత్యంత ఆసక్తికరంగా-విన సొంపుగా వుంటుంది. "చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శ్శుభం భవతు-…. …. …. త్రయార్షేయ ప్రవరాన్విత యజుర్వేదినే, తైత్తిరీయ శాఖాధ్యాయినే, ఆపస్తంబ సూత్రిణే, ….. …. శర్మణో నప్త్రే, …. … శర్మణ పౌత్రాయ, … …. శర్మణ పుత్రాయ, .. … శర్మణే వరాయ, భవదీయాం కన్యాం ప్రజాసహత్వ కర్మభ్యో వ్రణీమహే" ("మూడు ఋషులున్న …… గోత్రం కలవాడూ, యజుర్వేదాన్ని అభ్యసించినవాడూ, ఆ వేదం ప్రకారం తన ఇంటి కార్యక్రమాలను నడిపించేవాడూ, తైత్తరీయ శాఖను-ఆపస్తంబ సూత్రాన్ని అభ్యసించి అనుసరించేవాడూ, … మునిమనుమడూ, …. మనుమడూ, …. పుత్రుడూ అయిన … అనే వరుడికి మీ కూతురునిచ్చి వివాహం చేయమని అడగడానికి వచ్చాం") అని అడుగుతాడు. ఇలా వంశం వివరాలు చెప్పడం వల్ల కన్యా దాత చివరివరకూ ఆలోచించుకునే అవకాశం వుందింకా. ఇవేవీ తెలియకపోతే (అందరి సమక్షంలో), ఫలానావారి పిల్లవాడిని చేసుకున్నాం-ఇప్పుడు అనుభవిస్తున్నాం అని భవిష్యత్‌లో అనవచ్చు. కన్యా దాత, వరుడి వివరాలు ముత్తాత తరం దగ్గర నుండి విన్న తర్వాత, ఆ సంబంధం తనకి ఇష్టమైతే, వెంటనే తన వధువు (కూతురు) వివరాలు కూడా చెప్పి అబ్బాయి తన కూతురుని చేసుకోమని అడుగుతాడు.

గౌరీ పూజ దగ్గర గోత్రం-ప్రవరల వేడుక ముగిసిన పిదప, వధువు మేనమామలు పెళ్ళి కూతురిని గంపలో కూర్చొబెట్టి వివాహ వేదిక పైకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చాలా సరదాగా వుంటుంది. ఇందులోనూ ఒకరకమైన సామాజిక స్పృహ కనిపిస్తుంది. తల్లి తర్వాత మేనమామలు ముఖ్యమని తెలియచేయడమే దీని అర్థం. గంపలో ధాన్యం కూడా పోస్తారు. కొబ్బరి బోండా మానసిక స్వచ్ఛతకు చిహ్నం. అలానే, అందులోని పీచులాగా, ఎల్లవేళలా ఇరువురు విడిపోకుండా, అల్లుకు పోయి జీవిస్తామని-సత్ సంతానం కలవారమవుతామని సంకేతం కూడ ఈ వేడుకలో వుందంటారు పెద్దలు. కళ్యాణ వేదిక పైన వున్న వరుడి కాళ్లు కడిగే కార్యక్రమం, వివాహంలో, అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న మరో ముఖ్యమైన ఘట్టం. వధువుని గంపలోనే వుంచి మహా సంకల్పంతో ఆరంభించి, తర్వాత జరగాల్సిన వేడుక మొదలు పెట్తారు పురోహితులు.

వధూవరులు సాక్షాత్తు "లక్ష్మీ-నారాయణ స్వరూపులు" గా భావించుతారు కాబట్టి, ఆ విధంగానే "లక్ష్మీ నారాయణుల కల్యాణం" లా జరిపించుతారు. "మహా సంకల్పం" చెప్పడం, సృష్టి క్రమంతో మొదలుపెట్టి, పరమేశ్వరుడి శక్తి-సామర్థ్యాలు అనంతమని-అచింత్యాలని, ఆయన అనుగ్రహంతోనే యావత్ సృష్టి జరిగిందని కొనసాగింది. మానవుడి మేథస్సు ఊహించనలవికాని పరిమాణంలో వున్న ఈ జగత్తు, పరమేశ్వరుడి ఆద్యంతాలు లేని రూపంలో ఒక అతి చిన్నదైందని పురోహితుడంటాడు. అఖిలాండ బ్రహ్మాండంలో, అనేకానేక చిన్న-చిన్న గోళాలున్న ఖగోళంలోని అత్యంత సూక్ష్మమైన భూగోళంలో, భరత ఖండంలో, మారు మూలనున్న మానవుడు, అణు పరిమాణంలో వున్న చిన్న భాగమని తెలియచేసే దే మహా సంకల్పం. ఇది చెప్పడం ద్వారా, పరమాత్మ స్వరూపాన్ని ఎరుక పరిచి, మానవుడి అహంకారాన్ని తగ్గించుకోమని, వినయ సంపదను పెంచుకోమని సూచించడం జరుగుతుంది. మహా సంకల్పం విశ్వ స్వరూపాన్ని, ఖగోళ స్థితిని చక్కగా వివరిస్తుంది.

ఇక ఆ తర్వాత, "కన్యా దానం" తంతు, అంటే, ముహూర్తం సమయం దగ్గరపడుతున్నదని అర్థం. "కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగీషియా" !! అన్న వాక్యాలు పురోహితుడి నోటి వెంట వస్తాయి. దీని అర్ధం-"ఈమె బంగారం వంటి మనస్సు కలది. కనకం వంటి శరీర చాయ కలది. శరీరమంతా ఆభరణాలు కలిగినది. నా పిత్రాదులు సంసారంలో విజయం పొంది శాశ్వత ప్రాప్తి పొందినట్టు శృతి వలన విన్నాను. నేనూ ఆ శాశ్వత బ్రహ్మలోకప్రాప్తి పొందేందుకు విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానం చేస్తున్నాను" అని కన్యా దాత అంటారు. ఇంకా ఇలా చెప్పాలి కన్యా దాత: " సమస్త ప్రపంచాన్ని, అఖిలాండ బ్రహ్మాండాలను భరించే శ్రీ మహావిష్ణువు-పంచభూతాల-సర్వ దేవతల సాక్షిగా, పితృదేవతలను తరింపచేసేందుకు, ఈ కన్యను దానం చేస్తున్నాను. సౌశీల్యం కలిగి, బుద్ధిమంతుడి వైన నీకు, ధర్మార్థ కామాలు సిద్ధించేందుకు, సాలంకృత సాధ్వియైన ఈ కన్యను సమర్పించుకుంటున్నాను". ఇలా అంటూ, మామ గారు (కన్యా దాత) (వరుడి) చేతిలో నీళ్లు పోసి మరో మాటంటారు. "నీకు దానం చేసినప్పటికీ, ఈ కన్య నా కుమార్తే సుమా!" అని. ఇలా అంటూనే, "ధర్మేచ, అర్థేచ, కామేచ, ఏషా నాతి చరితవ్యా" అని ప్రతిజ్ఞ చేయిస్తారు కన్యా దాత వరుడితో. దీనికి సమాధానంగా, "నాతి చ రామి" అని వరుడితో చెప్పించాలి. సుముహూర్తం వచ్చేస్తున్నదనె దీనర్థం.

వధూ-వరులను కళ్యాణ వేదికపై, తూర్పు-పడమర ముఖంగా కూచోబెట్టి, మధ్య ఉత్తర-దక్షిణ ముఖంగా తెరను అడ్డం పెట్టి, ఇరువురి చేతికి "జీల కర్ర- బెల్లం" కలిపిన ముద్దను ఇస్తాడు పురోహితుడు. నిర్ణయించిన ముహూర్తానికి వరుడు-వధువు ఒకరి తలపై ఇంకొకరు "జీలకర్ర-బెల్లం" పెట్టడం జరుగుతుంది. నిజానికిదే సుముహూర్తం (జీల కర్ర-బెల్లం శిరస్సుపై వుంచడం). మంగళ వాయిద్యాలు మోగిస్తుంటే, పురోహితుడు మంత్రాలు చదువుతుంటే, గౌరీ దేవిని ధ్యానించుకుంటూ వధువు, వరుడు ఏక కాలంలో నిర్ణయించిన ముహూర్తానికి ఒకరి శిరస్సు మీద మరొకరం (బ్రహ్మ రంధ్రం మీద) జీల కర్ర-బెల్లం కలిపిన ముద్దను వుంచుకుంటారు. సుముహూర్త కాలంలో పెద్దల ఆశీర్వాదాన్ని పొందుతారు. పురోహితుడి తర్వాత, తల్లి-తండ్రులతో మొదలయ్యి, పెద్దలందరూ అక్షితలు చల్లుతారు దంపతులు మీద.


వివాహం అయినప్పటి నుంచీ, మహిళలు "మంగళ సూత్రం" ధరించడం భారతీయ సంప్రదాయం-హిందువుల ఆచారం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళి నాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం అనాదిగా వస్తున్నది. సాధారణంగా మంగళసూత్రాన్ని సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. మంగళ సూత్ర ధారణకు ముందు, మేనమామ గారు పెట్టిన "మధు పర్కం చీరె" ను, వధువుతో ధరింపచేస్తారు. మంగళ సూత్రాలకు గౌరీ దేవి అనుష్టాన దేవత. రెండు సూత్రాలలో (శత మానములు) ఒకటి అత్తింటి వారు, ఇంకోటి పుట్టింటి వారు చేయించడం ఆచారం. మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే, పురోహితుడు ""మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా ! కంఠే మిద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం !!"" అని చదువుతుంటే, వరుడితో మంగళ సూత్రాన్ని, వధువు మెడలో ధారణ చేయించుతారు, పురోహితుడు మూడు ముళ్లు వేయమంటారు. మూడు ముళ్లంటే, మూడు లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ-రజ-తమో గుణాలకు సంకేతం. చదివిన మంత్రానికీ అర్థముంది-"ఓ సుందరీ ! ఈ మంగళ సూత్రాన్ని, నీ మెడలో కడుతున్నాను. ఇది సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. నా జీవితం దీనిపైనే ఆధారపడి వుంది. నీవు శతాయుర్ధాయం కలదానివిగా వుండు" అని. మంగళ సూత్ర ధారణ అవుతూనే వేద పండితులు ఆశీర్వదించుతారు. "శతమానం భవతి, శతాయుః పురుష !" అనే మంత్రాన్నీ చదువుతారు. అందుకే, వీటికి "శత మానములు" అని పేరొచ్చింది.

మాంగల్య ధారణ అనంతరం అత్యంత కోలాహలంగా-ఇరువైపు బంధుమిత్రుల మధ్య పోటీలాగా జరిగే తంతు వధూ-వరులు "తలంబ్రాలు" పోసుకోవడం. ఎందుకంటే, వధూవరులుతో పాటు, బంధుమిత్రులకు కూడా చక్కటి వినోదాన్ని-ఆనందాన్ని కలిగించే కార్యక్రమం ఇది. మంగళ సూత్ర ధారణ పూర్తైన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకోవడం హిందూ సాంప్రదాయం. దీనిని అక్షతా రోహణం అని కూడా అంటారు కొందరు. "తలన్+బ్రాలు" అంటే తల నుండి క్రిందికి జారేవి అని కూడా అర్థం. అర్థాలు ఏవైనా, ఇదొక ఆనంద ప్రదమైన ఆచారం. వధూవరుల గృహస్థా శ్రమ జీవితం శుభప్రదంగా, మంగళ ప్రదంగా వుండాలని "మంగళ ద్రవ్యాలతో" చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ ఇది. పసుపు-బియ్యం-నెయ్యి-ఆవు పాలు అనే మంగళ ద్రవ్యాలతో ఈ తంతు జరిపిస్తారు. మంత్రాల మధ్య, వరుడి చేతితో కొబ్బరి చిప్పలో తీయించిన తలంబ్రాలు వధువు తలపైన మొదలు పోయిస్తారు. "నీవలన నాకు సంతానం అభివృద్ధి చెందుగాక" అని వరుడితో అనిపించుతారు. దానికి వధువు సమాధానం చెప్పకుండా, అంగీకార సూచకంగా, పురోహితుడు చెప్పిన పద్ధతిలో, వరుడి లాగనే తలంబ్రాలు తీసుకొని, వరుడి శిరస్సుపై పోస్తుంది. మొదటిసారి అలా పోస్తున్నప్పుడు, "పుట్టబోయే సంతానానికి పాల కొరకు" అన్న అర్థం వచ్చే రీతిలో, "నా పశు సంపద అభివృద్ధి చెందుగాక" అని వధువుతో అనిపించుతారు. దీనికి అంగీకార సూచకంగా వరుడు తలంబ్రాలు పోయాలి. ఇలా మూడు పర్యాయాలు ఇలాంటి అర్థస్ఫూర్తిగల మంత్రాల చదువుతుంటే, వధూవరులు తలంబ్రాలు పోసుకుంటారు. చివరికి అదొక పోటీలాగా ఒకరి శిరస్సుపై మరొకరు పోసుకోవడం ఇటీవలి కాలంలో ఆచారంగా మారింది. తలంబ్రాల పళ్లెం ఎత్తి శిరస్సుపై కుమ్మరించడం కూడా పరిపాటై పోయింది.

ఈ తంతు ముగిసిన తర్వాత, "బ్రహ్మ ముడి" వేడుక జరుగుతుంది. వధువు చీరె కొంగు అంచును, వరుడి ఉత్తరీయం అంచుకు కలిపి ముడివేస్తారు. బ్రాహ్మణుల ఆశీర్వచనాలను దంపతుల కొంగులలో ముడి వేయడం అనే భావన వుందిందులో. ఇకనుంచి, ఇరువురు కలిసి-మెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, "ఇంటి యజమానురాలు" గా అన్ని బాధ్యతలు స్వీకరించి, నీ ఇంటిని నువ్వే చక్కదిద్దు కోవడానికి రమ్మని, వేద మంత్రాల ద్వారా వధువుని కోరుతాడు వరుడు.

తలంబ్రాల కార్య క్రమం, బ్రహ్మ ముడి వేయడంతో ఇక వధూవరులను వివాహ వేదిక పైనుంచి కిందికి దింపుతారు. సాధారణంగా గౌరీ పూజ జరిపించిన చోటనో, లేకుంటే మరో అనువైన స్థలంలోనో, హోమం ఏర్పాటు చేసి స్థాళీపాకం వేడుక జరిపిస్తాడు పురోహితుడు. ఇందులో భాగంగా హోమం దగ్గర అన్నం వండించే పని, ఆ తర్వాత సప్తపది వుంటుంది. వివాహంలో సప్తపది అతి ముఖ్యమైన ఘట్టం. పరమ పావన మూర్తి అగ్నిహోత్రుడి సాక్షిగా, అగ్నిహోత్రుడి చుట్టూ, పాణి గ్రహణం తర్వాత వధూవరులిద్దరు, వధువు కుడి కాలి అడుగుతో ఆరంభించి, ఏడు అడుగులు వేయిస్తారు. దీనిని సప్తపది అని అంటారు. సప్తపది తర్వాత మరో ముఖ్యమైన వివాహ వేడుకలు, నాగవల్లి-సదశ్యం. ఆ తర్వాత అప్పగింతల కార్యక్రమం. నాగవల్లిలో పెళ్లి కూతురుకు భర్తతో కాలి మెట్టెలు తొడిగించే కార్యక్రమం, గుచ్చిన నల్లపూసల తాడును వధువు మెడలో కట్టించే కార్యక్రమం జరిపించుతారు. నల్ల పూసలతాడును కూడా మూడు ముళ్లు వేయించుతారు.

కన్యా దాత ఇంట్లో జరిగే వేడుకల్లో "అప్పగింతలు" కార్యక్రమం అన్నింటిలోకి చివరిది-ఉద్వేగ భరితమైంది. సాధారణంగా పెళ్లి జరిగిన రోజున అర్థరాత్రి దాటింతర్వాత అప్పగింతల మంత్రంతో మొదలవుతుంది కార్యక్రమం. భజంత్రీలు అప్పగింతల పాట పాడుతుంటే, పెళ్ళి పీటపై వధువును మధ్యలో కూర్చుండ బెట్టి, పాలలో చేతిని ముంచిన తర్వాత అప్పగింతల తంతు జరుగుతుంది. అప్పగించిన పెద్దలందరికీ బట్టలు పెట్టే తంతుంటుంది. అప్పగింతల ముందర "వడి కట్టు" వధువుకు కట్టు తారు. ఈ అప్పగింతలు చేసేవారికి, చూసే వారిలో చాలామందికి కంట తడిపెట్టిస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ఇన్నాళ్లుగా పెంచి పోషించిన కూతురు తమను విడిచి అత్త వారింటికి వెళుతుందని ఆమెను వదలి వుండాలే అనే బాధ కన్నవారికి కలగడం సహజం. అప్పగింతల కార్యక్రమం అనంతరం, పెళ్ళికూతురును లోపటికి తీసుకునిపోయి, పెరుగు అన్నం పెట్టి, దేవుడికి దండం పెట్టించి, బయట ఇంటి సింహద్వారం దగ్గర తల్లి కడుపుపై మజ్జిగతో అద్దించి, గడపకు చేతులతో కొట్టించుతారు. ఇవన్నీఅయ్యాక విడిది గృహ ప్రవేశానికి పంపుతారు. ఇక అంతటితో కన్యా దాత ఇంటినుంచి ముందు జరగాల్సిన వేడుక, విడిదికి-అక్కడినుంచి పెళ్లికొడుకు ఇంటికి మారుతుంది.

హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది. End


Saturday, December 5, 2015

బ్రాహ్మణులంటే ఎవరు? : వనం జ్వాలా నరసింహారావు

బ్రాహ్మణులంటే ఎవరు?
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (06-12-2015)

నువ్వెవరివి? అని అడుగుతే తాను ఎవరో-ఏంటో, చెప్పుకోలేని స్థితిలో వున్నారు నేటి బ్రాహ్మణులు. బ్రాహ్మణ ఔన్నత్యాన్నీ, బ్రాహ్మణ మూల విశేషాలను, ఏ మాత్రం తెలియని అనేకమంది తమ నోటికొచ్చినట్లు బ్రాహ్మణులను చిన్న చూపు చూస్తూ మాట్లాడే రోజులొచ్చాయి. బ్రాహ్మణ విమర్శకులు, "ఓహో...బ్రాహ్మణులంటే ఇంత గొప్ప వారా? వీళ్లకు ఇంత తెలుసా? బ్రాహ్మణులకి ఇంత విస్తారమైన చరిత్ర వుందా? వీరిని బాపనోడు, బామ్మడు, పంగనామాలోడు అని హేళన చేయవచ్చా?" అన్న ఆలోచన కలుగజేయాలి. హైందవ మతానికి, లేదా, వైదిక మతానికి ఒక ప్రత్యేకత వుంది. వాల్మీకి రామాయణం రాసే కాలంలోనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలు వాడుకలో వున్నాయి. ఐతే, పుట్టుకతో అందరూ శూద్రులే ఐనప్పటికీ, తమ తమ విధి నిర్వహణ సంస్కారాలను బట్టి, బ్రహ్మ జ్ఞానం సంతరించుకున్న తదుపరి, బ్రాహ్మణులుగా అవుతారని శంకరాచార్యులవారు వివరించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ద్విజులని, విప్రులని, బ్రాహ్మణులని మూడు విడి-విడి పదాలున్నాయి. వీటి అర్థం ఒకటే ఐనా, కొంత వ్యత్యాసం వుంది. సమాజం అభివృద్ధి చెందిన నేడు కూడా, సామాజిక అవసరాల దృష్ట్యా, చాతుర్వర్ణాలుండవచ్చు కదా! అనాదిగా వస్తున్న సాంప్రదాయాలకు అనుగుణంగా, పౌరాణిక-ఐతిహాసిక కథనాల ప్రకారం, చాతుర్వర్ణ వ్యవస్థలో అత్యున్నతమైంది బ్రాహ్మణ్యం.

           "బ్రాహ్మణులు" అనే మాట "బ్రహ్మన్" - అంటే "యజ్ఞం” అనే పదం నుంచి వచ్చింది. యజ్ఞాలు చేసే వారు బ్రాహ్మణులని చెప్పుకోవచ్చు. అలానే "బ్రహ్మ" అంటే వేదం అని, జ్ఞానం అని, వీటి నుంచే బ్రాహ్మణ శబ్దం వచ్చిందని కూడా అంటారు. వేదాధ్యయనం చేసిన వాడు, ఆత్మ జ్ఞానం తెలిసిన వాడే బ్రాహ్మణుడని అర్థం. బ్రాహ్మణ స్త్రీ యందు, బ్రాహ్మణ పురుషుడి వలన జన్మించి,  తదుపరి,  జాతి, కులం,  వృత్తి,  స్వాధ్యాయం,  జ్ఞానాల వల్ల బ్రాహ్మణుడిగా పిలువబడతాడు. తాను నిరంతరం చదువుకుంటూ వుండడం, శిష్యులకు బోధించడం, యజ్ఞాలు చేయడం, యజమానులతో చేయించడం, దానాలు ఇవ్వడం-తీసుకోవడం బ్రాహ్మణులు చేయాల్సిన పని. బ్రాహ్మణ వంశంలో పుట్టిన వారందరూ బ్రాహ్మణులు కాలేరు. వారిలో ఉపనయనాది సంస్కారాలు, వైదిక కర్మలు లేని వారిని "మాత్రులు" అని; వైదికాచారాలు పాటిస్తూ శాంత స్వభావులైన వారిని "బ్రాహ్మణులు" అని; బ్రాహ్మణోచితమైన షట్ కర్మలను ఆచరించే వారిని "శ్రోత్రియులు" అని; నాలుగు వేదాలను అధ్యయనం చేసిన వారిని, విద్వాంసులను "అనూచానులు" అని; ఇంద్రియాలను తమ వశంలో వుంచుకున్న వారిని "భ్రూణులు" అని; ఎప్పుడూ ఆశ్రమంలోనో, అరణ్యంలోనో వుండే వారిని "ఋషికల్పులు" అని; రేతస్కలనం లేక సత్య ప్రజ్ఞులైన వారిని "ఋషులు" అని; సంపూర్ణ తత్వ జ్ఞానం కలవారిని "మునులు" అని అంటారు.

          అఖండ భారత దేశంలోని అన్ని ప్రాంతాలలో బ్రాహ్మణులు విస్తరించి వున్నారు. ఉత్తర భారతంలో పంచ గౌడులుగా, దక్షిణ భారతంలో పంచ ద్రావిడులుగా పిలువబడే బ్రాహ్మణులు, భారతావనికి ఆవల వున్న దేశాలలోనూ వున్నారు. నేపాల్‌లో "బహున్" లుగా, మయన్మార్‍లో "పొన్న" లుగా, వివిధ పేర్లతో బ్రాహ్మణులున్నారు. దక్షిణాది బ్రాహ్మణులలో స్మార్తులని, వైష్ణవులని, మధ్వులని మూడు ప్రధానమైన విభాగాలున్నాయి. వింధ్య పర్వతాలకు దక్షిణాన వున్న బ్రాహ్మణులలో తెలుగు వారికి ఒక ప్రత్యేక స్థానం వుంది. వీరిని తెలుగు బ్రాహ్మణులంటారు. వీరిలో స్మార్తులు అత్యధికులు. మధ్వుల సంఖ్య పరిమితం. తెలుగు స్మార్త  బ్రాహ్మణులలో ప్రధానమైన తెగలు పది వరకూ వున్నాయి. వారిని, తెలగాణ్యులు, మురికినాడు, వెలనాడు, కాసలనాడు, కరణకమ్మలు, వేగినాడు, తొడ్రనాడు, ఔదమనాడు, కోన సముద్ర ద్రావిడులు, ఆరామ ద్రావిడులు అని పిలుస్తారు. ఈ పది తెగల వారు కూడా వైదికులే. స్మార్తులలో ఒక విభాగం వైదికులైతే, మరో విభాగం వారిని నియోగులంటారు.

          వేద వేదాంగ విహితమైన పౌరోహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ, సమాజంలో అందరూ తమ తమ జన్మానుసారం చేయదగిన కులపరమైన సంస్కార నిర్వహణకు మంత్ర సహితమైన కర్మ-కాండలలో తోడ్పడుతూ, ప్రజాసేవకు అంకితమవుతున్న వారిని "వైదికులు" అంటారు. వీరు వేద విద్యాభ్యాసం, వేద విద్య ప్రచారం, వేద విద్యానుగతమైన యజ్ఞకార్యాదుల నిర్వహణలో నిమగ్నమవుతూ వుంటారు. సమాజంలో వస్తున్న మార్పులకనుగుణంగా వీరిలో పలువురు వర్తమాన కాలంలో వివిధ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంతకూ ఏ వేదం చదివిన వారిని వైదికులని పిలవాలి? ఏక వేద పాఠకులను వైదికులని, ఒకటికి మించి ఎక్కువ చదివితే ద్వివేదులని, త్రివేదులని, చతుర్వేదులని పిలుస్తున్నారు. ఒకప్పుడు ప్రజ్ఞా పాటవాలకు లభించిన ఈ బిరుదులు ఇప్పుడు ఇంటి పేర్లుగా మారిపోయాయి.

          వైదికులనుండి విడిపోయి, ప్రత్యేక శాఖగా ఏర్పడిన వారు "నియోగులు". వారిలో, ఆరు వేల, నందవరీక, కరణకమ్మ, వెలనాటి, తెలగాణ్య, ద్రావిడ, కరణాలు, శిష్టకరణాలు, కాసలనాటి, పాకలనాటి నియోగులని రకరకాల ఉప శాఖల వారున్నారు. నియోగులనే పదానికి అర్థం, కరిణీకం, మంత్రి పదవి లాంటి లౌకిక కార్యాలలో రాజులచే వినియోగించబడిన వారని. పౌరోహిత్యం వృత్తిగా కాకుండా, లౌకిక ఉద్యోగాల మీద ఆధారపడిన వారే నియోగులు. వీరిలో ఆరు వేల నియోగులది పెద్ద ఉప శాఖ. ఐతే, వీరు ఆరువేల గ్రామాలకు చెందిన వారో, ఆరువేల గ్రామాలకు నియోగించబడిన వారో అనే విషయం ఇదమిద్ధంగా తేలలేదు. శతాబ్దాల క్రితం ఆంధ్ర దేశాన్ని పాలించిన రాజులు పరిపాలనా సౌలభ్యం కొరకు రాష్ట్రాన్ని పలు చిన్న ప్రాంతాలుగా విభజించారు. నియోగులలో చాలా శాఖలు లేదా విభాగాలు ప్రాధమికంగా ప్రాంతాల ఆధారంగా రూపొందినవే. కాకతీయుల పరిపాలనా కాలంలో, ఆరువేల మంది బ్రాహ్మణులను, స్థానిక గ్రామాలకు చెందిన రికార్డుల నిర్వహణ కొరకు గ్రామాధికారులుగా, గ్రామ కరణాలుగా నియోగించి నందువల్ల, వారికి ఆరువేల నియోగులన్న పేరొచ్చిందంటారు. అంతవరకూ యుద్ధాలలో కూడా పాల్గొన్న బ్రాహ్మణులు పాలనా రంగంలోకి వచ్చారు. మరో కథనం ప్రకారం, మహాభారతాన్ని ఆంధ్రీకరించిన నన్నయ కాలానికి తరువాత, తిక్కన కాలానికి ముందు నియోగి బ్రాహ్మణుల తెగ ఏర్పడి వుండవచ్చు.     వేంగీ చాళుక్యుల కాలంలో బ్రాహ్మణుల చరిత్ర గొప్ప మలుపు తిరిగింది. అంత వరకు, వేద పఠనానికి, పురోహితానికి మాత్రమే పరిమితమైన బ్రాహ్మణులు, మంత్రాంగ, మంత్రిత్వ నిర్వహణలకు పూనుకున్నారు. బహుశా అప్పటి నుంచి వైదిక, నియోగి శాఖలు ఏర్పడి వుండవచ్చు. మొత్తం మీద బ్రాహ్మణులలో నియోగి శాఖ ఎలా ఏర్పడిందనే అంశంపై చాలా కథలు ప్రచారంలో వున్నాయి. వేటిలో ఏది నిజమో, ఏవి కావో మరింత పరిశోధనలు చేయాల్సి వుంటుంది.

వైదికులైనా, నియోగులైనా, తమ పని తాము చేసుకుని పోతున్న బ్రాహ్మణులను, తమ బ్రతుకేదో తాము బ్రతుకుతున్న బ్రాహ్మణులను చీటికి-మాటికీ వేలెత్తి చూపుతూ, వారేదో తప్పు చేశారని చరిత్ర వక్రీకరించి మాట్లాడడం ఎంతవరకు సబబు?

చివరకు జరిగిందేంటి? ఆర్థికంగా బ్రాహ్మణులు బాగా చితికి పోయారు. వ్యవసాయం మీద, భూమి మీద ఆధారపడిన బ్రాహ్మణులు, చట్టాల పుణ్యమా అని ఆ రకమైన ఉపాధిని కోల్పోయారు. వున్న భూమి వ్యవసాయ భూపరిమితి చట్టం కింద ప్రభుత్వానికి పోయింది. రోజు గడవడం కష్టమైంది. ఒక నాటి పౌరోహిత్యం, పూజారి జీవితం, ఆయుర్వేద వైద్యం బ్రాహ్మణుల బ్రతుకు తెరువుగా కొనసాగడం కష్టమై పోయింది. వీటికి ఒకనాడు లభించిన గౌరవ మర్యాదలు కూడా కరవై పోయాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బ్రాహ్మణుల స్థితిగతులపై అధ్యయనం చేసిన ఒక సంస్థ, పలు ఆసక్తికరమైన నిజాలను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్రంలోని దాదాపు పురోహితులందరూ దారిద్ర్యరేఖకు దిగువన వున్నవారేనట. సుమారు 55 శాతం మది బ్రాహ్మణులు జాతీయ సగటు వ్యక్తిగత ఆదాయం కంటే తక్కువగా, దారిద్ర్యరేఖకు దిగువగా జీవనం సాగిస్తున్నారు. అనాదిగా ఆచారంగా వస్తున్న వారి దుస్తుల విషయం కాని, పిలక జుట్టు కాని, ఆచార వ్యవహారాలు కాని, బ్రాహ్మణులను హేళనకు గురి చేస్తున్నాయని అధ్యయనంలో తేలింది. రిజర్వేషన్లు, దిగజారుతున్న ఆర్థిక స్తోమత, వారిని లౌకిక ఉద్యోగాలకు దూరం చేసింది. పాఠశాలలో, కళాశాలలో చదువుకునే బ్రాహ్మణుల సంఖ్య దిన-దినం తగ్గిపోసాగింది. 5-18 సంవత్సరాల వయసున్న బ్రాహ్మణ బాల-బాలికలలో సుమారు 44 శాతం మంది ప్రాధమిక స్థాయిలో, మరో 36 శాతం మంది హయ్యర్ సెకండరీ స్థాయిలో పాఠశాల విద్యకు స్వస్తి చెపుతున్నారు. బ్రాహ్మణే తరుల ఆదాయంతో పోల్చి చూస్తే, నూటికి తొంబై శాతం మంది ఆదాయం చాలా తక్కువ. అనాథ బ్రాహ్మణుల శాతం అఖిల భారత సాధారణ కేటగిరీ సగటు కంటే చాలా ఎక్కువ. ఇంటర్మీడియట్ స్థాయి దాటి చదువు కొనసాగించేవారు దాదాపు లేనట్లే!

కడు బీదరికంతో అల్లల్లాడి పోతున్న పలువురు బ్రాహ్మణులు, పల్లెల నుంచి పట్టణాలకు ఉపాధి కొరకు వలసపోయే పరిస్థితులొచ్చాయి. చేతికందిన పని వెతుక్కుంటున్నారు. మొదట్లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడిపోవచ్చని భావించారు. న్యాయవాద వృత్తిలోనో, వైద్య వృత్తిలోనో చేరుదామని కలలు కన్నారు. అదీ అందని ద్రాక్ష పండే ఐంది. రిజర్వేషన్ల మూలాన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు దొరక కుండా పోయాయి. ప్రయివేట్ గా ఏదన్నా చేసుకుందామంటే ఆర్థిక స్థోమత అడ్డొచ్చింది. చివరకు గృహ సంబంధమైన చాకిరీ చేసే వివిధ వృత్తులలో స్థిరపడి పోవాల్సి వచ్చింది. బ్రాహ్మణులలో నిరుద్యోగ శాతం దాదాపు 75 మేరకు చేరుకుంది. ఆ మధ్యన అమెరికా దేశానికి చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్, బ్రాహ్మణులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. ఒకనాడు ప్రత్యేక హక్కులు కల వర్గంగా భావించబడిన బ్రాహ్మణులు, రారాజుల కనుసన్నలలో జీవనం సాగించిన బ్రాహ్మణులు, గత కొన్ని దశాబ్దాలుగా, భారత ప్రభుత్వ రిజర్వేషన్ చట్టాల మూలంగా, కనీ వినీ ఎరుగని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆ జర్నల్ పేర్కొంది. జాతీయ ఆర్థిక జీవన స్రవంతిలో బ్రాహ్మణుల భాగస్వామ్యం లేకుండా పోతోందని కూడా రాసింది. ఒక నాడు ఇండియన్ సివిల్ సర్వీసులలోను, ఆ తరువాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులలోన, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అధికార స్వామ్యంలోను కీలకమైన స్థానాలలో వున్న బ్రాహ్మణులను, రిజర్వేషన్లు, వాటికి దూరం చేశాయని కూడా జర్నల్ రాసింది. చివరకు రైల్వే కూలీలుగా, రిక్షా కార్మికులుగా, సులభ శౌచాలయ నిర్వాహకులుగా కూడా పని చేస్తున్నారు పలువురు బ్రాహ్మణులు.


ఎప్పుడో, వేల ఏళ్ల క్రితం, అప్పటి బ్రాహ్మణులు ఏదో చేశారన్న నెపంతో, ఈ తరం బ్రాహ్మణులను ఇలా ఇబ్బందులకు గురి చేయడం భావ్యమా? దోపిడీ చేసిన వారు, దోపిడీకి గురైన వారు అంతరించి పోయారు. ఇప్పుడున్నది సమ సమాజం. అందరూ భారత రాజ్యాంగ కింద సమాన హక్కులు కలవారే అంటున్నాం. అలాంటప్పుడు, సమాజంలోని ఒక వర్గం వారిని బ్రాహ్మణులన్న కారణాన చిన్న చూపు చూడడం సమంజసమా? ప్రత్యేక హక్కులు కావాలని వారనడం లేదు. అడగడమూ లేదు. తమను అందరితో సమానంగా చూడమనే అడుగుతున్నారు. ఆర్థికంగా చితికి పోయిన తాము కూడా వెనుకబడిన వర్గాల వారిమే అంటున్నారు. అందరితో పాటు వారినీ సమానంగా చూడడం సమాజం కర్తవ్యం! End