Tuesday, October 11, 2016

చిన్న జిల్లాల ఏర్పాటులో సుదీర్ఘ శాస్త్రీయ ప్రక్రియ : వనం జ్వాలా నరసింహారావు

చిన్న జిల్లాల ఏర్పాటులో సుదీర్ఘ శాస్త్రీయ ప్రక్రియ
వనం జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ దినపత్రిక (11-10-2016)

తుది నోటిఫికేషన్ విడుదల నేపధ్యంలో నేటి నుంచి కొత్త జిల్లాల ఆవిర్భావం కావడంతో, తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా ఒక మహోన్నత పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది. కొందరు విమర్శిస్తున్నట్లు ఇదంతా ఏదో ఆషామాషీగానో, లేదా రాజకీయ కారణాలతోనో, ఆశాస్త్రీయంగానో, అప్రజాస్వామికంగానో, ప్రజాభీష్టానికి విరుద్ధంగానో జరిగింది కాదు. ఒక సుదీర్ఘ ప్రక్రియ ద్వారా, బహు విధాల సలహా-సంప్రదింపుల ద్వారా, చారిత్రిక-భౌగోళిక అనుభవాల ఆధారంగా, దేశంలోని ఇతర జిల్లాలు అనుసరించిన విధానాలను నిశితంగా పరిశీలించి అధ్యయనం చేసిన తరువాత, ఒక కూలంకషమైన చర్చ జరిపి, ఏకాభిప్రాయ సాధనానంతరమే, అత్యంత జాకరూకతతో తీసుకున్న నిర్ణయం. ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను ఒకటి వెంట మరొకటి తుచ తప్పకుండా అమలు పరిచిన-పరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, అందులో భాగంగానే కొత్త జిల్లాల-చిన్న జిల్లాల ఏర్పాటు చేసి, మరో ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మరో నూతనాధ్యాయానికి తెర లేచింది.

రాష్ట్రంగా ఏర్పాటైన అచిరకాలంలోనే, తెలంగాణ ప్రగతి పధంలోకి దూసుకుపోతున్న నేపధ్యంలో, జిల్లాల విభజన జరిగి చిన్నవిగా ఏర్పాటు చేస్తే ప్రజలకు క్షేత్రస్తాయిలో సుపరిపాలనకు మార్గం సుగమమవుతుందనీ, తద్వారా బంగారు తెలంగాణ సాధన వేగవంతం అవుతుందనీ భావించిన ముఖ్యమంత్రి దాదాపు ఏడాది క్రితమే ఆ దిశగా ఆలోచన మొదలు పెట్టారు. నూతన తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు చారిత్రక ఘట్టంగా నిలిచిందని, జిల్లాలు మండలాల పెంపు మరో చారిత్రక ఘట్టంగా నిలవనున్నదని అప్పుడే అన్నారాయన.  నూతన జిల్లాల ఏర్పాటు ప్రకటనకు కూడా అప్పుడే రంగం సిద్ధమైంది.  ఆలోచన కార్యరూపం దాల్చే దిశగా కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణను తక్షణమే రూపొందించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. అలా యావత్తు ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా జిల్లాల పెంపును  శాస్త్రీయ పద్దతిలో చేపట్టాలని కూడా అప్పుడే అధికారులకు సిఎం సూచించారు.

తొలుత, ఏనాడో, సెప్టెంబర్ నెల 2015 లోనే ప్రధాన కార్యదర్శి  అధ్యక్షతన, రెవెన్యూ, పంచాయితీరాజ్, మునిసిపల్ శాఖ, సీసీఎల్‍ఏ లు సభ్యులుగా కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ తరువాత ఉపముఖ్యమంత్రి మెహమూద్ అలీ అధ్యక్షతన, మరో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపెల్లి కృష్ణారావులు సభ్యులుగా, ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కన్వీనర్ గా ఒక కాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి జిల్లాల పునర్వవస్తీకరణపై కసరత్తు చేయమని ప్రభుత్వం కోరింది. ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ సుదీర్ఘమైన కసరత్తు చేసింది. అలానే కాబినెట్ సబ్ కమిటీ జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి పెద్ద ఎత్తున అభిప్రాయ సేకరణ చేసింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ముందర జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి  అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కూడా జరిగింది. అన్ని పార్టీల నాయకులందులో పాల్గొన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటామని అన్న ముఖ్యమంత్రి అలానే చేసారు. వాస్తవానికి ఆ సమావేశంలో, తెలంగాణలో పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలకు సౌకర్యంగా ఉండడం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని రాజకీయపక్షాలు స్వాగతించాయి. ప్రభుత్వ ప్రతిపాదనలను దాదాపు పాల్గొన్న అందరు నాయకులు ఆమోదించారు. డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రతిపక్షాలు కొన్ని సూచనలు చేయగా, వాటిని పరిగణలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆ సూచనలన్నీ పరిగణలోకి తీసుకున్నారు కూడా.  చివరకు జిల్లాల ఏర్పాటు  నేపథ్యంలో పరిపాలన విభాగాల కూర్పును పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నేతృత్వంలో టాస్క్ ఫోర్సు కమిటీని సహితం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రాజ్యసభ సభ్యుడు కేశవరావు అధ్యక్షతన హైపవర్ కమిటీని కూడా నియమించింది. పునర్వ్యవస్తీకరణ చేపట్టిన ఇతర రాష్ట్రాల అనుభవాల అధ్యయనానికి ప్రత్యేకంగా సీనియర్ ఐఏఎస్ అధికారులను పంపింది ప్రభుత్వం. ఇదంతా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిందే.

తన ఆలోచనలకనుగుణంగా ఒకటికి పది సార్లు కలెక్టర్లతో, వివిధ శాఖాధిపతులతో, శాఖల సచివాలయ కార్యదర్శులతో, వరుస సమావేశాలు నిర్వహించారు సీఎం. ఆ సమావేశాలలో జిల్లా కార్యనిర్వాహక అధికారులుగా గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తున్న కలెక్టర్లు తెలంగాణ అభివృద్దిలో మరింత కీలక భూమికను పోషించే సమయం ఆసన్నమైందని సిఎం ఆకాంక్షించారు. కేవలం కొత్త జిల్లాల ఏర్పాటు నామ మాత్రంగా చేస్తే సరిపోదని భావించిన సీఎం, కలెక్టర్ కార్యాలయంతో సహా అది కేంద్రంగా వివిధ శాఖల కార్యాలయాలెలా వుండాలి, ఎంత స్థలంలో నిర్మించాలి, వాహనాల పార్కింగ్ ఎలా వుండాలి, మారుతున్న అవసరాల నేపధ్యంలో హెలిపాడు ఎక్కడ ఏర్పాటు చేయాలి, కార్యాలయాల పరిసర ప్రాంగణాలెలా వుండాలి, ఆప్టికర్ ఫైబర్-వాటర్ హార్వెస్టింగ్ లాంటి పలు అంశాలను కూడా కూలంకశంగా చర్చించేవారు. శాంతి భద్రతల పరిరక్షణ అత్యంత ప్రాధాన్యమైన విషయమని, జిల్లాల పునర్వవ్యవస్థీకరణలో భాగంగా నేరాలను పూర్తి స్థాయిలో అదపు చేసే చర్యలను తీసుకోవాలని, దానిలో భాగంగానే కొత్తగా ఏర్పడే మండల కేంద్రాలలో పోలీస్ స్టేషన్ల ఏర్పాటు-అవసరమైన సిబ్బంది నియామకం లాంటి అంశాలను కూడా విపులంగా చర్చించడం జరిగింది.


జూన్ నెల మొదటివారంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో జిల్లాల విభజన-నూతన జిల్లాల ఏర్పాటు గురించి పలు కీలకమైన నిర్ణయాలతో పాటు ఖచ్చితమైన రోడ్ మ్యాప్ ను కూడా రూపొందించింది ప్రభుత్వం. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  జిల్లాల పునర్విభజన ప్రక్రియను కేవలం జిల్లాల విభజనే కాదని మండలాల పునర్విభజనగా కూడా పరిగణించాల్సి వుంటుందని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో సూచించారు. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల సగటు విస్తీర్ణం, జనాభా, మండలాల సంఖ్య; మండలాల సగటు విస్తీర్ణం, జనాభా, గ్రామాల సంఖ్య లాంటి అంశాలపై చర్చ జరిగింది. దేనికైనా ‘‘దేరీస్ నో తంబ్ రూల్ ఓన్లీ  లిబరల్’’ అన్న సీఎం, ప్రజాభిప్రాయమే ముఖ్యమైందని స్పష్టం చేసారు. అలాగే, ప్రస్తుత జిల్లా నుంచి పక్క జిల్లాకు పోయే మండలాలు ఏమైనా ఉన్నాయా?  ఒక్క నియోజక వర్గం ఒకటికి మించి జిల్లాలో విస్తరించి ఉందా? ఉంటే ఎట్లా ఉన్నది? అక్కడి భౌగోళిక పరిస్థితులు ఏమిటి? అన్నీ సమీక్షించాలన్నారు. బలవంతంగా తమను ఇతర మండలంలో కలిపారన్న భావన ప్రజలకు రాకూడదనీ, ప్రతి విషయంలో ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలనీ, ఏదీ రాజకీయ కోణంలో చూడకూదదనీ, పెద్ద మండలాలను రెండుగా చేసే అంశాలను పరిశీలించాలనీ సమావేశంలో అభిప్రాయం వెల్లడైంది.

నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా నిర్ధిష్ట గడువులోగా అన్ని జిల్లాల కలెక్టర్లు తమ జిల్లాకు సంబంధించినంతవరకు ప్రాధమిక నివేదికలు తయారు చేయాలనీ, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో చర్చించి అభిప్రాయ సేకరణ చేయాలనీ, కలెక్టర్లతో వరుస సమీక్షా సమావేశాలు జరపాలనీ, అఖిల పక్ష సమావేశం కూడా నిర్వహించాలనీ, దరిమిలా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయాలనీ, నియమిత గడువు (నెలరోజులు) లోపు వచ్చే అభ్యంతరాలను ఆయా జిల్లా కలెక్టర్లు క్రోడికరించి నివేదికలు రూపొందించాలనీ, జిల్లా ఏర్పాటుకు సంబంధించిన సంపూర్ణ ప్రక్రియను పూర్తి చేసుకుని అక్టోబర్ 11, (విజయదశమి) నాటికి నూతన జిల్లాల ఆవిర్భావం జరగాలనీ సమావేశంలో నిర్ణయం జరిగింది. తుచ తప్పకుండా ఈ మొత్తం ప్రక్రియ జరిగిన తరువాతే జిల్లాల ఆవిర్భావం జరిందనేది నిర్వివాదాంశం.

జిల్లాల పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూర్పుపై కూడా కూలంకషమైన చర్చ ఒకటికి పదిసార్లు జరిగింది. పనిభారాన్ని బట్టి పరిపాలనా విభాగాలు ఉండాలని, దీనికి అనుగుణంగా అధికారుల సర్దుబాటు, కొత్త ఉద్యోగుల నియామకం జరగాలని సీఎం ఆ సమావేశాలలో సూచించారు. ఆయా ప్రాంతాల స్వభావం, సామిజిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వ శాఖల విభాగాలను ఏర్పాటు చేయాలని సిఎం పలుమార్లు చెప్పారు. ఈ సమావేశాలలో సందర్భాన్ని బట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, సీనియర్ ఐఎఎస్ అధికారులు, సీనియర్ ఐపిఎస్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మంత్రులు హాజరయ్యేవారు. దసరా నుంచి కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవిన్యూ డివిజన్లు, కొత్త మండలాలు కూడా సమాంతరంగా ప్రారంభం కావాలని సిఎం అనేవారు. ఒకానొక సందర్భంలో సీఎం మాట్లాడుతూ "ఓ కుటంబం ఇల్లు మారినప్పుడు ఉండేలాంటి సమస్యలే, కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా తలెత్తుతాయి" అని అన్నారు.

డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత వచ్చిన విజ్ఞప్తులను, సూచనలను, అభిప్రాయాలను అధికారుల స్థాయిలోనే కాకుండా సీఎం స్వయంగా వరుస సమావేశాల్లో విశ్లేషణ చేశారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ప్రజాభిప్రాయం, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకుని అప్పటికప్పుడే మండలాల, రెవెన్యూ డివిజన్ల, జిల్లాల ఏర్పాటుపై తన నిర్ణయం తెలియచేసేవారు. ఎప్పటికప్పుడు ఆయన ఒకటే మాట అనేవారు: "అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు చేయడం కోసం, ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావడం కోసమే జిల్లాల పునర్వ్యవస్థీకరణ" అని.

ప్రజల అభిప్రాయ సేకరణలో భాగంగా ప్రజాప్రతినిధులతో, అక్టోబర్ మొదటి వారంలో, రెండు రోజులు జిల్లాల వారీగా సుదీర్ఘ సమావేశాలు నిర్వహించిన సీఎం తుదిదాకా తనదైన శైలిలో ఈ దిశగా కసరత్తు అడుగడుగునా శాస్త్రీయంగా కొనసాగించారు. ప్రతీ జిల్లాలో మంత్రి, కలెక్టర్లు తమ కంప్యూటర్లో కుటుంబాల వివరాలు నమోదు చేసుకుని స్వయంగా ఒక్కో కుటుంబం గురించి శ్రద్ధ తీసుకునే పరిస్థితి రావాలని, అందుకే ప్రతీ జిల్లాలో సగటున 3లక్షల కుటుంబాలుండేలా జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తున్నామని, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ పర్యవేక్షణ లోపం వల్ల అవి అనుకున్న మేర ఫలితాలివ్వడం లేదని, సమాజంలో పేదరికం, అసమానతలు ఉన్నంత వరకు అశాంతి, అలజడి ఉంటుందని, వీటిని రూపుమాపడంలో చిన్న పరిపాలనా విభాగాలు మంచి ఫలితాలు అందిస్తాయని, ప్రజల సౌకర్యార్ధమే ఈ ప్రక్రియ చేపట్టినందున జిల్లాలు, డివిజన్లు, మండలాల సంఖ్య పెరిగినా ఫరవాలేదని సిఎం ఆ సమావేశాలలో స్పష్టం చేశారు. అందుకే ప్రజల కోరిక మేరకు వారెన్నుకున్న ప్రజాప్రతినిధుల సూచనలు సలహాలు ఆధారంగా చేసుకుని, జిల్లాల తుది జాబితా రూపొందించారు. బహుశా ఇంత శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన జరగడం దేశంలోనే ఇదే మొదటి సారి అనవచ్చేమో! మరెందుకీ విమర్శలు?  చివరగా ఒకే ఒక్క మాట...చిన్న పాలనా విభాగాలే సత్ఫలితాలిస్తాయన్న ప్రపంచవ్యాప్త అనుభవమే మనకి స్ఫూర్తిదాయకం. End


యువ అధికారులతో నవపాలన : వనం జ్వాలా నరసింహరావు

యువ అధికారులతో నవపాలన
వనం జ్వాలా నరసింహరావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (11-10-2016)

తెలంగాణ రాష్ట్రంలో, దసరా నాటినుంచి కొత్త, చిన్నజిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటైన నాటినుంచే పరిపాలనా కార్యక్రమాలు ప్రారంభంకావడానికి, సజావుగా సాగడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎంతో కసరత్తు చేసింది. కలెక్ట్రలు, జాయింటు కలెక్టర్లు లాంటి ఉన్నత స్థాయి అధికారులకు తోడు మరో 3252 పోస్టులు అవసరం కావచ్చని ప్రాధమికంగా అంచనా వేసినట్లు అధికారికంగా వార్తలొచ్చాయి. అర్హతను బట్టి, అవసరాన్ని బట్టి పదోన్నతులు కలిగించి పోస్టులను భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఇప్పుడున్న వాటికంటే అదనంగా మరో 21 జిల్లాలు ఏర్పాటు అయ్యే అవకాశాలుండడంతో, ఆ నేపధ్యంలో, పలువురు యువ ఐఏఎస్ అధికారులకు, జిల్లా కలెక్టర్లుగా, సంయుక్త కలెక్టర్లుగా, పదోన్నతులకు సాధారణంగా పట్టే సమయం కంటే కొంచెం ముందుగానే, పరిపాలనా బాధ్యతలు అప్పగించే సూచనలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వీరిలో కొందరు కేంద్ర సర్వీస్ కమీషన్ ద్వారా ఐఏఎస్ లుగా ఎంపికైనవారు కాగా, మరికొందరు ఐఏఎస్ లు గా పదోన్నతులు (కన్ఫర్డ్) పొందిన వారు. గడిచిన 28 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలు పరుస్తున్న అనేక అభివృద్ధి,  సంక్షేమ కార్యక్రమాలను సజావుగా, పకడ్బందీగా అమలు చేసే క్రమంలోను, రాష్ట్ర రాజకీయ, సాంఘిక, ఆర్థికాభివృద్ధిలోను, ప్రజలకు మెరుగైన పరిపాలనా సౌలభ్యాలను సమకూర్చే విషయంలోను, ఆయా జిల్లాలకు నియమితులువుతున్న ఈ అధికారులు తమ నైపుణ్యాన్ని, పాలనా కౌశలాన్నీ ప్రదర్శించేందుకు ఇదో గొప్ప అవకాశం అనాలి. మొత్తం 31 జిల్లాల కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, జిల్లాస్థాయిలో వారికింద పనిచేసే వివిధ స్థాయిల్లోని సిబ్బంది, ఉమ్మడిగా-విడివిడిగా, ఒక సమగ్రమైన, వైవిధ్యభరితమైన పాలనా వ్యవస్థ రూపు దిద్దుకోవడానికి,  రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ఒక కీలకమైన బృందంగా, వ్యవహరిస్తారు అనటంలో సందేహం లేదు.

            నేటికి, బహుశా ఎప్పటికీ, రాష్ట్ర పాలనా వ్యవస్థలో కలెక్టర్-జిల్లా మేజిస్ట్రేట్ పాత్ర అత్యంత కీలకమైనదిగా కొనసాగవలసిందే. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలమైన జిల్లాలలో మార్పుకు ప్రేరకులుగా, ప్రతినిధులుగా, ప్రధాన భూమిక వహించటంతో పాటు, సుపరిపాలనను అందించటంలో, సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాల అమలులో వీరు ఇతరులకు మార్గదర్శకులు కావాలి.  ప్రజల ఆశలు, ఆశయాలు, జీవితాలు, జీవనవిధానం అన్నీ ఆయా జిల్లా కలెక్టర్లు తీర్చిదిద్దేవిగా వుండాలి. కాలానుగుణంగా, రోజులు మారుతున్నాకొద్దీ, కలెక్టర్ల వ్యవహార శైలిలో, పాలనా విధానంలో గణనీయమైన మార్పులు నిరంతరం-నిత్యం చోటుచేసుకుంటున్నాయి. ఉత్ప్రేరకులుగా అనేక అభివృద్ధి, సంక్షేమ వ్యవహారాల అమలును పర్యవేక్షిస్తూ చక్క బెట్టాల్సిన క్రమంలో ఒక్కోసారి అవి వారి నియంత్రణాధికారాలకు భిన్నంగా వుండే అవకాశం వుంది. ఆ సందర్భంలో వారి నిర్ణయం ఆచితూచి తీసుకునే విధంగా వుండాలి. మారుతున్న పరిస్థితుల్లో, నేపధ్యంలో, అందరితో కలిసి, అందరినీ కలుపుకొని పరిపాలనా వ్యవహారాలు, పనులను చేసుకపోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ప్రజలను సమాయత్తపరుచు కోవటంలో, వారిలో స్పూర్తిని పరిపుష్టం చేయటంలో, ఉత్తేజాన్ని పెంపొందించటంలో, వారిలో గుప్తంగా దాగి వున్న సామర్ధ్యాన్ని వెలికి తీయటంలో, చైతన్య పరచటంలో, సృజనాత్మకతకు సాన పట్టడంలో వీరు వైవిధ్యాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. మానవ వనరుల సమగ్ర వినియోగం, సమగ్ర ప్రణాళిక అందుకు తగ్గ ఆలోచనలు చేయటం, ఆర్ధిక అవసరాల సక్రమ నిర్వహణ ఇలా అన్ని కలబోసి, వీటన్నింటినీ, అంతా తామై పర్యవేక్షించాల్సి ఉంటుంది. తద్వారా అనుకున్న సమయానికి నిర్వర్తించాల్సిన విధులను, చేపట్టాల్సిన చర్యలను, లక్ష్య సాధనలో తిసుకుపోవాల్సిన చర్యలను  ప్రజలకు చేరువ చేయాల్సిన సంక్షేమ అభివృద్ధి పనులను, వారికి చేరే లాగా నడచుకోవాలి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, దళితులకి భూ పంపిణీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పించన్లు, సాగు నీటి  ప్రాజెక్టుల నిర్మాణం, గురుకుల పాటశాలలు, ఆరు కేజీల బియ్యం పంపిణీ, ఆర్ధిక బృతి అందించే కార్యక్రమాలు, ఎస్.సి., ఎస్.టి.,  బీసీ, మైనార్టీలు సంక్షేమం లాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి.


కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు ఉమ్మడిగా పనికొచ్చే విధంగా, ఒకటి కాని అంతకంటే మించి కాని అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయడానికి, భారత రాజ్యాంగంలోని 312  ప్రకరణలో సవరణ చేసింది ప్రభుత్వం. ఆ విధంగా ఏర్పాటైందే ఇండియన్ అడ్మినిస్టేటివ్  సర్వీస్ (ఐ.ఎ.ఎస్). ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐ.ఎ.ఎస్)ను సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి “ఉక్కు వ్యవస్థ”గా అభివర్ణించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రభుత్వ నిర్ణయాలను కట్టుదిట్టంగా అమలుపర్చేందుకు, చేయూతనందించేందుకు, పటిష్టమైన పాలన యంత్రాంగం అవసరమైన నేపధ్యంలో అది ఆవిర్భవించింది.  అంతకుముందు ఆంగ్లేయుల పాలనలో పరిపాలన బాధ్యతలు నిర్వహించిన “ఇండియన్ సివిల్ సర్వీస్”కు విప్లవాత్మకమైన మార్పులు చేర్పులు చేసి, ఆ నమూనాలోనే ఈ వ్యవస్థను రూపొందించారు.  ఈ సర్వీస్‍కు ఎంపికైన వ్యక్తులు పౌర పరిపాలనలోనూ, విధాన నిర్ణయాలలోనూ, ఆంతరంగిక విదేశీ సంస్కరణలను చాకచక్యంగా నివారించడంలోనూ కీలకమైన పాత్ర పోషిస్తుంటారు.  సాహిత్యం నుంచి వైద్యశాస్త్రం వరకు విభిన్న విద్యల్లో తమదంటూ ఒక ప్రత్యేకత ఉందని నిరూపించుకున్న తెలివైన, బాధ్యతాయుతమైన, సమర్ధులైన వ్యక్తులను ఓ పద్దతి ప్రకారం విస్తృతమైన, కఠినమైన పరీక్షా విధానం ద్వారా ఈ సర్వీసుకు ఎంపిక చేస్తారు.  ఇలా ఎంపికైన ఐ.ఎ.ఎస్ అధికారుల ఉద్యోగాలకు రాజ్యాంగపరమైన భద్రత ఉంటుంది.  కార్య నిర్వహణ అధికారాల విషయంలో భయపడాల్సిన అవసరం కాని ఒత్తిడులకు లోను కావాల్సిన అవసరం కానీ వారికి ఎంత మాత్రంలేదు.  దేశ సమగ్రతకు ఈ వ్యవస్థ అత్యంత అవసరమైందని సర్దార్ పటేల్ అనేవారు. ఐ.ఎ.ఎస్ ల ఉద్యోగ వ్యవహారాలను మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సస్-పెన్షన్ డిపార్టుమెంట్, డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం చూసుకుంటుంది. ఈ క్యాడర్ లో ఉండాల్సిన 5000 పై చిలుకు స్థానాలు, నేరుగా కాని పదోన్నతి ద్వారా కాని భర్తీ చేస్తారు.  నేరుగా 62-2/3 శాతం మందినీ, పదోన్నతుల ద్వారా 33-1/3 శాతం మందినీ నియామకం చేస్తారు.

ఐ.ఎ.ఎస్‍కు చెందిన అధికారులకు సబ్ కలెక్టర్ స్థాయినుంచి, రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు, కేంద్రంలో కేబినెట్ సెక్రటరీ స్థాయి వరకు వివిధ శ్రేణి ఉద్యోగాల్లో పనిచేసే అవకాశం కలుగుతుంది.  వారి వారి సామర్ధ్యాన్నిబట్టి, కార్య నిర్వహణ పద్ధతులను బట్టి వారిని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులుగా నియమించడం, పదోన్నతులు కల్పించడం జరుగుతుంది. ఐ.ఎ.ఎస్‍కు ఎంపికైన వారు ఏడాదిపాటు ముస్సోరీలో, ఏడాదిపాటు వారికి కేటాయించిన రాష్ట్రంలో అసిస్టెంట్ కలెక్టర్ శిక్షణ పొందిన తరువాత లభించే మొదటి ఉద్యోగం సబ్ కలెక్టర్.  ఈ హోదాలో పనిచేసిన తరువాత సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారిగా, జాయింట్ కలెక్టర్‍గా పదోన్నతులు పొంది డిప్యూటీ సెక్రటరీ - జాయింట్ సెక్రటరీ స్థాయి హోదాలో (కొన్ని సందర్భాల్లో సెక్రటరీ స్థాయి) ఒక జిల్లా కలెక్టర్‍గా నియమితులవుతారు.  దురదృష్ట వంతులైన కొందరికి ఈ అవకాశం రాకుండాపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.  ఈ పదవుల కుండే హోదా, మెజిస్టీరియల్ అధికారాల దృష్ట్యా,  ప్రతి ఐ.ఎ.ఎస్ అధికారీ ఈ బాధ్యతలు నిర్వహించాలనే కోరుకుంటారు. అఖిల భారత సర్వీసుల్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‍కు ప్రత్యేకత ఉంటే అందులో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న పదవి జిల్లా కలెక్టర్. పలు అభివృద్ధి సంక్షేమ పధకాల అమలులో, పర్యవేక్షణలో కలెక్టర్ బాధ్యత అంచనాలను మించిపోతున్నది. జిల్లా స్థాయిలో లెక్కకు మించిన శాఖలకు కలెక్టరే అధిపతి.  సుమారు వందకు పైగా కమిటీలకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఎప్పుడేపని చేస్తుండేదీ గుర్తుంచుకోలేని స్థాయికి కలెక్టర్ చేరుకున్నారు.

అలాగే వీరి విధి నిర్వహణలో భాగంగా రాష్ట్ర సచివాలయంలోగాని, వివిధ శాఖలకు ఉన్నతాధికారులుగా కానీ, పబ్లిక్ రంగ సంస్థలకు ముఖ్య అధికారులుగా కానీ నియమింపబడతారు.  కొందరు కేంద్రానికి డిప్యుటేషన్ మీద వెళ్లి అక్కడ కీలకమైన పదవులను నిర్వహిస్తుంటారు.  మరికొందరు ఇతర రాష్ట్రాలకు కూడా కొంతకాల్ం డిప్యుటేషన్ పై వెళ్లి పనిచేసి తిరిగి స్వరాష్ట్రానికి వస్తారు. ఐఎఎస్ నియమాకాల్లో ఉన్నతమైన స్థానం, కేంద్రంలో కేబినెట్ సెక్రటరీ పదవిని చేపట్టడం. అలాగే వారి రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టడం. కేంద్రంలో తరువాత స్థానం సెక్రటరీ/ అడీషినల్ సెక్రటరీ (అదనపు కార్యదర్శి), జాయింట్ సెక్రటరీ (సంయుక్త కార్యదర్శి), డిప్యూటి సెక్రటరీ (ఉప కార్యదర్శి), అండర్ సెక్రటరీ స్థానాలు. ఈ పదవులు వారు పొందేందుకు సీనియారిటీ ప్రాతిపదిక పాటించాల్సి వుంటుంది.   ఎంపిక చేయబడిన కొందరు  కార్యదర్శులుగా, ప్రధాన కార్యదర్శులుగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద కానీ, దేశ ప్రధాన మంత్రి వద్ద కానీ నియమింపబడతారు. కేంద్రంలో హోం, డిఫెన్స్, ఫైనాన్స్, విదేశి వ్యవహారాల విభాగాల్లో కొందరు, కీలక నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో నియమింపబడతారు. మరికొందరు రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక, వ్యవసాయ, భూ పరిపాలన విభాగాల్లో నియమింపబడతారు.


మారుతున్న ప్రపంచ తీరు తెన్నులకు అనుగుణంగా  మానవ మేధో సంపత్తి అందనంత వేగంతో  సరికొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతున్నది. ఇందుకు సరైన రీతిలో ధీటైన ఆలోచనలు ఆచరణలోనికి తీసుకురావలసిన అవసరం ఎంతైనా వుంది. గతంలో మాదిరిగా వర్తమాన కాలంలోని కలెక్టర్ల పాత్ర లేదు.  మూస పద్ధతికి బహుశా ఇక తావులేదు. పాలనా పద్ధతుల్లో కొత్త పుంతలు తొక్కాలి.   అధునాతన ప్రపంచాన్ని ఆవిష్కరించాలి.  సృజనాత్మకతకు తావివ్వాలి.   కాలానుగుణంగా వస్తున్న మార్పులను స్వాగతిస్తూ, ప్రజల ఆశలకు, అవసరాలకు, ఆశయాలకు, కోరికలకు అనుగుణంగా పరిణతను, పరిపుష్టిని సాధించాలి. ఈ దిశగా యువ కలెక్టర్లు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, తమకింద పనిచేసేవారిని కలుపుకుని పోతూ, ప్రజలకు చేరువు కావలసిన ఫలాలను, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించటంలో తమ వంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా వుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ప్రజోపయోగమైన నూతన పాలనా విధానాలు కూడా అమల్లోకి రావాలి. చిన్న జిల్లాల ఏర్పాటుతో మన పాలనా విధానం దేశానికి మార్గదర్శకం కావాలి. End

Sunday, October 9, 2016

Small districts carved out on scientific basis : Vanam Jwala Narasimha Rao

Small districts carved out on scientific basis
Vanam Jwala Narasimha Rao
Metro India (10-10-2016)

The process of reorganization of districts in Telangana has reached its final stage, as the government issues final notification and the stage is set to launch new districts in the next 24 hours. With reorganization of districts, mandals and revenue divisions, Telangana State will be making history in administrative reforms. The process of reorganization of districts was started a year ago and since then, the government held parleys at different levels before arriving at a decision.
Contrary to the allegations by some people, the government has followed all democratic principles. The decision to carve out new districts was not taken without proper homework as alleged. In fact, Chief Minister K Chandrashekhar Rao had discussed the issue at length with Telangana ideologue Prof Jayashankar and others even before the State bifurcation was formally announced and TRS made a promise (districts’ reorganization) in its manifesto.
In fulfilling the promise, the government has given a long rope to every stakeholder to expresses his or her opinion without giving any room for political considerations. There was no truth in the allegation that the government had conducted the process in a hurried and hushed-up manner. In fact, the entire exercise was conducted in a most scientific and democratic manner, giving top priority to public opinion.
Ever since the TRS government came to power, the State has been making strides in all spheres and the government has introduced a number of schemes and programmes to alleviate poverty. However, it is also true that the fruits of the welfare schemes are not reaching the targeted groups properly due to administrative blockades. As a remedy, the government has taken up reorganization of districts, with a firm belief that smaller administrative units would enable the government to reach out to the people.
Keeping these factors in mind, the Chief Minister had rolled out the process a year back and directed the chief secretary to prepare an action plan to carve out new districts, mandals and revenue divisions. The Chief Minister insisted on following scientific and democratic norms in letter and spirit and he also made it clear that the bottom line should be administrative convenience and administrative ease, convenience, betterment and development of the people.
It may be recalled here that whenever he talked on the subject, he used to say that the final decision on new districts would not be against the wishes of the people. If we look back, the process started with constitution of secretaries’ committee headed by the chief secretary in September 2015. The other members of the committee are Revenue, Panchayat Raj, Municipal Administration secretaries and CCLA.

As a follow-up action, the government constituted a Cabinet Sub-committee headed by Deputy Chief Minister and Revenue Minister Mohammed Ali and another Deputy Chief Minister Kadiyam Srihari, Ministers Etela Rajender, Tummala Nageswar Rao and Jupally Krishna Rao as members and chief secretary Rajiv Sharma as convener.
The committee headed by the chief secretary carried out the exercise on all administrative matters involved in reorganization of districts and the Cabinet Sub-committee, on its part, conducted district-wise meetings to elicit public opinion. Another high-powered committee was constituted under the chairmanship of K Keshava Rao, MP. The Chief Minister also held an all-party meeting prior to the release of the draft notification. All political parties participated in the meeting and the leaders welcomed the move.
The government even accepted certain suggestions on bifurcation of revenue divisions and mandals. The Chief Minister also assured them that all their suggestions will be taken into account while preparing the final draft. The government took into consideration every suggestion made at the all-party meeting. Finally, the government constituted a task force headed by the chief secretary to finalize administrative departments and their function in the new set-up.
The Chief Minister has made all efforts to complete the process in a transparent manner. He held numerous meeting with Collectors, heads of departments, secretaries and other officials. The Chief Minister told the district Collectors that the time has come for them to play a more proactive role in development activities. The Chief Minister took interest in every aspect, including functions of the Collectors and district administration, facilities at the Collectorates and other offices and other minute things.
The Chief Minister openly shared his ideas even on issues such as parking facility, helipad and fiber connectivity. The government prepared a road map at a high level meeting held in last June where Ministers, officials and MPs, MLAs, MLCs and other people’s representatives discussed all aspects in detail. The government took every stakeholder into confidence in finalizing the road map. Nothing was left without proper scrutiny. Nowhere in the lengthy process had the Chief Minister taken a liberal stand.
In fact, the Chief Minister told the officials and others that “there is no thumb rule, only liberal”. The Chief Minister gave a free hand to the officials in finalizing administrative structure in new districts. Having said that, it is imperative to repeat the total exercise has been done in a most democratic and scientific manner. The objective of the reorganization is administrative ease, convenience, betterment and development of the people. Finally, small is beautiful is the universally accepted principle of administration.

Thursday, October 6, 2016

హనుమదే అసలు సిసలైన సర్జికల్ దాడి : వనం జ్వాలా నరసింహారావు

హనుమదే అసలు సిసలైన సర్జికల్ దాడి
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర భూమి దిన పత్రిక (07-10-2016)

సర్జికల్ దాడి....ఏ నోట విన్నా ఆమాటే...దీనర్థం ఇప్పుడందరికీ తెలిసిపోయింది. బహుశా కొద్దిమందికైనా తెలియందల్లా, వాల్మీకి మహర్షి తన రచనా చాతుర్యంతో, ఈ దాడి మూలాలను సుందరకాండలో వర్ణించిన వైనం. రామాయణ కాలం నాటి ఆ దాడిలో ఆర్మీ జనరల్, సైనికుడు, వ్యూహకర్త అంతా ఒకే ఒక్కడు. రావణ శత్రు సైన్యంలో మూడొంతులమందిని ఆ ఒక్కడే తుదముట్టించాడు. శత్రురాజు బలాబల సంపద తెలుసుకోవాలని తనంతత తానుగా పట్టుబడ్డాడు. ఉపాయంగా బయటపడి, శత్రు బలాల రహస్యాలను తన నాయకుడికి తెలియచేసి భవిష్యత్ యుద్ధానికి అంతా సమాయత్తం చేశాడు. అతడే సుందరకాండ కథానాయకుడు హనుమంతుడు. వివరాల్లోకి పోతే....

వాల్మీకి ఆదికవి. రామాయణం ఆదికావ్యం. ఇది ధ్వని, అర్థ ప్రతిపాదిత మంత్రపూతం. గాయత్రీ బీజ సంయుతం. రామాయణంలో అందమైన కాండ "సుందర కాండ". నిజానికది "హనుమత్కాండ". ఆద్యంతాలు హనుమంతుడు ఆచార్యుడుగా, వ్యూహకర్తగా, కార్యాచరణ కర్తగా దర్శనమిచ్చే అద్భుత కాంద సుందర కాండ. ఈ కాండ వృత్తాంతమంతా రోజున్నరలోనే గడచింది. వాల్మీకి కోకిల ఆలపించిన ఆనందమయ కావ్యగానమే సుందర కాండ. ఇందులో హనుమంతుడు మహాయోగి...మహా జ్ఞాని....విశిష్ట వశిష్ఠుడు....మహాచార్యుడు. ఇక ప్రధానంగా కథ విషయానికొస్తే....హనుమంతుడు సముద్రాన్ని లంఘించడం, లంకకు చేరడం, సీతాదేవి కోసం వెతకడం, ఆమెను చూడడం, రామలక్ష్మణుల సమాచారం చెప్పడం, లంకా ధ్వంసం-దహనం, మరలి పోవడం, రాముడికి సీతమ్మ సందేసాన్ని ఇవ్వడం...ఇంతే. దీనికొక పెద్ద పుస్తకం అక్కర్లేదు. ఐనా అక్కరకొచ్చింది. అందులో భాగమే హనుమ సర్జికల్ దాడులు. స్థూలంగా చెప్పాలంటే....సీతాదేవితో కలయిక తరువాత, ఆమె దగ్గర శెలవు తీసుకుని, శత్రువుల బలాబలాలు తెల్సుకోవాలనుకున్న హనుమంతుడు, వెంటనే తిరిగి పోకుండా, మెరుపుదాడిలా ముందు అశోకవనాన్ని పాడు చేస్తాడు. దొంగతనంగా రామలక్ష్మణులు లేని సమయం చూసి (పాకిస్తాన్ యూరీ తరహా చర్య) , సీతాపహరణం చేసిన రావణుడి చర్యకు ఇది తొలి ప్రతీకార చర్యగా భావించాలి. సహజంగానే రావణుడికి కోపం వచ్చే విధంగా హనుమంతుడు కయ్యానికి కాలు దువ్వాడు. ఆయనకు కోపం వచ్చి పంపిన కింకరులను మట్టుపెట్టాడు. చైత్య పాలకులను చంపాడు. జంబుమాలి వధ, మంత్రి పుత్రుల చావు, సేనానాయకుల మృతి, అక్షకుమారుడి వధ, కావాలనే ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి కట్టుబడడం, రావణుడి దగ్గరకు తీసుకుని పోగా అతడికి బుద్ధి చెప్పడం, దండనకు గురికావడం, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లంకా దహనం చేయడం, మరలి పోవడం క్లుప్తంగా సుందర కాండలో కథ.

మరింత లోతుగా ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే అనేక అంశాలు అవగతమౌతాయి. సీతాదేవి దగ్గర శెలవు తీసుకున్న తరువాత "కార్య శేషం" ఆలోచించాడు హనుమంతుడు. కేవలం సీతాదేవి ఉనికి గురించి రాముడుకి వివరించడంతో తన పని పూర్తి కాదని భావించాడు. చేయాల్సిన పని మరికొంచెం వుందనిపించిందాయనకు. సుగ్రీవుడు సీతను వెతకమనీ, లంకను చూడమనీ, హనుమకు రెండు పనులు అప్పగించాడు. ఒకటైపోయింది. మరోటి మిగిలింది. లంకను చూడడమంటే మిద్దెలు-మేడలు చూడడం కాదు. రాక్షసుల బలాబలాలు బేరీజు వేయడం. అతడి మాటల్లోనే రావణుడి అభిప్రాయం తెల్సుకోవడం కూడా మిగిలిపోయింది. ఇవన్నీ జరగాలంటే, సామ-దాన-బేదోపాయాలు (పాకిస్తాన్ విషయంలో లాగ) పనికి రావు. దండోపాయమొక్కటే సరైన మార్గమని నిర్ణయించాడు. తమోగుణం ఎక్కువున్న రాక్షసులు (పాకిస్తానీయుల లాగా) మంచి మాటలకు, ధర్మ వాక్యాలకు లోబడేవారు కాదు. దైవ బలం, దేహ బలం, ధర్మ బలం వున్న తనకు యుద్ధమే శరణ్యమనుకుంటాడు హనుమంతుడు. దాని వల్ల వాళ్లెంత బలవంతులో తెల్సిపోతుందనుకున్నాడు. మరో మేలు కూడా జరుగుతుందని భావించాడు. రామ లక్ష్మణులు సహాయం లేనివారు, ఏమీ చేయలేని వారు (పాకిస్తాన్ భారత్ ను భావించినట్లే) అనే దురభిప్రాయంతో వున్న రాక్షసుల అపోహ తొలగిపోవాలంటే, యుద్ధం చేసి కొందరినైనా చంపాలని అనుకుంటాడు. ఇలా జరుగుతే, మిగిలిన వారు ద్వేషం వదలి మెత్తబడడమో, వారిలో వారికి విభేదాలు రావడమో జరుగుతుందని భావించాడు.


ఎంత చిన్న పనైనా చక్కగా చేయడానికి పూనుకుంటే, అది నెరవేరడానికి ఎన్ని ఉపాయాలు అవసరమో అవన్నీ వెతకాలి. రామకార్యం కూడా పలువిధాలుగా చేయడమే మంచిదని భావించాడు హనుమ. బలంలో తనకూ, రాక్షసులకూ వున్న భేదాన్ని తెలుసుకుని, రాముడి దగ్గరకు పోతే, భవిష్యత్ లో జరగబోయే యుద్ధానికి అది పునాది అవుతుందనుకుంటాడు. రాక్షస రాజు రావణుడు తనంత బలవంతుడు లేడన్న మదంతొ వున్నాడు....అ మదమణిగితేనే కాని వాడు లొంగడు అనుకుంటాడు. కొందరు రాక్శసులను యుద్ధానికి ఈడ్చి సులభంగా చావకొడ్తే, రావణుడే యుద్ధానికి రాక తప్పదు. అప్పుడు వాడి బలం కూడా తేల్చుకోవచ్చనుకుంటాడు. కాబట్టి ఏదో విధంగా రావణుడిని, వాడి మంత్రులను, సైన్యాన్ని, యుద్ధానికి ఈడ్వడానికి మార్గం ఆలోచించాడు. కన్నుల పండుగగా, మనస్సుకు ఇంపుగా, ఇంద్రుడి నందనవనంలా వున్న అశోక ఉద్యానవనాన్ని "టార్గెట్" చేద్దామనుకున్నాడు. సొగసుగా వున్న, రావణుడికిష్టమైన దీన్ని ధ్వంసం చేస్తే, రావణుడికి కోపం తప్పక వస్తుందనుకున్నాడు. ఆ కోపంతో తన సైన్యాన్ని తనమీదకు పంపుతాడని, వాళ్లను సంహరించి సంతోషంతో కిష్కిందకు మరలిపోదామని నిర్ణయించుకుంటాడు.

హనుమంతుడు అశోకవనాన్ని పాడు చేసిన వైనాన్ని, ఆ తరువాత రావణిడి యోధానయోధులను సంహరించిన వైనాన్ని, వాల్మీకి సంస్కృత సుందర కాండలో, ఆంధ్ర వాల్మీకి వాసు దాసు తెలుగు సుందర కాండ మందరంలో, అద్భుతంగా వర్ణించారిలా: "విజృంభించిన హనుమంతుడు మహా వాయువులాంటి తన తొడల వేగంతో, అశోకవనం లోని చెట్లన్నీ కూకటి వేళ్లతో సహా పీకి నేల మీద పడేయడం ఆరంభించాడు. నానా రకాల చెట్ల తీగలతో, మదించిన పక్షుల ధ్వనులతో నిండిన ప్రమదావనాన్ని పాడు చేశాడు. క్రీడా పర్వతాలను నేలమట్టం చేశాడు. క్రీడా సరస్సులను విరగ గొట్టాడు. తెగిన తీగలతో, విరిగిన చెట్లతో, పాడైన సరస్సులతో, ఆ వనం కార్చిచ్చు తగిలి కాలిపోయినట్లుంది. తీగలు అల్లుకునేందుకు ఆధారంగా వుండి, భూమిలోదాకా పాతుకు పోయి తల్లి వేళ్లున్న చెట్లు కూడా పడిపోవడంతో, వాటి కొనలందున్న తీగలు దిక్కులేనివారిలా, భయంతో వణకుతూ కనిపించాయి. చెట్లు పడడంతో వాటి సందుల్లో వున్న పాములు కూడా నలిగి చచ్చాయి. చెట్టు తొర్రలు నేల కూలాయి. పొదరిండ్లు పాడైపోయాయి. రాతి ఇళ్లు నేలపై తూలి పడ్డాయి. ఇదంతా చూడడానికి ఘోరంగా కనిపించింది. రావణాసురుడి భార్యలకు ప్రమదావనమైన ఈ ఉద్యానవనాన్ని మూలమట్టంగా నాశనం చేసి, సంతోషంతో కయ్యానికి కాలుదువ్వి, యుద్ధానికి ఎదురుచూస్తూ, ఆ వనం తలవాకిటి మీదెక్కి కూర్చున్నాడు హనుమంతుడు".

హనుమంతుడి "టార్గెట్" కేవలం అశోకవనమే తప్ప దాని పరిసర ప్రాంతాలు కాదప్పటికి. ఈ విషయన్నే రావణుడికి తెలియచేశారు రాక్షస స్త్రీలు. రౌద్రాకారంతో విజృంభించిన ఒక "కోతి" ప్రమదావనాన్నంతా నిర్మూలించిందనీ, సీతాదేవి వున్న ప్రదేశాన్ని మాత్రం తాకలేదనీ పిర్యాదు చేశారు వాళ్లు. సీతాదేవికి రక్షణగా వుండాలనే వుద్దేశంతోనే చెట్లన్నీ తుంచినా, ఆమె వున్న అశోక వృక్షాన్ని మాత్రం ఏమీ చేయలేదనీ, సీతా సౌఖ్యం కొరకే దాన్ని పాడు చేయలేదనీ చెప్పారు వాళ్లు. రావణుడి స్పందనను, ఆ తరువాత జరిగిన యుద్ధాన్ని చాలా గొప్పగా వర్ణించారు సుందర కాండలో. కోపంతో ఊగిపోయాడు రావణాసురుడు. గిరగిరా తిరిగే గుడ్లున్న ఆయన కళ్ల నుండి బొటబొటా రాలిన నీళ్లు, దీపం నుండి మండుతూ, మీద పడే చమురు బొట్లలా కనిపించాయి. మహాగర్వంతో కన్ను-మిన్ను కానని, తనతో సమానమైన కింకరులనే వాళ్లను వెంటనే వెళ్లి, ఆ కోతిని పట్టుకు రమ్మని పంపుతాడు. రకరకాల ఆయుధాలు ధరించిన ఎనభై వేల మంది కింకరులు ఒక్క మూకగా హనుమంతుడి మీదకు యుద్ధానికి వచ్చారు. దేహాన్ని పెంచిన హనుమంతుడు లంకంతా ప్రతిధ్వనించే విధంగా సింహనాదం చేసి వారి మీదకు దాడికి దిగాడు. వారందరినీ చంపాడు. వారి చావు వార్త విన్న రావణుడు అజేయ బలమున్న ప్రహస్తుడి కొడుకు జంబుమాలిని హనుమంతుడి పైకి యుద్ధానికి పంపాడు.

ఈ లోపు జయ గర్వంతో వున్న హనుమంతుడు, సమీపంలోనే వున్న లంకాధి దేవత గుడి శిఖరాన్నెక్కి దానిని ధ్వంసం చేసే పనిలో వుండిపోతాడు. ఆయన సింహనాదాన్ని విన్న గుడి కాపలాదారులు (చైత్య పాలకులు) హనుమంతుడి మీదికి దూకారు. గుడి ధ్వజ స్థంబాన్ని పీకి దాంతో గుడిని ధ్వంసం చేసి, రాక్షసులందరికీ చంపాడు. అక్కడే ఒక హెచ్చరిక చేస్తాడు. అదీ యుద్ధ తంత్రంలో భాగమే! "ఓ లంకా వాసులారా! వినండి. నా లాంటి (అంతే బలం కల) వేల-లక్షల-కోట్ల వానరులు మీ మీదికి యుద్ధానికి రాబోతున్నారు. వీళ్లందరికీ అమేయ బలుడు సుగ్రీవుడు సైన్యాధిపతిగా వుంటాడు. సీతను రావణాసురుడు ఎత్తుకు వచ్చి ఇక్కడ బంధించి, నిష్కారణంగా శ్రీరాముడితో విరోధం తెచ్చుకున్నాడు. వాడితో పాటు మీరందరూ విరోధం తెచ్చుకున్నారు. రావణుడికీ, మీకూ, లంకకూ ఇక రుణానుబంధం తీరినట్లే!" అని అందరూ వినేట్లు చెప్తాడు. దీంతో ఇంతవరకూ సీతను లంకలో వుంచిన వార్త అంతఃపురానికి వచ్చే వారికి తప్ప తెలియని ఇతరులకు కూడా తెలిసి రహస్యం బయట పడింది.

ఇక ఆ తరువాత వెంట వెంట రావణుడు పంపిన జంబుమాలిని, మంత్రి (ఏడుగురు) పుత్రులందరినీ, విరూపాక్షుడు, దుర్ధరుడు, యూపాక్షుడు, బాసకర్ణుడు, ప్రఘసుడు అనే ఐదుగురు సేనానాయకులను, రావణుడి కొడుకు అక్షకుమారుడినీ యుద్దంలో చంపుతాడు. హతాశుడైన రావణుడు, తన మరో కొడుకు ఇంద్రజిత్తును హనుమంతుడిపైకి యుద్ధానికి పొమ్మంటాడు. న్యాయ మార్గంలో, అస్త్రాలతో హనుమంతుడిని చంపడం సాధ్యపడకపోతే, మాయ చేసైనా చంపమని అతడికి చెప్పాడు. యుద్ధానికి పొయీన ఇంద్రజిత్, ఎంతకూ హనుమంతుడిని గెలవలేక పోవడంతో, అరుదుగా వాడాల్సిన బ్రహ్మాస్త్రం ప్రయోగించి బంధించాడు. కించిత్తు దైవ శాపం వుండడం వల్ల తాత్కాలికంగా బంధించబడిన హనుమ, ఆ అవకాశాన్ని రావణుడి దగ్గరకు పోవడానికి ఉపయోగించుకుంటాడు. రావణుడి కొలువులో వాడికి బుద్ధి చెప్పి, అతడి కోపానికి గురవుతాడు. దూతను చంపడం భావ్యం కాదన్న విభీషణుడి సలహా మేరకు హనుమ తోక కాల్చమని ఆజ్ఞాపించాడు రావణుడు. కాల్చిన తోకతోనే రాక్షసులు హనుమను లంకంతా తిప్పారు. ఆ విధంగా లంకా నగర రహస్యమంతా హనుమకు తెలిసిపోయింది.


          తరువాత తన కట్లన్నీ వూడ తీసుకుని, లంకా దహనం చేస్తాడు. రాక్షస నాయకుల ఇళ్లన్నింటికీ నిప్పు పెట్తాడు. అలా....అశోక వనాన్ని పాడు చేసి, రాక్షసులను చంపి, మేడలు-మిద్దెలు నేలమట్టం చేసి, లంకా దహనం చేసి, సీతాదేవిని మరో మారు దర్శించుకుని, సముద్రాన్ని లంఘించి, మరలి వచ్చి రాముడికి సీతా వృత్తాంతం చెప్తాడు. హనుమదే అసలు సిసలైన సర్జికల్ దాడి! End

Friday, September 23, 2016

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు : వనం జ్వాలా నరసింహారావు

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (24-09-2016)

            ప్రయివేట్ కోచింగ్ సెంటర్లలో చదివే విధ్యార్థులకు పోటాపోటీగా, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థినీ విద్యార్థులు ఎంసెట్-2016 పరీక్షలలో గణనీయమైన సంఖ్యలో ఉత్తెర్ణులై, మెడిసిన్ విభాగంలో 40 సీట్లు, బిడిఎస్ లో 20 సీట్లు సంపాదించి తమ ప్రతిభను చాటడమే కాకుండా, సంస్థకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. ఈ విజయానికి అదనంగా ఇక్కడే చదివిన మరికొందరు గురుకుల విద్యార్థులు కేంద్రీయ విశ్వ విద్యాలయంలో 25 సీట్లను పొందడంతో పాటు, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో 6 సీట్లు, అజీం ప్రేమ్ జీ విద్యాసంస్థల్లో 11 సీట్లు, ఐఐటిలు, ఎన్ఐటిలలో 45 సీట్లు, చార్టడ్ ఎకౌంటెన్సీల్లో 5 సీట్లుసాధించారు.

గురుకుల విద్యాసంస్థల విధ్యార్థులు కనబరిచిన ప్రతిభను తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల సంఖ్యను పెంచేందుకు,  వీటిని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకే పరిమితం చేయకుండా, మైనారిటీలకూ, వెనుకబడిన తరగతులవారికీ ప్రవేశం కల్పించేందుకూ నిర్ణయించారు.  ఈ నిర్ణయం ద్వారా ప్రస్తుతమున్న గురుకుల పాఠశాలల సంఖ్యకు అదనంగా కేవలం మైనారిటీ విద్యార్థులకు ఉపయోగపడేలా మరో 89 గురుకుల పాఠశాలలను నెలకొల్పడం జరుగుతుంది. తద్వారా, మైనారిటీలకు ఈ పాటికే ప్రారంభించిన 71 గురుకులాల (వాటిలో బాలురకు 39, బాలికలకు 32) సంఖ్యను 160కి పెంచటం జరిగింది.  గతంలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కోటి చొప్పున 120 మైనారిటీ గురుకుల పాఠశాలలను మాత్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికి,  గురుకుల పాఠశాలల్లో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్న మైనారిటీ విద్యార్థల సంఖ్య క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో, మరో 40 అదనంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావించారు. గురుకుల పాఠశాలల్లో మొదట 5,6,7  తరగతులో విద్యార్థులను చేర్చుకుని, ఏడాది గడుస్తున్న కొద్దీ, పైతరగతులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలల విద్యాసంస్థ ఆ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను చేపట్తుంది. మైనారిటీలలో విద్యా ప్రమాణాలు తగ్గు ముఖం  పట్టడం, మధ్యలోనే చదువు మానేసేవారి సంఖ్య పెరగటం వల్ల ఈ సమస్యను అధిగమించాల్సిన ఆవశ్యకత వుంది అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.   మైనార్టీలకు మెరుగైన విద్యా విధానాన్ని అందించడానికి నాణ్యమైన గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి, ఆ తరువాత తగు ఉద్యోగ అవకాశాలను కల్పించి, వారి జీవన ప్రమాణాలను పెంచటం లక్ష్యంగా ఎంచుకున్నామని ముఖ్యమంత్రి అన్నారు. 

అలాగే బీసీల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున మరో 120 గురుకుల పాఠశాలలను కూడా ఏర్పాటు చేయాలని కూడా సీఎం నిర్ణయించారు. బీసీ కులాలకు చెందిన వారికి మెరుగైన భవిష్యత్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వారికి ఉత్తమమైన విద్యను అందించి తద్వారా మంచి పునాది వేయాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్దారు. అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీరి కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. వీటిలో సగం బాలురకు, సగం బాలికలకు కేటాయించనున్నారు. ఇంతకు ముందు, బాబాసాహేబ్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంలో, 100 నూతన గురుకుల పాఠశాలలను, 30 గురుకుల డిగ్రీ కాలేజీలను, ప్రత్యేకించి అణగారిన వర్గాల విద్యార్థిని విద్యార్థులకు, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ద్వారా, 2016-17 విద్యా సంవత్సరంలో ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. వీటితో పాటు ఎస్.టి.విద్యార్థులకు  అదనంగా  మరో 50 విద్యాలయాలను అదే విద్యా సంవత్సరంలో దశల వారీగా ఆరంభించాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం అణగారిన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేయడానికి, వారి భవిష్యత్ ను చక్కగా తీర్చిదిద్దటానికి తీసుకుంటున్న చర్య ఇది.

టీఆరెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కోన్న విధంగా, కేజి స్థాయి నుండి పిజి స్థాయి వరకు ఉచిత నిర్భంద విద్యను అందించే క్రమంలో పెద్ద సంఖ్యలో  గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ఉపక్రమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు ప్రత్యేకించి ఇవి ఉపయోగపడతాయి. గురుకుల విద్యా సంస్థల నుండి ఒక ఆధునిక విజ్ఞానదాయిక తరాన్ని ఆవిష్కృతం చేయగలమన్న ఆశాభావాన్ని ముఖ్యమంత్రి అనేక సార్లు వ్యక్తపరచారు. తెలంగాణ గురుకుల విద్యాసంస్థలలో చదివి బయట ప్రపంచంలో అడుగుపెట్టిన వారు, రానున్నరోజుల్లో, భారత దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికీ దిశా నిర్దేశాలు చేయడానికి, ప్రగతి బాటలు వేయడానికి, అవసరమైన మేధోసంపత్తి కలిగినవారై వుంటారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ఈ పాటికే 135 గురుకుల విద్యా సంస్థలు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ నిర్వహణలో నడుస్తున్నాయి. వీటిలో సుమారు 77, 000 మంది విద్యార్థులున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం ఎస్సీలకు 74 పాఠశాలలు, బిసీలకు 23 పాఠశాలలు, ఇతరులకు 47 పాఠశాలలు (మొత్తం  279) ఉండేవి.   ఇప్పుడు ప్రత్యేకించి మైనారిటీలకు ఏర్పాటు చేయదల్చుకున్న 89 అదనపు గురుకుల పాఠశాలలు, బీసీలకు ఏర్పాటుచేయాలనుకున్న 120 పాఠశాలలు కలిపి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏర్పాటుచేస్తున్న గురుకుల విద్యాసంస్థల సంఖ్య 480కి చేరుతుంది.   వీటిలో ఎస్సీలకు 103, ఎస్టీలకు 51, ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలు 30,  మైనారిటీలకు 160, బిసీలకు 120, జూనియర్ కళాశాలలు వున్నాయి.   లోగడ వున్నవి, కొత్తగా ఏర్పాటు చేస్తున్నవి అన్నీ కలిపితే, వచ్చే విద్యా సంవత్సరం నాటికి రికార్డు స్థాయిలో 760 గురుకుల విద్యా సంస్థలు రాష్ట్రంలో నెలకొల్పబడి సుమారు 2.3 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. ప్రస్తుతానికి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యాసంస్థకు చెందిన విధ్యార్థులు అనేక రకాలుగా నిర్వహించబడే పోటీలలో ముందంజలో వున్నారు.  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన కొన్నాళ్లకే జూన్ 2014 లో, ఒక స్వతంత్ర ప్రతిపత్తిగల రాష్ట్ర సంస్థగా రూపుదిద్దుకుంది. సంస్థ ఏర్పాటయినప్పటి నుంచే ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్ కు, మెరుగైన, నాణ్యమైన విద్యా ప్రమాణాలతో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు నిర్వాహకులు.

          సీనియర్ ఐ.పి.ఎన్. అధికారి డాక్టర్ ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ స్వఛ్చందంగా ముందుకు వచ్చి, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి, గణనీయమైన సేవలందించటంలో ప్రత్యేక కృషి చేసారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్దిగా చదువుకున్న ఆయన ఈ స్థాయికి చేరుకోవటం విశేషం. ఆయనకి స్ఫూర్తి వారి తల్లి గారు. ఆవిడ రోజువారీ కూలీగా చిన్నప్పటి జీవితాన్ని ఆరంభించి ఎసోసియేట్ ప్రొఫెసర్ గా, డాక్టర్ గా ఎదగగలిగారు. హార్వర్డ్ యూనివర్సిటీలో పట్టభద్రులు కావడానికి పూర్వం అక్కడ పరిచయమైన కొందరి స్ఫూర్తితో ఆయన ఆలోచనల్లో బలీయమైన కోరికగా ఇక్కడ పనిచేయటానికి బాటలు వేసింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తనపై పెట్టుకున్న నమ్మకానికి, తనకు అప్పచెప్పిన గురుతరమైన బాధ్యతకి, తనపై చూపించిన ఆదరణకు, తాను ఎప్పటికీ బద్ధుడినై, కృతజ్ఞతతో ఉంటూ లక్షల మంది భవితవ్యాన్ని తీర్చిదిద్దటంలో, భాగమైన కెజి-టు-పిజి కార్యక్రమాన్ని ముందుకుతీసుకుపోవడంలో తనవంతు కృషి చేస్తానని ప్రవీణ్ అన్నారు. తెలంగాణ గురుకుల విద్యాసంస్థలకు జాతీయ స్థాయి గుర్తింపును తీసుకురావటంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవటంలో తనవంతు పాత్ర నిర్వహిస్తానని కూడా ఆయన అన్నారు.

            విద్యకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉంది. పేదరికాన్ని, దారిద్ర్యాన్ని కూకటి వేళ్లతో పెకళించడానికి, అణగారిన వర్గాలను అభివృద్ధి చేయడానికి విద్య ఎంతో అవసరం. విద్యాబుద్ధులు కలిగించే గురువే తల్లితండ్రుల పాత్రని పోషిస్తూ, సర్వవిధాల విధ్యార్థులను సక్రమమైన మార్గంలో నడిపించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. గురుకుల విద్యనందించటం ద్వారా అద్భుత ఫలితాలు చేకూరడంతో పాటుగా ప్రతిభావంతులైన విద్యార్ధులు, వారి కలలు సాకారం పొందేందుకు, మట్టిలోంచి మాణిక్యాలను సృష్టించేందుకు గురుకుల విద్య దోహద పడుతోంది. గురుకులాల ఆవిర్భావంతో ఈ విద్యా సంస్థలను పెద్ద ఎత్తున మంచి పేరు రావటం ఆరంభమయ్యింది. ఎన్ని ప్రైవేటు విద్యా సంస్థలు పుట్ట గొడుగుల్లా విస్తరిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మండల స్థాయి వరకు గురుకులాల పరిధిని విస్తరించాలనే కృతనిశ్చయంతో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో ఈ గురుకుల పాఠశాలలు బోర్డు పరీక్షలలో సాధించే ఉత్తీర్ణతల సంఖ్య 15% పైమాటగానే నిలుస్తోంది. అఖిల భారత సర్వీసులకు, డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, రాజకీయాలు, వ్యాపారం, పర్వతారోహణ వంటి వాటిలో ఎందరికో ప్రవేశం కల్పిస్తుంది. గడచిన దశాబ్ద కాలంలో దాదాపు 200 పైగా విద్యార్ధులు ఐఐటిలకు, ఎన్ఐటిలకు, వైద్య రంగానికి, డెంటల్ కళాశాలలకు గురుకుల విద్యాసంస్థల నుంచి ఎంపికయ్యారు.

            గురుకుల విద్యా సంస్థల్లోని ప్రతీ పాఠశాలలో చక్కటి భవనంతో పాటు, ఒక డార్మిటరీ, వంటశాల, భోజనశాల, పని వారికి ఇళ్ళు, ఆటలకు మైదానం ఉంటాయి. ఒక సారి ప్రవేశం పొందిన అనంతరం నెలకు ఒక్క సారి మాత్రమే తల్లి తండ్రులను కలిసేందుకు, శెలవు రోజుల్లో మాత్రమే వారి వారి ఇళ్ళకు వెళ్ళేందుకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. టీచర్లూ అదే క్యాంపస్ లోనే ఉంటూ విద్యార్థుల అవసరాలకనుగుణంగా పాఠ్యాంశాల-పాఠ్యేతర అంశాల పరంగా, క్రీడా సంబంధమైన అంశాల కనుగుణంగా దిశా నిర్దేశం చేస్తూ అహర్నిశలు కంటికి రెప్పలా వారిని పర్యవేక్షిస్తుంటారు. వీరి విద్యకు అవసరమైన అన్ని ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. పన్నెండవ తరగతి అనంతరం వారికి పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ళ వసతి కల్పించి వారికి వచ్చే పారితోషికంతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేలా చూస్తారు. గురువులగానే కాకుండా తల్లితండ్రులుగా వారికి విలువలను నేర్పించటంలోనూ ఉపాధ్యాయులు దోహదపడతారు.


            తెలంగాణ గురుకుల విద్యా విధానాన్ని అనుకరించి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ అవసరాలకనుగుణంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవడం కష్టమేమీ కాదు. విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు కాని, ఈ నమూనా తప్పకుండా, అణగారిన వర్గాల్లో ఆణిముత్యాల్ని వెలికితీస్తుంది. సురక్షితమైన, సుస్థిరమైన, సమగ్రమైన రీతిలో తీర్చిదిద్దబడిన పిల్లలు వారి కుటుంబాలనే కాకుండా సమాజాన్నీ తగురీతిన తీర్చిదిద్దటంలో సఫలీకృతులౌతారు అనటం నిర్వివాదాంశం. End