Saturday, April 3, 2021

నలోపాఖ్యానం, నల దమయంతి వృత్తాంతం (ఆస్వాదన-14) : వనం జ్వాలా నరసింహారావు

 నలోపాఖ్యానం, నల దమయంతి వృత్తాంతం

(ఆస్వాదన-14)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (04-04-2021)

ఒకనాడు ధర్మారాజు దగ్గరికి బృహదశ్వుడు అనే గొప్ప ఋషి వచ్చాడు. ఆ ఋషితో శత్రువుల వల్ల తాము పడ్డ పాట్లు, జూదంలో జరిగిన మోసం, అరణ్యాలలో సంచరించడం చెప్పిన ధర్మరాజు, తమలాగా ఇక్కట్ల పాలైన ఇతర రాజులెవరైనా వున్నారా? అని అడిగాడు. జవాబుగా బృహదశ్వుడు, పాండవులకంటే ఎక్కువ బాధలు పడ్డవారు లేకపోలేదని అంటూ, నలోపాఖ్యాన్ని చెప్పాడు సవివరంగా. నలుడనే మహారాజు పూర్వకాలంలో జూదం ఆడి పుష్కరుడి వల్ల తన సంపదనంతా ఓడిపోయి ఒంటరిగా అడవులలో కష్టాలను అనుభవించలేదా? అని అన్నాడు.   

(డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు ఈ సందర్భంగా విశ్లేసిస్తూ ఇలా రాశారు: అరణ్య పర్వం మహాభారతంలోని 18 పర్వాలలో పెద్ద పర్వాలలో ఒకటి. దీనికి కారణం ఇందులో వున్న ఉపాఖ్యానాలు. ఆ ఉపాఖ్యానాలలో పెద్దది నలోపాఖ్యానం. వాస్తవానికి, నలోపాఖ్యానం మిక్కలి ప్రాచీనమైనదని పరిశోధకుల అభిప్రాయం. నలోపాఖ్యానం విషాదాంత గాథ కాదుకాని, విషాదాత్మక కృతి అని చెప్పవచ్చు. నలోపాఖ్యానం ప్రపంచ వాజ్మయంలో ‘నిరుపమానమైన రసవత్కావ్యం, ‘సాటిలేని విషాదాత్మక కృతి అని చెప్పవచ్చు. మహాభారత రచనకు చాలా పూర్వమే నలచక్రవర్తి గాథ బహుళ వ్యాప్తిని పొందింది. నలుడికి, ధర్మరాజుకి గల సామాన్య వ్యసనం జూదం).

నిషధేశ్వరుడైన వీరసేనుడి కొడుకు నలుడు. అతడు మహా తేజస్వి. ఎన్నో అక్షౌహిణుల సేనకు అధినేత. కాని, అతడికి జూదం అంటే అమితమైన ప్రేమ. తన పరాక్రమంతో రాజులందరినీ జయించి పాలన చేసేవాడు నలుడు. ఇదిలావుంటే, విదర్భ రాజైన భీముడు, అతడి భార్య, దమనుడనే గొప్ప ఋషిని ఆరాధించి, దమయంతి అనే కూతురును, ముగ్గురు కొడుకులను పొందారు. సద్గుణాల దమయంతి విశేష రూప లావణ్యవతి. నలుడి సద్గుణాలను దమయంతికి, ఆమె గుణగణాలను నలుడికి మధ్యవర్తులు అభివర్ణించి, ప్రశంసించి చెప్పడం వల్ల ఇరువురిలో ఒకరిమీద ఇంకొకరికి ప్రేమాభిమానాలు వెల్లివిరిశాయి.

ఒకనాడు నలుడు ఉద్యానవనంలో విహరిస్తుంటే ఒక హంసల గుంపు కనిపించింది. అందులోని ఒక హంసను అది ఎగరక ముందు పట్టుకున్నాడు నలుడు. తోటి హంసను పట్టుకున్నందుకు మిగతా హంసలు ఆకాశంలో అరుస్తూ తిరిగాయి. పట్టుబడ్డ హంస మానవ భాషలో, నలుడికి ఉపకారం చేస్తానని, ఆయనకు ఇష్టమైన దమయంతి దగ్గరికి వెళ్లి నలుడి మహనీయ గుణగణాలు చెప్పి, ఆమెకు ఇతడి మీదే వలపు నిలిపేట్లు చేస్తానన్నది. వెంటనే హంసను వదిలిపెట్టాడు నలుడు.

ఆ హంస విదర్భ రాజధానికి ఎగిరి వెళ్లి, అక్కడ ఉద్యానవనంలో వున్న దమయంతి సమీపానికి వచ్చి, నడయాడుతూ ఆమె చేతికి దొరికింది. అలా చిక్కిన రాజహంస మనోహరమైన మనుజ భాషలో, దమయంతితో, నలుడి గురించి వర్ణిస్తూ, ఈ అపారమైన భూమండలంలో రాజులెవ్వరూ సౌందర్యసౌశీల్యాలలో నలుడికి సాటిరారని చెప్పింది. నలుడికి దేవేరివి కమ్మని ప్రోత్సహించింది. వారిరువురి సంయోగం ఒకరికొకరు శోభ చేకూర్చినట్లు వుంటుంది అని అన్నది హంస. నలమహారాజు గుణాలను గురించి తనకెట్లా చెప్పిందో, అలాగే, తనను గురించి కూడా ఆ రాజుకు చెప్పమని దమయంతి కోరగానే, హంస ఎగురుకుంటూ నిషధ దేశానికి వెళ్లి, నలమహారాజుకు దమయంతి గుణరూప వైభవాలను గురించి చెప్పింది. నలదమయంతులకు ఒకరిమీద ఇంకొకరికి వలపు వృద్ధి చెంద సాగింది.

కూతురుకు నల మహారాజు మీద ప్రేమ వున్న విషయం ఆమె చెలికత్తెల ద్వారా గ్రహించిన విదర్భరాజు భీముడు ఏదైనా ఉపాయం చేసి నలుడిని విదర్భకు రప్పించాలనుకున్నాడు. దమయంతీ స్వయంవరం అనే మిషతో రాజులందరినీ రప్పించాడు. అదే సమయంలో ఇంద్రలోకం వెళ్లిన మునులు పర్వతుడిని, నారదుడిని భూలోక విషయాల గురించి ఇంద్రుడు అడగ్గా, అతడికి, అసాధారణ వైభవంతో జరుగనున్న జగదేక సుందరి దమయంతీ స్వయంవరం గురించి చెప్పారు వారు. ఆ వేడుకను చూడడానికి ఇంద్రుడు, దిక్పాలకులు కూడా బయల్దేరారు. దారిలో వారికి స్వయంవరానికి వెళ్తున్న నల మహారాజు కనిపించాడు. తమ దూతగా తమ అభీష్టం నేరవేర్చమని కోరాడు నలుడిని ఇంద్రుడు. సరేనని, ఆ కర్తవ్యం ఏమిటో వివరించమన్నాడు నలుడు. తాను దేవేంద్రుడినని, దమయంతీ స్వయంవరానికి స్నేహుతులతో కలిసి వెళ్తున్నానని, తమని దమయంతికి పేర్లతో, బిరుదులతో సహా ప్రశంసా పూర్వకంగా పరిచయం చేయమని అడిగాడు. అలా చేస్తే తమలో ఒకడిని ఆమె వరుడిగా ఎన్నుకుంటుంది అన్నాడు.

తానూ అదే పని మీద వెళ్తున్నానని అన్నాడు నలుడు. అలాంటప్పుడు తనను, ఇంద్రాదులను పరిచయం చేసే పనికి వినియోగించడం న్యాయమా? అని అడిగాడు. దేవేంద్రుడు మరీమరీ కోరడంతో ఒప్పుకున్నాడు. అతడి మాట ప్రకారం నలుడు విదర్భ రాజధానికి వెళ్లి దమయంతి ఇంట్లోకి ఇంద్రుడి మహిమ వల్ల దేవదూతగా ప్రవేశించాడు. దమయంతిని చూసి ఆమె అందానికి ముగ్దుడయ్యాడు. నలుడిని చూసిన ఆమె కూడా అతడెవరో తెలియకుండానే ముగ్దురాలు అయింది. ఇద్దరికీ మాటలు కలిశాయి. తాను దేవతల దూతనని, పేరు నలుడని, ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు ఆమె స్వయంవరానికి వచ్చారని, వారిలో ఒకరిని భర్తగా ఎన్నుకోమని కోరుతున్నారని చెప్పాడు నలుడు. తాను నలుడి సొత్తునని, కేవలం ఆయన రాక కోసమే స్వయంవరం ప్రకటించడం జరిగిందని, అతడు భర్తగా వుండడానికి అంగీకరించకపోతే ప్రాణాలు వదులుతానని అన్నది దమయంతి. స్వయంవరంలో ఇంద్రాదుల సమక్షంలోనే నలుడిని వరిస్తానని ధైర్యంగా చెప్పింది దమయంతి నలుడితో. నలుడు ఆ తరువాత దిక్పాలకుల దగ్గరికి వెళ్లి విషయమంతా సవివరంగా చెప్పాడు.

స్వయంవర మంటపంలో నలుడి పక్కన అదే వరుసలో ఐదుగురు (ఇంద్రాది దిక్పాలకులు) నల మహారాజులు కూర్చున్నారు. అక్కడికి సమీపించిన దమయంతి, కొంచెం కలవరపడి, తనకు నలుడిని ఎన్నుకునే పరిజ్ఞానం కలిగించమని దేవతలను ప్రార్థించింది. దేవతలు కరుణించారు. అసలు నలుడిని గుర్తించి, నలుడి మెడలో హారం వేసి, అతడిని వరుడుగా ఎన్నుకుంది దమయంతి. నల దమయంతుల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఇంద్రాది దిక్పాలకులు నలుడికి కోరిన వరాలు ఇచ్చారు.

దేవలోకం పోతున్న వారికి కలి కనిపించాడు దారిలో. దమయంతి స్వయంవరానికి కలి పోతున్నాడని విని, ఆ తతంగం అయిపోయిందని, నలుడితో ఆమె వివాహం జరిగిందని చెప్పాడు ఇంద్రుడు. కలి పురుషుడికి నలుడి మీద కోపం వచ్చింది. కలి నలుడిలో ప్రవేశించాడు. నలుడితో జూదం ఆడి అతడి రాజ్య సంపదలు హరించమని పుష్కరుడు అనే రాజును ప్రేరేపించాడు కలి. నలుడిని జూదానికి ఆహ్వానించాడు పుష్కరుడు. నలుడు సమ్మతించాడు కలి ప్రభావం వల్ల. నలుడు మొత్తం కోల్పోయాడు. దమయంతి దుఃఖించింది. తన కుమారులను తండ్రి దగ్గరికి పంపింది. జూదంలో నలుడి రాజ్యం పోయింది. రాజ్యాన్నుండి బయటకు వెళ్లాడు. కలి ప్రభావం వల్ల నగరం వెలుపల మూడు రోజులున్న నలుడిని ఎవరూ ఆదరించలేదు. పక్షుల రూపంలో వచ్చిన పాచికలు అతడి మీద వున్న బట్టలను కూడా అపహరించాయి. అడవి దారి పట్టారు నలదమయంతులు. విదర్భ రాజు దగ్గరికి పోవడానికి వారి మనస్సులు అంగీకరించలేదు.

 కలి ప్రభావం వల్ల నలుడు భార్యను అడవిలో ఒంటరిగా వదిలి ఒక్కడే వెళ్లిపోయాడు. నిద్రలేచిన దమయంతికి భర్త కనిపించక దుఃఖపడ్డది. ఒక కొండ చిలువ బారిన పడ్డ ఆమె ఒక కిరాతకుడి సహాయంతో తప్పించుకున్నది. అదే కిరాతకుడు కామభావ ప్రేరితుడై ఆమెను సమీపించగా తన పాతివ్రత్యం చేత అతడిని దహించి వేసింది. కీకారణ్యంలో ఒంటరిగా పయనం సాగిస్తున్న ఆమెకు ఒక వర్తకుల బృందం కనిపించింది. వారు ఎక్కడికి వెళ్తున్నారని అడిగింది. జవాబుగా చేది ప్రభువు సుబాహువు రాజధానికి అని చెప్పారు వారు. వారితోపాటే దమయంతి కూడా పయనమై పోయింది.

సుబాహుపురం చేరిన దమయంతి రాజమార్గంలో లక్ష్మీదేవిలాగా నడుస్తుంటే రాజమాత చూసి తన దాదిని పిలిచి ఆమెను తీసుకురమ్మని చెప్పింది. వచ్చిన దమయంతి వివరాలు అడిగింది. జూదం ఆడి తన భర్త రాజ్యాన్ని పోగొట్టుకున్న సంగతి చెప్పింది. భర్త వదిలి వెళ్తే దిక్కులేని దాన్నయ్యానని అన్నది. తన దగ్గర వుండమని చెప్పింది రాజమాత. ఆమెను తన కూతురు సునందకు అప్పచెప్పింది. అలా సైరంధ్రిగా సుబాహుపురంలో అజ్ఞాతవాసంలో వున్నది దమయంతి.

అక్కడ నలుడు అడవిలో తిరుగుతుంటే మంటల్లో చిక్కుకున్న కర్కోటకుడు అనే నాగ కుమారుడిని రక్షించాడు. కర్కోటకుడు నలుడిని కాటు వేశాడు. నలుడికి వెంటనే వికృత రూపం వచ్చింది. తాను నలుడికి మేలు చేశానని, ప్రస్తుతం వికృత రూపమే అతడికి మంచిదని, అతడికి త్వరలోనే భార్యా సంగమం కలిగి రాజ్య సంపద దక్కుతుందని, అతడికి ఎప్పుడు నిజరూపం కావాలనుకుంటే అప్పుడే తనను స్మరిస్తే చాలని అన్నాడు కర్కోటకుడు. అని ఒక వస్త్రం ఇచ్చాడు. ఋతుపర్ణుడు అనే మహారాజు దగ్గరికి పోయి బాహుకుడు అనే పేరుతో అతడిని సేవించమని చెప్పాడు. అతడికి నలుడికి వచ్చిన అశ్వ హృదయ విద్యను నేర్పి, అతడి నుండి అక్ష హృదయ విద్యను నేర్చుకొమ్మన్నాడు.

కర్కోటకుడు చెప్పినట్లే నలుడు అయోధ్యాపురికి వెళ్లి ఋతుపర్ణుడిని సందర్శించి, తాను బాహుకుడినని, అశ్వ విద్యలో నేర్పరినని, పాక కళలో నిపుణుడినని, శిల్పవిద్యా నిష్ణాతుడినని ఆయన దగ్గర సేవ చేయడానికి వచ్చానని చెప్పాడు. ఆయన అంగీకరించాడు. ఈ విధంగా నలుడు ఋతుపర్ణుడి దగ్గర గుర్రాలకు అధినేత అయ్యాడు. అలా నలుడు అజ్ఞాతవాసం చేశాడు. రాత్రులలో మదనతాపంతో దమయంతిని గురించి కలవరించేవాడు. ఇది గమనించి, నలుడి సహచరుడు జీవలుడు కురూపి అయిన బాహుకుడిని చూసి ఆశ్చర్యపడేవాడు.

ఇక అక్కడ విదర్భలో భీమరాజు, రాజ్యంపోగొట్టుకున్న తన అల్లుడు గురించి, కూతురు గురించి చింతించేవాడు. నలదమయంతులను వెతకడానికి బ్రాహ్మణులను నియమించాడు. వారు నానా దేశాలకు వెళ్లి వెతకసాగారు. వారిలో సుదేహుడనే బ్రాహ్మణుడు సుబాహుడి రాజధానికి చేరి, రాజమందిరంలోకి వెళ్లి, అక్కడ దమయంతిని చూసి, ఆమె కనుబొమల మధ్య వున్న పుట్టుమచ్చ ఆధారంగా గుర్తుపట్టాడు. దమయంతి దగ్గరికి రహస్యంగా వచ్చి ఆమె తల్లిదండ్రులు ఆమెకోరకు దుఃఖిస్తున్న విషయం చెప్పాడు. ఇది గమనించిన రాజకుమారి సునంద ఆ వార్తను తల్లికి చెప్పింది. రాజమాత అక్కడికి వచ్చి విషయాన్ని ఆకళింపు చేసుకున్నది. తన దగ్గర వున్నది దమయంతి అని తెలుసుకున్నది. దమయంతి తన కూతురుతో సమానమని, తాను, దమయంతి తల్లి దశార్ణరాజు పుత్రికలమని, అక్కచెల్లెల్లమని చెప్పింది రాజమాత. దమయంతి విదర్భకు వెళ్లింది. అక్కడ కూడా విచారంగా శరీర సౌఖ్యాలు త్యజించి జీవించసాగింది.

కూతురు దమయంతి కోరిక ప్రకారం విదర్భరాజు భీముడు, నలుడిని అన్వేషించడానికి బ్రాహ్మణులను వినియోగించాడు. ‘భార్యను మోసం చేసి ఆమె చీరను సగం చింపి కట్టుబట్టగా చేసుకుని పోవడం న్యాయమా అని అనమని, దానికి ఎవరైతే స్పందిస్తారో అతడే తన భర్త అని గుర్తించమని దమయంతి బ్రాహ్మణులకు సూచించింది. వెతకడానికి వెళ్లినవారిలో పర్ణాదుడు అనే బ్రాహ్మణుడికి అయోధ్య నగరంలో దమయంతి అనమన్న మాటలకు ఒక కురూపి స్పందించినట్లు గ్రహించాడు. తనను గుర్తించిన సుదేవుడినే పిలిచి నలుడిని గుర్తించడానికి అయోధ్యకు పంపింది దమయంతి. ఆ దేశానికి వెళ్లి, దమయంతికి ద్వితీయ స్వయంవరం ఏర్పాటు చేశాడు ఆమె తండ్రి అని రాజు ఋతుపర్ణుడికి చెప్పమని అన్నది. సుదేవుడు అయోధ్యాపురికి వెళ్లి ఋతుపర్ణుడిని సందర్శించి దమయంతి స్వయంవరం మర్నాడే జరుగుతుందని చెప్పాడు.

తనకు దమయంతీ స్వయంవరం చూడాలని వున్నదని, ఒక్క దినంలో విదర్భ చేరాలని, తన అశ్వశిక్షా చాతుర్యం చూపించి అక్కడికి చేర్చమని బాహుకుడి (నలుడికి) చెప్పాడు ఋతుపర్ణుడు. వాయువేగంతో పరుగెత్తే గుర్రాలను కట్టి రథాన్ని సిద్ధం చేశాడు బాహుకుడు. దానిమీద ఋతుపర్ణుడు పయనించాడు. దారిలో ఋతుపర్ణుడు, బాహుకుడి ఆశ్వవిద్యకు ప్రసన్నుడై అతడికి తనకు తెలిసిన అక్షహృదయం అనే గణిత విద్యను ఉపదేశించాడు. దానికి బదులుగా తనకు తెలిసిన ఆశ్వహృదయ విద్యను ఋతుపర్ణుడికి నేర్పాడు బాహుకుడు.

దారిలో నలుడిని ఆవహించిన కలి పురుషుడు కర్కోటకుడి విషాన్ని కక్కుతూ నలుడి శరీరం నుండి బయటకు వచ్చి అతడికి నమస్కరించి వెళ్లిపోయాడు. ఋతుపర్ణుడు వైభవోపేతంగా విదర్భలో ప్రవేశించాడు. అతడు పుర ప్రవేశం చేస్తుంటే అతడి రథఘోష మేఘ గర్జనలాగా వినిపించింది. దమయంతి దాన్ని వినగానే అది నలుడి రథమని గుర్తుపట్టింది. బాహుకుడు రథశాలలో వుండగా దమయంతి వచ్చి బాహుకుడిని చూసి ఆశాభంగం పొందింది. దమయంతి స్వయంవరం ప్రకటన కల్పితమే అని అర్థమైంది నలుడికి. దమయంతి ఇంకొంత విచారణ చేయగా బాహుకుడే నలుడన్న అనుమానం కలిగింది. బాహుకుడిలో నలుడి లక్షణాలను గమనించింది. తన తల్లికి తన అనుమానం గురించి చెప్పగా ఆమె బాహుకుడిని దమయంతి దగ్గరికి పిలిపించింది.

దమయంతి కన్నీరు చూసి నలుడు తనను కలి ఆవహించడం వల్ల బుద్ధి చెడి సమస్తమైన కష్టాలపాలు కావాల్సి వచ్చిందని, ఇప్పుడు కలి తనను వదిలిపోయాడని, తాను విదర్భ వచ్చింది దమయంతి విషయం తెలుసుకోవడానికే అని నలుడన్నాడు. దమయంతీ స్వయంవరం ప్రకటించాల్సిన అవసరం ఏమిటన్న అనుమానం మాత్రం నలుడికి తీరలేదు. నలుడిని గుర్తించడానికే స్వయంవర ప్రకటన అని దమయంతి చెప్పింది. వాస్తవానికి స్వయంవరం ఏమీ లేదన్నది. అదే సమయంలో దమయంతి నిర్మలమైన ప్రవర్తన గురించి ఆకాశవాణి పలికింది. తక్షణమే కర్కోటకుడిని స్మరించి అతడిచ్చిన వస్త్రాన్ని మీద ధరించగా నలుడికి తన నిజరూపం వచ్చింది. దమయంతికి సంతోషం కలిగింది. నలదమయంతులకు తిరిగి సమాగం జరిగింది. పుష్కర మహారాజు దగ్గరికి నలుడు పోయి మళ్లీ జూదం ఆడి, గెలిచి, సమస్త రాజ్యాన్ని గ్రహించాడు.

దమయంతీ నలమహారాజులు సుఖసంతోషాలతో జీవించారు. నలుడు సమస్త భూమండలాన్ని గొప్పగా పాలించాడు. ఇలా ధర్మరాజుకు నలోపాఖ్యానం చెప్పిన బృహదశ్వుడు, పాచికలలో ఓడిపోయానని చింతించవద్దని, విరోధులను జయించి రాజ్యాన్ని పొందమని అన్నాడు.        

(డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు ఈ సందర్భంగా విశ్లేసిస్తూ ఇలా రాశారు: నలోపాఖ్యానం భారత కథ కంటే ప్రాచీనమైనది. ఇందులోని పాత్రలు చిరస్మరణీయాలు. నలోపాఖ్యానం విని, చదివి, ధర్మారాజు నుండి నేటిదాకా రసానంద తన్మయత్వం అనుభవించిన సహృదయులు ఎందరో వున్నారు).

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

శ్రీరాముడి ఆగ్రహానికి సముద్రుడు గురయ్యాడా? : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీరాముడి ఆగ్రహానికి సముద్రుడు గురయ్యాడా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం (03-04-2021) ప్రసారం   

         వానర సేన సముద్ర తీరాన్ని చేరిన తరువాత, రావణుడిని వదిలి రాముడి దగ్గరకు వచ్చిన విభీషణ పట్టాభిషేకం జరిగిన అనంతరం, సముద్రం దాటి లంక చేరడానికి ఉపాయం ఆలోచించారు రామ, లక్ష్మణ, సుగ్రీవ, హనుమాదులు. దారి ఇవ్వమని ప్రార్థిస్తూ, బెదిరిస్తూ, తన కుడి భుజాన్ని దిండుగా చేసుకుని సముద్ర తీరంలో తూర్పు ముఖంగా, నియమబద్ధంగా పడుకున్నాడు శ్రీరాముడు. తాను సముద్రాన్నైనా దాటాలి, లేదా, సముద్రుడు చావనైనా చావాలి. రెంటిలో ఒకటి కావాలని శ్రీరాముడు నిశ్చయించుకున్నాడు. మౌనవ్రతం పూని సముద్రాన్ని ప్రార్థిస్తూ మూడు రాత్రులు (పాడ్యమి, విదియ, తదియ) పండుకున్నప్పటికీ బుద్ధిమాలిన సముద్రుడు కనబడలేదు.   

         మూడు రాత్రులు దర్భశయనం మీద వుండినా సముద్రుడు దర్శనం ఇవ్వకపోవడంతో కళ్లెర్ర చేసిన శ్రీరాముడు తన సమీపంలో వున్న లక్ష్మణుడిని చూసి, “లక్ష్మణా! చూశావా! సముద్రుడు కనబడడం లేదు. మంచిమాటలు చెప్పడం దుర్జనుల విషయంలో పనిచేయవు. నేను మొదట్లోనే సముద్రాన్ని ఎండించి కాలహరణం చేయకుండా వానరసేనను సముద్రాన్ని దాటించాలనుకున్నాను. మీరంతా సౌమ్య మార్గాన్ని సూచించడం వల్ల మీమాట తీసేయలేక కాలహరణమైనా సరే అని సహించడం వల్ల నన్ను దేనికీ పనికిరాని వాడిగా సముద్రుడు తలచాడు. ఏమిటీ వీడి ధైర్యం? ఇలాంటి వాడి విషయంలో ఓర్పు పనికిరాదు. నా బాణ పరంపరలతో నీరు కదలకుండా స్థంబించి, వీడి గర్వం అణచి, అల్లకల్లోలమయ్యేట్లు చేస్తాను. పదునైన బాణాలతో సాగరాన్ని ఎండబెట్తాను. మంచితనంతో వీడు మాట వినడు. సౌమిత్రీ! విల్లును, బాణాల సమూహాలను తెచ్చి ఇవ్వు. ఈ సముద్రాన్ని ఎండబెట్టి దుమ్ము లేపుతాను. వానరులు కాలినడకన సముద్రాన్ని దాటేట్లు చేస్తాను. చెలియలికట్టను దాటిరాకూడదనే మర్యాదను పోగొట్టి పొంగి పోరలేట్లు చేసి క్షోభకు గురిచేస్తాను” అని అంటాడు. 

         ఇప్పుడీ సముద్రాన్ని ఏం చేస్తానో చూడమని, దానికి ఏగతి పట్తుందో గమనించమని అంటూ, శ్రీరాముడు ప్రళయకాలాగ్ని లాగా మండిపడుతూ విల్లు గట్టిగా పట్టుకుని నారిలాగి, ఇంద్రుడి పిడుగుల్లాగా బాణాలను వదిలాడు. ఆ బాణాలు సముద్రాన్ని అల్లకల్లోలం అయ్యేట్లు చేశాయి. వికార రూపంలో సముద్రం చాలా బాధపడి కళవళ పడింది. పాతాళంలో వుండే పన్నగులు విచ్చలవిడిగా వస్తున్న బాణాల వేగానికి ముఖాలు, కళ్ళు మండుతుంటే డీలాపడి శోకించారు. అలల సమూహాలు ఆకాశానికి తగిలేట్లు ఎగిసాయి. సముద్రం అడుగు నుండి కలత పడింది. ఆయన కోపాన్ని చూసి భయపడిన లక్ష్మణుడు “అన్నా! అన్నా! బాణాలు ప్రయోగించ వద్ద” ని చెప్పడంతో పాటు, ఆ రామచంద్రుడి విల్లును పట్టుకున్నాడు.

         ఇంత జరిగినా సముద్రుడి దగ్గరనుండి స్పందన లేకపోవడంతో కోపం తెచ్చుకున్న శ్రీరామచంద్రమూర్తి, భయంకరమైన మాటలతో సముద్రుడితో ఇలా అన్నాడు. “ఓరీ సముద్రుడా! నా బాణాల సమూహంతో నీరు ఇంకి పోయేట్లు చేసి, నీ స్వరూపం లేకుండా చేస్తాను. చూస్తూ వుండు. నాకు కోపం వస్తే నువ్వు బతుకుతావా? ఓరీ! రాక్షసులకు ఉనికి పట్టయిన వాడా! నా పదునైన బాణాలతో సేతువు కట్టి వానరసేనను కాలినడకన ఈ క్షణంలోనే అవతలి ఒడ్డుకు చేరుస్తాను. అలా నా పరాక్రమం చూపకపోతే నీకు అసమానమైన నా బలపరాక్రమాలు ఎలా తెలుస్తాయి? కానీ రా!”.

         ఇలా అంటూ, బ్రహ్మ దండంతో సమానమైన ఒక బాణాన్ని వింటిలో సంధించి, రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రంతో దాన్ని అభిమంత్రించి, అమితమైన వేగంగా అల్లె తాటిని తన చెవి కొనవరకు లాగాడు. అప్పుడు కొండలు గడ-గడలాడాయి. దిక్కులు గాఢమైన అంధకారంలో మునిగి వణికాయి. సూర్య చంద్ర నక్షత్రాలు పెడతోవన పోయాయి. నదుల్లో, సరస్సుల్లో నీళ్ళు ఎండిపోయాయి. నక్షత్రాలు పెద్ద ధ్వనితో నేలరాలాయి. జంతువులు మూర్ఛపోయాయి. అంతటా చీకటి ఆవరించింది. సముద్రంలో ఒక యోజనం దూరందాకా నీళ్లు చెలియలికట్టను వదిలి లోపలికి ఈడ్చుకు పోయాయి. దయాసముద్రుడైన రామచంద్రమూర్తి భూత సంహారం అంటే ఇష్టం లేనందున బాణం వదల లేదు.

అప్పుడు సూర్య తేజస్సుతో సర్పాలతో చుట్టుకుని బంగారు సొమ్ములు ధరించిన సముద్రుడు నీళ్లలోనుండి బయటకి వచ్చాడు. రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి, “రామచంద్రా!” అని ఆదరంగా పిలిచి ఇలా అన్నాడు.

         “పంచమహాభూతాలైన భూమి, ఆకాశం, అగ్ని, జలం, వాయువు శాశ్వతమైన తమ మార్గాన్ని వదిలి వాటి స్వభావాన్ని విడవవు. ఆ విధంగానే జలరూపంలో వున్న నేను నా లోతు తెలియనీయను. కాలి నడకన దాటనీయను. ఇది నా స్వభావం. దీన్ని నేను తప్పకూడదు. రామచంద్రా! సౌమ్యుడా! నేను నా స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించడం సరైన పని కాదు. ఏ కారణాన కూడా నేను నా నీటిని గట్టిపడేట్లు చేయకూడదు. అలా చేస్తే ఆ జీవజంతువులు బాధపడ్తాయి. చచ్చిపోతాయి. కాబట్టి నేనెప్పుడూ అలాంటి పనిచేయకూడదు. నన్నాశ్రయించిన వారిని నేనెలా బాధపెట్టుతాను? అయినప్పటికీ నీ వానర సేనంతా సముద్రాన్ని దాటేంతవరకూ వారికి ఏ ఆపద లేకుండా, నా చేతనైనంత వరకు రక్షిస్తాను. నీ సేన దాటడానికి మిట్ట ప్రదేశాన్ని ఇస్తాను. కోపం వదులు”. అని సముద్రుడు చెప్పగా రామచంద్రమూర్తి ఇలా అన్నాడు.

         “ఈ బాణం వ్యర్థం కాకూడదు. దీన్ని ఎక్కడ వేయాలి?” అని రామచంద్రమూర్తి సముద్రుడిని ప్రశ్నించాడు. జవాబుగా, ఆయన, ఈ మహాస్త్రాన్ని పవిత్రమైన ద్రుమకుల్యమనే ప్రదేశంలో వేయి అన్నాడు. సముద్రుడు ఇలా చెప్పగానే ఆయన చూపించిన దిక్కుగా నిప్పులాగా మండుతున్న తన బాణాన్ని ప్రయోగించాడు రామచంద్రమూర్తి. ఆ బాణం పడ్డ చోట ఎడారి అన్న పేరు వచ్చింది. ఆ బాణం భూమిలో ప్రవేశించినందున కలిగిన రంధ్రం నుండి పాతాళ జలం పైకి వుబికింది. ఆ కూపానికి వ్రణకూపం అని పేరు. అక్కడ నుండి వచ్చిన నీరు సముద్రంలాగా అనిపిస్తుంది. ఆ బాణం భూమిని భేదించడం వల్ల ఆ వేడికి అక్కడ వారు తాగుతున్న గుంటల్లోని నీరు కూడా ఎండిపోయింది. ఈ విధంగా సముద్రంలోని ఒక భాగం రామచంద్రమూర్తి తీక్ష్ణమైన బాణానికి కాలిపోగా, సేతువు కట్టడానికి తనలో స్థలం చూపిస్తానని సముద్రుడు చెప్పాడు. రామచంద్రమూర్తిని చూసి సముద్రుడు ఇలా అన్నాడు అప్పుడు.

         “మీ దగ్గర వున్న నలుడు అనేవాడు విశ్వకర్మ కుమారుడు. శిల్ప విద్యలో తండ్రితో సమానమైన వాడు. తండ్రి వరబలం వల్ల ఆ విద్యల్లో ప్రవీణుడు, ప్రసిద్ధ శక్తి కలవాడు అయ్యాడు. వీడు సేతువు నిర్మించడానికి ప్రయత్నం చేయాలి. ఆ సేతువు భారాన్ని నేను వహిస్తాను. కొండలు, చెట్లు నీళ్లలో వేసినప్పుడు అవి మునిగి పోకుండా నేను కాపాడుతాను. నీళ్లమీద తేలేట్లు చేస్తాను”.

         ఇలా చెప్పి సముద్రుడు కనబడకుండా పోయాడు. అప్పుడు నలుడు ఇలా అన్నాడు. “రామచంద్రదేవా! సముద్రుడు నిజం చెప్పాడు. నా తండ్రి వరబలంతో నేను సముద్రం మీద సేతువు కట్తాను. నేను విశ్వకర్మకు ఔరస పుత్రుడిని. పూర్వం విశ్వకర్మ నా తల్లికి, తన కొడుకుకు సమస్త శిల్ప విద్యలు వస్తాయని వరం ఇచ్చాడు. ఆ వరం బలంతో నేను శిల్ప విద్యలో తండ్రితో సమానుడనయ్యాను. ఈ సముద్రుడు చెప్పడం వల్ల నా విద్య గుర్తుకు వచ్చింది. నేను సేతువు కట్తాను. దానికి కావాల్సిన పదార్థాలు తేవడానికి నాకు వానరుల సహాయం కావాలి. నేనే తెచ్చుకుని కట్టాలంటే ఆ పని కాదు”.

         ఇలా నలుడు చెప్పడంతో, రామచంద్రమూర్తి వానరులందరికీ చెట్టులు, గుట్టలు తెచ్చి నలుడికి అందివ్వమని ఆజ్ఞాపించాడు. వారలాగే అడవికి పోయి చెట్లు పెళ్లగించుకుని  సముద్రతీరానికి వచ్చారు. అవన్నీ నలుడు సముద్రంలో పడవేశాడు. సేతువు వంకరగా పోకుండా నూరామడ పగ్గాలు ఈ కొన నుండి ఆ కొన దాకా ఈ పక్కన కొందరు, ఆ పక్కన కొందరు పట్టుకున్నారు. ఎలా-ఎలా చేయాలో అని రామచంద్రమూర్తి చెప్పుతుంటే వానరులు సహాయం చేస్తుండగా నలుడు మొదటి రోజున సముద్రంలో పద్నాలుగు ఆమడల సేతువు కట్టాడు. రెండో రోజున వానరుల సహాయంతో ఇరవై, మూడవ రోజున ఇరవై రెండు, నాల్గవ రోజున ఇరవై రెండు ఆమడల సేతువు ఉత్సాహంగా కట్టారు. సామర్థ్యసంపత్తి కల నలుడు ఐదవ రోజున ఇరవై మూడు ఆమడల దూరం సేతువు కట్టాడు. ఇలా మొత్తం 101 ఆమడ దూరం కట్టారు. నీటి పొడుగు నూరామడలే కాబట్టి, మిగతా ఆమడ అటూ-ఇటూ భూమ్మీద సగం ఆమడ కట్టారు.

          

         అప్పుడు సుగ్రీవుడు రామచంద్రమూర్తితో హనుమంతుడి వీపుమీద రాముడు, అంగదుడి వీపుమీద లక్ష్మణుడు ఎక్కి ఆకాశ మార్గాన ఆవలి ఒడ్డుకు రావచ్చని చెప్పాడు. కాని రాముడు వానరులను విడిచి పోదల్చుకోలేదు. సుగ్రీవుడు వెంటే ఆయనా దాటసాగాడు. కొందరు వానరులు సేతువు మీదగా, కొందరు ఈదుకుంటూ, కొందరు ఆకాశ మార్గాన ఆవలి ఒడ్డుకు చేరారు. రామచంద్రమూర్తి చేసిన ఈ అసాధారణ కార్యం వల్ల ఇక రావణుడి చావు తప్పదని దేవఋషి సిద్ధ చారణులు సంతోషంతో తమ మనస్సులలో ఉప్పొంగి పోయారు.

         సమస్త శుభాశుభ శకునాల లక్షణం తెలిసిన రామచంద్రమూర్తి తనకు శుభ శకునాలు కలగడం చూసి సంతోషించి తమకిక భయం లేదని భావించి, లక్ష్మణుడిని కౌగలించుకుని, వానరసేనను ఒక మంచి ప్రదేశంలో, ఎక్కడైతే మంచినీరు విస్తారంగా లభిస్తుందో అక్కడ, వ్యూహాత్మకంగా తీర్చమని చెప్పాడు. వానరులకు, భల్లూకాలకు, రాక్షసులతో వినాశనకరమైన, మిక్కిలి భయంకరమైన యుద్ధం లోకనాశనం కొరకు తటస్థించింది. దుమ్మురేపుతూ గాలి వీచింది. కొండల శిఖరాలు వణకాయి. భూకంపం పుట్టింది. ఆ కారణాన చెట్లు నేలకూలాయి. భయంకరమైన డేగలు, మృగాలు, మేఘసమూహాలు ఉత్పాత సూచకంగా నెత్తురు వర్షం కురిపించాయి.         

         “లక్ష్మణా! సంధ్యాకాల మేఘాలు కుంకుమ వర్ణం కలవిగా వున్నాయి. సూర్యుడిలో ఒక నల్లటి చుక్క కనపడుతున్నది. సూర్యుడి నుండి ఒక నిప్పు సమూహం మండుతూ నేలమీద పడింది. సూర్యుడిని చూసి అన్ని ప్రదేశాల్లో వున్న మృగాలు, పక్షులు, దుఃఖస్వరంతో ధ్వనిస్తున్నాయి. రాత్రుల్లో చంద్రుడు తన కాంతి క్షీణించడంతో కోనల్లో నలుపు, ఎరుపు కలిసిన కాంతి కలిగి ప్రళయకాలంలో లాగా వేడి కలిగిస్తున్నాడుఈ శకునాల ఫలం ఏంటంటావా? ఈ నేల నెత్తురుతో, మాంసంతో బురదకాబోతున్నది. కాబట్టి రావణపాలిత లంకానగారాన్ని ఇప్పుడే సేనతో పోయి ముట్టడిద్దాం” అని రామచంద్రుడు చేతిలో విల్లు ధరించి లంకకు అభిముఖంగా పోయాడు. యుద్దాభిలాష ఆవహించడంతో సంతోషంతో పోతున్న రామచంద్రమూర్తి వెంట సుగ్రీవ విభీషణులు, ఇతర వానరులు రాక్షసులను చంపాలన్న నిశ్చయంతో పోయారు.

లంకను చూసిన రామచంద్రమూర్తి సీతాదేవిని తలచుకున్నాడు. పాపాత్ముడైన రావణుడి చెరలో సీత మనోవేదనతో దీనురాలై దుఃఖపడుతున్నది కదా! అని తనలో అనుకున్నాడు. ఆ తరువాత, రామచంద్రమూర్తి, రాజనీతి శాస్త్రం ప్రకారం సేనలను విభజించాడు. నీలుడు అతడి సేనతో అంగదుడు హృదయ స్థానంలో వుండేట్లు, ఋషభుడు తన సేనతో కుడిపక్క వుండే విధంగా, గంధమాదనుడు ఎడమవైపు నిలిచేట్లు, వేగదర్శి, సుసేషణుడు, జాంబవంతుడు వారి-వారి సేనలతో గర్భం కాపాడేట్లు ఆజ్ఞచేసి, తానూ లక్ష్మణుడితో కలిసి శిరోదేశంలో నిలిచాడు. పడమటి భాగాన్ని వరుణుడు కాచేట్లు, సేన పుచ్ఛ భాగాన్ని సుగ్రీవుడు రక్షించేట్లు వ్యూహం పన్నాడు శ్రీరాముడు. (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందారం ఆధారంగా) 

Thursday, April 1, 2021

భారతీయ ఐశ్వర్య కల్పవల్లి : వనం జ్వాలా నరసింహారావు

 భారతీయ ఐశ్వర్య కల్పవల్లి

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (02-04-2021)

యావత్ భారత దేశంలో, అ ఆమాటకొస్తే ప్రపంచంలో ఎక్కడైనా కానీ, నివసిస్తున్న హిందువులకు ఆవు అత్యంత పవిత్రమైన ఆరాద్య దైవం లాంటిది. ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు విస్తృతంగా, సవివరంగా చెప్పాయి. ఆవు పాదాల్లో పిత్రుదేవతలు, అడుగుల్లో అకాశ గంగ, స్థనాలలో చరుర్వేదాలు, పాలు పంచామృతాలు, కడుపులో కైలాసం, ఇలా ఒక్కొ భాగంలో ఒక్కో దేవతకు నివాసం వుందని పురాణాలు చెప్పాయి. ఆవు కొమ్ములు మూలంలో బ్రహ్మ, విష్ణువు నివసిస్తారు. అగ్రభాగాన తీర్థస్థానములు, స్థావర జంగమములు అలరారి ఉన్నాయి. శిరస్సుకు మధ్యభాగం శంకరుని గేహ, బిగువు అంగాలలో చతుర్థశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని అథర్వవేదం చెబుతున్నది. గోమాతకు ప్రధక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత పుణ్యం, ఫలితం కలుగుతుందని నమ్మిన అనేకమంది భారతీయులు గోవుకు ప్రదక్షిణలు చేస్తుంటారు. పూజలు చేస్తుంటారు.

గోవు పాలలో, పెరుగులో, వాటిద్వారా వచ్చిన నెయ్యిలో, పేడ, మూత్రంలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని చెప్తుంటారు. గోవు పాలు, పెరుగు, నెయ్యి వీటి యొక్క పోషక విలువలు, ఆరోగ్య గుణాలు వైద్యులు కూడా ఒప్పుకున్నారు. తల్లుల వద్ద పాలు లేని చిన్న పిల్లలకు ఆవు పాలే శరణ్యం. ఆహారంగానే కాకుండా అరాద్యంలోను, అంటే పూజ పునస్కారాలలోను వీటి ప్రాశస్త్యం తెలియని వారుండరు. గోవులు అధికంగా క్షీరం ఇవ్వాలనీ, అవి ఎన్నడూ ఎవరిచేతా దొంగిలింపబడరాదనీ, దుష్టుల వాతపడగూడదనీ, అధిక సంతతి పొందాలనీ, యజుర్వేదంలో శుభాకాంక్ష వ్యక్తం చేయబడింది.

ఆవు పేడతో పూజా స్థలంలో అలికి ముగ్గు పెట్టి పూజా కార్యక్రమం మొదలెడతారు. సకల దోష నివారణకు ఆవు మూత్రాన్ని ఇంటా బయట చల్లు తారు. ఇది హిందువుల ఆచారం. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచీ ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవుకన్న మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు. యజ్ఞ యాగాదులలో హవనానికై దుగ్ధ ఘృతాలనందించే గోవు సకల ప్రాణికోటికీ జీవాధారమైనదనీ, గోసేవ వల్ల ధీరోదాత్త గుణాలు అలవడగలవనీ, ధన సంపదలువృద్ధి పొందగలవనీ ప్రశంసించబడింది.

ప్రపంచంలో ఆహారాన్ని ఉత్పన్నం చేసేవి గోవులు అని ఆర్యులు శ్లాఘించారు. ఈ జగత్తులో గోసంపదతో సమానమైన ధనసంపద చూడలేదు అని చ్యవన మహర్షి 'నహుషం'లో ప్రవచించారు. చతుర్వేదాలలోనేకాక, హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోను, భారత, రామాయణ, భాగవతాది పవిత్ర గ్రంథాలలోను, గోమహిమ అసమానమైనదిగా అభివర్ణించబడింది. వాల్మీకి, వ్యాసుడు, శ్రీ ఆది శంకరాచార్యులు, బుద్ధుడు, స్వామి దయానంద సరస్వతి, తులసీదాసు, కబీరు, చైతన్య మహాప్రభువు మొదలగు మహానుభావులెందరో గోసంపద యొక్క రక్షాణావశ్యకతను గూర్చి నొక్కి వక్కాణించారు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి, సేవించి గోపాలుడైనాడు. దిలీప చక్రవర్తి తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సైతం వెనుకాడలేదు. జమదగ్ని గోరక్షణకై ఆత్మత్యాగం చేశాడు. గోవులే స్వర్గ సోపానాలు.

ఒకానొకప్పుడు పార్వతీదేవి కైలాసంలో పరమశివుడిని భక్తితో పూజించి, నాథా ! స్త్రీలు తెలిసి తెలియక చేసిన దోషం, పరులను హింసించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధముగా పరిహారమవుతుందో చెప్పవలసినదిగా ప్రార్థించింది.

దయామయుడైన పరమశివుడు "ఓ పార్వతీ! గోవులో సమస్త దేవతలు ఉన్నారు. అలాంటి గోవును పూజిస్తే సర్వపాపాలు నశిస్తాయి. ఆ గోవు పాదాలలో ఋణ పితృ దేవతలు, గొలుసులు, తులసి దళాలు, కాళ్ళలో సమస్త పర్వతాలు, మారుతీ కూడా వుంటారు. నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదములు, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్య చంద్రులు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ, ఇంద్రులు ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ, ప్రయాగ నదులు ఉంటాయి”.

“ఉదరమున పృధ్వీ దేవి, వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు. ఉదరమున సనక, సనంద, సనత్ కుమారులు, తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్య కిరణములను, తోలు ప్రజాపతి, రోమావళి త్రిశంత్కోటి దేవతలు పిరుదుల యందు పితరులు, కర్రి కావేరిబోలు, పాదుగు పుండరీకాక్షుని బోలు, స్తనాలు, సప్త సముద్రాలు, పాలు సరస్వతి నది, పెరుగు నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం కడుపులో ధరణీ దేవతలు, గోపచింత గంగ, యమున, ప్రయాగ, త్రివేణి నదులు తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు. గోపాద ధూళి సమస్త పుణ్య నదులు, తీర్థములు కన్నా గొప్పది”.

“కాబట్టి ఓ పార్వతీ ! ఈ గోమాహాత్మ్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మ హత్యా మహా పాతకములన్నియు తొలగును. ప్రతి అమావాస్యనాడు పఠిస్తే మూడు నెలల మహాపాపములు తొలగును. నిత్యము సంధ్య వేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరించెదరు. గోవుకు తృప్తిగా మేత, సెనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడెదరు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితము నిచ్చును. గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానం. గోవును పూజించితే సమస్త దేవుళ్ళను పూజించి నట్లగును. గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చేయవలెను”.

“ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసినవారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యములు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలము ఈ ఒక్క రోజు చేసినచో పుణ్యం లభిస్తుంది" అని బోధించాడు.

యజ్ఞయాగాలను నిర్వహించే ప్రదేశాలను గోమయంతోనే శుద్ధి చేస్తుంటారు. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్లు గోవుతో కలిసే గృహప్రవేశం చేయడం జరుగుతూ వుంటుంది. గోవు ప్రవేశిస్తే లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టుగా భావిస్తుంటారు.

హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్టత ఉంది. పూర్వం బ్రహ్మ అచేతనాలైన నదులు, పర్వతాలు మొదలైనవాటిని సృష్టించి, జీవాత్మతో కూడిన చేతనమైన వస్తుజాతకమును అగ్నినుండి ఉత్పన్నం చేయాలని సంకల్పించుకొని, అగ్నియందు ఉత్పత్తికి సాధకమగు హోమాన్ని చేశాడు. శరీరం కొరకు వాయువు, చక్షువు కొరకు ఆదిత్యుడు హోమం చేశారు. వారి హోమం వల్ల గోవు ఒక్కటే అందునుంచి ఆవిర్భవించింది. అగ్ని సంబంధమైన హోమం వల్ల గోవు జన్మించడంతో, గోవు అగ్నిహోత్ర సమానమైంది.

ఇంతకు ముందే రాసినట్లు, గోమాతలో సర్వదేవతలు కొలువై వుంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని అంటారు. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు. ఆవు కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే, త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సుపై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా, శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ, బిళ్వ దళాలతో పూజిస్తే, సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందట. గోవు నాసికను పూజిస్తే సంతాన నష్టం వుండదని అంటారు. ఆవు చెవిని పూజిస్తే, సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నులను పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయట. ఆవు నాలిక దగ్గర పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెపుతారు. అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే, విద్యాప్రాప్తి లభిస్తుంది.

ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని, కనుక వాటిని పూజిస్తే యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెపుతారు. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం. ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడట, అందువల్ల కంటాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు, సంతానం కలుగుతుందట. ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే, ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెపుతారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే, నాగలోక ప్రాప్తి లభిస్తుందని, భూమిపై నాగుపాముల భయం ఉండదని చెపుతారు. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారట. కనుక గిట్టలను పూజిస్తే, గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారట, ఆ భాగాన్ని పూజిస్తే, సఖ్యత, సౌందర్యం లభిస్తుందట. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు.

గోవును ప్రతి దినం పూజించవచ్చు. అయినప్పటికీ, గో పూజకు కొన్ని విశేషమైన పుణ్యతిథులు కూడా వున్నాయి. ఈ తిథుల్లో పూజించడం వల్ల విశేష ఫలితం దక్కుతుంది. అలాంటి పుణ్యతిథుల్లో ఒకటిగా ‘ఆశ్వయుజ బహుళ ద్వాదశి’ కనిపిస్తుంది. దీనినే ‘గోవత్స ద్వాదశి’ అని కూడా అంటారు. ఈ రోజున దూడతో కూడిన గోవుని పూజించాలని పండితులు అంటున్నారు. ఈ రోజున ఆవు, దూడలను పసుపు కుంకుమలతో, పూల దండలతో అలంకరించి, భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసి వుంటుంది. ఆవు పాలు, పెరుగు, నెయ్యితో చేసిన వంటకాలను ఈ రోజున స్వీకరించరాదనే నియమం ఉంది. దూడతో కూడిన ఆవును పూజించిన వాళ్లు ఆ రోజున బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేలపై పడుకోవలసి వుంటుంది. ఈ నియమాలను పాటిస్తూ గోపూజ చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయట.

దూడతో కూడిన ఆవును పూజించిన వాళ్లు ఆ రోజున బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేలపై పడుకోవలసి వుంటుంది. ఈ నియమాలను పాటిస్తూ గోపూజ చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

గోమాతను శుక్రవారం పూజిస్తే ఇంట్లో సిరిసంపదలు వెల్లివెరుస్తాయి. ఇంట్లో గోపూజ చేయడం కుదరని పక్షంలో ఆలయాల్లోని గోశాలల్లో నిర్వహించే పూజల్లో పాల్గొనడం ద్వారా కూడా శుభఫలితాలుంటాయి. ఆవుకు గో గ్రాసం సమర్పణ చేస్తే చక్కని సత్ఫలితాలు లభిస్తాయి. శుభ ముహూర్త కాలంలో గోపూజ చేయించడం, గోమాతను ఆలయాలకు దానంగా ఇవ్వడం వంటివి చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

గోమాతను దానం చేస్తే, కోటి పుణ్యాలు చేసినంత ఫలం, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యము దక్కుతుంది. పశువులకు మేతను దానం చేస్తే పాపాలు హరించబడతాయి అని పురాణాలు చెబుతున్నాయి.

మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని గోమాత వహించింది. గోమాతలు మనల్ని పోషిస్తున్నాయి. గోమాత లక్ష్మీదేవి స్వరూపం. గోవుకు వేద ప్రమాణమయిన విశిష్టత ఉంది. కవ్వంచేత గో క్షీరాన్ని మధిస్తే వచ్చేటువంటి వెన్న, నెయ్యి దేవతలకు ప్రియమైనవి. గోదాన, హిరణ్య దానాలను యజ్ఞయాగాది క్రతువుల్లోనూ, పితృకర్మల్లోనూ చేయాలని మనుస్మృతి బోధిస్తోంది. అందుకే మన ఇళ్ళల్లో జరిగే ప్రతి శుభకార్యానికి, వేడుకలు, యజ్ఞాలకు దేవతలను ఆహ్వానించే రీతిలో ఆవుపాలను వాడుతారని చెబుతున్నారు.

గోవులున్న ఇల్లు, గ్రామం, రాష్ట్రం, దేశం సకల సౌభాగ్యాలతో విలసిల్లుతూ ఉంటుంది. సమస్త సృష్టిలోకి పవిత్రమైన గోమాతను రక్షిద్దాము, పూజిద్దాము సకల శుభాలను పొందుదాం.