నలోపాఖ్యానం, నల దమయంతి వృత్తాంతం
(ఆస్వాదన-14)
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
ఆదివారం సంచిక (04-04-2021)
ఒకనాడు
ధర్మారాజు దగ్గరికి బృహదశ్వుడు అనే గొప్ప ఋషి వచ్చాడు. ఆ ఋషితో శత్రువుల వల్ల తాము
పడ్డ పాట్లు, జూదంలో జరిగిన మోసం, అరణ్యాలలో సంచరించడం చెప్పిన ధర్మరాజు, తమలాగా ఇక్కట్ల పాలైన ఇతర రాజులెవరైనా
వున్నారా? అని అడిగాడు. జవాబుగా బృహదశ్వుడు,
పాండవులకంటే ఎక్కువ బాధలు పడ్డవారు లేకపోలేదని అంటూ, నలోపాఖ్యాన్ని చెప్పాడు సవివరంగా. నలుడనే
మహారాజు పూర్వకాలంలో జూదం ఆడి పుష్కరుడి వల్ల తన సంపదనంతా ఓడిపోయి ఒంటరిగా అడవులలో
కష్టాలను అనుభవించలేదా?
అని అన్నాడు.
(డాక్టర్ నండూరి
రామకృష్ణమాచార్యులు ఈ సందర్భంగా విశ్లేసిస్తూ ఇలా రాశారు: అరణ్య పర్వం
మహాభారతంలోని 18 పర్వాలలో పెద్ద పర్వాలలో ఒకటి. దీనికి కారణం ఇందులో వున్న
ఉపాఖ్యానాలు. ఆ ఉపాఖ్యానాలలో పెద్దది నలోపాఖ్యానం. వాస్తవానికి, నలోపాఖ్యానం మిక్కలి ప్రాచీనమైనదని పరిశోధకుల
అభిప్రాయం. నలోపాఖ్యానం విషాదాంత గాథ కాదుకాని, విషాదాత్మక కృతి అని చెప్పవచ్చు. నలోపాఖ్యానం
ప్రపంచ వాజ్మయంలో ‘నిరుపమానమైన రసవత్కావ్యం’, ‘సాటిలేని విషాదాత్మక కృతి’ అని చెప్పవచ్చు. మహాభారత రచనకు చాలా పూర్వమే
నలచక్రవర్తి గాథ బహుళ వ్యాప్తిని పొందింది. నలుడికి, ధర్మరాజుకి గల సామాన్య వ్యసనం జూదం).
నిషధేశ్వరుడైన
వీరసేనుడి కొడుకు నలుడు. అతడు మహా తేజస్వి. ఎన్నో అక్షౌహిణుల సేనకు అధినేత. కాని, అతడికి జూదం అంటే అమితమైన ప్రేమ. తన
పరాక్రమంతో రాజులందరినీ జయించి పాలన చేసేవాడు నలుడు. ఇదిలావుంటే, విదర్భ రాజైన భీముడు, అతడి భార్య, దమనుడనే గొప్ప ఋషిని ఆరాధించి, దమయంతి అనే కూతురును, ముగ్గురు కొడుకులను పొందారు. సద్గుణాల దమయంతి
విశేష రూప లావణ్యవతి. నలుడి సద్గుణాలను దమయంతికి, ఆమె గుణగణాలను నలుడికి మధ్యవర్తులు
అభివర్ణించి, ప్రశంసించి చెప్పడం వల్ల ఇరువురిలో
ఒకరిమీద ఇంకొకరికి ప్రేమాభిమానాలు వెల్లివిరిశాయి.
ఒకనాడు నలుడు
ఉద్యానవనంలో విహరిస్తుంటే ఒక హంసల గుంపు కనిపించింది. అందులోని ఒక హంసను అది ఎగరక
ముందు పట్టుకున్నాడు నలుడు. తోటి హంసను పట్టుకున్నందుకు మిగతా హంసలు ఆకాశంలో
అరుస్తూ తిరిగాయి. పట్టుబడ్డ హంస మానవ భాషలో, నలుడికి ఉపకారం చేస్తానని, ఆయనకు ఇష్టమైన దమయంతి దగ్గరికి వెళ్లి నలుడి
మహనీయ గుణగణాలు చెప్పి,
ఆమెకు ఇతడి మీదే వలపు నిలిపేట్లు చేస్తానన్నది. వెంటనే హంసను వదిలిపెట్టాడు నలుడు.
ఆ హంస విదర్భ
రాజధానికి ఎగిరి వెళ్లి,
అక్కడ ఉద్యానవనంలో వున్న దమయంతి సమీపానికి వచ్చి, నడయాడుతూ ఆమె చేతికి దొరికింది. అలా చిక్కిన
రాజహంస మనోహరమైన మనుజ భాషలో, దమయంతితో, నలుడి గురించి వర్ణిస్తూ, ఈ అపారమైన భూమండలంలో రాజులెవ్వరూ సౌందర్యసౌశీల్యాలలో నలుడికి
సాటిరారని చెప్పింది. నలుడికి దేవేరివి కమ్మని ప్రోత్సహించింది. వారిరువురి సంయోగం
ఒకరికొకరు శోభ చేకూర్చినట్లు వుంటుంది అని అన్నది హంస. నలమహారాజు గుణాలను గురించి
తనకెట్లా చెప్పిందో, అలాగే, తనను గురించి కూడా ఆ రాజుకు చెప్పమని దమయంతి
కోరగానే, హంస ఎగురుకుంటూ నిషధ దేశానికి వెళ్లి, నలమహారాజుకు దమయంతి గుణరూప వైభవాలను గురించి
చెప్పింది. నలదమయంతులకు ఒకరిమీద ఇంకొకరికి వలపు వృద్ధి చెంద సాగింది.
కూతురుకు నల
మహారాజు మీద ప్రేమ వున్న విషయం ఆమె చెలికత్తెల ద్వారా గ్రహించిన విదర్భరాజు భీముడు
ఏదైనా ఉపాయం చేసి నలుడిని విదర్భకు రప్పించాలనుకున్నాడు. దమయంతీ స్వయంవరం అనే
మిషతో రాజులందరినీ రప్పించాడు. అదే సమయంలో ఇంద్రలోకం వెళ్లిన మునులు పర్వతుడిని, నారదుడిని భూలోక విషయాల గురించి ఇంద్రుడు
అడగ్గా, అతడికి, అసాధారణ వైభవంతో జరుగనున్న
జగదేక సుందరి దమయంతీ స్వయంవరం గురించి చెప్పారు వారు. ఆ వేడుకను చూడడానికి
ఇంద్రుడు, దిక్పాలకులు కూడా బయల్దేరారు. దారిలో
వారికి స్వయంవరానికి వెళ్తున్న నల మహారాజు కనిపించాడు. తమ దూతగా తమ అభీష్టం
నేరవేర్చమని కోరాడు నలుడిని ఇంద్రుడు. సరేనని, ఆ కర్తవ్యం ఏమిటో వివరించమన్నాడు నలుడు. తాను
దేవేంద్రుడినని, దమయంతీ స్వయంవరానికి స్నేహుతులతో కలిసి
వెళ్తున్నానని, తమని దమయంతికి పేర్లతో, బిరుదులతో సహా ప్రశంసా పూర్వకంగా పరిచయం
చేయమని అడిగాడు. అలా చేస్తే తమలో ఒకడిని ఆమె వరుడిగా ఎన్నుకుంటుంది అన్నాడు.
తానూ అదే పని
మీద వెళ్తున్నానని అన్నాడు నలుడు. అలాంటప్పుడు తనను, ఇంద్రాదులను పరిచయం చేసే
పనికి వినియోగించడం న్యాయమా?
అని అడిగాడు. దేవేంద్రుడు మరీమరీ కోరడంతో ఒప్పుకున్నాడు. అతడి మాట ప్రకారం నలుడు
విదర్భ రాజధానికి వెళ్లి దమయంతి ఇంట్లోకి ఇంద్రుడి మహిమ వల్ల దేవదూతగా
ప్రవేశించాడు. దమయంతిని చూసి ఆమె అందానికి ముగ్దుడయ్యాడు. నలుడిని చూసిన ఆమె కూడా
అతడెవరో తెలియకుండానే ముగ్దురాలు అయింది. ఇద్దరికీ మాటలు కలిశాయి. తాను దేవతల
దూతనని, పేరు నలుడని, ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు ఆమె స్వయంవరానికి వచ్చారని, వారిలో ఒకరిని భర్తగా ఎన్నుకోమని
కోరుతున్నారని చెప్పాడు నలుడు. తాను నలుడి సొత్తునని, కేవలం ఆయన రాక కోసమే స్వయంవరం ప్రకటించడం
జరిగిందని, అతడు భర్తగా వుండడానికి
అంగీకరించకపోతే ప్రాణాలు వదులుతానని అన్నది దమయంతి. స్వయంవరంలో ఇంద్రాదుల
సమక్షంలోనే నలుడిని వరిస్తానని ధైర్యంగా చెప్పింది దమయంతి నలుడితో. నలుడు ఆ తరువాత
దిక్పాలకుల దగ్గరికి వెళ్లి విషయమంతా సవివరంగా చెప్పాడు.
స్వయంవర మంటపంలో
నలుడి పక్కన అదే వరుసలో ఐదుగురు (ఇంద్రాది దిక్పాలకులు) నల మహారాజులు
కూర్చున్నారు. అక్కడికి సమీపించిన దమయంతి, కొంచెం కలవరపడి, తనకు నలుడిని ఎన్నుకునే పరిజ్ఞానం కలిగించమని
దేవతలను ప్రార్థించింది. దేవతలు కరుణించారు. అసలు నలుడిని గుర్తించి, నలుడి
మెడలో హారం వేసి, అతడిని వరుడుగా ఎన్నుకుంది దమయంతి. నల దమయంతుల వివాహం అత్యంత
వైభవంగా జరిగింది. ఇంద్రాది దిక్పాలకులు నలుడికి కోరిన వరాలు ఇచ్చారు.
దేవలోకం పోతున్న
వారికి కలి కనిపించాడు దారిలో. దమయంతి స్వయంవరానికి కలి పోతున్నాడని విని, ఆ తతంగం అయిపోయిందని, నలుడితో ఆమె వివాహం జరిగిందని చెప్పాడు
ఇంద్రుడు. కలి పురుషుడికి నలుడి మీద కోపం వచ్చింది. కలి నలుడిలో ప్రవేశించాడు.
నలుడితో జూదం ఆడి అతడి రాజ్య సంపదలు హరించమని పుష్కరుడు అనే రాజును ప్రేరేపించాడు
కలి. నలుడిని జూదానికి ఆహ్వానించాడు పుష్కరుడు. నలుడు సమ్మతించాడు కలి ప్రభావం
వల్ల. నలుడు మొత్తం కోల్పోయాడు. దమయంతి దుఃఖించింది. తన కుమారులను తండ్రి దగ్గరికి
పంపింది. జూదంలో నలుడి రాజ్యం పోయింది. రాజ్యాన్నుండి బయటకు వెళ్లాడు. కలి ప్రభావం
వల్ల నగరం వెలుపల మూడు రోజులున్న నలుడిని ఎవరూ ఆదరించలేదు. పక్షుల రూపంలో వచ్చిన
పాచికలు అతడి మీద వున్న బట్టలను కూడా అపహరించాయి. అడవి దారి పట్టారు నలదమయంతులు.
విదర్భ రాజు దగ్గరికి పోవడానికి వారి మనస్సులు అంగీకరించలేదు.
కలి
ప్రభావం వల్ల నలుడు భార్యను అడవిలో ఒంటరిగా వదిలి ఒక్కడే వెళ్లిపోయాడు. నిద్రలేచిన
దమయంతికి భర్త కనిపించక దుఃఖపడ్డది. ఒక కొండ చిలువ బారిన పడ్డ ఆమె ఒక కిరాతకుడి
సహాయంతో తప్పించుకున్నది. అదే కిరాతకుడు కామభావ ప్రేరితుడై ఆమెను సమీపించగా తన పాతివ్రత్యం
చేత అతడిని దహించి వేసింది. కీకారణ్యంలో ఒంటరిగా పయనం సాగిస్తున్న ఆమెకు ఒక
వర్తకుల బృందం కనిపించింది. వారు ఎక్కడికి వెళ్తున్నారని అడిగింది. జవాబుగా చేది
ప్రభువు సుబాహువు రాజధానికి అని చెప్పారు వారు. వారితోపాటే దమయంతి కూడా పయనమై
పోయింది.
సుబాహుపురం
చేరిన దమయంతి రాజమార్గంలో లక్ష్మీదేవిలాగా నడుస్తుంటే రాజమాత చూసి తన దాదిని
పిలిచి ఆమెను తీసుకురమ్మని చెప్పింది. వచ్చిన దమయంతి వివరాలు అడిగింది. జూదం ఆడి
తన భర్త రాజ్యాన్ని పోగొట్టుకున్న సంగతి చెప్పింది. భర్త వదిలి వెళ్తే దిక్కులేని
దాన్నయ్యానని అన్నది. తన దగ్గర వుండమని చెప్పింది రాజమాత. ఆమెను తన కూతురు సునందకు
అప్పచెప్పింది. అలా సైరంధ్రిగా సుబాహుపురంలో అజ్ఞాతవాసంలో వున్నది దమయంతి.
అక్కడ నలుడు
అడవిలో తిరుగుతుంటే మంటల్లో చిక్కుకున్న కర్కోటకుడు అనే నాగ కుమారుడిని
రక్షించాడు. కర్కోటకుడు నలుడిని కాటు వేశాడు. నలుడికి వెంటనే వికృత రూపం వచ్చింది.
తాను నలుడికి మేలు చేశానని,
ప్రస్తుతం వికృత రూపమే అతడికి మంచిదని, అతడికి త్వరలోనే భార్యా సంగమం కలిగి రాజ్య సంపద దక్కుతుందని, అతడికి ఎప్పుడు నిజరూపం కావాలనుకుంటే అప్పుడే
తనను స్మరిస్తే చాలని అన్నాడు కర్కోటకుడు. అని ఒక వస్త్రం ఇచ్చాడు. ఋతుపర్ణుడు అనే
మహారాజు దగ్గరికి పోయి బాహుకుడు అనే పేరుతో అతడిని సేవించమని చెప్పాడు. అతడికి
నలుడికి వచ్చిన అశ్వ హృదయ విద్యను నేర్పి, అతడి నుండి అక్ష హృదయ విద్యను
నేర్చుకొమ్మన్నాడు.
కర్కోటకుడు
చెప్పినట్లే నలుడు అయోధ్యాపురికి వెళ్లి ఋతుపర్ణుడిని సందర్శించి, తాను బాహుకుడినని, అశ్వ విద్యలో నేర్పరినని, పాక కళలో నిపుణుడినని, శిల్పవిద్యా నిష్ణాతుడినని ఆయన దగ్గర సేవ
చేయడానికి వచ్చానని చెప్పాడు. ఆయన అంగీకరించాడు. ఈ విధంగా నలుడు ఋతుపర్ణుడి దగ్గర
గుర్రాలకు అధినేత అయ్యాడు. అలా నలుడు అజ్ఞాతవాసం చేశాడు. రాత్రులలో మదనతాపంతో
దమయంతిని గురించి కలవరించేవాడు. ఇది గమనించి, నలుడి సహచరుడు జీవలుడు కురూపి అయిన బాహుకుడిని
చూసి ఆశ్చర్యపడేవాడు.
ఇక అక్కడ
విదర్భలో భీమరాజు, రాజ్యంపోగొట్టుకున్న తన అల్లుడు గురించి, కూతురు గురించి చింతించేవాడు. నలదమయంతులను
వెతకడానికి బ్రాహ్మణులను నియమించాడు. వారు నానా దేశాలకు వెళ్లి వెతకసాగారు. వారిలో
సుదేహుడనే బ్రాహ్మణుడు సుబాహుడి రాజధానికి చేరి, రాజమందిరంలోకి వెళ్లి, అక్కడ దమయంతిని చూసి, ఆమె కనుబొమల మధ్య వున్న పుట్టుమచ్చ ఆధారంగా
గుర్తుపట్టాడు. దమయంతి దగ్గరికి రహస్యంగా వచ్చి ఆమె తల్లిదండ్రులు ఆమెకోరకు
దుఃఖిస్తున్న విషయం చెప్పాడు. ఇది గమనించిన రాజకుమారి సునంద ఆ వార్తను తల్లికి
చెప్పింది. రాజమాత అక్కడికి వచ్చి విషయాన్ని ఆకళింపు చేసుకున్నది. తన దగ్గర
వున్నది దమయంతి అని తెలుసుకున్నది. దమయంతి తన కూతురుతో సమానమని, తాను, దమయంతి తల్లి దశార్ణరాజు పుత్రికలమని, అక్కచెల్లెల్లమని చెప్పింది రాజమాత. దమయంతి
విదర్భకు వెళ్లింది. అక్కడ కూడా విచారంగా శరీర సౌఖ్యాలు త్యజించి జీవించసాగింది.
కూతురు దమయంతి
కోరిక ప్రకారం విదర్భరాజు భీముడు, నలుడిని అన్వేషించడానికి బ్రాహ్మణులను
వినియోగించాడు. ‘భార్యను మోసం చేసి ఆమె చీరను సగం చింపి కట్టుబట్టగా చేసుకుని
పోవడం న్యాయమా’ అని అనమని, దానికి ఎవరైతే స్పందిస్తారో అతడే తన భర్త అని
గుర్తించమని దమయంతి బ్రాహ్మణులకు సూచించింది. వెతకడానికి వెళ్లినవారిలో పర్ణాదుడు
అనే బ్రాహ్మణుడికి అయోధ్య నగరంలో దమయంతి అనమన్న మాటలకు ఒక కురూపి స్పందించినట్లు
గ్రహించాడు. తనను గుర్తించిన సుదేవుడినే పిలిచి నలుడిని గుర్తించడానికి అయోధ్యకు
పంపింది దమయంతి. ఆ దేశానికి వెళ్లి,
దమయంతికి ద్వితీయ స్వయంవరం ఏర్పాటు చేశాడు ఆమె తండ్రి అని రాజు ఋతుపర్ణుడికి
చెప్పమని అన్నది. సుదేవుడు అయోధ్యాపురికి వెళ్లి ఋతుపర్ణుడిని సందర్శించి దమయంతి
స్వయంవరం మర్నాడే జరుగుతుందని చెప్పాడు.
తనకు దమయంతీ
స్వయంవరం చూడాలని వున్నదని, ఒక్క దినంలో విదర్భ చేరాలని, తన అశ్వశిక్షా చాతుర్యం చూపించి అక్కడికి
చేర్చమని బాహుకుడి (నలుడికి) చెప్పాడు ఋతుపర్ణుడు. వాయువేగంతో పరుగెత్తే గుర్రాలను
కట్టి రథాన్ని సిద్ధం చేశాడు బాహుకుడు. దానిమీద ఋతుపర్ణుడు పయనించాడు. దారిలో
ఋతుపర్ణుడు, బాహుకుడి ఆశ్వవిద్యకు ప్రసన్నుడై అతడికి తనకు తెలిసిన అక్షహృదయం అనే
గణిత విద్యను ఉపదేశించాడు. దానికి బదులుగా తనకు తెలిసిన ఆశ్వహృదయ విద్యను
ఋతుపర్ణుడికి నేర్పాడు బాహుకుడు.
దారిలో నలుడిని
ఆవహించిన కలి పురుషుడు కర్కోటకుడి విషాన్ని కక్కుతూ నలుడి శరీరం నుండి బయటకు వచ్చి
అతడికి నమస్కరించి వెళ్లిపోయాడు. ఋతుపర్ణుడు వైభవోపేతంగా విదర్భలో ప్రవేశించాడు.
అతడు పుర ప్రవేశం చేస్తుంటే అతడి రథఘోష మేఘ గర్జనలాగా వినిపించింది. దమయంతి దాన్ని
వినగానే అది నలుడి రథమని గుర్తుపట్టింది. బాహుకుడు రథశాలలో వుండగా దమయంతి వచ్చి
బాహుకుడిని చూసి ఆశాభంగం పొందింది. దమయంతి స్వయంవరం ప్రకటన కల్పితమే అని అర్థమైంది
నలుడికి. దమయంతి ఇంకొంత విచారణ చేయగా బాహుకుడే నలుడన్న అనుమానం కలిగింది.
బాహుకుడిలో నలుడి లక్షణాలను గమనించింది. తన తల్లికి తన అనుమానం గురించి చెప్పగా
ఆమె బాహుకుడిని దమయంతి దగ్గరికి పిలిపించింది.
దమయంతి కన్నీరు
చూసి నలుడు తనను కలి ఆవహించడం వల్ల బుద్ధి చెడి సమస్తమైన కష్టాలపాలు కావాల్సి
వచ్చిందని, ఇప్పుడు కలి తనను వదిలిపోయాడని, తాను విదర్భ వచ్చింది దమయంతి విషయం
తెలుసుకోవడానికే అని నలుడన్నాడు. దమయంతీ స్వయంవరం ప్రకటించాల్సిన అవసరం ఏమిటన్న
అనుమానం మాత్రం నలుడికి తీరలేదు. నలుడిని గుర్తించడానికే స్వయంవర ప్రకటన అని
దమయంతి చెప్పింది. వాస్తవానికి స్వయంవరం ఏమీ లేదన్నది. అదే సమయంలో దమయంతి
నిర్మలమైన ప్రవర్తన గురించి ఆకాశవాణి పలికింది. తక్షణమే కర్కోటకుడిని స్మరించి
అతడిచ్చిన వస్త్రాన్ని మీద ధరించగా నలుడికి తన నిజరూపం వచ్చింది. దమయంతికి సంతోషం
కలిగింది. నలదమయంతులకు తిరిగి సమాగం జరిగింది. పుష్కర మహారాజు దగ్గరికి నలుడు పోయి
మళ్లీ జూదం ఆడి, గెలిచి,
సమస్త రాజ్యాన్ని గ్రహించాడు.
దమయంతీ
నలమహారాజులు సుఖసంతోషాలతో జీవించారు. నలుడు సమస్త భూమండలాన్ని గొప్పగా పాలించాడు.
ఇలా ధర్మరాజుకు నలోపాఖ్యానం చెప్పిన బృహదశ్వుడు, పాచికలలో ఓడిపోయానని
చింతించవద్దని, విరోధులను జయించి రాజ్యాన్ని పొందమని అన్నాడు.
(డాక్టర్ నండూరి
రామకృష్ణమాచార్యులు ఈ సందర్భంగా విశ్లేసిస్తూ ఇలా రాశారు: నలోపాఖ్యానం భారత కథ
కంటే ప్రాచీనమైనది. ఇందులోని పాత్రలు చిరస్మరణీయాలు. నలోపాఖ్యానం విని, చదివి, ధర్మారాజు నుండి నేటిదాకా రసానంద తన్మయత్వం
అనుభవించిన సహృదయులు ఎందరో వున్నారు).
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, అరణ్యపర్వం, ద్వితీయాశ్వాసం
(తిరుమల, తిరుపతి
దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment