Saturday, April 3, 2021

శ్రీరాముడి ఆగ్రహానికి సముద్రుడు గురయ్యాడా? : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీరాముడి ఆగ్రహానికి సముద్రుడు గురయ్యాడా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం (03-04-2021) ప్రసారం   

         వానర సేన సముద్ర తీరాన్ని చేరిన తరువాత, రావణుడిని వదిలి రాముడి దగ్గరకు వచ్చిన విభీషణ పట్టాభిషేకం జరిగిన అనంతరం, సముద్రం దాటి లంక చేరడానికి ఉపాయం ఆలోచించారు రామ, లక్ష్మణ, సుగ్రీవ, హనుమాదులు. దారి ఇవ్వమని ప్రార్థిస్తూ, బెదిరిస్తూ, తన కుడి భుజాన్ని దిండుగా చేసుకుని సముద్ర తీరంలో తూర్పు ముఖంగా, నియమబద్ధంగా పడుకున్నాడు శ్రీరాముడు. తాను సముద్రాన్నైనా దాటాలి, లేదా, సముద్రుడు చావనైనా చావాలి. రెంటిలో ఒకటి కావాలని శ్రీరాముడు నిశ్చయించుకున్నాడు. మౌనవ్రతం పూని సముద్రాన్ని ప్రార్థిస్తూ మూడు రాత్రులు (పాడ్యమి, విదియ, తదియ) పండుకున్నప్పటికీ బుద్ధిమాలిన సముద్రుడు కనబడలేదు.   

         మూడు రాత్రులు దర్భశయనం మీద వుండినా సముద్రుడు దర్శనం ఇవ్వకపోవడంతో కళ్లెర్ర చేసిన శ్రీరాముడు తన సమీపంలో వున్న లక్ష్మణుడిని చూసి, “లక్ష్మణా! చూశావా! సముద్రుడు కనబడడం లేదు. మంచిమాటలు చెప్పడం దుర్జనుల విషయంలో పనిచేయవు. నేను మొదట్లోనే సముద్రాన్ని ఎండించి కాలహరణం చేయకుండా వానరసేనను సముద్రాన్ని దాటించాలనుకున్నాను. మీరంతా సౌమ్య మార్గాన్ని సూచించడం వల్ల మీమాట తీసేయలేక కాలహరణమైనా సరే అని సహించడం వల్ల నన్ను దేనికీ పనికిరాని వాడిగా సముద్రుడు తలచాడు. ఏమిటీ వీడి ధైర్యం? ఇలాంటి వాడి విషయంలో ఓర్పు పనికిరాదు. నా బాణ పరంపరలతో నీరు కదలకుండా స్థంబించి, వీడి గర్వం అణచి, అల్లకల్లోలమయ్యేట్లు చేస్తాను. పదునైన బాణాలతో సాగరాన్ని ఎండబెట్తాను. మంచితనంతో వీడు మాట వినడు. సౌమిత్రీ! విల్లును, బాణాల సమూహాలను తెచ్చి ఇవ్వు. ఈ సముద్రాన్ని ఎండబెట్టి దుమ్ము లేపుతాను. వానరులు కాలినడకన సముద్రాన్ని దాటేట్లు చేస్తాను. చెలియలికట్టను దాటిరాకూడదనే మర్యాదను పోగొట్టి పొంగి పోరలేట్లు చేసి క్షోభకు గురిచేస్తాను” అని అంటాడు. 

         ఇప్పుడీ సముద్రాన్ని ఏం చేస్తానో చూడమని, దానికి ఏగతి పట్తుందో గమనించమని అంటూ, శ్రీరాముడు ప్రళయకాలాగ్ని లాగా మండిపడుతూ విల్లు గట్టిగా పట్టుకుని నారిలాగి, ఇంద్రుడి పిడుగుల్లాగా బాణాలను వదిలాడు. ఆ బాణాలు సముద్రాన్ని అల్లకల్లోలం అయ్యేట్లు చేశాయి. వికార రూపంలో సముద్రం చాలా బాధపడి కళవళ పడింది. పాతాళంలో వుండే పన్నగులు విచ్చలవిడిగా వస్తున్న బాణాల వేగానికి ముఖాలు, కళ్ళు మండుతుంటే డీలాపడి శోకించారు. అలల సమూహాలు ఆకాశానికి తగిలేట్లు ఎగిసాయి. సముద్రం అడుగు నుండి కలత పడింది. ఆయన కోపాన్ని చూసి భయపడిన లక్ష్మణుడు “అన్నా! అన్నా! బాణాలు ప్రయోగించ వద్ద” ని చెప్పడంతో పాటు, ఆ రామచంద్రుడి విల్లును పట్టుకున్నాడు.

         ఇంత జరిగినా సముద్రుడి దగ్గరనుండి స్పందన లేకపోవడంతో కోపం తెచ్చుకున్న శ్రీరామచంద్రమూర్తి, భయంకరమైన మాటలతో సముద్రుడితో ఇలా అన్నాడు. “ఓరీ సముద్రుడా! నా బాణాల సమూహంతో నీరు ఇంకి పోయేట్లు చేసి, నీ స్వరూపం లేకుండా చేస్తాను. చూస్తూ వుండు. నాకు కోపం వస్తే నువ్వు బతుకుతావా? ఓరీ! రాక్షసులకు ఉనికి పట్టయిన వాడా! నా పదునైన బాణాలతో సేతువు కట్టి వానరసేనను కాలినడకన ఈ క్షణంలోనే అవతలి ఒడ్డుకు చేరుస్తాను. అలా నా పరాక్రమం చూపకపోతే నీకు అసమానమైన నా బలపరాక్రమాలు ఎలా తెలుస్తాయి? కానీ రా!”.

         ఇలా అంటూ, బ్రహ్మ దండంతో సమానమైన ఒక బాణాన్ని వింటిలో సంధించి, రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రంతో దాన్ని అభిమంత్రించి, అమితమైన వేగంగా అల్లె తాటిని తన చెవి కొనవరకు లాగాడు. అప్పుడు కొండలు గడ-గడలాడాయి. దిక్కులు గాఢమైన అంధకారంలో మునిగి వణికాయి. సూర్య చంద్ర నక్షత్రాలు పెడతోవన పోయాయి. నదుల్లో, సరస్సుల్లో నీళ్ళు ఎండిపోయాయి. నక్షత్రాలు పెద్ద ధ్వనితో నేలరాలాయి. జంతువులు మూర్ఛపోయాయి. అంతటా చీకటి ఆవరించింది. సముద్రంలో ఒక యోజనం దూరందాకా నీళ్లు చెలియలికట్టను వదిలి లోపలికి ఈడ్చుకు పోయాయి. దయాసముద్రుడైన రామచంద్రమూర్తి భూత సంహారం అంటే ఇష్టం లేనందున బాణం వదల లేదు.

అప్పుడు సూర్య తేజస్సుతో సర్పాలతో చుట్టుకుని బంగారు సొమ్ములు ధరించిన సముద్రుడు నీళ్లలోనుండి బయటకి వచ్చాడు. రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి, “రామచంద్రా!” అని ఆదరంగా పిలిచి ఇలా అన్నాడు.

         “పంచమహాభూతాలైన భూమి, ఆకాశం, అగ్ని, జలం, వాయువు శాశ్వతమైన తమ మార్గాన్ని వదిలి వాటి స్వభావాన్ని విడవవు. ఆ విధంగానే జలరూపంలో వున్న నేను నా లోతు తెలియనీయను. కాలి నడకన దాటనీయను. ఇది నా స్వభావం. దీన్ని నేను తప్పకూడదు. రామచంద్రా! సౌమ్యుడా! నేను నా స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించడం సరైన పని కాదు. ఏ కారణాన కూడా నేను నా నీటిని గట్టిపడేట్లు చేయకూడదు. అలా చేస్తే ఆ జీవజంతువులు బాధపడ్తాయి. చచ్చిపోతాయి. కాబట్టి నేనెప్పుడూ అలాంటి పనిచేయకూడదు. నన్నాశ్రయించిన వారిని నేనెలా బాధపెట్టుతాను? అయినప్పటికీ నీ వానర సేనంతా సముద్రాన్ని దాటేంతవరకూ వారికి ఏ ఆపద లేకుండా, నా చేతనైనంత వరకు రక్షిస్తాను. నీ సేన దాటడానికి మిట్ట ప్రదేశాన్ని ఇస్తాను. కోపం వదులు”. అని సముద్రుడు చెప్పగా రామచంద్రమూర్తి ఇలా అన్నాడు.

         “ఈ బాణం వ్యర్థం కాకూడదు. దీన్ని ఎక్కడ వేయాలి?” అని రామచంద్రమూర్తి సముద్రుడిని ప్రశ్నించాడు. జవాబుగా, ఆయన, ఈ మహాస్త్రాన్ని పవిత్రమైన ద్రుమకుల్యమనే ప్రదేశంలో వేయి అన్నాడు. సముద్రుడు ఇలా చెప్పగానే ఆయన చూపించిన దిక్కుగా నిప్పులాగా మండుతున్న తన బాణాన్ని ప్రయోగించాడు రామచంద్రమూర్తి. ఆ బాణం పడ్డ చోట ఎడారి అన్న పేరు వచ్చింది. ఆ బాణం భూమిలో ప్రవేశించినందున కలిగిన రంధ్రం నుండి పాతాళ జలం పైకి వుబికింది. ఆ కూపానికి వ్రణకూపం అని పేరు. అక్కడ నుండి వచ్చిన నీరు సముద్రంలాగా అనిపిస్తుంది. ఆ బాణం భూమిని భేదించడం వల్ల ఆ వేడికి అక్కడ వారు తాగుతున్న గుంటల్లోని నీరు కూడా ఎండిపోయింది. ఈ విధంగా సముద్రంలోని ఒక భాగం రామచంద్రమూర్తి తీక్ష్ణమైన బాణానికి కాలిపోగా, సేతువు కట్టడానికి తనలో స్థలం చూపిస్తానని సముద్రుడు చెప్పాడు. రామచంద్రమూర్తిని చూసి సముద్రుడు ఇలా అన్నాడు అప్పుడు.

         “మీ దగ్గర వున్న నలుడు అనేవాడు విశ్వకర్మ కుమారుడు. శిల్ప విద్యలో తండ్రితో సమానమైన వాడు. తండ్రి వరబలం వల్ల ఆ విద్యల్లో ప్రవీణుడు, ప్రసిద్ధ శక్తి కలవాడు అయ్యాడు. వీడు సేతువు నిర్మించడానికి ప్రయత్నం చేయాలి. ఆ సేతువు భారాన్ని నేను వహిస్తాను. కొండలు, చెట్లు నీళ్లలో వేసినప్పుడు అవి మునిగి పోకుండా నేను కాపాడుతాను. నీళ్లమీద తేలేట్లు చేస్తాను”.

         ఇలా చెప్పి సముద్రుడు కనబడకుండా పోయాడు. అప్పుడు నలుడు ఇలా అన్నాడు. “రామచంద్రదేవా! సముద్రుడు నిజం చెప్పాడు. నా తండ్రి వరబలంతో నేను సముద్రం మీద సేతువు కట్తాను. నేను విశ్వకర్మకు ఔరస పుత్రుడిని. పూర్వం విశ్వకర్మ నా తల్లికి, తన కొడుకుకు సమస్త శిల్ప విద్యలు వస్తాయని వరం ఇచ్చాడు. ఆ వరం బలంతో నేను శిల్ప విద్యలో తండ్రితో సమానుడనయ్యాను. ఈ సముద్రుడు చెప్పడం వల్ల నా విద్య గుర్తుకు వచ్చింది. నేను సేతువు కట్తాను. దానికి కావాల్సిన పదార్థాలు తేవడానికి నాకు వానరుల సహాయం కావాలి. నేనే తెచ్చుకుని కట్టాలంటే ఆ పని కాదు”.

         ఇలా నలుడు చెప్పడంతో, రామచంద్రమూర్తి వానరులందరికీ చెట్టులు, గుట్టలు తెచ్చి నలుడికి అందివ్వమని ఆజ్ఞాపించాడు. వారలాగే అడవికి పోయి చెట్లు పెళ్లగించుకుని  సముద్రతీరానికి వచ్చారు. అవన్నీ నలుడు సముద్రంలో పడవేశాడు. సేతువు వంకరగా పోకుండా నూరామడ పగ్గాలు ఈ కొన నుండి ఆ కొన దాకా ఈ పక్కన కొందరు, ఆ పక్కన కొందరు పట్టుకున్నారు. ఎలా-ఎలా చేయాలో అని రామచంద్రమూర్తి చెప్పుతుంటే వానరులు సహాయం చేస్తుండగా నలుడు మొదటి రోజున సముద్రంలో పద్నాలుగు ఆమడల సేతువు కట్టాడు. రెండో రోజున వానరుల సహాయంతో ఇరవై, మూడవ రోజున ఇరవై రెండు, నాల్గవ రోజున ఇరవై రెండు ఆమడల సేతువు ఉత్సాహంగా కట్టారు. సామర్థ్యసంపత్తి కల నలుడు ఐదవ రోజున ఇరవై మూడు ఆమడల దూరం సేతువు కట్టాడు. ఇలా మొత్తం 101 ఆమడ దూరం కట్టారు. నీటి పొడుగు నూరామడలే కాబట్టి, మిగతా ఆమడ అటూ-ఇటూ భూమ్మీద సగం ఆమడ కట్టారు.

          

         అప్పుడు సుగ్రీవుడు రామచంద్రమూర్తితో హనుమంతుడి వీపుమీద రాముడు, అంగదుడి వీపుమీద లక్ష్మణుడు ఎక్కి ఆకాశ మార్గాన ఆవలి ఒడ్డుకు రావచ్చని చెప్పాడు. కాని రాముడు వానరులను విడిచి పోదల్చుకోలేదు. సుగ్రీవుడు వెంటే ఆయనా దాటసాగాడు. కొందరు వానరులు సేతువు మీదగా, కొందరు ఈదుకుంటూ, కొందరు ఆకాశ మార్గాన ఆవలి ఒడ్డుకు చేరారు. రామచంద్రమూర్తి చేసిన ఈ అసాధారణ కార్యం వల్ల ఇక రావణుడి చావు తప్పదని దేవఋషి సిద్ధ చారణులు సంతోషంతో తమ మనస్సులలో ఉప్పొంగి పోయారు.

         సమస్త శుభాశుభ శకునాల లక్షణం తెలిసిన రామచంద్రమూర్తి తనకు శుభ శకునాలు కలగడం చూసి సంతోషించి తమకిక భయం లేదని భావించి, లక్ష్మణుడిని కౌగలించుకుని, వానరసేనను ఒక మంచి ప్రదేశంలో, ఎక్కడైతే మంచినీరు విస్తారంగా లభిస్తుందో అక్కడ, వ్యూహాత్మకంగా తీర్చమని చెప్పాడు. వానరులకు, భల్లూకాలకు, రాక్షసులతో వినాశనకరమైన, మిక్కిలి భయంకరమైన యుద్ధం లోకనాశనం కొరకు తటస్థించింది. దుమ్మురేపుతూ గాలి వీచింది. కొండల శిఖరాలు వణకాయి. భూకంపం పుట్టింది. ఆ కారణాన చెట్లు నేలకూలాయి. భయంకరమైన డేగలు, మృగాలు, మేఘసమూహాలు ఉత్పాత సూచకంగా నెత్తురు వర్షం కురిపించాయి.         

         “లక్ష్మణా! సంధ్యాకాల మేఘాలు కుంకుమ వర్ణం కలవిగా వున్నాయి. సూర్యుడిలో ఒక నల్లటి చుక్క కనపడుతున్నది. సూర్యుడి నుండి ఒక నిప్పు సమూహం మండుతూ నేలమీద పడింది. సూర్యుడిని చూసి అన్ని ప్రదేశాల్లో వున్న మృగాలు, పక్షులు, దుఃఖస్వరంతో ధ్వనిస్తున్నాయి. రాత్రుల్లో చంద్రుడు తన కాంతి క్షీణించడంతో కోనల్లో నలుపు, ఎరుపు కలిసిన కాంతి కలిగి ప్రళయకాలంలో లాగా వేడి కలిగిస్తున్నాడుఈ శకునాల ఫలం ఏంటంటావా? ఈ నేల నెత్తురుతో, మాంసంతో బురదకాబోతున్నది. కాబట్టి రావణపాలిత లంకానగారాన్ని ఇప్పుడే సేనతో పోయి ముట్టడిద్దాం” అని రామచంద్రుడు చేతిలో విల్లు ధరించి లంకకు అభిముఖంగా పోయాడు. యుద్దాభిలాష ఆవహించడంతో సంతోషంతో పోతున్న రామచంద్రమూర్తి వెంట సుగ్రీవ విభీషణులు, ఇతర వానరులు రాక్షసులను చంపాలన్న నిశ్చయంతో పోయారు.

లంకను చూసిన రామచంద్రమూర్తి సీతాదేవిని తలచుకున్నాడు. పాపాత్ముడైన రావణుడి చెరలో సీత మనోవేదనతో దీనురాలై దుఃఖపడుతున్నది కదా! అని తనలో అనుకున్నాడు. ఆ తరువాత, రామచంద్రమూర్తి, రాజనీతి శాస్త్రం ప్రకారం సేనలను విభజించాడు. నీలుడు అతడి సేనతో అంగదుడు హృదయ స్థానంలో వుండేట్లు, ఋషభుడు తన సేనతో కుడిపక్క వుండే విధంగా, గంధమాదనుడు ఎడమవైపు నిలిచేట్లు, వేగదర్శి, సుసేషణుడు, జాంబవంతుడు వారి-వారి సేనలతో గర్భం కాపాడేట్లు ఆజ్ఞచేసి, తానూ లక్ష్మణుడితో కలిసి శిరోదేశంలో నిలిచాడు. పడమటి భాగాన్ని వరుణుడు కాచేట్లు, సేన పుచ్ఛ భాగాన్ని సుగ్రీవుడు రక్షించేట్లు వ్యూహం పన్నాడు శ్రీరాముడు. (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందారం ఆధారంగా) 

No comments:

Post a Comment