Saturday, September 11, 2021

ఆదర్శ యక్షప్రశ్నలకు ఆదర్శ సమాధానాలు చెప్పిన ధర్మరాజు ...... ‘విశ్వసాహితీజగత్తులో యక్షప్రశ్నలు నిరుపమానాలు’ .... ఆస్వాదన-37 : వనం జ్వాలా నరసింహారావు

 ఆదర్శ యక్షప్రశ్నలకు ఆదర్శ సమాధానాలు చెప్పిన ధర్మరాజు

‘విశ్వసాహితీజగత్తులో యక్షప్రశ్నలు నిరుపమానాలు

ఆస్వాదన-37

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (12-09-2021)

అరణ్యవాసంలో మార్కండేయ మహర్షి ద్వారా అనేక రకాల పుణ్య కథలను విన్న పాండవులు మళ్లీ ద్వైతవనానికి తిరిగి వచ్చారు. అక్కడ వున్న సందర్భంలో ఒకనాడు ఒక బ్రాహ్మణుడు ధర్మరాజు దగ్గరికి ఆదుర్దాగా వచ్చాడు. తన అరణిని (అగ్నిని చేకూర్చే సాధనం) ఒక చెట్టు కొమ్మకు వ్రేలాడకట్టానని, దాన్ని ఒక లేడి వచ్చి తన కొమ్ముకు తగిలించుకుని పరుగు లంకించుకుని పారిపోయిందని, తన నిత్యానుష్టానానికి అరణి చాలా అవసరమని, తన అరణిని తనకు తెప్పించి ఇవ్వమని ప్రార్థించాడు ధర్మరాజును. వెంటనే ధర్మరాజు విల్లు ధరించి తమ్ములు తోడురాగా లేడిని వెంబడించారు. ఎన్ని బాణాలు ప్రయోగించినా అవేవీ ఆ లేడిని చేరలేదు. తాకనూ లేదు.

ఆ లేడి పాండవులను ముప్పుతిప్పలు పెట్టి, తిప్పీ-తిప్పి, ఒక భయంకరమైన అడవిలో కనిపించకుండా మాయమైపోయింది. పాండవులు తమ ప్రయత్నం వ్యర్థమైనందుకు విచారించారు. అలసిపోయి ఒక చెట్టునీడన చేరి విశ్రమించి, తమ కష్టాలను నెమరేసుకున్నారు. సుఖదుఃఖాలకు కారణం పూర్వజన్మ కర్మే అని ధర్మరాజు అంటే, మాయాద్యూతంనాడే ధృతరాష్ట్రుడి కొడుకులను సంహరించినట్లయితే ఈ కష్టాలు రాకపోయేవని భీముడన్నాడు. ఇలా అన్నదమ్ములు తమకు తోచిన విధంగా మాట్లాడుకుంటూ వుండగా సమీపంలో ఎక్కడైనా తాగడానికి మంచి నీరు దొరుకుతుందేమో చూడమని నకులుడికి చెప్పాడు ధర్మరాజు. చెట్టెక్కి చూసిన నకులుడు దగ్గరలోనే వున్నాయని నీళ్లు అనగానే, అక్కడికి వెళ్లి ఆయన తాగి సోదరులకు నీళ్లు తెమ్మని తమ్ముడిని ఆదేశించాడు ధర్మరాజు.

నకులుడు అన్నగారి ఆదేశం మేరకు సమీపంలోని ఆ తటాకానికి పోయి అందులోని నీళ్లను తాగడానికి సిద్ధమయ్యాడు. అంతట ఒక అశరీర భూతం ఇలా అన్నది. ‘ఈ చెరువు నాది. ఇందులో నీళ్లు తాగాలనుకుంటే నేనడిగే ప్రశ్నలకు జవాబు చెప్పు. ఆ హెచ్చరికను చులక చేసి నకులుడు ఆ చెరువులో నీళ్ళను తాగి వెంటనే స్పృహను కోల్పోయి, తటాకం ఒడ్డున చైతన్యం లేకుండా పడిపోయాడు. నకులుడు రావడం ఆలస్యం కావడంతో సహదేవుడిని పంపాడు ధర్మరాజు. అతడికి కూడా నకులుడికి అయినట్లే అయింది. ఆ తరువాత అన్నగారి ఆదేశానుసారం తటాకానికి వెళ్లిన అర్జునుడికి, భీముడికి కూడా అలాగే జరిగింది. నీరు తేవడానికి పోయిన తమ్ములెవరూ తిరిగి రాకపోవడంతో, చివరకు ధర్మరాజు స్వయంగా, వారు వెళ్ళిన దారిని బట్టి పోయాడు. తమ్ములను అన్వేషిస్తూ ఆ కొలను చేరాడు. అక్కడ స్పృహతప్పి వున్న తన తమ్ములను చూశాడు.

వారికలా ఎందుకు జరిగిందా అని పరిపరి విధాల ఆలోచిస్తూ, దాహానికి తాళజాలక ధర్మరాజు ఆ కొలనులోకి దిగాడు. అతడిని నీళ్లు తాగొద్దని వారిస్తూ మునుపటి లాగానే అశరీర భూతం ధర్మరాజును హెచ్చరించింది. తాను ఒక కొంగనని, ఆ సరోవరం తన ఆస్తని, ఆయన తమ్ములు తన హెచ్చరిక లక్ష్యం చేయలేదని, వద్దన్నా నీళ్లు తాగి ప్రాణాలను కోల్పోయారని, ఆయన కూడా వినకుండా నీళ్లు తాగితే అదే దుర్గతి పడుతుందని, తానడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి అప్పుడు సరోవరంలోని నీరు తాగమని అన్నది ఆ అశరీర భూతం. అలా మాట్లాడుతున్నది కొంగ కాదని, ఎవరో దేవత కావచ్చని, మామూలు వారికి తన తమ్ములను గెలవడం సాధ్యపడదని, నిజం చెప్పమని అడిగాడు ధర్మరాజు. జవాబుగా ఆ అశరీర భూతం ఒక భయంకరాకారంలో, దేదీప్యమానమైన వర్చస్సుతో, ధర్మరాజు ముందు ప్రత్యక్షమై తాను ఒక యక్షనాయకుడిని అని చెప్పాడు. తాను వేసే ప్రశ్నలకు సముచితమైన సమాధానాలు చెప్పమన్నాడు.          

(యక్ష ప్రశ్నల పూర్వ రంగాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు గారు ఇలా రాశారు: ‘అరణ్యవాసం ఒక సువిశాలమైన విశ్వ విద్యాలయం కావచ్చు. అక్కడ విజ్ఞానార్జన చేయవచ్చు. ప్రకృతిని మించిన పాఠశాల లేదు. విపద్దశను మించిన విశ్వ విద్యాలయం లేదు. పాండవులు పన్నెండు సంవత్సరాలు నిరంతర జిజ్ఞాసువులై అరణ్య విశ్వ విద్యాలయంలో అంతేవాసులయ్యారు. అక్కడ ఉపన్యాసకులు మార్కండేయాది మహర్షులు. ధర్మరాజు ఆదర్శ విద్యార్థిగా వనవాసాన్ని జ్ఞానుల సన్నిధిలో గడిపాడు. విద్యాభ్యాసం చివర జరగాల్సింది విద్యాపరీక్ష. అవే యక్షప్రశ్నలు. అది ఆదర్శ ప్రశ్నాపత్రం. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలిచ్చి ధర్మరాజు విజ్ఞాన పట్టభద్రుడయ్యాడు’.

‘మహాభారతంలో తరతరాల మేధావులను ఉర్రూతలూగించిన ఘట్టాలలో ఎన్నదగింది యక్షప్రశ్నల ఘట్టం. ప్రశ్న పరంపర అడిగింది యక్షరూపాన వున్న యమధర్మరాజు. సమాధానాలు చెప్పింది ధర్మరాజు. ప్రశ్నలకు సమాధానం చెప్పే అధికారం ధర్మరాజుకు రావడానికి కారణం ఆయన పన్నెండు సంవత్సరాలు అరణ్య విశ్వ విద్యాలయంలో జిజ్ఞాసువుగా విద్యాభ్యాసం చేయడమే! యక్షప్రశ్నల ఘట్టం అతడికి స్నాతక పరీక్ష. పరీక్షాధికారి సాక్షాత్తు యమధర్మరాజే. పన్నెండు సంవత్సరాలు ధర్మరాజు మహర్షులకు అంతులేని ప్రశ్నలను వేశాడు. సమాధానం చెప్పే వంతు ఇప్పుడు ధర్మరాజుకు వచ్చింది. ఇది అతడికి అసిధారావ్రతం. అన్నీ చిక్కుముడి ప్రశ్నలే. అడిగిన యక్షుడికి సముచిత సమాధానాలు తెలుసు. ఆదర్శ ప్రశ్నలకు ఆదర్శ సమాధానాలు ఇందులో వున్నాయి. విశ్వసాహితీజగత్తులో యక్షప్రశ్నలు నిరుపమానాలు).

ఇక యక్ష, ధర్మరాజుల ప్రశ్నోత్తరాలు ఇలా వున్నాయి:

ప్రశ్న: సూర్యుడిని నడిపేది ఏది? సూర్యుడిని సేవించి తిరిగేవారెవరు? సూర్యుడు దేనివల్ల అస్తమిస్తాడు? సూర్యుడికి ఆధారమైనది ఏది?

జవాబు: సూర్యుడిని బ్రహ్మం నడుపుతుంది. సూర్యుడిని సేవించి తిరిగేవారు వేల్పులు. సూర్యుడు ధర్మం వల్ల అస్తమిస్తాడు. ఆ మహాత్ముడికి ఆధారం సత్యం.

ప్రశ్న:  దేనివల్ల శ్రోత్రియుడు ఔతాడు? దేనివల్ల పురుషుడు గొప్ప మహిమను ఒప్పిదంగా పడయగలుగుతాడు? దేనివల్ల సాయం పొందినవాడు ఔతాడు? దేనివల్ల బుద్ధిమంతుడు ఔతాడు?

జవాబు: వేదాభ్యాసం వల్ల శ్రోత్రియుడు కాగలడు. నిరుపమానమైన తపస్సువల్ల గొప్ప ప్రభావం సిద్దిస్తుంది. ధైర్యం వల్ల సాయం పొందుతాడు. పెద్దల పరిచర్యవలన బుద్ధిమంతుడు ఔతాడు.

ప్రశ్న: దేనివల్ల బ్రాహ్మణుడు దివ్యత్వాన్ని సాధిస్తాడు? బ్రాహ్మణుడికి నిర్మలత్వం ఎలా ఏర్పడుతుంది? మాలిన్యం ఎట్లా దాపురిస్తుంది? దేనివల్ల బ్రాహ్మణుడు మర్త్యుడు ఔతాడు?

జవాబు: బ్రాహ్మణుడు వేద పఠనం వల్ల దివ్యత్వం ఆర్జిస్తాడు. మిక్కుటమైన నిష్టవల్ల సాదుభావం ఆర్జిస్తాడు. ఎన్నదగిన సౌశీల్యాన్ని వదిలితే అసాధువు ఔతాడు. శుచిత్వాన్ని వీడి మృత్యు భయం చెంది మర్త్యుడు ఔతాడు.

ప్రశ్న: జీవన్మృతుడు ఎవడు?

జవాబు: దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు, సేవకులకు మొదలైనవారికి పెట్టకుండా తాను భోజనం చేసేవాడు బతికి వుండగానే మరణించినవాడితో సమానుడు.

ప్రశ్న: భూమికంటే బరువు ఏది? ఆకాశం కంటే నిడివి కలది ఏది? గాలికంటే వేగంగా పోగలిగింది ఏది? గడ్డికంతే విరివిగా పెరిగేది ఏది?

జవాబు: భూమికంటే బరువైనది కన్నతల్లి. ఆకాశం కంటే పొడుగు తండ్రి. గాలికంటే వేగం కలది మనస్సు. తృణసమూహం కంటే విరివైనది చింత.

ప్రశ్న: నిద్రించి కూడా కన్ను మూయనిది ఏది? జన్మించి కూడా చైతన్యం లేనిది ఏది? రూపం వుంది కూడా హృదయం లేనిది ఏది? వేగం వల్ల అతిశయించేది ఏది?

జవాబు: చేప నిద్రించి కూడా నేత్రాలు మూయాడు. గుడ్డు జన్మించి కూడా ప్రాణం లేనిదే. రాయికి రూపం వున్నా హృదయం లేదు. ఏరు వేగం వల్ల వర్ధిల్లుతుంది.

ప్రశ్న: బాటసారికి, రోగికి, గృహస్థుడికి, మరణించినవాడికి చుట్టాలెవ్వరు?

జవాబు: సార్థం (అప్పుడప్పుడు మాత్రమే పయనించేది), వైద్యుడు, మంచిబ్యార్య, చేసిన ధర్మం.

ప్రశ్న: ధర్మానికి కుదురు ఏది? కీర్తికి ఆధారం ఏది? స్వర్గానికి సరైన మార్గం ఏది? సుఖానికి నెలవు ఏది?

జవాబు: దాక్షిణ్యం ధర్మానికి కుదురు. దానం కీర్తికి ఆధారం. స్వత్యం స్వర్గానికి ద్వారం. శీలం సమస్త సుఖాలకు నెలవు.

ప్రశ్న: నరుడికి ఆత్మ ఎవరు? అతడికి దైవికంగా ఏర్పడే చుట్టం ఎవరు? అతడు బతుకును ఎలా నిర్వహిస్తాడు? అతడు ఏవిధంగా మంచిని పొందుతాడు?

జవాబు: నరుడికి ఆత్మ పుత్రుడు. అతడికి దైవికమైన చుట్టం భార్య. అతడికి బతుకు ప్రసాదించేది మేఘుడు. అతడికి గొప్పదనం ఇచ్చేది దానం.

ప్రశ్న: ధర్మాలన్నిటిలోను గొప్పదైన ధర్మం ఏది? ఏది సతతం పరిపూర్ణంగా ఫలితాన్ని ఇస్తుంది? ఏది వదులుతే సంతోషం చేకూరుతుంది? ఎవరితోడి పొత్తు ఎప్పుడూ చెడదు?

జవాబు: అహింస అన్ని ధర్మాలలోను మేటి ధర్మం. యజ్ఞం ఎల్లప్పుడూ పంటనిచ్చే కార్యం. అహంభావం పోతే సంతోషం కలుగుతుంది. సజ్జన సహవాసం ఎప్పుడూ భగ్నం కాదు.

ప్రశ్న: లోకంలోని ప్రజలను ఆదుకుని సాయం చేసేవావారెవరు? దేనివల్ల నీరు, అన్నం లభిస్తాయి? విషం అంటే ఏమిటి? పితృతర్పణాలకు అనుకూలమైన కాలం ఏది?

జవాబు: ఈ సృష్టి సమస్తానికి దిక్కైనవారు సజ్జనులు. ఆకాశం నీటికి, భూమి అన్నానికి పుట్టే నెలవులు. బ్రాహ్మణుడి ధనం విషంతో సమానం. బ్రాహ్మణులరాక పితృతర్పణాలకు అనువైన కాలం.

ప్రశ్న: దేనిని వదలిపెట్టితే మానవుడు సర్వజనాలకు ఇష్టుడవుతాడు? నిశ్శోకుడు (దుఃఖం లేనివాడు) ఔతాడు? సంపన్నుడు ఔతాడు? సౌఖ్యం కలవాడు ఔతాడు?

జవాబు: గర్వం విడనాడితే అందరికీ ఇష్టుడు కాగలడు. కోపం విడనాడితే శోకంపాలు కాడు. లోభం వదిలి పెట్టితే సంపన్నుడు ఔతాడు. తృష్ణ వర్జిస్తే సుఖవంతుడు ఔతాడు.

ప్రశ్న: పురుషుడు అనదగినవాడు ఎవ్వడు? సర్వధని-సకల సంపదలు కలవాడు ఎవడు?

జవాబు: భూమ్యాకాశాలను ఆవరించి ఎవ్వడి కీర్తివైభవం మిరుమిట్లు కొలుపుతూ విస్తరిస్తుందో అలాంటి మహానుభావుడే పురుష శబ్దంతో పిలువదగినవాడు. ప్రియం, అప్రియం, సుఖం, దుఃఖం, జరిగిన కార్యాలు, జరగబోయే కార్యాలు, ఎవరికీ సమానమో అలాంటి మహానుభావుడు సర్వధని అని చెప్పవచ్చు.

         ఇలా యక్షుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ ధర్మరాజు చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెందిన యక్షుడు ఆయన తమ్ములలో ఒకడి ప్రాణాలు ఇస్తాను అంటాడు. నకులుడిని బతికించమని కోరాడు ధర్మరాజు. ఎందుకలా కోరావని అడుగుతే, కుంతి కొడుకుల్లో తానున్నానని, మాద్రి కొడుకుల్లో ఒకడైన నకులుడిని బతికించమని అడిగానని చెప్పాడు. ఆ ఆమాటలు విన్న యక్షుడు ధర్మరాజు ధర్మజ్ఞానానికి మెచ్చుకున్నానని, ఆయన తమ్ములంతా బతుకుతారని చెప్పి అందరినీ బతికించాడు. అప్పుడు యక్షుడు తన నిజస్వరూపాన్ని చూపించి, తాను యమధర్మరాజునని చెప్పాడు. తన కుమారుడైన ధర్మరాజును చూసే వేడుకతో వచ్చానని, ఆయన కోరిన వరాలను ఇస్తానని అన్నాడు.

         ధర్మరాజు ధర్మదేవుడికి నమస్కారం చేసి బ్రాహ్మణుడి అరణిని ప్రసాదించమని కోరాడు. ఆ అరణిని తానే లేడి రూపంలో అపహరించానని చెప్పి దాన్ని ధర్మరాజుకు ఇచ్చాడు యమధర్మరాజు. మున్ముందు అజ్ఞాతవాసంలో పాండవులను ఎవరూ గుర్తించకుండా వుండే వరాన్ని ప్రసాదించి అదృశ్యమయ్యాడు ఆయన. 

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, సప్తమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

Tuesday, September 7, 2021

సమస్త భూమండలం తిరిగిన సుగ్రీవుడు : వనం జ్వాలా నరసింహారావు

 సమస్త భూమండలం తిరిగిన సుగ్రీవుడు

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక చింతన కాలమ్ (08-09-2021)

         సీతాదేవిని వెతకడానికి నలుదిక్కులకూ ఒక్కొక్క వానర నాయకుడి నేతృత్వంలో కోటానుకోట్ల వానర వీరులను పంపించే ముందర వాళ్ళు వెళ్లే దిక్కులో వున్న ప్రదేశాలను వివరంగా చెప్పాడు వాళ్లకు సుగ్రీవుడు. ఒక విధంగా ఆయన మాటల్లో అది సమస్త భూమండలమే!

సీతను వెతకడానికి ముందుగా తూర్పు దిశకు వినతుడిని పొమ్మన్నాడు. ఆ దిక్కున వున్న ప్రదేశాలను వివరించాడు. సరయూ నది, గంగ, కౌశికిన, మనోహరమైన సింధు, యమున, సరస్వతి వున్నాయి. కొండలతో, వనాలతో కూడిన మహీనది, కాలమహి, బ్రహ్మమాల, విదేహం, మాలవం, కాశికాపురం, మగధదేశ గ్రామాలు, కోసలం వున్నాయి. ఇవి కాకుండా సముద్రమధ్యాన. ఏడు ఖండాలతో కూడిన యవద్వీపం, స్వర్ణరూప్యకమనే దీవులను దాటి పోతే ఆకాశాన్ని అంటే శిఖరంకల శిశిరం అనే పర్వటం వుంటుంది. అది దాటిపోతే, ఎర్రటి నీళ్లు, లోతు, మహా వేగంకల శోణ నాదం వుంటుంది. ఇది సముద్రానికి అవతలి ఒడ్డున వుంటుంది.

ఎర్రటి నీళ్లున్న సురాసముద్రాన్ని చూసుకుంటూ పోతే, బంగారం, మణులతో ప్రకాశిస్తూ కైలాసంతో సమానమైన, విశ్వకర్మ నిర్మించిన గరత్మంతుడి గృహాన్ని చూడవచ్చు. అక్కడ తెల్లటి మేఘంలాగా పాల సముద్రం వుంది. నిర్మలమైన పాల సముద్రం మధ్యలో ప్రసిద్ధమైన ఋషభ పర్వతం వుంది. అది తెల్లటి కాంతికలదై, దివ్యమైన పరిమళాలతో, పూలతో కూడిన బంగారి చాయకల చెట్లతో నిండి వుంటుంది. అక్కడే బడలిక పోయే సుందరమైన కొలను వుంటుంది. దాని పేరు సుదర్శనం.

ఆ కొలనులో తెల్లటి కింజల్కాలు కల తెల్ల కమలాలు వుంటాయి. వాటి కోసం కిన్నరులు, చారణులు, దేవతలు, వారి సమూహాలు, అప్సరసలు, జలకేళి కొరకు వస్తుంటారు. ఆ పాల సముద్రాన్ని దాటిపోతే, ప్రాణికోటికి భయం కలిగించే, యౌర్య మహర్షి కోపం మూలాన పుట్టిన గుర్రపు ఆకారంకల అగ్ని కనబడుతుంది. ఆ శుద్దోదక సముద్రాన్ని దాటి అటువైపు పోగా అక్కడ పదమూడు యోజనాలు కల బంగారు రాయికల బంగారు కొండ వుంది.

అటు పిమ్మట బంగారుమయమైన తూర్పు కొండ వుంది. ఆ పర్వత సమూహంలో ఆకాశాన్ని తాకుతూ, బంగారుమయమై, నూరామడల విస్తీర్ణం కల అందమైన అరుగు వుంది. అక్కడ మద్ది చెట్లు, తాటి చెట్లు, చీకటి మాకులు, కొండ గోగులు, సూర్యకాంతితో పూచి వుంటాయి. అక్కడ యోజనం వెడల్పున, పది ఆమడ ఎత్తున పర్వత శిఖరం వుంది. దాని పేరు సౌమనసం. సూర్యుడు జంబూద్వీపం ఉత్తర భాగంలో తిరుగుతూ ఆ కొండమీదకు వచ్చినప్పుడు మేరువు దక్షిణ దిక్కువారికి కనపడుతుంది. దాని పక్కదే సుదర్శనం. ఈ గొప్ప ద్వీపంలో సమస్త ప్రాణి సమూహాలకు నేత్ర కాంతి కలిగించే గొప్ప తేజంతో సూర్యుడు ప్రకాశిస్తుంటాడు.

బ్రహ్మ దేవుడు భూలోకానికి, తక్కిన లోకాలకు, ద్వారంగా చేసిన కారణాన, సూర్యుడు సంచరించడానికి మొదలు అక్కడి నుండే బయల్దేరడం వల్లా, దాన్ని పూర్వ దిశ అంటున్నారు. ఆ తూర్పుకొండకు ఆవల దేవతలు వుంటారు. అక్కడ చంద్ర-సూర్య కాంతులు లేవు. చీకట్లు వ్యాపించి వుంటాయి. అక్కడి దాకా పోవచ్చును కాని ఆ తరువాత పోవడం సాధ్యపడదు.

         దక్షిణ దిక్కుకు నీలుడిని, హనుమంతుడిని, జాంబవంతుడిని, అంగదుడిని, తదితర ప్రసిద్ధ బలులను పొమ్మన్నాడు. వీళ్లందరికీ దక్షిణ దిక్కున కల కొండల, గుట్టల, అడవుల గురించి చెప్పాడు.

         అనేక వృక్షాలు, లతలు, వేయి శిఖరాల పర్వత శ్రేష్టం వింధ్యము, పెద్ద-పెద్ద పాములు కల నర్మద, విశాలమైన గౌతమీ అనే పేరున్న నదీ తీరం, కృష్ణ, మహానది, వరద, మేఖల (ఇదే అమరటంక పర్వతం...ఇక్కడే నర్మద పుట్టుతుంది), ఉత్కలం, దశార్ణము, ఆశ్వవంతి, అవంతి, విదర్భ, మహిషి ఋషికాలు, వంగా, కాశీ, కళింగ, అంగ దేశాలుంటాయి. కొండలు, గుహలు, నదులున్న దండకారణ్యంలో గోదావరి నది వుంటుంది. ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ, దేశాలు, సహ్య పర్వతం వుంటాయి. కావేరి వుంటుంది. సముద్రాన్ని కలియబోయే తామ్రపర్నీనది వుంది.

         దానికి అవతల బంగారు రేకులతో ప్రకాశించే, శోభావిలసితమైన పాండ్యనగరి తలవాకిటి వుంది. సముద్రం లోపల, అగస్త్యుడు పూర్వం మహేంద్ర పర్వతం నిలిపాడు. అది నీళ్లల్లో మునిగీ-మునగనట్లు కనిపిస్తుంది. సముద్రం మధ్యలో మనుష్యులు పోలేని నూరామడల విస్తారంకల ద్వీపం వుంది. ఆ ద్వీపంలోనే రావణాసురుడు వుండే పట్టణం వుంది.

         దక్షిణ సముద్రం మధ్యలో అంగారక (దీన్నే సుందరకాండలో సింహిక అని పిలిచారు) అనే రాక్షసి వుంది. అది ఆకాశాన పోయే వారి నీడను పట్టుకుని నిలిపి బక్షిస్తుంది. ఆ ద్వీపం నుండి నూరామడ పోతే, అక్కడ సిద్ధులు, చారణులు వుండే, సూర్య-చంద్ర కిరణాలతో సమానమై, అందంగా వుండి, సముద్ర జలాలతో చుట్టబడ్డ, ఆకాశాన్ని తాకే శిఖరం కలిగిన పుష్పితకం అనే పర్వతం కనిపిస్తుంది. దాని బంగారు శిఖరాన్ని రాసుకుంటూ సూర్యుడు దక్షిణాయనంలో దాని వెండి శిఖరానికి వస్తాడు. దక్షిణాయనంలో దీనికి దక్షిణంగా సూర్యుడు పోడు.

         ఆ పర్వతాన్ని దాటి పద్నాలుగు ఆమడలు పోతే వైద్యుతమైన సూర్యవంతం అనే కొండ వస్తుంది. ఆ కొండలోనే విశ్వకర్మ అగస్త్యుడికి బంగారంలాగా ప్రకాశించే ఆమడ వెడల్పు, పది ఆమడ ఎత్తుకల, దివ్య రత్నాలతో విలసిల్లే ఇల్లు నిర్మించి ఇచ్చాడు. ఆ మహా పర్వతంలో సర్పాలతో రక్షించబడే భోగవతి అనే పేరుకల సర్పరాజైన వాసుకు నివాస స్థలం వుంది. ఆ పాముల నగరంలోపల అక్కడక్కడా రహస్య స్థలాలు వున్నాయి. అవన్నీ దాటి పోతుంటే, వృషభాకారం కలిగి, కాంతివంతమై, దేవతా సంబందమై, అగ్ని కాంతితో, గోరోచన కాంతితో వెలిగే ఋషభం అనే పర్వతం వుంటుంది. అది భూమికి పొలిమేర. అంటే ఆవల సముద్రం వుందని అనుకోవాలి.

         దాన్నీ దాటిపోతే ఆ పిమ్మట భయానకమైన యమలోకం వుంటుంది. కాబట్టి మనుష్యులకు ఆ యమలోకానికి పోవడం సాధ్యం కాదు. ఆ నగరాన్ని చుట్టుకుని భయంకరమైన చీకటి వ్యాపించి వుంటుంది. అక్కడి దాకా పోవచ్చు. ఆ తరువాత పోవడం అసాధ్యం.

         ఆ తరువాత సుగ్రీవుడు సుషేణుడిని పిలిచి, పశ్చిమంగా పొమ్మంటాడు.

         పశ్చిమ దిశగా పోతే, సురాష్ట్రం (ఇప్పటి సూరత్), బాహ్లికం, శూరము, భీమమనే దేశాలు విశాలంగా వుంటాయి. పడమటగా ప్రవహించే నదులు, మునులుండే అడవులు, కొండలు, నీరులేని ప్రదేశాలు, పెద్దరాల దేశాలను దాటిపోతే పశ్చిమ సముద్రం వస్తుంది. అది దాటిపోయి మురచీ పట్టణం, జతీపురం, అవంతిని, అంగలోప వుంటాయి. అక్కడి నుండి సింధు నది సముద్రంలో పడేచోటు వస్తుంది. అక్కడ దక్షిణలోయల వెంట వుండే హల పర్వతాన్ని చూడవచ్చు. అక్కడ పెద్ద మ్రాకులు, అనేక శిఖరాలు కలిగి ఆకాశాన్ని అంటే, రెక్కలుకల దానిలాగా ఎగిరే సింహాలుండే చరియలు కల హేమగిరి వుంది.

         ఆ పర్వతం దాటి నూరామడలు పోతే, చూడడానికే అసాధ్యమైన పారియాత్ర పర్వత (పశ్చిమ రాజపుత్ర స్థానంలో వున్న ఇప్పటి సోలేమాన్ రేంజ్ కావచ్చు) శిఖరాన్ని చూడవచ్చు. గంధర్వులు వుంటారక్కడ. వీరి దేశం గాంధార దేశం. ఇది ఇప్పటి ఆఫ్ఘానిస్తాన్. ఇందులోని గాంధారం అంటే కాందహార్. అక్కడ పవిత్రమైన వైడూర్యకాంతికలదై వజ్రాల దృఢమైన కొండ వుంది.

         ఆ కొండ పేరు వజ్రధరం. అందులో చిత్రమైన నూరామడల చదరమైన నేల వుంది. దానికి ఆవల సముద్రంలోని నాల్గవ భాగంలో చక్రవంతం అనే పెద్ద పర్వతం వుంటుంది. అక్కడ విశ్వకర్మ రచించిన సాహస్రార చక్రం వుంది. దానికి వేయి అంచులున్నాయి. దాన్ని రక్షించే హయగ్రీవుడిని, పంచ జనుడిని చంపి, విష్ణువు హయగ్రీవుడి చక్రాన్ని, పంచ జనుడి వెన్నెముక అయిన శంఖాన్ని తీసుకున్నాడు. పంచజనుడి వల్ల లభ్యమయింది కాబట్టే శంఖానికి పాంచజన్యమని పేరు వచ్చింది. ఆ తరువాత అరవై ఆమడలు పోతే సముద్రంలో విశాలమైన వెండి శిఖరంతో కూడిన వరాహ పర్వతం వుంటుంది. విశాలమైన ఆ  పర్వతంలో ప్రాగ్జ్యోతిషం (దీని ఇప్పటి పేరు అస్సాం) అనే పట్టణం వుంది.

         ఇవన్నీ కలయ చూస్తూ పోతుంటే సెలయేళ్లున్న సర్వసౌవర్ణం అనే పేరున్న కొండ వస్తుంది. ఆ పర్వతానికి మేఘవంతం అనే పేరు. అది దాటిపోతే అరవై వేల కొండలు వస్తాయి. ఆ పర్వతాల మధ్య ప్రదేశంలో ఉత్తర మేరుసావర్ణి అనే పర్వతం వుంది. విశ్వులు, ఆదిత్యులు, మరుత్తులు, వసువులు మొదలైనవారు ప్రసిద్ధులైన దేవతలను సాయంకాల సమయంలో భక్తితో బంగారు కొండమీద వున్న సూర్యుడిని సేవించడానికి వస్తారు. ప్రాణకోటికంతా కానరానివాడై లోకమంతా చీకటిలో మునిగేట్లు చేసి తానూ పడమటి కొండకు పోతాడు.

         గడియకు పదివేల ఆమడల వంతున పోయి సూర్యుడు పడమటి కొండకు చేరుకుంటాడు. ఆ పర్వత శిఖరం కొనలో సూర్యకాంతి కల మేడలతో నిండిన దివ్యమైన ఒక ఇల్లు వుంది. అది విశ్వకర్మ నిర్మితం. అక్కడ అస్తపర్వతానికి, మేరుపర్వతానికి మధ్యన బంగారుమయమై, చిత్రమైన అరుగు కలిగి, పది తలల తాల వృక్షం కళ్లకు ఆనందంగా కనపడుతుంది. సూర్యుడు ఉదయ సమయాన ఇంతదాకా తన తేజస్సుతో చీకట్లను తరిమి పడమటి కొండకు పోతాడు. ఆ తరువాత సూర్యరశ్మి వుండదు. కాబట్టి ఏమున్నదో తెలియదు. చీకట్లు వ్యాపించి వుంటాయి.

ఆ తరువాత సుగ్రీవుడు మహాబలవంతుడైన శతవలి అనే వాడిని ఉత్తర దిక్కుకు పొమ్మంటాడు.

         ఉత్తరాన హిమవత్పర్వతం వుంది. మ్లేచ్చ దేశంలో శూరసేన, పుళింద, ప్రస్థర, మద్రక, భారత (హస్తినాపుర), దక్షిణ కురుభూములు, కాంభోజ, యవన, శకదేశం, అరట్ట, బాహ్లిక, పౌరవ, టంకణ, ఋషిక దేశాలు, జీనా దేశం, పరమ చీన (మంచూరియా-మంగోలియా) దేశం, నిహార, దరద ప్రదేశాలు, హిమవత్పర్వత ప్రాంతం వుంటాయి. సోమాశ్రమం, కాలపర్వతం అవతలవైపున గుహలుంటాయి. ఆ పర్వతం దాటి పోగా సుదర్శనం అనే పర్వతం వస్తుంది. అది దాటిపోయిన తరువాత దేవసఖమనే పర్వతం వుంటుంది. దానికి అవతల కొండలు, నదులు, చెట్లు, జీవజంతువులు లేని నూరామడల పొడవున్న దేశం వుంటుంది. దీన్ని గోబి, శాము ఎడారి అంటారు. ఆ మరుభూమిని దాటిపోతే కైలాసపర్వతం కనబడుతుంది. (హిమాలయానికి ఉత్తరాన టిబెట్ దేశం వుందిప్పుడు). అక్కడ తెల్లటి మేఘంతో సమానమై, బంగారంతో అలంకృతమై, తెల్లటి కాంతికల కుబేరుడి ఇల్లుంది. దాన్ని విశ్వకర్మ నిర్మించాడు”.

         అక్కడ వస్వౌకసార అనే కొలను వుంది. కుబేరుడు ఎల్లప్పుడూ అక్కడ వినోదంగా క్రీడిస్తుంటాడు. ఆ ప్రదేశంలో పూర్వం కుమారస్వామి శక్తి ప్రయోగంతో నిర్మించిన శిబిరం వుంది. ఆ దారిలోనే హంసలు మానస సరస్సుకు పోయివస్తుంటాయి. ఆ బిలంలోకి పోవడం అంత సులభం కాదు. అక్కడ వృక్షం, కామశైలం, మానసం అనే పర్వతాలున్నాయి. దేవదానకులకు కూడా మాంసం అనే పర్వతం దగ్గరికి పోవడానికి సాధ్యంకాదు.

         క్రౌంచపర్వతం దాటిన తరువాత మైనాక పర్వతం వస్తుంది. ఆ పర్వతం మీద మయుడనే దానవుడు కట్టుకున్న సుందరమైన గృహం వుంది. అక్కడ సిద్ధులుండే ప్రదేశంలో వైఖానసం అనే సరస్సు వుంది. ఆ సరస్సుకు ఆవల సూర్యకాంతి, చంద్రకాంతి, నక్షత్రకాంతి లేదు. అక్కడ మేఘాలు లేవు. ఆకాశం శబ్దం లేకుండా వుంటుంది. మీరది దాటిపోతే శైలోదం అనే శిలానది వుంది. దానికి ఇవతల, అవతల కీచకాలు అనే పేరుకల వెదుళ్ల పొదలుంటాయి. ఆ ఏటి నీళ్లలో దిగినవారు రాళ్లుగా మారిపోతారు కాబట్టి ఆ నది దాటాలంటే, ఆ పొదల వెదుళ్ళు పట్టుకుని పోవాలి, రావాలి. ఆ దరిన, ఈ దరిన వెదుళ్ళు కలిసికొని అల్లుకుని వుంటాయి. ఆ ఉత్తర కురుభూములు పుణ్యం చేసిన పురుషులకు భోగస్థానాలై వుంటాయి”.

         అక్కడ అనేక నదులున్నాయి. వాటిల్లో వైడూర్యాలున్న ఆకులు కలిగిన బంగారు కమలాలుకల తామరతూండ్లు వున్నాయి. అక్కడ ఎర్రటి కలువల వనాలున్నాయి. అక్కడి సరస్సులు బంగారువన్నె, బాలసూర్యుడివన్నె కలిగి వుంటాయి. చూడడానికి చాలా సంతోషకరములై వుంటాయి. జాతినీలాల కాంతికల రేకులు, అపరంజి బంగారు కాంతికల కింజల్కాలున్న నల్లటి కలువలతో నిండిన సరస్సులు అక్కడ అందంగా వుంటాయి. అగ్నితో సమానంగా బంగారు కాంతితో కొండలక్కడ దండిగా వున్నాయి.

ఆ ఉత్తర కురు భూముల్లో కొన్ని పర్వతాలు అసమానమైన, ఆశ్చర్యకరమైన పీటలు, మంచాలు కాస్తాయి. దాన్ని దాటి ఉత్తరంగా పోతే, సముద్రంలో సోమశైలం అనే పేరున్న బంగారుమయమైన పర్వతం వుంటుంది. దాన్ని ఇంద్రలోక వాసులు, బ్రహ్మ లోకవాసులు కాపాడుతుంటారు.ఆ ప్రదేశంలో సూర్యకాంతి లేకపోయినా ఆ బంగారు కాంతి వల్ల వస్తువులు కనబడుతుంటాయి.

అక్కడ షాడ్గుణ్య పరిపూర్తికలిగి ప్రపంచ స్వరూపుడైన విష్ణువు, ఏకాదశ మూర్తులు ధరించి, మన్మథ విరోధి అయిన శివుడు, ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మ కాపురం వుంటారు. ఉత్తర కురుభూములకు ఉత్తరంగా వున్న సోమపర్వతం చేరబోవడం సాధ్యపడదు. ఆవలి దేశం కట్టుపాటు లేనిది. సూర్యకాంతి వుండదు. అక్కడ ఏమున్నదో ఎవరికీ తెలియదు.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

Sunday, September 5, 2021

రామ లక్ష్మణులను మిథిలా నగరానికి తీసుకెళ్తున్న విశ్వామిత్రుడు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-71 : వనం జ్వాలా నరసింహారావు

 రామ లక్ష్మణులను మిథిలా నగరానికి తీసుకెళ్తున్న విశ్వామిత్రుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-71

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (06-09-2021)

రాజవంశంలో పుట్టిన విశ్వామిత్ర ఋషి చేసిన యజ్ఞం ఈ విధంగా రక్షించిన సూర్య వంశపు రాజకుమారులు-రామ లక్ష్మణులు, తండ్రి ఆజ్ఞాపించిన కార్యాన్ని చేశామన్న నిండు సంతోషంతో, కంటి నిండా నిద్రించి, తెల్లవారగానే మేల్కున్నారు. ప్రాతఃకాలకృత్యాలు తీర్చుకుని, వీరాగ్రగణ్యులైన శ్రీరామ లక్ష్మణులు ముందుగా గురువైన విశ్వామిత్రుడికి-తర్వాత తపస్సంపున్నులైన ఋషీశ్వరులకు నమస్కరించి, తేనెలొలికే ముద్దుమాటలతో అన్నారీవిధంగా: " మునీంద్రా ! నువ్వు మితిమీరిన తపశ్శక్తితో నీ కార్యాలన్నీ చక్కబర్చుకోగలవు. మేం మీకు సాధించి ఇచ్చిందేమీలేదు. అయినా, మాకు తరుణోపాయంగా, సేవనేదొకటి కల్పించి, మాచేత చేయించుకుని-మీరు సంతోషపడి-మాకు గురు సేవ లభించి, ధన్యులమైతిమన్న సంతోషం కలిగించమని కోరుతున్నాం. స్వయంగా మేం మీ పనులు చేయలేకపోయినా, మీ వాక్య బలమే మాతో ఆ కార్యాలు చేయించగలదు. కాబట్టి మీరు చేయాల్సిన కార్యమేదో చెప్పి మాతో చేయించండి". జవాబుగా విశ్వామిత్రుడు, శిష్యుల యోగ క్షేమం కనుక్కోవడం గురువుకు ముఖ్యమని-వారికి శుభం కలిగే ఉపాయాన్ని ఆలోచించి, రామ లక్ష్మణులకు తెలియచేశాడీవిధంగా.

" రామచంద్రా! మిథిలా దేశపు రాజు జనకుడు మిక్కిలి ధర్మాత్ముడు. ఆయన ఇప్పుడు యజ్ఞం చేసే ప్రయత్నంలో వున్నాడు. నేను-ఇతర మునీశ్వరులు అక్కడకు పోతున్నాం. మీరు కూడా రండి. ఆయన రాజు-మేం రాజకుమారులం-ఆయన పిలవకుండా పోవడం మర్యాద కాదని అనవద్దు. పిలువకున్నా, యజ్ఞానికి పోవచ్చని శాస్త్రం చెపుతున్నది. అదీ కాకుండా, రాజులైనవారు అక్కడకు పోవాల్సిన పనుంది. ఆయన దగ్గర దేవతా సంబంధమైన-మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ధనస్సుంది. దాని మహిమ ఆశ్చర్యకరం. పూర్వం దాన్ని దేవతలు దేవరాతుడు అనే రాజుకిచ్చారు. ఆ విల్లెక్కు పెట్టడం దేవతలకు, గంధర్వులకు, పన్నగులకు, కిన్నరులకు, రాక్షసులకు, యక్షులకు, వీరిలో ముఖ్యులైన వారి సమూహానికి సాధ్యపడదు. మనుష్యులకు అసలే చేతకాదు. రఘువంశ దీపమా ! నీవు ఆ మహాత్ముడి యజ్ఞాన్ని-అక్కడున్న దివ్యమైన, అమోఘమైన, శ్రేష్ఠమైన చాపాన్ని కీర్తి కరంగా చూడవచ్చు-పోదాం రమ్మ" ని అంటాడు.

తర్వాత వింటి వృత్తాంతాన్ని ఆయన వెంట వస్తున్న ఋషులు వివరిస్తారీ విధంగా: " కీర్తనీయ చరిత్రుడైన మిథిలాపతి ఒక గొప్ప యజ్ఞాన్ని శాస్త్ర ప్రకారం నిర్వర్తించి, దానితో దేవతలను తృప్తి పరిచి, ప్రతిఫలంగా ’సునాభం’ అనే దివ్య చాపాన్ని ఇమ్మని దేవతలను కోరాడు. ఆయన కోరినట్లే వారిచ్చి వెళ్లారు. అప్పటినుంచి ఆ చాపం ఆయన రాజగృహంలోనే వుంది. ప్రతిదినం గంధంతోను, పూలు-ధూపం-దీపం మొదలైన సామగ్రులతోను, అది పూజించబడుతున్నది".

తన వెనుక శ్రీరామ లక్ష్మణులు ప్రయాణానికి సన్నద్ధమౌతుండగా, విశ్వామిత్రుడు, సిద్ధాశ్రమాన్ని వదిలి హిమవత్పర్వతానికి పోతున్నానని అక్కడున్న వన దేవతలను సంబోధిస్తూ అంటాడు. అంటూనే, ఆశ్రమానికి ప్రదక్షిణ చేసి, ఉత్తర దిక్కుగా బయలుదేరాడు. ఆయన వెంట మునీంద్రులు, శ్రీరామ లక్ష్మణులు బయల్దేరారు. వనంలోని జింకలు, మృగాలు, చిలుకలు, ఇతర రకాల పక్షులు విశ్వామిత్రుడి వెంట వస్తుంటే-వాటిని చూసి ఆయన, వెనక్కు మరలి పొమ్మని మంచిమాటలతో నచ్చచెప్పి, మరలిపోయేటట్లు చేస్తాడు. దూర ప్రయాణం చేసిన పిదప, సూర్యుడు అస్తమించగానే, మునీశ్వరులు శోణ నదిలో స్నానం చేసి, సంధ్యావందనం చేసి, ఇతర సాయంకాల కాల కృత్యాలను నెరవేర్చుకున్నారు. ఆ సమయంలో విశ్వామిత్రుడి చుట్టూ చేరిన వారిలోని శ్రీరాముడు, తీగలతోను-చెట్లతోను అలంకరించబడిన ఆదేశం ఎవ్వరిదని వినేందుకు ఉత్సాహంగా వుందని అంటాడు. అందరూ వింటుండగా విశ్వామిత్రుడు ఆ దేశం కథను యదార్థంగా చెప్ప సాగాడు.

శిష్యుడు గురు వంశ పరంపరను-గురువు మహత్యాన్ని, అవశ్యం తెలుసుకోవాలి కనుక, విశ్వామిత్రుడు తన వంశ చరిత్రను తానే తెలిపాడు.అయితే, తన మహత్యాన్ని తానే చెప్పుకోకూడదు కాబట్టి, తన విషయాన్ని తెలిసిన ఇతరులతో చెప్పించాలన్న వుద్దేశంతో, ఆ విషయాలను శతానందుడు ద్వారా శ్రీరామ లక్ష్మణులు తెలుసుకోవడం జరిగింది వివరంగా.

పూర్వ కాలంలో నిర్విఘ్నంగా తపస్సు చేసినవాడు-బ్రహ్మ పుత్రుడు-కుచ్చితపు జనులను దండించే వాడు-లోకులకు, తనకు మేలుగలిగించే దానిని తెలిసిన వాడు-సాధు వశుడు-గొప్ప మహిమగలవాడైన నైకుశుడనేవాడుండే వాడు. మిక్కిలి సద్గుణాలు కలిగి-గొప్ప వంశంలో పుట్టిన రత్నం లాంటి విదర్భ రాజు కూతురుని తనకు భార్యగా చేసుకుని, నైకుశుడు తనతో సమానమైన నిర్మల గుణాలున్న నలుగురు కొడుకులను ఆమె గర్భంలో కన్నాడు. (కుశుడు బ్రహ్మ పుత్రుడైనా, ఆయన కొడుకులు క్షత్రియ స్త్రీకి జన్మించి, క్షత్రియ వృత్తిలో చరించారు కాబట్టి వారూ క్షత్రియులయ్యారు. రావణాసురుడు అలాంటి వాడే). నైకుశుడి నలుగురు కొడుకుల పేర్లు: కుశాంబుడు, కుశనాభుడు, ఆధూర్తరజసుడు, వసువు. వారందరు తేజోవంతులు-ఉత్సాహం, ధైర్యం గలవారు-అత శూరులు. కుశుడు బ్రహ్మ కొడుకైనా కుమారుల విషయంలో క్షత్రియ ధర్మాన్నే పాటించ దలచి, కొడుకులతో, పుణ్యమతిశయించే భూమి పరిపాలన చేయమని ఆదేశించాడు. కీర్తిమంతులైన ఆ నలుగురు, తండ్రి చెప్పినట్లే తమకు యోగ్యమైన ప్రదేశాలను ఎంచుకుని, న్యాయంగా-పరిశుద్ధంగా-ప్రజలు చెడిపోకుండా-ప్రీతితో-పరాక్రమంతో, జనులందరూ తమను గౌరవిస్తుంటే రాజులై రాజ్యమేలారు.

కుశాంబుడు తన పేరుమీద "కౌశాంబి" అనే నగరాన్ని, కుశనాభుడు "మహోదయం" అనే పట్టణాన్ని, ఆధూర్తరజసుడు "ధర్మారణ్యం" అనే నగరాన్ని, వసువు " గిరివ్రజ పురాన్ని కట్టించి, వాటిని తమ రాజ్యాలకు రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఆ నలుగురిలో వసువు పాలించిన గిరివ్రజ పురం రాజధానిగా వున్న ప్రదేశం ఇదే. ఐదు మహా పర్వతాలు ఈ ప్రదేశాన్ని చుట్టి కోట గోడల వలె రక్షిస్తుంటాయి. మగధ దేశంలో పుట్టిన శోణ నది ఈ పర్వతాల మధ్య రాజ్యలక్ష్మి ధరించిన ముత్యాల సరం లాగా ప్రవహిస్తుంటుంది. శోణ నది పడమటి ముఖంగా పారుతుంది. వసువు చేసిన ప్రయత్నాలవలన ఈ ప్రదేశం ఎంతో వృద్ధి చెందింది. ఇంద్ర వైభవంతో సమానమైన వైభవం కల కుశనాభుడు, సుందరి-చిరునవ్వులు చిందించేదైన "ఘృతాచి" ని పెళ్లి చేసుకుని, రూప-విలాస అతిశయం గలిగి, లోకమంతా గౌరవించే మంచి తేజస్సు-నిర్మల ప్రీతి కల వంద మంది కన్యలను కన్నాడు.

Saturday, September 4, 2021

సహజ కవచకుండలాలను ఒలిచి దేవేంద్రుడికి అర్పించిన కర్ణుడి త్యాగం ..... ఆస్వాదన-36 : వనం జ్వాలా నరసింహారావు

 సహజ కవచకుండలాలను ఒలిచి దేవేంద్రుడికి అర్పించిన కర్ణుడి త్యాగం

ఆస్వాదన-36

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధమ్ (05-09-2021)

పన్నెండు సంవత్సరాల పాండవుల అరణ్యవాసం పూర్తికావస్తున్న నేపధ్యంలో ఇంద్రుడు వారికి మేలు చేయాలన్న తలంపుతో కర్ణుడి సహజ కవచకుండలాలను అపహరించాలని పన్నాగం పన్నాడు. ఇంద్రుడి అభిప్రాయాన్ని తెలుసుకున్న సూర్య భగవానుడు ఆ విషయాన్ని కర్ణుడికి తెలియచేయడానికి బ్రాహ్మణ వేషంలో కర్ణుడి దగ్గరికి వచ్చాడు ఒకనాడు. కర్ణుడికి, ఆయన మేలుకోరి ఒక ఆంతరింగిక విషయాన్ని చెప్పడానికి వచ్చానని, సావధానంగా ఆలకించమని అన్నాడు. పాండవుల మీద విశేషమైన అభిమానం కల దేవేంద్రుడు కర్ణుడి కవచకుండలాలను మోసం చేసి హరిస్తాడని, బ్రాహ్మణ వేషధారిగా వచ్చి వాటిని దానం ఇవ్వమని అడుగుతాడని, అతడికి కవచకుండలాలను ఎట్టి పరిస్థితిలోను ఇవ్వవద్దని, ఏదో విధంగా మభ్యపెట్టి తప్పించుకొమ్మని, అలా కాకుండా సహజ కవచకుండలాలను ఇస్తే మృత్యుముఖంలో దూరినట్లే అని, జాగ్రత్తగా వుండమని సలహా ఇచ్చాడు సూర్యుడు.

తన శ్రేయస్సు కోరి బ్రాహ్మణుడు చెప్పిన మాటలను విన్న కర్ణుడు ఆయనెవరో చెప్పమని కోరాడు. బదులుగా తాను సూర్యుడినని, కర్ణుడికి కర్తవ్యాన్ని ఉపదేశించడానికి వచ్చానని అన్నాడు. అప్పుడు కర్ణుడు, బ్రాహ్మణులు అర్థిస్తే వెనకాడక తాను తన అసువులను సయితం సమర్పిస్తానని, ఇది తన ప్రతిజ్ఞని, అంతే కాకుండా దేవేంద్రుడంతటివాడు తన వద్దకు వచ్చి ‘దేహీ అని ప్రార్థిస్తే కవచకుండలాలను ఇవ్వకుండా ఎలా వుంటానని, అవి తనకు తృణప్రాయమని అన్నాడు. దేవేంద్రుడు యాచకుడిగా తనవద్దకు రావడం అంటే అది అతడి కీర్తికే లోటని అన్నాడు. అలాంటప్పుడు తన కీర్తి ముల్లోకాలలో వెలుగొందుతుందని చెప్పాడు. తనకు అపకీర్తికంటే మరణమే మేలన్నాడు. ఇంద్రుడే అడుగుతే తన కవచకుండలాలను ఇచ్చేస్తానని స్పష్టం చేశాడు సూర్యుడికి కర్ణుడు.

భవిష్యత్తులో అర్జునుడికి, కర్ణుడికి యుద్ధం జరుగుతుందని, ఆ యుద్ధంలో కవచకుండలాలు వుంటే ఆర్జునుడిని గెల్వ వచ్చని, లేకపోతే ఆపద కలుగుతుందని సూర్యుడు చెప్పాడు. కవచకుండలాలు లేకపోయినా తన దగ్గర పరశురాముడు, ద్రోణుడు ఇచ్చిన దివ్యాస్త్రాలున్నాయని, వాటితో ఆర్జునుడిని సంహరిస్తానని, తనను ఆశీర్వదించమని అన్నాడు కర్ణుడు. దేవేంద్రుడికి కవచకుండలాలు ఇవ్వడమే కర్ణుడి కృతనిశ్చయమైతే, బదులుగా అతడి దగ్గరున్న తిరుగులేని భయంకరమైన ‘శక్తి అనే ఆయుధాన్ని అడిగి తీసుకొమ్మని సూచించాడు సూర్యుడు. దాంతో శత్రువులను సులభంగా జయించవచ్చని చెప్పి సూర్యుడు అంతర్థానమయ్యాడు.     

కర్ణుడు సహజ కవచకుండలాలు కలిగి వుండడానికి ఒక దేవ రహస్యం వున్నది. పూర్వం కుంతిభోజుడి గృహానికి ఒకనాడు దుర్వాస మహర్షి అతిథిగా వచ్చి, ఆయన ఇంట్లో తనకు కొన్నాళ్లు నివసించాలని కోరిక కలిగిందన్నాడు. తనకు సహనంగా పరిచర్యలు చేసే ఏర్పాట్లు కావించమని చెప్పాడు. కుంతిభోజుడు దానికి అంగీకరించి తన కూతురైన పృథ (కుంతి) అనే పెండ్లికాని అమ్మాయిని ఆ మహర్షికి పరిచర్యలు చేయడానికి నియమించాడు. మహానుభావుడైన దుర్వాసుడిని సంతోషింపచేసి ధన్యురాలివి కమ్మని చెప్పాడు తండ్రి ఆమెకు. తన కూతురేమన్నా తెలియక తప్పులు చేస్తే క్షమించమని చెప్పి కుంతిని మహర్షికి అప్పచెప్పాడు. తన మేడనే దుర్వాసుడికి విడిదిగా ఏర్పాటు చేశాడు. తండ్రి చెప్పినట్లే కుంతీదేవి చిత్తశుద్ధితో అనునిత్యం దుర్వాస మహర్షిని భక్తి శ్రద్ధలతో సేవించింది. కుంతీదేవి ఓర్పును పరీక్షించాలని, మహర్షి ఎన్ని రకాల ఇబ్బందులు కలిగించినా, ఆమె అన్నిటినీ ఓర్చుకుని సపర్యలు చేసింది.

ఇలా ఒక సంవత్సర కాలం గడిచింది. కుంతి చేసిన శుశ్రూషకు సంతోషించిన దుర్వాసుడు ఆమెనేదైనా వరం కోరుకొమ్మన్నాడు. ఆమె తనకే వరం అక్కరలేదన్నప్పటికీ, తనంతటతానే ఒక గొప్ప వరం అనుగ్రహించాడు. ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని ఉపాసించి ఏ వేలుపును ఆహ్వానిస్తే ఆ వేలుపు ఆమె వద్దకు వచ్చి ఆమెకు వశుడవుతాడని చెప్పాడు. కొన్నాళ్లకు దుర్వాసుడు ఉపదేశించిన  మంత్రప్రభావం ఎటువంటిదో పరీక్షించాలని అనుకున్నది కుంతీదేవి. ఋతుస్నాత అయిన ఒకనాడు సూర్యుడిని చూసి మనస్సులో అనురాగం కలుగుతుంటే, ఆయనలాంటి సుందరరూపుడైన కుమారుడిని తనకు దయతో అనుగ్రహించమని తలపోసి, కుంతీదేవి దుర్వాసుడు ఉపదేశించిన మంత్రాన్ని జపించింది. వెంటనే సూర్యుడు కుంతి దగ్గరకు వచ్చాడు. వచ్చి, ఆమె కోరిక తీరుస్తానన్నాడు. భయపడ్డ కుంతీదేవి తాను కేవలం వేడుక కొరకు ఆయన్ను పిలిచానని, తనకాయనతో ఏపనీ లేదని, వెంటనే ఆకాశానికి పొమ్మని ప్రార్థించింది.

ఆమె మనసులో ఆలోచన తాను గ్రహించానని, కాబట్టి తన తోడిపొందుకు అంగీకరించమని, మహాతేజస్వి అయిన కొడుకు ఆమెకు జన్మిస్తాడని, తన మాట వినకపోతే ఆమెను, ఆమె తల్లితండ్రులను బూడిద చేస్తానని, దుర్వాసుడిని కూడా దహించి వేస్తానని అన్నాడు సూర్యుడు. తన కన్యాత్వానికి భంగం కలుగుతుందని ప్రాదేయపడ్డది కుంతి. తెలియక చేసిన తన తప్పును నేరంగా పరిగణించకుండా క్షమించమని అడిగింది. ఆమెకు ఎలాంటి అపవాదు రాదని, ఆమెకు మహాతేజస్వి అయిన కుమారుడు కలుగుతాడని చెప్పి సూర్యుడు కుంతి సమ్మతితో ఆమెతో సమాగం చేసి తృప్తి పొందాడు. ఆమెకు గర్భం కలిగేట్లు చేసి ఆకాశానికి వెళ్లాడు. కుంతి గర్భం పెరిగినా సూర్యుడి మహిమవల్ల ఒక్క దాదికి తప్ప ఎవరికీ ఆ విషయం తెలియలేదు. ఒకనాడు కుంతీదేవి ప్రసవించింది. అతడు సహజ కవచ కుండలాలతో, ప్రకృతి సిద్ధమైన చెవి పోగులతో ఆజానుబాహుడుగా వున్నాడు.

ఇలా పుట్టిన మగబిడ్డను చూసి, లోకాపనిందకు భయపడి. ఆ క్షణంలోనే తన దాదితో కలిసి ఆ శిశువును ఒక చక్కని పెట్టెలో భద్రంగా వుంచి, ఆ పెట్టెను ఒక తెప్పమీద పెట్టి, గట్టిగా తాళ్లతో కట్టి, అశ్వనదిలో విడిచి పెట్టింది. ఆ తరువాత చేసిన పనికి దుఃఖించింది. తన కుమారుడిని దీవించి విలపించింది. అంతఃపురం వచ్చి ఎప్పటిలాగే జీవితం గడిపింది. శిశువుతో కూడిన ఆ పెట్టె ఆశ్వనదీ ప్రవాహ వేగంవల్ల చర్మణ్యతీ నదిలోకి చేరింది. అక్కడి నుండి యమునానదికి చేరి, యమున నుండి గంగానదిని చేరింది. గంగానది నుండి పంపానగర సమీపానికి వస్తున్న సమయంలో ధృతరాష్ట్రుడి స్నేహితుడైన అతిరథుడు అనే సూతుడు గంగలో సతీసమేతంగా జలక్రీడలు ఆడుతుంటే ఆ పెట్టె అతడి కంటబడింది. పెట్టె తెరిచి చూస్తే మగ బిడ్డ కనిపించాడు. సంతానంలేని అతిరథుడు సంతోషంతో ఆ బిడ్దను దైవానుగ్రహంగా భావించి తన భార్యైన రాధకు ఇచ్చాడు.

ఆ దంపతులు తమ ఇంటికి పోయి సూత కులాచారం ప్రకారం ఆ శిశువుకు పుట్టినప్పుడు చేసే సంస్కారం చేసి, సహజ కవచకుండలాలు కలిగున్నందున కర్ణుడు అని పేరు పెట్టారు. ‘వసుసేనుడు అన్న పేరు కూడా పెట్టారు. ఈ వృత్తాంతమంతా కుంతి తన వేగుల వాళ్ల ద్వారా తెలుసుకుంది. అతిరథుడు తన కొడుకు కర్ణుడిని ద్రోణాచార్యుడి దగ్గర అస్త్ర విద్యను అభ్యసించడానికి పంపాడు. కర్ణుడు కృపాచార్యుడి దగ్గర, పరశురాముడి దగ్గర కూడా విలువిద్య నేర్చుకున్నాడు. గొప్ప-గొప్ప అస్త్రాలను సంపాదించాడు. కాలక్రమేనా కర్ణుడికి దుర్యోధనుడితో గాఢమైన స్నేహం ఏర్పడింది.

కర్ణుడి కవచకుండలాలను అపహరించడానికి దేవేంద్రుడు (సూర్యుడు చెప్పినట్లే) ఒకనాడు బ్రాహ్మణ వేషంలో కర్ణుడి దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో కర్ణుడు సూర్యోపాసన చేస్తున్నాడు. తనవద్దకు ఆ సమయంలో వచ్చిన బ్రాహ్మణులకు వారు కోరిన ద్రవ్యాలను ఇస్తున్నాడు. దేవేంద్రుడు ‘బిక్షాం దేహి అని అడిగాడు. ఏంకావాలో కోరుకొమ్మన్నాడు కర్ణుడు. ఆయన చెవిపోగులను, కవచాన్నీ దానం చేయమని కోరాడు బ్రాహ్మణుడు. అవి ఉపయోగంలేని వస్తువులని చెప్పాడు కర్ణుడు. తనకు కవచకుండలాలే కావాలని పట్టుబట్టాడు బ్రాహ్మణుడు. పుట్టుకతో వున్న అవి లేకపోతే యుద్ధంలో తనకు పరాజయం కలుగుతుంది కాబట్టి వాటిని ఇవ్వలేనని అన్నాడు కర్ణుడు. తన అంగరాజ్యం ఇస్తానని కర్ణుడు అన్నప్పటికీ బ్రాహ్మణుడు తన పట్టు వీడలేదు.

అతడు దేవేంద్రుడు అని తాను గుర్తు పట్టానన్నాడు కర్ణుడు. ఇలా తనను వంచించడం ముల్లోకాధిపతైన అతడికి భావ్యమా? అని ప్రశ్నించాడు కర్ణుడు. తన కవచకుండలాలకు బదులుగా సమస్త శత్రువులను చంపగలిగిన తిరుగులేని ‘శక్తి అనే ఇంద్రుడి ఆయుధాన్ని తనకివ్వమన్నాడు కర్ణుడు. ఒకే ఒక్క శత్రువును మాత్రమే చంపి తిరిగి ‘శక్తి తనదగ్గరికి వస్తుందని చెప్పి దాన్ని ఇచ్చాడు ఇంద్రుడు. అర్జునుడొక్కడే తనకు శత్రువని చెప్పి ‘శక్తి ని తీసుకుని, తన చర్మాన్ని ఒలిచి, సహజ కవచకుండలాలను ఇంద్రుడికి ఇచ్చాడు కర్ణుడు.              

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, సప్తమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)