Saturday, September 4, 2021

సహజ కవచకుండలాలను ఒలిచి దేవేంద్రుడికి అర్పించిన కర్ణుడి త్యాగం ..... ఆస్వాదన-36 : వనం జ్వాలా నరసింహారావు

 సహజ కవచకుండలాలను ఒలిచి దేవేంద్రుడికి అర్పించిన కర్ణుడి త్యాగం

ఆస్వాదన-36

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధమ్ (05-09-2021)

పన్నెండు సంవత్సరాల పాండవుల అరణ్యవాసం పూర్తికావస్తున్న నేపధ్యంలో ఇంద్రుడు వారికి మేలు చేయాలన్న తలంపుతో కర్ణుడి సహజ కవచకుండలాలను అపహరించాలని పన్నాగం పన్నాడు. ఇంద్రుడి అభిప్రాయాన్ని తెలుసుకున్న సూర్య భగవానుడు ఆ విషయాన్ని కర్ణుడికి తెలియచేయడానికి బ్రాహ్మణ వేషంలో కర్ణుడి దగ్గరికి వచ్చాడు ఒకనాడు. కర్ణుడికి, ఆయన మేలుకోరి ఒక ఆంతరింగిక విషయాన్ని చెప్పడానికి వచ్చానని, సావధానంగా ఆలకించమని అన్నాడు. పాండవుల మీద విశేషమైన అభిమానం కల దేవేంద్రుడు కర్ణుడి కవచకుండలాలను మోసం చేసి హరిస్తాడని, బ్రాహ్మణ వేషధారిగా వచ్చి వాటిని దానం ఇవ్వమని అడుగుతాడని, అతడికి కవచకుండలాలను ఎట్టి పరిస్థితిలోను ఇవ్వవద్దని, ఏదో విధంగా మభ్యపెట్టి తప్పించుకొమ్మని, అలా కాకుండా సహజ కవచకుండలాలను ఇస్తే మృత్యుముఖంలో దూరినట్లే అని, జాగ్రత్తగా వుండమని సలహా ఇచ్చాడు సూర్యుడు.

తన శ్రేయస్సు కోరి బ్రాహ్మణుడు చెప్పిన మాటలను విన్న కర్ణుడు ఆయనెవరో చెప్పమని కోరాడు. బదులుగా తాను సూర్యుడినని, కర్ణుడికి కర్తవ్యాన్ని ఉపదేశించడానికి వచ్చానని అన్నాడు. అప్పుడు కర్ణుడు, బ్రాహ్మణులు అర్థిస్తే వెనకాడక తాను తన అసువులను సయితం సమర్పిస్తానని, ఇది తన ప్రతిజ్ఞని, అంతే కాకుండా దేవేంద్రుడంతటివాడు తన వద్దకు వచ్చి ‘దేహీ అని ప్రార్థిస్తే కవచకుండలాలను ఇవ్వకుండా ఎలా వుంటానని, అవి తనకు తృణప్రాయమని అన్నాడు. దేవేంద్రుడు యాచకుడిగా తనవద్దకు రావడం అంటే అది అతడి కీర్తికే లోటని అన్నాడు. అలాంటప్పుడు తన కీర్తి ముల్లోకాలలో వెలుగొందుతుందని చెప్పాడు. తనకు అపకీర్తికంటే మరణమే మేలన్నాడు. ఇంద్రుడే అడుగుతే తన కవచకుండలాలను ఇచ్చేస్తానని స్పష్టం చేశాడు సూర్యుడికి కర్ణుడు.

భవిష్యత్తులో అర్జునుడికి, కర్ణుడికి యుద్ధం జరుగుతుందని, ఆ యుద్ధంలో కవచకుండలాలు వుంటే ఆర్జునుడిని గెల్వ వచ్చని, లేకపోతే ఆపద కలుగుతుందని సూర్యుడు చెప్పాడు. కవచకుండలాలు లేకపోయినా తన దగ్గర పరశురాముడు, ద్రోణుడు ఇచ్చిన దివ్యాస్త్రాలున్నాయని, వాటితో ఆర్జునుడిని సంహరిస్తానని, తనను ఆశీర్వదించమని అన్నాడు కర్ణుడు. దేవేంద్రుడికి కవచకుండలాలు ఇవ్వడమే కర్ణుడి కృతనిశ్చయమైతే, బదులుగా అతడి దగ్గరున్న తిరుగులేని భయంకరమైన ‘శక్తి అనే ఆయుధాన్ని అడిగి తీసుకొమ్మని సూచించాడు సూర్యుడు. దాంతో శత్రువులను సులభంగా జయించవచ్చని చెప్పి సూర్యుడు అంతర్థానమయ్యాడు.     

కర్ణుడు సహజ కవచకుండలాలు కలిగి వుండడానికి ఒక దేవ రహస్యం వున్నది. పూర్వం కుంతిభోజుడి గృహానికి ఒకనాడు దుర్వాస మహర్షి అతిథిగా వచ్చి, ఆయన ఇంట్లో తనకు కొన్నాళ్లు నివసించాలని కోరిక కలిగిందన్నాడు. తనకు సహనంగా పరిచర్యలు చేసే ఏర్పాట్లు కావించమని చెప్పాడు. కుంతిభోజుడు దానికి అంగీకరించి తన కూతురైన పృథ (కుంతి) అనే పెండ్లికాని అమ్మాయిని ఆ మహర్షికి పరిచర్యలు చేయడానికి నియమించాడు. మహానుభావుడైన దుర్వాసుడిని సంతోషింపచేసి ధన్యురాలివి కమ్మని చెప్పాడు తండ్రి ఆమెకు. తన కూతురేమన్నా తెలియక తప్పులు చేస్తే క్షమించమని చెప్పి కుంతిని మహర్షికి అప్పచెప్పాడు. తన మేడనే దుర్వాసుడికి విడిదిగా ఏర్పాటు చేశాడు. తండ్రి చెప్పినట్లే కుంతీదేవి చిత్తశుద్ధితో అనునిత్యం దుర్వాస మహర్షిని భక్తి శ్రద్ధలతో సేవించింది. కుంతీదేవి ఓర్పును పరీక్షించాలని, మహర్షి ఎన్ని రకాల ఇబ్బందులు కలిగించినా, ఆమె అన్నిటినీ ఓర్చుకుని సపర్యలు చేసింది.

ఇలా ఒక సంవత్సర కాలం గడిచింది. కుంతి చేసిన శుశ్రూషకు సంతోషించిన దుర్వాసుడు ఆమెనేదైనా వరం కోరుకొమ్మన్నాడు. ఆమె తనకే వరం అక్కరలేదన్నప్పటికీ, తనంతటతానే ఒక గొప్ప వరం అనుగ్రహించాడు. ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని ఉపాసించి ఏ వేలుపును ఆహ్వానిస్తే ఆ వేలుపు ఆమె వద్దకు వచ్చి ఆమెకు వశుడవుతాడని చెప్పాడు. కొన్నాళ్లకు దుర్వాసుడు ఉపదేశించిన  మంత్రప్రభావం ఎటువంటిదో పరీక్షించాలని అనుకున్నది కుంతీదేవి. ఋతుస్నాత అయిన ఒకనాడు సూర్యుడిని చూసి మనస్సులో అనురాగం కలుగుతుంటే, ఆయనలాంటి సుందరరూపుడైన కుమారుడిని తనకు దయతో అనుగ్రహించమని తలపోసి, కుంతీదేవి దుర్వాసుడు ఉపదేశించిన మంత్రాన్ని జపించింది. వెంటనే సూర్యుడు కుంతి దగ్గరకు వచ్చాడు. వచ్చి, ఆమె కోరిక తీరుస్తానన్నాడు. భయపడ్డ కుంతీదేవి తాను కేవలం వేడుక కొరకు ఆయన్ను పిలిచానని, తనకాయనతో ఏపనీ లేదని, వెంటనే ఆకాశానికి పొమ్మని ప్రార్థించింది.

ఆమె మనసులో ఆలోచన తాను గ్రహించానని, కాబట్టి తన తోడిపొందుకు అంగీకరించమని, మహాతేజస్వి అయిన కొడుకు ఆమెకు జన్మిస్తాడని, తన మాట వినకపోతే ఆమెను, ఆమె తల్లితండ్రులను బూడిద చేస్తానని, దుర్వాసుడిని కూడా దహించి వేస్తానని అన్నాడు సూర్యుడు. తన కన్యాత్వానికి భంగం కలుగుతుందని ప్రాదేయపడ్డది కుంతి. తెలియక చేసిన తన తప్పును నేరంగా పరిగణించకుండా క్షమించమని అడిగింది. ఆమెకు ఎలాంటి అపవాదు రాదని, ఆమెకు మహాతేజస్వి అయిన కుమారుడు కలుగుతాడని చెప్పి సూర్యుడు కుంతి సమ్మతితో ఆమెతో సమాగం చేసి తృప్తి పొందాడు. ఆమెకు గర్భం కలిగేట్లు చేసి ఆకాశానికి వెళ్లాడు. కుంతి గర్భం పెరిగినా సూర్యుడి మహిమవల్ల ఒక్క దాదికి తప్ప ఎవరికీ ఆ విషయం తెలియలేదు. ఒకనాడు కుంతీదేవి ప్రసవించింది. అతడు సహజ కవచ కుండలాలతో, ప్రకృతి సిద్ధమైన చెవి పోగులతో ఆజానుబాహుడుగా వున్నాడు.

ఇలా పుట్టిన మగబిడ్డను చూసి, లోకాపనిందకు భయపడి. ఆ క్షణంలోనే తన దాదితో కలిసి ఆ శిశువును ఒక చక్కని పెట్టెలో భద్రంగా వుంచి, ఆ పెట్టెను ఒక తెప్పమీద పెట్టి, గట్టిగా తాళ్లతో కట్టి, అశ్వనదిలో విడిచి పెట్టింది. ఆ తరువాత చేసిన పనికి దుఃఖించింది. తన కుమారుడిని దీవించి విలపించింది. అంతఃపురం వచ్చి ఎప్పటిలాగే జీవితం గడిపింది. శిశువుతో కూడిన ఆ పెట్టె ఆశ్వనదీ ప్రవాహ వేగంవల్ల చర్మణ్యతీ నదిలోకి చేరింది. అక్కడి నుండి యమునానదికి చేరి, యమున నుండి గంగానదిని చేరింది. గంగానది నుండి పంపానగర సమీపానికి వస్తున్న సమయంలో ధృతరాష్ట్రుడి స్నేహితుడైన అతిరథుడు అనే సూతుడు గంగలో సతీసమేతంగా జలక్రీడలు ఆడుతుంటే ఆ పెట్టె అతడి కంటబడింది. పెట్టె తెరిచి చూస్తే మగ బిడ్డ కనిపించాడు. సంతానంలేని అతిరథుడు సంతోషంతో ఆ బిడ్దను దైవానుగ్రహంగా భావించి తన భార్యైన రాధకు ఇచ్చాడు.

ఆ దంపతులు తమ ఇంటికి పోయి సూత కులాచారం ప్రకారం ఆ శిశువుకు పుట్టినప్పుడు చేసే సంస్కారం చేసి, సహజ కవచకుండలాలు కలిగున్నందున కర్ణుడు అని పేరు పెట్టారు. ‘వసుసేనుడు అన్న పేరు కూడా పెట్టారు. ఈ వృత్తాంతమంతా కుంతి తన వేగుల వాళ్ల ద్వారా తెలుసుకుంది. అతిరథుడు తన కొడుకు కర్ణుడిని ద్రోణాచార్యుడి దగ్గర అస్త్ర విద్యను అభ్యసించడానికి పంపాడు. కర్ణుడు కృపాచార్యుడి దగ్గర, పరశురాముడి దగ్గర కూడా విలువిద్య నేర్చుకున్నాడు. గొప్ప-గొప్ప అస్త్రాలను సంపాదించాడు. కాలక్రమేనా కర్ణుడికి దుర్యోధనుడితో గాఢమైన స్నేహం ఏర్పడింది.

కర్ణుడి కవచకుండలాలను అపహరించడానికి దేవేంద్రుడు (సూర్యుడు చెప్పినట్లే) ఒకనాడు బ్రాహ్మణ వేషంలో కర్ణుడి దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో కర్ణుడు సూర్యోపాసన చేస్తున్నాడు. తనవద్దకు ఆ సమయంలో వచ్చిన బ్రాహ్మణులకు వారు కోరిన ద్రవ్యాలను ఇస్తున్నాడు. దేవేంద్రుడు ‘బిక్షాం దేహి అని అడిగాడు. ఏంకావాలో కోరుకొమ్మన్నాడు కర్ణుడు. ఆయన చెవిపోగులను, కవచాన్నీ దానం చేయమని కోరాడు బ్రాహ్మణుడు. అవి ఉపయోగంలేని వస్తువులని చెప్పాడు కర్ణుడు. తనకు కవచకుండలాలే కావాలని పట్టుబట్టాడు బ్రాహ్మణుడు. పుట్టుకతో వున్న అవి లేకపోతే యుద్ధంలో తనకు పరాజయం కలుగుతుంది కాబట్టి వాటిని ఇవ్వలేనని అన్నాడు కర్ణుడు. తన అంగరాజ్యం ఇస్తానని కర్ణుడు అన్నప్పటికీ బ్రాహ్మణుడు తన పట్టు వీడలేదు.

అతడు దేవేంద్రుడు అని తాను గుర్తు పట్టానన్నాడు కర్ణుడు. ఇలా తనను వంచించడం ముల్లోకాధిపతైన అతడికి భావ్యమా? అని ప్రశ్నించాడు కర్ణుడు. తన కవచకుండలాలకు బదులుగా సమస్త శత్రువులను చంపగలిగిన తిరుగులేని ‘శక్తి అనే ఇంద్రుడి ఆయుధాన్ని తనకివ్వమన్నాడు కర్ణుడు. ఒకే ఒక్క శత్రువును మాత్రమే చంపి తిరిగి ‘శక్తి తనదగ్గరికి వస్తుందని చెప్పి దాన్ని ఇచ్చాడు ఇంద్రుడు. అర్జునుడొక్కడే తనకు శత్రువని చెప్పి ‘శక్తి ని తీసుకుని, తన చర్మాన్ని ఒలిచి, సహజ కవచకుండలాలను ఇంద్రుడికి ఇచ్చాడు కర్ణుడు.              

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, సప్తమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment