ఆదర్శ యక్షప్రశ్నలకు ఆదర్శ సమాధానాలు చెప్పిన ధర్మరాజు
‘విశ్వసాహితీజగత్తులో యక్షప్రశ్నలు నిరుపమానాలు’
ఆస్వాదన-37
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (12-09-2021)
అరణ్యవాసంలో
మార్కండేయ మహర్షి ద్వారా అనేక రకాల పుణ్య కథలను విన్న పాండవులు మళ్లీ ద్వైతవనానికి
తిరిగి వచ్చారు. అక్కడ వున్న సందర్భంలో ఒకనాడు ఒక బ్రాహ్మణుడు ధర్మరాజు దగ్గరికి
ఆదుర్దాగా వచ్చాడు. తన అరణిని (అగ్నిని చేకూర్చే సాధనం) ఒక చెట్టు కొమ్మకు
వ్రేలాడకట్టానని, దాన్ని ఒక లేడి వచ్చి తన కొమ్ముకు తగిలించుకుని పరుగు
లంకించుకుని పారిపోయిందని, తన నిత్యానుష్టానానికి అరణి చాలా అవసరమని, తన అరణిని తనకు తెప్పించి ఇవ్వమని
ప్రార్థించాడు ధర్మరాజును. వెంటనే ధర్మరాజు విల్లు ధరించి తమ్ములు తోడురాగా లేడిని
వెంబడించారు. ఎన్ని బాణాలు ప్రయోగించినా అవేవీ ఆ లేడిని చేరలేదు. తాకనూ లేదు.
ఆ లేడి
పాండవులను ముప్పుతిప్పలు పెట్టి, తిప్పీ-తిప్పి, ఒక భయంకరమైన అడవిలో కనిపించకుండా
మాయమైపోయింది. పాండవులు తమ ప్రయత్నం వ్యర్థమైనందుకు విచారించారు. అలసిపోయి ఒక
చెట్టునీడన చేరి విశ్రమించి, తమ
కష్టాలను నెమరేసుకున్నారు. సుఖదుఃఖాలకు కారణం పూర్వజన్మ కర్మే అని ధర్మరాజు అంటే, మాయాద్యూతంనాడే ధృతరాష్ట్రుడి కొడుకులను
సంహరించినట్లయితే ఈ కష్టాలు రాకపోయేవని భీముడన్నాడు. ఇలా అన్నదమ్ములు తమకు తోచిన
విధంగా మాట్లాడుకుంటూ వుండగా సమీపంలో ఎక్కడైనా తాగడానికి మంచి నీరు దొరుకుతుందేమో
చూడమని నకులుడికి చెప్పాడు ధర్మరాజు. చెట్టెక్కి చూసిన నకులుడు దగ్గరలోనే
వున్నాయని నీళ్లు అనగానే,
అక్కడికి వెళ్లి ఆయన తాగి సోదరులకు నీళ్లు తెమ్మని తమ్ముడిని ఆదేశించాడు ధర్మరాజు.
నకులుడు
అన్నగారి ఆదేశం మేరకు సమీపంలోని ఆ తటాకానికి పోయి అందులోని నీళ్లను తాగడానికి
సిద్ధమయ్యాడు. అంతట ఒక అశరీర భూతం ఇలా అన్నది. ‘ఈ చెరువు నాది. ఇందులో నీళ్లు
తాగాలనుకుంటే నేనడిగే ప్రశ్నలకు జవాబు చెప్పు’. ఆ హెచ్చరికను చులక చేసి నకులుడు ఆ చెరువులో
నీళ్ళను తాగి వెంటనే స్పృహను కోల్పోయి, తటాకం ఒడ్డున చైతన్యం లేకుండా
పడిపోయాడు. నకులుడు రావడం ఆలస్యం కావడంతో సహదేవుడిని పంపాడు ధర్మరాజు. అతడికి కూడా
నకులుడికి అయినట్లే అయింది. ఆ తరువాత అన్నగారి ఆదేశానుసారం తటాకానికి వెళ్లిన
అర్జునుడికి, భీముడికి కూడా అలాగే జరిగింది. నీరు
తేవడానికి పోయిన తమ్ములెవరూ తిరిగి రాకపోవడంతో, చివరకు ధర్మరాజు స్వయంగా, వారు వెళ్ళిన దారిని బట్టి పోయాడు. తమ్ములను
అన్వేషిస్తూ ఆ కొలను చేరాడు. అక్కడ స్పృహతప్పి వున్న తన తమ్ములను చూశాడు.
వారికలా ఎందుకు
జరిగిందా అని పరిపరి విధాల ఆలోచిస్తూ, దాహానికి తాళజాలక ధర్మరాజు ఆ కొలనులోకి దిగాడు. అతడిని నీళ్లు
తాగొద్దని వారిస్తూ మునుపటి లాగానే అశరీర భూతం ధర్మరాజును హెచ్చరించింది. తాను ఒక
కొంగనని, ఆ సరోవరం తన ఆస్తని, ఆయన తమ్ములు తన హెచ్చరిక లక్ష్యం చేయలేదని, వద్దన్నా నీళ్లు తాగి ప్రాణాలను కోల్పోయారని, ఆయన కూడా వినకుండా నీళ్లు తాగితే అదే దుర్గతి
పడుతుందని, తానడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి అప్పుడు సరోవరంలోని నీరు
తాగమని అన్నది ఆ అశరీర భూతం. అలా మాట్లాడుతున్నది కొంగ కాదని, ఎవరో దేవత కావచ్చని, మామూలు వారికి తన తమ్ములను గెలవడం సాధ్యపడదని, నిజం చెప్పమని అడిగాడు ధర్మరాజు. జవాబుగా ఆ
అశరీర భూతం ఒక భయంకరాకారంలో, దేదీప్యమానమైన వర్చస్సుతో, ధర్మరాజు ముందు
ప్రత్యక్షమై తాను ఒక యక్షనాయకుడిని అని చెప్పాడు. తాను వేసే ప్రశ్నలకు సముచితమైన
సమాధానాలు చెప్పమన్నాడు.
(యక్ష ప్రశ్నల
పూర్వ రంగాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు గారు ఇలా రాశారు:
‘అరణ్యవాసం ఒక సువిశాలమైన విశ్వ విద్యాలయం కావచ్చు. అక్కడ విజ్ఞానార్జన చేయవచ్చు.
ప్రకృతిని మించిన పాఠశాల లేదు. విపద్దశను మించిన విశ్వ విద్యాలయం లేదు. పాండవులు
పన్నెండు సంవత్సరాలు నిరంతర జిజ్ఞాసువులై అరణ్య విశ్వ విద్యాలయంలో అంతేవాసులయ్యారు.
అక్కడ ఉపన్యాసకులు మార్కండేయాది మహర్షులు. ధర్మరాజు ఆదర్శ విద్యార్థిగా వనవాసాన్ని
జ్ఞానుల సన్నిధిలో గడిపాడు. విద్యాభ్యాసం చివర జరగాల్సింది విద్యాపరీక్ష. అవే
యక్షప్రశ్నలు. అది ఆదర్శ ప్రశ్నాపత్రం. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలిచ్చి ధర్మరాజు
విజ్ఞాన పట్టభద్రుడయ్యాడు’.
‘మహాభారతంలో
తరతరాల మేధావులను ఉర్రూతలూగించిన ఘట్టాలలో ఎన్నదగింది యక్షప్రశ్నల ఘట్టం. ప్రశ్న
పరంపర అడిగింది యక్షరూపాన వున్న యమధర్మరాజు. సమాధానాలు చెప్పింది ధర్మరాజు. ప్రశ్నలకు
సమాధానం చెప్పే అధికారం ధర్మరాజుకు రావడానికి కారణం ఆయన పన్నెండు సంవత్సరాలు అరణ్య
విశ్వ విద్యాలయంలో జిజ్ఞాసువుగా విద్యాభ్యాసం చేయడమే! యక్షప్రశ్నల ఘట్టం అతడికి
స్నాతక పరీక్ష. పరీక్షాధికారి సాక్షాత్తు యమధర్మరాజే. పన్నెండు సంవత్సరాలు
ధర్మరాజు మహర్షులకు అంతులేని ప్రశ్నలను వేశాడు. సమాధానం చెప్పే వంతు ఇప్పుడు ధర్మరాజుకు
వచ్చింది. ఇది అతడికి అసిధారావ్రతం. అన్నీ చిక్కుముడి ప్రశ్నలే. అడిగిన యక్షుడికి
సముచిత సమాధానాలు తెలుసు. ఆదర్శ ప్రశ్నలకు ఆదర్శ సమాధానాలు ఇందులో వున్నాయి.
విశ్వసాహితీజగత్తులో యక్షప్రశ్నలు నిరుపమానాలు’).
ఇక యక్ష, ధర్మరాజుల ప్రశ్నోత్తరాలు ఇలా వున్నాయి:
ప్రశ్న: సూర్యుడిని నడిపేది ఏది? సూర్యుడిని సేవించి తిరిగేవారెవరు? సూర్యుడు దేనివల్ల అస్తమిస్తాడు? సూర్యుడికి ఆధారమైనది ఏది?
జవాబు: సూర్యుడిని బ్రహ్మం నడుపుతుంది. సూర్యుడిని
సేవించి తిరిగేవారు వేల్పులు. సూర్యుడు ధర్మం వల్ల అస్తమిస్తాడు. ఆ మహాత్ముడికి
ఆధారం సత్యం.
ప్రశ్న: దేనివల్ల
శ్రోత్రియుడు ఔతాడు? దేనివల్ల పురుషుడు గొప్ప మహిమను
ఒప్పిదంగా పడయగలుగుతాడు?
దేనివల్ల సాయం పొందినవాడు ఔతాడు?
దేనివల్ల బుద్ధిమంతుడు ఔతాడు?
జవాబు: వేదాభ్యాసం వల్ల శ్రోత్రియుడు కాగలడు.
నిరుపమానమైన తపస్సువల్ల గొప్ప ప్రభావం సిద్దిస్తుంది. ధైర్యం వల్ల సాయం పొందుతాడు.
పెద్దల పరిచర్యవలన బుద్ధిమంతుడు ఔతాడు.
ప్రశ్న: దేనివల్ల బ్రాహ్మణుడు దివ్యత్వాన్ని
సాధిస్తాడు? బ్రాహ్మణుడికి నిర్మలత్వం ఎలా
ఏర్పడుతుంది? మాలిన్యం ఎట్లా దాపురిస్తుంది? దేనివల్ల బ్రాహ్మణుడు మర్త్యుడు ఔతాడు?
జవాబు: బ్రాహ్మణుడు వేద పఠనం వల్ల దివ్యత్వం
ఆర్జిస్తాడు. మిక్కుటమైన నిష్టవల్ల సాదుభావం ఆర్జిస్తాడు. ఎన్నదగిన సౌశీల్యాన్ని
వదిలితే అసాధువు ఔతాడు. శుచిత్వాన్ని వీడి మృత్యు భయం చెంది మర్త్యుడు ఔతాడు.
ప్రశ్న: జీవన్మృతుడు ఎవడు?
జవాబు: దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు, సేవకులకు మొదలైనవారికి పెట్టకుండా తాను భోజనం
చేసేవాడు బతికి వుండగానే మరణించినవాడితో సమానుడు.
ప్రశ్న: భూమికంటే బరువు ఏది? ఆకాశం కంటే నిడివి కలది ఏది? గాలికంటే వేగంగా పోగలిగింది ఏది? గడ్డికంతే విరివిగా పెరిగేది ఏది?
జవాబు: భూమికంటే బరువైనది కన్నతల్లి. ఆకాశం కంటే
పొడుగు తండ్రి. గాలికంటే వేగం కలది మనస్సు. తృణసమూహం కంటే విరివైనది చింత.
ప్రశ్న: నిద్రించి కూడా కన్ను మూయనిది ఏది? జన్మించి కూడా చైతన్యం లేనిది ఏది? రూపం వుంది కూడా హృదయం లేనిది ఏది? వేగం వల్ల అతిశయించేది ఏది?
జవాబు: చేప నిద్రించి కూడా నేత్రాలు మూయాడు. గుడ్డు
జన్మించి కూడా ప్రాణం లేనిదే. రాయికి రూపం వున్నా హృదయం లేదు. ఏరు వేగం వల్ల
వర్ధిల్లుతుంది.
ప్రశ్న: బాటసారికి, రోగికి, గృహస్థుడికి, మరణించినవాడికి చుట్టాలెవ్వరు?
జవాబు: సార్థం (అప్పుడప్పుడు
మాత్రమే పయనించేది), వైద్యుడు,
మంచిబ్యార్య, చేసిన ధర్మం.
ప్రశ్న: ధర్మానికి కుదురు ఏది? కీర్తికి ఆధారం ఏది? స్వర్గానికి సరైన మార్గం ఏది? సుఖానికి నెలవు ఏది?
జవాబు: దాక్షిణ్యం ధర్మానికి కుదురు. దానం కీర్తికి
ఆధారం. స్వత్యం స్వర్గానికి ద్వారం. శీలం సమస్త సుఖాలకు నెలవు.
ప్రశ్న: నరుడికి ఆత్మ ఎవరు? అతడికి దైవికంగా ఏర్పడే చుట్టం ఎవరు? అతడు బతుకును ఎలా నిర్వహిస్తాడు? అతడు ఏవిధంగా మంచిని పొందుతాడు?
జవాబు: నరుడికి ఆత్మ పుత్రుడు. అతడికి దైవికమైన
చుట్టం భార్య. అతడికి బతుకు ప్రసాదించేది మేఘుడు. అతడికి గొప్పదనం ఇచ్చేది దానం.
ప్రశ్న: ధర్మాలన్నిటిలోను గొప్పదైన ధర్మం ఏది? ఏది సతతం పరిపూర్ణంగా ఫలితాన్ని ఇస్తుంది? ఏది వదులుతే సంతోషం చేకూరుతుంది? ఎవరితోడి పొత్తు ఎప్పుడూ చెడదు?
జవాబు: అహింస అన్ని ధర్మాలలోను మేటి ధర్మం. యజ్ఞం
ఎల్లప్పుడూ పంటనిచ్చే కార్యం. అహంభావం పోతే సంతోషం కలుగుతుంది. సజ్జన సహవాసం
ఎప్పుడూ భగ్నం కాదు.
ప్రశ్న: లోకంలోని ప్రజలను ఆదుకుని సాయం చేసేవావారెవరు? దేనివల్ల నీరు, అన్నం లభిస్తాయి? విషం అంటే ఏమిటి? పితృతర్పణాలకు అనుకూలమైన కాలం ఏది?
జవాబు: ఈ సృష్టి సమస్తానికి దిక్కైనవారు సజ్జనులు.
ఆకాశం నీటికి, భూమి అన్నానికి పుట్టే నెలవులు.
బ్రాహ్మణుడి ధనం విషంతో సమానం. బ్రాహ్మణులరాక పితృతర్పణాలకు అనువైన కాలం.
ప్రశ్న: దేనిని వదలిపెట్టితే మానవుడు సర్వజనాలకు
ఇష్టుడవుతాడు? నిశ్శోకుడు (దుఃఖం లేనివాడు) ఔతాడు? సంపన్నుడు ఔతాడు? సౌఖ్యం కలవాడు ఔతాడు?
జవాబు: గర్వం విడనాడితే అందరికీ ఇష్టుడు కాగలడు.
కోపం విడనాడితే శోకంపాలు కాడు. లోభం వదిలి పెట్టితే సంపన్నుడు ఔతాడు. తృష్ణ వర్జిస్తే సుఖవంతుడు ఔతాడు.
ప్రశ్న: పురుషుడు అనదగినవాడు ఎవ్వడు? సర్వధని-సకల
సంపదలు కలవాడు ఎవడు?
జవాబు: భూమ్యాకాశాలను ఆవరించి ఎవ్వడి కీర్తివైభవం
మిరుమిట్లు కొలుపుతూ విస్తరిస్తుందో అలాంటి మహానుభావుడే పురుష శబ్దంతో
పిలువదగినవాడు. ప్రియం,
అప్రియం, సుఖం, దుఃఖం, జరిగిన కార్యాలు, జరగబోయే కార్యాలు, ఎవరికీ
సమానమో అలాంటి మహానుభావుడు సర్వధని అని చెప్పవచ్చు.
ఇలా
యక్షుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ ధర్మరాజు చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెందిన
యక్షుడు ఆయన తమ్ములలో ఒకడి ప్రాణాలు ఇస్తాను అంటాడు. నకులుడిని బతికించమని కోరాడు
ధర్మరాజు. ఎందుకలా కోరావని అడుగుతే,
కుంతి కొడుకుల్లో తానున్నానని,
మాద్రి కొడుకుల్లో ఒకడైన నకులుడిని బతికించమని అడిగానని చెప్పాడు. ఆ ఆమాటలు విన్న
యక్షుడు ధర్మరాజు ధర్మజ్ఞానానికి మెచ్చుకున్నానని, ఆయన తమ్ములంతా బతుకుతారని చెప్పి అందరినీ
బతికించాడు. అప్పుడు యక్షుడు తన నిజస్వరూపాన్ని చూపించి, తాను యమధర్మరాజునని చెప్పాడు. తన కుమారుడైన
ధర్మరాజును చూసే వేడుకతో వచ్చానని,
ఆయన కోరిన వరాలను ఇస్తానని అన్నాడు.
ధర్మరాజు
ధర్మదేవుడికి నమస్కారం చేసి బ్రాహ్మణుడి అరణిని ప్రసాదించమని కోరాడు. ఆ అరణిని
తానే లేడి రూపంలో అపహరించానని చెప్పి దాన్ని ధర్మరాజుకు ఇచ్చాడు యమధర్మరాజు.
మున్ముందు అజ్ఞాతవాసంలో పాండవులను ఎవరూ గుర్తించకుండా వుండే వరాన్ని ప్రసాదించి
అదృశ్యమయ్యాడు ఆయన.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, అరణ్యపర్వం, సప్తమాశ్వాసం
(తిరుమల, తిరుపతి
దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment