Thursday, August 11, 2016

శ్రీ కుమార కవచము



శ్రీ కుమార కవచము

ఓం నమో భగవతే శరవణభవాయ
ఓం నమో భగవతే భవబంధహరణాయ
ఓం సద్భక్త శరణాయ శరవణభవాయ
ఓం శాంభవవిఖాయ యోగనాయకాయ
ఓం మహాదేవసేనావృతాయ మహామణిగణాలంకృతాయ
ఓం శక్తిశూల గదా ఖడ్గ ఖేటక పాశాంకుశ
ఓం ముసల ప్రాస లోమర వరదాభయ కరాలంకృతాయ
ఓం శరణాగత రక్షదీక్షాధురంధర చరణారవిందాయ
ఓం సర్వలోకైక గోప్త్రే సర్వలోకైక హర్త్రే
ఓం సర్వనిగమ గుహ్వాయ కుక్కుట ధ్వజాయ
ఓం కుక్షిస్థాఖిల బ్రహ్మాండ మండలాయ
ఓం అఖండల వందితాయ హృదేంద్ర అంతరంగాబ్దిసోమాయ
ఓం సంపూర్ణకామాయ నిష్కామాయ నిరుపమాయ
ఓం నిర్ధ్వంధ్వాయ నిత్యాయ, సత్యాయ, శుద్ధాయ, బుద్ధాయ
ఓం ముక్తాయ, అవ్యక్తాయ, అబాధ్యాయ, అభేధ్యాయ
ఓం అసాధ్యాయ, అవిఛ్ఛేధ్యాయ, ఆద్యంత శూన్యాయ
ఓం అజాయ, అప్రమేయాయ, అవాజ్మూనసగోచరాయ
ఓం పరమ శాంతాయ, పరిపూర్ణాయ, పరాత్పరాయ
ఓం ప్రణవ స్వరూపాయ, ప్రణతార్తిభంజనాయ, స్వాశ్రితరంజనాయ
ఓం జయ జయ రుద్రకుమార, మహాబల పరాక్రమ
ఓం త్రయత్రింశత్కోటి దేవతానంద స్కంద నిరుపమానంద
ఓం మమ ఋణరోగశతృపీడాపరిహారం కురు, కురు
ఓం దుఃఖాతురుం మమ ఆనందయ ఆనందయ
ఓం నరక భయాన్మాముద్దర ఉద్దర
ఓం సంస్కృతి క్లేశసహితం మాం సంజీవయ సంజీవయ
ఓం వరదోసిత్వం, శక్తోసిత్వం, మహాభుక్తిం
ఓం ముక్తిం దత్వామే శరణాగతం మామ్ శతాయుష మవభో
ఓం దీనబంధో, దయాసింధో, కార్తికేయ ప్రభో ప్రసీద ప్రసీద
ఓం సుప్రసన్నోభవ వరదోభవ, సుబ్రహ్మణ్యస్వామిన్నోం
నమస్తే, నమస్తే, నమస్తే, నమః

Monday, August 8, 2016

రావణా! నీ మేలు కోరి చెబుతున్నా, విను ..... ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు 13 వ భాగం అరణ్య కాండ : వనం జ్వాలా నరసింహా రావు

(Recovered and Reloaded)

రావణా! నీ మేలు కోరి చెబుతున్నా, విను
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
13 వ భాగం అరణ్య కాండ

వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (25-07-2016)

శ్రీరామచంద్రుడు ఖరదూషణాదులతో యుద్ధంచేస్తున్న సమయంలో నెలకొన్న పరిస్థితిని వివరించడానికి వాసు దాసుగారు ఎంచుకున్న వృత్తాలలో మూడు సుగంధి, స్రగ్ధర, కవిరాజవిరాజితములు. ఆ పద్యాలిలా సాగుతాయి.

సుగంధి:                  మానవేంద్రము క్తశాత మార్గణాసహిష్ణులై
                        వైనతేయపక్షజాత వాతధూతభూజసం
                        తానరీతి భీతయాతు ధాన కోటి యోటమై
                        దీనవృత్తిఁ బారఁ జొచ్చె దేవవైరి డాయఁ గన్ -48

ఛందస్సు:      సుగంధికి ర-జ-ర-జ-ర గణాలు. తొమ్మిదింట యతి.
స్రగ్ధర:            ఘోరప్రాసాసిఖడ్గా కుటిల శరశతుల్గుప్పగా మీఁ ద గుప్పన్
                జ్యారావోద్భిన్న శత్రూచ్చయహృదయపుటీ సద్ముఁ దై కంఠ రావో
                దారుం డై శత్రుఘాతార్థముగ భయదగాం ధర్వనారాచ్ మేసెన్
                నీరంద్రం బై దిశాళుల్ నిశితఖగతితిన్ నిండ సీతేశుఁ డంతన్ -49
ఛందస్సు:      స్రగ్ధరకు మ-ర-భ-న-య-య-య గణాలు. ఎనిమిదింట ఎనిమిదింట యతులు.

కవిరాజవిరాజితము:
విరిగినతేరులు గూలినశూరులు వ్రీలినకేతువులున్ గొడుగుల్
        తెరచిననోరులు పారెడివీరులు ద్రెళ్లినగౌరులు పొర్లుహరుల్
        తరిగినచేతులు తున్గినమూతులు తారెడిభీతులు మిక్కుట మై
        తెరఁ గరి రాక్షససైన్యము సర్వము దీరుచు నుండఁ గ దూషణుడున్ -50
ఛందస్సు:      కవిరాజవిరాజితమునకు ఒక్క "న" గణం, ఆరు "జ" గణాలు, "వ" గణం. పద్నాలుగవ ఇంట యతి.

తాత్పర్యం:    
రామభద్ర భూపాలుడిచే విడువబడిన పదునైన బాణాలను సహించలేక, గరుడుడి రెక్కలగాలిలో ఎగిరిన చెట్ల గుంపుల మాదిరిగా,భయపడిన రాక్షస సమూహాలు, పరాభవంతో-దుఃఖంతో ఖరుడి చాటున దాక్కున్నారు. భయంకరమైన ఈటెలు, కత్తులు, బాణపరంపరలు, కుప్పలు-కుప్పలుగా వారు (ఖరుడి సైనికులు) తనమీద పడవేస్తుంటే, రామభద్రుడు ధనుష్టాంకారంతో వారిగుండెలు పగిలేలా సింహనాదంచేసి, శత్రుసంహారానికై దిక్కుల్లో సందులేకుండా కరకుబాణాలు నిండే విధంగా గాంధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు. (ఫలితంగా) విరిగిన రథాలు, చనిపోయిన శూరులు, నేల కూలిన ధ్వజాలు, గొడుగులు, తెరిచిన నోళ్లు, పరుగిడుతున్న వీరులు,పడిపోయిన ఏనుగులు, దొరులుతున్న గుర్రాలు, తెగినచేతులు, తునకలైన మూతులు, పక్కకొదిగిన పిరుదులు పెరుగిపోతుండడాన్ని- రాక్షస సైన్యం సర్వనాశనం కావడాన్ని గమనించిన దూషణుడు (యుద్ధానికి సిద్ధమౌతున్నాడు).

దూషణుడు శ్రీరాముడితో యుద్ధంచేసి చనిపోతాడు. తదుపరి తనమీదకొచ్చిన రాక్షసులను, వారి సేనానాయకులను చంపాడు రాముడు. అలా పదునాలుగు వేలమందినీ చంపేశాడు రాముడాయుద్ధంలో. ఆ తర్వాత ఖరుడి మరో సేనా నాయకుడు త్రిశిరుడనేవాడు కూడా భయంకరమైన యుద్ధంచేసి చివరకు అతడూ నేలకూలుతాడు. అదిచూసిన సేనలోని వారంతా తలోదిక్కుకు పారిపోతారు. చివరకు ఖరుడే స్వయంగా రణంలోకి దిగి,శ్రీరాముడి కవచాన్ని భేదించడంతో, రాముడు అగస్త్యుడిచ్చిన వైష్ణవ ధనస్సుతో బాణాలను సంధించాడు అతడిపైకి. చివరకు ఇంద్రుడిచ్చిన అమోఘమైన బాణాన్ని ప్రయోగించి ఖరుడిని వధించాడు రాముడు. మహర్షుల ప్రశంసలందుకుంటాడు రాముడు. జనస్థానంనుండి అకంపనుడనే రావణుడి వేగులవాడు లంకకు పోయి, ఖర-దూషణాదుల మరణవార్తను తెలియచేశాడు. శ్రీరాముడి పరాక్రమాన్ని కూడా వర్ణించి చెప్పాడు రావణాసురుడికి. చెప్పి,శ్రీరాముడిని చంపాలంటే, సీతాపహరణమే తగిన ఉపాయమంటాడు. ఇంతలో లంకకెళ్లిన శూర్ఫణఖ రావణుడితో తనగోడు చెప్పుకుంటుంది. తన దుఃఖాన్ని చూసికూడా ఓదార్చని రావణుడిని నిందిస్తుంది. రాముడివల్ల తనకు జరిగిన అవమానాన్ని, దుఃఖాన్ని తెలిసికూడా ఓదార్చని రావణుడిని ఆయన కొలువులోనే-మంత్రుల సమక్షంలోనే శూర్ఫణఖ నిందించిన విధానాన్ని ఒక "మత్తకోకిలం" లో రాసారీవిధంగా:

మత్తకోకిలము:                   ఎండుకట్టెల మంటిపెళ్లల నేనియున్ మరి దుమ్ముచే
                        నొండు కార్యము కల్గుఁ గాని స మూహ చేయఁ గ రాజుగా
                        నుండి భ్రష్టత నొందినట్టిన రోత్తముం డొకగవ్వకేన్
                        ఖండితాహితసంచయా ! కొరగాఁ డు నిక్కము నమ్ముమీ-51
ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ర----- గణాలు. పదకొండో అక్షరం యతి.

తాత్పర్యం:     లోకంలో దేనికీ పనికిరాని అల్పమైన ఎండుకట్టెలు, మట్టిపెళ్లలు,నేలదుమ్ములాంటివి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడవచ్చేమోగాని, ఎంత ఆలోచించినా, రాజైవుండి-రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడు గవ్వకైనా కొరాగడనేది వాస్తవం.



ఒకవైపు రాముడిని, రావణుడిని దూషిస్తూనే, శ్రీరాముడిని గురించి వివరంగా వర్ణించి చెపుతుంది శూర్ఫణఖ. ఖర-దూషణాది పదునాలుగు వేలమందిని, మూడు గడియల్లో ఒంటరిగా బాణాలతో నాశనం చేశాడని పొగుడుతుంది. సీతనూ వర్ణించి చెపుతుంది. అందమైన గమనం కలదని,సమస్త సద్గుణాలవల్ల గొప్ప కీర్తిగాంచినదని అంటుంది. రాముడి చేతిలో చచ్చిన ఖర-దూషణాదుల మీద ఏ మాత్రం ప్రేమున్నా రాముడిని, అతడికి సహాయం చేస్తున్న వారందరిని చంపమంటుంది. ఇవన్నీ విన్న రావణుడు రహస్యంగా మారీచాశ్రమానికి పోతాడు. నిర్మలమైన ఒక ప్రదేశంలో, మితాహారుడై,ఇంద్రియనిగ్రహంతో, జింకచర్మం ధరించి, నార వస్త్రాలు కట్టుకొని తపస్సుచేస్తుంటాడు మారీచుడు. జనస్థానం వృత్తాతంతాన్ని చెప్పి,సీతాపహరణంలోతనకు సహాయం చెయ్యమని మారీచుడిని వేడుకుంటాడు రావణుడు. సమాధానంగా మారీచుడు, శ్రీరాముడి బలపరాక్రమాలను గురించి రావణుడికి తెలియ చెప్పుతాడు. ఆయన ధర్మమూర్తంటాడు. "జనకాత్మ జ సంబంధం, బున రాముం డప్ర మేయ పురుతేజుం డ య్యెను నట్టిరాముచాపము, తను గాపగ నున్న సీత దరమాతేరన్" (సీతాదేవి సంబంధం వల్ల రాముడు, ఛేదింపగరాని గొప్పతేజం కలవాడయ్యాడు. అలాంటి రాముడి విల్లు రక్షిస్తుంటే, సీతను తేవడం నీకు సాధ్యమా ?) అంటాడు మారీచుడు. శ్రీరాముడితో తాను పడ్డపాట్లను రావణుడికి తెలియచేస్తూ,అందగత్తెలైన తనభార్యలతో దీర్ఘకాలం సుఖపడాలన్న కోరికుంటే,రామచంద్రుడికి కీడుచేసే పని చేయొద్దనీ-సీతను ఎత్తుకొని రావద్దనీ హితబోధచేసే సమయంలో, "మాలిని" వృత్తంలో ఒక పద్యాన్ని రాసారీవిధంగా కవి.

మాలిని:                  వలదు వలదు సీతా వారిజాక్షిన్ గ్రహింపన్
                        జెలిమికలిమి నీకుం జెప్పెదం, గాదటుంచున్
                        బలిమిని గ్రహియింపన్ బంధుమిత్రాళితోడన్
                        గలవు కలనఁ గూలన్ క్ష్మాసుతానాధుచేతన్ -52
ఛందస్సు:      మాలినికి న---- గణాలు, తొమ్మిదో ఇంట యతి.
తాత్పర్యం:     రావణా ! సీతాదేవిని నీవు హరించవద్దు. నేను ఈ మాటను నీ మీద నాకున్న ప్రేమవల్ల, నీ క్షేమం కోరి చెపుతున్నాను. నా మాట వినకుండా, బలాత్కారంగా సీతను తీసుకొస్తే,బంధువులతో-మిత్రులతో రాముడి చేతిలో యుద్ధంలో చస్తావు.

తాను రాముడిబారినుండి ఎలా తప్పించుకున్నది వివరించాడు మారీచుడు రావణాసురుడికి. ఇన్ని చెప్పినా మనసుకెక్కని రావణుడు మారీచుడిని పరుషాలాడి, బలాత్కరించి, తనకు తోడ్పడాడినికి ఒప్పించాడు. తనకు సహాయం చేయాల్సిన విధానాన్ని తెలిపాడు. వెండి చుక్కల బంగారు జింక ఆకారాన్ని ధరించి, రాముడి ఆశ్రమం దగ్గర తిరుగుతుంటే, సీత నిజమైన జింకని నమ్మి పట్టుకొని రమ్మని కోరుతుందనీ, ఆతర్వాత సీతను ఎత్తుకొని పోవచ్చనీ వివరించాడు మారీచుడికి. అదివిన్న మారీచుడు రావణుడిని నిందిస్తూ, హితవాక్యాలు కొన్ని చెప్తాడు. అప్పుడు "వసంతతిలక" వృత్తంలో ఒక పద్యం రాసారు వాసు దాసుగారీవిధంగా:

వసంతతిలక:            నీ మేలు గోరి యిటు నేను హితంబుఁ బల్కన్
                        నామాట నీ వెద న నాదృతిఁ జేసె దయ్యో
                        యే మందు రావణ సు హృజ్జనపథ్యవాక్యం
                        బేమాడ్కి మృత్యువశుఁ డేర్పడ నాలకించున్ -53
ఛందస్సు:      వసంతతిలక కు త-భ-జ-జ-గ-గ గణాలు. ఎనిమిదింట యతి.
తాత్పర్యం:     రావణా ! నీ మేలుగోరి నీకు హితమైనదానిని బోధించగా,నామాటను నీవు అలక్ష్యం చేస్తున్నావు. అయ్యో ! నేను నిన్నేమి చేయగలను ? మృత్యువునకు వశపడి చావదల్చుకున్నవాడు మితృలు చెప్పే మంచిమాటలు వింటాడా ?

రావణ-మారీచులు పంచవటికి ప్రయాణమై పోతారు. మారీచుడు మాయా జింక వేషాన్ని ధరించాడు. రాముడుండే తపోవనంలోకి ప్రవేశించాడు. జానకి మాయామృగాన్ని చూస్తుంది. రావణుడు ఊహించినట్లే మాయామృగాన్ని పట్టితెమ్మని సీత కోరుతుంది రాముడుని. దాన్ని సులభోపాయంతో పట్టితెమ్మని, ఒకవేళ ప్రాణాలతో దొరక్కపోతే దాని చర్మంతోనన్నా ఆడుకోవాలని వుందని అంటుంది. అంగీకరించిన రాముడికి అది మారీచుడి మాయేనన్న అనుమానంకూడా కలుగుతుంది. అలాంటప్పుడు దానివధ అవశ్యమనుకుంటాడు. అదే విషయాన్ని లక్ష్మణుడితో చెప్పి, ఒక్క వాడి బాణంతో జింకను చంపి చర్మాన్ని తీసుకొని వస్తానని, తానొచ్చేవరకు సీతను "జటాయువు" సహాయుడుగా వుండగా రక్షింపమని అంటాడు రాముడు. అది చెప్పడానికి "మత్తకోకిలము" వృత్తంలో పద్యాన్ని రాసారీవిధంగా కవి:

మత్తకోకిలము:                   దక్షుఁ డున్ దృఢసత్త్వుఁ డున్ మతి ధైర్యయుక్తుఁ డు లక్ష్మణా !
                        పక్షిరాజు జటాయు వియ్యెడ బాసటై  చరియింపఁ గా
                        రక్షణంబు ఘటింపుమీ యుడు రాజబింబసమాస్యకున్
                        దీక్షఁ బూని ప్రమాద  మేది  ప్ర తిక్షణంబును శంకి వై -54

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ర----- గణాలు. పదకొండో అక్షరం యతి.
తాత్పర్యం:     పక్షిరాజైన జటాయువు కార్యసాధన సమర్థుడు. మిక్కిలి బలవంతుడు. కార్యాలోచన, కార్యంచేయగల ధైర్యంగలవాడు. ఆయన నీకు సహాయకుడుగా సీతాదేవిని అనుక్షణం, ఏ మూలన ఏమి ఆపద వస్తుందోనని, శంక గలవాడై-పొరపాటుపడకుండా, ఒక వ్రతంగా భావించి రక్షించు.

లక్ష్మణుడితో సీతను కాపాడమని చెప్పిన శ్రీరాముడు మాయామృగం వెంట పోతాడు. చేత్లో ధనస్సుతో వస్తున్న రాముడిని చూసిన మారీచుడు తనకు చావు తధ్యమనుకున్నాడు. మాయలుచేస్తూ రాముడికి చిక్కకుండా తిరగసాగింది జింక. అలా ఆ జింక వినోదంగా తిరుగుతున్న విధానాన్ని "మాలి" వృత్తంలో ఒక పద్యంరాసారిలా:

మాలి:           కనఁ గ గనఁ గ గాంతుల్ గ్రక్కుచున నిల్చుధ్వనిన్
                గనుచుఁ గనుచుఁ బాఱు న్దవ్వుగాఁ జిక్కకుండన్
మునుఁ గు వెఱను బాణంబుం గనున్ మింట నాడున్
వనుల దరుల డాఁ గున్ వంచనన్ గాసిమ్రాఁ గున్ - 55
తాత్పర్యం:    
రామచంద్రమూర్తి చూస్తుండగానే, కాంతులు విరజిమ్ముతున్నదానివలె, మెరుస్తూ నిలుస్తుంది. ఆయన విల్లెత్తగనే దృష్టి దానిమీదనే వుంచి, దూరంగా చిక్కకుండా పరుగెత్తుతుంది. భయపడుతున్నట్లు నటించుకుంటూ బాణం వైపు చూస్తుంది. ఆకాశంలోనే గంతులుపెట్టుకుంటూ ఆడుతుంది కాసేపు. అడవుల్లో చెట్లచాటున గుహల్లో దాక్కుంటుంది. అలసిపోయిందానిలాగా వంచనతో సోలుతుంది.

ఇలా తనతో దోబూచులాడుతున్న మాయా మృగంపై కోపగించిన రామచంద్రుడు, దాన్ని చంపాలనుకొని, బ్రహ్మాస్త్రాన్ని గురిచూసి వేశాడు. ఆ దెబ్బకు మరణించబోతున్న మారీచుడు, రావణుడికి సహాయపడదలిచి,రాముడి గొంతును అనుకరిస్తూ, "హా సీతా లక్ష్మణా" అని అఱచి చనిపోయాడు. రాముడు మారీచుడిని చంపిన తర్వాత ఆశ్రమానికి బయల్దేరి పోతుంటాడు. రాముడి గొంతువిన్న సీత లక్ష్మణుడిని అతడికి సహాయంగా పొమ్మంటే, అన్న ఆజ్ఞ ప్రకారం వెళ్లకుండేసరికి ఆమె కోపగించుకుంటుంది, నిష్టూరాలాడుతుంది. చివరకు లక్ష్మణుడు రాముడుని వెతుక్కుంటూ పోతాడు. ఆ తర్వాత రావణుడు యతి వేషంలో సీతాపహరణానికి వస్తాడు. వచ్చినవాడు రాక్షసుడని తెలిసి కూడా, కొంతసేపు ఆలశ్యంచేస్తే రామ లక్ష్మణులు రాకపోతారా అని ఎదురుచూస్తున్న సందర్భంలో తరలము వృత్తంలో ఒక పద్యం రాసారీవిధంగా:

తరలము:      వనికి వేఁ టకు జన్న భర్తయు భ్రాతతోఁ జనుదెంచునా
                యనుచు నాలుగు దిక్కులున్ జలజాయతాక్షి వనీదిశన్
                గనియెఁ గ్ాని రఘోత్తముల్ పొడకట్టరైరి, యథాస్థితిన్
                వనకుజంబులు దోఁ చు చుండెను భామచిత్తము కందఁ గన్ -56
ఛందస్సు:      తరలము వృత్తానికి న------ గణాలుంటాయి.పన్నెండో ఇంట యతి.


తాత్పర్యం:     మాయా మృగాన్ని వేటాడేందుకు అడవికి పోయిన రామచంద్రమూర్తి లక్ష్మణుడితో వస్తాడా అని, అడవి వైపు నాలుగు దిక్కులా చూసినప్పటికీ వాళ్లు కానరాలేదు. యథాప్రకారం అడవిచెట్లు మాత్రం కనిపించాయి. అది తెలుసుకొన్న సీత మనస్సు భయ సంతాపాలతో వాడిపోయింది.


లోకహితం కోరే రామా! జయతు జయతు ..... ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు 12 వ భాగం అరణ్య కాండ : వనం జ్వాలా నరసింహా రావు

(Recovered and Reloaded)

లోకహితం కోరే రామా! జయతు జయతు
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
12 వ భాగం అరణ్య కాండ
వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (18-07-2016)

          శ్రీ సీతా రామలక్ష్మణులు అరణ్యవాసం కొనసాగిస్తున్న తొలినాళ్లలో,అడవిలో పోతున్నప్పుడు పర్వత శిఖరంలా పొడవైన దేహమున్న భయంకరాకారుడైన ఒక క్రూరుడిని చూశాడు రామచంద్రమూర్తి. విరాధుడనే వాడు, సీతా రామలక్ష్మణులను చూసి కోపంతో వారిమీద పడి సీతను చంకలో పెట్టుకొని, తన పేరు వారికిచెప్పి, "పాపాత్ములైన వారిని" చంపి, ఆమెను పెళ్లిచేసుకుంటానని బెదిరించాడు. భయపడుతున్న సీతాదేవిని చూసిన రాముడు ఆమెకెంత ఆపదొచ్చిందో చూడమని తమ్ముడు లక్ష్మణుడితో అంటాడు. స్పష్ఠమైన తన భుజబలంతో వాడిని చంపుతానని అన్నతో అంటూ లక్ష్మణుడు, విరాధుడిని, వాడెవడని, వాడి పుట్టు పూర్వోత్తరాలేంటని అడుగుతాడు. విరాధుడిచ్చిన జవాబును "వసంతమంజరి" లో పద్యంగా రాసారు వాసు దాసుగారు ఈ విధంగా:

వసంతమంజరి:       
వినుము నా జనకుండు జయుఁ డను వీరుఁ డంబ శతహ్రదా
        ఖ్య నిఖిలావనిఁ గల్గుదనుజని కాయ మెల్ల విరాధుఁ డం
        చును వచించును నన్నుఁ దపమున సూర్యవంశ్య ! వరంబునేఁ
        గొనితి  శస్త్రముచేత మరణముఁ గూర కుండఁ గ బ్రహ్మచేన్ -41

తాత్పర్యం:     నా తండ్రి జయుడు. నా తల్లి శతహ్రద. భూమిపైనున్న తనుజులందరు నన్ను విరాధుడని పిలుస్తారు. నేను తపస్సుచేసి శస్త్రంతో చావులేకుండా బ్రహ్మ వరం పొందాను.(ఆ తర్వాత విరాధుడు రామలక్ష్మణుల చేతిలో వధించబడ్డాడు).

ఛందస్సు:      వసంతమంజరికి న-భ-భ-న-ర-స-వ గణాలు. పదమూడో అక్షరం యతి స్థానం.

విరాధుడిని వధించిన తర్వాత సీతా రామలక్ష్మణులు శరభంగాశ్రమానికి పోతారు. అరణ్యవాసంలో తాము నివసించుటకు నివాసయోగ్యమైన స్థలమేదో సూచించమని రాముడు కోరగా, శరభంగుడు వారుండుటకు తగిన స్థలం సుతీక్ష్ణుడను మునీంద్రుడు తెలియచేస్తాడని అక్కడికి పొమ్మని చెప్పి తన దేహం వదిలినతర్వాతే అక్కడనుండి వెళ్లమని ప్రార్తించాడు. అక్కడున్న మునులందరూ తమకష్టాలను చెప్పి తమను కాపాడమని కోరడంతో వారికి రాముడు అభయ హస్తమిచ్చిన తర్వాత,బయలుదేరి సుతీక్ష్ణాశ్రమానికి చేరుకుంటారు ముగ్గురూ. ఆ రాత్రి అక్కడే గడుపుతారు వారందరూ. ఆయన సలహామేరకు పంచవటికి ప్రయాణమైపోతుంటారు. బయల్దేరేముందర దాచిపెట్టిన ఆయుధాలను రామలక్ష్మణులకు అందచేస్తుంది సీత. దారిలో సీతాదేవి శ్రీరాముడికి వెంటవస్తున్న లక్ష్మణుడు వింటుండగానే రాబోయేకాలంలో సంభవించనున్న పరణామాలను గ్రహించినదానివలె కొన్ని హితబోధలు చేస్తుంది. ఆ క్రమంలోనే సీత రాముడికి శస్త్ర సాంగత్య దోషాన్ని తెలియచేసే ఇతిహాసాన్ని చెపుతుంది. శస్త్రాన్ని ధరించినట్లైతే దాన్ని ఉపయోగించాలన్న కోరిక పుటుతుందనీ, కాబట్టి అడవుల్లో వాటిని ధరించవద్దనీ, అయోధ్యకు చేరిన తర్వాత ధర్మ రక్షణార్థం శస్త్రం ధరించవచ్చనీ హితబోధచేస్తుంది. ఇక్కడ "మంజుభాషిణి" వృత్తంలో ఒక పద్యాన్ని రాసారు కవి ఈ విధంగా:

మంజుభాషిణి:           సిరిఁ యున్ ధరన్ విడిచి చేరి కానలన్
                        జరియించునీ విపుడు సం యమింబలెన్
                        దిరుగం దపోనియతి దేవ మోదముం
                        బరఁ గించు నత్తకును మామగారికిన్ -42

ఛందస్సు:      మంజు భాషిణీ వృత్తానికి స-జ-స-జ-గ గణాలుంటాయి. 9వ అక్షరం యతి. సీత "మంజు భాషిణి" అయినందున ఇక్కడ "మంజుభాషిణి" వృత్తంలో పద్యం రాయడం సమంజసమే అంటారు వాసు దాసుగారు.

తాత్పర్యం:     అనుభవించాల్సిన ఐశ్వర్యం, పాలించాల్సిన భూమి వదిలిపెట్టి,మునిలాగా అడవులకు చేరిన నువ్వు మునుల్లాగానే తపస్సు చేస్తుంటే రాముడు యదార్థ వాది - తనతో చెప్పినట్లే చేస్తున్నాడని కైక సంతోషిస్తుంది. తన కొడుకు విశేష శ్రమ పడకుండా సుఖంగా వున్నాడని కౌసల్య కూడా సంతోషిస్తుంది. వీరే కాకుండా స్వర్గంలోని మామగారు తన కొడుకు తనను సత్యవాదిని చేస్తున్నాడని సంతోషిస్తాడు. కావున అలానే చేయి.


సీత హితోపదేశాన్ని విన్న రాముడు ఆర్త రక్షణే పరమ ధర్మమని అంటాడు. అడవుల్లో తపస్సు చేసుకుంటున్న మునుల రక్షణ కూడా ధర్మ రక్షణార్థమేనంటాడు. మునులను కాపాడుతానని ప్రతిజ్ఞ చేసానని,బ్రాహ్మణులకిచ్చిన మాటతప్పి తన ప్రతిజ్ఞ విడువనని సత్యాన్ని రక్షించేందుకు ప్రాణాలనైనా, భార్యనైనా, తమ్ముడినైనా విడుస్తానని స్పష్ఠంగా తెలియచేశాడు సీతకు. ఇలా చెప్పుకుంటూ ముగ్గురూ పయనమై పోతుంటారు. వాళ్లలా పోవడాన్ని ప్రణవ స్వరూపం-ప్రణవార్థం వచ్చే విధంగా తేటగీతిలో రాసిన పద్యం ఇలా సాగుతుంది: "అగ్రవర్తియై శ్రీరాము డరుగుచుండె, నువిదతనుమధ్య మధ్యమందుండెసీత, మహిత కోదండదండ సంభరణ హస్తు, డోలి వెన్నంటె లక్ష్మణుడొప్పుప్రేమ".  మొదటిపాదం మొదటి అక్షరం "అ" కారం, రెండవ పాదం మొదటి అక్షరం "ఉ" కారం, మూడోపాదం మొదటి అక్షరం "మ" కారం వున్నాయి. మూడు కలిసి "ఓం" అయిందని, అలానే నాలుగోపాదం మొదటి-కడపటి అక్షరం కలిసి "ఓం" అయిందని కవి వివరించారు. ఈ విధంగా ఈ పద్యం ప్రణవ స్వరూపమని అంటారాయన. ఈ ప్రణవార్థం పరమార్థ తత్త్వాన్ని విపులంగా చూపిస్తుంది. ఇక్కడ "మానిని" వృత్తంలో , అక్కడి పరిసరాలను వర్ణిస్తూ, ఒక పద్యాన్ని రాసారు వాసు దాసుగారిలా:

మానిని:        సారము లౌనవసారసకై రవ సౌరభవాసితభాసితకా
                సారములుం దటినీతటసై కత సంచరదంచితచక్రయుగీ
                వారములున్ గిరిసుందరకందర పాతసుపూతఝరీలహరీ
                పూరములున్ సుమమంజులకుంజక పుంజితగుంజదళీంద్రములున్-43

ఛందస్సు:మానిని వృత్తానికి సప్త "భ" గణాలుంటాయి. ఒక గురువు. 13 వ అక్షరం యతి.
తాత్పర్యం:     సారవంతాలై కొత్తగా వికసించిన కమలాల కలువల పరిమళాల గుంపులతో
ప్రకాశించే కొలకులతో, నదీతీరంలోని ఇసుక దిబ్బల్లో తిరిగే అందమైన చక్రవాక దంపతుల సమూహాలతో, కొండల్లోని సుందరమైన గుహల్లో పడుతున్న నీళ్లున్న పవిత్రమైన కొండవంకల ప్రవాహాలనే పూలతో, అందమైన పొదల్లోని గుంపుల తుమ్మెదలతో (నిండిన ప్రదేశం). 

అగస్త్యాశ్రమానికి పోవడానికి సుతీక్ష్ణుడి అనుమతి తీసుకొంటాడు శ్రీరాముడు. తానే వారిని అక్కడికి పొమ్మమనమని చెప్పదల్చుకున్నానని,దక్షిణంగా నాలుగు యోజనాలు వెళ్తే అగస్త్యుడి సోదరుడి ఆశ్రమం వస్తుందని,అక్కడినుంచి మరో ఆమడ దూరంలో అగస్త్యుడి ఆశ్రమం వుంటుందని అంటాడాయన. అలా ఆయన ఆజ్ఞ తీసుకొని పోతున్న సందర్భాన్ని "తరలము" వృత్తంలో రాసారు వాసు దాసుగారిలా:

తరలము:               ముని వచించినత్రోవచొప్పున మువ్వురున్ వనిఁ బోవుచున్
                        గనిరి త్రోవల క్రేవలన్ ఘన కంధరాకృతబంధురం
                        బును ధరప్రచయంబునున్ సుమ పూర్ణరమ్యవనంబులన్
                        గొనబుమీరినవంకలం దమి గూర్చు మేలికొలంకులన్ -44

ఛందస్సు:      తరలము వృత్తానికి న-భ-ర-స-జ-జ-గ గణాలుంటాయి. పన్నెండో ఇంట యతి.
తాత్పర్యం:     సుతీక్ష్ణ మహాముని చెప్పిన తోవ పట్టుకొని అడవిలో ముగ్గురు బయలుదేరి పోతూ, మార్గ మధ్యంలో, ఇరుపక్కల కారుమబ్బులాగా విస్తారమైన కొండలగుంపును, పూలతో నిండిన మనోహరమైన వనాలను, అందమైన వంకలను,సంతోషం కలిగించే సరస్సులను చూసారు.


సీతారామ లక్ష్మణులు అగస్త్యాశ్రమానికి చేరుకొని, ఆయన దర్శనం చేసుకుంటారు. ఆయన ఇచ్చిన వైష్ణవాయుధాలను తీసుకొంటాడు రాముడు. అక్కడికి రెండామడల దూరంలో "పంచవటి" అనే సుఖప్రదమైన ప్రదేశం వుందని, అక్కడొక ఆశ్రమం నిర్మించుకొని, అరణ్యవాసాన్ని పూర్తిచేసి, తండ్రి వాక్యాన్ని పాలించమని సలహా ఇస్తాడు. పంచవటికి పోయే మార్గాన్నికూడా వివరంగా చెప్తాడు. ఆయన చెప్పిన మార్గంలో పోతుంటారు వాళ్లు. దారిలో జటాయువును చూస్తారు. అక్కడినుండి బయల్దేరి "పంచవటి" చేరుకుంటారు. అక్కడికి చేరుకున్నప్పుడు, ఆ ప్రదేశంలోని చెట్లను రాముడిద్వారా వర్ణించడాన్ని "మత్తకోకిలము" వృత్తంలో పద్యంగా మలిచారిలా కవి:

మత్తకోకిలము:         సాలతాలత మాలతుంగర సాలజాల మధూకకు
                        ద్దాల వంజుల నక్తమాలవి తానసిందుక చందనో
                        ద్దాలచంపకపారిజాతక దంబనింబకపిత్థత
                        క్కోలకేసరజంభకింశుక కూటపాటలకోటులన్ -45

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ర----- గణాలు. పదకొండో అక్షరం యతి.
తాత్పర్యం:     మద్దిచెట్లు, తాటిచెట్లు, చీకటి మ్రాకులు, తియ్య మామిడిచెట్లు,ఇప్ప, కాంచన చెట్లు, అశోక, కానుగు, సిందుక చెట్లు,సంపంగి, పారిజాత, వేప, వెలగ, పొన్న, నిమ్మ, మోదుగు.. .. చెట్ల సమూహాలతో కూడిన ప్రదేశం.

లక్ష్మణుడు పంచవటిలో పర్ణశాల నిర్మిస్తాడు. అందులో వారు ముగ్గురు మిక్కిలి సుఖంగా నివసిస్తుంటారు. వనవాసం చేద్దామని రాముడు సంకల్పించుకున్న పద్నాలుగు సంవత్సరాలలో పదమూడో సంవత్సరం జరుగుతుంటుంది. ఆ సంవత్సరపు మార్గశిర మాసంలో ఒకనాడు, గోదావరి స్నానం చేసి వచ్చి, పర్ణశాలలో ముగ్గురూ ముచ్చటించు కుంటుంటారు. ఆ సమయంలో శ్రీరాముడిని చూసిన శూర్ఫణఖ ఆశ్రమంలో కొస్తుంది. రాముడిని మోహిస్తుంది. తన కోర్కెను వెల్లడిస్తుంది. పరిహాసంతో రాముడు, తమ్ముడు లక్ష్మణుడిని చూపించి ఆయన దగ్గరకు పొమ్మంటాడు. ఆమె లక్ష్మణుడి వెంట బడుతుంది. లక్ష్మణుడు తనకంటే రాముడే తగినవాడని అక్కడకు పంపుతాడు. రాముడి వద్దకు పోయిన శూర్ఫణఖ సీతను మింగుతానని భయపెడుతూ ఆమె మీదకు పోతుంటే, ఒక పద్యాన్ని "తరలము" వృత్తంలో రాసారు వాసు దాసుగారిలా:

తరలము:                అని కురంగకిశోరలోచన నాయలాతనిభాక్షి హు
                        మ్మనుచు రోహిణిమీఁ ద బారు మహత్తరోల్క యనంగ రాఁ
                        గని మహాబలశాలి రాముఁ డు గ్రక్కునం బిగఁ బట్టి కిం
                        కను సుమిత్రతనూజుతో ననుఁ గంటె లక్ష్మణ రక్కసిన్ -46

ఛందస్సు:      తరలము వృత్తానికి న------గగణాలుంటాయి. పన్నెండో ఇంట యతి.
తాత్పర్యం:     ఈ ప్రకారం చెప్పి, జింకపిల్ల కళ్లలాంటి కళ్లున్న సీతపై, కొరివితో సమానమైన కళ్లున్న శూర్ఫణఖ రోహిణిమీదకు కొరివి నక్షత్రం పోయినట్లు పోవడం చూసిన శ్రీరాముడు దాన్ని బిగబట్టి కోపంతో లక్ష్మణుడి తో ఇలా అంటాడు.

నీచులతో పరిహాసాలాడడం తప్పనీ, శూర్ఫణఖను సరైన రీతిలో శిక్షించాలనీ, దానిని విరూపనుగా చేయమనీ లక్ష్మణుడిని ఆదేశించాడు రాముడు. లక్ష్మణుడు ఆమె ముక్కు-చెవులు తెగగోసి వికార రూపంగా చేశాడు. ఆ వికృత రూపాన్ని చూసిన దాని తమ్ముడు ఖరుడు కోపగించుకుంటాడు. ఆమె వికార రూపానికి కారణమైన సీతారామలక్ష్మణుల వృత్తాంతాన్నితెలుసుకుంటాడు. పగ తీర్చుకునేందుకు పద్నాలుగు మంది రాక్షసులను శ్రీరాముడి మీదకు యుద్ధానికి పంపగా వారందరూ ఆయన చేతిలో చస్తారు. వెంటనే శూర్ఫణఖ ఖరుడిని రాముడిపై యుద్ధానికి ప్రేరేపించడంతో వాడు తన పద్నాలుగు వేలమంది సైన్యంతో పోతాడు. సింహనాదం చేస్తూ యుద్ధానికి సన్నద్ధమౌతున్న ఖరుడిపై గెలవాలని కాంక్షిస్తూ ఆకాశం నుండి వీక్షిస్తున్న దేవతలు, సిద్ధులు, మునులు రాముడికి శుభం కలగాలని కోరుకుంటున్న విధానాన్ని "మాలిని" వృత్తంలో పద్యంగా రాసారిలా:

మాలిని:                          జయతు జయతు రామ స్సం యుగే సర్వదై త్యా
                                న్న యగుణహీతచక్రీ వాశరా న్నంచు మింటన్
                                రయమునఁ జనుదేరన్ రాక్షసక్రూరసేనా
                                చయములఁ గని రంతన్ సంభ్రమోత్సాహదీప్తిన్ -47

ఛందస్సు:      మాలినికి న-న-మ-య-య గణాలు, తొమ్మిదో ఇంట యతి.

తాత్పర్యం:     లోకహితం గోరి శుభకార్యాలు చేసే సుదర్శన చక్రధారైన విష్ణువు రాక్షసులను జయించిన విధంగా, శ్రీరామచంద్రుడు సర్వ రాక్షసులను యుద్ధంలో జయించాలని అంటూ, ఆకాశం నుండి (వీక్షిస్తున్న దేవతలు, సిద్ధులు, మునులు) రాక్షస సేన సంతోషంతో-ఉత్సాహంతో ప్రకాశిస్తుండగా చూసారు.