Monday, August 8, 2016

రావణా! నీ మేలు కోరి చెబుతున్నా, విను ..... ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు 13 వ భాగం అరణ్య కాండ : వనం జ్వాలా నరసింహా రావు

(Recovered and Reloaded)

రావణా! నీ మేలు కోరి చెబుతున్నా, విను
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
13 వ భాగం అరణ్య కాండ

వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (25-07-2016)

శ్రీరామచంద్రుడు ఖరదూషణాదులతో యుద్ధంచేస్తున్న సమయంలో నెలకొన్న పరిస్థితిని వివరించడానికి వాసు దాసుగారు ఎంచుకున్న వృత్తాలలో మూడు సుగంధి, స్రగ్ధర, కవిరాజవిరాజితములు. ఆ పద్యాలిలా సాగుతాయి.

సుగంధి:                  మానవేంద్రము క్తశాత మార్గణాసహిష్ణులై
                        వైనతేయపక్షజాత వాతధూతభూజసం
                        తానరీతి భీతయాతు ధాన కోటి యోటమై
                        దీనవృత్తిఁ బారఁ జొచ్చె దేవవైరి డాయఁ గన్ -48

ఛందస్సు:      సుగంధికి ర-జ-ర-జ-ర గణాలు. తొమ్మిదింట యతి.
స్రగ్ధర:            ఘోరప్రాసాసిఖడ్గా కుటిల శరశతుల్గుప్పగా మీఁ ద గుప్పన్
                జ్యారావోద్భిన్న శత్రూచ్చయహృదయపుటీ సద్ముఁ దై కంఠ రావో
                దారుం డై శత్రుఘాతార్థముగ భయదగాం ధర్వనారాచ్ మేసెన్
                నీరంద్రం బై దిశాళుల్ నిశితఖగతితిన్ నిండ సీతేశుఁ డంతన్ -49
ఛందస్సు:      స్రగ్ధరకు మ-ర-భ-న-య-య-య గణాలు. ఎనిమిదింట ఎనిమిదింట యతులు.

కవిరాజవిరాజితము:
విరిగినతేరులు గూలినశూరులు వ్రీలినకేతువులున్ గొడుగుల్
        తెరచిననోరులు పారెడివీరులు ద్రెళ్లినగౌరులు పొర్లుహరుల్
        తరిగినచేతులు తున్గినమూతులు తారెడిభీతులు మిక్కుట మై
        తెరఁ గరి రాక్షససైన్యము సర్వము దీరుచు నుండఁ గ దూషణుడున్ -50
ఛందస్సు:      కవిరాజవిరాజితమునకు ఒక్క "న" గణం, ఆరు "జ" గణాలు, "వ" గణం. పద్నాలుగవ ఇంట యతి.

తాత్పర్యం:    
రామభద్ర భూపాలుడిచే విడువబడిన పదునైన బాణాలను సహించలేక, గరుడుడి రెక్కలగాలిలో ఎగిరిన చెట్ల గుంపుల మాదిరిగా,భయపడిన రాక్షస సమూహాలు, పరాభవంతో-దుఃఖంతో ఖరుడి చాటున దాక్కున్నారు. భయంకరమైన ఈటెలు, కత్తులు, బాణపరంపరలు, కుప్పలు-కుప్పలుగా వారు (ఖరుడి సైనికులు) తనమీద పడవేస్తుంటే, రామభద్రుడు ధనుష్టాంకారంతో వారిగుండెలు పగిలేలా సింహనాదంచేసి, శత్రుసంహారానికై దిక్కుల్లో సందులేకుండా కరకుబాణాలు నిండే విధంగా గాంధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు. (ఫలితంగా) విరిగిన రథాలు, చనిపోయిన శూరులు, నేల కూలిన ధ్వజాలు, గొడుగులు, తెరిచిన నోళ్లు, పరుగిడుతున్న వీరులు,పడిపోయిన ఏనుగులు, దొరులుతున్న గుర్రాలు, తెగినచేతులు, తునకలైన మూతులు, పక్కకొదిగిన పిరుదులు పెరుగిపోతుండడాన్ని- రాక్షస సైన్యం సర్వనాశనం కావడాన్ని గమనించిన దూషణుడు (యుద్ధానికి సిద్ధమౌతున్నాడు).

దూషణుడు శ్రీరాముడితో యుద్ధంచేసి చనిపోతాడు. తదుపరి తనమీదకొచ్చిన రాక్షసులను, వారి సేనానాయకులను చంపాడు రాముడు. అలా పదునాలుగు వేలమందినీ చంపేశాడు రాముడాయుద్ధంలో. ఆ తర్వాత ఖరుడి మరో సేనా నాయకుడు త్రిశిరుడనేవాడు కూడా భయంకరమైన యుద్ధంచేసి చివరకు అతడూ నేలకూలుతాడు. అదిచూసిన సేనలోని వారంతా తలోదిక్కుకు పారిపోతారు. చివరకు ఖరుడే స్వయంగా రణంలోకి దిగి,శ్రీరాముడి కవచాన్ని భేదించడంతో, రాముడు అగస్త్యుడిచ్చిన వైష్ణవ ధనస్సుతో బాణాలను సంధించాడు అతడిపైకి. చివరకు ఇంద్రుడిచ్చిన అమోఘమైన బాణాన్ని ప్రయోగించి ఖరుడిని వధించాడు రాముడు. మహర్షుల ప్రశంసలందుకుంటాడు రాముడు. జనస్థానంనుండి అకంపనుడనే రావణుడి వేగులవాడు లంకకు పోయి, ఖర-దూషణాదుల మరణవార్తను తెలియచేశాడు. శ్రీరాముడి పరాక్రమాన్ని కూడా వర్ణించి చెప్పాడు రావణాసురుడికి. చెప్పి,శ్రీరాముడిని చంపాలంటే, సీతాపహరణమే తగిన ఉపాయమంటాడు. ఇంతలో లంకకెళ్లిన శూర్ఫణఖ రావణుడితో తనగోడు చెప్పుకుంటుంది. తన దుఃఖాన్ని చూసికూడా ఓదార్చని రావణుడిని నిందిస్తుంది. రాముడివల్ల తనకు జరిగిన అవమానాన్ని, దుఃఖాన్ని తెలిసికూడా ఓదార్చని రావణుడిని ఆయన కొలువులోనే-మంత్రుల సమక్షంలోనే శూర్ఫణఖ నిందించిన విధానాన్ని ఒక "మత్తకోకిలం" లో రాసారీవిధంగా:

మత్తకోకిలము:                   ఎండుకట్టెల మంటిపెళ్లల నేనియున్ మరి దుమ్ముచే
                        నొండు కార్యము కల్గుఁ గాని స మూహ చేయఁ గ రాజుగా
                        నుండి భ్రష్టత నొందినట్టిన రోత్తముం డొకగవ్వకేన్
                        ఖండితాహితసంచయా ! కొరగాఁ డు నిక్కము నమ్ముమీ-51
ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ర----- గణాలు. పదకొండో అక్షరం యతి.

తాత్పర్యం:     లోకంలో దేనికీ పనికిరాని అల్పమైన ఎండుకట్టెలు, మట్టిపెళ్లలు,నేలదుమ్ములాంటివి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడవచ్చేమోగాని, ఎంత ఆలోచించినా, రాజైవుండి-రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడు గవ్వకైనా కొరాగడనేది వాస్తవం.



ఒకవైపు రాముడిని, రావణుడిని దూషిస్తూనే, శ్రీరాముడిని గురించి వివరంగా వర్ణించి చెపుతుంది శూర్ఫణఖ. ఖర-దూషణాది పదునాలుగు వేలమందిని, మూడు గడియల్లో ఒంటరిగా బాణాలతో నాశనం చేశాడని పొగుడుతుంది. సీతనూ వర్ణించి చెపుతుంది. అందమైన గమనం కలదని,సమస్త సద్గుణాలవల్ల గొప్ప కీర్తిగాంచినదని అంటుంది. రాముడి చేతిలో చచ్చిన ఖర-దూషణాదుల మీద ఏ మాత్రం ప్రేమున్నా రాముడిని, అతడికి సహాయం చేస్తున్న వారందరిని చంపమంటుంది. ఇవన్నీ విన్న రావణుడు రహస్యంగా మారీచాశ్రమానికి పోతాడు. నిర్మలమైన ఒక ప్రదేశంలో, మితాహారుడై,ఇంద్రియనిగ్రహంతో, జింకచర్మం ధరించి, నార వస్త్రాలు కట్టుకొని తపస్సుచేస్తుంటాడు మారీచుడు. జనస్థానం వృత్తాతంతాన్ని చెప్పి,సీతాపహరణంలోతనకు సహాయం చెయ్యమని మారీచుడిని వేడుకుంటాడు రావణుడు. సమాధానంగా మారీచుడు, శ్రీరాముడి బలపరాక్రమాలను గురించి రావణుడికి తెలియ చెప్పుతాడు. ఆయన ధర్మమూర్తంటాడు. "జనకాత్మ జ సంబంధం, బున రాముం డప్ర మేయ పురుతేజుం డ య్యెను నట్టిరాముచాపము, తను గాపగ నున్న సీత దరమాతేరన్" (సీతాదేవి సంబంధం వల్ల రాముడు, ఛేదింపగరాని గొప్పతేజం కలవాడయ్యాడు. అలాంటి రాముడి విల్లు రక్షిస్తుంటే, సీతను తేవడం నీకు సాధ్యమా ?) అంటాడు మారీచుడు. శ్రీరాముడితో తాను పడ్డపాట్లను రావణుడికి తెలియచేస్తూ,అందగత్తెలైన తనభార్యలతో దీర్ఘకాలం సుఖపడాలన్న కోరికుంటే,రామచంద్రుడికి కీడుచేసే పని చేయొద్దనీ-సీతను ఎత్తుకొని రావద్దనీ హితబోధచేసే సమయంలో, "మాలిని" వృత్తంలో ఒక పద్యాన్ని రాసారీవిధంగా కవి.

మాలిని:                  వలదు వలదు సీతా వారిజాక్షిన్ గ్రహింపన్
                        జెలిమికలిమి నీకుం జెప్పెదం, గాదటుంచున్
                        బలిమిని గ్రహియింపన్ బంధుమిత్రాళితోడన్
                        గలవు కలనఁ గూలన్ క్ష్మాసుతానాధుచేతన్ -52
ఛందస్సు:      మాలినికి న---- గణాలు, తొమ్మిదో ఇంట యతి.
తాత్పర్యం:     రావణా ! సీతాదేవిని నీవు హరించవద్దు. నేను ఈ మాటను నీ మీద నాకున్న ప్రేమవల్ల, నీ క్షేమం కోరి చెపుతున్నాను. నా మాట వినకుండా, బలాత్కారంగా సీతను తీసుకొస్తే,బంధువులతో-మిత్రులతో రాముడి చేతిలో యుద్ధంలో చస్తావు.

తాను రాముడిబారినుండి ఎలా తప్పించుకున్నది వివరించాడు మారీచుడు రావణాసురుడికి. ఇన్ని చెప్పినా మనసుకెక్కని రావణుడు మారీచుడిని పరుషాలాడి, బలాత్కరించి, తనకు తోడ్పడాడినికి ఒప్పించాడు. తనకు సహాయం చేయాల్సిన విధానాన్ని తెలిపాడు. వెండి చుక్కల బంగారు జింక ఆకారాన్ని ధరించి, రాముడి ఆశ్రమం దగ్గర తిరుగుతుంటే, సీత నిజమైన జింకని నమ్మి పట్టుకొని రమ్మని కోరుతుందనీ, ఆతర్వాత సీతను ఎత్తుకొని పోవచ్చనీ వివరించాడు మారీచుడికి. అదివిన్న మారీచుడు రావణుడిని నిందిస్తూ, హితవాక్యాలు కొన్ని చెప్తాడు. అప్పుడు "వసంతతిలక" వృత్తంలో ఒక పద్యం రాసారు వాసు దాసుగారీవిధంగా:

వసంతతిలక:            నీ మేలు గోరి యిటు నేను హితంబుఁ బల్కన్
                        నామాట నీ వెద న నాదృతిఁ జేసె దయ్యో
                        యే మందు రావణ సు హృజ్జనపథ్యవాక్యం
                        బేమాడ్కి మృత్యువశుఁ డేర్పడ నాలకించున్ -53
ఛందస్సు:      వసంతతిలక కు త-భ-జ-జ-గ-గ గణాలు. ఎనిమిదింట యతి.
తాత్పర్యం:     రావణా ! నీ మేలుగోరి నీకు హితమైనదానిని బోధించగా,నామాటను నీవు అలక్ష్యం చేస్తున్నావు. అయ్యో ! నేను నిన్నేమి చేయగలను ? మృత్యువునకు వశపడి చావదల్చుకున్నవాడు మితృలు చెప్పే మంచిమాటలు వింటాడా ?

రావణ-మారీచులు పంచవటికి ప్రయాణమై పోతారు. మారీచుడు మాయా జింక వేషాన్ని ధరించాడు. రాముడుండే తపోవనంలోకి ప్రవేశించాడు. జానకి మాయామృగాన్ని చూస్తుంది. రావణుడు ఊహించినట్లే మాయామృగాన్ని పట్టితెమ్మని సీత కోరుతుంది రాముడుని. దాన్ని సులభోపాయంతో పట్టితెమ్మని, ఒకవేళ ప్రాణాలతో దొరక్కపోతే దాని చర్మంతోనన్నా ఆడుకోవాలని వుందని అంటుంది. అంగీకరించిన రాముడికి అది మారీచుడి మాయేనన్న అనుమానంకూడా కలుగుతుంది. అలాంటప్పుడు దానివధ అవశ్యమనుకుంటాడు. అదే విషయాన్ని లక్ష్మణుడితో చెప్పి, ఒక్క వాడి బాణంతో జింకను చంపి చర్మాన్ని తీసుకొని వస్తానని, తానొచ్చేవరకు సీతను "జటాయువు" సహాయుడుగా వుండగా రక్షింపమని అంటాడు రాముడు. అది చెప్పడానికి "మత్తకోకిలము" వృత్తంలో పద్యాన్ని రాసారీవిధంగా కవి:

మత్తకోకిలము:                   దక్షుఁ డున్ దృఢసత్త్వుఁ డున్ మతి ధైర్యయుక్తుఁ డు లక్ష్మణా !
                        పక్షిరాజు జటాయు వియ్యెడ బాసటై  చరియింపఁ గా
                        రక్షణంబు ఘటింపుమీ యుడు రాజబింబసమాస్యకున్
                        దీక్షఁ బూని ప్రమాద  మేది  ప్ర తిక్షణంబును శంకి వై -54

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ర----- గణాలు. పదకొండో అక్షరం యతి.
తాత్పర్యం:     పక్షిరాజైన జటాయువు కార్యసాధన సమర్థుడు. మిక్కిలి బలవంతుడు. కార్యాలోచన, కార్యంచేయగల ధైర్యంగలవాడు. ఆయన నీకు సహాయకుడుగా సీతాదేవిని అనుక్షణం, ఏ మూలన ఏమి ఆపద వస్తుందోనని, శంక గలవాడై-పొరపాటుపడకుండా, ఒక వ్రతంగా భావించి రక్షించు.

లక్ష్మణుడితో సీతను కాపాడమని చెప్పిన శ్రీరాముడు మాయామృగం వెంట పోతాడు. చేత్లో ధనస్సుతో వస్తున్న రాముడిని చూసిన మారీచుడు తనకు చావు తధ్యమనుకున్నాడు. మాయలుచేస్తూ రాముడికి చిక్కకుండా తిరగసాగింది జింక. అలా ఆ జింక వినోదంగా తిరుగుతున్న విధానాన్ని "మాలి" వృత్తంలో ఒక పద్యంరాసారిలా:

మాలి:           కనఁ గ గనఁ గ గాంతుల్ గ్రక్కుచున నిల్చుధ్వనిన్
                గనుచుఁ గనుచుఁ బాఱు న్దవ్వుగాఁ జిక్కకుండన్
మునుఁ గు వెఱను బాణంబుం గనున్ మింట నాడున్
వనుల దరుల డాఁ గున్ వంచనన్ గాసిమ్రాఁ గున్ - 55
తాత్పర్యం:    
రామచంద్రమూర్తి చూస్తుండగానే, కాంతులు విరజిమ్ముతున్నదానివలె, మెరుస్తూ నిలుస్తుంది. ఆయన విల్లెత్తగనే దృష్టి దానిమీదనే వుంచి, దూరంగా చిక్కకుండా పరుగెత్తుతుంది. భయపడుతున్నట్లు నటించుకుంటూ బాణం వైపు చూస్తుంది. ఆకాశంలోనే గంతులుపెట్టుకుంటూ ఆడుతుంది కాసేపు. అడవుల్లో చెట్లచాటున గుహల్లో దాక్కుంటుంది. అలసిపోయిందానిలాగా వంచనతో సోలుతుంది.

ఇలా తనతో దోబూచులాడుతున్న మాయా మృగంపై కోపగించిన రామచంద్రుడు, దాన్ని చంపాలనుకొని, బ్రహ్మాస్త్రాన్ని గురిచూసి వేశాడు. ఆ దెబ్బకు మరణించబోతున్న మారీచుడు, రావణుడికి సహాయపడదలిచి,రాముడి గొంతును అనుకరిస్తూ, "హా సీతా లక్ష్మణా" అని అఱచి చనిపోయాడు. రాముడు మారీచుడిని చంపిన తర్వాత ఆశ్రమానికి బయల్దేరి పోతుంటాడు. రాముడి గొంతువిన్న సీత లక్ష్మణుడిని అతడికి సహాయంగా పొమ్మంటే, అన్న ఆజ్ఞ ప్రకారం వెళ్లకుండేసరికి ఆమె కోపగించుకుంటుంది, నిష్టూరాలాడుతుంది. చివరకు లక్ష్మణుడు రాముడుని వెతుక్కుంటూ పోతాడు. ఆ తర్వాత రావణుడు యతి వేషంలో సీతాపహరణానికి వస్తాడు. వచ్చినవాడు రాక్షసుడని తెలిసి కూడా, కొంతసేపు ఆలశ్యంచేస్తే రామ లక్ష్మణులు రాకపోతారా అని ఎదురుచూస్తున్న సందర్భంలో తరలము వృత్తంలో ఒక పద్యం రాసారీవిధంగా:

తరలము:      వనికి వేఁ టకు జన్న భర్తయు భ్రాతతోఁ జనుదెంచునా
                యనుచు నాలుగు దిక్కులున్ జలజాయతాక్షి వనీదిశన్
                గనియెఁ గ్ాని రఘోత్తముల్ పొడకట్టరైరి, యథాస్థితిన్
                వనకుజంబులు దోఁ చు చుండెను భామచిత్తము కందఁ గన్ -56
ఛందస్సు:      తరలము వృత్తానికి న------ గణాలుంటాయి.పన్నెండో ఇంట యతి.


తాత్పర్యం:     మాయా మృగాన్ని వేటాడేందుకు అడవికి పోయిన రామచంద్రమూర్తి లక్ష్మణుడితో వస్తాడా అని, అడవి వైపు నాలుగు దిక్కులా చూసినప్పటికీ వాళ్లు కానరాలేదు. యథాప్రకారం అడవిచెట్లు మాత్రం కనిపించాయి. అది తెలుసుకొన్న సీత మనస్సు భయ సంతాపాలతో వాడిపోయింది.


No comments:

Post a Comment