(Recovered and Reloaded)
లోకహితం కోరే రామా! జయతు జయతు
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
12 వ భాగం అరణ్య కాండ
వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (18-07-2016)
శ్రీ సీతా రామలక్ష్మణులు అరణ్యవాసం కొనసాగిస్తున్న తొలినాళ్లలో,అడవిలో పోతున్నప్పుడు పర్వత శిఖరంలా పొడవైన దేహమున్న భయంకరాకారుడైన
ఒక క్రూరుడిని చూశాడు రామచంద్రమూర్తి. విరాధుడనే వాడు, సీతా
రామలక్ష్మణులను చూసి కోపంతో వారిమీద పడి సీతను చంకలో పెట్టుకొని, తన పేరు
వారికిచెప్పి, "పాపాత్ములైన
వారిని" చంపి, ఆమెను పెళ్లిచేసుకుంటానని బెదిరించాడు. భయపడుతున్న సీతాదేవిని చూసిన
రాముడు ఆమెకెంత ఆపదొచ్చిందో చూడమని తమ్ముడు లక్ష్మణుడితో అంటాడు. స్పష్ఠమైన తన
భుజబలంతో వాడిని చంపుతానని అన్నతో అంటూ లక్ష్మణుడు, విరాధుడిని, వాడెవడని, వాడి పుట్టు
పూర్వోత్తరాలేంటని అడుగుతాడు. విరాధుడిచ్చిన జవాబును "వసంతమంజరి" లో
పద్యంగా రాసారు వాసు దాసుగారు ఈ విధంగా:
వసంతమంజరి:
వినుము నా
జనకుండు జయుఁ డను వీరుఁ డంబ శతహ్రదా
ఖ్య నిఖిలావనిఁ గల్గుదనుజని కాయ మెల్ల విరాధుఁ డం
చును వచించును నన్నుఁ దపమున సూర్యవంశ్య ! వరంబునేఁ
గొనితి శస్త్రముచేత
మరణముఁ గూర కుండఁ గ బ్రహ్మచేన్ -41
తాత్పర్యం:
నా తండ్రి జయుడు. నా తల్లి
శతహ్రద. భూమిపైనున్న తనుజులందరు నన్ను విరాధుడని పిలుస్తారు. నేను తపస్సుచేసి
శస్త్రంతో చావులేకుండా బ్రహ్మ వరం పొందాను.(ఆ తర్వాత విరాధుడు రామలక్ష్మణుల చేతిలో వధించబడ్డాడు).
ఛందస్సు:
వసంతమంజరికి న-భ-భ-న-ర-స-వ
గణాలు. పదమూడో అక్షరం యతి స్థానం.
విరాధుడిని వధించిన తర్వాత సీతా రామలక్ష్మణులు శరభంగాశ్రమానికి
పోతారు. అరణ్యవాసంలో తాము నివసించుటకు నివాసయోగ్యమైన స్థలమేదో సూచించమని రాముడు
కోరగా, శరభంగుడు వారుండుటకు తగిన స్థలం సుతీక్ష్ణుడను మునీంద్రుడు
తెలియచేస్తాడని అక్కడికి పొమ్మని చెప్పి తన దేహం వదిలినతర్వాతే అక్కడనుండి
వెళ్లమని ప్రార్తించాడు. అక్కడున్న మునులందరూ తమకష్టాలను చెప్పి తమను కాపాడమని
కోరడంతో వారికి రాముడు అభయ హస్తమిచ్చిన తర్వాత,బయలుదేరి సుతీక్ష్ణాశ్రమానికి చేరుకుంటారు ముగ్గురూ. ఆ రాత్రి అక్కడే
గడుపుతారు వారందరూ. ఆయన సలహామేరకు పంచవటికి ప్రయాణమైపోతుంటారు. బయల్దేరేముందర
దాచిపెట్టిన ఆయుధాలను రామలక్ష్మణులకు అందచేస్తుంది సీత. దారిలో సీతాదేవి
శ్రీరాముడికి వెంటవస్తున్న లక్ష్మణుడు వింటుండగానే రాబోయేకాలంలో సంభవించనున్న
పరణామాలను గ్రహించినదానివలె కొన్ని హితబోధలు చేస్తుంది. ఆ క్రమంలోనే సీత రాముడికి
శస్త్ర సాంగత్య దోషాన్ని తెలియచేసే ఇతిహాసాన్ని చెపుతుంది. శస్త్రాన్ని
ధరించినట్లైతే దాన్ని ఉపయోగించాలన్న కోరిక పుటుతుందనీ, కాబట్టి
అడవుల్లో వాటిని ధరించవద్దనీ, అయోధ్యకు
చేరిన తర్వాత ధర్మ రక్షణార్థం శస్త్రం ధరించవచ్చనీ హితబోధచేస్తుంది. ఇక్కడ
"మంజుభాషిణి" వృత్తంలో ఒక పద్యాన్ని రాసారు కవి ఈ విధంగా:
మంజుభాషిణి: సిరిఁ యున్
ధరన్ విడిచి చేరి కానలన్
జరియించునీ
విపుడు సం యమింబలెన్
దిరుగం
దపోనియతి దేవ మోదముం
బరఁ గించు
నత్తకును మామగారికిన్ -42
ఛందస్సు:
మంజు భాషిణీ వృత్తానికి
స-జ-స-జ-గ గణాలుంటాయి. 9వ అక్షరం యతి. సీత "మంజు భాషిణి" అయినందున ఇక్కడ
"మంజుభాషిణి" వృత్తంలో పద్యం రాయడం సమంజసమే అంటారు వాసు దాసుగారు.
తాత్పర్యం:
అనుభవించాల్సిన ఐశ్వర్యం, పాలించాల్సిన
భూమి వదిలిపెట్టి,మునిలాగా అడవులకు చేరిన నువ్వు
మునుల్లాగానే తపస్సు చేస్తుంటే రాముడు యదార్థ వాది - తనతో చెప్పినట్లే
చేస్తున్నాడని కైక సంతోషిస్తుంది. తన కొడుకు విశేష శ్రమ పడకుండా సుఖంగా వున్నాడని
కౌసల్య కూడా సంతోషిస్తుంది. వీరే కాకుండా స్వర్గంలోని మామగారు తన కొడుకు తనను
సత్యవాదిని చేస్తున్నాడని సంతోషిస్తాడు. కావున అలానే చేయి.
సీత హితోపదేశాన్ని విన్న రాముడు ఆర్త రక్షణే పరమ ధర్మమని అంటాడు.
అడవుల్లో తపస్సు చేసుకుంటున్న మునుల రక్షణ కూడా ధర్మ రక్షణార్థమేనంటాడు. మునులను
కాపాడుతానని ప్రతిజ్ఞ చేసానని,బ్రాహ్మణులకిచ్చిన మాటతప్పి తన ప్రతిజ్ఞ విడువనని సత్యాన్ని
రక్షించేందుకు ప్రాణాలనైనా, భార్యనైనా, తమ్ముడినైనా
విడుస్తానని స్పష్ఠంగా తెలియచేశాడు సీతకు. ఇలా చెప్పుకుంటూ ముగ్గురూ పయనమై
పోతుంటారు. వాళ్లలా పోవడాన్ని ప్రణవ స్వరూపం-ప్రణవార్థం వచ్చే విధంగా తేటగీతిలో
రాసిన పద్యం ఇలా సాగుతుంది: "అగ్రవర్తియై శ్రీరాము డరుగుచుండె, నువిదతనుమధ్య
మధ్యమందుండెసీత, మహిత
కోదండదండ సంభరణ హస్తు, డోలి
వెన్నంటె లక్ష్మణుడొప్పుప్రేమ". మొదటిపాదం మొదటి అక్షరం "అ" కారం, రెండవ పాదం
మొదటి అక్షరం "ఉ" కారం, మూడోపాదం
మొదటి అక్షరం "మ" కారం వున్నాయి. మూడు కలిసి "ఓం" అయిందని, అలానే
నాలుగోపాదం మొదటి-కడపటి అక్షరం కలిసి "ఓం" అయిందని కవి వివరించారు. ఈ
విధంగా ఈ పద్యం ప్రణవ స్వరూపమని అంటారాయన. ఈ ప్రణవార్థం పరమార్థ తత్త్వాన్ని
విపులంగా చూపిస్తుంది. ఇక్కడ "మానిని" వృత్తంలో , అక్కడి పరిసరాలను వర్ణిస్తూ, ఒక
పద్యాన్ని రాసారు వాసు దాసుగారిలా:
మానిని: సారము
లౌనవసారసకై రవ సౌరభవాసితభాసితకా
సారములుం దటినీతటసై కత
సంచరదంచితచక్రయుగీ
వారములున్ గిరిసుందరకందర
పాతసుపూతఝరీలహరీ
పూరములున్ సుమమంజులకుంజక పుంజితగుంజదళీంద్రములున్-43
ఛందస్సు:మానిని వృత్తానికి
సప్త "భ" గణాలుంటాయి. ఒక గురువు. 13 వ అక్షరం యతి.
తాత్పర్యం:
సారవంతాలై కొత్తగా వికసించిన
కమలాల కలువల పరిమళాల గుంపులతో
ప్రకాశించే
కొలకులతో, నదీతీరంలోని ఇసుక దిబ్బల్లో తిరిగే అందమైన చక్రవాక దంపతుల సమూహాలతో, కొండల్లోని
సుందరమైన గుహల్లో పడుతున్న నీళ్లున్న పవిత్రమైన కొండవంకల ప్రవాహాలనే పూలతో, అందమైన
పొదల్లోని గుంపుల తుమ్మెదలతో (నిండిన ప్రదేశం).
అగస్త్యాశ్రమానికి పోవడానికి సుతీక్ష్ణుడి అనుమతి తీసుకొంటాడు
శ్రీరాముడు. తానే వారిని అక్కడికి పొమ్మమనమని చెప్పదల్చుకున్నానని,దక్షిణంగా నాలుగు యోజనాలు వెళ్తే అగస్త్యుడి సోదరుడి ఆశ్రమం
వస్తుందని,అక్కడినుంచి మరో ఆమడ దూరంలో
అగస్త్యుడి ఆశ్రమం వుంటుందని అంటాడాయన. అలా ఆయన ఆజ్ఞ తీసుకొని పోతున్న సందర్భాన్ని
"తరలము" వృత్తంలో రాసారు వాసు దాసుగారిలా:
తరలము: ముని వచించినత్రోవచొప్పున
మువ్వురున్ వనిఁ బోవుచున్
గనిరి
త్రోవల క్రేవలన్ ఘన కంధరాకృతబంధురం
బును
ధరప్రచయంబునున్ సుమ పూర్ణరమ్యవనంబులన్
గొనబుమీరినవంకలం
దమి గూర్చు మేలికొలంకులన్ -44
ఛందస్సు:
తరలము వృత్తానికి
న-భ-ర-స-జ-జ-గ గణాలుంటాయి. పన్నెండో ఇంట యతి.
తాత్పర్యం:
సుతీక్ష్ణ మహాముని చెప్పిన తోవ
పట్టుకొని అడవిలో ముగ్గురు బయలుదేరి పోతూ, మార్గ
మధ్యంలో, ఇరుపక్కల కారుమబ్బులాగా విస్తారమైన కొండలగుంపును, పూలతో
నిండిన మనోహరమైన వనాలను, అందమైన వంకలను,సంతోషం కలిగించే సరస్సులను చూసారు.
సీతారామ లక్ష్మణులు అగస్త్యాశ్రమానికి చేరుకొని, ఆయన దర్శనం
చేసుకుంటారు. ఆయన ఇచ్చిన వైష్ణవాయుధాలను తీసుకొంటాడు రాముడు. అక్కడికి రెండామడల
దూరంలో "పంచవటి" అనే సుఖప్రదమైన ప్రదేశం వుందని, అక్కడొక
ఆశ్రమం నిర్మించుకొని, అరణ్యవాసాన్ని
పూర్తిచేసి, తండ్రి వాక్యాన్ని పాలించమని సలహా ఇస్తాడు. పంచవటికి పోయే
మార్గాన్నికూడా వివరంగా చెప్తాడు. ఆయన చెప్పిన మార్గంలో పోతుంటారు వాళ్లు. దారిలో
జటాయువును చూస్తారు. అక్కడినుండి బయల్దేరి "పంచవటి" చేరుకుంటారు.
అక్కడికి చేరుకున్నప్పుడు, ఆ ప్రదేశంలోని
చెట్లను రాముడిద్వారా వర్ణించడాన్ని "మత్తకోకిలము" వృత్తంలో పద్యంగా
మలిచారిలా కవి:
మత్తకోకిలము: సాలతాలత మాలతుంగర సాలజాల మధూకకు
ద్దాల వంజుల నక్తమాలవి
తానసిందుక చందనో
ద్దాలచంపకపారిజాతక దంబనింబకపిత్థత
క్కోలకేసరజంభకింశుక
కూటపాటలకోటులన్ -45
ఛందస్సు: మత్తకోకిలము
వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో
అక్షరం యతి.
తాత్పర్యం:
మద్దిచెట్లు, తాటిచెట్లు, చీకటి
మ్రాకులు, తియ్య మామిడిచెట్లు,ఇప్ప, కాంచన చెట్లు, అశోక, కానుగు, సిందుక
చెట్లు,సంపంగి, పారిజాత, వేప, వెలగ, పొన్న, నిమ్మ, మోదుగు.. ..
చెట్ల సమూహాలతో కూడిన ప్రదేశం.
లక్ష్మణుడు పంచవటిలో పర్ణశాల నిర్మిస్తాడు. అందులో వారు ముగ్గురు
మిక్కిలి సుఖంగా నివసిస్తుంటారు. వనవాసం చేద్దామని రాముడు సంకల్పించుకున్న
పద్నాలుగు సంవత్సరాలలో పదమూడో సంవత్సరం జరుగుతుంటుంది. ఆ సంవత్సరపు మార్గశిర
మాసంలో ఒకనాడు, గోదావరి స్నానం చేసి వచ్చి, పర్ణశాలలో
ముగ్గురూ ముచ్చటించు కుంటుంటారు. ఆ సమయంలో శ్రీరాముడిని చూసిన శూర్ఫణఖ ఆశ్రమంలో
కొస్తుంది. రాముడిని మోహిస్తుంది. తన కోర్కెను వెల్లడిస్తుంది. పరిహాసంతో రాముడు, తమ్ముడు
లక్ష్మణుడిని చూపించి ఆయన దగ్గరకు పొమ్మంటాడు. ఆమె లక్ష్మణుడి వెంట బడుతుంది.
లక్ష్మణుడు తనకంటే రాముడే తగినవాడని అక్కడకు పంపుతాడు. రాముడి వద్దకు పోయిన
శూర్ఫణఖ సీతను మింగుతానని భయపెడుతూ ఆమె మీదకు పోతుంటే, ఒక
పద్యాన్ని "తరలము" వృత్తంలో రాసారు వాసు దాసుగారిలా:
తరలము: అని
కురంగకిశోరలోచన నాయలాతనిభాక్షి హు
మ్మనుచు
రోహిణిమీఁ ద బారు మహత్తరోల్క యనంగ రాఁ
గని
మహాబలశాలి రాముఁ డు గ్రక్కునం బిగఁ బట్టి కిం
కను
సుమిత్రతనూజుతో ననుఁ గంటె లక్ష్మణ రక్కసిన్ -46
ఛందస్సు: తరలము
వృత్తానికి న-భ-ర-స-జ-జ-గగణాలుంటాయి. పన్నెండో
ఇంట యతి.
తాత్పర్యం:
ఈ ప్రకారం చెప్పి, జింకపిల్ల
కళ్లలాంటి కళ్లున్న సీతపై, కొరివితో
సమానమైన కళ్లున్న శూర్ఫణఖ రోహిణిమీదకు కొరివి నక్షత్రం పోయినట్లు పోవడం చూసిన
శ్రీరాముడు దాన్ని బిగబట్టి కోపంతో లక్ష్మణుడి తో ఇలా అంటాడు.
నీచులతో పరిహాసాలాడడం తప్పనీ, శూర్ఫణఖను
సరైన రీతిలో శిక్షించాలనీ, దానిని
విరూపనుగా చేయమనీ లక్ష్మణుడిని ఆదేశించాడు రాముడు. లక్ష్మణుడు ఆమె ముక్కు-చెవులు
తెగగోసి వికార రూపంగా చేశాడు. ఆ వికృత రూపాన్ని చూసిన దాని తమ్ముడు ఖరుడు
కోపగించుకుంటాడు. ఆమె వికార రూపానికి కారణమైన సీతారామలక్ష్మణుల
వృత్తాంతాన్నితెలుసుకుంటాడు. పగ తీర్చుకునేందుకు పద్నాలుగు మంది రాక్షసులను
శ్రీరాముడి మీదకు యుద్ధానికి పంపగా వారందరూ ఆయన చేతిలో చస్తారు. వెంటనే శూర్ఫణఖ
ఖరుడిని రాముడిపై యుద్ధానికి ప్రేరేపించడంతో వాడు తన పద్నాలుగు వేలమంది సైన్యంతో
పోతాడు. సింహనాదం చేస్తూ యుద్ధానికి సన్నద్ధమౌతున్న ఖరుడిపై గెలవాలని కాంక్షిస్తూ
ఆకాశం నుండి వీక్షిస్తున్న దేవతలు, సిద్ధులు, మునులు
రాముడికి శుభం కలగాలని కోరుకుంటున్న విధానాన్ని "మాలిని" వృత్తంలో
పద్యంగా రాసారిలా:
మాలిని: జయతు జయతు
రామ స్సం యుగే సర్వదై త్యా
న్న
యగుణహీతచక్రీ వాశరా న్నంచు మింటన్
రయమునఁ
జనుదేరన్ రాక్షసక్రూరసేనా
చయములఁ గని
రంతన్ సంభ్రమోత్సాహదీప్తిన్ -47
ఛందస్సు:
మాలినికి న-న-మ-య-య గణాలు, తొమ్మిదో
ఇంట యతి.
తాత్పర్యం:
లోకహితం గోరి శుభకార్యాలు చేసే
సుదర్శన చక్రధారైన విష్ణువు రాక్షసులను జయించిన విధంగా, శ్రీరామచంద్రుడు
సర్వ రాక్షసులను యుద్ధంలో జయించాలని అంటూ, ఆకాశం నుండి
(వీక్షిస్తున్న దేవతలు, సిద్ధులు, మునులు)
రాక్షస సేన సంతోషంతో-ఉత్సాహంతో ప్రకాశిస్తుండగా చూసారు.
No comments:
Post a Comment