Sunday, December 20, 2020

విలక్షణమైన ప్రబంధ గ్రంథమే రామాయణ కథనం ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-36 : వనం జ్వాలా నరసింహారావు

 విలక్షణమైన ప్రబంధ గ్రంథమే రామాయణ కథనం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-36

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (21-12-2020)

లోక రక్షణ కొరకు భూమ్మీద అవతరించిన శ్రీరామచంద్రమూర్తి ప్రజా పాలన చేస్తున్న రోజుల్లో, భగవంతుడైన వాల్మీకి మహర్షి, లోకోపకారంగా, చిత్రమైన పదాలతో, ఇరవై నాలుగువేల శ్లోకాలతో రామాయణ రచన చేశాడు. పూర్వ రామాయణంలోని ఆరు కాండలలో ౫౩౭ (537) సర్గలుంటే, శ్రీరామ పట్టాభిషేకం తర్వాత జరిగిన కథకు సంబంధించిన ఉత్తర కాండలో మరో ౧౧౦ (110) సర్గలున్నాయి. అదేవిధంగా శ్రీరామ పట్టాభిషేకం అనంతరం ఈ గ్రంథాన్ని లోకానికి ప్రకటించినవారు కుశ లవులు. ఇంత గొప్ప బృహత్తర గ్రంథాన్ని రచించిన వాల్మీకి, ఓపిగ్గా దీన్నంతా కంఠంస్థం చేయగల శక్తిమంతులు ఎవరన్నా వున్నారానని ఆలోచించసాగాడు.

సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు

బాల కాండ             ౭౭    (77)    సర్గలు           ౨౨౫౬ (2256)       శ్లోకాలు

అయోధ్య కాండ        ౧౧౯  (119)   సర్గలు           ౪౪౧౫ (4415)        శ్లోకాలు

అరణ్య కాండ            ౭౫   (75)    సర్గలు           ౨౭౩౨  (2732)       శ్లోకాలు

కిష్కింధ కాండ          ౬౭   (67)     సర్గలు           ౨౬౨౦ (2620)       శ్లోకాలు

సుందర కాండ          ౬౮  (68)     సర్గలు           ౩౦౦౬  (3006)       శ్లోకాలు

యుద్ధ కాండ           ౧౩౧ (131)    సర్గలు           ౫౯౯౦ (5990)       శ్లోకాలు

ఉత్తర కాండ             ౧౧౦ (110)    సర్గలు           ౩౨౩౪  (3234)       శ్లోకాలు

--------------------------------------------------------------------------------

ఏడు కాండలు          ౬౪౭ (647)   సర్గలు           ౨౪,౨౫౩ (24,253)  శ్లోకాలు

ప్రబంధ వైలక్షణ్యాన్ని తెలియచేసే సర్గ ఇది. పరమ ఆప్తుడైన కవి రచించడం, కీర్తిమంతుడైన నాయకుడు ప్రతిపాద్యుడిగా వుండడం, మహాత్ములు దాన్ని అంగీకరించడం, సాక్షాత్తూ కథానాయకుడే దాన్ని శ్లాఘించడం లాంటి విషయాలను కలిగున్న గ్రంథాన్ని "ప్రబంధ వైలక్షణ్య" మున్న గ్రంథ మంటారు. సర్గలోని మొదటి పద్యంలోనే ఈ విషయం విశదమవుతుంది. సమస్త సద్గుణాలతో లోకులందరినీ ఆనందపర్చిన శ్రీరామచంద్రుడి చరిత్రై నందువల్ల, రామాయణం కడు ఆదరణీయమైంది. శ్రీరామ చరిత్ర అంటే మహాపురుష చరిత్రే.. అందుకే దీనివలన ఎన్నో లాభాలున్నాయన్న భావన కూడా మొదటి పద్యం లోనే వివరించబడింది. శ్రీరామచంద్రమూర్తి రాజ్యం చేసే రోజుల్లో, సీతాదేవి తన ఆశ్రమం చేరిన తర్వాతే, వాల్మీకి రామాయణ రచన చేశారన్న విషయం కూడా ఈ పద్యంలో స్పష్టంగా బోధపడ్తుంది. శ్రీరామచంద్రమూర్తి అవతరించడానికి పూర్వమే వాల్మీకి రామాయణం రచించాడనడం సత్యదూరం.

(స్థూల దృష్టితో పెద్ద సంఖ్య చెప్పేటప్పుడు దాని పైనున్న చిల్లర సంఖ్య గణించాల్సిన పనిలేదు. అందుకే రామాయణంలో ౨౪ (24) వేల శ్లోకాలని చెప్పడం జరిగింది. రామాయణంలోని శ్లోకాలు, సర్గలు, కాండల వివరాలు కూడా (మొదటి) ఈ క్రింది పద్యంలో చెప్పడం జరిగింది).

సీ:      భువనావనార్థంబు భూమిపై జన్మించి, ప్రాప్తరాజ్యుండయి ప్రజలరాము

         డోముచు నుండ లోకోపకారంబుగ, భగవంతు డగు ఋషి వాల్మికుండు

         శ్రీరాము చరితంబు చిత్రపదంబుల, వెలయ నిర్వదినాల్గు వేలు శ్లోక

         సంఖ్యయు, వానిని సర్గముల్ గాగను, పూర్వరామాయణ మనను నూరు

తే:      లేను, కాండంబులారుగ  జానుమీర, వెండియునుబల్కె  బదపడి కాండమొండు

పావనంబై న రఘురాము భావికథను, సో త్తరంబుగ నెల్ల రసోత్తరముగ.

ఇలా ఆలోచిస్తున్న వాల్మీకి వద్దకు అసమాన బుద్ధి-చమత్కారాలున్న ఇద్దరు బాలురు వచ్చారు. ముని వేషాలు ధరించిన వారిరువురు, వాల్మీకికి మిక్కిలి భక్తితో నమస్కరించి, తామీ గ్రంథాన్ని సమగ్రంగా ముఖస్థం చేస్తామని అంటారు. క్షత్రియ జాతి బాలురైన ఆ ఇద్దరు, చంద్రుడిలాగా తెల్లటి కీర్తితో ప్రకాశిస్తున్నారు. గురు శుశ్రూషా ధర్మం చక్కగా తెలిసిన వారిలా కనిపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకాశిస్తుండె విష్ణు తేజం లాంటి కోల్పోని తేజముంది వారిరువిరిలో. వారుండేది వాల్మీకి ఆశ్రమంలోనే. చక్కని మేధ, సామగాన విద్యల్లో ఎవర్నైనా జయించి కీర్తి పొందగలిగే శక్తి-సామర్థ్యాలు, చలించని వేద మార్గం, నిష్ఠ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి వారిలో. కుశ-లవులనే పేర్లున్న ఆ బాలురు-అన్న తమ్ములు, తనకు సాష్టాంగ నమస్కారం చేసి నిలబడగానే, వారిని గమనించిన వాల్మీకి, వేదార్థాన్ని విశదపరిచే తన ఉత్తమ కావ్యాన్ని-దాని యోగ్యతకు తగ్గట్టే పఠనం చేయగల యోగ్యులు, సమర్థులు, వీరేనని నిర్ణయించుకుంటాడు. (యోగ విద్యను మేధావులు-నియతాత్ములైన వారికే ఇవ్వాలి. అయోగ్యులకు ఇవ్వకూడదు. అయోగ్యులు రామాయణం చదివి వ్యక్తం చేస్తున్న భావాలు-దురాపేక్షలు అందరికీ తెలిసినవే). ఎన్నో వ్రతాలను చేసినందువల్ల అత్యధికమైన జ్ఞానాన్ని, మహిమలను సంతరించుకున్న వాల్మీకి మహర్షి, రావణ వధ అనే నెపంతో, ప్రసిద్ధమైన వాక్యాలను వున్నదున్నట్లుగా, సీతామహాచరిత్రగా రచించాడు రామాయణాన్ని. అదొక మహాకావ్యం-గ్రంథం అయింది.


(గ్రంథాలు మూడు రకాలు. ప్రభు సమ్మిత శబ్ద ప్రధానమైంది మొదటి రకం - అంటే, శబ్దాల ఆడంబరంతో రాజులాగా ఆజ్ఞాపించేది. ఇక రెండో రకం సుహృత్సమ్మిత అర్థ ప్రధానమైంది - అంటే, స్నేహితుడివలె బోధించేది. కాంతా సమ్మిత వ్యంగ్య ప్రధానమైంది మూడో రకం - అంటే, వ్యంగార్థమే ప్రధానంగా వుండి, ప్రియురాలివలె మనస్సుకు నచ్చచెప్పి చేయించేది. రామాయణం అర్థ ప్రధానమై ఇతిహాసంగాను - వ్యంగ్య ప్రధానమై కావ్యంగాను ప్రసిద్ధి పొందింది. రామాయణాన్ని సీతా మహా చరిత్ర అంటాడు వాల్మీకి. రామచంద్రమూర్తి చరిత్రకంటే, సీతాదేవి చరిత్ర ఉత్కృష్టమైందని దానర్థం. కౌసల్యా గర్భ సంభూతుడు రాముడు. అయోనిజ సీత. తండ్రి ఆజ్ఞ ప్రకారం అడవులకు వెళ్లినవాడు రాముడు. ఎవరి బలవంతం లేకపోయినా, కేవలం పతిభక్తితో అడవులకు పోయింది సీత. కష్ట కార్యాలు చేసినందువల్ల గట్టి దేహం కలవాడు రాముడైతే, ఎండకన్నెరుగని సుకుమారి సీత. స్వతంత్రుడై, శక్తుడై, తోడున్నవాడై, దుఃఖం అనుభవించాడు రాముడు. రాక్షసుడికి బందీగా, ప్రాణ భయంతో, నిరాహారిగా, అశక్తిగా, ఒంటరిగా దుఃఖ పడింది సీత. భక్తుల దోషాలను క్షమిస్తానన్నాడు రాముడు. భక్తుల్లో దోషాలే లేవన్నది సీత. కాకాసురుడికి శిక్ష విధించి క్షమించాడు రాముడు. తనను బాధించిన రాక్షస స్త్రీలను క్షమించింది సీత. లోకపిత రాముడైతే, లోకమాత సీత. తన చరిత్రకంటే సీతాదేవి చరిత్రే శ్రేష్ఠమైందని రామచంద్రమూర్తే స్వయంగా అంటాడొకసారి. అందువల్లనె రామాయణాన్ని సీతా మహాచరిత్రమంటాడు వాల్మీకి మహర్షి).

వాల్మీకి రచించిన రామాయణ మహాకావ్యం చదివినా, విన్నా, పాడినా వీనులకింపై-మనస్సుకు సంతోషకరమై-శుభకరమై వుంటుంది. ద్రుతం-మధ్యం-విలంబితం అనే కాలాల ధ్వని-పరిచ్ఛేదాలతో నిండిన పాటలకు అనువైన కావ్యమిది. "స-రి-గ-మ-ప-ద-ని-స" (షడ్జం-ఋష్ట్రభం-గాంధారం-మధ్యమం-పంచమం-దైవతం-నిషాదం, అనే సప్త స్వరాల సంజ్ఞాక్షరాలు) అనే స్వరాలతో-జాతులతో బంధించబడినదై, గాన లోపాలు లేనిదై, వీణపై వాయించేందుకు అనువైనదై, తాళాలకు-లయకు సరిపోయిందై అలరారుతుందీ కావ్యం. శృంగార, హాస్య, కరుణ, వీర, రౌద్ర, శాంతి, అద్భుత, భయానక, బీభత్స అనే నవరసాలతో నిండినదైనప్పటికీ, శృంగార రసమే ప్రధానంగా వున్న మనోజ్ఞమైన కావ్యం రామాయణం. ఇంత గొప్పదైన రామాయణాన్ని గానం చేసేందుకు అనువైన రీతిలో కుశ లవులకు నేర్పించాడు వాల్మీకి. శ్రీరామచంద్రుడి ప్రతిబింబాలనదగిన కుశ లవులు గాన విద్యలో సమర్థులు.ఆ బాలురు సుందరమూర్తులు- మంద్ర, మధ్య తారల స్వరాల విషయాలను తెలిసిన వారందరిలో అగ్రగణ్యులు. ఇంపైన కంఠ స్వరమున్న వారు. మనోహరంగా మాట్లాడగలరు. నాటక లక్షణ శాస్త్రం చక్కగా తెలిసిన వారు. (కుశ లవులకు రామాయణం వాల్మీకి నేర్పడం కాకుండా, స్వయంగా కంఠస్థం చేసి సభల్లో పాడగల నైపుణ్యం వుంది).

 

Saturday, December 19, 2020

కోపం లేని రాముడు సహజ గుణం వదలవచ్చా? : వనం జ్వాలా నరసింహారావు

 కోపం లేని రాముడు సహజ గుణం వదలవచ్చా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం శనివారం (19-12-2020) మధ్యాహ్నం ప్రసారం 

మాయా జింకను రాముడు సంహరించిన తరువాత పర్ణశాలలో లక్ష్మణుడు కూడా లేని సమయం చూసి రావణుడు సీతాదేవిని అపహరించాడు. ఇక్కడ ఇలా వుంటే,  దండకలో రాముడి సంగతి వేరే విధంగా వుంది. ఆశ్రమానికి రావాలని త్వర-త్వరగా వస్తుంటే, వెనుక పక్క అశుభం సూచిస్తూ నక్క కూత వినిపించింది. కీడు కలుగుతుందని భావించిన రాముడు, రాక్షసులు సీతను ఎత్తుకు పోయారేమో అని అనుమానిస్తాడు. నడుచుకుంటూ వస్తున్న రాముడికి మృగాలు, పక్షులు, కుడి నుండి ఎడమవైపుగా భయంకర ధ్వని చేసుకుంటూ పోవడం జరిగింది. ఇది చూసి, లక్ష్మణుడిని, సీతను గురించి ఆలోచించుకుంటూ ఆలశ్యం చేయకుండా పోసాగాడు రాముడు.

         రాముడు ఆశ్రమాన్ని సమీపించాడు. అక్కడే ముఖం వేలాడవేసుకుని, ఒంటరిగా వస్తున్న తమ్ముడిని చూశాడు. వెంటనే ఏదో కీడు జరిగిందని శంకించాడు. తమ్ముడిని సమీపించి, మొదలు పరుశంగాను, తరువాత మృదువుగాను, ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఎడమకన్ను అదురుతున్నది.  సంతోషం మనస్సులో ఏమాత్రం లేదు. ఆశ్రమంలో సీత లేదు. పగ తీర్చుకోవడానికి రాక్షసులు ఆమెను పట్టుకుని పోయారో లేక వారి బాధ పడలేక ఆమే చనిపోయిందో లేక మనల్ని వెతుక్కుంటూ వచ్చి దారి తెలియక వేరే తోవలో ఎక్కడికైనా పోయిందో?”

“లక్ష్మణా! చెప్పు, సీత ప్రాణంతో వుందా? రాక్షసులు మింగారా? ఎత్తుకు పోయారా? మారీచుడి అరుపుకు సీత మోసపోయినా, నువ్వెలా మోసపోయావు? సీత పొమ్మన్నా రక్షించాల్సిన వాడివి అబలను ఒంటరిగా వదలి ఎలా వెళ్లావు? వెళ్లి మనకు కీడు చేసే రాక్షసులకు అవకాశం ఇచ్చావు. రాక్షసులు ఆమెను చంపారో? ఏమో? ఇలా జరగవచ్చని కొంచెమైనా ఆలోచించావా? అయినా నిన్ను అని ప్రయోజనం లేదు. ఈ గతి నాకు కలగాలని మీకీ బుద్ధి పుట్టించాడు” అని సీతకొరకై రాముడు వెక్కి-వెక్కి ఏడ్చాడు.

         “నువ్వు సీతను రక్షిస్తావని నమ్మి కదా సీతను ఒంటరిగా నీ స్వాధీనంలో వుంచి నేనిలా వచ్చాను? నేను కాపాడలేక నీకాపని అప్పచెప్పానా? ఆ స్త్రీరత్నాన్ని అడవిలో ఒంటరిగా వదలిపెట్టి ఇక్కడేదో మునిగిపోయినట్లు పరుగెత్తుకుంటూ వచ్చావు. నిన్ను చూసింది మొదలు నాకేదో భయంగా వుంది లక్ష్మణా. వచ్చినవాడివి సీతను కూడా తీసుకుని రావచ్చుకదా? ఆమె లేకుండా నువ్వు ఒక్కడివే రావడం దూరం నుండే చూసిన నాకు గుండె పగిలింది. ఎడమ భుజం, ఎడమ కన్ను అదిరాయి. కొంప మునిగింది కదా అనుకున్నాను”.

         రామచంద్రమూర్తి తనమీద నింద వేయడంతో, దోషం ఆరోపించడంతో, ఆయన పడుతున్న దుఃఖబాధను గమనించి, ఇంతకు పూర్వమే సీత మాట్లాడిన మాటలకే నొచ్చుకున్న లక్ష్మణుడు మరింత నొచ్చుకుని ఇలా జవాబిచ్చాడు అన్నకు. “అన్నా! ఆ ధ్వని నీ గొంతుక ధ్వని అని మోసపోయి స్వతంత్రించి నాకై నేను రాలేదు. ‘సీతా, లక్ష్మణా, కావరే’ అనే ధ్వని అరణ్యంలో రాగా సీత విని భయపడి నన్ను పొమ్మని, బలవంతపెట్టింది. ‘రాముడికి భయం లేదమ్మా అని ఆమెకు నమ్మకం కలిగేలా ఎంతో చెప్పాను. “రాముడికి తమ్ముడివి కాదు. ఎప్పుడు వీలవుతుందా, ఎప్పుడు సీతను హరిస్తానా? అన్న ఆశతో నా కోసమే నా మగడి వెంట వచ్చావు’ అన్నది. ఈ మాటలు వినగానే నా పెదవులు అదిరాయి. కళ్ళు ఎర్రగా అయ్యాయి. కోపం పట్టలేక, అక్కడ వుండలేక ఆశ్రమం వదిలి వచ్చాను. అన్నా! వున్న విషయం చెప్పాను. “

         లక్ష్మణుడు ఇలా చెప్పడంతో, రాముడు, “నువ్వు సీతను విడిచి రావడం సరైన పనికాదు. ఇప్పుడేమనుకున్నా ఏం ప్రయోజనం? స్త్రీలకు కోపం వస్తే ఏదో అంటారు. అందునా, భర్తకు కీడు కలిగిందని భయంతో, శోకంతో, పీడించబడ్డ వారి విషయం చెప్పాల్నా? ఇవన్నీ నువ్వు ఆలోచించకుండా సీత కోప్పడ్డదని నువ్వు కూడా కోపంతో నా శౌర్యం, నా శక్తి తెలిసికూడా ఆడదాన్ని ఒంటరిగా అడవుల్లో వదిలి వచ్చావే? ఏమనాలి నిన్ను? నా ఆజ్ఞ జవదాటావుకదా?” అన్నాడు.

         రాముడు తాను చెప్పదలచుకున్న మాటలను లక్ష్మణుడికి చెప్పి, త్వర-త్వరగా ఆశ్రమం వైపు అడుగులు వేస్తుంటే, ఎడమకన్ను కిందిభాగంలో అదిరింది. కాళ్లు కూలబడ్డాయి. దేహం వణకడం మొదలైంది. తన ఆశ్రమం ప్రవేశించి వెదికిచూసిన రాముడు సీత లేదని నిశ్చయించుకుని, మనసు కలత చెందగా ఆమెను తలచుకుని ఏడ్చాడు.

         సీత ఏమైందోనని రకరకాల ఆలోచించడం మొదలెట్టాడు. “ఎక్కడి పోయి వుంటుంది? నేనేం చేయాలి? ఎక్కడ వెతకాలి? ఎలా వెతకాలి? ఈ పాడు అడవిలో ఎవరిని అడగాలి?” అనుకుంటూ, సీతను వెతికి-వెతికి కళ్ళు వుబ్బేట్లు రామచంద్రమూర్తి ఏడ్చాడు. దుఃఖం ఎక్కువవతుంటే ఎర్రగా అవుతున్న కళ్ళతో, వికారమైన చూపులతో, పిచ్చి పట్టిన వాడిలాగా, మూర్ఖుడిలాగా ఏడ్చాడు. తనకెవరు దిక్కని అనుకున్నాడు. సీతాదేవి దాక్కున్నదేమో అని చెట్టు-చెట్టు దగ్గరకూ పరుగెత్తాడు రాముడు. గుట్ట-గుట్టకూ పరుగెత్తాడు. బాగా ఏడ్చాడు. ఎక్కడ కూడా సీత లేనందున మనసులో తల్లడిల్లుతు మూర్చపడి, లేస్తూ, సొక్కుతూ, ఆరాటపడుతూ, ఆ అడవిలో సీతను వెతికినా ఎక్కడా కనపడలేదామె.

కలతచెందిన శ్రీరామచంద్రుడు, సీతాదేవి రాక్షసుల చేతిలో చిక్కి మరణించిందేమోనని అనుమాన పడతాడు. ఒక వనం తరువాత మరో వనంలొ వెతుకుతూ, భ్రమతో, సీతా-సీతా అని పిలుస్తూ వెర్రివాడిలాగా శోకించాడు.  సీతాదేవిని వెతుక్కుంటూ సహించలేని బాధతో వున్న అన్నకు లక్ష్మణుడు హితవాక్యాలను చెప్పాడు. బాధ పడవద్దన్నాడు. కొండలు, గుట్టలు, కోనలు, నదులు, కాన్లు, కొలకులు వెతికి-వెతికి సీతాదేవి జాడ లేకపోయేసరికి దుఃఖం ఎక్కువైంది అన్నదమ్ములకు. వాస్తవానికి సీతాదేవి తన ఎదురుగా లేకపోయినా, మన్మథతాపం వల్ల కళ్లకు కట్టినట్లు దగ్గరే వున్నట్లు భావించిన శ్రీరాముడు, ఆ సీతను గురించి గద్గద స్వరంతో, మాట కూడా సరిగ్గా రాకుండా, తన బాధ ఇలాంటిదని చెప్పనలవి కాకుండా, విచారంతో చాలా-చాలా అన్నాడు, తనలో అనుకున్నాడు. తమ్ముడు లక్ష్మణుడిని అయోధ్యకు పొమ్మన్నాడు.

         ఈ విధంగా రామచంద్రమూర్తి విలపిస్తుంటే లక్ష్మణుడు రాముడిని ఉరట పరచడానికి కాలానుగుణమైన కొన్ని మాటలు చెప్పాడు. “అన్నా! ఏడవవద్దు. సంతాపంతో శుష్కించి విచారించవద్దు. ధైర్యంగా వుండు. శోకంతో కృశించవద్దు. స్త్రీరత్నమైన సీతాదేవిని వెతుకుదాం.”.

స్త్రీపురుషుల సంయోగం వల్ల కలిగిన దేహం భగవంతుడికి లేదు. అయినా విష్ణుమూర్తి ఇతర అవతారాలలాగా కాకుండా రామావతారం దోషరహితమై, చైతన్యం కలదై, నిత్యసుఖ స్వరూపమైన తన శరీరాన్ని ప్రకాశించేట్లు చేసింది. రామచంద్రమూర్తిలో రావణుడికి భగవంతుడనే బుద్ధి లేకుండా చేసి వాడికి మోక్షం లేకుండా చేయడమే రామచంద్రుడి శోకానికి ఫలం అని చెప్పడం జరిగింది. రావణుడి చేత సీతను అపహరించేట్లు చేయడం, వాడి పుణ్యాన్ని నాశనం చేసి, వాడిని తన చేతిలో చంపబడేట్లు చేయడమే. గొప్ప తపస్సు చేసి సంపాదించిన బలం కల రావణుడిని అంతకంటే అధిక తపోబలం లేకుండా చంపడం సాధ్యపడదు. దేవతలు అంతకంటే ఎక్కువ తపస్సు చేయలేరు. కాబట్టి, వాడికి అనుచితమైన అనురాగం సీతమీద కలిగించి, దానివల్ల వాడిని మోహితుడిని చేసి, రావణుడి తపశ్శక్తి నాశనం చేసి, దేవతలా కార్యం సాధించాలని లక్ష్మీదేవితో కలిసి ఆలోచించి సీతతో సహా అవతరించాడు విష్ణువు.

రామచంద్రమూర్తి మాయామానుషవేశాధారి అని అంగీకరించాలి. కర్మబద్ధులై జన్మించిన ప్రాకృత జనులు ఎలా ప్రవర్తించారో ఆయనా అలానే చేశాడు. భార్య మీద ప్రేమగల మనుష్యులు ఆమెను పోగొట్టుకుంటే ఎలా ఏడుస్తారో రాముడు కూడా అలానే చేశాడు. కన్నీరు కార్చడం. ఏడవడం, సత్యమే కాని అది తామస శోకం వలన కలిగింది కాదు. జయ-విజయులకు మూడో జన్మలోకాని ముక్తిలేదనే విషయం భగవంతుడికి తెలుసు. రావణ-కుంభకర్ణులది రెండవ జన్మే కాబట్టి ముక్తిలేదు. భగవంతుడు రావణుడికి మోక్షం లేకుండా చేయడానికి వాడికి దుర్బుద్ధి పుట్టించి వాడితో ఒక అకార్యం చేయించి అది నెపంగా వాడిని వధించాడు. లోక శిక్షకోసం వచ్చినవాడు కదా భగవంతుడు.

అడవి మృగాలను చూసి రాముడు, “వీటికి సీత పోయిన జాడ తెలుసేమో?” అని అంటూ కన్నీరు కార్చుకుంటూ వాటిని అడుగుతాడిలా. “మృగాలూ...సీత జాడ మీకు తెలియునా?” అని. అవి చివాలున లేచి, దక్షిణ దిక్కుగా పయనమై తలలు పైకి ఎత్తుకుని రామలక్ష్మణుల ముఖాలు చూసుకుంటూ పరుగెత్తాయి. అప్పుడు లక్ష్మణుడు వాటి అభిప్రాయం అర్థం చేసుకుని అన్నతో దక్షిణ దిక్కుగా (ఆకాశ మార్గాన రావణుడు పోయిన మార్గం)సీతను వెతకడానికి పోదాం అన్నాడు. అలాగే పోసాగారు ఇరువురూ. రాముడు భయపడుతూ అటూ-ఇటూ తిరుగుతూ సీతను వెతుకుతూ వుండగా, ఆమె పాదాల చిన్న ముద్రలు, అ అపాదాల వెంటే పోయిన పెద్ద-పెద్ద రాక్షస పాదాల ముద్రలు, విరిగిపడిన ధనుస్సు, రథం, అమ్ములపొది, అక్కడక్కడా పడి వుండడం గమనించాడు. అవి చూసి తొట్రుపడుతూ రాముడు లక్ష్మణుడితో ఇవి రాక్షసులవేమో అన్నాడు.  

          రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు: “ఇక్కడ విషయం ఆలోచించి చూస్తుంటే ఎవడో రాక్షసుడు అడవిలో నా భార్యను అపహరించినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక్కడి పరిస్థితి చూస్తుంటే, బలిష్టుడైన రాక్షసుడే విరోధ బుద్ధితో నాకు అపకారం చేయాలనుకుని సీతను అపహరించాడని అర్థమవుతున్నది. కాబట్టి మనకు రాక్షసులతో ప్రాణాంతకమైన విరోధం కలిగింది అనడం నిశ్చయం. రాక్షసులు సీతను అపహరించి ఎక్కడైనా దాచిపెట్టయినా వుండాలి, లేదా, ఆమె చచ్చిపోయైనా వుండాలి, లేదా, రాక్షసులు ఆమెను తినైనా వుండాలి. వీటిల్లో ఏదో ఒకటి నిజం. రాక్షసులీవిధంగా సీతను బక్షిస్తుంటే, ధర్మఫలదాతలైన దేవతలైనా అక్కరకు వచ్చినప్పుడు ఆడుకుందాం అనుకోలేదు కదా? కాబట్టి వీళ్లూ నాకపకారం చేసినవారే! రాక్షసులు, భూత సమూహాలు, ఇక నా పౌరుష గుణాన్ని చవిచూసి ఎలాంటి పాట్లు పడనున్నారో చూస్తుండు”. రాక్షసులలో, పిశాచాల్లో, యక్షుల్లో, గంధర్వుల్లో, భూజనుల్లో ఒక్కడైనా సుఖపడుతాడేమో చూడు....ఈ క్షణంలోనే నా పరాక్రమాన్ని ప్రదర్శిస్తా చూడు. మూడులోకాలు బాధపడేట్లు చేస్తాను. నాసీతకు ఏబాధ లేకుండా దేవతలు నాకు సమర్పించారా, సరి. లేదా, ప్రసిద్ధమై వ్యర్థం కాని నా పరాక్రమాన్ని ఏడుస్తూ చూస్తారు. నాకు ప్రియమైన సీతను మంచితనంగా తెచ్చి దేవతలు-ఇతరులు ఇవ్వకపోతే, లక్ష్మణా! ముల్లోకాలు ఏవిధంగా రూపంలేకుండా నాశనం అవుతాయో చూస్తుండు”.

         అని చెక్కిళ్లు అడురుతుంటే, భయంకరమైన కోపంతో, ఎర్రటి కళ్ళతో రాముడు తన పెద్ద విల్లుని చీతిలోకి తీసుకుని, చక్కటి బాణాన్ని అల్లెతాటిలో సంధించి, ప్రళయకాలాగ్ని లాగా మండిపడసాగాడు రాముడు. ఎప్పుడూ కోపం తెచ్చుకొని రాముడిని చూసి లక్ష్మణుడు పెదవులు ఎండిపోతుంటే, ముఖం వెల-వెలపోతుంటే, ఆయనతో ఇలా అన్నాడు.

“అన్నా! నువ్వు సర్వదా జగాలకు మేలుచేయడానికి ఇష్టపడే వాడివే. కోపం లేనివాడివే. మృదుస్వభావుడివే. ఇలాంటి నువ్వు ఇప్పుడు కోపం తెచ్చుకుని నీ సహజగుణం వదలవచ్చా? ఇది నీకు ధర్మమా?  ఎవడో ఒక్కడు చేసిన నేరాన్ని కనిపెట్టే శక్తిలేక లోకాన్నంతా నాశనం చేయడం న్యాయమా? విరిగిన ఈ రథం ఎవరిదో, ఎందుకు ఎవరివల్ల విరిగిందో అనే విషయం మనం విచారించి తెలుసుకోవాలి. విరిగిన గుర్రపు గిట్టలను, దొరలిన చక్రాల కమ్మలను, నేలబడ్డ నెత్తురు బొట్లను, పరిశీలించి చూస్తే ఇవన్నీ ఒకడివే అనిపిస్తున్నది”.

“నువ్వు ఆలోచించకుండా ఎవడో ఒకడి కోసమని లోకమంతా నాశనం చేయడం మంచిదా? ఎవడో ఒకడు అపరాధం చేస్తే దాన్ని లోకమంతా ఒప్పుకున్నాడని భావించి, ఆ లోకమంతా వధ్యమని నువ్వు అనుకోవడం పొరపాటు. ఎందుకంటే, తమ రక్షణ కోరే సర్వభూతాలను రక్షించగలవాడివి నువ్వు ఒక్కడివే కాని వేరొకడు లేడు. నేను నీకు తోడురాగా తపస్వుల సహాయంతో సీతను అన్నిచోట్లా వెతుకుదాం. మనం చేయాల్సినదంతా చేసిన తరువాత. అప్పటికీ దేవతలు మంచితనంగా సీతను సమర్పించకపోతే, అప్పుడు ఏది ఉచితమో ఆ పని చేద్దాం. నీ ఇష్ట ప్రకారం లోకాన్ని భస్మం చేయి” అని అంటాడు లక్ష్మణుడు రాముడితో. అన్నను శాంతపరిచాడు అప్పటికే.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

Sunday, December 13, 2020

రామ చరిత్రనంతా యోగ దృష్టితో చూసిన వాల్మీకి .... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-35 : వనం జ్వాలా నరసింహారావు

 రామ చరిత్రనంతా యోగ దృష్టితో చూసిన వాల్మీకి

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-35

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (14-12-2020)

ధర్మ విచార స్వభావం కలిగిన వాల్మీకి, మహోన్నత ధర్మాలను బోధించే శ్రీరామ చరిత్రను, యధాతథంగా-వాస్తవంగా జరిగింది జరిగినట్లే-ఆద్యంతం, కళ్లార కాంచడానికి శ్రద్ధగా సంసిద్ధుడవుతాడు. ఆచమనం చేసి, గురువు నారదుడిని-ఆయన గురువు బ్రహ్మను తలుస్తూ, భగవంతుడికి నమస్కరించి, తూర్పు కొనలుగా పరిచిన దర్భలమీద కృష్ణాజినం వుంచి-దానిపై వస్త్రం పరిచి, సుఖాసీనుడైనాడు. అలా కూర్చుని, మనోవృత్తులన్నిటినీ పూర్ణంగా నియమించి, ఏకాగ్ర చిత్తంతో-బ్రహ్మానుగ్రహ మనస్సుతో, రామచంద్రుడి చరిత్రనంతా వీక్షించడానికి సన్నద్ధుడయాడు వాల్మీకి.

ఏకాగ్రచిత్తుడైన వాల్మీకికి సీతారామ లక్ష్మణులు, దశరథుడు, కౌసల్య, సుమిత్ర , కైకేయిలతో పాటు అయోధ్యలోని ప్రజలు యావన్మంది ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి చేశారో-ఎలా నడుచుకున్నారో-ఎట్లా నవ్వారో-ఎట్లా మాట్లాడుకున్నారో-ఒకరొకరి మధ్య రాకపోకలెలా సాగాయో-వాళ్లు చేసే పనులెలా సాగాయో కళ్లకు కట్టినట్లు కనిపించాయి. పితృవాక్య పాలనకై ఆడిన మాట తప్పని శ్రీరామచంద్రుడు, అడవిలో సీతా లక్ష్మణులతో కూడి చేసిన పనులన్నీ ఉసిరికాయను చూసినట్లు చూశాడు వాల్మీకి. మరింత తృప్తి కలిగేందుకు యోగ సమాధిలో పోయి, ఏకాగ్ర మనస్సుతో పాప రహితమైన రామ కథను, ఆద్యంతమూ వాస్తవంగా చూసి, చూసింది చూసినట్లే ఆసాంతం గ్రంథంగా రచించాలని నిర్ణయించుకున్నాడు. ధర్మార్థ కామ మోక్షాలలో, ధర్మ మోక్షాలను సవివరంగా, కామార్థాలను క్లుప్తంగా తెలియ పరుస్తూ, గురువైన నారదుడి బోధను ఏమాత్రం అతిక్రమించకుండా-ఆయన ఉపదేశించిన విధంగానే-రత్న ఖచితమైన సాగరంలా-విన సొంపుగా, శ్రీరామ చరిత్రను రచించాడు వాల్మీకి.

శ్రీరాముడి జననం, సుబాహుడు-తాటక రాక్షసులను వధించి బాల్యంలోనే రాముడు చూపిన పరాక్రమం, ప్రజలపై రాముడికున్న అనుకూల భావం-ప్రీతి-ఓర్పు, ఆయనపై ప్రజలకున్న నమ్మకం, రాముడి సత్యవాదిత్వం, విశ్వామిత్రుడు చెప్పిన కథలు, శివదనుర్భంగం, సీతా కల్యాణం, పరశురాముడితో వివాదం చూశాడు వాల్మీకి. శ్రీరాముడి సుగుణ సంపత్తి, యౌవరాజ్య పట్టాభిషేకానికి దశరథుడు చేసిన ప్రయత్నం, కైక వ్యవహరించిన తీరు, పట్టాభిషేకం విఘ్నం, రామచంద్రమూర్తి అడవులకు ప్రయాణం, దశరథుడి మరణం, పౌరులందరూ దుఃఖించడం, వారినందరిని వదిలి రాముడు అడవులకు పోవడం, గుహుడిని కలవడం, సుమంత్రుడిని అయోధ్యకు మరలి పొమ్మనడం, గంగను దాటడం, భరద్వాజ దర్శనం, చిత్రకూటాన్ని చేరడం, పర్ణశాలను నిర్మించుకుని అక్కడ నివసించడం, భరతుడి రాక-అతడిని రాముడాదరించడం, దశరథుడికి తర్పణాలు వదలడం, పాదుకా పట్టాభిషేకం, నంది గ్రామంలో భరతుడుండడం చూస్తాడు వాల్మీకి. రామచంద్రమూర్తి చిత్రకూటం విడిచి దండకారణ్యం చేరడం, విరాధుడి వధ, శరభంగుడిని-సుతీక్షణుడిని చూడడం, అనసూయ సీతాదేవికి గంధ లేపనం ఇవ్వడం, అగస్త్య దర్శనం, జటాయువుతో సంభాషణ, పంచవటిలో నివాసం, శూర్పణఖ ముక్కు చెవులు లక్ష్మణుడు కోయడం, సైన్యంతో సహా ఖర-దూషణ-త్రిశీర్షులను రాముడు చంపడం, సీతాపహరణకు రావణుడి ప్రయత్నం, మాయ లేడి రూపంలోని మారీచుడి హతం, సీతాపహరణం, రాముడి విలాపం, సీతకు సహాయపడుతూ జటాయువు ప్రాణాలను కోల్పోవడం, కబంధుడిని రాముడు చూడడం, శబరి ఆతిధ్యం, రామ హనుమల కలయిక-సంభాషణలకు చెందిన సంఘటనలను చూస్తాడు వాల్మీకి.

హనుమంతుడితో కలిసి రాముడు ఋష్యమూకం చేరడం, సూర్యపుత్రుడు సుగ్రీవుడితో స్నేహం చేయడం, వాలి-సుగ్రీవుల మధ్య జరిగిన యుద్ధంలో ఒకే ఒక్క బాణంతో వాలిని చంపడం, వాలి కొరకు తార ఏడ్వడం, సుగ్రీవుడిని వానర రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేయడం కనుగొంటాడు యోగదృష్టితో వాల్మీకి. వర్షాకాలం ముగుస్తూనే సీతాన్వేషణకు వెళ్లాల్సి, సమయ పాలన తప్పిన సుగ్రీవుడిపై రాముడు కోపించడం, తక్షణమే సుగ్రీవుడా పని చేపట్టడం, నలుదిక్కులకు వానర సేన వెళ్లడం-వెళ్లాల్సిన వారికి సుగ్రీవుడు దారిలో కనిపించనున్న నగరాలు, వనాలు, ఇతర భౌగోళిక చిహ్నాలు వివరించడం కనిపిస్తుంది. దక్షిణ దిశగా వెళ్లాల్సిన హనుమంతుడికి రామ ముద్రికను రాముడివ్వడం, ఆంజనేయాదుల స్వయంప్రభ గుహ ప్రవేశం, సీతాదేవి లంకలో బందీగా వుందని సంపాతి వానరులకు చెప్పడం, వానరులంతా మహేంద్రగిరెక్కడం, హనుమంతుడు సముద్రాన్ని దాటడం, హనుమంతుడిని తన వీపుపై విశ్రాంతి తీసుకొమ్మని మైనాకుడు కోరడం, హనుమంతుడికి సురస పరీక్ష, సింహిక వధ, సముద్రాన్ని దాటి హనుమంతుడు రాత్రివేళ లంకలో ప్రవేశించడం, సీతను వెతికే ఉపాయం ఆలోచించడం, నిద్రిస్తున్న రావణుడిని-పుష్పక విమానాన్ని హనుమంతుడు చూడడం కనిపిస్తుంది వాల్మీకికి. సారాయి మయమైన రావణుడి ఇల్లు, ఆయన అంతఃపురం, అందులో సీతకొరకు వెతకడం, అశోక వనంలో సీతతో నీచంగా మాట్లాడుతున్న రావణాసురుడిని హనుమంతుడు గమనించడం, రావణుడు వెళ్లిన తర్వాత హనుమంతుడు సీతకు రామ ముద్రికనివ్వడం, కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలు సీతను బెదిరించడం, త్రిజట స్వప్న వృత్తాంతం, సీతా దేవి హనుమంతుడికి చూడామణినివ్వడం, అశోక వనాన్ని హనుమంతుడు నాశనం చేయడం, రావణుడికి రాక్షస స్త్రీలు ఫిర్యాదు చేయడం, హనుమంతుడి చేతిలో రావణాసురుడు పంపిన రాక్షస వీరులు మరణించడం, ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి హనుమంతుడు తాత్కాలికంగా వశ పడడం, రావణుడితో హనుమంతుడి సంభాషణ, లంకా దహనం, తిరుగు ప్రయాణంలో హనుమంతుడు లంకను దాటడం స్పష్టంగా వాల్మీకికి కనిపిస్తుంది.

మరలివచ్చిన హనుమంతుడు సహచర వానర మిత్రులకు లంకలో జరిగిన సంఘటనలను వివరించడం, మధు వనంలో కోతులు తేనె తాగడం, హనుమంతుడు శ్రీరాముడిని ఓదార్చడం, సీత ఇచ్చిన చూడామణిని రాముడికివ్వడం, రాముడు సేనలతో సముద్రాన్ని దాటే ప్రయత్నంలో నలుడి సహాయంతో సేతువు కట్టడం, వానర సేనతో సముద్రాన్ని దాటి లంక చేరడం, సద్భుద్దితో విభీషణుడు రాముడి శరణు కోరడం-రావణాది రాక్షసుల మరణ రహస్యం చెప్పడం, యుద్ధంలో రాముడు కుంభకర్ణుడిని-ఇంద్రజిత్తును చంపి రావణుడిని వధించడం, సీత అగ్నిప్రవేశం చేయడం-తదనంతరం రాముడామెను గ్రహించడం, విభీషణుడి పట్టాభిషేకం, సీతారామ లక్ష్మణులు పుష్పక విమానాన్ని ఎక్కి అయోధ్యకు ప్రయాణం కావడం, నంది గ్రామంలో భరతుడిని కలిసి అయోధ్యకు వెళ్లడం, శ్రీరామ పట్టాభిషేకం, సేనులందరినీ వారి-వారి స్థానాలకు పంపడం యావత్తు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది వాల్మీకికి. (ఆ తర్వాత జరిగిన కథను వాల్మీకి ఉత్తర కాండలో పొందుపరుస్తాడు).

(శ్రీరామచంద్రుడికి రామభద్రుడు-రామచంద్రుడు, అని పేర్లున్నాయి. ఇవి రామాయణంలో లేకపోయినా ఉపనిషత్తులలో వున్నాయి. రామచంద్ర శబ్దం గురించి వివరించడం జరిగింది. "భద్ర" శబ్దం భగవంతుడి నిత్య నిర్దోషిత్వాన్ని తెలియచేస్తుంది. నిత్య నిర్దోషిత్వం ద్వారా రాముడు అభిరాముడయ్యాడు. మంగళకరమైన కాంతిని సూర్యుడిలో కలిగించేవాడు-సజ్జనుల భావాన్ని కరిగించేవాడు-ఘోరమైన సంసార తాపత్రయాలను పారతోలగలిగేవాడే భద్రుడు. భద్ర శబ్దానికి శ్రేష్ఠుడని కూడా అర్థముంది. రామభద్రుడంటే రాములందరిలో శ్రేష్ఠుడని అర్థం-పరశురామ, బలరాములకంటే శ్రేష్ఠుడు).