రామ చరిత్రనంతా యోగ దృష్టితో చూసిన వాల్మీకి
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-35
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (14-12-2020)
ధర్మ విచార స్వభావం కలిగిన వాల్మీకి, మహోన్నత ధర్మాలను బోధించే శ్రీరామ చరిత్రను, యధాతథంగా-వాస్తవంగా జరిగింది జరిగినట్లే-ఆద్యంతం, కళ్లార కాంచడానికి శ్రద్ధగా సంసిద్ధుడవుతాడు. ఆచమనం చేసి, గురువు నారదుడిని-ఆయన గురువు బ్రహ్మను తలుస్తూ, భగవంతుడికి నమస్కరించి,
తూర్పు కొనలుగా పరిచిన దర్భలమీద కృష్ణాజినం వుంచి-దానిపై
వస్త్రం పరిచి,
సుఖాసీనుడైనాడు. అలా కూర్చుని, మనోవృత్తులన్నిటినీ పూర్ణంగా నియమించి, ఏకాగ్ర
చిత్తంతో-బ్రహ్మానుగ్రహ మనస్సుతో, రామచంద్రుడి చరిత్రనంతా
వీక్షించడానికి సన్నద్ధుడయాడు వాల్మీకి.
ఏకాగ్రచిత్తుడైన వాల్మీకికి సీతారామ
లక్ష్మణులు,
దశరథుడు, కౌసల్య, సుమిత్ర ,
కైకేయిలతో పాటు అయోధ్యలోని ప్రజలు యావన్మంది ఎక్కడెక్కడ
ఎవరెవరు ఏమేమి చేశారో-ఎలా నడుచుకున్నారో-ఎట్లా నవ్వారో-ఎట్లా
మాట్లాడుకున్నారో-ఒకరొకరి మధ్య రాకపోకలెలా సాగాయో-వాళ్లు చేసే పనులెలా సాగాయో
కళ్లకు కట్టినట్లు కనిపించాయి. పితృవాక్య పాలనకై ఆడిన మాట తప్పని శ్రీరామచంద్రుడు, అడవిలో సీతా లక్ష్మణులతో కూడి చేసిన పనులన్నీ ఉసిరికాయను చూసినట్లు చూశాడు
వాల్మీకి. మరింత తృప్తి కలిగేందుకు యోగ సమాధిలో పోయి, ఏకాగ్ర మనస్సుతో పాప రహితమైన రామ కథను, ఆద్యంతమూ వాస్తవంగా చూసి, చూసింది చూసినట్లే ఆసాంతం గ్రంథంగా రచించాలని నిర్ణయించుకున్నాడు. ధర్మార్థ
కామ మోక్షాలలో,
ధర్మ మోక్షాలను సవివరంగా, కామార్థాలను క్లుప్తంగా తెలియ పరుస్తూ, గురువైన నారదుడి బోధను
ఏమాత్రం అతిక్రమించకుండా-ఆయన ఉపదేశించిన విధంగానే-రత్న ఖచితమైన సాగరంలా-విన
సొంపుగా,
శ్రీరామ చరిత్రను రచించాడు వాల్మీకి.
శ్రీరాముడి జననం, సుబాహుడు-తాటక రాక్షసులను వధించి బాల్యంలోనే రాముడు చూపిన పరాక్రమం, ప్రజలపై రాముడికున్న అనుకూల భావం-ప్రీతి-ఓర్పు, ఆయనపై ప్రజలకున్న నమ్మకం, రాముడి సత్యవాదిత్వం, విశ్వామిత్రుడు చెప్పిన కథలు, శివదనుర్భంగం, సీతా కల్యాణం,
పరశురాముడితో వివాదం చూశాడు వాల్మీకి. శ్రీరాముడి సుగుణ
సంపత్తి,
యౌవరాజ్య పట్టాభిషేకానికి దశరథుడు చేసిన ప్రయత్నం, కైక వ్యవహరించిన తీరు,
పట్టాభిషేకం విఘ్నం, రామచంద్రమూర్తి అడవులకు
ప్రయాణం,
దశరథుడి మరణం, పౌరులందరూ దుఃఖించడం, వారినందరిని వదిలి రాముడు అడవులకు పోవడం, గుహుడిని కలవడం, సుమంత్రుడిని అయోధ్యకు మరలి పొమ్మనడం, గంగను దాటడం, భరద్వాజ దర్శనం,
చిత్రకూటాన్ని చేరడం, పర్ణశాలను నిర్మించుకుని
అక్కడ నివసించడం,
భరతుడి రాక-అతడిని రాముడాదరించడం, దశరథుడికి తర్పణాలు వదలడం, పాదుకా పట్టాభిషేకం, నంది గ్రామంలో భరతుడుండడం చూస్తాడు వాల్మీకి. రామచంద్రమూర్తి చిత్రకూటం విడిచి
దండకారణ్యం చేరడం,
విరాధుడి వధ, శరభంగుడిని-సుతీక్షణుడిని
చూడడం, అనసూయ సీతాదేవికి గంధ లేపనం ఇవ్వడం, అగస్త్య దర్శనం, జటాయువుతో సంభాషణ,
పంచవటిలో నివాసం, శూర్పణఖ ముక్కు చెవులు
లక్ష్మణుడు కోయడం,
సైన్యంతో సహా ఖర-దూషణ-త్రిశీర్షులను రాముడు చంపడం, సీతాపహరణకు రావణుడి ప్రయత్నం, మాయ లేడి రూపంలోని
మారీచుడి హతం,
సీతాపహరణం, రాముడి విలాపం, సీతకు సహాయపడుతూ జటాయువు ప్రాణాలను కోల్పోవడం, కబంధుడిని రాముడు చూడడం, శబరి ఆతిధ్యం, రామ హనుమల కలయిక-సంభాషణలకు చెందిన సంఘటనలను చూస్తాడు వాల్మీకి.
హనుమంతుడితో కలిసి రాముడు ఋష్యమూకం
చేరడం, సూర్యపుత్రుడు సుగ్రీవుడితో స్నేహం చేయడం, వాలి-సుగ్రీవుల మధ్య
జరిగిన యుద్ధంలో ఒకే ఒక్క బాణంతో వాలిని చంపడం, వాలి కొరకు తార ఏడ్వడం, సుగ్రీవుడిని వానర రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేయడం కనుగొంటాడు యోగదృష్టితో
వాల్మీకి. వర్షాకాలం ముగుస్తూనే సీతాన్వేషణకు వెళ్లాల్సి, సమయ పాలన తప్పిన సుగ్రీవుడిపై రాముడు కోపించడం, తక్షణమే సుగ్రీవుడా పని చేపట్టడం, నలుదిక్కులకు వానర సేన
వెళ్లడం-వెళ్లాల్సిన వారికి సుగ్రీవుడు దారిలో కనిపించనున్న నగరాలు, వనాలు,
ఇతర భౌగోళిక చిహ్నాలు వివరించడం కనిపిస్తుంది. దక్షిణ దిశగా
వెళ్లాల్సిన హనుమంతుడికి రామ ముద్రికను రాముడివ్వడం, ఆంజనేయాదుల స్వయంప్రభ గుహ ప్రవేశం, సీతాదేవి లంకలో బందీగా
వుందని సంపాతి వానరులకు చెప్పడం, వానరులంతా
మహేంద్రగిరెక్కడం,
హనుమంతుడు సముద్రాన్ని దాటడం, హనుమంతుడిని తన వీపుపై విశ్రాంతి తీసుకొమ్మని మైనాకుడు కోరడం, హనుమంతుడికి సురస పరీక్ష, సింహిక వధ, సముద్రాన్ని దాటి హనుమంతుడు రాత్రివేళ లంకలో ప్రవేశించడం, సీతను వెతికే ఉపాయం ఆలోచించడం, నిద్రిస్తున్న
రావణుడిని-పుష్పక విమానాన్ని హనుమంతుడు చూడడం కనిపిస్తుంది వాల్మీకికి. సారాయి
మయమైన రావణుడి ఇల్లు,
ఆయన అంతఃపురం, అందులో సీతకొరకు వెతకడం, అశోక వనంలో సీతతో నీచంగా మాట్లాడుతున్న రావణాసురుడిని హనుమంతుడు గమనించడం, రావణుడు వెళ్లిన తర్వాత హనుమంతుడు సీతకు రామ ముద్రికనివ్వడం, కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలు సీతను బెదిరించడం, త్రిజట స్వప్న వృత్తాంతం, సీతా దేవి హనుమంతుడికి
చూడామణినివ్వడం,
అశోక వనాన్ని హనుమంతుడు నాశనం చేయడం, రావణుడికి రాక్షస స్త్రీలు ఫిర్యాదు చేయడం, హనుమంతుడి చేతిలో
రావణాసురుడు పంపిన రాక్షస వీరులు మరణించడం, ఇంద్రజిత్తు
బ్రహ్మాస్త్రానికి హనుమంతుడు తాత్కాలికంగా వశ పడడం, రావణుడితో హనుమంతుడి సంభాషణ, లంకా దహనం, తిరుగు ప్రయాణంలో హనుమంతుడు లంకను దాటడం స్పష్టంగా వాల్మీకికి కనిపిస్తుంది.
మరలివచ్చిన హనుమంతుడు సహచర వానర
మిత్రులకు లంకలో జరిగిన సంఘటనలను వివరించడం, మధు వనంలో కోతులు తేనె
తాగడం, హనుమంతుడు శ్రీరాముడిని ఓదార్చడం, సీత ఇచ్చిన చూడామణిని
రాముడికివ్వడం,
రాముడు సేనలతో సముద్రాన్ని దాటే ప్రయత్నంలో నలుడి సహాయంతో సేతువు
కట్టడం, వానర సేనతో సముద్రాన్ని దాటి లంక చేరడం, సద్భుద్దితో విభీషణుడు
రాముడి శరణు కోరడం-రావణాది రాక్షసుల మరణ రహస్యం చెప్పడం, యుద్ధంలో రాముడు కుంభకర్ణుడిని-ఇంద్రజిత్తును చంపి రావణుడిని వధించడం, సీత అగ్నిప్రవేశం చేయడం-తదనంతరం రాముడామెను గ్రహించడం, విభీషణుడి పట్టాభిషేకం,
సీతారామ లక్ష్మణులు పుష్పక విమానాన్ని ఎక్కి అయోధ్యకు
ప్రయాణం కావడం,
నంది గ్రామంలో భరతుడిని కలిసి అయోధ్యకు వెళ్లడం, శ్రీరామ పట్టాభిషేకం,
సేనులందరినీ వారి-వారి స్థానాలకు పంపడం యావత్తు కళ్లకు
కట్టినట్లు కనిపిస్తుంది వాల్మీకికి. (ఆ తర్వాత జరిగిన కథను వాల్మీకి ఉత్తర కాండలో
పొందుపరుస్తాడు).
(శ్రీరామచంద్రుడికి రామభద్రుడు-రామచంద్రుడు, అని పేర్లున్నాయి. ఇవి
రామాయణంలో లేకపోయినా ఉపనిషత్తులలో వున్నాయి. రామచంద్ర శబ్దం గురించి వివరించడం
జరిగింది. "భద్ర" శబ్దం భగవంతుడి నిత్య నిర్దోషిత్వాన్ని
తెలియచేస్తుంది. నిత్య నిర్దోషిత్వం ద్వారా రాముడు అభిరాముడయ్యాడు. మంగళకరమైన
కాంతిని సూర్యుడిలో కలిగించేవాడు-సజ్జనుల భావాన్ని కరిగించేవాడు-ఘోరమైన సంసార
తాపత్రయాలను పారతోలగలిగేవాడే భద్రుడు. భద్ర శబ్దానికి శ్రేష్ఠుడని కూడా అర్థముంది.
రామభద్రుడంటే రాములందరిలో శ్రేష్ఠుడని అర్థం-పరశురామ, బలరాములకంటే శ్రేష్ఠుడు).
No comments:
Post a Comment