విలక్షణమైన ప్రబంధ గ్రంథమే రామాయణ కథనం
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-36
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (21-12-2020)
లోక రక్షణ కొరకు భూమ్మీద అవతరించిన
శ్రీరామచంద్రమూర్తి ప్రజా పాలన చేస్తున్న రోజుల్లో, భగవంతుడైన వాల్మీకి మహర్షి, లోకోపకారంగా, చిత్రమైన పదాలతో,
ఇరవై నాలుగువేల శ్లోకాలతో రామాయణ రచన చేశాడు. పూర్వ
రామాయణంలోని ఆరు కాండలలో ౫౩౭ (537) సర్గలుంటే, శ్రీరామ పట్టాభిషేకం తర్వాత జరిగిన కథకు సంబంధించిన ఉత్తర కాండలో మరో ౧౧౦ (110) సర్గలున్నాయి. అదేవిధంగా శ్రీరామ పట్టాభిషేకం అనంతరం ఈ గ్రంథాన్ని లోకానికి
ప్రకటించినవారు కుశ లవులు. ఇంత గొప్ప బృహత్తర గ్రంథాన్ని రచించిన వాల్మీకి, ఓపిగ్గా దీన్నంతా కంఠంస్థం చేయగల శక్తిమంతులు ఎవరన్నా వున్నారానని
ఆలోచించసాగాడు.
సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు
బాల కాండ ౭౭ (77) సర్గలు ౨౨౫౬ (2256) శ్లోకాలు
అయోధ్య కాండ ౧౧౯ (119) సర్గలు ౪౪౧౫ (4415) శ్లోకాలు
అరణ్య కాండ ౭౫ (75) సర్గలు ౨౭౩౨ (2732) శ్లోకాలు
కిష్కింధ కాండ ౬౭ (67) సర్గలు ౨౬౨౦ (2620) శ్లోకాలు
సుందర కాండ ౬౮ (68) సర్గలు ౩౦౦౬ (3006) శ్లోకాలు
యుద్ధ కాండ ౧౩౧
(131) సర్గలు ౫౯౯౦ (5990) శ్లోకాలు
ఉత్తర కాండ ౧౧౦
(110) సర్గలు ౩౨౩౪ (3234) శ్లోకాలు
--------------------------------------------------------------------------------
ఏడు కాండలు ౬౪౭
(647) సర్గలు ౨౪,౨౫౩ (24,253) శ్లోకాలు
ప్రబంధ వైలక్షణ్యాన్ని తెలియచేసే సర్గ
ఇది. పరమ ఆప్తుడైన కవి రచించడం, కీర్తిమంతుడైన నాయకుడు
ప్రతిపాద్యుడిగా వుండడం,
మహాత్ములు దాన్ని అంగీకరించడం, సాక్షాత్తూ కథానాయకుడే దాన్ని శ్లాఘించడం లాంటి విషయాలను కలిగున్న గ్రంథాన్ని
"ప్రబంధ వైలక్షణ్య" మున్న గ్రంథ మంటారు. సర్గలోని మొదటి పద్యంలోనే ఈ
విషయం విశదమవుతుంది. సమస్త సద్గుణాలతో లోకులందరినీ ఆనందపర్చిన శ్రీరామచంద్రుడి
చరిత్రై నందువల్ల,
రామాయణం కడు ఆదరణీయమైంది. శ్రీరామ చరిత్ర అంటే మహాపురుష
చరిత్రే.. అందుకే దీనివలన ఎన్నో లాభాలున్నాయన్న భావన కూడా మొదటి పద్యం లోనే
వివరించబడింది. శ్రీరామచంద్రమూర్తి రాజ్యం చేసే రోజుల్లో, సీతాదేవి తన ఆశ్రమం చేరిన తర్వాతే, వాల్మీకి రామాయణ రచన
చేశారన్న విషయం కూడా ఈ పద్యంలో స్పష్టంగా బోధపడ్తుంది. శ్రీరామచంద్రమూర్తి
అవతరించడానికి పూర్వమే వాల్మీకి రామాయణం రచించాడనడం సత్యదూరం.
(స్థూల దృష్టితో పెద్ద సంఖ్య చెప్పేటప్పుడు దాని పైనున్న చిల్లర సంఖ్య
గణించాల్సిన పనిలేదు. అందుకే రామాయణంలో ౨౪ (24) వేల శ్లోకాలని
చెప్పడం జరిగింది. రామాయణంలోని శ్లోకాలు, సర్గలు, కాండల వివరాలు కూడా (మొదటి) ఈ క్రింది పద్యంలో చెప్పడం జరిగింది).
సీ: భువనావనార్థంబు
భూమిపై జన్మించి,
ప్రాప్తరాజ్యుండయి ప్రజలరాము
డోముచు నుండ
లోకోపకారంబుగ,
భగవంతు డగు ఋషి వాల్మికుండు
శ్రీరాము చరితంబు
చిత్రపదంబుల,
వెలయ నిర్వదినాల్గు వేలు శ్లోక
సంఖ్యయు, వానిని సర్గముల్ గాగను,
పూర్వరామాయణ మనను నూరు
తే: లేను, కాండంబులారుగ జానుమీర, వెండియునుబల్కె బదపడి కాండమొండు
పావనంబై న రఘురాము భావికథను, సో త్తరంబుగ నెల్ల రసోత్తరముగ.
ఇలా ఆలోచిస్తున్న వాల్మీకి వద్దకు
అసమాన బుద్ధి-చమత్కారాలున్న ఇద్దరు బాలురు వచ్చారు. ముని వేషాలు ధరించిన
వారిరువురు,
వాల్మీకికి మిక్కిలి భక్తితో నమస్కరించి, తామీ గ్రంథాన్ని సమగ్రంగా ముఖస్థం చేస్తామని అంటారు. క్షత్రియ జాతి బాలురైన ఆ
ఇద్దరు, చంద్రుడిలాగా తెల్లటి కీర్తితో ప్రకాశిస్తున్నారు. గురు శుశ్రూషా ధర్మం చక్కగా
తెలిసిన వారిలా కనిపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకాశిస్తుండె విష్ణు
తేజం లాంటి కోల్పోని తేజముంది వారిరువిరిలో. వారుండేది వాల్మీకి ఆశ్రమంలోనే.
చక్కని మేధ,
సామగాన విద్యల్లో ఎవర్నైనా జయించి కీర్తి పొందగలిగే
శక్తి-సామర్థ్యాలు,
చలించని వేద మార్గం, నిష్ఠ ప్రస్ఫుటంగా
కనిపిస్తున్నాయి వారిలో. కుశ-లవులనే పేర్లున్న ఆ బాలురు-అన్న తమ్ములు, తనకు సాష్టాంగ నమస్కారం చేసి నిలబడగానే, వారిని గమనించిన వాల్మీకి, వేదార్థాన్ని విశదపరిచే తన ఉత్తమ కావ్యాన్ని-దాని యోగ్యతకు తగ్గట్టే పఠనం
చేయగల యోగ్యులు,
సమర్థులు, వీరేనని
నిర్ణయించుకుంటాడు. (యోగ విద్యను మేధావులు-నియతాత్ములైన వారికే ఇవ్వాలి.
అయోగ్యులకు ఇవ్వకూడదు. అయోగ్యులు రామాయణం చదివి వ్యక్తం చేస్తున్న
భావాలు-దురాపేక్షలు అందరికీ తెలిసినవే). ఎన్నో వ్రతాలను చేసినందువల్ల అత్యధికమైన
జ్ఞానాన్ని,
మహిమలను సంతరించుకున్న వాల్మీకి మహర్షి, రావణ వధ అనే నెపంతో,
ప్రసిద్ధమైన వాక్యాలను వున్నదున్నట్లుగా, సీతామహాచరిత్రగా రచించాడు రామాయణాన్ని. అదొక మహాకావ్యం-గ్రంథం అయింది.
(గ్రంథాలు మూడు రకాలు. ప్రభు సమ్మిత శబ్ద ప్రధానమైంది మొదటి రకం - అంటే, శబ్దాల ఆడంబరంతో రాజులాగా ఆజ్ఞాపించేది. ఇక రెండో రకం సుహృత్సమ్మిత అర్థ
ప్రధానమైంది - అంటే,
స్నేహితుడివలె బోధించేది. కాంతా సమ్మిత వ్యంగ్య ప్రధానమైంది
మూడో రకం - అంటే,
వ్యంగార్థమే ప్రధానంగా వుండి, ప్రియురాలివలె మనస్సుకు నచ్చచెప్పి చేయించేది. రామాయణం అర్థ ప్రధానమై ఇతిహాసంగాను
- వ్యంగ్య ప్రధానమై కావ్యంగాను ప్రసిద్ధి పొందింది. రామాయణాన్ని సీతా మహా చరిత్ర
అంటాడు వాల్మీకి. రామచంద్రమూర్తి చరిత్రకంటే, సీతాదేవి చరిత్ర
ఉత్కృష్టమైందని దానర్థం. కౌసల్యా గర్భ సంభూతుడు రాముడు. అయోనిజ సీత. తండ్రి ఆజ్ఞ
ప్రకారం అడవులకు వెళ్లినవాడు రాముడు. ఎవరి బలవంతం లేకపోయినా, కేవలం పతిభక్తితో అడవులకు పోయింది సీత. కష్ట కార్యాలు చేసినందువల్ల గట్టి దేహం
కలవాడు రాముడైతే,
ఎండకన్నెరుగని సుకుమారి సీత. స్వతంత్రుడై, శక్తుడై,
తోడున్నవాడై, దుఃఖం అనుభవించాడు
రాముడు. రాక్షసుడికి బందీగా, ప్రాణ భయంతో, నిరాహారిగా,
అశక్తిగా, ఒంటరిగా దుఃఖ పడింది సీత.
భక్తుల దోషాలను క్షమిస్తానన్నాడు రాముడు. భక్తుల్లో దోషాలే లేవన్నది సీత.
కాకాసురుడికి శిక్ష విధించి క్షమించాడు రాముడు. తనను బాధించిన రాక్షస స్త్రీలను
క్షమించింది సీత. లోకపిత రాముడైతే, లోకమాత సీత. తన
చరిత్రకంటే సీతాదేవి చరిత్రే శ్రేష్ఠమైందని రామచంద్రమూర్తే స్వయంగా అంటాడొకసారి.
అందువల్లనె రామాయణాన్ని సీతా మహాచరిత్రమంటాడు వాల్మీకి మహర్షి).
వాల్మీకి రచించిన రామాయణ మహాకావ్యం
చదివినా,
విన్నా, పాడినా
వీనులకింపై-మనస్సుకు సంతోషకరమై-శుభకరమై వుంటుంది. ద్రుతం-మధ్యం-విలంబితం అనే కాలాల
ధ్వని-పరిచ్ఛేదాలతో నిండిన పాటలకు అనువైన కావ్యమిది.
"స-రి-గ-మ-ప-ద-ని-స" (షడ్జం-ఋష్ట్రభం-గాంధారం-మధ్యమం-పంచమం-దైవతం-నిషాదం, అనే సప్త స్వరాల సంజ్ఞాక్షరాలు) అనే స్వరాలతో-జాతులతో బంధించబడినదై, గాన లోపాలు లేనిదై,
వీణపై వాయించేందుకు అనువైనదై, తాళాలకు-లయకు సరిపోయిందై అలరారుతుందీ కావ్యం. శృంగార, హాస్య,
కరుణ, వీర, రౌద్ర,
శాంతి, అద్భుత, భయానక,
బీభత్స అనే నవరసాలతో నిండినదైనప్పటికీ, శృంగార రసమే ప్రధానంగా వున్న మనోజ్ఞమైన కావ్యం రామాయణం. ఇంత గొప్పదైన
రామాయణాన్ని గానం చేసేందుకు అనువైన రీతిలో కుశ లవులకు నేర్పించాడు వాల్మీకి.
శ్రీరామచంద్రుడి ప్రతిబింబాలనదగిన కుశ లవులు గాన విద్యలో సమర్థులు.ఆ బాలురు
సుందరమూర్తులు- మంద్ర,
మధ్య తారల స్వరాల విషయాలను తెలిసిన వారందరిలో అగ్రగణ్యులు.
ఇంపైన కంఠ స్వరమున్న వారు. మనోహరంగా మాట్లాడగలరు. నాటక లక్షణ శాస్త్రం చక్కగా
తెలిసిన వారు. (కుశ లవులకు రామాయణం వాల్మీకి నేర్పడం కాకుండా, స్వయంగా కంఠస్థం చేసి సభల్లో పాడగల నైపుణ్యం వుంది).
No comments:
Post a Comment