Saturday, August 14, 2021

శ్రీ మదాంధ్ర మహాభారతంలో వాల్మీకి రామాయణం-2 ..... సుగ్రీవుడితో రామలక్ష్మణుల స్నేహం, వాలి వధ, సీతాన్వేషణ, లంకమీద దాడికి సన్నాహం .... ఆస్వాదన-33 : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీ మదాంధ్ర మహాభారతంలో వాల్మీకి రామాయణం-2

సుగ్రీవుడితో రామలక్ష్మణుల స్నేహం, వాలి వధ, సీతాన్వేషణ, లంకమీద దాడికి సన్నాహం

ఆస్వాదన-33

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధమ్ (15-08-2021)

సీతాపహరణం పూర్వరంగంలో, దండకారణ్యంలో, శ్రీరాముడు మాయాలేడి రూపంలో వున్న మారీచుడిని సంహరించిన తరువాత పర్ణశాలకు వెళ్తుంటే మార్గమధ్యంలో ఎదురొస్తున్న లక్ష్మణుడు కలిశాడు. సీతను ఒంటరిగా వదలి ఎందుకు వచ్చావని రాముడు ప్రశ్నించగా, తాను సీతను వదిలి రావడానికి కారణం చెప్తూ. ఆమె తనను నిందించిన విషయం వివరించాడు. శ్రీరాముడి హృదయంలో ఆందోళన పెరిగింది. ఇద్దరూ కలిసి ఆశ్రమానికి తిరిగొచ్చారు. సీతాదేవి లేని పర్ణశాలను చూశారు. రామలక్ష్మణులు ఇద్దరూ పరిసర ప్రదేశాలలో సీతను వెతికారు. అలా వెతుక్కుంటూ వెళ్తుంటే కొనవూపిరితో వున్న జటాయువు కనిపించాడు. తాను వారి తండ్రి దశరథుడి స్నేహితుడినని చెప్పాడు. దక్షిణ దిక్కుగా రావణుడు సీతను తీసుకుపోయిన సంగతి, తాను అతడితో పోరాడిన సంగతి చెప్పి మరణించాడు జటాయువు. రామలక్ష్మణులు జటాయువుకు అగ్నిసంస్కారాలు చేసి అంత్యక్రియలు నిర్వర్తించారు.

సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులకు మార్గమధ్యంలో వికృత రూపంకల కబంధుడనే రాక్షసుడు లక్ష్మణుడిని పట్టుకోగా అన్నదమ్ములు ఇద్దరు కలిసి వాడి దీర్ఘమైన చేతులను ఖండించారు. తక్షణమే వాడికి శాప విమోచనం అయ్యి దివ్యరూపం ధరించాడు. సీతను రావణుడు అపహరించి లంకాపట్టణానికి తీసుకుపోయాడని చెప్పాడు. సమీపంలో వున్న పంపా సరోవర తీరానికి చేరి అక్కడున్న ఋష్యమూకం అనే పర్వతం మీదున్న వాలి తమ్ముడు సుగ్రీవుడితో స్నేహం చేసుకొమ్మన్నాడు. అలా చేస్తే వారి పని నెరవేరగలదని చెప్పాడు. అతడు చెప్పినట్లే రామలక్ష్మణులు ప్రయాణం చేసి పంపా తీరం చేరారు. దాని దగ్గరలో వున్న ఋష్యమూక పర్వతాన్ని చూశారు. అక్కడికి చేరి దానికి దగ్గరలో కూచున్నారు. వారిని చూసిన సుగ్రీవుడు వారెవరో కనుక్కొని రమ్మని హనుమంతుడికి చెప్పాడు. హనుమంతుడు వారి దగ్గరికి సుగ్రీవుడి దూతగా వెళ్లాడు. వారి వివరాలు కనుక్కొని, సుగ్రీవుడి గురించి చెప్పి, ఇద్దరికీ స్నేహం కలిపాడు.

సుగ్రీవుడు శ్రీరాముడుకి సీత పారేసిన ఆభరణాల మూట చూపాడు. అవి సీతవేనని నిర్ధారణ చేశాడు రాముడు. సుగ్రీవుడికి ప్రత్యుపకారంగా అతడి శత్రువు, అన్న అయిన వాలిని చంపి వానర రాజ్యానికి సుగ్రీవుడిని రాజును చేస్తానన్నాడు. సీతను రావణుడి చెర విడిపించడానికి సహాయ పడుతానన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. వాలిసుగ్రీవుల యుద్ధం ఘోరంగా, భీకరంగా జరిగింది. ఒకరినొకరు విజృంభించి తలపడ్డారు. ఒక దశలో ముష్టి యుద్ధానికి దిగారిద్దరూ. ఇద్దరూ ఒకే పోలికతో వుండడం వల్ల శ్రీరాముడు బాణం వేయలేకపోయాడు. అప్పుడు ఆంజనేయుడు ఒక ఆకుల దండను సుగ్రీవుడి మెడలో గుర్తు పట్టడానికి వేశాడు. వెంటనే శ్రీరాముడు వదిలిన బాణంతో వాలి నేలకూలాడు. రాముడు చేసిన పని అన్యాయం అన్నాడు వాలి. శ్రీరాముడు వాలిని సంహరించి వానర రాజ్యానికి సుగ్రీవుడిని పట్టాభిషిక్తుడిని చేశాడు. రానున్న వర్షాకాలం గడిచిన వెంటనే వానరులను సీతాన్వేషణకు పంపుతానని సుగ్రీవుడు చెప్పాడు. అలా చెప్పి తన రాజధానైన కిష్కింధా నగరానికి పోయాడు.

ఇక్కడ ఇలా వుండగా అక్కడ లంకలో సీతాదేవి రావణాసురుడి చెరలో కష్టాలను అనుభవిస్తూ శ్రీరాముడిని స్మరించుకుంటూ వున్నది. వికృత రూపాలుకల అనేకమంది రాక్షస స్త్రీలు ఆమెకు కాపలా వున్నారు. ఆమెను రకరకాల భయపెట్టేవారు రాక్షస స్త్రీలు. అయితే వారిలోనే ఒకతి అయిన త్రిజట అనే రాక్షసి సీతకు ఆమెకు వచ్చిన స్వప్నం గురించి ఒక శుభవార్త లాగా చెప్పింది. రామలక్ష్మణులు క్షేమంగా వున్న వార్త చెప్పింది. సుగ్రీవుడితో స్నేహం గురించి కూడా చెప్పింది. వారంతా శీఘ్రంగా లంక మీద దండెత్తడానికి వస్తున్నారని చెప్పింది. రావణుడు ఆమెను బలాత్కారం చేయలేకపోవడానికి కారణం రంభ శాపమే అన్నది. తనకొచ్చిన స్వప్నంలో రావణుడి పతనం గురించి, చావు గురించి స్పష్టంగా సంకేతాలున్నాయని అన్నది. మహా పరాక్రమ శాలైన శ్రీరాముడిని కూడా కలలో చూశానని చెప్పింది. తన కల నిజం అవుతుందని, సీతకు ఏ అపాయం లేదని, త్వరలోనే ఆమె తన భర్తను పొందగలదని అన్నది. త్రిజట మాటలకు సీతాదేవి ఊరట చెందింది.

ఇంతలో రావణుడు అక్కడికి వచ్చి సీతతో అనురాగపు మాటలు మాట్లాడాడు. తన గొప్పలు చెప్పుకున్నాడు. తాను ఎందరినో జయించానని అన్నాడు. తాను సకల భువనాలకు సార్వభౌముడినని ప్రగల్బాలు పలికాడు. రావణుడు ఇన్ని చెప్తున్నా పట్టించుకోకుండా సీతాదేవి ఒక పచ్చి గడ్డి పరకను రావణుడి ముందు పడేసి దాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కటువుగా జవాబిచ్చింది. ధర్మం తెలుసుకొని ప్రవర్తించమని చెప్పింది. అలా చెప్పి ఉత్తరీయంతో ముఖం కప్పుకొని దీనంగా ఏడుస్తూ వుండగా దుర్మార్గుడైన రావణుడు ఇంకా కొన్ని దుర్భాషలాడి వెళ్లిపోయాడు.

లంకలో పరిస్థితి ఇలావుంటే, అక్కడ శ్రీరాముడు వున్న చోట వర్షాకాలం అయిపోయే సమయం దగ్గర పడింది. రాముడు లక్ష్మణుడిని పిలిచి సుగ్రీవుడి బాధ్యత గుర్తు చేయమన్నాడు. కిష్కింధకు పొమ్మన్నాడు. సుగ్రీవుడు బాధ్యత మరచిపోతే వాలికి పట్టిన గతే అతడికీ పడుతుందని చెప్పమన్నాడు. లక్ష్మణుడు అన్నగారు చెప్పినట్లే సుగ్రీవుడి దగ్గరికి వెళ్లి పరిస్థితి విచారించాడు. సీతాదేవిని వెతకాడానికి వానరులను నలుదిక్కులకు పంపానని, వారు భూమండలాన్ని అంతటినీ గాలించి ఒక నెలలో వచ్చి సీత జాడ చెప్తారని, ఆ వ్యవధి ఇంకా అయిదు రోజులు మాత్రమే వున్నదని చెప్పాడు సుగ్రీవుడు. లక్ష్మణుడు, సుగ్రీవుడు చెప్పిన సమాధానానికి, సంతృప్తి చెందాడు. కొన్నాళ్లకు తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు పోయిన వానరులు తిరిగొచ్చి సీత జాడ తెలియలేదని చెప్పారు.

దక్షిణ దిక్కుకు వెళ్లిన హనుమంతుడు మొదలైనవారు మార్గమధ్యంలో మధువనంలో విహరించి, తేనె కడుపార తాగి, విశ్రమించి, లక్ష్మణుడు, సుగ్రీవుడు, శ్రీరాముడు కలిసి వున్న ప్రదేశానికి వచ్చారు. వారి ముఖ కవళికలను బట్టి వారికి సీతా దర్శనం కలిగిందని భావించాడు రాముడు. అప్పుడు హనుమంతుడు, తాను సీతాదేవిని దక్షిణ దిక్కున వున్న లంకలో సందర్శించానని చెప్పి, ఎలా ప్రభావతి అనే తాపసాంగన తమకు సీతాదేవిని కనుగొనే సూచనలు ఇచ్చింది, ఎలా జటాయువు సోదరుడు సంపాతి రావణుడి జాడ చెప్పిందీ, ఎలా తాను సముద్రాన్ని దాటిందీ, ఎలా లంకకు పోయిందీ, ఎలా సీతాన్వేషణ చేసిందీ, ఎలా సీతను అశోకవనంలో చూసిందీ, ఎలా ఆమె సీత అని గుర్తించిందీ, ఎలా ఆమెకు తనను పరిచయం చేసుకున్నదీ, ఎలా ఆమెకు రామలక్ష్మణుల జాడ చెప్పిందీ వివరించాడు. సీతాదేవి ఇచ్చిన ఆమె తలమీది మాణిక్యాన్ని రాముడికి ఇచ్చాడు. కాకాసుర వృత్తాంతాన్ని కూడా సీత చెప్పిన విధంగా చెప్పాడు. తాను లంకా దహనం చేసిన సంగతి కూడా చెప్పాడు.

ఇదంతా విన్న శ్రీరాముడు సుగ్రీవుడిని చూసి, రావణుడి మీద దండెత్తడానికి తగిన సన్నాహాలు చేయమని ఆదేశించాడు. రామాజ్ఞను శిరసావహించి నలుదిక్కుల వున్న వానర నాయకులను కిష్కింధకు రమ్మని సుగ్రీవుడు ఆదేశాలిచ్చాడు. ఆయన అజ్ఞానుసారం అనేకమంది సాటిలేని వీరులు వచ్చారక్కడికి. గజుడు, గయుడు, కుముదుడు, దధిముఖుడు, జాంబవంతుడు మొదలైన వానర నాయకులు వందల-వేల కోట్ల భల్లూక, వానర సేనతో కిష్కింధకు వచ్చారు. ఒక శుభముహూర్తంలో శ్రీరాముడు లంక మీదికి దండయాత్రకు బయల్దేరాడు.                   

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, షష్ఠ-సప్తమాశ్వాసాలు

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

                               

Sunday, August 8, 2021

శ్రీరాముడికి దివ్యాస్త్రాలను ఇచ్చిన విశ్వామిత్రుడు ...... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-68 : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీరాముడికి దివ్యాస్త్రాలను ఇచ్చిన విశ్వామిత్రుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-68

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (09-08-2021)

ఆ విధంగా ఆ రాత్రి అక్కడే నిదురించి,మర్నాడు-నాలుగవ రోజు ఉదయం కాగానే, ముద్దుబాలకులైన రామ లక్ష్మణులను నిద్ర లేపాడు విశ్వామిత్రుడు. శ్రీరామచంద్రమూర్తిని చూసి, " నాయనా,రామా ! రామచంద్రా ! నీ నడవడికి నాకెంతో సంతోషం కలిగింది. మనుష్యులనైనా, దేవతలనైనా, రాక్షసులనైనా, యక్షులనైనా, గంధర్వ-కిన్నర-గరుడ-సిద్ధుల సమూహాలనైనా, యుద్ధభూమిలో జయించగల శ్రేష్ఠమైన అనేక అస్త్రాలను నీకిస్తాను. తీసుకో. వీటితో నువ్వెట్టి శత్రువునైనా అణచి, వశపర్చుకోగల శూరుడివై భూమిపై ప్రసిద్ధికెక్కుతావు" అని అంటాడు. తానివ్వబోయే అస్త్రాలను వివరిస్తాడీవిధంగా విశ్వామిత్రుడు:

"దండ చక్రం-ధర్మచక్రం-కాలచక్రం-విష్ణుచక్రం-ఐంద్రాస్త్రం-భయంకరమైన వజ్రాస్త్రం-శివ శూలం- బ్రహ్మ శిరం-ఐషీకం-బ్రహ్మాస్త్రం-మోదకీ శిఖరులనే రెండు గదలు-వరుణ పాశం-వారుణాస్త్రం-ధర్మ పాశం -కాల పాశం-ఆర్ద్రం, శుష్కం అనే పేర్లున్న యశనులు (పిడుగులు)-నారాయణాస్త్రం-పైనాకం- అగ్ని దేవతాకమైన ఆగ్నేయాస్త్రం -శిఖరాస్త్రం- వాయువ్యాస్త్రం- హయశిరోస్త్రం -క్రౌంచాస్త్రం-రాక్షసులు ధరించే కంకాలం, ముసలం, కంకణం, కాపాలం - వైద్యాధరాస్త్రం-నందనం అనే ఖడ్గం-మానవాస్త్రం-గాంధర్వాస్త్రం- ప్రశమనం-ప్రస్వాపనం-భాస్కరాస్త్రం- దర్పణం - శోషణం - సంతాపనం - విలాపనం - కందర్పుడికి ప్రియమైన దర్పకాస్త్రం-పైశాచాస్త్రం-మోహనం-సంవర్తకం - దామనంబు - సౌమనం - త్వష్ట్రస్త్రమైన సుదామనం - భర్గాస్త్రం – శీతాస్త్రం - సౌరాస్త్రం". ఈ అస్త్రాలన్ని కామరూపాలనీ, మహాబలవంతమైనవనీ అంటూ, విశ్వామిత్రుడు అన్నిటినీ రాముడికిచ్చెదను తీసుకొమ్మంటాడు.

అంటూనే, తూర్పు ముఖంగా శుచిగా ఆచమానం చేసి, ఆ అస్త్రాల మంత్రాలను ఆయనకు ఉపదేశించాడు. ఇన్ని అస్త్రాలను ఒక్కడే సంపాదించాలంటే దేవతలకైనా సాధ్యపడదు.వాటన్నిటినీ విశ్వామిత్రుడు ఉదార బుద్ధితో శ్రీరాముడికిచ్చాడు. శ్రీరాముడు కూడా మిక్కిలి నిష్ఠతో జపం చేసింతర్వాత, మునీంద్రుడి ఆజ్ఞ ప్రకారం, ఆ అస్త్ర-శస్త్ర సమూహాలన్ని, భృత్యులై రామచంద్రమూర్తిని సేవించాయి. తనకు ప్రత్యక్షమైన అస్త్ర దేవతలందరినీ తన హస్త పద్మాలతో తాకి, స్వీకరించి, తనకు అవసరమైనప్పుడు పిలుస్తాను-అప్పుడొచ్చి తన అవసరాన్ని తీర్చమని-ప్రస్తుతానికి పొమ్మని వారికి సెలవీయగా, వారందరూ తమ తమ ఇష్టానుసారంగా వెళ్లిపోయారు. శ్రీరామచంద్రుడు సంతోషం అతిశయించగా, వికసించిన మనస్సుతో, విశ్వామిత్రుడికి నమస్కరించి ప్రయాణమై పోతూ, తనకున్న సందేహాలను ఆయన్నడిగి తీర్చుకుంటాడు. 

శ్రీరాముడికి ఉపసంహార అస్త్రాలను ఇచ్చిన విశ్వామిత్రుడు

దయావంతుడైన విశ్వామిత్రుడు దేవతా సమూహాలకైనా లభ్యం కాని అస్త్రాలను తనకిస్తే తీసుకున్నానీ, అయితే, శత్రువులు తనపై ఏదైనా అస్త్రాన్ని ప్రయోగిస్తే, తాను దాన్ని ఎదుర్కోవడానికి ఏ అస్త్రాన్ని ఉపయోగించాల్నో - అదేవిధంగా, తాను ప్రయోగించిన అస్త్రాన్ని తిరిగి ఉపసంహరించాలంటే ఏం చేయాల్నో, వివరంగా చెప్పమని మునీంద్రుడిని అడుగుతాడు. శ్రీరాముడు అడిగిన విషయాలన్నిటికీ వివరణ ఇచ్చాడు విశ్వామిత్రుడు. "సత్యవంతం - సత్యకీర్తి - ప్రతిహారం - రభసం - పరాజ్ముఖం - అవాజ్ముఖం - లక్షాక్ష విషమాలు - దశాక్షం - దృఢనాభం - సునాభం - సుదీప్తం - దశశీర్షం - శతోదరం - శతవక్త్ర శరం - కృశనం - జ్యోతిషం - పద్మనాభం - మహానాభం - దుందునాభం - నైరాశ్యం - శుచి - బాహువు - విరుచి - రుచిరం - ధనం - మహాబాహువు - నిష్కులి - దైత్య శమనం - హరిద్రం - యోగంధరం - మకరం - ధాన్యం - పితృవు - సౌమనసం - కరవీర శరం - విభూత శరం - కామరుచి - ఆవరణం - మోహం - కామరూపం - సర్వనాభం - జృంభకం - సంతానం - వరణం - అనంతం - విభావంతం": వీరందరు భృశాశ్వుడి కొడుకులని, కోరిన రూపాలు కలవారని. జపించేవారి పాలిటి చింతామణులని, చెప్పిన విశ్వామిత్రుడు అవన్నీ శ్రీరాముడికిచ్చాడు. ఆ మంత్రాలను కూడా ఉపదేశించాడు. (ఈ అస్త్రాలన్ని అవతార పురుషుడైన శ్రీరామచంద్రమూర్తికి తెలియవని కాదు. కాకపోతే, మంత్రాలను నేర్చుకోవాలంటే, సద్గురూపదేశం అవశ్యమని లోకానికి తెలియచెప్పేందుకు, వాటిని విశ్వామిత్రుడి ద్వారా పొందాడు).

ఆ అస్త్రాలలో కొన్ని కఠిన శరీరాలు కలవి - కొన్ని విస్తారమైన తేజస్సు కలవి - కొన్ని సుఖమిస్తాయి - కొన్ని మండుతున్న అగ్నితో సమానమైనవి - కొన్ని పొగలాగా వుంటాయి - కొన్ని సూర్య చంద్రుల తేజంతో వుంటాయి. అవన్నీ రామచంద్రమూర్తిని సమీపించి, చేతులు జోడించి, " పుండరీకాక్షా ! రామచంద్రా ! మేము నీ కింకరులం. కొత్తవరం కాదు. నీ వెట్లా ఆజ్ఞాపిస్తే అట్లానే నడచుకుంటాం" అనడంతో, తాను స్మరించినప్పుడు వచ్చి తన కార్యం చక్కపర్చి పొమ్మని కోరుతాడు రాముడు. వెన్వెంటనే అస్త్ర మంత్ర మూర్తులు చేతులు జోడించి, శ్రీరామచంద్రమూర్తి తమను అనుగ్రహించి స్వీకరించాడన్న సంతోషంతో ఆయనకు ప్రదక్షిణ చేసి మాయమయ్యాయి. తదుపరి, విశ్వామిత్రుడి ఆజ్ఞ ప్రకారం సంహారాస్త్రాలన్ని రామచంద్రమూర్తి లక్ష్మణుడికి ఇచ్చాడు. ఈ విధంగా వారిద్దరూ ఆ విద్యలనన్నీ నేర్చినవారైనారు.

రత్నాల లాగా శ్రేష్ఠమైన సద్గుణాలుగల ఆ బాలురు విశ్వామిత్రుడి వెంట పోయే సమయంలో సమీపంలోని కొండ పక్క అందమైన చెట్ల గుంపు కనిపించింది. మబ్బు కమ్మినట్లు దట్టంగా - నల్లగా - చీకట్లు కలిగించే విధంగా, రసవంతమైన వృక్షాలు, తియ్య మామిడులు, చీకటి మాకులు, జాజులు, చందన వృక్షాలు, మాది ఫలాలు, గజ నిమ్మలు, మొల్లలు, దిరిసెనలు, పూల గురివింద తీగలు, వాటి సమూహాలు, ఆశ్చర్యం కలిగించే నానా వర్ణాల చిలుకలు, నెమళ్లు, తుమ్మెదలు-వాటి పిల్లల ఝంకారాలు, కళ్లకు ఆనందం కలిగిస్తూ - మనస్సును ఆకర్షిస్తూ వుందా స్థలం. ఆడే గోరువంకలు, ఆడే చిలుకలు, ఆడే నెమిళ్లు - వాటి పాటలు దట్టమైన ఆకాశాన్ని రాసుకుంటున్నాయని, ఆ వనం లో వుండే ఋషి ఎవరనీ అడుగుతాడు శ్రీరాముడు విశ్వామిత్రుడిని. "మునీంద్రా ! భయంకరమైన అడవిని దాటామని ఈ మనోహరమైన సుఖ ప్రదేశాన్ని చూస్తుంటే అనిపిస్తున్నది. నిన్న వినిపించిన భయంకర ధ్వనులు - కనిపించిన క్రూర మృగాలు పోయి, మనోహరమైన ధ్వనులు వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మనుష్యుల భయం లేకుండా ఇష్టమొచ్చినట్లు జింకలు తిరుగుతున్నాయి. దీనికి కారణమేంటి మునీంద్రా? నీ యజ్ఞం విఘ్నం చేయాలనుకుంటున్న బ్రాహ్మణ హంతకులెవరు? మీరు యజ్ఞం చేయాలనుకుంటున్న వనం ఎక్కడున్నది? నేనెట్లా యజ్ఞ రక్షణ చేయాలి?" అని అడిగిన రామచంద్రమూర్తితో విశ్వామిత్రుడు వారప్పుడున్న సిద్ధాశ్రమ వృత్తాంతాన్ని వివరిస్తాడు.

Saturday, August 7, 2021

శ్రీ మదాంధ్ర మహాభారతంలో వాల్మీకి రామాయణం-1..... శ్రీరామావతారం, రావణ జననం, రాముడి అరణ్యవాసం, సీతాపహరణం .... ఆస్వాదన-32 : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీ మదాంధ్ర మహాభారతంలో వాల్మీకి రామాయణం-1

శ్రీరామావతారం, రావణ జననం, రాముడి అరణ్యవాసం, సీతాపహరణం

ఆస్వాదన-32

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధమ్ (08-08-2021)

ద్రౌపదిని బలాత్కారంగా ఎత్తుకుపోయిన సైంధవుడిని పాండవులు ఓడించి, ద్రౌపదిని విడిపించి, అతడిని పరాభవించి, మందలించి, వదిలిపెట్టిన తరువాత కొన్నాళ్లకు ధర్మరాజాదుల దగ్గరికి మార్కండేయ మహర్షి వచ్చాడు. జరిగిన విషయాలన్నీ ఆ మహర్షికి చెప్పాడు ధర్మరాజు.  చెప్పిన తరువాత, ద్రౌపదీదేవిలాగా అమితమైన ఆవేదనను అనుభవించిన రాజకుమారి కాని, తనలాగా నిరంతర దుఃఖసముద్రంలో ఓలలాడిన రాజకుమారుడు కాని ఇంతకుముందు ఎక్కడైనా వున్నారా అని ప్రశ్నించాడు. జవాబుగా మార్కండేయుడు, వారు పడ్డ కష్టాలకంటే ఎక్కువ కష్టాలను అనుభవించినవాడు రఘువంశంలో జన్మించిన శ్రీరామచంద్రుడని ఆయన కథ వినిపించాడు.

ఇక్ష్వాకు వంశంలో అజుడనే మహారాజుకు దశరథుడు అనే కుమారుడు పుట్టి ముగ్గురు సతులను పెండ్లి చేసుకున్నాడు. ఆ ముగ్గురిలో కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు.వారిలో రాముడికి విదేహరాకుమారి సీత భార్య అయింది. ఇదిలా వుండగా సృష్టికర్తైన బ్రహ్మదేవుడికి మానస పుత్రుడైన పులస్త్యుడికి వైశ్రవణుడు అనే కుమారుడు జన్మించాడు. అతడు బ్రహ్మ గురించి తపస్సు చేసి, నలకూబరుడు అనే కొడుకును, లోకపాలత్వాన్ని, ధనానికి ఆధిపత్యాన్ని, శివుడితో స్నేహాన్ని వరాలుగా పొందాడు. దీనికి కోపించిన పులస్త్యుడు తన శరీరం నుండి విశ్రవసుడు అనేవాడిని వైశ్రవణుడికి పోటీగా సృజించాడు. కాకపోతే వైశ్రవణుడికి, విశ్రవసుడికి సఖ్యత కుదిరింది. వైశ్రవణుడు ముగ్గురు రాక్షస వనితలను బ్రాహ్మణుడైన విశ్రవసుడికి పరిచారికలుగా ఇచ్చాడు. ఆ ముగ్గురూ అతడికి పరిచర్యలు చేసేవారు.

విశ్రవసుడు ఆ ముగ్గిరికి సంతానాన్ని ప్రసాదించాడు. ఒకరికి రావణ, కుంభకర్ణుడు; ఇంకొకరికి విభీషణుడు; మూడో ఆమెకు ఖరుడు, శూర్పణక జన్మించారు. వీరిలో రావణుడు విస్తారమైన పేరు ప్రతిష్టలను ఆర్జించి, పరాక్రమవంతుడయ్యాడు. కుంభకర్ణుడు కూడా అలాగే అయ్యాడు. కాకపొతే ఇద్దరూ దుర్మార్గులయ్యారు. విభీషణుడు మాత్రం గొప్ప మనస్సు కలవాడయ్యాడు. ఖరుడు, శూర్పణక పాపాత్ములయ్యారు. వారంతా జనకుడి దగ్గర వేదాలు, వేదాంగాలు, విలువిద్య క్షుణ్ణంగా అభ్యసించారు. ఒకనాడు తన తండ్రి దగ్గరకు వచ్చిన కుబేరుడిని చూసిన రావణుడు, కుంభకర్ణుడు అసూయ చెంది తాము కూడా అలాగే కావాలని బ్రహ్మ దేవుడి గురించి తపస్సు చేశారు. విభీషణుడు సహితం తపస్సు చేశాడు. వెయ్యేళ్ల తరువాత బ్రహ్మదేవుడు సాక్షాత్కరించాడు.  అమరత్వం తప్ప ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు.

దేవ, పితరుల, దితి సంతతి, పన్నగుల, గంధర్వుల, రాక్షసుల, విద్యాధరుల, యక్షజాతుల లాంటి ఎవరి చేతుల్లో ఓటమి లేకుండా, సువిశాల సృష్టిలో ఎక్కడికైనా కోరిన రూపంతో సంచరించే విధంగా వరం కోరాడు రావణుడు. మనుజుల చేతుల్లో తప్ప ఇతరుల వల్ల ప్రాణ భయం లేదని బ్రహ్మ వరం ఇచ్చాడు. కుంభకర్ణుడు కోరినట్లే నిద్ర వరంగా ఇచ్చాడు. తన మనస్సు పాపానికి దూరంగా వుండే వరం, బ్రహ్మాస్త్రం కోరాడు విభీషణుడు. బ్రహ్మ ఆ రెండూ అనుగ్రహించాడు. అమరత్వం కూడా ఇచ్చాడు.

వరగర్వంతో రావణుడు కుబేరుడి మీదకు దండెత్తాడు. అతడు లంకను వదిలి పారిపోయాడు. రావణుడు వెంబడించి అతడి పుష్పక విమానాన్ని లాక్కున్నాడు. రాక్షస సామ్రాజ్యానికి తిరుగులేని నాయకుడయ్యాడు రావణుడు. ఇంద్రుడిని జయించాడు. సర్వ భూతాలకు భీతి కలిగించాడు. ఋషులు అగ్నిదేవుడితో కలిసి బ్రహ్మకు మొరపెట్టుకున్నారు. తమ విన్నపాలను ఆలకించమని వేడుకున్నారు. విష్ణుమూర్తి భూలోకంలో మానవుడుగా అవతరించి రావణాసురుడిని సంహరిస్తాడని వారికి అభయమిచ్చాడు బ్రహ్మ. ఇంద్రాది దేవతలు వానరులుగా, ఎలుగుబంట్లుగా అవతరిస్తారని కూడా చెప్పాడు. దుందుభి అనే యక్షకాంతను ‘మంథర’ అనే కుబ్జగా జన్మించమని ఆదేశించాడు. సర్వం అలాగే జరిగింది.

ఇదిలా వుండగా దశరథ కుమారులు పెరిగి వేద వేదాంగాలను చదివారు. వివాహం చేసుకున్నారు. యువరాజ పదవికి శ్రీరాముడిని పట్టాభిషిక్తుడిగా చేయాలనుకున్నాడు దశరథుడు. శుభ ముహూర్తం కూడా నిర్ణయించడం జరిగింది. ఆ సందర్భంలో కైకేయి, తన దాసి మంథర దుర్మార్గపు సలహాతో, భర్త దగ్గరికి పోయి పూర్వం ఆయన ఇస్తానన్న వరాన్ని అప్పుడు కావాలని కోరింది. సరేనన్న దశరథుడికి ఆ వరం ఏమిటో చెప్పింది. ఒకటి భరతుడికి యౌవరాజ్య పట్టాభిషేకం, రెండవది శ్రీరాముడికి పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం. అది విని దశరథుడు మూర్ఛపోయాడు. జరిగినదంతా తెలుసుకున్న శ్రీరాముడు తన తండ్రిని సత్యసంధుడిని చేయాలన్న తలంపుతో, తక్షణమే బయల్దేరి సీతాలక్ష్మణులతో కలిసి అరణ్యానికి వెళ్లాడు. రాముడు వెళ్లిన వార్త విన్న దశరథుడు ప్రాణాలను విడిచాడు. కైకేయి భరతుడిని రప్పించి రాజ్యభారాన్ని వహించమని చెప్పింది.

భరతుడు తల్లిని నిష్టూరాలాడాడు. కోపగించుకున్నాడు. పాపాత్మురాలన్నాడు. భరతుడు తండ్రికి అంత్య క్రియలు చేశాడు. ఆ తరువాత సహాకుటుంబ, బంధుమిత్ర, సపరివార సమేతంగా, తల్లులతో సహా అన్నను వెనక్కు పిలవడానికి శ్రీరాముడున్న చిత్రకూట పర్వతానికి వెళ్లాడు. వెళ్లి, శ్రీరాముడి పాదాలమీద పడి, తండ్రి మరణ వృత్తాంతం చెప్పి, అయోధ్యకు తిరిగి వచ్చి సింహాసనాన్ని అధిష్టించమని ప్రార్థించాడు. శ్రీరాముడు భరతుడెంత ప్రార్థించినా సమ్మతించలేదు. చివరకు అన్నగారి పాదుకలను తీసుకొని అయోధ్యకు సమీపంలోని నందిగ్రామం చేరి, అక్కడ వాటిని నెలకొల్పి, తాను రాముడి ప్రతినిధిగా రాజ్యం చేయసాగాడు భరతుడు. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో చిత్రకూటం వదిలి శరభంగుడి ఆశ్రమానికి పోయి, అక్కడ నుండి దండకారణ్యం ప్రవేశించి, గోదావరీ తీరంలో పర్ణశాల నిర్మించుకుని నివసించసాగాడు.   

పర్ణశాలలో నివసిస్తున్నప్పుడు రావణుడి సహోదరి శూర్పణక వీరికి కీడుచేయడానికి రాగా ఆమె ముక్కు-చెవులు వికారం చేశాడు లక్ష్మణుడు. దానికి కోపగించి తన మీదికి యుద్ధానికి వచ్చిన ఖర దూషణాది పద్నాలుగు వేలమంది రాక్షసులను శ్రీరాముడు సంహరించాడు. అప్పుడు శూర్పణక రావణాసురుడి దగ్గరకు వెళ్లి తనకు జరిగిన పరాభవాన్ని గురించి చెప్పింది. ఎవరీ పరాభవం చేశారని రావణుడు అడగ్గా, రామలక్ష్మణుల గురించి, వారున్న స్థలాన్ని గురించి, వారు తన ముక్కు చెవులు కోసిన సంగతి, ఖర దూషణాది పద్నాలుగు వేలమంది రాక్షసులను శ్రీరాముడు ఒక్కడే సంహరించిన విషయం వివరంగా చెప్పింది. రావణుడు తక్షణమే బయల్దేరి గోకర్ణానికి వెళ్లి, తన పూర్వ మంత్రైన మారీచుడిని కలిసి రాముడిమీద పగతీర్చుకోవడానికి తనకు సహాయం చెయ్యమని అడిగాడు.

శ్రీరాముడితో యుద్ధం వద్దని సలహా ఇచ్చాడు మారీచుడు. ఆయన గొప్ప పరాక్రమవంతుడని చెప్పాడు. తాను ఇంతకు ముందు శ్రీరాముడు శౌర్యాన్ని చవిచూసి వున్నానని అన్నాడు. తన మాట వినకపోతే చంపుతానన్నాడు. రావణుడి చేతిలో చచ్చేదానికంటే రాముడి చేతిలో చావడం మేలనుకున్నాడు మారీచుడు. తక్షణం మారీచుడిని బంగారు లేడిగా మారమన్నాడు రావణుడు. సీతకు కనిపించి ఆమెను ఆకర్షించమన్నాడు. మారీచుడు అందుకు సమ్మతించాడు. మాయాలేడిని చూసిన సీత అది తనకు కావాలని, తెచ్చిపెట్టమని రాముడిని కోరింది. శ్రీరాముడు లేడిని పట్టుకోవడానికి బయల్దేరాడు. శ్రీరాముడు వెంబడిస్తుంటే మాయలేడి చిక్కకుండా పరుగెత్తింది. అదంతా రాక్షసమాయ అని గ్రహించిన రాముడు తన బాణాన్ని దానిమీద ప్రయోగించగా, అది ‘హా! సీతా! హా! లక్ష్మణా!’ అని రాముడి కంఠంతో బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచింది.  

ఆ అరుపు విన్న సీతాదేవి భయపడింది. వెంటనే పోయి రాముడిని రక్షించమని లక్ష్మణుడిని కోరింది. అది రాక్షస మాయ అని లక్ష్మణుడు చెప్పినా సీత వినిపించుకోలేదు. సీతకు కోపం వచ్చింది. లక్ష్మణుడిని దూషించింది. అనుమానించింది. సీత మాటలు వినలేక లక్ష్మణుడు విల్లు, అమ్ములు ధరించి అన్నగారు వెళ్లిన మార్గంలో వెళ్లాడు.

అదే సమయంలో రావణుడు మారు రూపంలో, సన్యాసి వేషం ధరించి సీతాదేవి వున్నచోటుకు వచ్చాడు. అతడు నిజమైన మునిగా భావించి అతిథి సత్కారాలు చేసింది సీతాదేవి. కాసేపటికి తన నిజస్వరూపం బయటపెట్టి, తానెవరో చెప్పాడు రావణాసురుడు. తన ప్రేయసివి కమ్మన్నాడు సీతను. రావణుడిని దూషించింది సీత. తనను ఎన్నటికీ రావణుడు కాంక్షించరాదన్నది. రావణుడిని అధిక్షేపిస్తూ సీత దూరంగా తొలగిపోసాగింది. అప్పుడు రావణుడు ఆమెను బెదిరించి, భయంకరంగా ఆమెను పట్టుకొని, ఆకాశానికి ఎగిరి, లంకాపట్టణం దిశగా పోసాగాడు. అప్పుడు తనను రక్షించమని సీతాదేవి ఆక్రోశించింది. ఆ అరుపు విన్న జటాయువు అనే పక్షి రాజు రావణుడిని అడ్డుకుంది. ఇద్దరికీ యుద్ధం జరిగింది. జటాయువు రెక్కలను ఖండించిన రావణుడు చివరకు ఆతడిని సంహరించాడు.

జటాయువును సంహరించి రావణుడు వేగంగా లంకానగరం వైపు వెళ్తుంటే సీత తనకు ఇక సహాయం చేసేవారెవరూ లేరని నిరాశ పడింది. కిందకు చూడగా ఒక కొండ శిఖరం మీద కొందరు వానరులు విహరిస్తుండడం కనిపించింది. వారి మధ్య పడేవిధంగా తన ఆభరణాలను చీరచెంగున మూటకట్టి కొండ మీదకు జారవిడిచింది. రావణుడు సీతను తీసుకొని లంకకు చేరాడు. అక్కడ అశోకవనంలో వుంచాడు. రాక్షస స్త్రీలను కాపలా పెట్టాడు. (ఇంకా వున్నది)         

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, షష్ఠాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

                 

Wednesday, August 4, 2021

తెలంగాణ కోసమే తెరాసలో చేరికలు : వనం జ్వాలా నరసింహారావు

 తెలంగాణ కోసమే తెరాసలో చేరికలు   

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (05-08-2021)

తెలంగాణ రాష్ట్ర సమితిలో, వారూ-వీరూ అనే తేడాలేకుండా, ఆ పార్టీ-ఈ పార్టీ అనే భేదం లేకుండా, అను నిత్యం, ఎన్నికైన వివిధ స్థాయి ప్రజాప్రతినిధులతో సహా, వేలాది మంది రాజకీయ కార్యకర్తలు, వందల మంది ఇతర పార్టీల నాయకులు చేరడం రాజకీయ పునరేకీకరణ ఆవశ్యకత మాత్రమే. ఒక మహోన్నత ఉద్యమ నేపధ్యంలో, ఒక కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపధ్యంలో, ఆ రాష్ట్రం బంగారు రాష్ట్రంగా అవతరించాల్సిన ఆవశ్యకత నేపధ్యంలో, ఒక పార్టీ టికెట్ మీద గెలిచి, మరో పార్టీలో చేరడం సమంజసమే. అదే విధంగా ఒక పార్టీలో చాలా కాలమో, కొంతకాలమో వుండి అనేకానేక కారణాల వల్ల పార్టీ మారి టీఆరెస్ లో చేరడం కూడా సహజమే, సహేతుకమే. ఇది అనైతికమనే వారికి రాజకీయ పునరేకీకరణ ఆవశ్యకత అంతగా అర్థం కాదు. పార్టీ మారుతున్నవారి దృష్టిలో తాము మరో పార్టీలో చేరుతున్నామనే భావన కన్నా మిన్నగా, ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్రాభివృద్ధికి అమలు చేస్తున్న అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులు కావడమే. గతంలో వారు ప్రాతినిధ్యం వహించిన పార్టీలు ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతిపక్ష పాత్ర పోషించలేని దుర్గతిలో వుండడమే వారంతా ఆయా పార్టీలను వదిలి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడానికి కారణమనేది నిర్వివాదాంశం.

తెలంగాణను అడ్డుకోవడానికి అడుగడుగునా కుట్రలు జరిగినట్లే, సాధించుకున్న తెలంగాణను అస్థిర పరచడానికి కూడా వరుస కుట్రలు జరిగాయని, వాటన్నింటినీ ఎదుర్కోవడానికి రాజకీయ పునరేకీకరణ అవసరమౌందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పదే-పదే చెప్తుంటారు. చెన్నారెడ్డి ఆధ్వర్యలో 1969లో జరిగిన మహోన్నత ఉద్యమం నుంచి 2014 వరకు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా కుట్రలు జరిగాయి. ఆ తరువాత కూడా ఇంకా జరుగుతూనే వున్నాయి. ఈ ఉద్యమాల నేపధ్యంలో లోతుగా ఆలోచిస్తే, రాజకీయ అవసరాల కోసం ఆషామాషీగా చేరికలు జరగడం లేదని, తెలంగాణ గెలిచి నిలిచేందుకు అనుసరిస్తున్న వ్యూహంలో భాగంగానే పునరేకీకరణ జరుగుతున్నదని స్పష్ఠంగా అర్థమవుతుంది.

         తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక్కడే ఉద్యమ దిశగా బయలు దేరాడు. తర్వాత కొద్ది మంది మిత్రులు ఆయనతో జమయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనే విషయంపై ప్రతీ ఒక్కరితో చర్చలు జరిపారు కేసీఆర్. 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారితో కూడా మాట్లాడారాయన. వారు వారి అనుభవాలను కేసీఆర్ తో పంచుకున్నారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్య బద్ధంగా, రాజకీయ చర్యల ద్వారా తెలంగాణ సాధించాలన్న తన వ్యూహాన్ని, తన మనసులో వున్న ఆలోచనలను వారికి వివరించారు. కేవలం జై తెలంగాణ నినాదాలతోనే తెలంగాణ రాదని అన్నారు. చాలా వ్యూహాత్మకంగా, దౌత్యనీతితో ముందుకుపోవాలని స్పష్టం చేసారు. తెలంగాణ ఉద్యమం ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదని కూడా ఆనాడే స్పష్టం చేశారు. తాను నడిపే ఉద్యమంలో “ఆంధ్ర గో బ్యాక్” నినాదాలు ఉండవన్నారు. “మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు మనకు దక్కడం కోసం తెలంగాణ కావాలి కానీ, ఎవరికో వ్యతిరేకంగా కాదని” చెప్పారు. అలా తన అభిప్రాయాలను, వ్యూహాలను ఒక్కొక్కరికీ విడమరిచి చెప్పారు. చర్చోపచర్చలు సాగాయి. మూడు నాలుగు వేల గంటల చర్చలు సాగాయి. ఎంతో మేధో మథనం జరిగింది. తెలంగాణ ఎట్ల వస్తదని అడిగినవారికి తెలంగాణ సాధన అనేది మన నిబద్ధత మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఉద్యమం నడిపే తీరుపైనే తెలంగాణ సాధన ఆధారపడి ఉంటుందని కూడా వివరించారు. తెలంగాణ సమాజాన్నంత ఒకవైపుకు తిప్పగలిగితే తెలంగాణ వస్తుందని అన్నారు. చివరకు తెలంగాణ ఉద్యమంపై తనకున్న వ్యూహాన్ని వారు అర్థం చేసుకున్నారు. అప్పటి నుంచి కేసీఆర్ వెంటే అందరూ నడిచారు.

        తెలంగాణ ఉద్యమం ఓ రాజకీయ పార్టీగా ముందుకుపోతుండడంతో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, ఆంధ్ర శక్తులు ఉద్యమాన్ని నీరు కార్చేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. రకరకాల పద్ధతుల ద్వారా ప్రయత్నాలు చేశారు. కుట్రలు చేశారు. వారు ప్రధానంగా నాలుగు పద్ధతులు అవలంభించారు. మొదటిది: విభజించి పాలించు అనే పద్దతిని పాటించి, తెలంగాణ సమాజాన్ని విడదీయడానికీ, ఐక్యత లేకుండా చేయదానికీ ప్రయత్నాలు; రెండవది: తెలంగాణ ఉద్యమ నాయకత్వ వ్యక్తిత్వ హననం, అంటే, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ద్వారా ప్రజల్లో ఉద్యమ నాయకత్వం పట్ల విశ్వసనీయత లేకుండా చూడడం; మూడవది: మీడియా ద్వారా అబద్ధాలు ప్రచారం చేయడం; చివరగా: ప్రభుత్వ అండతో ఉద్యమాన్ని అణచివేసే చర్యలు చేపట్టడం. ఈ నాలుగు పద్దతుల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చి, స్వరాష్ట్ర ఆకాంక్షను రూపుమాపాలని నిరంతర ప్రయత్నం జరిగింది. కేసీఆర్ కు కూడా అనేక బెదిరింపులు వచ్చాయి. వెనుకంజ వేయాలని కలలు కన్నారు. అయినా సరే వెనుకడుగు వేయవద్దని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఎన్ని ఇబ్బందులు కలిగినా, నిర్భంధం ఎదురైనా ఉద్యమాన్ని కొనసాగించారు.

         2004 ఎన్నికల తర్వాత కేసీఆర్ కేంద్ర మంత్రి అయ్యారు. ఢిల్లీలో ఎక్కువ సమయం గడిపారు. కేంద్ర మంత్రిగా ఉన్నంత కాలం ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల చుట్టూ తిరిగారు. తెలంగాణ ఏర్పడడానికి అనుకూలంగా 36 రాజకీయ పార్టీలను ఒప్పించారు. సిపిఐ బర్థన్ తో 30 సార్లు సమావేశమయ్యారు. మాయావతితో 19 సార్లు సమావేశమయ్యారు. అప్పుడు తెలంగాణ పడుతున్న గోస గురించి, ప్రత్యేక రాష్ట్రం కావాల్సిన అవసరం గురించి సిడి తయారు చేయించి, ఢిల్లీలో నాయకులందరికీ చూపించారు. ప్రతీ ఎంపికి, ప్రతీ పార్టీకి కొరియర్ చేశారు. అందరికీ తెలంగాణ గోస అర్థమయింది కానీ, తెలంగాణ వస్తుందనే నమ్మకం చాలా మందికి లేకుండె. ఎంత చేసినా సరే తెలంగాణ రాదు అనే అపనమ్మకం ఏర్పడడానికి గత అనుభవం కూడా ఓ కారణమే.

         1969 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సారధ్యం వహించిన స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గొప్ప తెలంగాణ బిడ్ద. ఆయన ఉద్యమాన్ని ఆకాశం ఎత్తుకు లేపారు. ఆనాటి ఆయన ఉద్యమమే మలివిడతగా చేపట్టిన కేసీఆర్ సారధ్యంలోని ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందనాలి. 1970-1971 లో ఇందిరకు మాస్ లీడర్ గా మంచి పేరొచ్చింది. పాకిస్తాన్ తో యుద్ధానికి ముందు ఇందిర 30-40 దేశాలకు వెళ్లి అక్కడి నాయకులతో మాట్లాడింది. తాను చేయబోయే బంగ్లాదేశ్ విమోచన గురించి చెప్పింది. చివరకు బంగ్లాదేశ్ ఏర్పాటైంది. దరిమిలా ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. దేశమంతా ఇందిర పార్టీ గెలిచినా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మాత్రం చెన్నారెడ్డి నాయకత్వంలోని ప్రజాసమితి, ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేసి 11 లోక సభ స్థానాలను గెలుచుకుంది. వీళ్లందరినీ తీసుకుని చెన్నారెడ్డి ఇందిరా గాంధీ దగ్గరకు వెళ్లారు. ఆమె ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అని, ప్రజల కోరిక మన్నించి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

ఇందిరాగాంధీ కొందరి సలహా తీసుకుంది. ఒక్క కొత్త రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఇలాంటి డిమాండ్లు ఎన్నో వస్తాయని, తెలంగాణ ప్రజలు అడిగిందేదైనా ఇవ్వొచ్చు కాని ప్రత్యేక రాష్ట్రం మాత్రం ఇవ్వొద్దని సలహా ఇచ్చారు వారు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం రావడం లేదని తెలిసిపోయిందో అప్పుడే నాయకత్వాన్ని తిట్టడం మొదలైంది. కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నం చేశారు. అందరం కలిసి చేరుదామని చెప్పిన చెన్నారెడ్డి, ఇందిర నుంచి కొన్ని సేఫ్ గార్డ్స్ కు అంగీకరించేలా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ లోని కొందరు చెన్నారెడ్డిని ద్రోహిగా చిత్రీకరించడం వెనుక కూడా ఆంధ్రా వాళ్ల కుట్ర వుంది. ఆంధ్ర పత్రికల పాత్ర కూడా వుంది.

         చెన్నారెడ్డి రోజులనుంచి నేటి దాకా ఆంధ్రా వాళ్ల కుట్రలు కొనసాగుతూనే వున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కూడా దీన్ని అస్థిరపరిచే కుట్ర జరిగింది. తెలంగాణ బతికి బట్ట కట్టదని ప్రచారం జరిగింది. మనుగడ సాగదని అన్నారు. రాష్ట్రపతి పాలన విధించే ప్రయత్నాలు కూడా జరిగాయి. 2014 ఎన్నికల తరువాత టీఆరెస్ కు స్నేహంగా వుండే మజ్లీస్ పార్టీ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా వుంటామని ప్రకటించిన దరిమిలా  శాసన సభలో పార్టీ బలం 63 నుంచి 70 కి చేరింది. అలా..అలా.. ప్రభుత్వానికి అండగా వుండాలని భావించి చాలా మంది టీఅరెస్ తో కలిసారు. శాసన సభలో సంఖ్య 90కు చేరుకుంది. రాజకీయ స్థిరత్వం పూర్తిగా వచ్చింది. 2018 ఎన్నికల తరువాత కూడా ఇదే జరిగింది. ఇతర పార్టీలనుండి వచ్చిన వారి చేరికతో పార్టీ-ప్రభుత్వం మరింత బలపడుతున్నది. తెలంగాణ అన్ని రకాల బాగుపడాలి. ఇతర పార్టీలనుండి వచ్చిన వారిని చిల్లర రాజకీయాల కోసం టీఆరెస్ లో చేర్చుకోవడం లేదు. తెలంగాణ నిలిచి గెలవాలి. ఈ రోజు తెలంగాణ వున్న పరిస్థితుల్లో తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే శక్తులన్నీ ఏకమై, తెలంగాణాను అభివృద్ధి చేయాలి. తెలంగాణలో రాజకీయ సుస్థిరత, ఆర్థిక సుస్థిరత సాధించడం జరిగింది. ఇదే పంథా కొనసాగాలి. అందుకోసమే పునరేకీకరణ అవసరమైంది.

         2018 లో జరిగిన ఎన్నికల్లో ఆశించనట్లే తెలంగాణ రాష్ట్ర సమితి అఖండ విజయాన్ని సాధించింది. 88 అసెంబ్లీ స్థానాలను గెల్చుకుంది. మజ్లీస్ పార్టీ తన ఏడు స్థానాలతో తెరాసకు మద్దతు ప్రకటించింది. ఎన్నికలైన వెంటనే ఇండిపెండెంట్లుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. తదనంతరం  జరిగిన రాజకీయ పరిణామాల్లో మరో ముగ్గురు వేరే పార్టీవాళ్లు కూడా తెరాసలో చేరారు. అలా..అలా...చేరికలు కొనసాగాయి. చేరినవారందరూ, చేరబోతున్న వారూ, తమ నియోజకవర్గ, రాష్ట్ర అభివృద్ధికి తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అమలుపరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులమైనామని ప్రకటించారు. వారు ఆకారణాన పార్టీ మారితే తప్పేంటి?

ఇతర పార్టీలనుండి వచ్చిన వారి చేరికతో పార్టీ-ప్రభుత్వం మరింత బలపడుతున్నది. తెలంగాణ అన్ని రకాల బాగుపడాలి. ఇతర పార్టీలనుండి వచ్చిన వారిని చిల్లర రాజకీయాల కోసం టీఆరెస్ లో చేర్చుకోవడం లేదు. తెలంగాణ నిలిచి గెలవాలి. ఈ రోజు తెలంగాణ వున్న పరిస్థితుల్లో తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే శక్తులన్నీ ఏకమై, తెలంగాణాను అభివృద్ధి చేయాలి. తెలంగాణలో రాజకీయ సుస్థిరత, ఆర్థిక సుస్థిరత సాధించడం జరిగింది. ఇదే పంథా కొనసాగాలి. అందుకోసమే పునరేకీకరణ అవసరమైంది. ఆద్యతన భవిష్యత్ లో మరికొందరు పార్టీ మారినా, తెరాసలో చేరినా ఆశ్చర్యం లేదేమో!!!

 

Sunday, August 1, 2021

తాటకను వధించిన శ్రీరాముడు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-67 : వనం జ్వాలా నరసింహారావు

 

తాటకను వధించిన శ్రీరాముడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-67

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (02-08-2021)

విశ్వామిత్రుడు చెప్పిన మాటలన్నీ గొప్ప విషయాలను బోధించేవిగాను-యుక్తి యుక్తంగాను వుండడంతో, రామచంద్రమూర్తి తనలో తానే ఆలోచించాడు కొంత సేపు. " స్త్రీ వధ పాపం అనిపిస్తుంది. గురువైన విశ్వామిత్రుడేమో అధర్మ ప్రవర్తైన తాటకను చంపడం పాపం కాదంటున్నాడు. ఆయనెందుకు అసత్యం చెప్పి తనతో అధర్మ కార్యం చేయిస్తాడు? ఏదేమైనా, ఈ ధర్మ-అధర్మ విచారం తో నాకు పనిలేదు. నిండు సభలో తన తండ్రి విశ్వామిత్రుడు చెప్పిన పనులన్నీ చేయమని చెప్పాడు తనతో. జనకుడు ఆజ్ఞ జవదాటకూడదు. గౌరవించాలి. కాబట్తి ధర్మమో - అధర్మమో మునీంద్రుడి ఇష్టప్రకారం నడచుకుంటాను" అని నిర్ణయించుకుంటాడు.

తండ్రి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మ సమానుడైన ఈ బ్రహ్మవాది ఆజ్ఞ నెరవేరుద్దామని అనుకుంటాడు రాముడు. "అలా చేస్తే, గురువు ఆజ్ఞ - జనకుడి ఆజ్ఞ, రెండూ నెరవేర్చిన వాడినవుతాను. కేవలం దయా గుణంతో కార్యం నెరవేర్చకపోతే, ఇరువురి ఆజ్ఞ మీరినవాడినవుతాను. కాబట్టి ఇక సందేహించాల్సిన పనిలేదు" అని నిశ్చయించుకున్న రాముడు, విశ్వామిత్రుడిని చూసి, చేతులెత్తి నమస్కరించి " మునీంద్రా ! బ్రాహ్మణులు, గోవులు, దేశాలు సుఖపడేందుకు నీ ఆజ్ఞ ప్రకారం తాటక ను చంపుతాను" అంటూ, దిక్కులు వూగే ధ్వని వచ్చే విధంగా తన అల్లె తాడును లాగాడు. చెవులు పగిలి పోయేటట్లు వచ్చిన ఆ ధ్వనిని విన్న తాటక, హుంకారాలతో - భూమి, దిక్కులు పగిలిపోయే విధంగా గర్జిస్తూ,  రాముడి అల్లె త్రాటి ధ్వని వచ్చిన దిక్కును పసిగట్టి, దబ్బు -దబ్బు అని ధ్వని చేసుకుంటూ, పాదాలు నేలపై కొట్టుకుంటూ, భయంకరాకారంతో వీరున్నవైపు రాసాగింది.

దాన్ని గమనించిన రాముడు లక్ష్మణుడితో అంటాడీవిధంగా: " తమ్ముడా, లక్ష్మణా ! ఈ రాక్షసి ఎలా వికార వేషంతో, భయంకర దేహంతో, దిగులు పుట్టే ధ్వని చేస్తుందో చూశావా? భయంకరమైన దీని రూపం చూసినంతనే ఎంతటి ధీరులైనా గుండెలు బద్దలై పోయి వెంటనే చావరా? కేవలం దేహ బలం మాత్రమే కాకుండా, అసమానమైన మాయా విద్యకూడా దీనికొచ్చు. ఎవరికైనా దీన్ని జయించడం సులభం కాదు. విశ్వామిత్రుడు సత్యమే చెప్పాడు. దీన్నెవరూ జయించ లేకపోవడం నిజమే. నేనే దీన్ని చంపాలి. కాకపోతే, స్త్రీ ని ఎట్లా చంపాలన్న కరుణ నన్ను పీడిస్తున్నది. అందుకే దీన్ని చంపకుండా, ముక్కు-చెవులు కోసి, గమన వేగాన్ని అణచివేసి, వెనక్కు తిరిగి పోయేటట్లు చేస్తాను. దాంతో భయం కలిగి చెడ్డ పనులు చేయదు" అని అంటుండగానే, ఆ రాక్షసి చేతులు పైకెత్తి హూంకరిస్తూ, రాముడి మీద పడబోయింది. ఎప్పుడైతే తాటక భయంకర ఆకారంతో రాముడి పై పడబోయిందో, అప్పుడే విశ్వామిత్రుడు, హుంకారంతో అదిలించి, "రామభద్రుడికి జయం-జయం" అని దీవించాడు. తాటక కూడా దూరం నుండే రాముడిపై గాలి వాన కురిపించింది. నివ్వెరపడ్డ రాముడు ప్రతిగా ఏం చేద్దామని ఆలోచిస్తుండగానే, తాటక మాయతో రామ లక్ష్మణులమీద రివ్వు-రివ్వున, ధారలు-ధారలుగా, రాళ్లవాన విరామం లేకుండా కురిపించింది. దాని చేష్టలకు కోపించిన రాముడు బాణాలను కురిపించి తాటక రెండు చేతులను నరికివేశాడు. దానిని చంపనని - ముక్కు చెవులు మాత్రమే కోస్తానని అన్న చెప్పిన మాటలు జ్ఞప్తికి తెచ్చుకున్న లక్ష్మణుడు, ఆ పనిని తానే చేయదలిచి, దాని పైకి దూకి, దాని ముక్కు చెవులు ఖండిస్తాడు. అంతమాత్రాన అది వెనుకంజ వేయకుండా, విజృంభించి - నానా రూపాలు ధరించి - కళ్ళకు కనిపించకుండా - మాయలతో - మతి భ్రమణం కలిగించే రీతిలో విపరీతంగా రాళ్ల వాన కురిపిస్తూ ఎదిరించసాగింది.

తాటక విక్రమాన్ని-వేగాన్ని గమనించిన విశ్వామిత్రుడు రాముడి మనసులోని ఆలోచనను తెలుసుకున్నవాడివలె, "రామా ! దీని పై దయతల్చి చంపకుండా వూరుకుని, తరిమి కొట్టుదా మనుకుంటున్నావు. అదట్లా పారిపోయేది కాదు. చెడు నడవడి కలది. విస్తార పరాక్రమం కలది. యజ్ఞాలు నాశనం చేసే శక్తిగలది. దీన్ని చంపటంలో ఆలశ్యం చేస్తే, సంధ్య వేళైతే, ఇక చంపడం అసాధ్యం" అని హెచ్చరిస్తాడు. ఆయనలా అంటుండగానే, తాటక రాళ్లవాన కురిపిస్తూ, మాయా బలంతో తనను సమీపిస్తుంటే, అది కనబడకపోయినా, ధ్వనిని బట్టి గుర్తించి, బాణాలు ప్రయోగించి రాముడు దాని మదం అణిచాడు. తన మాయలు నిష్ప్రయోజనం కావడంతో, వాటిని వదిలి, ప్రత్యక్షంగా ఎదురొచ్చి, రివ్వున ఒడిసెల రాయిలాగా తనమీద పడబోతే, రాముడు భయంకరమైన - తీక్షణమైన బాణాన్ని సంధించి, దాని రొమ్ములో నాటుకునేటట్లు వేయడంతో, ఆ రాక్షసి చచ్చిపోయి, భూమి అదిరిపోయేటట్లు దబీలుమని పడిపోయింది. అది చూసిన ఇంద్రాది దేవతలు, దుష్ట రాక్షసి చనిపోయిందని సంతోషించారు. ఇంతటి బలవంతురాలిని కేవలం బాణాలతోనే రామచంద్రమూర్తి సంహరించాడు - ఆయనకే కనుక అస్త్ర బలం వుంటే ఎంత కార్యమైనా చేయగలడని పొగుడుతూ శ్రీరాముడిని పూజించారు దేవతలు.

(శ్రీరామచంద్రమూర్తి అవతార కార్య ధురంధరత్వం స్త్రీ వధతో ప్రారంభం అవుతుంది. స్త్రీ వధ పాపం అని రామాయణమే చెపుతుంది. భరత వాక్యం - హనుమంతుడి వాక్యం అదే విషయం తెలియచేస్తుంది. అలాంటప్పుడు శ్రీరాముడు ఎందుకు స్త్రీ వధ చేశాడు? భగవద్గీత పుట్టింది ఇలాంటి సంశయ నివృత్తికే. అర్జునుడు, శ్రీరాముడు - ఇరువురు క్షత్రియులే. స్వధర్మమని, బంధువులను చంపితే పాపం వస్తుందని, భయపడ్డాడు అర్జునుడు. స్వధర్మమని, స్త్రీ ని చంపవచ్చానని, శంకించాడు రాముడు. కృష్ణుడు అర్జునుడికి ఏం ఉపదేశించాడో - విశ్వామిత్రుడు అదే చేశాడు రాముడికి. స్వధర్మ నిర్వహణ తన విధి అని శ్రీరామచంద్రమూర్తి ఆసక్తి లేకపోయినా చేశాడు. అందుకే శ్రీరాముడు తాటకను చంపడం దోషం కాదు).

ఇంద్రాది దేవతలు విశ్వామిత్రుడి దగ్గరున్న భృశాశ్వనందనులనే అస్త్రాలను, లోక సంరక్షణార్థమై, రామచంద్రమూర్తికి అప్పగించమని ఆయన్ను ప్రార్థిస్తారు. రాముడు చేయవలసిన కార్యాలెన్నో వున్నాయని, అస్త్ర జ్ఞానం లేకుండా అవన్నీ ఎలా చేస్తాడని ఆయన్ను అడుగుతారు వారు. అస్త్ర దానం చేయడానికి విశ్వామిత్రుడికి రాముడుకంటె యోగ్యుడైన వాడు మరొకరు కనిపించడని, అందుకే, ఆయన దగ్గరున్న విద్యా సమూహాన్నంతా రాముడికివ్వమని చెప్పి పోతారు వారందరు. విశ్వామిత్రుడు వారి మాటలను విని, రాముడిని కౌగలించుకుని, ప్రేమతో శిరస్సును ఆఘ్రాణించి, అప్పటికి సంధ్యా సమయం అయిందని, ఆ రాత్రి అక్కడే గడిపి ఉదయం కాగానే, తన ఆశ్రమానికి పోదామని అంటాడు. సరేనన్న రామ లక్ష్మణులు, ఆ మూడో రోజు రాత్రి, అక్కడే వుండిపోయారు. ఆ వనం కూడా తాటక చావుతో శాపం తీరిన దానిలాగా, కొత్త చిగుళ్లు - పూలు గుత్తులు-గుత్తులుగా కనిపించి, చైత్ర రథమనే పేరున్న కుబేరుడి ఉద్యానవనం లాగా అనిపిస్తూ, సుందర లక్ష్మికి నివాస భూమిలాగా అగుపడ సాగింది.