శ్రీ మదాంధ్ర మహాభారతంలో వాల్మీకి రామాయణం-2
సుగ్రీవుడితో రామలక్ష్మణుల స్నేహం, వాలి
వధ, సీతాన్వేషణ, లంకమీద దాడికి సన్నాహం
ఆస్వాదన-33
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధమ్ (15-08-2021)
సీతాపహరణం
పూర్వరంగంలో, దండకారణ్యంలో, శ్రీరాముడు మాయాలేడి రూపంలో వున్న మారీచుడిని
సంహరించిన తరువాత పర్ణశాలకు వెళ్తుంటే మార్గమధ్యంలో ఎదురొస్తున్న లక్ష్మణుడు
కలిశాడు. సీతను ఒంటరిగా వదలి ఎందుకు వచ్చావని రాముడు ప్రశ్నించగా, తాను సీతను వదిలి రావడానికి కారణం చెప్తూ. ఆమె
తనను నిందించిన విషయం వివరించాడు. శ్రీరాముడి హృదయంలో ఆందోళన పెరిగింది. ఇద్దరూ
కలిసి ఆశ్రమానికి తిరిగొచ్చారు. సీతాదేవి లేని పర్ణశాలను చూశారు. రామలక్ష్మణులు
ఇద్దరూ పరిసర ప్రదేశాలలో సీతను వెతికారు. అలా వెతుక్కుంటూ వెళ్తుంటే కొనవూపిరితో
వున్న జటాయువు కనిపించాడు. తాను వారి తండ్రి దశరథుడి స్నేహితుడినని చెప్పాడు.
దక్షిణ దిక్కుగా రావణుడు సీతను తీసుకుపోయిన సంగతి, తాను అతడితో పోరాడిన సంగతి చెప్పి మరణించాడు జటాయువు. రామలక్ష్మణులు
జటాయువుకు అగ్నిసంస్కారాలు చేసి అంత్యక్రియలు నిర్వర్తించారు.
సీతాన్వేషణలో
వున్న రామలక్ష్మణులకు మార్గమధ్యంలో వికృత రూపంకల కబంధుడనే రాక్షసుడు లక్ష్మణుడిని
పట్టుకోగా అన్నదమ్ములు ఇద్దరు కలిసి వాడి దీర్ఘమైన చేతులను ఖండించారు. తక్షణమే
వాడికి శాప విమోచనం అయ్యి దివ్యరూపం ధరించాడు. సీతను రావణుడు అపహరించి
లంకాపట్టణానికి తీసుకుపోయాడని చెప్పాడు. సమీపంలో వున్న పంపా సరోవర తీరానికి చేరి
అక్కడున్న ఋష్యమూకం అనే పర్వతం మీదున్న వాలి తమ్ముడు సుగ్రీవుడితో స్నేహం
చేసుకొమ్మన్నాడు. అలా చేస్తే వారి పని నెరవేరగలదని చెప్పాడు. అతడు చెప్పినట్లే
రామలక్ష్మణులు ప్రయాణం చేసి పంపా తీరం చేరారు. దాని దగ్గరలో వున్న ఋష్యమూక
పర్వతాన్ని చూశారు. అక్కడికి చేరి దానికి దగ్గరలో కూచున్నారు. వారిని చూసిన
సుగ్రీవుడు వారెవరో కనుక్కొని రమ్మని హనుమంతుడికి చెప్పాడు. హనుమంతుడు వారి
దగ్గరికి సుగ్రీవుడి దూతగా వెళ్లాడు. వారి వివరాలు కనుక్కొని, సుగ్రీవుడి గురించి చెప్పి, ఇద్దరికీ స్నేహం కలిపాడు.
సుగ్రీవుడు
శ్రీరాముడుకి సీత పారేసిన ఆభరణాల మూట చూపాడు. అవి సీతవేనని నిర్ధారణ చేశాడు
రాముడు. సుగ్రీవుడికి ప్రత్యుపకారంగా అతడి శత్రువు, అన్న అయిన వాలిని చంపి వానర రాజ్యానికి సుగ్రీవుడిని రాజును
చేస్తానన్నాడు. సీతను రావణుడి చెర విడిపించడానికి సహాయ పడుతానన్నాడు సుగ్రీవుడు.
సుగ్రీవుడు వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. వాలిసుగ్రీవుల యుద్ధం ఘోరంగా, భీకరంగా జరిగింది. ఒకరినొకరు విజృంభించి
తలపడ్డారు. ఒక దశలో ముష్టి యుద్ధానికి దిగారిద్దరూ. ఇద్దరూ ఒకే పోలికతో వుండడం
వల్ల శ్రీరాముడు బాణం వేయలేకపోయాడు. అప్పుడు ఆంజనేయుడు ఒక ఆకుల దండను సుగ్రీవుడి
మెడలో గుర్తు పట్టడానికి వేశాడు. వెంటనే శ్రీరాముడు వదిలిన బాణంతో వాలి నేలకూలాడు.
రాముడు చేసిన పని అన్యాయం అన్నాడు వాలి. శ్రీరాముడు వాలిని సంహరించి వానర
రాజ్యానికి సుగ్రీవుడిని పట్టాభిషిక్తుడిని చేశాడు. రానున్న వర్షాకాలం గడిచిన
వెంటనే వానరులను సీతాన్వేషణకు పంపుతానని సుగ్రీవుడు చెప్పాడు. అలా చెప్పి తన
రాజధానైన కిష్కింధా నగరానికి పోయాడు.
ఇక్కడ ఇలా
వుండగా అక్కడ లంకలో సీతాదేవి రావణాసురుడి చెరలో కష్టాలను అనుభవిస్తూ శ్రీరాముడిని
స్మరించుకుంటూ వున్నది. వికృత రూపాలుకల అనేకమంది రాక్షస స్త్రీలు ఆమెకు కాపలా
వున్నారు. ఆమెను రకరకాల భయపెట్టేవారు రాక్షస స్త్రీలు. అయితే వారిలోనే ఒకతి అయిన
త్రిజట అనే రాక్షసి సీతకు ఆమెకు వచ్చిన స్వప్నం గురించి ఒక శుభవార్త లాగా
చెప్పింది. రామలక్ష్మణులు క్షేమంగా వున్న వార్త చెప్పింది. సుగ్రీవుడితో స్నేహం
గురించి కూడా చెప్పింది. వారంతా శీఘ్రంగా లంక మీద దండెత్తడానికి వస్తున్నారని
చెప్పింది. రావణుడు ఆమెను బలాత్కారం చేయలేకపోవడానికి కారణం రంభ శాపమే అన్నది. తనకొచ్చిన
స్వప్నంలో రావణుడి పతనం గురించి, చావు గురించి స్పష్టంగా
సంకేతాలున్నాయని అన్నది. మహా పరాక్రమ శాలైన శ్రీరాముడిని కూడా కలలో చూశానని
చెప్పింది. తన కల నిజం అవుతుందని, సీతకు ఏ అపాయం లేదని, త్వరలోనే ఆమె తన భర్తను పొందగలదని అన్నది.
త్రిజట మాటలకు సీతాదేవి ఊరట చెందింది.
ఇంతలో రావణుడు
అక్కడికి వచ్చి సీతతో అనురాగపు మాటలు మాట్లాడాడు. తన గొప్పలు చెప్పుకున్నాడు. తాను
ఎందరినో జయించానని అన్నాడు. తాను సకల భువనాలకు సార్వభౌముడినని ప్రగల్బాలు పలికాడు.
రావణుడు ఇన్ని చెప్తున్నా పట్టించుకోకుండా సీతాదేవి ఒక పచ్చి గడ్డి పరకను రావణుడి
ముందు పడేసి దాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కటువుగా జవాబిచ్చింది. ధర్మం తెలుసుకొని
ప్రవర్తించమని చెప్పింది. అలా చెప్పి ఉత్తరీయంతో ముఖం కప్పుకొని దీనంగా ఏడుస్తూ
వుండగా దుర్మార్గుడైన రావణుడు ఇంకా కొన్ని దుర్భాషలాడి వెళ్లిపోయాడు.
లంకలో పరిస్థితి
ఇలావుంటే, అక్కడ శ్రీరాముడు వున్న చోట వర్షాకాలం అయిపోయే
సమయం దగ్గర పడింది. రాముడు లక్ష్మణుడిని పిలిచి సుగ్రీవుడి బాధ్యత గుర్తు
చేయమన్నాడు. కిష్కింధకు పొమ్మన్నాడు. సుగ్రీవుడు బాధ్యత మరచిపోతే వాలికి పట్టిన
గతే అతడికీ పడుతుందని చెప్పమన్నాడు. లక్ష్మణుడు అన్నగారు చెప్పినట్లే సుగ్రీవుడి
దగ్గరికి వెళ్లి పరిస్థితి విచారించాడు. సీతాదేవిని వెతకాడానికి వానరులను
నలుదిక్కులకు పంపానని, వారు భూమండలాన్ని అంతటినీ గాలించి ఒక
నెలలో వచ్చి సీత జాడ చెప్తారని, ఆ వ్యవధి ఇంకా అయిదు రోజులు మాత్రమే
వున్నదని చెప్పాడు సుగ్రీవుడు. లక్ష్మణుడు, సుగ్రీవుడు చెప్పిన సమాధానానికి,
సంతృప్తి చెందాడు. కొన్నాళ్లకు తూర్పు,
పడమర, ఉత్తర దిక్కులకు పోయిన వానరులు తిరిగొచ్చి సీత
జాడ తెలియలేదని చెప్పారు.
దక్షిణ దిక్కుకు
వెళ్లిన హనుమంతుడు మొదలైనవారు మార్గమధ్యంలో మధువనంలో విహరించి, తేనె కడుపార తాగి, విశ్రమించి, లక్ష్మణుడు, సుగ్రీవుడు, శ్రీరాముడు కలిసి వున్న ప్రదేశానికి వచ్చారు.
వారి ముఖ కవళికలను బట్టి వారికి సీతా దర్శనం కలిగిందని భావించాడు రాముడు. అప్పుడు
హనుమంతుడు, తాను సీతాదేవిని దక్షిణ దిక్కున వున్న లంకలో సందర్శించానని
చెప్పి, ఎలా ప్రభావతి అనే తాపసాంగన తమకు సీతాదేవిని కనుగొనే సూచనలు ఇచ్చింది, ఎలా జటాయువు సోదరుడు సంపాతి రావణుడి జాడ
చెప్పిందీ, ఎలా తాను సముద్రాన్ని దాటిందీ, ఎలా లంకకు పోయిందీ, ఎలా సీతాన్వేషణ చేసిందీ, ఎలా సీతను అశోకవనంలో చూసిందీ, ఎలా ఆమె సీత అని గుర్తించిందీ, ఎలా ఆమెకు తనను పరిచయం చేసుకున్నదీ, ఎలా ఆమెకు రామలక్ష్మణుల జాడ చెప్పిందీ వివరించాడు.
సీతాదేవి ఇచ్చిన ఆమె తలమీది మాణిక్యాన్ని రాముడికి ఇచ్చాడు. కాకాసుర వృత్తాంతాన్ని
కూడా సీత చెప్పిన విధంగా చెప్పాడు. తాను లంకా దహనం చేసిన సంగతి కూడా చెప్పాడు.
ఇదంతా విన్న
శ్రీరాముడు సుగ్రీవుడిని చూసి, రావణుడి మీద దండెత్తడానికి తగిన
సన్నాహాలు చేయమని ఆదేశించాడు. రామాజ్ఞను శిరసావహించి నలుదిక్కుల వున్న వానర
నాయకులను కిష్కింధకు రమ్మని సుగ్రీవుడు ఆదేశాలిచ్చాడు. ఆయన అజ్ఞానుసారం అనేకమంది
సాటిలేని వీరులు వచ్చారక్కడికి. గజుడు,
గయుడు, కుముదుడు,
దధిముఖుడు, జాంబవంతుడు మొదలైన వానర నాయకులు వందల-వేల కోట్ల భల్లూక, వానర సేనతో కిష్కింధకు వచ్చారు. ఒక
శుభముహూర్తంలో శ్రీరాముడు లంక మీదికి దండయాత్రకు బయల్దేరాడు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, అరణ్యపర్వం, షష్ఠ-సప్తమాశ్వాసాలు
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment