శ్రీ మదాంధ్ర మహాభారతంలో వాల్మీకి రామాయణం-1
శ్రీరామావతారం, రావణ
జననం, రాముడి అరణ్యవాసం, సీతాపహరణం
ఆస్వాదన-32
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధమ్ (08-08-2021)
ద్రౌపదిని
బలాత్కారంగా ఎత్తుకుపోయిన సైంధవుడిని పాండవులు ఓడించి, ద్రౌపదిని విడిపించి, అతడిని పరాభవించి, మందలించి,
వదిలిపెట్టిన తరువాత కొన్నాళ్లకు ధర్మరాజాదుల దగ్గరికి మార్కండేయ మహర్షి వచ్చాడు.
జరిగిన విషయాలన్నీ ఆ మహర్షికి చెప్పాడు ధర్మరాజు.
చెప్పిన తరువాత, ద్రౌపదీదేవిలాగా అమితమైన ఆవేదనను
అనుభవించిన రాజకుమారి కాని, తనలాగా నిరంతర దుఃఖసముద్రంలో ఓలలాడిన
రాజకుమారుడు కాని ఇంతకుముందు ఎక్కడైనా వున్నారా అని ప్రశ్నించాడు. జవాబుగా
మార్కండేయుడు, వారు పడ్డ కష్టాలకంటే ఎక్కువ కష్టాలను అనుభవించినవాడు రఘువంశంలో
జన్మించిన శ్రీరామచంద్రుడని ఆయన కథ వినిపించాడు.
ఇక్ష్వాకు
వంశంలో అజుడనే మహారాజుకు దశరథుడు అనే కుమారుడు పుట్టి ముగ్గురు సతులను పెండ్లి
చేసుకున్నాడు. ఆ ముగ్గురిలో కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు
జన్మించారు.వారిలో రాముడికి విదేహరాకుమారి సీత భార్య అయింది. ఇదిలా వుండగా
సృష్టికర్తైన బ్రహ్మదేవుడికి మానస పుత్రుడైన పులస్త్యుడికి వైశ్రవణుడు అనే కుమారుడు
జన్మించాడు. అతడు బ్రహ్మ గురించి తపస్సు చేసి,
నలకూబరుడు అనే కొడుకును, లోకపాలత్వాన్ని, ధనానికి ఆధిపత్యాన్ని, శివుడితో స్నేహాన్ని వరాలుగా పొందాడు. దీనికి
కోపించిన పులస్త్యుడు తన శరీరం నుండి విశ్రవసుడు అనేవాడిని వైశ్రవణుడికి పోటీగా
సృజించాడు. కాకపోతే వైశ్రవణుడికి, విశ్రవసుడికి సఖ్యత కుదిరింది. వైశ్రవణుడు
ముగ్గురు రాక్షస వనితలను బ్రాహ్మణుడైన విశ్రవసుడికి పరిచారికలుగా ఇచ్చాడు. ఆ
ముగ్గురూ అతడికి పరిచర్యలు చేసేవారు.
విశ్రవసుడు ఆ
ముగ్గిరికి సంతానాన్ని ప్రసాదించాడు. ఒకరికి రావణ, కుంభకర్ణుడు; ఇంకొకరికి విభీషణుడు; మూడో ఆమెకు ఖరుడు, శూర్పణక జన్మించారు. వీరిలో రావణుడు
విస్తారమైన పేరు ప్రతిష్టలను ఆర్జించి,
పరాక్రమవంతుడయ్యాడు. కుంభకర్ణుడు కూడా అలాగే అయ్యాడు. కాకపొతే ఇద్దరూ
దుర్మార్గులయ్యారు. విభీషణుడు మాత్రం గొప్ప మనస్సు కలవాడయ్యాడు. ఖరుడు, శూర్పణక పాపాత్ములయ్యారు. వారంతా జనకుడి దగ్గర
వేదాలు, వేదాంగాలు,
విలువిద్య క్షుణ్ణంగా అభ్యసించారు. ఒకనాడు తన తండ్రి దగ్గరకు వచ్చిన కుబేరుడిని
చూసిన రావణుడు, కుంభకర్ణుడు అసూయ చెంది తాము కూడా అలాగే కావాలని బ్రహ్మ దేవుడి
గురించి తపస్సు చేశారు. విభీషణుడు సహితం తపస్సు చేశాడు. వెయ్యేళ్ల తరువాత
బ్రహ్మదేవుడు సాక్షాత్కరించాడు. అమరత్వం
తప్ప ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు.
దేవ, పితరుల,
దితి సంతతి, పన్నగుల,
గంధర్వుల, రాక్షసుల,
విద్యాధరుల, యక్షజాతుల లాంటి ఎవరి చేతుల్లో ఓటమి లేకుండా, సువిశాల సృష్టిలో ఎక్కడికైనా కోరిన రూపంతో
సంచరించే విధంగా వరం కోరాడు రావణుడు. మనుజుల చేతుల్లో తప్ప ఇతరుల వల్ల ప్రాణ భయం
లేదని బ్రహ్మ వరం ఇచ్చాడు. కుంభకర్ణుడు కోరినట్లే నిద్ర వరంగా ఇచ్చాడు. తన మనస్సు
పాపానికి దూరంగా వుండే వరం, బ్రహ్మాస్త్రం కోరాడు విభీషణుడు. బ్రహ్మ ఆ రెండూ
అనుగ్రహించాడు. అమరత్వం కూడా ఇచ్చాడు.
వరగర్వంతో
రావణుడు కుబేరుడి మీదకు దండెత్తాడు. అతడు లంకను వదిలి పారిపోయాడు. రావణుడు
వెంబడించి అతడి పుష్పక విమానాన్ని లాక్కున్నాడు. రాక్షస సామ్రాజ్యానికి తిరుగులేని
నాయకుడయ్యాడు రావణుడు. ఇంద్రుడిని జయించాడు. సర్వ భూతాలకు భీతి కలిగించాడు. ఋషులు అగ్నిదేవుడితో
కలిసి బ్రహ్మకు మొరపెట్టుకున్నారు. తమ విన్నపాలను ఆలకించమని వేడుకున్నారు.
విష్ణుమూర్తి భూలోకంలో మానవుడుగా అవతరించి రావణాసురుడిని సంహరిస్తాడని వారికి
అభయమిచ్చాడు బ్రహ్మ. ఇంద్రాది దేవతలు వానరులుగా, ఎలుగుబంట్లుగా అవతరిస్తారని కూడా చెప్పాడు. దుందుభి అనే యక్షకాంతను
‘మంథర’ అనే కుబ్జగా జన్మించమని ఆదేశించాడు. సర్వం అలాగే జరిగింది.
ఇదిలా వుండగా
దశరథ కుమారులు పెరిగి వేద వేదాంగాలను చదివారు. వివాహం చేసుకున్నారు. యువరాజ పదవికి
శ్రీరాముడిని పట్టాభిషిక్తుడిగా చేయాలనుకున్నాడు దశరథుడు. శుభ ముహూర్తం కూడా
నిర్ణయించడం జరిగింది. ఆ సందర్భంలో కైకేయి, తన దాసి మంథర దుర్మార్గపు సలహాతో, భర్త
దగ్గరికి పోయి పూర్వం ఆయన ఇస్తానన్న వరాన్ని అప్పుడు కావాలని కోరింది. సరేనన్న
దశరథుడికి ఆ వరం ఏమిటో చెప్పింది. ఒకటి భరతుడికి యౌవరాజ్య పట్టాభిషేకం, రెండవది శ్రీరాముడికి పద్నాలుగు సంవత్సరాల
అరణ్యవాసం. అది విని దశరథుడు మూర్ఛపోయాడు. జరిగినదంతా తెలుసుకున్న శ్రీరాముడు తన
తండ్రిని సత్యసంధుడిని చేయాలన్న తలంపుతో,
తక్షణమే బయల్దేరి సీతాలక్ష్మణులతో కలిసి అరణ్యానికి వెళ్లాడు. రాముడు వెళ్లిన
వార్త విన్న దశరథుడు ప్రాణాలను విడిచాడు. కైకేయి భరతుడిని రప్పించి రాజ్యభారాన్ని
వహించమని చెప్పింది.
భరతుడు తల్లిని
నిష్టూరాలాడాడు. కోపగించుకున్నాడు. పాపాత్మురాలన్నాడు. భరతుడు తండ్రికి అంత్య
క్రియలు చేశాడు. ఆ తరువాత సహాకుటుంబ,
బంధుమిత్ర, సపరివార సమేతంగా, తల్లులతో సహా అన్నను వెనక్కు పిలవడానికి
శ్రీరాముడున్న చిత్రకూట పర్వతానికి వెళ్లాడు. వెళ్లి, శ్రీరాముడి పాదాలమీద పడి, తండ్రి మరణ
వృత్తాంతం చెప్పి, అయోధ్యకు తిరిగి వచ్చి సింహాసనాన్ని
అధిష్టించమని ప్రార్థించాడు. శ్రీరాముడు భరతుడెంత ప్రార్థించినా సమ్మతించలేదు.
చివరకు అన్నగారి పాదుకలను తీసుకొని అయోధ్యకు సమీపంలోని నందిగ్రామం చేరి, అక్కడ వాటిని నెలకొల్పి, తాను రాముడి ప్రతినిధిగా రాజ్యం చేయసాగాడు
భరతుడు. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో చిత్రకూటం వదిలి శరభంగుడి ఆశ్రమానికి పోయి, అక్కడ నుండి దండకారణ్యం ప్రవేశించి, గోదావరీ తీరంలో పర్ణశాల నిర్మించుకుని
నివసించసాగాడు.
పర్ణశాలలో
నివసిస్తున్నప్పుడు రావణుడి సహోదరి శూర్పణక వీరికి కీడుచేయడానికి రాగా ఆమె
ముక్కు-చెవులు వికారం చేశాడు లక్ష్మణుడు. దానికి కోపగించి తన మీదికి యుద్ధానికి
వచ్చిన ఖర దూషణాది పద్నాలుగు వేలమంది రాక్షసులను శ్రీరాముడు సంహరించాడు. అప్పుడు
శూర్పణక రావణాసురుడి దగ్గరకు వెళ్లి తనకు జరిగిన పరాభవాన్ని గురించి చెప్పింది.
ఎవరీ పరాభవం చేశారని రావణుడు అడగ్గా,
రామలక్ష్మణుల గురించి, వారున్న స్థలాన్ని గురించి, వారు తన ముక్కు చెవులు కోసిన సంగతి, ఖర దూషణాది పద్నాలుగు వేలమంది రాక్షసులను
శ్రీరాముడు ఒక్కడే సంహరించిన విషయం వివరంగా చెప్పింది. రావణుడు తక్షణమే బయల్దేరి గోకర్ణానికి
వెళ్లి, తన పూర్వ మంత్రైన మారీచుడిని కలిసి రాముడిమీద
పగతీర్చుకోవడానికి తనకు సహాయం చెయ్యమని అడిగాడు.
శ్రీరాముడితో
యుద్ధం వద్దని సలహా ఇచ్చాడు మారీచుడు. ఆయన గొప్ప పరాక్రమవంతుడని చెప్పాడు. తాను
ఇంతకు ముందు శ్రీరాముడు శౌర్యాన్ని చవిచూసి వున్నానని అన్నాడు. తన మాట వినకపోతే
చంపుతానన్నాడు. రావణుడి చేతిలో చచ్చేదానికంటే రాముడి చేతిలో చావడం మేలనుకున్నాడు
మారీచుడు. తక్షణం మారీచుడిని బంగారు లేడిగా మారమన్నాడు రావణుడు. సీతకు కనిపించి
ఆమెను ఆకర్షించమన్నాడు. మారీచుడు అందుకు సమ్మతించాడు. మాయాలేడిని చూసిన సీత అది
తనకు కావాలని, తెచ్చిపెట్టమని రాముడిని కోరింది. శ్రీరాముడు లేడిని పట్టుకోవడానికి
బయల్దేరాడు. శ్రీరాముడు వెంబడిస్తుంటే మాయలేడి చిక్కకుండా పరుగెత్తింది. అదంతా
రాక్షసమాయ అని గ్రహించిన రాముడు తన బాణాన్ని దానిమీద ప్రయోగించగా, అది ‘హా! సీతా!
హా! లక్ష్మణా!’ అని రాముడి కంఠంతో బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచింది.
ఆ అరుపు విన్న
సీతాదేవి భయపడింది. వెంటనే పోయి రాముడిని రక్షించమని లక్ష్మణుడిని కోరింది. అది
రాక్షస మాయ అని లక్ష్మణుడు చెప్పినా సీత వినిపించుకోలేదు. సీతకు కోపం వచ్చింది. లక్ష్మణుడిని
దూషించింది. అనుమానించింది. సీత మాటలు వినలేక లక్ష్మణుడు విల్లు, అమ్ములు ధరించి అన్నగారు వెళ్లిన మార్గంలో
వెళ్లాడు.
అదే సమయంలో
రావణుడు మారు రూపంలో, సన్యాసి వేషం ధరించి సీతాదేవి వున్నచోటుకు వచ్చాడు. అతడు
నిజమైన మునిగా భావించి అతిథి సత్కారాలు చేసింది సీతాదేవి. కాసేపటికి తన నిజస్వరూపం
బయటపెట్టి, తానెవరో చెప్పాడు రావణాసురుడు. తన ప్రేయసివి
కమ్మన్నాడు సీతను. రావణుడిని దూషించింది సీత. తనను ఎన్నటికీ రావణుడు
కాంక్షించరాదన్నది. రావణుడిని అధిక్షేపిస్తూ సీత దూరంగా తొలగిపోసాగింది. అప్పుడు
రావణుడు ఆమెను బెదిరించి, భయంకరంగా ఆమెను పట్టుకొని, ఆకాశానికి ఎగిరి, లంకాపట్టణం దిశగా పోసాగాడు. అప్పుడు తనను
రక్షించమని సీతాదేవి ఆక్రోశించింది. ఆ అరుపు విన్న జటాయువు అనే పక్షి రాజు
రావణుడిని అడ్డుకుంది. ఇద్దరికీ యుద్ధం జరిగింది. జటాయువు రెక్కలను ఖండించిన
రావణుడు చివరకు ఆతడిని సంహరించాడు.
జటాయువును
సంహరించి రావణుడు వేగంగా లంకానగరం వైపు వెళ్తుంటే సీత తనకు ఇక సహాయం చేసేవారెవరూ
లేరని నిరాశ పడింది. కిందకు చూడగా ఒక కొండ శిఖరం మీద కొందరు వానరులు విహరిస్తుండడం
కనిపించింది. వారి మధ్య పడేవిధంగా తన ఆభరణాలను చీరచెంగున మూటకట్టి కొండ మీదకు
జారవిడిచింది. రావణుడు సీతను తీసుకొని లంకకు చేరాడు. అక్కడ అశోకవనంలో వుంచాడు.
రాక్షస స్త్రీలను కాపలా పెట్టాడు. (ఇంకా వున్నది)
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, అరణ్యపర్వం, షష్ఠాశ్వాసం
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment