Sunday, December 12, 2021

అహల్యా శాప విమోచనం ...... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-85 : వనం జ్వాలా నరసింహారావు

 అహల్యా శాప విమోచనం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-85

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (13-12-2021)

"వృషణ హీనుడైన ఇంద్రుడు, దేవతల పురోహితుడైన అగ్ని దేవుడితో సహా ఇతర దేవతలందరితో తనీ స్థితికెందుకెందుకు రావలసి వచ్చిందో చెప్పాడు. గౌతముడు తపస్సు చేస్తున్నప్పుడు ఆయన కోపాన్ని జయించాడా-లేదానని పరీక్షించేందుకు, అతడికి కోపాతిశయం కలిగించేట్లు తపస్సును చెడగొట్టానని అంటాడు. ఇలా తను చేసిన దేవతా కార్యానికి ప్రతిఫలంగా గౌతముడు, తనను బీజహీనుడివి కమ్మని శపించాడన్నాడు. భార్యపైకూడా కోపమొచ్చి,ఆమెనూ శపించి-వదిలిపెట్టి,తపస్సును వ్యర్థంచేసుకున్నాడు గౌతముడు అనికూడా చెప్పాడు ఇంద్రుడు.దేవకార్యం చేసిన తనకీగతి పట్టింది కాబట్టి, తిరిగి తన వృషణాలొచ్చే ఉపాయం చేయమని వారందరినీ కోరాడు.ఇంద్రుడిలా వారినికోరడంతో,అగ్ని మొదలైన దేవతలు,మరుద్గణం-పితృదేవతలతో, వృషణాలులేని ఇంద్రుడికి మేకఅండాలనిచ్చి బీజయుతుడిగా చేయమని ప్రార్థించారు. యజ్ఞంలో మనుష్యులు వృషహీణమైన మేక మాంసాన్ని ఇస్తే,దాంతో తృప్తిచెంది,యజ్ఞఫలానికి హానిరాకుండా చేయమనికూడా అంటారు వారు. దేవతలు కోరినట్లు పితృదేవతలు, మేక బీజాలు తీసి, ఇంద్రుడికి తగిలించారు. ఆ రోజునుంచి, బీజాలు లేని మేకమాంసాన్ని యజ్ఞంలో భుజించి,యజ్ఞం చేసినవారికి యాగఫలాన్ని విశేషంగా ఇవ్వసాగారు. గౌతమమహర్షి తపోబలం వల్ల,నాటినుండి ఇంద్రుడు"మేఘవృషణుడు"అయ్యాడు"అని చెప్పిన విశ్వామిత్రుడు, గౌతముడి ఆశ్రమంలో ప్రవేశించి, అహల్యను ఉద్ధరించేలా సంకల్పించమని శ్రీరాముడిని కోరాడు.

విశ్వామిత్రుడిలా చెప్పడంతో, లక్ష్మణుడితో కలిసి రామచంద్రమూర్తి, విశ్వామిత్రుడు ముందు నడవగా, గౌతముడి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. తపస్సునే భాగ్యంగా కలిగున్నదాన్ని, గొప్ప తపస్సు చేయడం వల్ల అతిశయించిన తేజస్సు కలిగిన దాన్ని, దేవ-దాన-మానవులకింతవరకు కనిపించని దాన్ని, మనుష్యులలో ఎవరికీ లేని సౌందర్యం కలదిగా బ్రహ్మ మాయతో సృష్టించబడిన దాన్ని, మంచు కప్పి-మబ్బు కమ్మినా చంద్రకాంతిలా వున్నదాన్ని, నీటిలో కనిపిస్తున్న సూర్యుడిని ఎండలా చూడడం సాధ్యంకాని రీతిలో వున్నదాన్ని అక్కడ చూశాడు శ్రీరాముడు. ఆశ్రమంలో శ్రీరామచంద్రమూర్తి ప్రవేశించగానే, శాపం తొలిగిన అహల్య, పూర్వరూపంలో లోకానికి కనపడింది. శ్రీరామ లక్ష్మణులు ఆమెకు నమస్కరించారు. వారు అవతారమూర్తులని గౌతముడు తనకు శాపమిస్తున్నప్పుడు చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకున్న అహల్య, పూజ్యులైన వారికి అర్ఘ్యపాద్యాలను ఇచ్చింది. రామచంద్రమూర్తి అవి తీసుకుంటున్నప్పుడు దేవతలు దుందుభులు మోగించి, మేలు-మేలని అహల్యను మెచ్చుకున్నారు. ఇలా, శ్రీరామానుగ్రహం వల్లా, ఇంతకాలం తపస్సు చేసినందున పరిశుద్ధురాలైనందు వల్లా గౌతముడు ఆమెను పరిగ్రహించి శ్రీరాముడిని పూజించాడు. మునీశ్వరుడి పూజలందుకున్న రామచంద్రమూర్తి ప్రయాణానికి బయల్దేరాడు.

 

Saturday, December 11, 2021

ద్రుపద పురోహితుడి, సంజయుడి రాయబారాలు-కౌరవ పాండవుల అభిప్రాయాలు ....... ఆస్వాదన-50 : వనం జ్వాలా నరసింహారావు

 ద్రుపద పురోహితుడి, సంజయుడి రాయబారాలు-కౌరవ పాండవుల అభిప్రాయాలు

ఆస్వాదన-50

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (12-12-2021)

ద్రుపదుడు పంపిన పురోహితుడు హస్తినాపురానికి వచ్చి ధృతరాష్ట్రుడిని, కృపాచార్యుడిని, ద్రోణాచార్యుడిని, భీష్ముడిని, విదురుడిని వారి-వారి ఇండ్లకు వెళ్లి కలిసి, ఆతరువాత దుర్యోధనుడి దర్శనం కూడా చేసుకున్నాడు. తన చాతుర్యంతో ధృతరాష్ట్రుడిని తనకు అనుకూలంగా మలచుకుని, ఒకనాడు, నిండు కొలువులో సభాసదుల సమక్షంలో అసలు తాను వచ్చిన నేపధ్యాన్ని కొంచెం కటువుగా ప్రస్తావించాడు. ధృతరాష్ట్రుడు, పాండురాజు అన్నదమ్ములన్న విషయాన్ని, వారి కొడుకులు తమ తల్లిదండ్రుల ఆస్తికి వారసులన్న విషయాన్ని, పూర్వం చోటు చేసుకున్న వ్యవహారాన్నీ, మోసంతో కౌరవులు భూమిని హరించిన విషయాన్ని, వీటన్నిటికీ ధృతరాష్ట్రుడు పరోక్షంగా సమ్మతించిన విషయాన్ని పురోహితుడు ప్రస్తావించాడు. సభాసదులు చూస్తుండగా ద్రౌపదీదేవి వలువలు ఇప్పడాన్ని, సంపదను హరించడాన్ని, పాండవుల అరణ్య-అజ్ఞాతవాసాలు, కౌరవల ప్రవర్తన మొదలైన అంశాలను పేర్కొని నిష్పాక్షిక బుద్ధితో విచారించి, ధృతరాష్ట్రుడికి బుద్ధి చెప్పడం మంచిదని సభాసదులకు విజ్ఞప్తి చేశాడు పురోహితుడు.

యుద్ధం జరుగుతే ప్రజలు నశిస్తారు కాబట్టి పాండవులు కౌరవులతో వైరానికి ఇష్టపడరని, అట్లా అని వాళ్లు బలహీనులు కాదని, ధర్మాత్ములని, కౌరవ సేన పాండవుల సేనకంటే పెద్దదైనప్పటికీ పరాక్రమంలో పాండవ పక్షం మిన్న అని, పరమాత్మైన శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన వున్నందున వారికేదీ అసాధ్యం కాదని, సమయం మించి పోకముందే పాండవులను పిలిచి వారికి న్యాయం చేయమని చెప్పాడు ద్రుపద పురోహితుడు. ఆయన చెప్పిన మాటలు బ్రాహ్మణ సహజంగా, వినడానికి కష్టమైనా సభకు నచ్చేదిగా వుందని అన్న భీష్ముడు, పాండవులను బాధించడం న్యాయం కాదని, ధృతరాష్ట్రుడు వారి వాటా వారికివ్వడం సముచితం అని చెప్పాడు. ద్రుపద పురోహితుడి హితవును భీష్ముడు సమర్థించి, ఆ విధంగా సభానుకూలాన్ని ప్రకటించాడు. అంతే కాకుండా ధర్మరాజు సహనాన్ని ప్రశంసించాడు. కౌరవ పాండవుల బలాబలాల విషయంలో పురోహితుడి అభిప్రాయాన్ని సమర్థించాడు. అర్జునుడికే ఆగ్రహం వస్తే ఎంతటి శూరులైనా ఓర్చుకోగలరా అని అన్నాడు.

భీష్ముడి మాటలకు కర్ణుడు అభ్యంతరం చెప్పాడు. అధర్మ వాదన చేశాడు. పాండవుల సహాయులు బలవంతంగా వాటా అడుగుతే భయపడిపోయి దుర్యోధనుడు ఒప్పుకుంటాడా? అని ప్రశ్నించాడు. ఉత్తర గోగ్రహణంలో మహా పరాక్రమశాలైన అర్జునుడు ఒక్కడే తమల్ని అందరినీ ఓడించిన సంగతి గుర్తు చేశాడు భీష్ముడు. ధృతరాష్ట్రుడు భీష్మ కర్ణులను వారించాడు. తాను అందరికీ మేలు కలిగే విధంగా అందరితో ఆలోచించి, భూజనులకు అందరికీ సంతోషం కలిగే విధంగా చేస్తానని అన్నాడు ధృతరాష్ట్రుడు. ఒక మంచివాడిని తన బిడ్డలైన పాండవుల దగ్గరికి పంపుతానని చెప్పాడు. ధృతరాష్ట్రుడి మనస్సులో పాండవులతో కూడి వుండే మార్గాన్నే అవలంభిస్తాడని వుందన్న సంగతి కురువంశీయులకు అందరికీ సుస్పష్టం అని చెప్పాడు.

ఆ తరువాత పురోహితుడికి ఆభరణాలను, వస్త్రాలను, తాంబూలాన్ని ఇచ్చి సెలవిచ్చి పంపాడు ధృతరాష్ట్రుడు. అక్కడి నుండి పురోహితుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడి కొలువులో జరిగినదంతా చెప్పాడు.

ధృతరాష్ట్రుడు సభాసదులకు చెప్పిన విధంగానే సభలో అందరి మధ్య కూచుండి సంజయుడిని పిలిపించాడు. పాండవులు వుంటున్న ఉపప్లావ్యానికి వెళ్లమని, వారంతా శ్రీకృష్ణుడితో కలిసి వున్నప్పుడు తన మాటలుగా కొన్ని విషయాలు చెప్పమని అన్నాడు. వాళ్ల క్షేమ సమాచారాలు తాను అడిగానని, దుర్యోధనుడి చెడు బుద్ధివల్ల, కార్యాకార్యాలు తెలియనివాడు కావడం వల్ల అనర్ధాలు జరిగాయని, వాళ్లు కూడా తండ్రి వాటా అనుభవించాల్సిన వారేనని చెప్పమన్నాడు. కౌరవ పాండవులు పాలు, నీళ్లలా కలిసిపోయి బతకాలని అన్నానని, ధర్మం నడపడానికి ధర్మరాజున్నాడని అన్నానని, పాండవుల భాగం వారికివ్వకుండా వుందామన్నా తన శక్యం కాదన్నానని చెప్పమన్నాడు. ధర్మరాజును కొలువు తీర్చిన సమయంలో దర్శించుకొమ్మని, పాండవులకు సంతోషం కలిగేలా మాట్లాడమని చెప్పాడు ధృతరాష్ట్రుడు సంజయుడికి.

         ఉపప్లావ్యపురం చేరిన సంజయుడు మొదలు శ్రీకృష్ణార్జునుల దర్శనం చేసుకున్నాడు. మర్నాడు ధర్మరాజు కొలువు తీర్చినప్పుడు అతడిని దర్శించాడు. ద్రౌపదీదేవితో సహా పాండవులంతా కులాసాగా వున్న విషయం తెలుసుకుని సంతోషంతో ధృతరాష్ట్రుడు తనను పంపాడని చెప్పాడు సంజయుడు. ధర్మరాజు ఆ మాటలకు సంతోషించాడు. ధృతరాష్ట్ర, దుర్యోధనాదుల క్షేమం అడిగాడు. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామల క్షేమం అడిగాడు. తన తమ్ముల బలపరాక్రమాలు తలుస్తున్నారా అని అడిగాడు. ఘోషయాత్ర వృత్తాంతం గుర్తుందా అన్నాడు. కర్ణుడు పెత్తనం బాగా సాగుతున్నాదా అని ప్రశ్నించాడు. జవాబుగా సంజయుడు, దుర్యోధనుడి దగ్గర వున్న ఎన్నోరకాల వారి ప్రస్తావన అనవసరమని తన మనవి శ్రద్ధగా ఆలకించమని కోరాడు ధర్మరాజును. తాను వచ్చిన అసలు విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ విధంగా చెప్పాడు. ధృతరాష్ట్రుడు చెప్పమన్న మాటలు కూడా ఆయన మాటల్లోనే చెప్పాడు.

         ‘ధృతరాష్ట్రుడికి ఒకప్పుడు లేకపోయినా తరువాత జరిగినదానికి మనస్తాపం కలిగి ఇప్పుడు శాంతుడయ్యాడు. లోగడ సంధి చేసుకోవాలని లేకపోయినా ఇక ముందు  కలుగుతుంది. మీ సద్వంశంలో దుర్యోధనుడి మూలాన మచ్చ ఏర్పడింది. దానిని పోగొట్టడానికి నువ్వే సమర్థుడివి. జయాపజయాలు లాభదాయకమైనా ఆ పనికి సజ్జనులు పూనుకుంటారా? యుద్ధంలో అంతా చనిపోతే ఏం ప్రయోజనం? శ్రీకృష్ణుడు మీకు పెట్టని కోట. భీమార్జున, సాత్యకి, ద్రుపదుడు అంతా మహావీరులే. కౌరవల పక్షాన ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, అశ్వత్థామ, కర్ణుడు, శల్యుడు, దుర్యోధనుడు ఆయన తమ్ములు పరాక్రమవంతులు. ఇలాంటి మీరు ఒకరితో మరొకరు పోరాడడం వల్ల మేలు కలగదు’.

         ఇలా చెప్పిన సంజయుడు ఇంకా ఇలా అన్నాడు.

         ఉ:       మ్రొక్కెద వాసుదేవునకు, మోడ్చెదఁ జేతులు సవ్యసాచికిం,

దక్కటి మిత్త్ర బాంధవ హిత ప్రియమంత్రి వయస్య కోటికిన్‌

స్రుక్కుచు విన్నవించెద నసూయలు దక్కి యనుజ్ఞ సేయుఁడీ

యిక్కరుణాకరున్‌ శరణ మే నిదె వేఁడెదఁ గ్రోధశాంతికిన్‌

            ‘కృష్ణుడికి మొక్కుతాను. అర్జునుడికి చేతులు జోడిస్తాను. తక్కిన స్నేహితుల, బంధువుల, హితుల, ప్రియుల, మంత్రుల, వయస్యుల సమూహానికి సవినయంగా మనవి చేస్తాను. కోపాలు మాని అనుమతించండి. ఈ దయాళుడైన ధర్మరాజు కోపోశమనానికై నేను ఇదే శరణు వేడుతాను’ అని అన్నాడు సంజయుడు.

         (ఈ సందర్భాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు ఇలా రాశారు: ‘సంజయ రాయబారపు ఘట్టంలో పతాకస్థానమైన పద్యమిది. నాటకీయమైన సన్నివేశం. భక్తిభావ ప్రవృత్తితో సంజయుడు ధర్మరాజుకు ప్రణామం చేస్తూ పలికిన మాటలివి. ధర్మరాజును కరుణాకరుడని ప్రశంసించాడు. సంజయుడు కోరింది క్రోధశాంతి. అంటే, ధర్మరాజు క్రోధమూర్తి అయి వున్నాడనీ, ఆ క్రోధాన్ని శాశ్వతంగా చంపుకొని శాంతమూర్తి కావాలనీ కోరుకున్నాడు. ధర్మరాజును అనుమతించాల్సిన వారిలో అగ్రగణ్యుడు శ్రీకృష్ణుడు. అందుకే ముందుగా ఆయనకు మొక్కులు చెల్లించాడు. నారాయణుడి తరువాత నరుడు. అతడికీ చేతులు జోడించాడు. మిగిలిన వారందరికీ వినయంగా విన్నవించుకున్నాడు).

         ఇలా అన్న సంజయుడితో ధర్మరాజు, తమకు మాత్రం యుద్ధం లేకుండా జీవించడం తగిన పని కాదా? అని ప్రశ్నించాడు. యుద్ధం లేకుండా ప్రయోజనం నెరవేరితే మంచిదేగా అన్నాడు. ఒకమాట చెప్తా, నిష్పక్షపాతబుద్ధితో వినమన్నాడు. ‘అయ్యో! ధృతరాష్ట్రుడు అప్పుడు కుటిలుడై నీతిమార్గం విడిచిపెట్టాడు! మమ్ముల్నేమో సన్మార్గంలో ప్రయత్నించి నడవండి అంటూ బుద్ధులు చెప్తున్నాడు. ఇదేం న్యాయం అని ప్రశ్నించాడు. సంజయుడిని లేనిపోని ఆశలు పెట్టుకుని తమను అనవసరంగా బాధపెట్టవద్దని, ధృతరాష్ట్రుడి ప్రవర్తన కొత్తా అని చెప్పాడు ధర్మరాజు. సంజయుడు ఒకవైపు పాండవుల పరాక్రమాన్ని పొగిడి, మరోవైపు కౌరవులను యుద్ధంలో గెలవడం అసాధ్యమని స్ఫురించేలా మాట్లాడాడని అది తాను అంగీకరించనని స్పష్టం చేశాడు ధర్మరాజు. పక్షపాత బుద్ధి విడిచిపెట్టమని కూడా చెప్పాడు. భీమార్జున నకుల సహదేవుల పరాక్రమాన్ని వివరించాడు. ధృతరాష్ట్రుడికి తమ మీద ప్రేమ వుంటే, తమని పిలిపించి, భాగం ఇవ్వమని కొడుకులకు చెప్పి, అలా ఇచ్చి పంపడం మంచిది కదా? అన్నాడు.

         సంజయ, ధర్మరాజుల మధ్య జరుగుతున్న మాటల్లో తమకు శ్రీకృష్ణుడి మాట అనతిక్రమణేయం అని అంటాడు ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణుడు కలగ చేసుకుని, సంజయుడితో, తానెప్పుడూ హృదయంలో పాండవుల మేలు ఆకాంక్షిస్తూ వుంటానని, ధర్మరాజు మాటలతీరు చూస్తుంటే సంధి కుదరని వైనం స్ఫురిస్తున్నదని అన్నాడు. ధర్మరాజు అభిప్రాయం సరైనదే అని కూడా చెప్పాడు. ఎలా చూసినా దుర్యోధనుడు మహాగర్వి అనీ, ధృతరాష్ట్రుడి హృదయం అందరికీ తెలిసిందే అని అన్నాడు. కౌరవ పాండవులకు ఏవిధంగా చూసినా యుద్ధమే మంచిదని స్పష్టం చేశాడు. నిండు సభలో ద్రౌపదీదేవికి జరిగిన అవమానాన్ని సంజయుడికి గుర్తుచేశాడు కృష్ణుడు. అప్పుడు సభలో వున్న పెద్దల మౌనాన్ని కూడా గుర్తు చేశాడు. దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునిల ప్రవర్తననూ గుర్తుచేశాడు. సంజయుడు యుద్ధాన్ని ఆపడానికి ఎంత తెలివిగా మాట్లాడినప్పటికీ, కృష్ణుడు, జరిగిన అన్యాయాలన్నీ ఏకరువుపెట్టి, ఈ సంధి కార్యం జరగడం మిక్కిలి కష్టమని, దీనిని కుదర్చడం అసాధ్యం అని తాను భావిస్తున్నానని స్పష్టం చేశాడు శ్రీకృష్ణుడు.

         ‘దుర్యోధనుడు క్రోధరూప మహావృక్షం. కర్ణుడు దాని పెద్ద బోదె. శకుని పూలకొమ్మ. దుశ్శాసనుడు పుష్ప ఫలాలు. తండ్రి అయున ధృతరాష్ట్రుడు దాని మూల బలం. ఇక, ధర్మరాజు ధర్మమనే చెట్టు. అర్జునుడు దాని పెద్ద బోదె. భీముడు దాని కొమ్మ. నకులసహదేవులు పూలూ, పండ్లు. నేనూ, బ్రాహ్మణులు, వేదాలు దాని వేళ్ళ సమూహం అని అన్నాడు శ్రీకృష్ణుడు. తాను కౌరవపాండవ సంధి కార్యానికై హస్తినకు వస్తానని, ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటాడో, లేదో? చూసి దాన్ని బట్టి ప్రవర్తిస్తాం అని, రాజుకు తమ అభిప్రాయం అంతా చెప్పమని అన్నాడు శ్రీకృష్ణుడు సంజయుడితో.

తాను వచ్చిన పని నెరవేరినట్లే అని అంటూ సంజయుడు ధర్మరాజాదుల దగ్గర సెలవు తీసుకుని హస్తినాపురానికి వెళ్లాడు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఉద్యోగపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

        

                 

    

Monday, December 6, 2021

ఆర్ధిక నిపుణుడి ఆరోగ్యసేవలు : వనం జ్వాలా నరసింహారావు

 ఆర్ధిక నిపుణుడి ఆరోగ్యసేవలు

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (07-12-2021)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ స్వర్గీయ రోశయ్యతో నాకున్న సాన్నిహిత్యం సుమారు మూడు దశాబ్దాలకు పైగానే. బహుశా ఆ సాన్నిహిత్యంతోనే రోశయ్య ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాలుగైదు రోజుల్లో, కలవడానికి సమయం కేటాయించమని కార్యాలయ సిబ్బందిని కోరకుండానే, ఆయనను కలిసేందుకు మితృడు భండారు శ్రీనివాస రావుతో కలిసి వెళ్లాను. కలవడానికి ధైర్యంగా వెళ్ళిన మేము ఆయన గారి ముందు గదిలో కూర్చొన పోతుండగా, ముఖ్యమంత్రిని కలిసిన వ్యక్తి ఒకరు లోపలి నుంచి బయటకొస్తున్నప్పుడు తలుపు తీయడంతో, మమ్మల్ని చూసిన రోశయ్య, పేర్లు పెట్టి పిలిచి మమ్మల్ని రమ్మన్నారు. ముఖ్యమంత్రికి నమస్కారం చేసి, మర్యాదపూర్వకంగా ఆయనను కలవడానికి, అభినందనలు వ్యక్తిగతంగా చెప్పడానికి మాత్రమే వచ్చామని, ఆ రెండూ అయ్యాయి కనుక వెళ్తామని చెప్పాం. సున్నితంగా మా కోరికను తిరస్కరించి, మమ్మల్ని కూచోమని అనడమే కాకుండా, ఎప్పటి రోశయ్య గారి లాగానే, మాట్లాడారు గంటకు పైగా.

ఆ తర్వాత నేను అమెరికాలో మా పిల్లలతో వున్నప్పుడు దసరా, సంక్రాంతి పండుగలకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఫోన్ చేసినప్పుడు, ఇంకే ముఖ్యమంత్రి కూడా (బహుశా) కేటాయించనంత సమయం నాతోను, అక్కడుంటున్న మా అమ్మాయితోను మాట్లాడడానికి కేటాయించడం, ఆత్మీయంగా కుశల ప్రశ్నలు అడగడం, ఆయన నిరాడంబరానికి నిదర్శనం. ఒక ముఖ్యమంత్రి, అందునా అప్పట్లో వున్న పరిస్థితుల్లో, ఫోన్లో దొరకడం, సంభాషించడం నా లాంటివారెప్పుడూ మరిచిపోలేని మరుపు రాని సంఘటన.

రోశయ్యతో నాకు మొదటిసారి దగ్గరగా పరిచయం 1989 లో అయింది. అంతకుముందు కలిసినా అంతగా పరిచయం చేసుకునే అవకాశం కలగలేదు. అప్పట్లో నేను గవర్నర్ కుముద్ బెన్ జోషి దగ్గర పనిచేస్తున్నప్పటికీ, పాత్రికేయ ప్రవృత్తితో వున్న సంబంధం నన్ను స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డితో పరిచయానికి దారితీసింది. అదే క్రమంలో, చెన్నారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కావడంతో నేనాయనకు మరింత చేరువయ్యాను. ఎన్ టీ రామారావు సారధ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించడానికి పటిష్టమైన నాయకత్వం కొరకు పీసీసీ అధ్యక్షుడిగా చెన్నారెడ్డిని నియమించడంతో, ఆయనకు ఆ లక్ష్యంలో తోడ్పడిన ముఖ్యుల్లో ప్రథముడైన రోశయ్యతో పరిచయం కలిగింది. 1989 సంవత్సరాంతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చెన్నారెడ్డికి అన్ని విషయాల్లో చేదోడుగా వుండేవారు రోశయ్య.

ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం, చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కావడం, రోశయ్య ఆయన మంత్రివర్గంలో చేరడం జరిగింది. ఎన్నికల ముందు పరిచయమైన చెన్నారెడ్డి నన్ను "ముఖ్యమంత్రి పౌర సంబంధాల అధికారి" గా నియమించారు. నా నియామకం గురించి మొట్టమొదట రోశయ్య గారికి తెలియచేసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ముఖ్యమంత్రి పీఅర్ఓ గా ప్రతి దినం రోశయ్యను కలిసే అవకాశం, విధి నిర్వహణలో ఆయన సూచనలు-సలహాలు తీసుకోవడం నిరంతరం జరిగేది. ఆ తర్వాత రాజకీయాలకు సంబంధించిన ఉద్యోగం ఏదీ నేను చేయకపోయినా, ఆయనను మధ్య-మధ్య కలవడం జరుగుతుండేది. ఆయన మంత్రిగా లేనప్పుడు కూడా చాలా పర్యాయాలు కలిసి ఆయన సహాయం కోరితే కాదనలేదెప్పుడు. 1994-2004 మధ్య కాలంలో, కాంగ్రెస్ ప్రతిపక్షంలో వున్నప్పుడు శ్రీనివాసరావు తో కలిసి చాలా సార్లు కలిశాను. అప్పడు ఎలా కలివిడిగా మాట్లాడేవారో, ఇప్పుడూ అంతే.

2004 లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఉద్యోగ విరమణ చేసి, ఏడాది తర్వాత, 108 అత్యవసర సహాయ సేవలు నిర్వహిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థలో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ఇన్-చార్జ్ గా చేరాను. ఆ మధ్యలో, నేను ఆయనను కలిసిన ప్రతిసారీ, నాకేమైనా సహాయం కావాలా అని అడిగేవారు. ఇ.ఎం.ఆర్.ఐ లో చేరిన మొదటి వారంలోనే, ఒకే కంపార్ట్ మెంటులో రైల్లో ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఆయన్ను కలవడం, నా ఉద్యోగం విషయం చెప్పడం, ఆ సేవల గురించి ఆయన నోటి వెంట వివరంగా వినడం జరిగింది. నేను చేరక ముందు, ఆగస్టు 15, 2005 న ఆ సేవలు లాంఛనంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రారంభించినప్పుడు ఆయన అక్కడున్న విషయం కూడా చెప్పారు రోశయ్య. ఆర్థిక శాఖకు అదనంగా, ఆరోగ్య-వైద్య-కుటుంబ సంక్షేమ శాఖకు కూడా రోశయ్య గారే మంత్రి. 108 అత్యవసర సహాయ సేవలకు సంబంధించి, అవసరమైనప్పుడల్లా ఆయనను కలిసే అవకాశం కలిగింది. తొలుత కేవలం ప్రయివేట్ నిధులతోనే నడుస్తున్న ఆ సేవలను ఒకే రోజున ఒంగోలు, చీరాలలో ఆయన ప్రారంభించారు. చీరాల సభలో మాట్లాడుతూ, జిల్లాకు కోటి రూపాయల వంతున 23 కోట్ల రూపాయలను బడ్జెట్లో మున్ముందు కేటాయించడానికి ప్రభుత్వ సంసిద్ధతను మొట్టమొదటి సారిగా బహిరంగంగా ప్రకటించింది రోశయ్య గారే. ఇచ్చిన మాట ప్రకారం 2007-2008 బడ్జెట్లో 23 కోట్లు కేటాయించారు. ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం ఉన్నప్పటికి, రాజశేఖర రెడ్డి దృష్టిలో అప్పటికింకా వివరంగా పడలేదాసేవల విషయం.

రోశయ్య ఆరోగ్య శాఖను నిర్వహిస్తున్నప్పుడే, అంతవరకు 108 అత్యవసర సహాయ సేవలకు అసలే అందని నిధుల స్థానంలో, నిర్ణీత మొత్తంలో కొంత నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వ పరంగా సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు మధ్య ఆయన సమక్షంలో సెప్టెంబర్ 2006 లో అవగాహనా ఒప్పందం కుదిరింది. రోశయ్య చొరవతో సాధ్యమైన ఆ సంఘటన అత్యవసర సహాయ సేవలకు సంబంధించినంతవరకు ఒక చారిత్రాత్మక మలుపు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయనకు సలహాదారుడుగా పనిచేస్తున్న అధికారి, పీకె అగర్వాల్, అప్పట్లో ఆరోగ్య-వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి. ఒప్పందం ప్రకారం నిధులకు తోడు 432 అంబులెన్సులను కూడా సమకూర్చింది ప్రభుత్వం. క్రమేపీ రోశయ్య ద్వారా దివంగత ముఖ్యమంత్రికి చేరువైన సేవల నిర్వహణకు, మరిన్ని అంబులెన్సులను చేర్చడంలోను, నిర్వహణ నిధులను 95% వరకు పెంచడంలోను కీలక పాత్ర పోషించింది రోశయ్యే. గ్రామీణ ప్రాంతాలకు సహాయ సేవలను విస్తరించడానికి జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం నుంచి, ఆ సేవలకు అంబులెన్సులను పెంచినప్పుడల్లా సంబంధిత కార్యక్రమంలో పాలు పంచుకోవడం వరకు, అడిగినప్పుడల్లా కాదనకుండా ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ప్రాంగణానికి రావడం దాకా, నిధుల విడుదలలో ఆలస్యమైనప్పుడల్లా తోడ్పడంతో సహా, ఎల్ల వేళలా ఆయన సహకారం కొరకు కలిసినప్పుడల్లా ఒకే రకమైన ఆత్మీయ స్పందన దొరికేది.

సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ రామలింగ రాజు జైలుకెళ్లడంతో, జనవరి 8, 2009 , దివంగత ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలన్నీ రోశయ్య సలహాతోనే తీసుకున్నారు రాజశేఖర రెడ్డి. తిరిగి నాలుగు నెలల అనంతరం 108 అత్యవసర సహాయ సేవల నిర్వహణకు ప్రయివేట్ భాగస్వామిగా బాధ్యతలు చేపట్టమని జీవి కృష్ణారెడ్డితో రాజశేఖర రెడ్డి మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన సంప్రదించింది రోశయ్యనే. ఆ నాలుగు నెలల మధ్య కాలంలో వచ్చిన పెద్ద అవాంతరం రోశయ్య జోక్యం చేసుకోవడంతో తప్పింది. ఇ.ఎం.ఆర్.ఐ ఖాతాలో వున్న సంస్థ నిధులను యాక్సెస్ బాంక్ స్తంభింపచేయడంతో తలెత్తిన సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న రోశయ్యను కలవడం, ఆయన సహాయం కోరిన వెంటనే ఆయన దానిని పరిష్కరించడం జరిగింది. జీవీ కృష్ణారెడ్డి కంటే ముందు ప్రయివేట్ భాగస్వామిగా వచ్చేందుకు ఉత్సాహం చూపించిన పిరమల్ సంస్థ చైర్మన్ అజయ్ పిరమల్ కోరిక మేరకు, అడిగిన వెంటనే తన ఇంట్లో ఆయన కలుసుకునేందుకు సమయం కేటాయించడమే కాకుండా, అత్యవసర సహాయ సేవల గురించి "బ్రాండ్ అంబాసిడర్" లాగా ఆయనకు వివరించారు రోశయ్య. తనకున్న కొన్ని పరిమితుల వల్ల ఇ.ఎం.ఆర్.ఐ బాధ్యతలు స్వీకరించలేక పోయిన అజయ్ పిరమల్, మరో స్వచ్చంద సంస్థ పై ఆసక్తి కనబరిచి, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి కలిసినప్పుడు నేను కూడా ఆ సంస్థ అధికారులతో కలిసి వెళ్లాను. మళ్ళీ అదే అత్మీయత చూపారు రోశయ్య గారు.

ఇలా ఎప్పుడు ఏది అడిగినా కాదనని రోశయ్య అనుకోని పరిస్థితుల కారణంగా, రాజశేఖర రెడ్డి అకాల మరణంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

కొణిజేటి రోశయ్య, ఐదు దశాబ్దాల క్రితం 1968లో విధాన మండలి సభ్యుడిగా ఎన్నికై చట్టసభలో అడుగు పెట్టారు. శాసన మండలిలో ప్రతిపక్షనేతగా వ్యవహరించిన ఆయన వాగ్దాటికి అడ్డుకట్ట వేయడానికి, 1983 లో అధికారంలోకి వచ్చిన ఎన్ టీ రామారావు మండలిని రద్దు చేసేంత వరకు, ఆయన విధాన సభ సభ్యుడుగా కొనసాగారు. తెనాలి, చీరాల నియోజక వర్గాలనుంచి శాసనసభకు, నరసరావుపేట నియోజకవర్గం నుంచి లోక్ సభకు కూడా ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో తొలిసారిగా 1979 లో, తదుపరి ఎందరో ముఖ్యమంత్రుల దగ్గర, మంత్రివర్గ సభ్యుడిగా, కీలకమైన శాఖలు నిర్వహించిన అనుభవజ్ఞుడు రోశయ్య. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 1995-97 మధ్య కాలంలో సమర్థవంతంగా పనిచేశారు. పాతికేళ్ల విరామం తర్వాత మరో మారు శాసనమండలి సభ్యుడుగా 2009 లో ఎన్నికయ్యారు. ఏ శాసన మండలి సభ్యుడిగా చట్ట సభల్లో ప్రవేశించారో, అదే మండలి సభ్యుడిగా, రోశయ్య సెప్టెంబర్ 3,2009 న ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. బహుముఖ ప్రజ్ఞా శాలైన రోశయ్యకు 2007 అక్టోబర్‌లో ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ పట్టా ఇచ్చింది. ఎన్జీ రంగా శిష్యుడిగా చెప్పుకునే రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ను, 16 సార్లు శాసనసభలో ప్రవేశపెట్టిన అప్రకటిత "ఆర్థిక రంగ నిపుణుడు" కొణిజేటి రోశయ్య. వరుసగా రెండు పర్యాయాలు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ ప్రవేశపెట్టి రికార్డు సాధించారు.

ఎల్లప్పుడూ తెల్లటి ఖద్దరు దుస్తులనే ధరించే రోశయ్య ఆజానుబాహుడు. గంభీరమైన కంఠస్వరం ఆయన సొత్తు. సంయమనం ఆయన ఆస్తి. ఆయన పంచె కట్టు తెలుగు దనానికే ప్రతీక . గిట్టని వారు సహితం ఆయన్ను ఫలానా వారి గ్రూపుకు చెందిన వ్యక్తిగా వేలెత్తి చూపలేదు. మహాత్మా గాంధి సిద్ధాంతాలైన అహింస-సత్య శీలతకు ఆయన పర్యాయ పదం అనవచ్చు. రోశయ్య తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో విలక్షణమైన రాజనీతిజ్ఞుడిగా, అందరి వాడుగా, క్రమ శిక్షణ గల కాంగ్రెస్ వాదిగా మన్ననలను పొందారు. ఆశించని ముఖ్య మంత్రి పదవి, రోశయ్యకు దక్కడంతో, "అజాత శత్రువు" గా ఆయనకున్న పేరును, కొందరు అసూయాపరులు మలినం చేసే ప్రయత్నాలు ఉద్దేశపూర్వకంగా చేయడాన్ని, లౌక్యంతో-ఓర్పుతో-నమ్రతతో, అనుభవం నేర్పిన ధైర్యంతో ఎదుర్కున్నారాయన.

మూడు దశాబ్దాల పాటు మంత్రిగా పనిచేసిన అనుభవంతో, ముఖ్యమంత్రిగా, తనదైన శైలితో విధాన పరమైన నిర్ణయాలను తీసుకుంటూ, చెరిపినా చెరగని ముద్ర ప్రభుత్వ పాలనపై వేశారాయన. క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి, ఒకటి వెంట మరొక సంక్షోభం రోశయ్యను వెంటాడాయి. అనుకోని రాజకీయ అనిశ్చిత పరిస్థితుల లాంటి సంక్షోభాలను ఎదుర్కోని, ధైర్యంతో నిలదొక్కుకొని, పాలనను గాడిలో పెట్టారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంలో ఆయన చూపిన చొరవ అభినందనీయం.

తమిళనాడు గవర్నర్ గా వున్నప్పుడు ఒక పర్యాయం నేను భండారు శ్రీనివాసరావు, ఎమ్మెస్ శంకర్ తొ కలిసి చెన్నై రాజ్ భవన్ లో ఆయన్ను కలవడానికి ఉదయం పూట వెళ్లాం. ఆయన అప్పుడే మార్నింగ్ వాక్ ముగించుకుని కాఫీ తాగుతూ మాతో గంటకు పైగా ముచ్చటించారు. ఆయన ఆప్యాయత, నిరాడంబరత ఎన్నటికీ మరచిపోలేం.

Sunday, December 5, 2021

సుమతి విశ్వామిత్రుల సంభాషణ ...... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-84 : వనం జ్వాలా నరసింహారావు

 సుమతి విశ్వామిత్రుల సంభాషణ

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-84

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (06-12-2021)

విశ్వామిత్రుడు, సుమతి పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ తర్వాత దేవేంద్రుడితో సమానమైన సుమతికి విష్ణు పరాక్రమ సమానులైన శ్రీరామ లక్ష్మణులు కనిపించారు. వారిని గురించి విశ్వామిత్రుడిని ప్రశ్నించాడు సుమతి. " మునీంద్రా, ఎవరు వీరు? వీరిని చూస్తుంటే, గాంభీర్య గమనంలో ఏనుగుతోను-పరులను తిరస్కరించేందుకు అర్హమైన గమనంలో సింహంతోను-భయంకర గమనంలో పులులతోను-గర్వగమనంలో వృషభంతోను పోల్చదగిన వారిగా కనిపిస్తున్నారు. శత్రువులతో మొరపెట్టించే వీర్యంగలవారిగాను, కమలాల బోలే కళ్లుగలవారిగాను, సరసమైన మనసున్నవారిలాగాను, ఖడ్గాలు-పొదులు-విల్లు-బాణాలు ధరించేవారి లాగాను, అశ్వినీ దేవతల లాగాను, సుందరమైన-మనోహరమైన దేహాలున్నవా రిగాను, పుటమరిస్తున్న లేతప్రాయంవారివలెను, స్వేచ్ఛగా భూమ్మీదకొచ్చిన దేవతలలాగాను, ఇంగితంలో-చేష్టల్లో-ప్రమాణంలో ఒకరితో ఒకరు సమానంగాను వున్న వీరిని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. వీరెవరో చెప్పండి" అని ప్రార్థించాడు సుమతి విశ్వామిత్రుడిని.

సూర్యచంద్రులు ఆకాశాన్ని వెలిగించినట్లు భూతలాన్ని వెలిగిస్తున్న వీరు, మనుష్యులు తిరిగేందుకు సాధ్యపడని భయంకరమైన అడవుల్లో, కాలినడకన ఆయుధాలు ధరించి, మునీంద్రుడైన విశ్వామిత్రుడి వెంట ఎలా రాగలిగారని ప్రశ్నించాడు సుమతి. వారించనలవికాని బల పరాక్రమాలున్న ఆ బాలురు ఎవరి కొడుకులని కూడా అడిగాడు. వారిని గురించి విశ్వామిత్రుడు చెప్పిన మాటలను, విరోధులను అణచిన ఆ సుమతి విని-సంతోషించి, పూజార్హులు-మిక్కిలి బలవంతులైన శ్రీరామ లక్ష్మణులు-దశరథ రాజ కుమారులు, తన ఇంటికి రావడమే తన భాగ్యంగా భావించి, పూజించాడు. శ్రీరామ లక్ష్మణులు ఆయన పూజలను గ్రహించారు. ఆ రాత్రంతా ఆ నగరంలోనే సంతోషంతో గడిపి, ఉదయమే లేచి, మునిజన సమూహంతో బయలుదేరి పోయి, దూరంనుండే మిథిలా పురాన్ని చూసి, దాని అందాన్ని మెచ్చుకుంటూ పోతుండగా, ఆ నగరానికి దగ్గర లోనే ఓ చక్కటి ప్రదేశాన్ని చూసారు.

గౌతముడి ఆశ్రమ వృత్తాంతం

అక్కడున్న ఆశ్రమం ఎవరిదని, చూడడానికి అందంగా వున్నప్పటికీ ఎందుకని జనహీనమైందని అడుగుతాడు రాముడు విశ్వామిత్రుడిని. ఆశ్రమం అలా కావడానికి కారణాన్ని-ఆశ్రమ వృత్తాంతాన్ని వివరించాడీవిధంగా విశ్వామిత్రుడు: " పూర్వం ఇక్కడ బ్రహ్మ సమానుడైన గౌతమ మహర్షి వుండేవాడు. గౌతముడు తన భార్య అహల్యతో అనేక సంవత్సరాలిక్కడ వుండి తపస్సు చేశాడు. ఒకనాడు సమయం కనిపెట్టి, గౌతముడివలె ముని వేషంలో అహల్యను కలుస్తాడు ఇంద్రుడు. మన్మథుడి ప్రేరణవల్ల విశేష మోహం కలిగి, ఆ సమయం స్త్రీలతో సంభోగించించే ఋతుకాలం కాకపోయినా, అహల్యతో రతి కేళికై కోరిక గలిగి వచ్చానని గౌతముడి వేషంలో వున్న ఇంద్రుడు అహల్యతో అంటాడు. తన దగ్గరకు వచ్చినవాడు ఇంద్రుడని తెలిసినా, వాడితో రమించడం పాపమని తెలిసినా, ఇంద్రుడంతటివాడు వచ్చి ప్రార్థిస్తుంటే, ఎందుకు కాదనాలని భావించి, దుష్ట బుద్ధితో అతడితో సంభోగించింది అహల్య. ఆ తర్వాత సంతోషంతో, అయిందేదో అయిందనీ, ఇక ఆయనను కాపాడుకుని, తన్ను కూడా కాపాడమని ఇంద్రుడితో అంటుంది అహల్య. అలాంటి గొప్పవాడితో సంభోగించడం వల్ల ధన్యురాలనైనానని అంటూ, త్వరగా ఇంద్రుడిని అక్కడనుండి వెళ్లమనడంతో, భయపడొద్దని చెప్పి ఇంద్రుడు వెళ్లిపోయేందుకు తయారయ్యాడు. అదే సమయంలో, కుడిచేత్తో దర్భలు-ఎడమ చేత్తో సమిధలు ధరించి, తీర్థ స్నానం చేసి, తడి బట్టలతో-బ్రహ్మ వర్చస్సుతో-దేవదానవులు సహించలేని తేజంతో ఆశ్రమానికొచ్చిన గౌతముడు ఎదురయ్యాడు ఇంద్రుడికి. ఆయన్ను చూడగానే, తత్తర పాటుతో-చేష్టలుడిగి-కాళ్లు చేతులు వణుకుతుంటే, తెల్లబోయిన ముఖంతో, తన ఆకారాన్ని ధరించి నిలిచిపోయాడు ఇంద్రుడు. గౌతముడికి కోపం తారాస్థాయికి చేరుకుంది".

అహల్యను, ఇంద్రుడిని శపించిన గౌతముడు

"తన రూపాన్ని ధరించి, చేయరాని కార్యాన్ని చేసేందుకు సాహసించిన ఇంద్రుడు భవిష్యత్ లో ఇలాంటి పాడు పనులు చేయకుండా, ఆయన వృషణాలు వూడి నేలపై పడాలని శపించాడు గౌతముడు. తక్షణమే, ఇంద్రుడి వృషణాలు వూడి నేల రాలాయి. గౌతముడు ఆ తర్వాత ఇంట్లోకి పోయి భార్య అహల్యను చూసి, కోపంతో ఆమెనుకూడా శపించాడు. నీచ నడవడిగలిగినందున, అనేక సంవత్సరాలు గాలినే ఆహారంగా తీసుకుంటూ, కూడు-నీళ్లు లేకుండా, ఆ ప్రదేశంలోనే వుంటూ, బూడిదలో పడి ఎవరికీ కనిపించకుండా, తాపంతో పొర్లాడుతుండమని శపించాడామెను. శాప విముక్తి కూడా గౌతముడే చెప్పాడు. ఎప్పుడైతే దశరథుడి కుమారుడు రాముడు, ఆశ్రమానికి రావడం జరుగుతుందో, ఆ రోజున ఆమే పాపం పోయి పవిత్రురాలవుతుందనంటాడు గౌతముడు. రాముడిక్కడికి రాగానే, ఆయనను అతిథిగా ఎంచి, అతిథికి చేయాల్సిన పూజలు చేసి, కుబుద్ధీ-లోభం-మోహం పోయినదానివై, ఎప్పటి అందమైన ఆకారం ధరించి, సంతోషంగా తన దగ్గరకొస్తావని చెప్పి గౌతముడు ఆశ్రమాన్ని వదిలి హిమవంతానికి పోయాడు" అని ఆ వృత్తాంతాన్ని వివరించాడు విశ్వామిత్రుడు.

(అహల్య శిలగా మారిందని కొన్ని గ్రంథాలలో చెప్పబడిన విషయం వాస్తవం కాదని వాల్మీకి రామాయణం స్పష్టం చేసింది. వాల్మీకి మతమే వేరు. దుఃఖానుభవం లేకుండా, రాయిగా పడి వుంటే, పాప ఫలం అనుభవించినట్లెలా అవుతుంది? అహల్య స్త్రీగా వుంటూనే, ఆహారం లేకుండా తాపంలో మాడుతుంటుంది. రామచంద్రమూర్తి ఆశ్రమ ప్రవేశం చేయగానే ఆ తాపం తొలగి లోకానికి కనిపిస్తుంది. అంటే, జారత్వ దోషం పోవాలంటే, అనేక సంవత్సరాలు తపించి, భగవత్ సాక్షాత్కారం చేసుకోవాలి. అలా కాకపోతే వంశ నాశనం అవుతుంది. గౌతముడు అహల్య స్వరూప నాశనం చేయకుండా, గాలిని ఆహారంగా తీసుకుంటూ, కఠిన వ్రతం ఆచరించమని మాత్రమే అంటాడు. జారత్వమే అభ్యాసంగా వుంటే, ఆ స్త్రీని పతితగా భావించి స్వీకరించ కూడదు-పరిత్యజించాలి.

స్త్రీలు తమ జాతివారితో వ్యభిచరించినప్పటికీ, గర్భం రాకపోతే పరిత్యజించ రాదు. అంటే, గర్భం వచ్చినా-అసవర్ణులతో వ్యభిచరించినా, వదిలి పెట్టాలి. గర్భం ధరించకపోతే, న్యాయ శాస్త్ర ప్రకారం దండించి ప్రాయశ్చిత్తం చేయించాలి. కుక్కలతో కరిపించాలని కూడా శాస్త్రంలో వుంది).