సుమతి విశ్వామిత్రుల సంభాషణ
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-84
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (06-12-2021)
విశ్వామిత్రుడు, సుమతి పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ తర్వాత దేవేంద్రుడితో సమానమైన
సుమతికి విష్ణు పరాక్రమ సమానులైన శ్రీరామ లక్ష్మణులు కనిపించారు. వారిని గురించి
విశ్వామిత్రుడిని ప్రశ్నించాడు సుమతి. " మునీంద్రా, ఎవరు వీరు?
వీరిని చూస్తుంటే, గాంభీర్య గమనంలో ఏనుగుతోను-పరులను తిరస్కరించేందుకు అర్హమైన గమనంలో
సింహంతోను-భయంకర గమనంలో పులులతోను-గర్వగమనంలో వృషభంతోను పోల్చదగిన వారిగా
కనిపిస్తున్నారు. శత్రువులతో మొరపెట్టించే వీర్యంగలవారిగాను, కమలాల బోలే కళ్లుగలవారిగాను, సరసమైన మనసున్నవారిలాగాను, ఖడ్గాలు-పొదులు-విల్లు-బాణాలు ధరించేవారి లాగాను, అశ్వినీ దేవతల లాగాను, సుందరమైన-మనోహరమైన
దేహాలున్నవా రిగాను, పుటమరిస్తున్న
లేతప్రాయంవారివలెను, స్వేచ్ఛగా భూమ్మీదకొచ్చిన
దేవతలలాగాను,
ఇంగితంలో-చేష్టల్లో-ప్రమాణంలో ఒకరితో ఒకరు సమానంగాను వున్న
వీరిని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. వీరెవరో చెప్పండి" అని ప్రార్థించాడు
సుమతి విశ్వామిత్రుడిని.
సూర్యచంద్రులు ఆకాశాన్ని
వెలిగించినట్లు భూతలాన్ని వెలిగిస్తున్న వీరు, మనుష్యులు తిరిగేందుకు సాధ్యపడని భయంకరమైన అడవుల్లో, కాలినడకన ఆయుధాలు ధరించి, మునీంద్రుడైన
విశ్వామిత్రుడి వెంట ఎలా రాగలిగారని ప్రశ్నించాడు సుమతి. వారించనలవికాని బల
పరాక్రమాలున్న ఆ బాలురు ఎవరి కొడుకులని కూడా అడిగాడు. వారిని గురించి
విశ్వామిత్రుడు చెప్పిన మాటలను, విరోధులను అణచిన ఆ సుమతి
విని-సంతోషించి,
పూజార్హులు-మిక్కిలి బలవంతులైన శ్రీరామ లక్ష్మణులు-దశరథ రాజ
కుమారులు,
తన ఇంటికి రావడమే తన భాగ్యంగా భావించి, పూజించాడు. శ్రీరామ లక్ష్మణులు ఆయన పూజలను గ్రహించారు. ఆ రాత్రంతా ఆ నగరంలోనే
సంతోషంతో గడిపి,
ఉదయమే లేచి, మునిజన సమూహంతో బయలుదేరి
పోయి,
దూరంనుండే మిథిలా పురాన్ని చూసి, దాని అందాన్ని మెచ్చుకుంటూ పోతుండగా, ఆ నగరానికి దగ్గర లోనే ఓ చక్కటి ప్రదేశాన్ని చూసారు.
గౌతముడి ఆశ్రమ వృత్తాంతం
అక్కడున్న ఆశ్రమం ఎవరిదని, చూడడానికి అందంగా వున్నప్పటికీ ఎందుకని జనహీనమైందని అడుగుతాడు రాముడు
విశ్వామిత్రుడిని. ఆశ్రమం అలా కావడానికి కారణాన్ని-ఆశ్రమ వృత్తాంతాన్ని
వివరించాడీవిధంగా విశ్వామిత్రుడు: " పూర్వం ఇక్కడ బ్రహ్మ సమానుడైన గౌతమ
మహర్షి వుండేవాడు. గౌతముడు తన భార్య అహల్యతో అనేక సంవత్సరాలిక్కడ వుండి తపస్సు
చేశాడు. ఒకనాడు సమయం కనిపెట్టి, గౌతముడివలె ముని వేషంలో
అహల్యను కలుస్తాడు ఇంద్రుడు. మన్మథుడి ప్రేరణవల్ల విశేష మోహం కలిగి, ఆ సమయం స్త్రీలతో సంభోగించించే ఋతుకాలం కాకపోయినా, అహల్యతో రతి కేళికై కోరిక గలిగి వచ్చానని గౌతముడి వేషంలో వున్న ఇంద్రుడు
అహల్యతో అంటాడు. తన దగ్గరకు వచ్చినవాడు ఇంద్రుడని తెలిసినా, వాడితో రమించడం పాపమని తెలిసినా, ఇంద్రుడంతటివాడు వచ్చి ప్రార్థిస్తుంటే, ఎందుకు కాదనాలని భావించి, దుష్ట బుద్ధితో అతడితో
సంభోగించింది అహల్య. ఆ తర్వాత సంతోషంతో, అయిందేదో అయిందనీ, ఇక ఆయనను కాపాడుకుని, తన్ను కూడా కాపాడమని ఇంద్రుడితో అంటుంది అహల్య. అలాంటి గొప్పవాడితో సంభోగించడం
వల్ల ధన్యురాలనైనానని అంటూ, త్వరగా ఇంద్రుడిని
అక్కడనుండి వెళ్లమనడంతో, భయపడొద్దని చెప్పి
ఇంద్రుడు వెళ్లిపోయేందుకు తయారయ్యాడు. అదే సమయంలో, కుడిచేత్తో దర్భలు-ఎడమ చేత్తో సమిధలు ధరించి, తీర్థ స్నానం చేసి, తడి బట్టలతో-బ్రహ్మ
వర్చస్సుతో-దేవదానవులు సహించలేని తేజంతో ఆశ్రమానికొచ్చిన గౌతముడు ఎదురయ్యాడు
ఇంద్రుడికి. ఆయన్ను చూడగానే, తత్తర
పాటుతో-చేష్టలుడిగి-కాళ్లు చేతులు వణుకుతుంటే, తెల్లబోయిన ముఖంతో, తన ఆకారాన్ని ధరించి
నిలిచిపోయాడు ఇంద్రుడు. గౌతముడికి కోపం తారాస్థాయికి చేరుకుంది".
అహల్యను, ఇంద్రుడిని శపించిన గౌతముడు
"తన రూపాన్ని ధరించి, చేయరాని కార్యాన్ని చేసేందుకు సాహసించిన ఇంద్రుడు భవిష్యత్ లో ఇలాంటి పాడు
పనులు చేయకుండా,
ఆయన వృషణాలు వూడి నేలపై పడాలని శపించాడు గౌతముడు. తక్షణమే, ఇంద్రుడి వృషణాలు వూడి నేల రాలాయి. గౌతముడు ఆ తర్వాత ఇంట్లోకి పోయి భార్య
అహల్యను చూసి,
కోపంతో ఆమెనుకూడా శపించాడు. నీచ నడవడిగలిగినందున, అనేక సంవత్సరాలు గాలినే ఆహారంగా తీసుకుంటూ, కూడు-నీళ్లు లేకుండా, ఆ ప్రదేశంలోనే వుంటూ, బూడిదలో పడి ఎవరికీ కనిపించకుండా, తాపంతో పొర్లాడుతుండమని శపించాడామెను. శాప విముక్తి కూడా గౌతముడే చెప్పాడు.
ఎప్పుడైతే దశరథుడి కుమారుడు రాముడు, ఆశ్రమానికి రావడం
జరుగుతుందో,
ఆ రోజున ఆమే పాపం పోయి పవిత్రురాలవుతుందనంటాడు గౌతముడు.
రాముడిక్కడికి రాగానే, ఆయనను అతిథిగా ఎంచి, అతిథికి చేయాల్సిన పూజలు చేసి, కుబుద్ధీ-లోభం-మోహం
పోయినదానివై,
ఎప్పటి అందమైన ఆకారం ధరించి, సంతోషంగా తన దగ్గరకొస్తావని చెప్పి గౌతముడు ఆశ్రమాన్ని వదిలి హిమవంతానికి
పోయాడు" అని ఆ వృత్తాంతాన్ని వివరించాడు విశ్వామిత్రుడు.
(అహల్య శిలగా మారిందని కొన్ని గ్రంథాలలో చెప్పబడిన విషయం వాస్తవం కాదని
వాల్మీకి రామాయణం స్పష్టం చేసింది. వాల్మీకి మతమే వేరు. దుఃఖానుభవం లేకుండా, రాయిగా పడి వుంటే, పాప ఫలం అనుభవించినట్లెలా
అవుతుంది?
అహల్య స్త్రీగా వుంటూనే, ఆహారం లేకుండా తాపంలో మాడుతుంటుంది. రామచంద్రమూర్తి ఆశ్రమ ప్రవేశం చేయగానే ఆ
తాపం తొలగి లోకానికి కనిపిస్తుంది. అంటే, జారత్వ దోషం పోవాలంటే, అనేక సంవత్సరాలు తపించి, భగవత్ సాక్షాత్కారం చేసుకోవాలి. అలా కాకపోతే వంశ నాశనం అవుతుంది. గౌతముడు
అహల్య స్వరూప నాశనం చేయకుండా, గాలిని ఆహారంగా తీసుకుంటూ, కఠిన వ్రతం ఆచరించమని మాత్రమే అంటాడు. జారత్వమే అభ్యాసంగా వుంటే, ఆ స్త్రీని పతితగా భావించి స్వీకరించ కూడదు-పరిత్యజించాలి.
స్త్రీలు తమ జాతివారితో
వ్యభిచరించినప్పటికీ, గర్భం రాకపోతే పరిత్యజించ
రాదు. అంటే,
గర్భం వచ్చినా-అసవర్ణులతో వ్యభిచరించినా, వదిలి పెట్టాలి. గర్భం ధరించకపోతే, న్యాయ శాస్త్ర ప్రకారం దండించి ప్రాయశ్చిత్తం చేయించాలి. కుక్కలతో కరిపించాలని
కూడా శాస్త్రంలో వుంది).
No comments:
Post a Comment