ద్రుపద పురోహితుడి, సంజయుడి రాయబారాలు-కౌరవ పాండవుల అభిప్రాయాలు
ఆస్వాదన-50
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (12-12-2021)
ద్రుపదుడు పంపిన
పురోహితుడు హస్తినాపురానికి వచ్చి ధృతరాష్ట్రుడిని, కృపాచార్యుడిని, ద్రోణాచార్యుడిని, భీష్ముడిని, విదురుడిని వారి-వారి ఇండ్లకు వెళ్లి కలిసి, ఆతరువాత దుర్యోధనుడి దర్శనం కూడా
చేసుకున్నాడు. తన చాతుర్యంతో ధృతరాష్ట్రుడిని తనకు అనుకూలంగా మలచుకుని, ఒకనాడు,
నిండు కొలువులో సభాసదుల సమక్షంలో అసలు తాను వచ్చిన నేపధ్యాన్ని కొంచెం కటువుగా
ప్రస్తావించాడు. ధృతరాష్ట్రుడు, పాండురాజు అన్నదమ్ములన్న విషయాన్ని, వారి కొడుకులు తమ తల్లిదండ్రుల ఆస్తికి
వారసులన్న విషయాన్ని, పూర్వం చోటు చేసుకున్న వ్యవహారాన్నీ, మోసంతో కౌరవులు భూమిని హరించిన విషయాన్ని, వీటన్నిటికీ ధృతరాష్ట్రుడు పరోక్షంగా
సమ్మతించిన విషయాన్ని పురోహితుడు ప్రస్తావించాడు. సభాసదులు చూస్తుండగా ద్రౌపదీదేవి
వలువలు ఇప్పడాన్ని, సంపదను హరించడాన్ని, పాండవుల అరణ్య-అజ్ఞాతవాసాలు, కౌరవల
ప్రవర్తన మొదలైన అంశాలను పేర్కొని నిష్పాక్షిక బుద్ధితో విచారించి,
ధృతరాష్ట్రుడికి బుద్ధి చెప్పడం మంచిదని సభాసదులకు విజ్ఞప్తి చేశాడు పురోహితుడు.
యుద్ధం జరుగుతే
ప్రజలు నశిస్తారు కాబట్టి పాండవులు కౌరవులతో వైరానికి ఇష్టపడరని, అట్లా అని వాళ్లు
బలహీనులు కాదని, ధర్మాత్ములని, కౌరవ సేన పాండవుల సేనకంటే పెద్దదైనప్పటికీ పరాక్రమంలో పాండవ పక్షం
మిన్న అని, పరమాత్మైన శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన
వున్నందున వారికేదీ అసాధ్యం కాదని,
సమయం మించి పోకముందే పాండవులను పిలిచి వారికి న్యాయం చేయమని చెప్పాడు ద్రుపద
పురోహితుడు. ఆయన చెప్పిన మాటలు బ్రాహ్మణ సహజంగా, వినడానికి కష్టమైనా సభకు నచ్చేదిగా వుందని అన్న భీష్ముడు, పాండవులను బాధించడం న్యాయం కాదని, ధృతరాష్ట్రుడు వారి వాటా వారికివ్వడం సముచితం
అని చెప్పాడు. ద్రుపద పురోహితుడి హితవును భీష్ముడు సమర్థించి, ఆ విధంగా సభానుకూలాన్ని ప్రకటించాడు. అంతే
కాకుండా ధర్మరాజు సహనాన్ని ప్రశంసించాడు. కౌరవ పాండవుల బలాబలాల విషయంలో పురోహితుడి
అభిప్రాయాన్ని సమర్థించాడు. అర్జునుడికే ఆగ్రహం వస్తే ఎంతటి శూరులైనా ఓర్చుకోగలరా
అని అన్నాడు.
భీష్ముడి మాటలకు
కర్ణుడు అభ్యంతరం చెప్పాడు. అధర్మ వాదన చేశాడు. పాండవుల సహాయులు బలవంతంగా వాటా
అడుగుతే భయపడిపోయి దుర్యోధనుడు ఒప్పుకుంటాడా?
అని ప్రశ్నించాడు. ఉత్తర గోగ్రహణంలో మహా పరాక్రమశాలైన అర్జునుడు ఒక్కడే తమల్ని
అందరినీ ఓడించిన సంగతి గుర్తు చేశాడు భీష్ముడు. ధృతరాష్ట్రుడు భీష్మ కర్ణులను వారించాడు.
తాను అందరికీ మేలు కలిగే విధంగా అందరితో ఆలోచించి, భూజనులకు అందరికీ సంతోషం కలిగే విధంగా చేస్తానని అన్నాడు
ధృతరాష్ట్రుడు. ఒక మంచివాడిని తన బిడ్డలైన పాండవుల దగ్గరికి పంపుతానని చెప్పాడు. ధృతరాష్ట్రుడి
మనస్సులో పాండవులతో కూడి వుండే మార్గాన్నే అవలంభిస్తాడని వుందన్న సంగతి
కురువంశీయులకు అందరికీ సుస్పష్టం అని చెప్పాడు.
ఆ తరువాత
పురోహితుడికి ఆభరణాలను, వస్త్రాలను, తాంబూలాన్ని ఇచ్చి సెలవిచ్చి పంపాడు
ధృతరాష్ట్రుడు. అక్కడి నుండి పురోహితుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడి
కొలువులో జరిగినదంతా చెప్పాడు.
ధృతరాష్ట్రుడు
సభాసదులకు చెప్పిన విధంగానే సభలో అందరి మధ్య కూచుండి సంజయుడిని పిలిపించాడు.
పాండవులు వుంటున్న ఉపప్లావ్యానికి వెళ్లమని, వారంతా శ్రీకృష్ణుడితో కలిసి
వున్నప్పుడు తన మాటలుగా కొన్ని విషయాలు చెప్పమని అన్నాడు. వాళ్ల క్షేమ సమాచారాలు
తాను అడిగానని, దుర్యోధనుడి చెడు బుద్ధివల్ల, కార్యాకార్యాలు
తెలియనివాడు కావడం వల్ల అనర్ధాలు జరిగాయని,
వాళ్లు కూడా తండ్రి వాటా అనుభవించాల్సిన వారేనని చెప్పమన్నాడు. కౌరవ పాండవులు పాలు, నీళ్లలా కలిసిపోయి బతకాలని అన్నానని, ధర్మం నడపడానికి ధర్మరాజున్నాడని అన్నానని, పాండవుల భాగం వారికివ్వకుండా వుందామన్నా తన
శక్యం కాదన్నానని చెప్పమన్నాడు. ధర్మరాజును కొలువు తీర్చిన సమయంలో దర్శించుకొమ్మని, పాండవులకు సంతోషం కలిగేలా మాట్లాడమని చెప్పాడు
ధృతరాష్ట్రుడు సంజయుడికి.
ఉపప్లావ్యపురం
చేరిన సంజయుడు మొదలు శ్రీకృష్ణార్జునుల దర్శనం చేసుకున్నాడు. మర్నాడు ధర్మరాజు
కొలువు తీర్చినప్పుడు అతడిని దర్శించాడు. ద్రౌపదీదేవితో సహా పాండవులంతా కులాసాగా
వున్న విషయం తెలుసుకుని సంతోషంతో ధృతరాష్ట్రుడు తనను పంపాడని చెప్పాడు సంజయుడు.
ధర్మరాజు ఆ మాటలకు సంతోషించాడు. ధృతరాష్ట్ర, దుర్యోధనాదుల
క్షేమం అడిగాడు. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామల క్షేమం అడిగాడు. తన తమ్ముల
బలపరాక్రమాలు తలుస్తున్నారా అని అడిగాడు. ఘోషయాత్ర వృత్తాంతం గుర్తుందా అన్నాడు.
కర్ణుడు పెత్తనం బాగా సాగుతున్నాదా అని ప్రశ్నించాడు. జవాబుగా సంజయుడు, దుర్యోధనుడి దగ్గర వున్న ఎన్నోరకాల వారి
ప్రస్తావన అనవసరమని తన మనవి శ్రద్ధగా ఆలకించమని కోరాడు ధర్మరాజును. తాను వచ్చిన
అసలు విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ విధంగా చెప్పాడు. ధృతరాష్ట్రుడు చెప్పమన్న మాటలు
కూడా ఆయన మాటల్లోనే చెప్పాడు.
‘ధృతరాష్ట్రుడికి
ఒకప్పుడు లేకపోయినా తరువాత జరిగినదానికి మనస్తాపం కలిగి ఇప్పుడు శాంతుడయ్యాడు.
లోగడ సంధి చేసుకోవాలని లేకపోయినా ఇక ముందు
కలుగుతుంది. మీ సద్వంశంలో దుర్యోధనుడి మూలాన మచ్చ ఏర్పడింది. దానిని
పోగొట్టడానికి నువ్వే సమర్థుడివి. జయాపజయాలు లాభదాయకమైనా ఆ పనికి సజ్జనులు
పూనుకుంటారా? యుద్ధంలో అంతా చనిపోతే ఏం ప్రయోజనం? శ్రీకృష్ణుడు మీకు పెట్టని కోట. భీమార్జున, సాత్యకి,
ద్రుపదుడు అంతా మహావీరులే. కౌరవల పక్షాన ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, అశ్వత్థామ, కర్ణుడు,
శల్యుడు, దుర్యోధనుడు ఆయన తమ్ములు పరాక్రమవంతులు.
ఇలాంటి మీరు ఒకరితో మరొకరు పోరాడడం వల్ల మేలు కలగదు’.
ఇలా
చెప్పిన సంజయుడు ఇంకా ఇలా అన్నాడు.
ఉ: మ్రొక్కెద వాసుదేవునకు, మోడ్చెదఁ జేతులు సవ్యసాచికిం,
దక్కటి మిత్త్ర బాంధవ హిత ప్రియమంత్రి వయస్య
కోటికిన్
స్రుక్కుచు విన్నవించెద నసూయలు దక్కి యనుజ్ఞ
సేయుఁడీ
యిక్కరుణాకరున్ శరణ మే నిదె వేఁడెదఁ
గ్రోధశాంతికిన్
‘కృష్ణుడికి మొక్కుతాను. అర్జునుడికి చేతులు
జోడిస్తాను. తక్కిన స్నేహితుల, బంధువుల, హితుల,
ప్రియుల, మంత్రుల,
వయస్యుల సమూహానికి సవినయంగా మనవి చేస్తాను. కోపాలు మాని అనుమతించండి. ఈ దయాళుడైన
ధర్మరాజు కోపోశమనానికై నేను ఇదే శరణు వేడుతాను’ అని అన్నాడు సంజయుడు.
(ఈ
సందర్భాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు ఇలా రాశారు:
‘సంజయ రాయబారపు ఘట్టంలో పతాకస్థానమైన పద్యమిది. నాటకీయమైన సన్నివేశం. భక్తిభావ
ప్రవృత్తితో సంజయుడు ధర్మరాజుకు ప్రణామం చేస్తూ పలికిన మాటలివి. ధర్మరాజును
కరుణాకరుడని ప్రశంసించాడు. సంజయుడు కోరింది క్రోధశాంతి. అంటే, ధర్మరాజు క్రోధమూర్తి అయి వున్నాడనీ, ఆ
క్రోధాన్ని శాశ్వతంగా చంపుకొని శాంతమూర్తి కావాలనీ కోరుకున్నాడు. ధర్మరాజును
అనుమతించాల్సిన వారిలో అగ్రగణ్యుడు శ్రీకృష్ణుడు. అందుకే ముందుగా ఆయనకు మొక్కులు
చెల్లించాడు. నారాయణుడి తరువాత నరుడు. అతడికీ చేతులు జోడించాడు. మిగిలిన వారందరికీ
వినయంగా విన్నవించుకున్నాడు’).
ఇలా
అన్న సంజయుడితో ధర్మరాజు, తమకు మాత్రం యుద్ధం లేకుండా జీవించడం
తగిన పని కాదా? అని ప్రశ్నించాడు. యుద్ధం లేకుండా ప్రయోజనం
నెరవేరితే మంచిదేగా అన్నాడు. ఒకమాట చెప్తా,
నిష్పక్షపాతబుద్ధితో వినమన్నాడు. ‘అయ్యో! ధృతరాష్ట్రుడు అప్పుడు కుటిలుడై
నీతిమార్గం విడిచిపెట్టాడు! మమ్ముల్నేమో సన్మార్గంలో ప్రయత్నించి నడవండి అంటూ
బుద్ధులు చెప్తున్నాడు. ఇదేం న్యాయం’
అని ప్రశ్నించాడు. సంజయుడిని లేనిపోని ఆశలు పెట్టుకుని తమను అనవసరంగా
బాధపెట్టవద్దని, ధృతరాష్ట్రుడి ప్రవర్తన కొత్తా అని చెప్పాడు ధర్మరాజు. సంజయుడు
ఒకవైపు పాండవుల పరాక్రమాన్ని పొగిడి,
మరోవైపు కౌరవులను యుద్ధంలో గెలవడం అసాధ్యమని స్ఫురించేలా మాట్లాడాడని అది తాను
అంగీకరించనని స్పష్టం చేశాడు ధర్మరాజు. పక్షపాత బుద్ధి విడిచిపెట్టమని కూడా
చెప్పాడు. భీమార్జున నకుల సహదేవుల పరాక్రమాన్ని వివరించాడు. ధృతరాష్ట్రుడికి తమ
మీద ప్రేమ వుంటే, తమని పిలిపించి, భాగం ఇవ్వమని కొడుకులకు చెప్పి,
అలా ఇచ్చి పంపడం మంచిది కదా? అన్నాడు.
సంజయ, ధర్మరాజుల మధ్య జరుగుతున్న మాటల్లో తమకు
శ్రీకృష్ణుడి మాట అనతిక్రమణేయం అని అంటాడు ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణుడు కలగ
చేసుకుని, సంజయుడితో, తానెప్పుడూ హృదయంలో పాండవుల మేలు ఆకాంక్షిస్తూ వుంటానని, ధర్మరాజు మాటలతీరు చూస్తుంటే సంధి కుదరని వైనం
స్ఫురిస్తున్నదని అన్నాడు. ధర్మరాజు అభిప్రాయం సరైనదే అని కూడా చెప్పాడు. ఎలా
చూసినా దుర్యోధనుడు మహాగర్వి అనీ, ధృతరాష్ట్రుడి హృదయం అందరికీ
తెలిసిందే అని అన్నాడు. కౌరవ పాండవులకు ఏవిధంగా చూసినా యుద్ధమే మంచిదని స్పష్టం
చేశాడు. నిండు సభలో ద్రౌపదీదేవికి జరిగిన అవమానాన్ని సంజయుడికి గుర్తుచేశాడు
కృష్ణుడు. అప్పుడు సభలో వున్న పెద్దల మౌనాన్ని కూడా గుర్తు చేశాడు. దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునిల ప్రవర్తననూ గుర్తుచేశాడు. సంజయుడు యుద్ధాన్ని ఆపడానికి ఎంత
తెలివిగా మాట్లాడినప్పటికీ, కృష్ణుడు, జరిగిన అన్యాయాలన్నీ ఏకరువుపెట్టి, ఈ సంధి
కార్యం జరగడం మిక్కిలి కష్టమని, దీనిని కుదర్చడం అసాధ్యం అని తాను
భావిస్తున్నానని స్పష్టం చేశాడు శ్రీకృష్ణుడు.
‘దుర్యోధనుడు
క్రోధరూప మహావృక్షం. కర్ణుడు దాని పెద్ద బోదె. శకుని పూలకొమ్మ. దుశ్శాసనుడు పుష్ప
ఫలాలు. తండ్రి అయున ధృతరాష్ట్రుడు దాని మూల బలం. ఇక, ధర్మరాజు ధర్మమనే చెట్టు. అర్జునుడు దాని పెద్ద బోదె. భీముడు దాని
కొమ్మ. నకులసహదేవులు పూలూ, పండ్లు. నేనూ, బ్రాహ్మణులు, వేదాలు దాని వేళ్ళ సమూహం’ అని అన్నాడు శ్రీకృష్ణుడు. తాను కౌరవపాండవ
సంధి కార్యానికై హస్తినకు వస్తానని,
ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటాడో, లేదో?
చూసి దాన్ని బట్టి ప్రవర్తిస్తాం అని,
రాజుకు తమ అభిప్రాయం అంతా చెప్పమని అన్నాడు శ్రీకృష్ణుడు సంజయుడితో.
తాను వచ్చిన పని
నెరవేరినట్లే అని అంటూ సంజయుడు ధర్మరాజాదుల దగ్గర సెలవు తీసుకుని హస్తినాపురానికి
వెళ్లాడు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, ఉద్యోగపర్వం, ప్రథమాశ్వాసం
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment