(సూర్య దినపత్రికలో ఆగస్ట్ 2009 లో ప్రచురించబడింది)
మన్యం వ్యాధులతో అల్లాడుతోందని, విష జ్వరాలతో గిరిజనులు పోరాటం చేస్తున్నారని, అయినా అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదనీ వార్తలొస్తున్నాయి. ఆదివాసీ ప్రాంతాలలో సంభవిస్తున్న మరణాలు, సోకుతున్న వ్యాధులపై ప్రభుత్వానికి శ్రద్ధ లేకుండా పోయిందనీ, మౌలిక వసతుల కొరతకు తోడుగా వైద్య సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో అందుబాటులో లేరనీ శాసనసభలో విపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి.
‘అందరికీ వైద్యం’ అన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నినాదం కాగితాకే పరిమితం కావాలా? గిరిజన ప్రాంతాల్లో (అలోపతి) వైద్య సేవలకు కేటాయించిన నిధులను ఖర్చు చేయడానికి వేరే ప్రత్యామ్నాయ మార్గాలే లేవా? ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యులు, ఇతర సిబ్బంది పనిచేసేందుకు సిద్ధంగా లేకపోతే ‘సాంప్రదాయిక ప్రత్యామ్నాయ వైద్యుల’ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోకూడదా? వారి సేవలను ఉపయోగించుకోకూడదా? గ్రామీణ ప్రాంతాల్లోకే పూర్తిగా చేరని ప్రాథమిక వైద్యం మారుమూలున్న షెడ్యూల్డు ప్రాంతాలకు అందుబాటులోకి రావడానికి గణనీయమైన సమయం పడుతుందన్నది వాస్తవం.
రాష్ట్రంలో గ్రామీణ ప్రజలందరికీ ఇంతకు ముందు లేని విధంగా 104 ద్వారా సంపూర్ణ వైద్య సేవలనందించే ప్రక్రియ ఫలితాలనిస్తున్నప్పటికీ, మారుమూల గిరిజన ప్రాంతాలకు, రహదారి సౌకర్యాలు, కమ్యూనికేషన్‌సౌకర్యాలు కరవైన ప్రదేశాలకు ఇవి ఉపయోగంలోకి రావడానికి ఎంతో కాలం పట్టవచ్చు. కానీ అంతవరకూ వైద్య అవసరాలు ఆగవు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సమగ్ర గిరిజనాభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి (డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి) పదే పదే చెప్తున్నారు. అందులో నిజా నిజాలు ఎలా ఉన్నా, గిరిజన ప్రాంతాల్లో తగు రీతిలో వైద్య, ఆరోగ్య సౌకర్యాలను సమకూర్చనంత వరకు అభివృద్ది అన్న పదానికి అర్థమే లేదు.
సరైన వైద్య- ఆరోగ్య సేవల కల్పనతో అభివృద్ధి సాధ్యమన్న విషయం అందరికీ, అన్ని ప్రాంతాల వారికీ వర్తించేదయినా, మారుమూల గిరిజన ఆదివాసీల విషయంలో ఇది ప్రత్యేకత సంతరించుకుందని అనాలి. తరతరాలుగా, యుగయుగాలుగా సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక దోపిడీకి గురవుతూ వస్తున్న అమాయిక గిరిజనులకు ఆధునిక ఆలోపతి వైద్య- ఆరోగ్య సౌకర్యాలను కలిగించలేకపోయినా, కనీసం వారు అనాదిగా ఆధారపడుతున్న, నమ్ముతున్న మూలికా సంబంధమైన వైద్య సౌకర్యాలనన్నా శాస్ర్తీయ దృక్పథంతో అందుబాటులోకి తెస్తే మంచిదేమో!
పన్నెండు సంవత్సరాల క్రితం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ, అటవీ సంస్థలలో పని చేస్తున్న ఉన్నత స్థాయి ఉద్యోగులకు ‘షెడ్యూలు ప్రాంతాల అభివృద్ధి’ అన్న అంశంపై నిర్వహించిన ఓ సదస్సులో స్వర్గీయ భండారు పర్వతాల రావు గిరిజన ప్రాంతాలలో ‘ఆయుర్వేద - ఔషధ మొక్కల వైద్యం’ అభివృద్ధి అనే అంశంపై తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఆ విషయాలకు అప్పట్లో ప్రాచుర్యం లభించకపోయినా, నేటికీ అవన్నీ అక్షర సత్యాలు.
పర్వతాల రావు స్వర్గస్థులై దాదాపు మూడు సంవత్సరాలవుతోంది. 1978-84 మధ్య కాలంలో అయిదుగురు ముఖ్యమంత్రుల దగ్గర ప్రజా సంబంధాల అధికారిగా పనిచేసారాయన. 2006లో ఆగస్టు నెలలో తన 75వ ఏట పుట్టపర్తిలో మరణించారు.అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న పట్టణ-పట్టణ పరిసర గ్రామీణ ప్రాంతాలలోనే సరైన ఆరోగ్య వైద్య సేవలు లభించడం లేదు. ఇప్పటికీ, జాతీయ ఆరోగ్య మిషన్ పుణ్యమా అని క్రింది స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఆసుపత్రుల ఆధునీకరణ జరిగే ప్రణాళికకు రూపకల్పన జరిగినా, ఆచరణలో సాధ్యపడలేదు.
మన రాష్ట్రంలో కూడా ఈ విషయంలో పెద్దగా ముందుకు పోలేదనే అనాలి. అందుకే ప్రత్యామ్నాయంగా 104 సేవలు అమల్లోకి వచ్చాయి సంస్కరణల దిశగా. ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలలో కనీస వసతులు లేకపోవడమూ, ఉన్న వసతులను ఉపయోగించుకోకపోవడమూ, వైద్యులు అందుబాటులో లేకపోవడమూ, ఉన్న కొద్ది మందికి ఆధునిక వైద్య పద్ధతుల్లో అవగాహన లేకపోవడమో, వారి నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం శ్రద్ధ కనపరచకపోవడమో జరుగుతోంది ఇప్పటికీ. ఈ పరిస్థితిలో ఇప్పట్లో మార్పు ఉండకపోవచ్చు.
ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాలలో ఆధునిక వైద్య సౌకర్యాల కల్పన సమీప భవిష్యత్తులో జరగకపోవచ్చు. కొంచెం కష్ట సాధ్యం కూడా కావచ్చు. మారుమూల, జనావాసాలకు అందుబాటులో లేని ప్రదేశాలకు మౌలిక సదుపాయాల కల్పన నుంచి, క్రమం తప్పకుండా మందుల సరఫరా వరకు వైద్యులను రప్పించడంతో సహా అన్నీ ఇబ్బందులే. ప్రభుత్వాన్ని ఈ విషయంలో తప్పు పట్టినా ఫలితం లేదు. గిరిజన ప్రాంతాల్లో పనిచేయాలన్న మానసిక-సేవా దృక్పథం ఉన్నవారు లభ్యమవడం కూడా కష్టమే. ఆ మాటకొస్తే గిరిజన తెగలకు, షెడ్యూల్డు ప్రాంతాలకు చెందిన కొందరు వైద్య విద్యనభ్యసించి కూడా ఆ ప్రాంతాలలో పని చేయడానికి నిరాసక్తత కనబరుస్తున్నారు.
ఇది మానవ నైజం. ఇవన్నీ అధిగమించి పరిష్కారం కనుగొనాలంటే ఏకైక మార్గం, ప్రత్యామ్నాయంగా గిరిజన తెగల వారు వంశపారంపర్యంగా నమ్మకం పెట్టకున్న మూలికా వైద్య విధానాన్ని సశాస్ర్తీయంగా వారికందించడమే. ఇదేమంత కష్టసాధ్యమైంది కాదు.‘అందరికీ ఆరోగ్యం’ అన్న నినాద రూపకల్పన చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ‘ఆల్మా అటా’ అసెంబ్లీ ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకునే తమ నినాదాన్ని- విధానాన్ని ప్రకటించింది ఏనాడో.
వారు రూపొందించిన ప్రపంచవ్యాప్త కార్యాచరణ పథకంలో భాగంగా సాంప్రదాయిక ఆయుర్వేద, మూలికా వైద్య విధానాన్ని కూడా చేర్చింది. ఆ మాటకొస్తే 1982లో నాటి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ ఆరోగ్య విధానం కూడా సరైన రీతిలో వివిధ రకాల ఆధునిక, సాంప్రదాయిక వైద్య విధానాలను సమన్వయం చేయాలని నిర్దేశించింది. అందుకే కనీసం, గిరిజన ప్రాంతాలలలోనన్నా ఆయుర్వేద, మూలికా పరమైన రోగ చికిత్సా విధానాన్ని ఆలోపతి విధానాలతో సశాస్ర్తీయంగా సమన్వయం చేయడమో, విడిగా ఆధునీకరించి అమలు పర్చడమో జరగాలి. మన్యం మరణాలకు ఆ విధంగానన్నా కొంత పరిష్కారం కనుక్కోవాలి.
గిరిజనుల్లో చాలా మంది ఇప్పటికీ-ఎప్పటికీ మూలికా వైద్యం పైనే ఆధారపడతారు. ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు అందుబాటులో ఉన్నప్పటికీ ఆసుపత్రులకి పోకుండా వారు నమ్ముతున్న ‘వైద్యుడి’ దగ్గరకే పోతారు. వంశపారంపర్యంగా, మూలికా వైద్య విధానం ద్వారా ఎన్నో రోగాలకు చికిత్సను విజయవంతంగా చేస్తున్న ‘వెజ్జులు’ గా పిలిచే ఈ వైద్యులు గిరిజనుల పాలిట దేవుళ్ళుగా ఆ ప్రాంతాల్లో చాలా మంది భావిస్తారు. తమకు తెలిసిన వైద్య చిట్కాలను అతి రహస్యంగా, అత్యంత గోప్యంగా ఉంచుతారు వెజ్జులు.
తమ గురువు అనుమతి లేకుండా ఇతరులకు ఈ రహస్యాన్ని తెలియచేస్తే ఆ వైద్యం పని చేయదని ప్రచారం చేస్తారు వీళ్ళు. నాగరికత పెరుగుతుండడంతో, విచక్షణా జ్ఞానంలేని కొందరు స్వార్ధపరులు అక్రమ మార్గంలో మూలికా చికిత్సా విధానాన్ని వాడుకుంటారేమోనన్న భయం కూడా వారికుంది. ఇటీవలి కాలంలో ఆధునిక అలోపతి వైద్య విధానానికి అదనంగానో, అనుబంధంగానో అభివృద్ధి చెందిన కొన్ని దేశాలే మూలికా వైద్య విధానాన్ని సమన్వయం చేస్తున్నప్పుడు ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న, అందునా ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో అమలు లో ఉన్న ఈ విధానాన్ని పునరుద్ధరించి గిరిజన ప్రాంతాల్లో కూడా అందరికీ వైద్యం అమలును సాధ్యం ఎందుకు చేయకూడదు?
అయాం ఎ బిగ్ జీరో (45) - భండారు శ్రీనివాసరావు
2 hours ago
No comments:
Post a Comment