Sunday, December 27, 2009

అమెరికా ఎన్నికల్లోనూ అదే తంతు

Please Click this link for an article on New York Mayor Election:

http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2009/nov/8edit2

Full Text:

న్యూయార్క్ మేయర్ ఎన్నికలు-2009

ఏ దేశంలో ఎన్నికలు జరిగినా షరా మామూలే

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నవంబర్ 23న జరుగ నున్నాయి. ఎత్తులు-పైఎత్తులు, పొత్తుల గురించి ఆలోచనలు-ప్రయత్నాలు, అవి విఫలమవడం అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటివి కేవలం మన హైదరాబాద్ కో, ఆంధ్రప్రదేశ్ కో, భారత దేశానికి మాత్రమే పరిమితం అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకోటి లేదు. పార్టీలు మారడం, ధనం విచ్చలవిడిగా ఖర్చుచేయడం, భయంతోనో-భక్తితోనో ప్రత్యర్థి వర్గానికి చెందిన వాడిని ఓడించే ప్రయత్నం చేయకుండా-గెలుపుకు పరోక్షంగా తోడ్పడడం, ఎన్నికల అక్రమాలకు పాల్పడడం, దాదాపు అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో ఇంచుమించు కొద్ది తేడాతో జరుగుతూనే వుంటాయనడానికి ఇటీవల నవంబర్ 3న అమెరికాలో జరిగిన న్యూయార్క్ మేయర్ ఎన్నికలే నిదర్శనం.

నవంబర్ 3న జరిగిన న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా, మాజీ రిపబ్లికన్-మాజీ డెమోక్రాటిక్ నాయకుడు, మైఖేల్ బ్లూంబర్గ్ తన ప్రత్యర్థి, డెమోక్రాటిక్ అభ్యర్థి విలియం సీ థామ్సన్ ను ఓడించి ముచ్చటగా మూడోసారి మేయర్ గా ఎన్నికయ్యారు. బ్లూంబర్గ్ 1960-2001 మధ్య కాలంలో డెమోక్రాటిక్ పార్టీలోనూ, 2001-2007 మధ్య కాలంలో రిపబ్లికన్ పార్టీలోనూ వుండే వాడు. 2008 లో రిపబ్లికన్ పార్టీకి రాజీనామా ఇచ్చి, ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా-రిపబ్లికన్ పార్టీ విధానాలకు అనుకూలమైన పంథాలో పోటీలో దిగి 50% పైగా ఓట్లను సంపాదించి ఎన్నికయ్యారు. పోలైన ఓట్లలో ఆయనకు 5,57,059 , థామ్సన్ కు 5,06,717 (46%) ఓట్లు వచ్చాయి.

2001 లో బ్లూంబర్గ్ రిపబ్లికన్ అభ్యర్థిగా గెల్చి నగర 108 వ మేయరయ్యాడు. 2005 లో మరోసారి రిపబ్లికన్ అభ్యర్థిగానే పోటీచేసి మరింత మెజారిటీతో గెలిచాడు. జూన్ 2007 లో అభిప్రాయాల భేదాలవల్ల రిపబ్లికన్ పార్టీని వదిలి, నాటి నుండి ఏ పార్టీకి చెందని స్వతంత్రుడుగా వ్యవహరిస్తున్నాడు. వంద సంవత్సరాల క్రితం-అంటే 1897 నుండి జరుగుతున్న న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఇంతవరకు మూడోసారి గెలిచినవారు, బ్లూంబర్గ్ తో కలిపి కేవలం ముగ్గురు మాత్రమే. ఇంతవరకు 31 సార్లు జరిగిన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో 19 సార్లు డెమొక్రాట్లు, 8 సార్లు రిపబ్లికన్లు, 4 సార్లు ఏ పార్టీకి చెందని ఇతరులు-రేండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ మద్దతుతోనో-ఆపార్టీ పంథా అనే నెపంతోనో గెలిచారు. రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల్లో దేనికి చెందని అభ్యర్థి కాకుండా ఇంతకుముందు ఒకే ఒక్కసారి 1969లో జాన్ లిండ్సే గెలిచారు. మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత బ్లూంబర్గ్ గెలిచాడు.

బ్లూంబర్గ్ ఎన్నికల్లో పోటీకి దిగినప్పటినుండీ, పతాక శీర్షికలతో, ఆయనపైనా-ఆయన ప్రచార సరళిపైనా-ఆయన విచ్చలవిడిగా చేస్తున్న ఎన్నికల ఖర్చుపైనా రకరకాల కథనాలొచ్చాయి. అసలు ఆయన మూడో పర్యాయం పోటీకి దిగడానికి నిబంధనలు ఒప్పుకోవు. న్యూయార్క్ సిటీ కౌన్సిల్ అక్టోబర్ 23న సమావేశమై, కొద్దిపాటి మెజారిటీతో, రెండు సార్లే ఎన్నిక కావచ్చన్న నిబంధనకు సవరణ తెచ్చి, బ్లూంబర్గ్ పోటీచేసేందుకు మార్గం సుగమం చేసింది.

అమెరికా ఎన్నికల చరిత్రలో ఇంతవరకూ ఏ అభ్యర్థీ పెట్టనంత ఖర్చు బ్లూంబర్గ్ అప్పటికే పెట్టాడని ఎన్నికలకు పది రోజుల ముందు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. అప్పటికే ఆయన 850 లక్షల డాలర్లు, అంటే, సుమారు 475 కోట్ల రూపాయలు వ్యయం చేశాడు. ఎన్నికలయ్యే నాటి కది 100 మిలియన్ల డాలర్లు దాటింది. ఆ లెక్కన ఆయన పోటీచేసిన మూడు ఎన్నికల వ్యయాన్ని పరిగన లోకి తీసుకుంటే, బహుశా, దానికి మూడురెట్లు-వెయ్యికోట్ల రూపాయలకు పైగా ఖర్చుచేశాడని అనుకోవాలి. వార్నర్ బ్రదర్స్ హారీ పాటర్ సినిమా నిర్మాణానికి పెట్టిన ఖర్చుతో ఇది సమానమన్న మాట. ఆయన పెట్తున్న ఖర్చును లోగడ ఎక్కువ మొత్తంలో పెట్టిన ఇతరుల ఖర్చుతో పోల్చి చూస్తే అంచనాలకు మించిపోయింది. ఆయన ఆస్తి సుమారు 16 బిలియన్ల డాలర్లుంటుందని అంచనా. మనదేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొంతమంది వెల్లడించిన ఆస్తుల వివరాలను చదివి మనం ముక్కున వేలేసుకున్నాం గాని, అంతకంటే ఎన్నోరెట్లు సంపాదన వున్నవారు-ఖర్చుచేసినవారు అమెరికాలో అనేకమందున్నారు. అది ఏదేశమైనా, ఎన్నికలంటే డబ్బున్న వారికే ననీ-ఖర్చు చేయగలిగే వారికే ననీ వేరే చెప్పక్కరలేదు.

బ్లూంబర్గ్ కు వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకుంటే, ఒక్కో ఓటుకు ఆయన సుమారు 200 డాలర్లు-దాదాపు పదివేల రూపాయలు ఖర్చుచేశాడనుకోవాలి. మనమే నయమేమో. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం బలమైన తన ప్రత్యర్థి విలియం సీ థామ్సన్-బిల్లీ కంటే కనీసం 10-15 రెట్లన్నా బ్లూంబర్గ్ ఖర్చుచేశాడు. ప్రకటనలకు, మద్దతు దార్ల వసతికి, టెలివిజన్ షోలకు, తినుబండారాలకు, రవాణాకు, మౌలిక సదుపాయాలకు ఆయన చేసిన ఖర్చును గమనించిన ఆయన మద్దతు దారులు, రెండు సార్లు ఎన్నికై-ఎన్నో మంచి పనులు చేసిన ఆయన పాపులారిటీ చాలు ఆయన గెలవడానికి అంటున్నారు. ఆయనకున్న నిధులకు అదనంగా ఆయన మద్దతుదార్లుకూడా ఎన్నికలకొరకు కొంత డబ్బు వసూలు చేశారు ఆయనకొరకు.

ఎన్నికల ఖర్చుకంటే ఆయన అడుగడుగునా గెలిచేందుకు పన్నిన వ్యూహం గురించి కూడా ఎన్నో కథనాలు వెలుగులోకొచ్చాయి. అమెరికా అద్యక్ష కార్యాలయానికి కొన్నివారాలకింద బ్లూంబర్గ్ మద్దతు దార్లనుండి ఒబామాకు ఫోన్ వచ్చిందట. మర్యాదగానే చేసినా-గట్టిగా చేసిన సూచన ప్రకారం, ఒబామా మేయర్ ఎన్నికల్లో ఆయన పార్టీకి చెందిన థామ్సన్ పక్షాన ప్రచారానికి రావద్దని దాని సారాంశం. ఎలాగైనా బ్లూంబర్గ్ గెలుపు ఖాయమని, అందుకే ఓడిపోయే డెమోక్రాటిక్ అభ్యర్థికి, అద్యక్షుడంతటి వాడొచ్చి ప్రచారం చేయడం అంత మంచిదికాదని ఆయనకు సలహా ఇచ్చారు. వాస్తవానికి, ఒబామా కనుక గవర్నర్ కార్జిన్ తో కలిసి ప్రచారానికొస్తే, ప్రత్యర్థి అవకాశాలు మెరుగుపడతాయని భావించిన బ్లూంబర్గ్ తన మద్దతు దార్లతో వైట్ హౌజ్ కు ఫోన్ చేయించాడు. అద్యక్షుడి సలహాదారు వాలెరీ జారెట్ కు, బ్లూంబర్గ్ పక్షాన జాఫ్రీ కెనడా ఫోన్ చేసి ఒబామా రాకుండా చేయాలని అభ్యర్థించాడు. అధ్యక్షుడికి ఆమే చాలా దగ్గరనీ-ఆయనకు ఆమె ఒక "చెవి" లాంటిదనీ అంటారు. 2008 లో అమెరికా అద్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో, న్యూయార్క్ మేయర్ గా వున్న బ్లూంబర్గ్, తటస్థంగా వుండి ఒబామాకు వ్యతిరేకంగా ప్రచారం చేయలేదన్న విషయాన్ని ప్రస్తావించాడు జాఫ్రీ కెనడా. తనకు వ్యతిరేకంగా పనిచేయని బ్లూంబర్గ్ కు వ్యతిరేకంగా, డెమోక్రాటిక్ అభ్యర్థి పక్షాన ఎందుకు ప్రచారం చేయాలని అంటూ, తటస్థంగా వుండమని గట్టిగా చెప్పటం జరిగింది. అద్యక్ష కార్యాలయం ఒప్పుకోవడం జరిగింది. పర్యవసానంగా ఒబామా థామ్సన్ కు మద్దతుగా, తన పార్టీ వాడే అయినప్పటికీ ప్రచారం చేయలేదు. ఇలాంటివి అమెరికాలో కూడా జరగడం ఆశ్చర్యకరమైన విషయమే.

కేవలం విచ్చలవిడిగా ఖర్చుచేయడమే కాకుండా ప్రత్యర్థిని ఓడించేందుకు అందుబాటులో వున్న అన్ని అవకాశాలనూ ఉపయోగించుకున్నాడు బ్లూంబర్గ్. ఎన్నికల్లో పోటీకి దిగుదామని అనుకున్న మరుక్షణం నుంచే వ్యూహం పన్నడం మొదలెట్టాడు. ముగ్గురు సభ్యుల సలహా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మొదట. ఆ ముగ్గురు తనతో పనిచేస్తున్నవారే. తనమీద పోటీకి దిగవచ్చనుకున్న బలమైన ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపమని ఆయన రాజకీయ గురు విచ్చిన సలహాను అమలుపర్చాడు. మీడియాతో సత్సంబంధాలు నెలకొల్పుకుని ప్రత్యర్థులను సమాచార పరంగా ఎదురుదెబ్బ తీయడానికి హిల్లరీ క్లింటన్ కు కమ్యూనికేషన్ డైరెక్టర్ గా పనిచేసిన వ్యక్తిని నియమించాడు. అమోఘమైన తెలివితేటలున్న వ్యక్తికి ప్రచార సారధ్యం అప్పగించాడు. "పావెల్ డాక్ట్రిన్" అనే వ్యూహం అనుసరించి, బ్లూంబర్గ్ పై పోటీకి దిగడానికే భయపడే రీతిలో ఎంతో ముందుగా ప్రచారం మొదలెట్టాడు. చివరకు ఆయనపై పోటీకి దిగడానికి చాలామంది భయపడే స్తితికి పరిస్తితులొచ్చాయి. ఆయన అంగబలం, అర్థ బలం, వ్యూహం, కుతంత్రాలు అన్నీ అక్కరకొచ్చాయి. ఆయనపై పోటీకి డెమోక్రాటిక్ అభ్యర్థిగా ఆఖరుకు రంగంలో దిగిన విలియం థామ్సన్ ఓటమి పాలు కాక తప్పలేదు.

No comments:

Post a Comment