(ప్రజాతంతంత్ర దిన-వార పత్రికలలో ఐదేళ్ల క్రితం, సూర్య దిన పత్రికలో 2009-2010 బడ్జెట్ ను అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య శాసనసభకు సమర్పించినప్పుడు మార్చ్ 2009 లో ప్రచురించబడింది)
వాస్తవ పరిస్థితులకు, బడ్జెట్‌అంచనాలకు, ఏడాది చివర్లో జరిగిన వ్యయానికి పొంతన అనేది ఉంటున్నదా అంటే దానికి సరైన జవాబు ఎప్పుడూ దొరకదు. అయినా ఏటా ప్రభుత్వం బడ్జెట్‌ప్రవేశపెడు తూ ఉంటుంది. ప్రతిపక్షాల విమర్శ, స్వపక్షాల పొగడ్త ఎప్పుడూ పరిపాటే.
ఆర్థిక మాంద్యం నేపథ్యంలో, రాష్ట్ర ఆదాయ వనరులు తగ్గిపోయిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులపై ప్రపంచ ఆర్థిక మాంద్యం తీవ్ర ప్రభావం చూపిస్తున్నప్పటికీ ఆర్థికమంత్రి సాహసోపేతంగా మరోసారి లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రతిపాదించడం, శాసన సభ ఆమోదించడం జరిగిపోయింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి నేటివరకూ సుమారు 55 సంవత్సరాల కాలంగా పలువురు ఆర్థిక మంత్రులు తమ బడ్జెట్‌ప్రసంగం ద్వారా ఏటేటా ఆర్థిక మంత్ర పఠనం చేస్తూ వస్తున్నారు.
నాటి ముఖ్యమంత్రి (1955-56)- ఆర్థిక మంత్రి- బెజవాడ గోపాల రెడ్డి ప్రసంగం నుంచి రోశ య్య ప్రసంగం వరకూ ఆసక్తికరంగా పరిశీలించుకుం టూ పోతే, ఆర్థ శాస్త్రంలో, సామాజిక-రాజకీయ శాస్త్రాలలో డాక్టరేట్‌పొందే అంశాలు ఎన్నో కనుగొనవచ్చు. అసలీ బడ్జెట్‌అంటే ఏమిటనికానీ, దాని ప్రాముఖ్యం ఏమిటనీ కానీ గమనిస్తే ఆసక్తికరమైన పలు విషయాలను తెలుసుకోవచ్చు. బడ్జెట్ అనేది కేవలం ఆర్థిక శాఖకు మా త్రమే సంబంధించినదనీ, ఇతరులకు దానిని గురించిన వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదనీ చాలా మందిలో అపోహ ఉంది.
బ్రిటన్ ఆర్థికమంత్రిని ‘ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్ చెక్కర్’ అని పిలుస్తారు. ఆయన ప్రతి సంవత్సరం, రాబోయే ఆర్థిక సంవత్సరపు ఆర్థిక అవసరాలు, ఆదాయ వనరుల వివరాలు తెలియచేసే కాగితాలను చిన్న తోలు సంచీలో ఉంచుకొని, పార్లమెంట్‌కు వెళ్లే ఆచారం ఆనాదిగా కొనసాగుతోంది. ఇందుకు కారణం ఫ్రెంచ్‌భాషలో బడ్జెట్‌అంటే ‘చిన్న సంచీ’ అనే అర్థమని అంటారు కొందరు.
మనది బ్రిటిష్‌వారసత్వం. అదే పార్లమెంటరీ సంప్ర దాయం. వాస్తవానికి బ్రిటిష్‌కాలం నాటికీ, నేటికీ బడ్జెట్ స్వరూప స్వభావాలు విప్లవాత్మకంగా మారే దాఖలాలు అంతగా లేవని ఆర్థిక నిపుణులు అంటుంటారు. చంద్ర బాబు కాలంలో కొన్ని సంవత్సరాలు ‘జీరో బేస్‌డ్ బడ్జెట్’ అని పిలిచినా, ఇపుడు మరో పేరుతో పిల్చినా దాని స్వరూప స్వభావాలను మాత్రం ప్రభుత్వాలు-అవి ఏవైనా, కాపా డుకుంటూ వస్తూన్నాయి.
ప్రణాళికా కేటాయింపులంటే ఏమిటి, కేంద్రం విడుదల చేసే నిధులకు-మ్యాచింగ్‌గ్రాంట్లకు ఒక తీరు-తెన్నూ అనేది ఉందా, ఏ రంగానికి కేటాయింపులు పెంచాలి, ఏ రంగానికి తగ్గించాలి అనే విషయాల గురించి సవివరమైన అధ్యయనం ఉందా అనేది తెలుసుకోవాలి. వాస్తవ పరిస్థితులకు, బడ్జెట్‌అంచనాలకు, ఏడాది చివర్లో జరిగిన వ్యయానికి పొంతన అనేది ఉంటున్నదా అంటే దానికి సరైన జవాబు ఎప్పుడూ దొరకదు. అయినా ఏటా ప్రభుత్వం బడ్జెట్‌ప్రవేశపెడుతూ ఉంటుంది. ప్రతిపక్షాల విమర్శ, స్వపక్షాల పొగడ్త ఎప్పుడూ పరిపాటే. పన్నులు విధించని ప్రభుత్వం ఉండదు. విమర్శంచని ప్రతి పక్షమూ ఉండదు. చివరకు ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్‌కే శాసనసభ ఆమోదం లభించి తీరుతుంది.
ఈ నేపథ్యంలో బడ్జెట్‌స్వరూప స్వభావాలు, పూర్వా పరాలు, పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవడం అవసరం. భారత రాజ్యాంగంలోని 266(3) ప్రకరణ, ప్రభుత్వ ఖర్చుపై లోక్‌సభ, శాసనసభల ఆధిపత్యాన్ని, నియం త్రణను స్పష్టంగా తెలియచేస్తుంది. మన రాష్ట్రం విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నియమ నిబంధనల సంపుటి (మ్యాన్యువల్) లోని మూడు భాగాలు స్థూలంగా ఈ విషయాలను తెలియచేస్తాయి.
మొదటి భాగంలో బడ్జెట్‌ను ఎలా రూపొందించాలనే పద్ధతిని, రెండవ భాగంలో బడ్జెట్‌కు సంబంధించిన వివిధ పత్రాలను క్షేత్ర స్థాయి నుండి సచివాలయ స్థాయి వరకు తెచ్చే ప్రక్రియ వివరాలను, మూడవ భాగంలో అనుబంధాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. ప్రభుత్వ ఖర్చులకు సంబంధించిన పద్దులు ఏ విధంగా ఉండాలి, ఖాతా పద్దు- శీర్షిక (హెడ్‌ఆప్ అకౌంట్) అంటే ఏమిటి, మేజర్‌హెడ్, మైనర్‌హెడ్‌లంటే ఏమిటి వంటి వివరాలుంటాయి. బడ్జెట్‌మ్యాన్యువల్‌లోని నియమాలను ‘పేరాలు’ అని పిలుస్తారు. బడ్జెట్‌గురించిన మరిన్ని వివరాలు కొన్ని అకౌంట్స్ కోడ్‌లోనూ, ఇంకొన్ని ఫైనాన్షియల్ కోడ్‌లోనూ ఉంటాయి.
ప్రభుత్వం అంటే ఒక అతిపెద్ద వ్యవస్థ-సంస్థ. అందులో వివిధ శాఖలు, ఉపశాఖలు, వందల-వేల కార్యాల యాలు, వీటిద్వారా ప్రజలకు సమకూర్చాల్సిన లక్షలాది పనులు ఉంటాయి. వీటన్నింటి నిర్వహణకు, రకరకాల కార్యక్రమాల అమలుకు వనరుల సేకరణ జరగాలి. పన్నుల వసూళ్ళు జరగాలి. రాజ్యాంగ నిర్మాతలు బడ్జెట్‌గురించి విశ్లేషిస్తూ, దీన్ని వార్షిక ఆర్థిక వివరణ-లేదా-వార్షిక విత్తీయ వివరణగా పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల సూచన మేరకు ఆర్థికశాఖ రూపొందించిన బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం తప్పనిసరి.
బడ్జెట్‌ను మూడు విభాగాలుగా చూపిస్తారు. సంచిత నిధి, ఆకస్మిక ఖర్చులనిధి, ప్రభుత్వ ఖాతా, ప్రభుత్వానికి వివిధ శాఖల ద్వారా సమకూరే వనరులు, టాక్స్ రెవెన్యూ, నాన్‌టాక్స్ రెవెన్యూ, రుణసేకరణ, కేంద్రప్రభుత్వ ఆర్థిక సహాయం లాంటి వన్నీ ‘సంచిత నిధి’ కిందికి వస్తాయి. ఏ శాఖ వసూలు చేసిన డబ్బును కేవలం ఆశాఖ కొరకే ఖర్చు చేసేందుకు వీల్లేదు. మొత్తం వసూళ్ళు సంచిత నిధికి చేరుతాయి. అందులోంచి బయటకు తీసి ఖర్చు చేయాలంటే, బడ్జెట్‌ను చట్ట సభల్లో ప్రవేశపెట్టి, సభ ఆమోదం పొంది తీరాల్సిందే.
కొన్ని సందర్భాల్లో, కొన్ని పథకాలను అత్యవసరంగా చేపట్టి అమలు పరచవలసిన అవసరం కలగవచ్చు. ఆర్థిక సంవత్సరం మధ్యలో కానీ, బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం పొందిన తర్వాత కానీ అనివార్య కారణాలవల్ల బడ్జెట్‌లో నిధులు కేటాయించని పథకానికి ఖర్చు చేయాల్సిన అవసరం రావచ్చు. అప్పుడు హఠాత్తుగా శాసన సభను సమావేశపరచి సభ ఆమోదం పొందడం సాధ్య పడదు. అంతవరకూ ఆ పథకాన్ని అమలు పరచకుండా ఉండాల్సిన అవసరంలేదు. ఇందుకు రాజ్యాంగంలో ఒక వెసులుబాటు కలిగించారు. ‘ఆకస్మిక ఖర్చుల నిధి’ పేరుతో ప్రభుత్వ ఆధీనంలో, పూర్తి నియంత్రణలో ఈ నిధి ఉంటుంది.
రూ.50 కోట్ల వరకూ ఇందులో ఉంటాయి. ఒక రకమైన ‘శాశ్వత అడ్వాన్స్’లాగా మొదటే శాసనసభ అమోదం పొంది, ఆకస్మిక నిధి కోసం రూ. 50 కోట్లు ప్రక్కన పెడతారు. ఇది ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే ‘కార్పస్’ అని కూడా అనవచ్చు. పథకాల అమలుకు ఈ నిధి నుండి తీసుకొని, ఆ తర్వాత అనుబంధ బడ్జెట్‌లో మంజూరు చేయించుకుంటుంది ప్రభుత్వం. వాడుకొన్న మొత్తాన్ని తిరిగి ఆ నిధిలో జమ చేస్తారు.
ప్రభుత్వం కూడా ఒక రకంగా బ్యాంకు వంటిదే. బ్యాంకర్‌గా కొన్ని లావాదేవీలు జరుపుతుంటుంది. ఉద్యో గుల భవిష్య నిధికి, బీమా ప్రీమియంకు, కంట్రాక్టర్ల నుండి సేకరించాల్సిన డిపాజిట్ల వంటి వాటిని ప్రభుత్వ ఖాతాలో జమచేస్తుంటారు. ఏదో ఒక రోజున ఆ డబ్బును సంబంధిత వ్యక్తులకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే దీన్ని ప్రత్యేకంగా వేరే ఖాతాగా చూపిస్తుంది ప్రభుత్వం.
సంచిత నిధిలో మూడు భాగాలుంటాయి. రెవెన్యూ ఖాతా, మూలధనం ఖాతా, రుణ ఖాతాలుగా వీటిని పిలు స్తారు. పన్నుల రూపేణా, సర్వీసుల రూపేణా, జరిమానాల రూపేణా, ఇతర రకాలుగా వచ్చే ఆదాయాన్ని రెవెన్యూ ఖాతాలో చేరుస్తారు. ప్రభుత్వ నిర్వహణకయ్యే ఖర్చులన్నీ ఈ ఖాతా నుండే చేస్తారు. భవనాల, రహదారుల నిర్మాణానికి ప్రాజెక్టుల, ఇతర రకాల ప్రజల మేలు కోసం పెట్టుబడి వసూళ్లు చేస్తారు. గత సంవత్సరం రెవెన్యూ ఖాతాకు రావలసినవి ఈ సంవత్సరం వస్తే అవి కూడా మూలధనం ఖాతాలోకే చేరతాయి.
రుణ ఖాతాలోకి చేసిన అప్పులు, విడుదల చేసిన రుణాలు వస్తాయి. స్థానిక సంస్థలకు, రైతులకు ప్రభుత్వం విడుదల చేసే రుణాలన్నీ రికవరీ వివరాలతో సహా రుణ ఖాతా లోకే చేరతాయి. ప్రభుత్వానికి చెందిన ఆదాయ వ్యయాలన్నీ ఈ మూడు విభాగాల్లోనే తేట తెల్లంగా తెలుస్తాయి. బడ్జెట్‌పరంగా ‘సెక్టొరయల్ క్లాసిఫికేషన్’ (వర్గీకరణ) పేరుతో ప్రభుత్వ శాఖలను నాలుగు తరగతులుగా విభజించారు.
వాటిని సాధారణ సేవల శాఖలు, సాంఘిక సామాజిక సేవల శాఖలు, ఆర్థిక సేవల శాఖలు, ఆర్థిక సహాయక శాఖలుగా పిలుస్తారు. ప్రభుత్వ నిర్వహణ, శాంతి భద్రతలు, రెవెన్యూ, జైళ్లు, శిక్షణా సంస్థలు సాధారణ సేవల కిందకి వస్తాయి. విద్య, వైద్యం, ఆరోగ్యం, సాంఘిక సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమ శాఖలవంటివి సాంఘిక-సామాజిక సేవల శాఖల కిందకి వస్తాయి. నీటి పారుదల, రోడ్లు-భవనాలు, వ్యవసాయం, విద్యుత్ రంగాల వంటివి ఆర్థిక శాఖల కిందకొస్తాయి.
స్థానిక సంస్థల సేవలలాంటివి ఆర్థిక సహాయక శాఖల కిందికి వస్తాయి. ఈ సేవలన్నీ ఖాతాల్లో పద్దుల రూపేణా చూపించ డానికి మరోరకమైన విభజన ఉంటుంది. వివిధ రకాలైన పద్దులను మేజర్, మైనర్(ప్రధాన-చిన్న) హెడ్‌లుగా విభ జిస్తారు. బడ్జెట్ పరిభాషలో ఈ విభజనను ‘ఏడంచెల’ విభజనగా పిలుస్తారు. మొదటి అంచెలో ఏశాఖ ఏ విభాగం కిందకు వస్తుందో నిర్ణయిస్తారు. ఆ శాఖకు ఒక నంబరు కేటాయిస్తారు. తదుపరి మిగిలిన అయిదు అంచెలను ప్రధాన పద్దు, అనుబంధ ప్రధాన పద్దు, చిన్న పద్దు, సవివరమైన పద్దులుగా పిలుస్తారు.
కొత్తగా అను బంధ సవివరణ పద్దును చేర్చారు. వివిధ శాఖల, విభా గాల లావాదేవీలకు వరుస నంబర్లను కేటాయిస్తారు. సంచిత నిధి కిందకొచ్చే మూడు విభాగాలకు ఆ నంబ ర్లను వరుస క్రమంలో ఏర్పాటు చేశారు. రెవెన్యూ ఖాతా పద్దులకు మేజర్‌హెడ్‌కింద, రెవెన్యూ రిసిప్ట్స్ కు 1-1999, సాధారణ ఖర్చులకు 2000-3999 నంబర్లుంటాయి. మూలధనం పద్దులకు 4000- 5999, రుణఖాతా పద్దు లకు 6000-7999 నంబర్లుంటాయి. ఆకస్మిక ఖర్చుల నిధికి నంబర్ 8000 కేటాయించారు. 8001 నుంచి ఉండే మేజర్‌హెడ్స్ అన్నీ కూడా ప్రభుత్వ ఖాతాకు చెంది నవే. ఇదే విధంగా ఇతర మైనర్, సబ్ మైనర్ హెడ్‌లకు నంబర్లుంటాయి. ఇవి అమర్చిన విధానంలో ఒక్క హెడ్ ఆఫ్ అకౌంట్ ఖాతా పద్దు తెలుస్తే చాలు. మిగిలినవన్నీ సులువుగా తెలుసుకోవచ్చు.
మరో ముఖ్యమైన విషయం, ఈ విభజన ఒక్క మన (ఆంధ్ర ప్రదేశ్) రాష్ట్రానికే పరిమితం కాదు. మేజర్, మైనర్, సబ్ మేజర్ హెడ్స్ అఖిలభారత స్థాయిలో అన్ని చోట్ల ఒకే రకంగా, యూనిఫాంగా ఉంటాయి. ఇవన్నీ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ సలహా మేరకు కేంద్రప్రభుత్వం నిర్ణయం మేరకు, అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న ఖాతా పద్దులు.
బడ్జెట్‌లో ఒక యూనిట్‌కు కేటాయించిన మొత్తాన్ని వినియోగం (అప్రోప్రియేషన్) అంటాం. బడ్జెట్ సంవత్సరమంటే ఏప్రిల్ మొదటి తేది నుండి మార్చి 31 వరకు. ఏ సంవత్సరానికి ఆమోదించిన బడ్జెట్‌ను అదే సంవత్సరంలో ఖర్చు చేయాలి. చేయకపోతే మురిగి పోతుంది. బడ్జెట్‌ను వివిధ ఖండాలుగా విడగొట్టారు.
ప్రతి శాఖమంత్రి తన శాఖ నిర్వహణ కు కొంత మొత్తాన్ని మంజూరు చేయాల్సిందిగా శాసనసభను కోరు తారు. దీన్నే ‘డిమాండ్’ అభ్యర్థన అంటారు.
శాసనసభ ఆ డిమాండ్‌ను ఆమోదించిన తర్వాత ‘గ్రాంట్’ మంజూరు అయిందంటాం. ఇలా అన్ని శాఖల గ్రాంట్లు కలిపి, బడ్జెట్ సమావేశాల చివర్లో ద్రవ్య వినియోగ బిల్లు (అప్రొ ప్రియేషన్‌బిల్లు) ను ప్రవేశపెడతారు. దీనికి సభ ఆమోదం అభించగానే, దాన్ని ‘అప్రొప్రియేషన్ యాక్ట్’ అంటారు. అంటే బడ్జెట్‌కు పూర్తి ఆమోదం లభించి, అంచనాలకు తగ్గట్లు ప్రతి శాఖ ఖర్చు చేసుకోవచ్చునని అర్థం.
ప్రభుత్వం చేసే ప్రతి ప్రతిపాదనను క్షుణ్ణంగా చర్చించే అవకాశం- అధికారం శాసనసభకుంది. కొన్ని అంశాల విషయంలో రాజ్యాంగ పరంగా మినహాంపులున్నాయి. వీటినే ‘చార్జ్డ్ ఐటమ్స్’ అంటారు. గవర్నర్ సిబ్బంది, సభాపతి సిబ్బంది, కోర్టు డిక్రీలు వంటి వాటికయ్యే ఖర్చును బడ్జెట్‌లో చూపించినా, ఓటింగ్‌కు పెట్టరు. ఆమోదించినట్లే భావించాలి.ఇంత సుదీర్ఘమైన ప్రక్రియలో బడ్జెట్‌ను రూపొందించి, ఆమోదం లభించినా ‘బడ్జెట్‌లో చూపించింది చూపించినట్లే ఖర్చు చేయరు, ఖర్చు చేసింది బడ్జెట్‌లో చూపరు’ అని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యా నిస్తుంటారు.
అయాం ఎ బిగ్ జీరో (45) - భండారు శ్రీనివాసరావు
2 hours ago
No comments:
Post a Comment