Thursday, September 2, 2010

ఆత్మీయతకు మారుపేరు ముఖ్యమంత్రి రోశయ్య : వనం జ్వాలా నరసింహారావు

రెండు దశాబ్దాలుగా నేనెరిగిన-నాకు తెలిసిన కొణిజేటి రోశయ్య
వనం జ్వాలా నరసింహారావు

ముఖ్యమంత్రి రోశయ్యతో నాకున్న సాన్నిహిత్యం, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో లేదు. ఆయనతో నాకు కేవలం పరిచయం మాత్రమే. పది మందికి ప్రాణాపాయంలో అవసరానికొచ్చే 108 అత్యవసర సహాయ సేవలకు సంబంధించిన నా ఉద్యోగ నిర్వహణ విషయంలో, రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ప్రతి సమస్యను ప్రభుత్వ పరంగా పరిష్కరించబడడానికి ఆయనతో వున్న పరిచయానికంటే, రోశయ్యతో వున్న సాన్నిహిత్యమే ఎక్కువగా ఉపయోగ పడిందనాలి. బహుశా ఆ సాన్నిహిత్యంతోనే రోశయ్య ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాలుగైదు రోజుల్లో, కలవడానికి సమయం కేటాయించమని కార్యాలయ సిబ్బందిని కోరకుండానే, ఆయనను కలిసేందుకు మితృడు భండారు శ్రీనివాస రావుతో కలిసి వెళ్లాను. సాధారణంగా లోగడ కలిసే సమయంలోనే, కలవడానికి ధైర్యంగా వెళ్ళిన మాకు, ఇంటిముందరకు పోయిన తర్వాత నిరాశ మిగిలింది. అప్పటికే విధుల్లో చేరిన సెక్యూరిటీ సిబ్బంది, అప్పాయింట్మెంవట్ లేకుండా వెళ్ళడం కుదరదన్నారు. లోపడున్నవారిని ఫోనులో సంప్రదించడానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు.

ఈ నేపధ్యంలో లోనికి వెళ్లగలిగినా, ముఖ్యమంత్రిని కలవడం సాధ్యపడే విషయం కాదని అనుకుంటున్న సమయంలో, బాగా పరిచయమున్న ఒక పోలీసు ఉన్నతాధికారి, ముఖ్యమంత్రిని కలిసి బయటకు రావడం జరిగింది. ఆయన మమ్మల్ని పలకరించిన తీరు చూసి, బహుశా ఆయన సైగలను అర్థం చేసుకుని, సెక్యూరిటీ సిబ్బంది మా ఇద్దరిని లోనికి వదిలారు. మాకు తెలిసిన ముఖ్యమంత్రి వ్యక్తిగత సిబ్బంది ఇంకా రాలేదప్పటికి. ముందు గదిలో మేము కూర్చొన పోతుండగా, ముఖ్యమంత్రిని కలిసిన వ్యక్తి ఒకరు లోపలి నుంచి బయటకొస్తున్నప్పుడు తలుపు తీయడంతో, మమ్మల్ని చూసిన ఆయన, పేర్లు పెట్టి పిలిచి మరీ రమ్మనడంతో ఊపిరి పీల్చుకున్నాం. ముఖ్యమంత్రికి నమస్కారం చేసి, మర్యాదపూర్వకంగా ఆయనను కలవడానికి-అభినందనలు వ్యక్తిగతంగా చెప్పడానికి మాత్రమే వచ్చామని, ఆ రెండూ అయ్యాయి కనుక వెళ్తామని చెప్పాం. సున్నితంగా మా కోరికను తిరస్కరించి, మమ్మల్ని కూచోమని అనడమే కాకుండా, ఎప్పటి రోశయ్య గారి లాగానే, మాట్లాడారు చాలా సేపు. నేను 108 అత్యవసర సహాయ సేవల నిర్వహణ సంస్థలో ఉద్యోగం మానేసిన విషయం, అమెరికా వెళ్తున్న విషయం చెప్పి, ఇద్దరం బయటకొచ్చాం. బహుశా మరొక రాజకీయ నాయకుడై తే అలా పిలవక పోయేవారేమో! అలా సాదాసీదాగా మాట్లాడకపోయేవారేమో! ఆ తర్వాత నేను అమెరికాలో మా పిల్లలతో వున్నప్పుడు దసరా, సంక్రాంతి పండుగలకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఫోన్ చేసినప్పుడు, ఇంకే ముఖ్యమంత్రి కూడా (బహుశా) కేటాయించనంత సమయం నాతోను-అక్కడుంటున్న మా అమ్మాయితోను మాట్లాడడానికి కేటాయించడం, ఆత్మీయంగా కుశల ప్రశ్నలు అడగడం, ఆయన నిరాడంబరానికి నిదర్శనం. ఒక ముఖ్యమంత్రి, అందునా అప్పట్లో వున్న పరిస్థితుల్లో, ఫోన్లో దొరకడం-సంభాషించడం నా లాంటివారెప్పుడూ మరిచిపోలేని మరుపు రాని సంఘటన.

సీఎం రోశయ్యతో నాకు మొదటిసారి దగ్గరగా పరిచయం 1989 లో అయింది. అంతకుముందు కలిసినా అంతగా పరిచయం చేసుకునే అవకాశం కలగలేదు. అప్పట్లో నేను గవర్నర్ కుముద్ బెన్ జోషి దగ్గర పనిచేస్తున్నప్పటికీ, పాత్రికేయ ప్రవృత్తితో వున్న సంబంధం నన్ను స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డితో పరిచయానికి దారితీసింది. అదే క్రమంలో, చెన్నారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కావడంతో నేనాయనకు మరింత చేరువయ్యాను. ఎన్ టీ రామారావు సారధ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించడానికి పటిష్టమైన నాయకత్వం కొరకు పీసీసీ అధ్యక్షుడిగా చెన్నారెడ్డిని నియమించడంతో, ఆయనకు ఆ లక్ష్యంలో తోడ్పడిన ముఖ్యుల్లో ప్రథముడైన రోశయ్యతో పరిచయం కలిగింది. 1989 సంవత్సరాంతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చెన్నారెడ్డికి అన్ని విషయాల్లో చేదోడుగా వుండేవారు రోశయ్య. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం, చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కావడం, రోశయ్య ఆయన మంత్రివర్గంలో చేరడం జరిగింది. ఎన్నికల ముందు పరిచయమైన నన్ను చెన్నారెడ్డి నన్ను "ముఖ్యమంత్రి పౌర సంబంధాల అధికారి" గా నియమించారు. నా నియామకం గురించి మొట్టమొదట రోశయ్య గారికి తెలియచేసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ముఖ్యమంత్రి పీఅర్ఓ గా ప్రతి దినం రోశయ్యను కలిసే అవకాశం, విధి నిర్వహణలో ఆయన సూచనలు-సలహాలు తీసుకోవడం నిరంతరం జరిగేది. ఆ తర్వాత రాజకీయాలకు సంబంధించిన ఉద్యోగం ఏదీ నేను చేయకపోయినా, ఆయనను మధ్య-మధ్య కలవడం జరుగుతుండేది. ఆయన మంత్రిగా లేనప్పుడు కూడా చాలా పర్యాయాలు కలిసి ఆయన సహాయం కోరితే కాదనలేదెప్పుడు. 1994-2004 మధ్య కాలంలో, కాంగ్రెస్ ప్రతిపక్షంలో వున్నప్పుడు శ్రీనివాసరావు తో కలిసి చాలా సార్లు కలిశాను. అప్పడు ఎలా కలివిడిగా మాట్లాడేవారో, ఇప్పుడూ అంతే.

2004 లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఉద్యోగ విరమణ చేసి, ఏడాది తర్వాత, 108 అత్యవసర సహాయ సేవలు నిర్వహిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థలో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ఇన్-చార్జ్ గా చేరాను. ఆ మధ్యలో, నేను ఆయనను కలిసిన ప్రతిసారీ, నాకేమైనా సహాయం కావాలా అని అడిగేవారు. ఇ.ఎం.ఆర్.ఐ లో చేరిన మొదటి వారంలోనే, ఒకే కంపార్ట్ మెంటులో ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఆయన్ను కలవడం, నా ఉద్యోగం విషయం చెప్పడం, ఆ సేవల గురించి ఆయన నోటి వెంట వివరంగా వినడం జరిగింది. నేను చేరక ముందు, ఆగస్టు 15, 2005 న ఆ సేవలు లాంఛనంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రారంభించినప్పుడు ఆయన అక్కడున్న విషయం కూడా చెప్పారు రోశయ్య. ఆర్థిక శాఖకు అదనంగా, ఆరోగ్య-వైద్య-కుటుంబ సంక్షేమ శాఖకు కూడా రోశయ్య గారే మంత్రి. 108 అత్యవసర సహాయ సేవలకు సంబంధించి, అవసరమైనప్పుడల్లా ఆయనను కలిసే అవకాశం కలిగింది. తొలుత కేవలం ప్రయివేట్ నిధులతోనే నడుస్తున్న ఆ సేవలను ఒకే రోజున ఒంగోలు, చీరాలలో ఆయన ప్రారంభించారు. చీరాల సభలో మాట్లాడుతూ, జిల్లాకు కోటి రూపాయల వంతున 23 కోట్ల రూపాయలను బడ్జెట్లో మున్ముందు కేటాయించడానికి ప్రభుత్వ సంసిద్ధతను మొట్టమొదటి సారిగా బహిరంగంగా ప్రకటించింది రోశయ్య గారే. ఇచ్చిన మాట ప్రకారం 2007-2008 బడ్జెట్లో 23 కోట్లు కేటాయించారు. ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం ఉన్నప్పటికి, రాజశేఖర రెడ్డి దృష్టిలో అప్పటికింకా వివరంగా పడలేదాసేవల విషయం.

రోశయ్య ఆరోగ్య శాఖను నిర్వహిస్తున్నప్పుడే, అంతవరకు 108 అత్యవసర సహాయ సేవలకు అసలే అందని నిధుల స్థానంలో, నిర్ణీత మొత్తంలో కొంత నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వ పరంగా సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి-ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు మధ్య ఆయన సమక్షంలో సెప్టెంబర్ 2006 లో అవగాహనా ఒప్పందం కుదిరింది. రోశయ్య చొరవతో సాధ్యమైన ఆ సంఘటన అత్యవసర సహాయ సేవలకు సంబంధించినంతవరకు ఒక చారిత్రాత్మక మలుపు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయనకు సలహాదారుడుగా పనిచేస్తున్న అధికారి, పీకె అగర్వాల్, అప్పట్లో ఆరోగ్య-వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి. ఒప్పందం ప్రకారం నిధులకు తోడు 432 అంబులెన్సులను కూడా సమకూర్చింది ప్రభుత్వం. క్రమేపీ రోశయ్య ద్వారా దివంగత ముఖ్యమంత్రికి చేరువైన సేవల నిర్వహణకు, మరిన్ని అంబులెన్సులను చేర్చడంలోను, నిర్వహణ నిధులను 95% వరకు పెంచడంలోను కీలక పాత్ర పోషించింది రోశయ్యే. గ్రామీణ ప్రాంతాలకు సహాయ సేవలను విస్తరించడానికి జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం నుంచి, ఆ సేవలకు అంబులెన్సులను పెంచినప్పుడల్లా సంబంధిత కార్యక్రమంలో పాలు పంచుకోవడం వరకు, అడిగినప్పుడల్లా కాదనకుండా ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ప్రాంగణానికి రావడం దాకా, నిధుల విడుదలలో ఆలస్యమైనప్పుడల్లా తోడ్పడంతో సహా, ఎల్ల వేళలా ఆయన సహకారం కొరకు కలిసినప్పుడల్లా ఒకే రకమైన ఆత్మీయ స్పందన దొరికేది. సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ రామలింగ రాజు జైలుకెళ్లడంతో, జనవరి 8, 2009 న, దివంగత ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలన్నీ రోశయ్య సలహాతోనే తీసుకున్నారు రాజశేఖర రెడ్డి. తిరిగి నాలుగు నెలల అనంతరం 108 అత్యవసర సహాయ సేవల నిర్వహణకు ప్రయివేట్ భాగస్వామిగా బాధ్యతలు చేపట్టమని జీవి కృష్ణారెడ్డితో రాజశేఖర రెడ్డి మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన సంప్రదించింది రోశయ్యనే. ఆ నాలుగు నెలల మధ్య కాలంలో వచ్చిన పెద్ద అవాంతరం రోశయ్య జోక్యం చేసుకోవడంతో తప్పింది. ఇ.ఎం.ఆర్.ఐ ఖాతాలో వున్న సంస్థ నిధులను యాక్సెస్ బాంక్ స్తంభింపచేయడంతో తలెత్తిన సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న రోశయ్యను కలవడం, ఆయన సహాయం కోరిన వెంటనే ఆయన దానిని పరిష్కరించడం జరిగింది. జీవీ కృష్ణారెడ్డి కంటే ముందు ప్రయివేట్ భాగస్వామిగా వచ్చేందుకు ఉత్సాహం చూపించిన పిరమల్ సంస్థ చైర్మన్ అజయ్ పిరమల్ కోరిక మేరకు, అడిగిన వెంటనే తన ఇంట్లో ఆయన కలుసుకునేందుకు సమయం కేటాయించడమే కాకుండా, అత్యవసర సహాయ సేవల గురించి "బ్రాండ్ అంబాసిడర్" లాగా ఆయనకు వివరించారు రోశయ్య. తనకున్న కొన్ని పరిమితుల వల్ల ఇ.ఎం.ఆర్.ఐ బాధ్యతలు స్వీకరించలేక పోయిన అజయ్ పిరమల్, మరో స్వచ్చంద సంస్థ పై ఆసక్తి కనబరిచి, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి ఇటీవల కలిసినప్పుడు నేను కూడా ఆ సంస్థ అధికారులతో కలిసి వెళ్లాను. మళ్ళీ అదే అత్మీయత చూపారు రోశయ్య గారు.

ఇలా ఎప్పుడు ఏది అడిగినా కాదనని రోశయ్య అనుకోని పరిస్థితుల కారణంగా, రాజశేఖర రెడ్డి అకాల మరణంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ప్రభుత్వ శాఖల పనితీరుపై అవసరమైనప్పుడు తక్షణమే సమీక్షలు నిర్వహిస్తారనడానికి నిదర్శనంగా ఇటీవలి నా అనుభవమే ఉదాహరణ. ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో సేవలందిస్తున్న సంస్థలో పనిచేస్తున్న నేను, ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారితో కలిసి, సంస్థ ఎదుర్కొంటున్న సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాం. ఎంతో పని ఒత్తిడిలో వున్న ముఖ్యమంత్రి మాతో మాట్లాడడానికి నిమిషం కంటె ఎక్కువ సమయం కేటాయించ లేకపోయారు. అయినా ఆ ఒక్క నిమిషంలోనే సమస్య పరిష్కారం దిశగా ఆంతరంగిక సిబ్బందికి తగు ఆదేశాలిచ్చారు. సంబంధిత అధికారిని కలవమని కూడా సూచించారు. మేము ముఖ్యమంత్రి సూచన మేరకు ఆయన చెప్పినట్లే చేశాం. ఆ తర్వాత ఏం జరిగిందో కాని, నేను పనిచేస్తున్న సంస్థకు సంబంధించిన ప్రభుత్వ శాఖాధికారులతో, మర్నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి. సమస్యకు సంబంధించిన తక్షణ ఇబ్బందులు తొలగిపోయాయి.

అధికారంలో లేనప్పుడు ఎంత సమయం కేటాయించినా, ముఖ్యమంత్రి కానప్పుడు అధికారంలో వుండగా ఎంత సమయం కేటాయించినా, ముఖ్యమంత్రిగా పనుల ఒత్తిడివల్ల అతి తక్కువ సమయం కేటాయించినా, రోశయ్య కనిపించే ఆత్మీయతలో మార్పు కొంచెమైనా లేదు. హద్దులు మించని ఏ కోరిక కోరినా ఆయన స్పందనలో ఒకే రకమైన
ఆత్మీయత.

Also please click for more here:

2 comments:

  1. రోశయ్య గారితో పరిచయం గురించి జ్వాలా నరసింహారావు రాసిన విధానం బాగుంది. మొదట్లో పేర్కొన్న సేనియర్ పోలీసు అధికారి – ప్రస్తుత పోలీసు డైరెక్టర్ జనరల్ అరవిందరావు గారు. బహుశా పేరు ప్రింట్ లో జారిపోయి వుంటుందని అనుకుంటున్నాను. – భండారు శ్రీనివాసరావు ., క్యాంప్ : సియాటిల్, అమెరికా

    ReplyDelete
  2. Best and valuable message I have seen. I cannot imagine such a
    special, peculiar and a versatile of our beloved CM Sri.K.Rosiah.
    Sundara Rau K.H.A

    ReplyDelete