పాత తరం నాయకుడు కోట్ల విజయ భాస్కర రెడ్డి
వనం జ్వాలానరసింహా రావు
పాత తరం నాయకులలో కోట్ల విజయ భాస్కర రెడ్డికి ప్రత్యేకత వుందనాలి. ఆద్యంతం-ఆజన్మాంతం, చెదరని నిజాయితీతో, క్రమశిక్షణతో, పరిపాలనా దక్షతతో, ముందు చూపుతో, సామర్థ్యంతో, నైతిక విలువలతో, ఆత్మ విశ్వాసంతో, ముక్కు సూటిగా పోయే మనస్తత్వంతో, పట్టుదలతో రాష్ట్ర-దేశ రాజకీయాలలో తనదంటూ చెరిగిపోని ముద్ర వేసిన పెద్దమనిషి, సౌమ్యుడు, మితభాషి, అజాతశత్రువు, సంస్కార వంతుడు, అరుదైన సహజ నాయకుడు కోట్ల విజయభాస్కర రెడ్డి. జీవన యానంలో సహస్ర చంద్ర దర్శనం, రాజకీయ యానంలో షష్టి పూర్తి జరుపుకున్న ఆ మహా మనిషిని వరించని పదవి లేకపోయినా, ఎన్నడూ పదవే ధ్యేయంగా రాజకీయాలు చేయలేదు. అందుకేనేమో, అశేష జనం అభిమానాన్ని చూరగొన్న "పదహారణాల పెద్దాయన" య్యారు. మిగిలిన రాజకీయ వాదులతో పోల్చితే విజయభాస్కర రెడ్డిది పెద్ద మనిషి తరహా వ్యవహార శైలి.
అనేక ప్రజోపయోగమైన కీలక పదవులను తన అరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో పొందారు. పొందిన ప్రతి పదవికి వన్నె తెచ్చారు. స్వపక్షం-విపక్షం అన్న తేడా లేకుండా, తన వారైనా-పరాయి వారైనా తప్పుచేశారని భావించినప్పుడు, అందుకవసరమైన న్యాయ విచారణకు ఆదేశించి, ప్రశంశలను-అభిశంసలను అందుకున్నారు. అందుకేనేమో, సాక్షాత్తు రాజీవ్ గాంధీ లాంటి వారు, తన తల్లిపై-ఆమె ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చేసినప్పుడు, అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హోదాలో దాన్ని తిప్పికొట్టడానికి, విజయభాస్కర రెడ్డి లాంటి వారి పేరును వాడుకున్నారు. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చేంత వరకు, ఏ విధంగానైతే కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో "నంబర్ టు" గా వ్యవహరించి, ఏ ముఖ్యమంత్రి వున్నా ఆయనకు అండగా సంపూర్ణ సహకారాలందించే వారో, అదే విధంగా అటు కేంద్రంలోను-ఇటు రాష్ట్రంలోను నిర్మాణాత్మక పాత్ర పోషించేవారు విజయభాస్కర రెడ్డి. ఆయన "నంబర్ టు" గా వుండడం, ఎప్పుడో బ్రహ్మానంద రెడ్డి కాలంలోనే ఆరంభమైంది. ఆయన ఏ శాఖను ఏ స్థాయిలో నిర్వహించినా, దానికి సంబంధించిన పూర్వా-పరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారని ఆయన ఆంతరంగిక అధికారులంటుండేవారు. నిజాయితీ పరులైన అధికారులంటే ఆయనకు ఎనలేని గౌరవం. వారిని ఎన్నో రకాలుగా ప్రోత్సహించేవారని పేరుంది. ఇప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్, ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయనకు కార్యదర్శిగా పనిచేశారు. అంతకు ముందు ఎన్ టీ రామారావు దగ్గర ఎస్వీ ప్రసాద్ పనిచేసినప్పటికీ, నిజాయితీ పరులైన అధికారులంటే ఆయనకున్న గౌరవమే తన దగ్గర పనిచేసేందుకు కూడా ఆయన్నే ఎంపిక చేసుకునేందుకు దారితీసింది. అలానే సమస్య ఎదురైనప్పుడు, దాన్ని ధైర్యంగా ఎదుర్కునేవారు కాని, ఇప్పటి నాయకులవలె బాధ్యతనుంచి తప్పించుకునే ధోరణి కాని-ఇతరులను నిందించడం కాని ఎన్నడూ చేయలేదని కూడా ఆయనతో పనిచేసిన అధికారులనేవారు. ఉదాహరణకు, తీవ్రవాదుల కిడ్నాప్‌కు గురైన ప్రభుత్వాధికారులను విడుదల చేయించేందుకు ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించిన తీరు అప్పట్లో పలువురి ప్రశంసలనందుకుంది.
కోట్ల తీసుకున్న సారా నిషేధం నిర్ణయం వల్ల మహిళలకు ధైర్యం కలగడం-అనేక బీద కుటుంబాలు బాగుపడడం జరిగింది. చౌక దుకాణాలను మహిళలకు కేటాయించాలనే నిర్ణయం కూడా ఆయనదే. అనాదిగా కాంగ్రెస్ పార్టీపై మహిళలకున్న అభిమానం, విజయభాస్కర రెడ్డి నిర్ణయాల మూలంగా ఇనుమడించిందనాలి. కర్నూలు జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా పనిచేసిన ఆయనకు పాలనా దక్షుడుగా పేరొచ్చింది. ఆ పేరే ఆయనను 1962లో రాష్ట్ర స్థాయికి ఎదిగేందుకు దోహదపడిందంటారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడుగా, రాష్ట్ర స్థాయికి చేరుకుని, దరిమిలా కేంద్ర స్థాయికి ఎదిగారు. ఆయన ప్రతిభను గుర్తించిన అధిష్టానం, ఎన్ని విధాల వీలై తే అన్ని విధాల, ఆయన సేవలను ఉపయోగించుకుంది. అహర్నిశలు ఆత్మవిశ్వాసంతో పనిచేసే విలక్షణమైన వ్యక్తిత్వమున్న విజయభాస్కర రెడ్డి ఏ పదవిలో వున్నా, అనవసర విషయాలకు, ఇప్పటి నాయకుల లాగా ప్రాధాన్యమివ్వకుండా, తన కర్తవ్య నిర్వహణలో ఎవరు కూడా వేలెత్తి చూపని రీతిలో హుందాగా ముందుకు సాగేవారు.
మానవత్వానికి, మంచితనానికి, సహనానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆయన గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఒక పర్యాయం ముఖ్యమంత్రిగా ఆయన కాన్వాయ్ వెంట ప్రయాణిస్తున్న పాత్రికేయుల వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైందట. అది గమనించిన విజయభాస్కర రెడ్డి, తాను ముఖ్యమంత్రినన్న విషయం పక్కన పెట్టి, తన వాహనం దిగి, స్వయంగా గాయపడిన విలేఖరులకు సహాయ పడ్డారట. అదీ ఆయన మానవత్వం. వ్యవసాయానికి కావాల్సిన విద్యుత్ విషయంలో శ్లాబ్ పద్దతిని ప్రవేశపెట్టిన మంచితనం ఆయనది. కాపులను ముస్లింలను వెనుకబడిన వర్గాల వారిగా గుర్తించే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయించింది ఆయనే. బలహీన వర్గాల గృహనిర్మాణ పధకం రూపకర్తా ఆయనే. ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమం జాతీయ స్థాయిలో అమలు చేయాలని ఇందిరా గాంధి నిర్ణయం తీసుకోవడానికి కారణం, అంతకు ముందే, అలాంటి కార్యక్రమాన్ని విజయవంతంగా ఆంధ్ర ప్రదేశ్ లో విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా అమలుపరచడమే. ఆయనకు సాగునీటి శాఖన్నా, విద్యుత్ శాఖన్నా, విద్యా శాఖన్నా ఎక్కువ మక్కువ నేవారు. అప్పటి ప్రధాని పీవీ సమక్షంలో తనకు, తన పార్టీ వారినుంచే జరిగిన అవమానానికి నిరసనగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆత్మగౌరవం ప్రదర్శించిన వ్యక్తి విజయభాస్కర రెడ్డి. ముఠా రాజకీయాలకు ఆలవాలమైన రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆయన సహనానికి ప్రతీక అనాలి. రాజకీయ నాయకుల కుండే సహజసిద్ధమైన "లౌక్యం" ఆయనకు అలవాటులేదు. నిర్మొహమాటంగా తాను చెప్పదల్చుకుంది చెప్పేవారేకాని మనసులో ఒక మాట, బయటకు మరో మాట చెఫ్ఫే మనస్తత్వం కాదు. ఉదాహరణకు, పీవీ నరసింహా రావు ఓటమి తర్వాత, యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ మద్దతు విషయంలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం చెప్పుకోవాలి. తెలుగు దేశంతో కలిసి ఫ్రంట్కు మద్దతివ్వడం మంచిది కాదని నిక్కచ్చిగా ఆయన చేసిన సూచన విలువ కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత తెలిసొచ్చింది.
విజయభాస్కర రెడ్డి మన మధ్య లేకపోయినా ఆయన గురించి పెద్దలు చెప్పిన మంచి వాక్యాలు మన మదిలో ఎల్లప్పుడూ మెదులుతూనే వుంటాయి. సీపీఎం నాయకుడు స్వర్గీయ బోడేపూడి వెంకటేశ్వర రావు, శాసన సభలో తెలుగుగంగపై జరిగిన అవినీతికి సంబంధించిన చర్చలో పాల్గొన్నారొక పర్యాయం. ఆయన ఆ సమయంలో ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబడుతూనే, ఆయన సహచరులపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూనే, విజయభాస్కర రెడ్డిని గురించి ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన వ్యాఖ్యలు చేశారు. "నీతి-నిజాయితీలకు" ఆయన నిదర్శనమని, తాను చేస్తున్న ఆరోపణలకు విజయభాస్కర రెడ్డికి సంబంధం లేదని అన్నారాయన. అరుదైన నాయకుడాయన.
No comments:
Post a Comment