సెప్టెంబర్ 27, 2010 న కోట్ల విజయభాస్కర రెడ్డి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా
కోట్ల విజయ భాస్కర రెడ్డి మరణించి అప్పుడే తొమ్మిదేళ్లయింది. ఐనా ఆయన మన మధ్య ఇంకా కదలాడుతున్నట్లే వుంది. కేవలం తన కంటిచూపుతోనే ఆత్మీయ తను పంచిపెట్ట గలిగే వ్యక్తిత్వం ఆయనది. ప్రలోభాలకు-ఒత్తిళ్లకు లోనుకాకుండా తనకు తానే సాటి అనిపించుకున్న కోట్ల, రెండు పర్యాయాలు, రాష్ట్ర ముఖ్య మంత్రిగా, అనేక సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసి అందరి మన్ననలు పొందారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో, విద్యార్థి నాయకుడుగా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, లాఠీ దెబ్బలు తిన్న కోట్ల జీవితాంతం అవే స్వతంత్ర భావాలు కనబరచారు. అడ్వొకేట్‌గా పనిచేస్తూనే, రాజకీయ రంగంలో ప్రవేశించారు.ఆరు సార్లు కర్నూలు నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎమ్మిగనూరు, డోన్, పాణ్యం, పత్తికొండల నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు కర్నూల్ జిల్లాపరిషత్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
పాత తరం నాయకులలో విజయభాస్కర రెడ్డికి ప్రత్యేకత వుందనాలి. ఎన్ టీ రామారావుకు ఖ్యాతినిచ్చిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని, అంతకు పది పైసలకన్నా తక్కువ ధరకే ప్రవేశ పెట్టిన వ్యక్తి విజయభాస్కర రెడ్డి. అలాగే సారాను నిషేధించాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఆ తర్వాత కాలంలో మద్య నిషేధానికి దారి తీసింది. ఈ నిర్ణయాలు ఆయన తీసుకోకపోతే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వారు వాటిని పట్టించుకోక పోయేవారేమో!
కోట్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తొలుత, 1955 శాసన సభ ఎన్నికలలో పోటీ చేసి, టంగుటూరు ప్రకాశం పంతులు ప్రభుత్వం అవిశ్వాసం తీర్మానంలో ఓటమి చెందడానికి కారణమైన న్యాయ కంటి శంకర రెడ్డిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. 1959 లో కర్నూల్ జిల్లా పరిషత్ మొదటి అధ్యక్షునిగా, మళ్లీ రెండో పర్యాయం 1964 లో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. శాసన మండలి సభ్యుడుగా కూడా 1967 లో ఎన్నికయ్యారు. బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో అనేక కీలక శాఖలను నిర్వహించారు. 1977-1999 మధ్య కాలంలో ఆరు సార్లు పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికయ్యారు. ఇందిరా గాంధి, రాజీవ్ గాంధి, పీవీ నరసింహా రావు మంత్రివర్గాలలో పనిచేశారు. 1983 లో నాలుగు నెలలు, 1992-1994 మధ్య కాలంలో రెండేళ్లకు పైగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షునిగా, వర్కింగ్ కమిటీ సభ్యునిగా, జాతీయాభివృద్ధి మండలి, జాతీయ సమగ్రతా మండలి సభ్యునిగా, వివిధ రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ పరిశీలకునిగా సేవలందించారు. దక్షిణాది నుంచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి రెండుసార్లు ఎన్నికైన ఏకైక వ్యక్తి విజయభాస్కర రెడ్డి. తిరుపతి ప్లీనరీలో 1992 లో మొదటి పర్యాయం, కలకత్తాలో 1996 లో రెండో పర్యాయం వర్కింగ్ కమిటీకి ఎన్నికయ్యారాయన.
కోట్ల విజయభాస్కర రెడ్డి గురించిన ఘటన ఒకటి అప్పట్లో ప్రచారంలో వుండేది. ఇందిరా గాంధి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో, సిండికేట్ నాయకులతో ఘర్షణ నెలకొంది. ఈ సందర్భంలో నీలం సంజీవరెడ్డి అనుచరుడుగా పేరున్న కోట్లపై ఆమె దృష్టి పడింది. అప్పటికి ఆయన రాష్ట్రంలో ఆర్థిక మంత్రి మాత్రమే. ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి ఇందిరాగాంధి పక్షం. సంజీవ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీలో వున్నారు. ఆయనను సాక్షాత్తు ఇందిరా గాంధి ప్రతిపాదించారు. కానీ ఆ తరువాత మనసు మార్చుకుని స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన వీవీ గిరికి "అంతరాత్మ ప్రబోధం" అనే నినాదంతో మద్దతు ప్రకటించారు. ఇందిరా గాంధి పిలుపు మేరకు విజయభాస్కర రెడ్డి ఆమెను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఆమె నివాసంలో ఇందిరను కలిసి మాట్లాడుతున్న సమయంలోనే, సంజీవరెడ్డి అమెను కలిసేందుకు వచ్చారట. తనతో మాట్లాడడం పూర్తైన తర్వాత విజయభాస్కర రెడ్డిని ప్రధాన ద్వారం నుంచి కాకుండా, వేరే ద్వారం నుంచి వెళ్తే బాగుంటుందని ఆమె సలహా ఇచ్చారట. కోట్లకు, సంజీవరెడ్డికి ఉన్న అనుబంధం తెలిసిన ఆమె ఇరువురి స్నేహం చెడకుండా ఈ సలహా ఇచ్చిందంటారు. అయితే, కోట్ల మాత్రం తాను బహిరంగంగా ఇందిరకు మద్దతు తెలపడానికి వచ్చానని అంటూ వేరే ద్వారం నుంచి వెళ్లడానికి మర్యాదగా తిరస్కరించారట.
కోట్ల మరణించినప్పుడు సంతాపసభలో లోక్‌సభ దివంగత స్పీకర్ బాలయోగి చెప్పిన మాటలు మరువలేనివి. "ఆరడుగుల ఆజానుబాహుడు విజయభాస్కర రెడ్డి పార్లమెంటు సెంట్రల్ హాలుకు నడుచుకుంటూ వస్తుంటే, తెలుగు తేజం ఉట్టిపడుతుంది" అన్నారాయన.
No comments:
Post a Comment