విప్లవ వనిత "లోరి బిరెన్సన్"-పదిహేనేళ్ల జైలు జీవితం నుంచి విముక్తి
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర జ్యోతి దినపత్రిక (15-03-2011)
ఒక దేశ ప్రధాని గానో, అధ్యక్షురాలుగా నో ఎన్నికై అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన మహిళ లెందరో వున్నారు. శ్రీలంక మాజీ ప్రధాన మంత్రి-ప్రధమ మహిళా ప్రధాని సిరిమావో భండార నాయిక, ఆమె కూతురు-ఆ దేశాధ్యక్ష్యురాలిగా ఎన్నికైన చంద్రిక, భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధి, ఇజ్రాయెల్ అధ్యక్షురాలు గోల్డా మేర్ లాంటి వారిని ఆ కోవకు చెందిన ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అలానే, చైనా దేశానికి చెందిన "సూంగ్ సోదరీమణులు" ముగ్గురూ, వారి-వారి పరిధుల్లో గొప్ప వారే. పెద్దామె అత్యంత ధనికుడిని వివాహం చేసుకుంటే, రెండో ఆమె నవ చైనా నిర్మాత-చైనా రిపబ్లిక్ ప్రధమ అధ్యక్షుడు సన్-యట్-సేన్ ను భార్య. ఆమె కూడా ఆ దేశ గౌరవ అధ్యక్షురాలైంది. ఇక మూడవ సోదరి, కోమింటాంగ్ ఉద్యమంలో పాల్గొని, దాని నాయకుడు చియాంగ్-కై-షేక్ ను పెళ్లి చేసుకుంది. ఈ ముగ్గురూ ప్రముఖ మహిళలే. అమెరికన్ రెడ్ క్రాస్ వ్యవస్థాపకురాలు, మానవాతా వాది క్లారా బార్టన్, గుడ్డి వారి కొరకు అహర్నిశలు శ్రమించిన హెలెన్ కెల్లర్, మానవాతా వాది లొరెయిన్ రోథ్మన్ లాంటి మరెందరో మహిళలు ప్రపంచంలో పేరు తెచ్చుకున్నారు. కాకపోతే, వారిని గౌరవించు తూ-గుర్తుంచుకున్నట్లే, మరో రంగంలో కృషిచేసిన లోరి బిరెన్సన్ లాంటి విప్లవ వనితలను కూడా అప్పుడప్పుడూ అభినందిస్తూ జ్ఞప్తికి తెచ్చుకోవడం సమంజసమే మో!
మానవ హక్కుల కొరకు, ప్రజాస్వామ్యం కొరకు పోరాడే వారి పక్షాన నిలిచి, తిరుగుబాటు దారులతో చేతులు కలిపి, ప్రభుత్వం చేతికి చిక్కి, జైలు జీవితం గడుపుతున్న అమెరికన్ మహిళ లోరి బిరెన్సన్ ను ఇప్పుడిప్పుడే ప్రపంచ సమాజం గుర్తిస్తోంది. పాతిక సంవత్సరాల వయసుకే పెరు దేశపు విప్లవ వీరులతో సాన్నిహిత్యం పెంచుకుని, వారితో గొంతు కలిపిన నేరానికి, ఏడాది గడవకుండానే, పోలీసుల చేతికి దొరికి, గత పదిహేనేళ్లుగా జైలు జీవితం గడిపిన లోరి బిరెన్సన్ ఇటీవలే, పెరోల్ పై విడుదలై, తనకు శాశ్వత న్యాయం జరక్కపోతుందా అని ఎదురు చూస్తూ, ఏడాది వయసున్న కుమారుడితో జీవనం గడుపుతోంది.
"ప్రాతినిధ్య ప్రజాస్వామ్య గణతంత్రం" దేశంగా పిలువబడే పెరు, పశ్చిమ దిక్కు నున్న దక్షిణ అమెరికా దేశం. ఫెర్నాండో బౌలిండే నుంచి జనరల్ జువాన్ వెలాస్కో అల్వరాడోకు, ఆయన నుంచి జనరల్ ఫ్రాన్సిస్కో మొరేల్స్ బెర్ముడెజ్ కు అధికారం-పెత్తనం, ఒక్కో రకమైన సైనిక తిరుగుబాటులలో చేతులు మారింది తొలుత. ఆ తర్వాత, 1990-2000 మధ్య కాలంలో, ఆల్బర్టో ఫుజిమోరి అధ్యక్షుడుగా వున్న రోజుల్లో, ఆయన పాలనపై తీవ్ర నిరసనలు-ఆరోపణలు వచ్చాయి. ఆయన నిరంకుశుడని, అవినీతిపరుడని, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడేవాడని ఆరోపిస్తూ, ఆయనపై తిరుగుబాటు జరిగింది. ఆయన గద్దె దిగిన ఏడాదికి, ఆయన ఓటమికి కారణభూతుడైన అలెజాండ్రో టొలెడో అధ్యక్ష పీఠాన్నెక్కి ఐదేళ్లు పాలించాడు. గత ఐదేళ్లు గా అలన్ గార్షియా ప్రభుత్వం అధికారంలో వుంది. 18-70 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి వారు విధిగా ఓటింగులో పాల్గొనే నిబంధనున్న పెరు రిపబ్లిక్ ప్రత్యక్షంగా ప్రజలతో ఎన్నుకోబడే ప్రభుత్వం. అయినా ఆ దేశంలో, ఓ అమెరికన్ మహిళ గత పదిహేనేళ్లుగా, మానవ హక్కులను ఉల్లంఘించిన ఫుజిమోరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిందన్న నేరారోపణపై జైలు శిక్ష అనుభవించడం దురదృష్టం. ఆమె పేరే, లోరి బిరెన్సన్.
1996 లో పెరువియన్ మార్క్సిస్టు తిరుగుబాటు దారులకు సహకరించిందన్న నేరారోపణపై, సైనిక ప్రత్యేక న్యాయస్థానం ఆమెను విచారించి యావజ్జీవితఖైదు విధించింది. నాలుగున్నరేళ్ల అనంతరం, అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి, ఆమెపై పునర్విచారణ జరిపించి, శిక్షను ఇరవై సంవత్సరాలకు కుదించింది! 2010 మే నెలలో షరతులతో కూడిన పెరోలును ఆమెకు మంజూరు చేసిన న్యాయస్థానం, కొన్నాళ్లకు దాన్ని రద్దుచేయడం-తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ప్రస్తుతం ఆమె పెరోలు జీవితం గడుపుతోంది. 70,000 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఫుజిమోరి ప్రభుత్వాన్ని ధైర్యంగా ఎదుర్కొని పోరాడిన వారికి "ప్రతీకగా" లోరి బిరెన్సన్ ను పెరు దేశీయులు ఇప్పటికీ అభిమానిస్తారు-ఆరాధిస్తారు. అయినా ఆమెకు పూర్తి స్వేచ్ఛ-స్వాతంత్ర్యాలు లభించలేదింకా.
జైలు గోడల మధ్య శిక్షను అనుభవిస్తూనే, సహచర ఖైదీ, మిలిటెంటు భావాల ఏనిబల్ అపారీని 2003 లో వివాహం చేసుకుంది లోరి. వైవాహిక సంబంధమైన కలయికకు ప్రభుత్వం అనుమతివ్వడంతో, 2009 లో తల్లి కాగలిగింది. ఆమె కొడుకు-అమెరికా, పెరు దేశాల పౌరుడు, సాల్వడార్ కూడా ఆమెతో పాటే జైలులో వుండి అక్కడే పెరిగాడు. ఆమెను పెళ్ళిచేసుకున్న అపారీ ప్రస్తుతం విడుదలై, ఆమె న్యాయవాదిగా వ్యవహరిస్తున్నాడు. కారణాలే వైనా, ఇరువురూ విడాకులకు సిద్ధమౌతున్నారు. అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన ఇద్దరు ప్రముఖులు-బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యు బుష్, ఎంత తీవ్రమైన ఒత్తిడిని పెరు ప్రభుత్వంపై తెచ్చినా, ఆమెకు పూర్తి న్యాయం చేయలేకపోయారు. ఆమెను పెరోల్ మీద విడుదల చేయాలన్న నిర్ణయం పలువురిని ఆశ్చర్యంలో ముంచింది. ఆమె శిక్షాకాలం 2015 లో ముగుస్తుంది. పెరోల్ మీద బయటున్నా, ఆమె శిక్షను అనుభవిస్తున్నట్లే లెక్క.
న్యూయార్క్ లో జన్మించిన లోరి బిరెన్సన్ ఒక సామాజిక ఆందోళనకారిణి. ప్రతి వ్యక్తి మానవ హక్కులను సమాజంలో అందరూ గౌరవించాలన్నది ఆమె ప్రగాఢ నమ్మకం. పరిశోధన సంబంధమైన పనిలోను, రచనా వ్యాసంగంలోను, అనువాదం చేయడంలోను, సంపాదకీయ సంబంధిత పనిలోను లోరీకి ఆసక్తి వుంది. జైలు గోడల మధ్యనుంచి కూడా ఒకటి-రెండు అమెరికన్ మాగజైన్లకు ఆమె వ్యాసాలు పంపుతుండేది. లోరీకి 26 సంవత్సరాల వయసున్నప్పుడు, నవంబర్ 30, 1995 న, పెరువియన్ కాంగ్రెస్ భవనం నుంచి బయటికొచ్చి, స్థానిక బస్సులో ప్రయాణం చేస్తుండగా, ఆమెను నిర్బంధంలోకి తీసుకున్నారు మిలిటరీ పోలీసులు. తాను అమెరికా దేశానికి చెందిన పత్రికా విలేకరినని గుర్తింపు కార్డు చూపించింది లోరి బిరెన్సన్. ఆమెకు పెరు దేశంలోని "ఎం ఆర్టీఏ" విప్లవ సంస్థ కార్యకలాపాలతో ప్రత్యక్ష సంబంధాలున్నాయని, ఆ సంస్థ సభ్యులు తీవ్రవాదులని పోలీసులు ఆరోపించారు. నాలుగై దు వారాల అనంతరం ఆమెను పాత్రికేయుల ముందుకు తెచ్చారు. పెరు దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని, మానవ హక్కుల ఉల్లంఘనను నిరసిస్తూ, "ఎం ఆర్టీఏ" కేవలం ఒక విప్లవ సంస్థ మాత్రమేనని, అందులోని వ్యక్తులెవరు తీవ్రవాదులు కాదని లోరి గొంతు చించుకుని అరిచింది పాత్రికేయుల సమక్షంలో. అయినా ప్రయోజనం లేకపోయింది.
లోరి బిరెన్సన్ అరెస్టు చేసిన రోజుల్లో పెరు దేశాధ్యక్షుడుగా వున్న ఆల్బర్టో ఫుజిమోరికి, మానవ హక్కుల ఉల్లంఘన నేరారోపణపై, పదవీచ్యుతుడైన అనంతరం, 2009 లో పాతిక సంవత్సరాల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ప్రస్తుతం ఆయన శిక్షను అనుభవిస్తున్నాడు. అయినా లోరికి మాత్రం పూర్తిగా విముక్తి కలగ లేదు. యావజ్జీవిత శిక్షకు గురైన లోరి బిరెన్సన్ ను కలిసేందుకు ఆమె తల్లితండ్రులకు అనుమతి లభించలేదు. ఒక కార్గో విమానంలో-ఆ తర్వాత బస్సులో, సాయుధ సైనికుల కాపలాతో, ముఖాలు కనిపించకుండా ముసుగులు వేసి, కాళ్లు-చేతులు కట్టి పడేసి, పెరు దేశంలో పన్నెండువేల అడుగుల ఎత్తున వున్న పునో జైలుకు తరలించారు లోరి బిరెన్సన్ ను.
లోరి బిరెన్సన్ పెరు దేశానికి రావడానికి కారణం లేకపోలేదు. నికరాగువా, ఎల్ సాల్వడార్, గౌటెమాల దేశాల శరణార్థులకు రాజకీయ ఆశ్రయం కలిగించడానికి సంబంధించిన విధాన పరమైన అంశాలపై పరిశోధన చేస్తున్న మసాచ్యుసెట్స్ ప్రొఫెసర్ దగ్గర లోరి పనిచేసింది కొంతకాలం. అందులో భాగంగా, విద్యార్థుల అధ్యయన బృందం సభ్యురాలిగా, బిరెన్సన్, మూడు నెలలు ఎల్ సాల్వడార్ లో పర్యటించింది. తిరిగొచ్చిన అనంతరం, "ఎల్ సాల్వడార్ ప్రజల సంఘీభావ కమిటీ" లో, న్యూయార్క్, వాషింగ్టన్ నగరాల్లో పనిచేసింది. ఆ క్రమంలో, 1989 లో, ఎల్ సాల్వడార్ జాతీయ విమోచన ఫ్రంట్ లో పనిచేసేందుకు అక్కడకొచ్చింది. "ఎఫ్.ఎం.ఎల్.ఎన్" గా పిలువబడే ఆ ఫ్రంట్, ఐదు రకాల మార్క్సిస్టు గ్రూపుల ఐక్య సంఘటన. ఎల్ సాల్వడార్ "అల్పజన పాలన” కు వ్యతిరేకంగా జరుగుతున్న అంతర్యుద్ధంలో "ఎఫ్.ఎం.ఎల్.ఎన్" ఐక్య సంఘటన కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఎల్ సాల్వడార్ లో అధికారంలో వుంది ఆ ఫ్రంట్ పక్షాన ఎన్నికైన అభ్యర్థే. యుద్ధ విరమణ జరిగి, 1992 లో శాంతి ఒప్పందాలు కుదిరిన తర్వాత, ఆ ఫ్రంట్ కమాండింగ్ జనరల్ దగ్గర కార్యదర్శిగా చేరింది లోరి బిరెన్సన్. ఎవరి దగ్గరైతే ఆమె సెక్రటరీగా పనిచేసిందో, ఆ వ్యక్తే ఆ తర్వాత ఎల్ సాల్వడార్ ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. నిరంతరం పోరాట పటిమతో పనిచేయడంలో ఆసక్తి కలిగిన లోరి బిరెన్సన్, 1994 లో, ఎల్ సాల్వడార్ వదిలి, దక్షిణ అమెరికాలో విస్తృతంగా పర్యటించి, పెరు దేశం చేరుకుంది. ఆమె సాధించిన ఈ అనుభవమంతా, ఆమెకు పాతికేళ్లు నిండే లోపునే! ఆ దేశం వచ్చిన అచిర కాలంలోనే, జైలు శిక్షకు బలైంది.
పెరోల్ లభించి తాత్కాలిక స్వేచ్ఛా జీవితం గడుపుతూ, తాను అరెస్టు కావడానికి ముందు ఏడాది పాటు జరిగిన సంఘటనలను సవివరంగా చెప్పటానికి ఇష్టపడని లోరి, తనకు "ఎం ఆర్టీఏ" సభ్యులతో వున్న పరిచయాన్ని మాత్రం ధృవ పరుస్తోంది. తాను ఇష్టపూర్వకంగానే వారితో చేతులు కలిపానని, మానవ హక్కుల పరిరక్షణలో భాగంగానే తాను అలా చేశానని చెపుతోంది. కాకపోతే, తాను పెరువియన్ కాంగ్రెస్ భవనానికి ఎటువంటి తీవ్రవాద కార్యకలాపాలకొరకు వెళ్లలేదని, తన పాత్రికేయ వృత్తిలో భాగంగానే వెళ్లానని అంటున్నది. నవంబర్ 5, 2010 న పెరోల్ లభించడంతో, జైలులో తనతో పాటే వున్న కొడుకు సాల్వడార్ తో సహా, తన అపార్టు మెంటుకి చేరుకుంది లోరి. తన శిక్షకు సంబంధించి, పెరోల్ కు సంబంధించి తదుపరి కోర్టు వాయిదా కొరకు ఎదురుచూచింది. తలిదండ్రులు వారి ఉద్యోగాల కొరకు అమెరికాకు వెళ్లిపోయారు. జనవరి 24, 2011 న ఆమె పెరోల్ ను శాశ్వతంగా ధృవీకరించిన న్యాయస్థానం, 2015 వరకు దేశం (లిమా నగరం) వదిలి వెళ్లకూడదని ఆంక్షలు విధించింది.
ఏప్రియల్ 2002 లో మానవ హక్కుల అమెరికన్ కమీషన్, లోరి బిరెన్సన్ కు విధించిన శిక్ష విషయంలో తీవ్ర నిరసన తెలియచేసింది. తీవ్రవాద వ్యతిరేక చట్టాల అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఆమె కేసును విచారించలేదని తేల్చి చెప్పింది. అయినా ఫలితం శూన్యం. లోరి బిరెన్సన్ జైలులో వున్న పదిహేనేళ్లలో ఆమె కుటుంబంలోను, బాహ్య ప్రపంచంలోను మార్పులొచ్చాయి. తలిదండ్రులు మధ్య వయస్కులయ్యారు. సాంకేతికంగా చోటుచేసుకున్న మార్పులను 41 సంవత్సరాల వయసున్న లోరి క్రమేపీ అర్థం చేసుకుంటున్నది. యవ్వన జీవితంలో చాలా భాగం ఆమె కోల్పోయింది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులొచ్చాయి. లాటిన్ అమెరికాపై ఆమెకున్న అభిమానం, ఏదో చేయాలన్న తపన అలానే మిగిలిపోయింది. పెరు దేశానికి వచ్చి, తాను సాధించాలనుకున్న కోరిక ఇంకా పూర్తవలేదు. తనతో సహా, కొడుకు బాధ్యత ఆమెపైనుందిప్పుడు.
జైలులో వుంటూనే, సామాజిక న్యాయం, మానవ హక్కులకు సంబంధించిన అంశాలపై తన అభిప్రాయాలను బహిర్గతం చేస్తూండేది లోరి. పెరు దేశంలో, న్యాయ విచారణకు ఆస్కారం లేనే లేదని వాదించేది. జైలులో ఆమెను పలురకాలుగా హింసించారు. శారీరకంగా ఆమెపై జరిగిన హింసను, "కఠినమైన, అతి క్రూరమైన, హీనమైన, అవమానకరమైన" చర్యలుగా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు వర్ణించాయి. పెరు జైళ్లలో ఆమె తోటి ఖైదీల పరిస్థితి కూడా అంతేనట. శిక్షకు పూర్వం నిర్బంధంలో వుండగా, శిక్ష విధించిన అనంతరం జైళ్లలో వుండగా ఖైదీల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అత్యంత హేయమైనవని లోరి అంటున్నది. ఆమె తన ముందున్న అన్ని రకాల అవకాశాలను కోల్పోయి, అలసి-సొలసి పోయింది. ఇక ఆ దేశాధ్యక్షుడు ఆమెకు క్షమా బిక్ష ప్రసాదించడం మినహా మరే అవకాశం లేదిప్పుడు. అదే జరుగు తే, కనీసం రాబోయే ఐదేళ్ల కాలంలోనైనా, ఆమె తిరిగి కోలుకుని, జీవితంలో తాను సాధించ దల్చుకున్న మార్గంలో పయనించే అవకాశం కొంతైనా కలుగుతుంది. ధైర్యమే లోరి బిరెన్సన్ కు రక్ష.
What is the definition of "విప్లవ వనిత" and "విప్లవ purushuDu"?
ReplyDeleteDon't you think that every day "common man" and "common women" who are fighting for survival of their existence against most corrupt Indian politicians and bureaucrats are the real "విప్లవ human beings"?!.
They are all "విప్లవ వనిత"s ...Yes...But, this woman is slightly more than them... Not that she alone is.
ReplyDeleteThanks for the interest evinced.
Regards, Jwala