కౌన్సిల్ ఎన్నికలు వైకుంఠపాళి స్థానిక సమరంలో విరిగిన ‘చేయి’
వనం జ్వాలా నరసింహారావు
(సూర్య దినపత్రిక:25-03-2011)
విజయ రహస్యాలు ఎన్నికల సంఘాలకు తెలియవా?, పెద్దల సభా, పునరావాస కేంద్రమా!
మొత్తమంతా రాజకీయ నేపథ్యమే!, ప్రత్యర్థుల ఓటమే లక్ష్యమా?
ఓపెన్ సీక్రెట్ బ్యాలెట్‌గా మారిన తతంగం
గెలుపు-ఓటములు దైవాధీనం అనే నానుడి పచ్చి అసత్యం. నూటికి మరో నూరు పాళ్లు అవి మానవాధీనం అని ఘంటా పధంగా చెప్పడానికి ఇటీవల జరిగిన మూడు రకాల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఉపాధ్యాయ-పట్టభద్రుల నియోజక వర్గాల నుంచి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కాని, ఎమ్మెల్యేల కోటా ఎన్నికలు కాని, స్థానిక సంస్థల కోటావి కాని...ఆ మాట కొస్తే భవిష్యత్ లో జరగబోయే మరి కొన్ని ఈ మోస్తరు ఎన్నికలు తీరుతెన్నులు కాని, కేంద్ర-రాష్ట్ర ఎన్నికల సంఘాలు కించిత్తైనా గమనిస్తున్న దాఖలాలు అసలు లేనే లేవు. ఏ పార్టీ అభ్యర్థులు-ఎంత మంది-ఎలా గెలిచారనేది ఇంగిత జ్ఞానం వున్న ప్రతివారికి ఆసాంతం తెలిసిన విషయమే అయినా, ఎన్నికల సంఘానికి మాత్రం చీమ కుట్టినట్లయినా లేదు. "పెద్దల సభ” కు ఎన్నికయ్యేది "పెద్దలు” కాదని, అది కేవలం "రాజకీయ నాయకుల పునరావాస కేంద్రం" అని భావించిన స్వర్గీయ ఎన్ టీ రామారావు తెలుగు దేశం అధికారం చేపట్టిన తక్షణమే దాన్ని రద్దు చేయించారు. సభను పునరుద్ధరించడానికి బహిరంగంగా అయిష్టం వ్యక్తం చేసిన ఎన్ టీ రామారావు వారసులు, మనస్సులో ఒకింత సంతోష పడి, సభను రాజకీయ వేదికగా మలచడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ఫలితమే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఆ పార్టీ-ఈ పార్టీ అన్న తేడా లేకుండా, ఉపాధ్యాయ-పట్టభద్రుల-ఎమ్మెల్యే-స్థానిక సంస్థల కోటాలో అభ్యర్థుల గెలుపు-ఓటములు. ఎన్నికల నిబంధనలతో సంబంధం లేకుండా, సాంప్రదాయాలను ఏ మాత్రం గౌరవించకుండా, తమ గెలుపు-ప్రత్యర్థుల ఓటమే లక్ష్యంగా జరిగిన ఎన్నికలు భవిష్యత్ భారతానికి ఇస్తున్న సంకేతం-సందేశం ఏదైనా వుందా?
ఉపాధ్యాయుల సమస్యలకు తోడు, దైనందిన ఇతర ప్రజా సమస్యల విషయంలో కూడా, రాజకీయాలకు అతీతంగా విశ్లేషణాత్మకమైన తమ మేధో సంపదను చట్ట సభలకు అందించి, విలువైన పాలనా పరమైన సూచనలను ప్రభుత్వానికి అందించేందుకు, ఉపాధ్యాయ వృత్తికి చెందిన వారినే ఎమ్మెల్సీలుగా ఎన్నుకునేందుకు ఎగువ సభలో కొంత కోటా ఏర్పాటయింది. అదే విధంగా పట్ట భద్రులకూ కొంత కోటా వుంది. అయితే జరుగుతున్న దేంటి? ఈ రెండు కోటాల్లోను, ఎవరో ఒకరిద్దరి విషయం మినహాయించి, పోటీకి దిగిన ప్రతివారూ, ఏదో ఒక రాజకీయ పార్టీ మద్దతు లేకుండా, రంగంలోకి దిగడం లేదు-దిగ లేకపోతున్నారు. ఈ కోటాల్లో కూడా, అభ్యర్థుల ఎంపిక పూర్తిగా రాజకీయ నేపధ్యంలోనే జరుగుతోంది. అంతవరకు బాగానే వుంది. వీరి విషయంలో కూడా ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా నైనా క్యాంపు రాజకీయాలకు తెర లేచింది. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే స్థితికి చేరుకుంది వ్యవహారం. కాంగ్రెస్ సమ్మతి-అసమ్మతి వర్గ అభ్యర్థులు, జగన్ వర్గం అభ్యర్థులు, టిడిపి అభ్యర్థులు, వీరి మద్దతు అంతో-ఇంతో కూడగట్టుకున్న మిత్ర పక్షాల అభ్యర్థులు రంగంలోకి దిగి, ప్రత్యర్థుల ఓటమికి కృషి చేశారు. తమ గెలుపు లక్ష్యం కన్నా, ఇతరుల ఓటమే లక్ష్యంగా జరిగిన ఎన్నికలివి. సరే అంచనాలు కొందరి విషయంలో అనుకూలంగాను, మరి కొందరి విషయంలో తారు-మారుగాను జరగడంతో, ఓడిన వారి పక్షాన నిలిచిన రాజకీయ పార్టీ నాయకుల కన్ను ఎమ్మెల్యే కోటా ఎన్నికలపై పడింది. అదో తతంగం.
ఎమ్మెల్యేల కోటాలో పది మంది ఎమ్మెల్సీలను ఎన్నుకునేందుకు మాత్రమే వీలుండగా, అన్ని పార్టీలకు చెందిన రాజకీయ చాణక్యులు, వారి-వారి అనుకూల కూటముల అవగాహన (రాహిత్యం) ప్రకారం, కలిమిడిగా-విడి విడిగా, పన్నెండు మంది అభ్యర్థులను రంగంలో దింపారు. సంఖ్యాపరంగా ఖచ్చితంగా గెలిచే స్థానాలు కాంగ్రెస్-ఎంఐఎం-ప్రజారాజ్యం పార్టీ కూటమికి ఏడు కాగా, టిడిపి-సీపీఐ కూటమికి మూడున్నాయి. ఈ రెండింటితో సంబంధం లేని తెరాస పార్టీకి కాని, వారికి మద్దతిచ్చిన బిజెపికి కాని, ఇదమిద్ధమైన సంఖ్యా బలం లేని జగన్ వర్గానికి కాని తమ అభ్యర్థిని గెలిపించుకునే అవకాశం లేదు. వ్యూహాత్మకంగా జగన్ వర్గం రంగంలోకి దిగకుండా, జాగ్రత్తగా పావులు కదిపింది. తెరాస-బిజెపి కూటమి ఒక అభ్యర్థిని, తెలుగు దేశం పార్టీ అదనంగా మరో అభ్యర్థిని రంగంలోకి దింపాయి. సాధారణంగా బలాబలాలు స్పష్టంగా వున్నప్పుడు ఏకగ్రీవంగా జరిగే నిర్ణయం, ఈ సారి, ఎన్నికల ద్వారా తీసుకోవాల్సిన అవసరం పడింది. గెలుపుపై ధీమా-ఓటమిపై గుబులు-నమ్మకం-అప నమ్మకం అన్ని పార్టీలలో చోటు చేసుకుంది. తప్పకుండా ఓడుతామని తెలిసిన తెరాస-బిజెపి కూటమితో సహా, అన్ని పార్టీలు, తమ-తమ ఎమ్మెల్యేలను తమదైన శైలిలో "కట్టుబాట్ల" లో వుంచే ప్రయత్నం చేశాయి. "సీక్రెట్ బాలెట్" కాస్తా "ఓపెన్ సీక్రెట్ బాలెట్" గా మారి పోయింది. ఎమ్మెల్సీ ఎన్నిక నియమావళికి విరుద్ధంగా జరిగింది. ఆసాంతం పర్యవేక్షించాల్సిన ఎన్నికల సంఘం నోట మాట లేదు. ఎవరినీ తప్పు పట్టలేని స్థితికి చేరుకుంది. గెలిచిన వారు, ఓడిన వారు ఒకే తప్పు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతి పక్ష పార్టీల వారు, తమ చేతిలో వున్న "క్రాస్ ఓటింగు" ఆయుధాన్ని యధేఛ్చగా వాడుకున్నారు. తాము ఓడి పార్టీని ఓటమి పాలు చేసిన వారు కొందరైతే, పార్టీని ఓడించి తామూ ఓటమి పాలైన వారు మరి కొందరయ్యారు. రహస్య బాలెట్ కు అపహాస్యం జరిగిన ఈ ఎన్నికను ఆసాంతం ఎన్నికల కమీషన్ సమీక్షించక పోతే, భవిష్యత్ లో "సాధారణ ఎన్నికల్లో కూడా ఇలానే జరగడం తథ్యం".
రంగంలోకి దింపిన అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నంలో పడ్డ పార్టీలు ఎన్నికల నియమావళిని అతిక్రమించాయనడానికి ప్రత్యక్ష నిదర్శనం బహిరంగంగా ఆయా పార్టీల నాయకులు తమ-తమ ఎమ్మెల్యేలకు "కోటాలు-కోడ్ లు" ఏర్పాటు చేయడమే. గతంలో కేవలం పార్టీల అంతర్గత వ్యవహారంగా వుండే ఈ విధానం, అవధులు దాటి, ఫలానా ఎమ్మెల్యేను-ఫలానా ఎమ్మెల్సీ అభ్యర్థికి "మాత్రమే" ఓటెయ్యాలని నిబంధన విధించడంతో పాటు, వారు పార్టీ చెప్పిన ప్రకారం వేశారా-లేదా తెలుసుకోవడానికి "రహస్యమైన కోడ్" ని ఆయా ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేశామని ప్రకటన చేసే దాకా వచ్చింది. రహస్య బాలెట్ అన్నప్పుడు రహస్యంగా వుంచాలి. కాదనుకున్నప్పుడు ఓపెన్ బాలెట్ పెట్టి బలా-బలాలు తేల్చుకోవాలి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక రెండూ కాకుండా పోయింది. సాక్షాత్తు అధికార పార్టీ, తమ ఎమ్మెల్యేలకు కోడ్ విధించిన విషయం బాహాటంగా ప్రకటించగా, బాధ్యతాయుతమైన ప్రతి పక్ష పార్టీ అదే పని చేయడం దురదృష్టం. అదే పనిని ఓడి పోతామని తెలిసిన తెరాస కూడా చేసింది. ఇంత జరిగినా, "కోడు-గీడు" పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించిన పలువురు ఎమ్మెల్యేలు, "తమకు నచ్చిన"-"తమనే నమ్మిన" అభ్యర్థికి ఓటు వేశారు. ఫలితంగా, అధికారిక కోటాకన్నా అధికంగానో, తక్కువగానో దాదాపు అందరు (గెలిచిన-ఓడిన) అభ్యర్థులు ఓట్లున్నాయి. తమ బలం కంటే మూడు రెట్లు ఓట్లు ఎంఐఎం పార్టీ తెచ్చుకుంటే, కేటాయించిన దానికంటే, ఒక కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కువ ఓట్లు తెచ్చుకోవడం సాక్షాత్తు ముఖ్యమంత్రినే ఆశ్చర్య పరిచింది. అదే పరిస్థితి తెలుగు దేశంలోను ఏర్పడింది. ఫలితంగా ప్రతిభా భారతి ఓటమి, మహమ్మద్ జానీ గెలుపు ప్రపంచకప్పు క్రికెట్ పోటీలను తలపించాయి. కధ ఇంతటితో ఆగ లేదు. ఒక కాంగ్రెస్ అభ్యర్థికి కేటాయించిన దానికంటే ఎక్కువగా వచ్చిన ఓట్లు తెరాస పార్టీవని, ఆ పార్టీకి చెందిన ముగ్గురు క్రాసు ఓటింగుకు పాల్పడ్డారని, వారి ముగ్గురి ని పార్టీ నుంచి సస్పెండు చేశారని, మర్నాడు బయట పడింది. తప్పు చెయ్యమని (కోటా కేటాయించడం) పార్టీ నాయకులు చెప్పినప్పుడు, ఆ తప్పును తమకు ఇష్టమొచ్చిన (తాము అనుకున్న అభ్యర్థికి) వారికి ఓటెయ్యడం ద్వారా చెయ్యడంలో తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యేలు.
స్థానిక సంస్థల ద్వారా శాసనమండలికి జరిగిన ఎన్నికలు మరో తతంగం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇరకాటంలో పడింది. అభ్యర్థులను గెలిపించలేక పోయారన్న నింద సంబంధిత మంత్రులపై అంతో-ఇంతో పడింది. వారికి జిల్లాల్లో పట్టులేదన్న కారణాన ఓటమికి దారితీసిందంటే, "కాంపుల నిర్వహణ" లో వారి బలహీనత బహిర్గతమైందనుకోవాలి. కాంపుల నిర్వహణంటే డబ్బుల పంపకం, ఇచ్చిన డబ్బులకు ప్రతిఫలం దక్కేందుకు అదో రకమైన "కోడ్" వుండే వుండాలి. అయినా అనుకున్న ఫలితాలు దక్కలేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాలో కూడా పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి రావాలని భావించిన పార్టీకి ఉభయ గోదావరి జిల్లాలలో బలం స్పష్టంగా వుండాలి. ఈ రెండు జిల్లాల్లో కనీసం ఒక్క సీటు కూడా గెల్చుకోలేక పోయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీలు ఓటమికి బాధ్యత ఎవరిదనే విషయంలో ఇప్పుడిప్పుడే స్పష్టత రాదు. అది ఆ పార్టీకున్న ప్రత్యేకత. జగన్ వర్గం ఓడిందా-గెలిచిందా అంటే, ప్రజా స్వామ్యంలో, ఒక్క ఓటుతో గెలిచినా గెలుపే కనుక, గెలిచిందనే అనాలి. కడపలో బలం తగ్గిందా అంటే, ఈ గెలుపుతో ఆ వర్గం కనీసం భవిష్యత్ లో నన్నా బలపడుతుందని చెప్పక తప్పదు. కాకపోతే జగన్ వ్యతిరేక కాంగ్రెస్ నాయకత్వం గట్టి పోటీ ఇచ్చింది.
ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన మిశ్రమ ఫలితాలు నిరాశ పరిచాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా అన్నారు. ఆరు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని బావించిన సీఎంకు మూడు స్థానాల్లోనే గెలవడం, భవిష్యత్ లో నన్నా మరింత బలపడమని ఆయనకు పరోక్ష సంకేతం అనుకోవాలి. టీచర్, గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఒక్కరినీ గెలిపించుకోలేని జగన్‌కు సరికొత్త వూపిరినిచ్చింది ఈ ఎన్నికలు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బేనని ముఖ్యమంత్రి అంగీకరించారు. "కాంగ్రెస్ ఓడిపోదని... ఓడించబడుతుందని ఈ ఫలితాలు మరోసారి రుజువు చేశాయి'' అని కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పూర్తిగా తనమీదే వేసుకున్న ముఖ్యమంత్రి "తానోడి పార్టీని ఓడించెనా? పార్టీ ఓటమితో తానూ ఓడనున్నాడా?". మరింత బలపడడానికి ఈ ఎన్నికలు కారణం కానున్నాయా? తేల్చాల్సింది ఆయన నాయకత్వంలోని కాంగ్రెస్ నాయకులే. గెలుపు ఓటములు ఎప్పుడూ దైవాధీనం కాదని, మానవాధీనం కూడా అని ఎమ్మెల్సీ ఎన్నికలు నిరూపించాయి.
No comments:
Post a Comment