అణు విపత్తు మానవ తప్పిదం అంటున్న నిపుణులు
వనం జ్వాలా నరసింహారావు
మార్చ్ 11, 2011 న జపాన్ తీరప్రాంతంలో సంభవించిన సునామీ-భూకంపం దరిమిలా చెలరేగిన అణు సంక్షోభం చేజారిపోతోంది. పరిస్థితి విషమిస్తోంది. ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రంలో రేడియేషన్ స్థాయి తీవ్రమైంది. హెలికాప్టర్ సహాయంతో రి యాక్టర్ పై నీళ్లు చల్లేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. ఇంధన కడ్డీలను చల్లార్చేందుకు హెలికాప్టర్ల ద్వారా బోరిక్ యాసిడ్ చల్లే అవకాశాలను కూడా అధికారులు పరిశీలించారు. ఫుకుషిమా విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే కలుషిత గాలి, రష్యా మీదుగా వెళుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అమెరికా కాలిఫోర్నియాకు చేరవచ్చనీ అంటున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో, ఇంతవరకూ ఎన్నడూ, కనీ-వినీ ఎరుగని రీతిలో, దేశంలో వున్న మిలిటరీ సిబ్బందిలో సగానికి పైగా-సుమారు లక్ష మందిని సహాయ-పునరావాస కార్యక్రమాలకు పురమాయించింది జపాన్ ప్రభుత్వం. అమెరికా దేశానికి చెందిన న్యూక్లియర్ ఆధారిత "రొనాల్డ్ రీగన్"(విమానాలు మోసుకెళ్ళే నౌక) తన వంతు సహాయం చేయడానికి అక్కడకు చేరుతుందంటున్నారు. రోజులు గడుస్తున్నా కొద్దీ పరిస్థితులు తీవ్రమవుతున్నాయే కాని తగ్గే సూచనలు అంతగా కానరావడం లేదని వార్తలొస్తున్నాయి. జపాన్ దేశంలోని వయసు మీరిన కురువృద్ధులకు, రెండవ ప్రపంచ యుద్ధం నాటి విధ్వంసం గుర్తుకొస్తుండొచ్చు.
టోక్యో-జపాన్ అధికారులు చెప్తున్నదానికంటే ఎన్నో రెట్లు అధికంగా విధ్వంసానికి గురైన రి యాక్టర్ల దుష్ప్రభావం వుందని, ప్రభుత్వం సూచించిన దానికంటే, ఆ ప్రాంతానికి మరింత దూరంగా అక్కడ నివసిస్తున్న అమెరికన్లు వెళ్లిపోవాలని, అమెరికా అణు నియంత్రణ కమీషన్ అధ్యక్షుడు అనడాన్ని బట్టి పరిస్థితిని అంచనా వేయవచ్చు. ఆ ప్రకటన ఇరు దేశాల మధ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపొచ్చు. అమెరికన్ అధికారులు చెప్పేది నిజమై తే, చెడిపోయిన రి యాక్టర్లు శాశ్వతంగా జలంతో నింపివేయాల్సిందే నట. విడుదలవుతున్న రేడియో ధార్మిక శక్తి ప్రభావం వల్ల, చెడిపోయిన రి యాక్టర్లే కాకుండా, మిగిలిన వాటికి కూడా నష్టం వాటిల్లుతోంది. ఏదేమైనా, దైచీ పరిసర ప్రాంతాలతో సహా, సుదూరంలోని కొన్ని ప్రాంతాలకు కూడా కొంతకాలం పాటు ముప్పు తప్పదు. కాకపోతే వాస్తవాలు బయట పడే విషయంలోనే భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. నగరాలకు-నగారాలే తుడుచిపెట్టుకు పోయే పరిస్థితుల్లో కూడా, జపాన్ ప్రభుత్వం పరిస్థితిని తక్కువ అంచనా వేసి చెప్పడం బాహ్య ప్రపంచానికి నచ్చడం లేదన్న వార్తలొస్తున్నాయి. అధికారిక ప్రతిస్పందన విషయంలో నిర్లిప్తత ధోరణిని ప్రదర్శించడం జపాన్ ప్రభుత్వానికి ఆనవాయితీ అని చరిత్ర చెపుతోంది. 1995 లో సంభవించిన భూకంపం సమయంలోను, ఆ తర్వాత రెండేళ్లకు టోక్యో సమీపంలో జరిగిన విమాన ప్రమాదం విషయంలోను జపాన్ కనబర్చిన నిర్లిప్తతను ప్రపంచ దేశాలు గుర్తుచేసుకుంటున్నాయి. అప్పట్లో, భూకంపం సంభవించినప్పుడు, వైద్య సహాయం చేయడానికి వచ్చిన అమెరికన్ డాక్టర్లను, జపాన్ ప్రభుత్వం లైసెన్సు లేదన్న మిషతో, అనుమతి ఇవ్వలేదు. మూడు రోజుల తర్వాత చట్టాన్ని సవరించి వారికి అనుమతి ఇచ్చారట. కారణాలే వైనా, గత గుణపాఠాల నేపధ్యంలో, ప్రస్తుతం జపాన్ ఆలోచనా ధోరణిలో కొంత మార్పొచ్చింది. విదేశీ సహాయం పొందడంలో చొరవ తీసుకుంటున్నప్పటికీ, సమాచారం ప్రజలకు తెలియచేసే విషయంలో మాత్రం నిజాయితీ లోపాలింకా కనిపిస్తున్నాయి. బహుశా దీనికి కారణాలుండవచ్చు. మాంద్యం కలుగజేయడం, కలవర పరచడం, అర్థం కాకుండా చేయడం, మసకబరచడం జపాన్ అధికారిక సమాచార వ్యవస్థ ప్రత్యేకత.
ఫుకుషిమా పరిస్థితులు కొంత కుదుట పడిన తర్వాత, దైచీ అణు విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అత్యవసర తీవ్రత తగ్గింతర్వాత, దీనంతటికీ కారణమైన "టోక్యో విద్యుత్ సంస్థ" (టెప్కో), దానికి బాధ్యతలను అప్పగించిన జపాన్ ప్రభుత్వం ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోక తప్పదు. అత్యంత నిబ్బరంతో-ఆత్మ విశ్వాసంతో, ఎవరూ ఊహించని విధంగా, ఆరు అణు రి యాక్టర్ల "ఫుకుషిమా సముదాయాన్ని" భూకంపాల-సునామీల తాకిడిని తట్టుకోలేని ప్రతికూల క్షేత్రం పరిసరాల్లో నిర్మించి, "టోక్యో విద్యుత్ సంస్థ" చాలా పొరపాటు చేసింది. తీవ్ర అసహనంతో ఉడికిపోతున్న జపాన్ పౌరులు, ఆ మాటకొస్తే అంతర్జాతీయ పౌరులు, వాటి నిర్మాణానికి జపాన్ ప్రభుత్వం టెప్కోకు ఎలా అనుమతినిచ్చిందో తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్నారు. "అణు విపత్తులను కప్పిపుచ్చే ప్రయత్నాలను" టెప్కో సంస్థ ఎంత చాకచక్యంగా చేస్తున్న దో సవివరంగా తెలియచేసే ఆసక్తికరమైన సమాచారం, ప్రపంచ సామ్యవాద వేదికకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ లో లభ్యమవుతుంది.
ప్రపంచంలోని విద్యుత్ సంస్థల్లో నాలుగో అతి పెద్ద సంస్థ టెప్కో. ఆసియా ఖండంలో అదే అతి పెద్దది. 17 న్యూక్లియర్ రి యాక్టరులను నిర్వహిస్తూ, జపాన్ విద్యుత్ అవసరాల్లో మూడో వంతు సమకూరుస్తున్న టెప్కో, జపాన్ ప్రభుత్వ అండ దండలతో, సహాయ సహకారాలతో, ఒక వైపు కార్పొరేట్ లాభాలను ఆర్జించు తూ, మరో వైపు బధ్రతా చర్యలను కట్టుదిట్టంగా ఉల్లంఘించు తూ, ప్రజల ప్రాణాలను-ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి, చాకచక్యంగా తన తప్పులను కప్పిపుచ్చుకుంటున్నది. టెప్కో చేస్తున్న పనిని తప్పు పట్టిన వారిని వేధించడం, వ్యతిరేకించిన వారిని అణచి వేయడం, ప్రచార-ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకుని విమర్శలను బయటకు పొక్కకుండా చేయడం ఆ సంస్థ అధికారులకు వెన్నతో పెట్టిన విద్య. దానికి తోడు ప్రభుత్వ పరోక్ష మద్దతు పుష్కలంగా లబిస్తోంది. సంస్థ బాహాటంగా ఒప్పుకున్న అణు రి యాక్టర్ల సంబంధిత తప్పిదాలు ఈ పాటికే సుమారు 200 పైగా వున్నాయి. 2007 లో ఇంతకంటే తక్కువ తీవ్రతతో భూమి కంపించినప్పుడు, అలాంటి తీవ్రతకు తట్టుకునే శక్తిలేని రీతిలో నిర్మాణం జరిగినట్లు సంస్థ అంగీకరించింది కూడా. అయినా ఆ తర్వాత తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం శోచనీయం. వరుస జపాన్ ప్రభుత్వాల పుణ్యమా అని గత 40 సంవత్సరాలలో, టెప్కో చేయని తప్పు లేదు. 1955 నుంచి 2009 వరకు అధికారంలో వున్న లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ ప్రభుత్వాధినేతల మద్దతుతో, పర్యావరణ నిపుణుల-స్థానికుల ఆక్షేపణలను పరిగణలోకి తీసుకోకుండా, జపాన్ విద్యుత్ అవసరాలను తీర్చేందుకన్న నెపంతో, ప్రపంచంలోనే అతి తీవ్ర స్థాయిలో భూకంపాలకు గురయ్యే ప్రమాదమున్న ప్రాంతాల్లో, సుమారు 50 కి పైగా, అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించింది టెప్కో సంస్థ! జపాన్ సామ్రాజ్యవాద అవసరాల కొరకు ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టాయి ప్రభుత్వం, టెప్కో సంయుక్తంగా.
1995 లో ఒక రి యాక్టర్ లో జరిగిన సోడియం విస్ఫోటనం ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. 1999 లో టొకైముర యురేనియం ప్రాసెసింగ్ యూనిట్ లో సంభవించిన దారుణమైన ప్రమాదం అనంతరం భద్రతా లోపాలున్నాయని ప్రభుత్వం కూడా అంగీకరించింది. తప్పుల తడక సాంకేతిక పరమైన సమాచారం అందించడం టెప్కోకు, సంస్థ చేస్తున్న తప్పులపై మొసలి కన్నీరు కార్చడం ప్రభుత్వానికి అలవాటుగా మారింది. సంస్థ చేపట్టిన అంతర్గత దర్యాప్తులో, రి యాక్టరులలో అడపాదడపా చోటు చేసుకున్న పలు ప్రమాదాలను పై అధికారుల దృష్టికి రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు, మార్చ్ 2007 లో బయట పడింది. జరిగిన దానికి బహిరంగ క్షమాపణ చెప్పిన సంస్థ తన కార్యకలాపాలను కొనసాగించింది. ప్రమాదాల దిశగా మరింత ముందుకు సాగింది. ఫలితంగా, జులై 2007 నాటి భూకంపానికి, ఒక అణు విద్యుత్ కేంద్రం నిర్మాణ లోపాలు బయట పడడం, నీటి పైపులు పగిలి పోవడం, అగ్ని ప్రమాదం సంభవించడం, రేడియో ధార్మిక శక్తి వెలువడడం, సముద్రం-పరిసరాలు కలుషితం కావడం, ఈ నాటి దుష్పరిణామాలే ఆ నాడు కూడా కొంచెం తక్కువ స్థాయిలో చోటుచేసుకోవడం జగ మెరిగిన నిజం. గుడ్డిలో మెల్లగా, భూకంప కేంద్రం తీవ్ర ప్రమాదం కంటే కొద్ది దూరంలో వుండడం వల్ల, పెను ముప్పు తప్పింది.
ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ కేంద్రాన్ని మూసి వేయాల్సి వచ్చింది. మొట్ట మొదటి సారి టెప్కో సంస్థ నష్టాల్లోకి పోయింది. ఆ నష్టం కొనసాగి, ప్రస్తుత అంచనాల ప్రకారం, కోట్లాది డాలర్ల అప్పుల్లో కూరుకు పోయింది టెప్కో. ఇటీవలి పరిణామాలకు కారణ భూతమైన టెప్కో సంస్థను, బహిరంగంగా ప్రధాన మంత్రి విమర్శిస్తున్నప్పటికీ, ప్రభుత్వానికి-సంస్థకు మధ్య చాలాకాలంగా నెల కొన్న "భాగస్వామ్యం" భవిష్యత్ లో మరిన్ని దుష్పరిణామాలకు దారితీస్తుందనడంలో అనుమానం లేదు. జపాన్ దేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లో కూడా టెప్కో ద్వారా అణు కేంద్రాల నిర్మాణానికి, తన వంతు సహకారాన్ని అందిస్తోంది జపాన్ ప్రభుత్వం. వియత్నాం, థాయిలాండ్, అమెరికా లలో తన వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ఒప్పందాలను కుదుర్చుకుంది టెప్కో. జపాన్ లో కూడా 2014-2015 మధ్య కాలంలో, 2015-2018 లో మరో ఆరు అణు విద్యుత్ కేంద్రాలను ఆరంభించడానికై, నిర్మాణం చేపట్టేందుకు టెప్కోకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అక్కడ నివాసముంటున్న స్థానికుల నిరసనల మధ్య, అర్థ రాత్రి నిర్మాణం పనులు చేపట్టింది సంస్థ. ఆ ప్రాంతంలోనే ఇటీవల అగ్ని పర్వతం పేలింది కూడా.
ఒక బలీయమైన పారిశ్రామిక శక్తిగా ఎదగడానికి జపాన్ దేశానికి ఎన్నో అనుకూలతలు చేకూరాయి. చైనాతో యుద్ధం, రష్యాతో యుద్ధం దరిమిలా, తైవాన్-కొరియా దేశాలను తన అధీనంలో తెచ్చుకుంది జపాన్. మొదటి ప్రపంచ యుద్ధం జపాన్ విస్తరణకు దోహదపడింది. 1931 లో మంచూరియాని ఆక్రమించుకుంది. అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపధ్యంలో నానా దేశాల కూటమి నుంచి వైదొలగింది. 1936 లో నాజీ జర్మనీతో ఒప్పందం కుదుర్చుకున్న జపాన్ మరుసటి ఏడాది చైనాపై దాడి చేసింది. డిసెంబర్ 7, 1941 న పెర్ల్ హార్బర్ నావల్ బేస్ పై దాడి చేసి, అమెరికా-ఇంగ్లాండ్-నెదర్లాండ్ దేశాలపై యుద్ధాన్ని ప్రకటించింది. పర్యవసానంగా అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలోకి దిగింది. మంచూరియాపై సోవియట్ దాడి, హిరోషిమా-నాగసాకిలపై 1945 లో అమెరికా అణుబాంబు దాడి నేపధ్యంలో ఆ ఏడాది ఆగస్టు 15 న, జపాన్ బేషరతుగా లొంగిపోయింది. ప్రపంచ యుద్ధ ప్రభావం జపాన్ పై తీవ్రంగా పడింది. పారిశ్రామికంగా, మౌలిక సదుపాయాల పరంగా దెబ్బ తినడం తో పాటు, లక్షలాది పౌరుల ప్రాణాలు పోయాయి. 1947 లో నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న జపాన్, సరళీకృత ప్రజాస్వామ్య పద్ధతులను పాటిస్తోంది. ఐక్య రాజ్య సమితిలో సభ్యత్వం పొందింది. గణనీయమైన అభివృద్ధి చెందుతూ, ప్రపంచం దేశాలలో ఆర్థికంగా రెండో స్థానానికి చేరుకుంది. ఇంతలో, మార్చ్ 11, 2011 న సునామీ-భూకంపాల ప్రకృతి వైపరీత్యానికి, వెనువెంటనే, అణు విద్యుత్ కేంద్రాల ప్రమాదం రూపంలో మానవ తప్పిదానికీ గురైంది. తన దేశ వాసులకు, ఇతర దేశాల వారికీ నష్టం కలిగించింది.
జపాన్ విషాదం నుంచి అణు విద్యుత్ కావాలని కోరుకుంటున్న దేశాలు గుణపాఠం నేర్చుకుంటే మంచిది. ముఖ్యంగా అమెరికా అణు కోరికల గుర్రానికి సంకెళ్లు వేయడం తప్పనిసరి. సాంకేతికంగా ఎంతో ముందున్న జపాన్ దేశంలో ఇంత ప్రమాదం జరిగిన నేపధ్యంలో, అమెరికాను అనుకరించే మరి కొన్ని ఇతర దేశాలు కూడా పునరాలోచన చేయాలి. అమెరికాలో సుమారు 30 అణు రి యాక్టరుల డిజైన్లు, మొన్న జపాన్ లో ప్రమాదానికి గురైన వాటి నమూనాను పోలినవే. అమెరికాలో అవి నెలకొల్పబడుతున్న ప్రదేశాలు కూడా జపాన్ ఫుకుషిమా దైచీ లాంటివే. చాలా దేశాల ఇంధన విధానం వాస్తవాల ప్రాతిపదికగా రూపొందించడం జరగడం లేదు. అవసరాలకు కావల్సినంత విద్యుత్ ఉత్పత్తి కావడం లేదన్న భయంతో, ఏ రకమైన విద్యుత్ ఉత్పత్తైనా పరవాలేదని-దుష్పరిణామాలు సంభవించినా నష్టం లేదని ప్రభుత్వాలు భావించడం దురదృష్టకరం. సౌర శక్తి ద్వారా, గాలి మరల ద్వారా, జీవ ద్రవ్యాల ద్వారా, బొగ్గు ద్వారా, నీటి ద్వారా, అణు కేంద్రాల ద్వారా.... ఇలా, ఎలా పడితే అలా... విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చనే అపోహ ప్రభుత్వాల్లో బలంగా నాటుకు పోయింది. వీటిల్లో ఒక్కొక్క ప్రక్రియ ద్వారా, ఒక్కో రకమైన పర్యావరణ కాలుష్య ప్రభావం వుంటుందన్న విషయాన్ని గ్రహించిన ప్రజలు ఇటీవలి కాలంలో ఆందోళనకు దిగుతున్న విషయం తెలిసిందే. కాకపోతే, ఏ విధమైన బధ్రతా జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంలో హద్దులు నిర్ణయించడం ఎలా అన్నదే ప్రశ్న.
ఈ నేపధ్యంలో, ఇప్పటికే ప్రణాళికలు వేసిన అణు విద్యుత్ కేంద్రాలకు అనుమతులను సస్పెండ్ చేస్తున్నట్లు చైనా ప్రకటించింది. భద్రతా వ్యవస్థలను సమగ్రంగా తనిఖీ చేయనున్నట్లు తెలిపింది. భారత్‌లో ఇలాంటి కేంద్రాల ఏర్పాటుపై తొందర పడరాదని కేంద్ర పర్యావరణ మంత్రి జై రామ్ రమేశ్ చెప్పారు. కొత్త అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసే ముందు.. భూకంపాలు, సునామీల వల్ల నెల కొనే పరిస్థితులను తట్టుకునే పటిష్టమైన ఏర్పాట్లను సమీక్షించుకోవాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థలో కూడా గందరగోళ పరిస్థితులు నెల కొన్నాయి. చెర్నోబిల్ జ్ఞాపకాలు, ఫుకుషిమా భీభత్సం నుంచి పాఠాలు నేర్చుకుంటున్న దాఖలాలు కొన్ని దేశాల విషయంలో కనిపించడం లేదు. రష్యా ఇంకా మడమ తిప్పడం లేదు. భూకంపం, సునామీ దరిమిలా అణు ప్లాంట్లలో రి యాక్టర్లు పేలిపోయి జపాన్ అణు-అంపశయ్యపై నిలిచినా, రష్యా ఇప్పటికీ అణు విద్యుచ్ఛక్తిపైనే ఆధారపడతానంటున్నది. ఇక అమెరికా సంగతి సరే సరి. మన దేశం కూడా ఆలోచనలు మానుకోకపోతే జపాన్ కు పట్టిన గతే పట్టొచ్చేమో! భారతదేశంలో, అందునా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం-శ్రీకాకుళం జిల్లాలో నిర్మించ తలపెట్టిన వెయ్యి మెగావాట్ల అణు విద్యుత్‌కేంద్రం, జపాన్ పరిణామాల నేపథ్యంలో వివిధ కోణాల నుంచి పునరాలోచన చేయడం సమంజస మేమో! అణు విద్యుత్ ఉత్పాదనకు ఉరకలు వేయడం ఎంత అవసరమో, అణు విద్యుత్ కేంద్రాలకు అన్ని రకాల భద్రత కల్పించడమూ అంతే అవసరం అన్న విషయంపై దృష్టి సారించాలి. భారత అణు కేంద్రాలు శీతల వ్యవస్థ విద్యుత్ సరఫరాపై ఆధారపడవనో, పరోక్ష పద్ధతిలోనే రియాక్టర్లను చల్లబరిచే వ్యవస్థ ఉందనో, భూకంప తాకిడులు తక్కువ స్థాయిలో ఉన్నాయనో, సముద్ర మట్టానికి ఎత్తులో నిర్మించడం వల్ల సునామీ అలల తాకిడిని తట్టుకోగలుగుతాయనో, ఇతర దేశాల నియంత్రణల కన్నా భారతదేశంలో సురక్షిత అంచనా పరీక్షలున్నాయనో సర్ది చెప్పుకునే బదులు పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం అభిలషణీయం. అలా చేయగలిగినప్పుడు, దేశంలో ఇప్పుడున్న 20 రి యాక్టర్లు కాని, నిర్మించ తలపెట్టిన మరికొన్ని కాని, అనివార్య ప్రకృతి వైపరీత్య పరిస్థితుల్లోను ప్రజలను ఇబ్బందుల్లో పెట్టక పోవచ్చు.
న్యూక్లియర్ ఆధారిత విమానం "రొనాల్డ్ రీగన్"
ReplyDelete-------
విమానాలు మోసుకెళ్ళే నౌక -- అని సరిచెయ్యండి.
USS Ronald Reagan, US aircraft carrier.
Thank You I added.
ReplyDeleteజ్వాలాగారు, ఏ విషయం లోను పూర్తీ రక్షణ వుండదు.రిలేటివ్సేఫ్టీ మాత్రం వుంటుంది అందువల్ల మానవసాధ్యమైనజాగ్రత్తలు అన్నీ సైన్సు ప్రకారం తీసుకోవాలి .నిర్వహణ లో చాలా శ్రద్ధ వ హించాలిముఖ్యంగా అణురియాక్టర్ల విషయంలో . ఒకవేళ ప్రమాదం జరిగితే వెంటనే ఏమి చేయాలో పూర్తిగా సన్నద్ద మైవుండాలి. అలా అయితే అనువిద్యుత్తునునిషేధించ నవసరం లేదని నా అభిప్రాయం. ===రమణీయం
ReplyDelete