"వృత్తిలో" డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి
వనం జ్వాలా నరసింహారావు
(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 36 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో ఐదవ అధ్యాయం ఇది).
ఖమ్మం పట్టణానికి రాధాకృష్ణమూర్తి వచ్చి, డాక్టర్‍గా ప్రాక్టీస్ ప్రారంభించిన రోజుల్లో, వృత్తి పరంగా ఆయనకు పోటీ అంతగా లేదు. అప్పట్లో పేరున్న డాక్టర్లు ఇద్దరు-ముగ్గురు కంటే ఎక్కువ లేరు. డాక్టర్ మజీద్, డాక్టర్ అశ్వత్థామ, డాక్టర్ సీతారామరావులతో పాటు మరో ఇద్దరు-ముగ్గురు ఎంబిబిఎస్ పట్టాలేని డాక్టర్లుండే వారు. యలమంచిలి గారి పరిచయస్తులు, దగ్గర బంధువులు, స్నేహితులు, చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వారు ఆయన దగ్గరకు రావడంతో, త్వరగానే ప్రాక్టీస్ పెరగసాగింది. దీనికి తోడు, ఆయనకు కమ్యూనిస్ట్ పార్టీ అభిమానిగా పేరుండడంతో, అది కూడా ప్రాక్టీస్ పెరగడానికి దోహద పడింది. వచ్చిన మొదట్లో పార్టీతో నేరుగా సంబంధాలు పెట్టుకోక పోయినప్పటికీ, ఆయన క్లినిక్ నడుపుతున్న గాంధీ చౌక్లో వున్న బంగళా పై భాగంలో పార్టీ కార్యాలయం వుండడంతో ఆయన పరిచయాలు పెరగడానికి తోడ్పడింది. ఆయన ఖమ్మం రావడానికి కారణం కూడా వుంది. సమీపంలోని నేలకొండపల్లి, బోదులబండ గ్రామాల్లో ఆయన పిన తండ్రి, మరికొందరు బంధువులు అంతకు పది సంవత్సరాల క్రితం వచ్చి, చౌకగా దొరికితే భూములు కొనడం, స్థిరపడడం జరిగింది. ఖమ్మంలో డాక్టర్లు ఎక్కువగా లేరని, వస్తే ప్రాక్టీసు బాగా సాగుతుందని వాళ్లు ప్రోత్సహించడం వల్ల రావాలన్న కోరిక బలపడింది.
వైద్య వృత్తిలో నైతిక విలువలకు, మానవత్వానికి కట్టుబడి వున్న ప్రతి డాక్టర్‍కు ప్రజల అభిమానం లభిస్తుందని నమ్మిన యలమంచిలి, తన వైద్య శాల ద్వారా ఆ మార్గంలోనే ప్రాక్టీస్ చేయడంతో, అచిర కాలంలోనే ఆయన వద్దకు చికిత్సకొరకు వచ్చే వారి సంఖ్య పెరగ సాగింది. అదనంగా ఆయనకున్న వృత్తిపరమైన నైపుణ్యం వై.ఆర్.కెకు వైద్యుడుగా మంచి పేరు తెచ్చి పెట్టింది. అరవై సంవత్సరాల పూర్వం ఆయన ప్రాక్టీసు చేస్తున్న రోజుల్లో, "స్పెషలిస్టు" డాక్టర్లంటూ ఎక్కువ మంది లేరు. ఎంబిబిఎస్ ఉత్తీర్ణులైన వారే, తాము చదువుకున్న రోజుల్లో నేర్చుకొనేటప్పుడే, వైద్యం చేయడానికి అవసరమైన ప్రతి విషయంలోను అంతో-ఇంతో నైపుణ్యం అలవరచుకునే వారు. అలానే సాధ్యమైనంత వరకు, అప్పటి మెడికల్ ప్రొఫెసర్లు, వీరికి జనరల్ ప్రాక్టీషనర్లకు కావాల్సిన నైపుణ్యం, కష్టపడడం, ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా విజ్ఞానాన్ని పెంపొందించి కోవడం లాంటివి బోధించేవారు. రాధాకృష్ణమూర్తి స్వతహాగా తెలివైన విద్యార్థి కావడంతో ను, తోటి విద్యార్థులు కూడా అలాంటి వారే కావడంతోను, భవిష్యత్‍లో సేవా దృక్ఫదంతో వుండాలన్న కోరిక బలంగా ఆయనలో నాటుకు పోవడంతోను, ప్రతి విషయాన్ని ఆసక్తిగా నేర్చుకునేవారు.
ఆయన సహాధ్యాయులు, రూమ్మేట్లు అయిన డాక్టర్ బాల పరమేశ్వరరావు (భీమవరం), డాక్టర్ సత్యనారాయణ(విజయవాడ), మరొక విద్యార్థి సుబ్బారాయుడు(పాలకొల్లు), జి. సోమరాజు(తణుకు), రాజరత్నం(చిలకలూరిపేట), కృపాదానం(గుంటూరు జిల్లా), జి. రామచంద్రరావు(మైలవరం), మిక్కిలినేని వెంకటేశ్వరరావు(చిల్లపల్లి), ఒ.ఏ శర్మ(తరువాత కాలంలో ఎర్రగడ్డ టి.బి ఆసుపత్రి సూపరింటెండెంట్ అయ్యారు), కొడాలి వీరయ్య, రాఘవయ్య(తెనాలి), సజ్జా చంద్రమౌళి(చీరాల)-వీరయ్య, చంద్రమౌళిగార్లు టిడిపి పక్షాన ఎమ్మెల్యేలుగా కూడా పనిచేశారు-, ఉప్పలపాటి వెంకట రత్నం(ఎం.డి చేసి విజయవాడలో ప్రాక్టీస్ చేశారు), కుప్పాబ్బి కృష్ణమూర్తి (మెడిసిన్ ప్రొఫెసర్‍గా పనిచేశారు), సీతారాం(ఆర్మీలో చేరి అకాల మరణం పొందారు), వారి-వారి కులాలు వేరైనా, వాటన్నిటికీ అతీతంగా కలిసిమెలిసి, కొత్త విషయాలను నేర్చుకునేవారు. జీవనయానంలో ఎవరి దారి వారిదైనప్పటికి, వారి మధ్య స్నేహం కొనసాగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో రాధాకృష్ణమూర్తిగారు చురుగ్గా పాల్గొనే రోజుల్లో ఆ స్నేహం మరింత బలపడింది. కాలేజీ రోజులు తలచుకుంటూ, రచయిత ఆరుద్రతో పరిచయం జ్ఞాపకం చేసుకున్నారు. రాధాకృష్ణమూర్తిగారు విశాఖపట్నంలో మెడిసిన్ చదువుకునే రోజుల్లో, ఆరుద్ర "లైకోగ్రాఫ్"లో నైపుణ్యం పొందేందుకు, స్థానికంగా ఒక ఫొటో స్టూడియోలో పనిచేసేవారు. స్నేహితుడు తాజుద్దీన్, వై.ఆర్.కెను ఫొటో తీయించుకోవడానికి అక్కడికి తీసుకెళ్లి పరిచయం చేశాడు (తాజుద్దీన్ మెడికల్ కాలేజీ "బ్యూటీ" సుగుణను పెళ్లి చేసుకుని, కొంతకాలం ప్రభుత్వ ఆరోగ్య శాఖలో పని చేసి, అమెరికా వెళ్ళి ఫ్లోరిడాలో స్థిర పడ్డాడు. డాక్టర్‍గారికి ఫోన్ చేస్తుంటాడు). ఆరుద్ర తనదైన శైలిలో ఫొటో తీసినట్లు, ఆ సమయంలో మంచి పోజు ఇవ్వమని సూచించినట్లు జ్ఞాపకం చేసుకున్నారు డాక్టర్ యలమంచిలి. అప్పటికీ-ఇప్పటికీ కొన్ని వృత్తి పరమైన సామాజిక విషయాల్లో చాలా తేడా వుందని ఆయన భావన.
మానవత్వం, మానవ విలువల పట్ల గౌరవం డాక్టర్‍గారికి కలగడానికి ఆయన కుటుంబ నేపధ్యం ప్రధాన కారణం. తోటివారిని మర్యాదగా చూడడం, దయా దాక్షిణ్యాలు వారిపట్ల కలిగివుండడం, చిన్నతనంలో దత్తత తండ్రిగారి నుంచి అలవరచుకున్నారాయన. కళాశాల చదువు, వివిధ రంగాలకు సంబంధించి పెంపొందించుకున్న అభిలాష, స్వయం శిక్షణ, క్రమశిక్షణ లాంటివి ఆయన అభివృద్ధికి దోహదపడ్డాయి. ఆయన ఖమ్మంలో వైద్య వృత్తి ఆరంభించిన నాటి రోజులకు-ఇప్పటికి, చికిత్సా విధానంలోను, రోగ నిర్ధారణలోను, నివారణలోను, శస్త్ర చికిత్సా పద్దతులలోను గణనీయమైన మార్పులు వచ్చినప్పటికీ, అప్పుడు నేర్చుకుని ఆచరించిన పద్దతుల ద్వారా కూడా మెరుగైన చికిత్సను అందించగలిగా మన్న తృప్తి వుండేదని ఆయన భావన-నమ్మకం. కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి స్వర్గీయ నల్లమల గిరిప్రసాద్‍తో సహా, పలువురికి, ఆయన, అప్పటికున్న సదుపాయాల ఆధారంగానే, ట్రాన్సిల్స్ ఆపరేషన్ చేశారు. బహుశా అదే ఖమ్మంలో మొదటి ఆపరేషనేమో! సాధారణ ఆపరేషన్‍కు అప్పట్లో అయ్యే ఖర్చు కేవలం రు. 25 మాత్రమే.
డాక్టర్ వై.ఆర్.కె చేసిన ఆపరేషన్లలో హైడ్రోసిల్, హెర్నియా, అపెండిసైటిస్, ఫ్రాక్చర్స్, ట్యూమర్ లాంటివి కూడా వున్నాయి. ఏ ఆపరేషన్ చేసినా, ఆయనకు ఎప్పుడూ, ఏ విధమైన క్లిష్ట సమస్యలు ఎదురు పడలేదు. కేవలం రొటీన్ ఆపరేషన్లు, ప్రమాదం లేదనుకునే ఆపరేషన్లు మాత్రమే చేసేవారప్పట్లో. మెడికల్ పరమైన చికిత్సలనే ఎక్కువగా చేపట్టేవారు. కంట్లో నలకపడితే తీసే విధానం వుండేదప్పట్లో. సులభమైన మౌలిక సూత్రాలకు అనుగుణంగా చికిత్సా విధానం వుండేది. అనుభవం ప్రాతిపదికగా రోగ నిర్ధారణ నైపుణ్యం అలవరచుకునే వారు వైద్యులు. నిపుణుల ద్వారా చికిత్స చేయించాల్సిన అవసరముంటే, విజయవాడకో-హైదరాబాద్‍కో రోగులను పంపాల్సి వచ్చేది. ఎక్స్-రే కావాలన్నా విజయవాడకు పోవాల్సి వచ్చేది. రోగ నిర్ధారణ కొరకు ఇప్పటి మాదిరిగా రక్త-మల-మూత్ర పరీక్షలు లేవప్పుడు. సీబిపి కాని, మైక్రోస్కోపిక్ పరీక్షలు , ఎక్స్-రే సౌకర్యం ఖమ్మంలో లేవు. డాక్టర్ కోటయ్య గారు వచ్చిన తర్వాతే ఖమ్మంలో ఎక్స్-రే సౌకర్యం వచ్చింది.
ఇప్పటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా-బాలికల పాఠశాల వున్న ఆవరణలో-16 పడకల జిల్లా ఆసుపత్రి వుండేది. ఇద్దరు డాక్టర్లు (ఒక్కోసారి ఒక్కరే) మాత్రమే వుండేవారు. ఎప్పుడైతే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి స్థాయి పెంచారో అప్పుడే స్పెషలిస్టుల రాక మొదలైంది. ఖమ్మం వచ్చిన మొదటి స్పెషలిస్ట్ సర్జన్ డాక్టర్ సూర్యనారాయణ అని, మొదటి ఎక్స్-రే పెట్టింది డాక్టర్ కోటయ్య అని, మొదటి అనస్థటిస్టు ఎల్ వీ ఎస్ కోటేశ్వర రావు అని, ఆ తర్వాత డాక్టర్ జయచంద్రారెడ్డి, డాక్టర్ జే.ఆర్. ప్రసాద్ లాంటి స్పెషలిస్టులు వచ్చారని గుర్తు చేసుకున్నారు రాధాకృష్ణమూర్తిగారు. 1961లో నర్సింగ్ హోంలు ఆరంభం కావడంతో వారి సంఖ్య లెక్కకు మించి పోయిందిప్పుడు.
రోగ నిర్ధారణ పరీక్షలు చేసే వసతి లేకుండా మెడికల్ ప్రాక్టీస్ చేయడం అంత తేలికైన విషయం కాకపోయినా చేయక తప్పని పరిస్థితులుండేవి అప్పట్లో. ధనుర్వాతంలాంటి జబ్బులొస్తే, ఆ రోగికి చికిత్స చేయడానికి, డాక్టర్లెవరు ముందుకు రాని రోజులవి. అలా చేయడం సాహసంతో కూడుకున్న పని. డాక్టర్ వై ఆర్ కె రిస్క్ తీసుకో తలిచి ధైర్యంగా అలాంటి కేసులను చేపట్టి, విజయవంతంగా నయం చేసిన సందర్భాలెన్నో వున్నాయి. అలానే క్షయ వ్యాధికి సంబంధించిన కేసులను డాక్టర్లు అంత తేలిగ్గా చికిత్స చేయడానికి ఆసక్తి చూపక పోయేవారు. స్ట్రెప్టోమైసిన్ మందులివ్వడమే టీబీ చికిత్సకు అప్పట్లో వున్న ఒకే ఒక చికిత్సా విధానం. ఇప్పుడైతే రకరకాల మందులొచ్చాయి. అలాంటి మల్టీ డ్రగ్స్ చికిత్సా విధానంతో పాటు, అవి వాడినందువల్ల రోగ నిరోధక శక్తికూడా శరీరానికి తగ్గసాగింది. క్షయ వ్యాధి చికిత్సకు ఒక క్రమ పద్ధతి అవలంబించామని రాధాకృష్ణమూర్తి చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అవలంబించే "ఆర్టిఫిషల్ న్యూమో థొరాక్స్" అనే విధానం ద్వారా, ఊపిరి తిత్తులను "కొలాప్స్" చేసే పద్ధతి పాటించేవారు. ఒక ఊపిరి తిత్తి చుట్టూ వుండే (స్పేస్) ప్రదేశంలోకి గాలిని పంపి, "కొలాప్స్" చేసి, దానికి విశ్రాంతినిచ్చి, మరో దాన్ని నయం చేసేవారు. ఊపిరితిత్తి మచ్చ వుంటే, గాలిని పొట్టలో నింపి, పైకి తన్ని "న్యూమో పెరిటోనియం" చికిత్స చేసేవారు. తన దగ్గర కొచ్చే ఎందరో క్షయ రోగులను ఈ విధానం ద్వారానే నయం చేశానని, అప్పట్లో సరైన ఆ విధానాన్ని ఇప్పుడు ఎవరూ ఉపయోగించడం లేదని కూడా అన్నారాయన.
విరిగిన ఎముకలను బాగు చేయించుకోవడానికి ఆయన దగ్గరకు అనేక మంది వచ్చే వారు. జనరల్ మెడికల్ ప్రాక్టీస్ చేసే డాక్టర్లు ఆ కేసులను సాధారణంగా ఒప్పుకోరు. అలాంటి వారికి ప్లాస్టర్ వేసి బాగు చేయడం డాక్టర్ వై.ఆర్.కె గారు ఒక ప్రత్యేక నైపుణ్యంగా అలవరచుకున్నారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో నేర్చుకున్న దానిని, మరింత పదును పెట్టడానికి, నిరంతర అధ్యయనం చేసేవారాయన. విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో నిర్వహించే మెడికల్ ఎడ్యుకేషన్ తరగతులకు హాజరై తన వృత్తి నైపుణ్యాన్ని ఆధునీకరించుకునేవారు. అలా చేస్తూ, ఒంటి చేత్తో ఎన్నో కేసులను నయం చేసేవారు. అదనంగా తన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి వివిధ మెడికల్ జర్నల్స్ లో ప్రచురించబడే వ్యాసాలను అధ్యయనం చేసేవారు.
వృత్తిలో కొన్ని నియమాలను పాటించేవాడినని చెప్పారు. మొదట్లో అసలు కన్సల్టేషన్ ఫీజు వుండేది కాదు. సంఖ్య పెరిగి, తట్టుకోవడం కష్టం కావడంతో, తలకు రు. 2 /- వసూలు చేసేవారు. అనవసరమైన పరీక్షలు చేయించక పోవడం, తన వల్ల కాని జబ్బు అనిపిస్తే, వెంటనే స్పెషలిస్టుల దగ్గరకు పంపడం, విద్యార్థులకు, పార్టీ పూర్తికాలం కార్యకర్తలకు - వారి కుటుంబాలకు ఉచితంగా చేయడం, ఇన్ పేషంట్లకు - సర్జరీలకు బిల్లు వేస్తే ఇచ్చుకోలేమనే వారికి, వారికి చేతనైనంతే ఇవ్వమనడం, ఎన్నాళ్లు సేవలందించినా సరే చనిపోయిన వారికి బిల్లు వేయకపోవడం పాటించేవారు. ఆస్తిపరులు స్వచ్చందంగానే ఏదో ఒక మొత్తం ఇచ్చి వెళ్లేవారు. ఎంత ఇచ్చారనేది చూసుకునేవారు కాదు. కొందరు వార్షికంగా ఇచ్చే వారు. వుండడానికి అవసరమైన అన్ని ప్రమాణాలను, నైతిక విలువలను తప్పక పాటించేవారాయన.
No comments:
Post a Comment