Monday, July 23, 2012

శరద్ పవార్ కోపం కాంగ్రెస్ ప్రక్షాళణకు దారితీయనుందా?: వనం జ్వాలా నరసింహారావు


శరద్ పవార్ కోపం కాంగ్రెస్ ప్రక్షాళణకు దారితీయనుందా?
వనం జ్వాలా నరసింహారావు


శరద్ పవార్‌కు కోపం వచ్చింది. ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చి సర్దుకుపోయింది. అప్పుడే మో, సోనియా విదేశీయతకు కోపం వస్తే, ఇప్పుడేమో తనకు మంత్రివర్గంలో రెండో స్థానం ఇవ్వలేదని కోపం వచ్చింది. మంత్రిపదవికి రాజీనామా చేస్తానని బెదిరించే వరకూ కోపం వచ్చింది. ఇంతకీ పవార్ యుపిఎని వీడిపోతాడా? పోడా? అనేది ఇప్పుడిప్పుడే చెప్పలేం కాని కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొంచెం కష్టాలు తెస్తాడని మాత్రం చెప్పవచ్చు. అసలిదంతా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కావాలనే చేస్తున్నదా? గత పదమూడేళ్లు  రికార్డు స్థాయిలో అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన సోనియా గాంధి తన పార్టీలోను, యుపిఎ భాగస్వాములలోను అసంతృప్తిని పసికట్టిందా? ఇక తప్పదనుకున్న సోనియా అత్తగారి తరహా దిద్దుబాటులోనే పయనించి, యుపిఎలోను-పార్టీలోను చీలికకు శ్రీకారం చుట్టి, సమూల ప్రక్షాలణ చేసి, అసలు-సిసలైన వీర విధేయులను మాత్రమే తన వెంట వుంచుకుని, వారసత్వానికి మార్గం సుగమం చేయనుందా? ఎదురుతిరగగల శక్తి-యుక్తులున్న శరద్ పవార్ లాంటి కాంగ్రేసేతర నాయకులను కాని, ఇంకా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న మరికొందరు అసంతృప్త నాయకులను కాని, వదిలించుకునే ఆలోచనలో సోనియా వుందా? వారికీ విడిపోతేనే మంచి జరుగుతుందని, రాజకీయంగా లబ్ది చేకూరుతుందని భావన కలుగుతోందా? ఎవరి వ్యూహం ఎలా వుందో అర్థం చేసుకోవాలంటే చరిత్ర తిరగదోడాల్సిందే! నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్థానంలో, ధిక్కరించి పార్టీ వీడిన ప్రముఖులకే ప్రధాని, ఉప ప్రధాని, రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవులు దక్కాయి. విధేయత, వీర విధేయత ప్రదర్శించిన వారంతా తాము అనుభవిస్తున్న పదవులను కాపాడుకోవడానికే పరిమితమయ్యారే కాని ఉన్నత శిఖరాలకు చేరుకోలేక పోయారు. ఎత్తుకు పై ఎత్తులు వేయగల కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే... ఏదీ అసాధ్యం కాదు!

          సోనియా గాంధి, చిక్కుల్లో పడ్డ పార్టీని, ప్రక్షాలణచేసి-పునర్నిర్మించి-పూర్వ వైభవాన్ని సమకూర్చి, కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారకురాలైంది. రాజీవ్ గాంధి మరణానంతరం, సోనియా నిరాకరించిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలను అనూహ్య పరిస్థితుల్లో చేపట్టిన పీవీ నరసింహారావు సోనియా విశ్వాసాన్ని కోల్పోయి పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజీనామా చేయక తప్పలేదు. జిత్తులమారిగా పేరున్న మరో వృద్ధ నాయకుడు సీతారాం కేసరికి ఆ రెండు పదవులు దక్కాయి. సీతారాం కేసరికి వ్యతిరేకంగా పలువురు సీనియర్ నాయకులు పార్టీని వీడే పరిస్థితులు తలెత్తడంతో, పార్టీ ఛిన్నాభిన్నం కాకుండా "రక్షించమని" కొందరు నాయకుల అభ్యర్థన మేరకు, నెహ్రూ-గాంధి వారసత్వ పరంపరలో ఐదో తరం ప్రతినిధిగా, సోనియా గాంధి తొలుత పార్టీ "ప్రాధమిక సభ్యత్వం" స్వీకరించారు. అచిర కాలంలోనే, "రెండు నెలల అపారమైన అనుభవంతో", పార్టీ శ్రేయోభిలాషులు కోరడంతో కాదనలేక, 1998 లో, కొందరు ఆమె "జాతీయత" ను ప్రశ్నించినప్పటికీ, అధ్యక్ష పదవిని చేపట్టి, గత పదమూడు-పద్నాలుగేళ్లగా పార్టీకి తిరుగులేని నాయకురాలిగా-మకుటంలేని మహారాణిగా, నెహ్రూ-గాంధి వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీలో ఆమె తీసుకున్న నిర్ణయమే "ఏకాభిప్రాయం".



          నెహ్రూ-గాంధి కుటుంబీకుల అనుకూల-ప్రతికూల శక్తుల, వ్యక్తుల, ముఠా రాజకీయాల మధ్య జరుగుతున్న ఆధిపత్య సమరమే, భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర. విధేయులు "అణిగిమణిగి" వుండి, దొరికిన దానితో సంతృప్తి పడుతుంటే, వ్యతిరేకులు అడపాదడపా ఎదురుతిరగకుండా వుండలేక పోయారు. మొరార్జీ దేశాయ్, విశ్వనాథ ప్రతాప సింగ్, చంద్రశేఖర్, గుజ్రాల్ ఎదురు తిరిగి పార్టీని వీడక పోయినట్లయితే, ఏ నాటికీ "ప్రధాన మంత్రి" అయ్యేవారు కానే కాదు. జగ్జీవన్ రాం కు ఉప ప్రధాన మంత్రి దక్కే అవకాశమే వుండకపోయేది. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి కాగలిగింది కాంగ్రెస్ పార్టీని వీడినందునే. వారే కనుక వీర విధేయతతో పార్టీలో కొన సాగినట్లయితే మంత్రివర్గంలో స్థానంతో సరిపుచ్చుకోవాల్సిందే. భారత జాతీయ కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం, అసంతృప్తులు, ధిక్కారాలు, ఎదురీతలు, చీలికలు అంతర్భాగాలే. నెహ్రూ-గాంధి కుటుంబీకుల వారసత్వ పరంపరలో ప్రతి ఒక్కరు, తమ మాట చెల్లని ప్రతిసారీ పార్టీని ప్రత్యక్షంగానో పరోక్షంగా నో వీడడమో, చీల్చడమో, "మనస్సాక్షి చెప్పినట్లు" నడచుకోమని కార్యకర్తలను ప్రోత్సహించడమో-పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేయమని సూచించడమో, వ్యతిరేకులు పార్టీని వదలి వెళ్లే పరిస్థితులు కలిపించడమో చరిత్ర చెప్పిన వాస్తవం. అలా జరిగిన ప్రతిసారీ ఆ కుటుంబీకులు పార్టీలో తమ ఆధిపత్యాన్ని పదిల పరచుకున్న విషయమూ జగమెరిగిన సత్యం. ఆ క్రమంలోనే ఆ వారసుల నాయకత్వం మినహా గత్యంతరం లేని అవసరం కూడా ఏర్పడింది. అదే ఇప్పటికీ కొనసాగుతోంది.

          నెహ్రూ-గాంధి కుటుంబ వారసత్వ ప్రధమ తరం నాయకుడు మోతీలాల్ నెహ్రూ, కుమారుడు జవహర్లాల్ నెహ్రూకు, తన తర్వాత వెనువెంటనే "అధ్యక్ష బాధ్యత" అప్ప చెప్పారు. ఆ కుటుంబానికి రాజకీయ పరంగా మద్దతిచ్చిన మహాత్మా గాంధి, ఆయన జీవించినంతవరకు, నెహ్రూను వ్యతిరేకించిన-వ్యతిరేకించగల సామర్థ్యం వుందని భావించిన వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్ర బోస్, టాండన్, పట్టాభి సీతారామయ్య లాంటి నాయకులందరినీ పార్టీలో మైనారిటీకి తగ్గించేందుకు సహకరించారనే ది వాస్తవం. స్వాతంత్ర్యం లభించిన తర్వాత అలనాటి కాంగ్రెస్ అధ్యక్షుడు ఆచార్య కృపలానీ చర్యలను తరచుగ ప్రశ్నించు తూ, తన ఆధిపత్యాన్ని నెహ్రూ ప్రదర్శించడం కూడా తిరుగుబాటు లాంటిదే. ముగ్గురు ప్రధాన మంత్రులను దేశానికిచ్చి, నాలుగో తరం త్వరలో ఆ పదవిని చేపట్టడానికి సిద్ధంగా వున్న అరుదైన కుటుంబం అది. నాలుగు దశాబ్దాలు వివిధ దశల్లో, పాతిక పర్యాయాలు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన ఘనత కూడా ఆ కుటుంబానిదే.

          నెహ్రూ వారసురాలిగా ఇందిరా గాంధి తొలుత పార్టీ పగ్గాలను 1959-60 లో చేపట్టింది. తండ్రి మరణానంతరం, లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత, 1966 లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజుల్లో పార్టీలో రెండు బలమైన వర్గాలుండేవి. ఇందిర అనుయాయులైన "సామ్యవాదులు", మొరార్జీ-తదితరుల నాయకత్వంలోని "సంప్రదాయ వాదులు" ఆధిపత్యం కొరకు బహిరంగంగానే విమర్శించుకునే వారు. నెహ్రూ-గాంధి కుటుంబ ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన మొరార్జీ దేశాయ్‌ని తప్పని పరిస్థితుల్లో మంత్రివర్గంలో తీసుకుని కీలకమైన ఆర్థిక శాఖనిచ్చింది ఇందిర. బాంకుల జాతీయం, రాజా భరణాల రద్దు లాంటి విధాన పరమైన నిర్ణయాల నేపధ్యంలో, మొరార్జీ దేశాయ్‍తో సహా, హేమామేమీలైన "సంప్రదాయ వాదుల" ను బయటకు పంపేందుకు, 1969 లో పార్టీని చీల్చింది ఇందిర. ఆమెతో విభేదించి, తమదే అసలైన పార్టీగా ప్రకటించి, దానికి సారధ్యం వహించి, ఆ తర్వాత జనతా పార్టీలో విలీనం చేసిన మొరార్జీ దేశాయ్ ప్రప్రధమ కాంగ్రేసేతర ప్రభుత్వ ప్రధాన మంత్రి కాగలిగారు. నెహ్రూ-గాంధి కుటుంబ వారసత్వాన్ని వ్యతిరేకించగలిగిన వారే, ప్రధాన మంత్రి స్థాయికి ఎదగ గలుగుతారని నిరూపించారాయన.

          మైనారిటీలో పడిన ఇందిర వర్గం కాంగ్రేసేతర సోషలిస్టుల-వామ పక్షాల మద్దతు పొంది విప్లవాత్మక సంస్కరణలతో బలమైన నాయకురాలిగా ఎదగసాగింది. 1971 ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించి, కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని నాయకురాలయ్యారు. పార్టీని అంటిపెట్టుకున్న విధేయుల్లో కొందరు క్రమేపీ ఆమెను అంతర్లీనంగా వ్యతిరేకించసాగారు. పార్టీని వీడిన "యంగ్ టర్క్స్" ఎస్ చంద్రశేఖర్ ప్రధాన మంత్రి స్థాయికి, కృష్ణకాంత్ ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఇందిర మరో విమర్శకుడు, ఐ కె గుజ్రాల్ కూడా రాజీనామా చేసి ప్రధాన మంత్రి కాగలిగారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల పూర్వ రంగంలో, ఆమెకు అత్యంత విధేయుడుగా వున్న జగ్జీవన్ రాం ఆమెను ఎదిరించి పార్టీని వదిలి, "కాంగ్రెస్ ఫర్ డెమాక్రసీ" ని స్థాపించి, జనతా కూటమితో కలిసి పోటీ చేయడం వల్లనే ఉప ప్రధాన మంత్రి కాగలిగారు. 1977 ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన తర్వాత పార్టీలో తన వీర విధేయులకు తప్ప ఇతరులకు స్థానం లేకుండా చేసి, పార్టీని చీల్చి, ఇందిరా కాంగ్రెస్ పేరుతో పునర్నిర్మించి, ఎవరినీ నమ్మలేని పరిస్థితుల్లో 1978 లో తానే అధ్యక్ష పదవిని చేపట్టింది. అనతి కాలంలోనే అఖండ విజయం సాధించి ప్రధాని కాగలిగింది. ఆమె వారసుడిగా ఎదుగుతున్న చిన్న కొడుకు సంజయ్ గాంధి దుర్మరణం పాలవడంతో, పెద్దకొడుకు రాజీవ్ గాంధిని నెహ్రూ-గాంధి కుటుంబ పాలనను కొనసాగించడానికి రాజకీయ తెరమీదికి తీసుకొచ్చింది. "వీర విధేయులు" దానికి మద్దతీయగా, "నిశ్సబ్ద వ్యతిరేకులు" మౌనం పాటించారు. సమయం కొరకు వేచి చూడ సాగారు. హత్యకు గురయ్యేంతవరకూ పార్టీ పగ్గాలు ఇందిరా గాంధి తన చేతుల్లోనే వుంచుకుని, తదనంతరం రాజీవ్ గాంధికి వారసత్వం ఇచ్చింది. ఇక నాటినుంచి భారత జాతీయ కాంగ్రెస్‌ను ఇందిరా కాంగ్రెస్ అని వాడుకలో పిలవడం, ఏఐసీసీ (ఐ) అని ఉపయోగించడం మొదలైంది.

          1984 సార్వత్రిక ఎన్నికల్లో, గతంలో ఎన్నడు సాధించలేనంత భారీ మెజారిటీతో రాజీవ్ పార్టీని గెలిపించారు. భారత జాతీయ కాంగ్రెస్ వందేళ్లు పూర్తి చేసుకున్న సంవత్సరంలో 1985 లో, "ఇందిర కాంగ్రెస్ పార్టీ" అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ "ధిక్కార ధోరణి" ని సహించలేని రాజీవ్, తల్లి ఇందిర ఏ విధంగా మొరార్జీ ని తొలగించిందో, అలానే, సింగ్ శాఖలో మార్పులు చేసి రక్షణ శాఖకు మార్చాడు. ఎప్పుడైతే "బోఫోర్స్" కుంభకోణానికి సంబంధించిన సమాచారం వెలుగులో తేవడానికి సింగ్ సిద్ధపడుతున్నాడని అనుమానం వచ్చిందో, రాజీవ్ ఆయనను ఆ శాఖనుంచి కూడా తప్పించడం జరిగింది. కాంగ్రెస్ ప్రాధమిక సభ్యత్వానికి, పార్లమెంటు స్థానానికి రాజీనామా చేసిన వీపీ సింగ్, 1989 లో జరిగిన ఎన్నికల్లో జనతా దళ్ అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికై, "నేషనల్ ఫ్రంట్" ప్రభుత్వానికి సారధ్యం వహించి ప్రధాన మంత్రి అయ్యారు. ఆయనే కనుక రాజీవ్ గాంధీకి "వీర విధేయుడి" గా వుండిపోయినట్లైతే, తన ఆర్థిక శాఖను కాపాడుకో గలిగే వాడే కాని, ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగేవాడు కానే కాదు. 1991 మధ్యంతర ఎన్నికల్లో ప్రచారంలో వున్న రాజీవ్ గాంధి హత్యకు గురికావడంతో ఆయన స్థానంలో పీవీ నరసింహారావు "ఏకాభిప్రాయ అభ్యర్థి" గా పార్టీ పదవిని చేపట్టి, ఎన్నికల తర్వాత ప్రధాన మంత్రి అయ్యారు.

          నెహ్రూ-గాంధి వారసత్వ పరంపరకు చెందని వారికి, పార్టీ సారధ్యం-ప్రధాన మంత్రి పదవి రావడం పలువురిని ఆశ్చర్య పరిచింది. సోనియా తన చెప్పు చేతల్లో వుంటాడనుకున్న వ్యక్తి, సొంత నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా తెచ్చి, భవిష్యత్ ప్రధాని కావడానికి పునాదులు వేశారాయన. సోనియా ఆగ్రహానికి మాత్రం గురికాక తప్పలేదు. పార్టీ నాయకత్వ బాధ్యతలనుంచి దయనీయంగా తొలగించారాయనను. ఆయన స్థానంలో వచ్చిన కేసరికి అదే పరిస్థితి ఎదురైంది తర్వాత. సోనియా శకం మొదలైంది. ఐదో తరం వ్యక్తిగా పార్టీ అధ్యక్షురాలైంది.

          సోనియా అధ్యక్ష పదవిని అనుకున్నంత సులభంగా అధిష్టించలేదు. నెహ్రూ-గాంధి కుటుంబ వారసత్వ నాయకత్వంపై వున్న వ్యతిరేకత ప్రభావం ఆమెపై కూడా సహజంగానే పడింది. పీవీ రావడంతో ఇక వారసత్వ రాజకీయాలు స్వస్తి అని భావించిన పలువురు కాంగ్రెస్ "ఆశావహులు" నిరాశకు గురయ్యారు. ఇంతలో 2004 ఎన్నికల సంరంభం మొదలైంది. రద్దయిన లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన శరద్ పవార్, ఎన్నికల్లో కాంగ్రెస్ పక్ష ప్రధాని అభ్యర్థిగా, భారత దేశంలో పుట్టిన వారి పేరునే ప్రకటించాలన్న నినాదం లేవదీశాడు. ధిక్కార స్వరం వినిపించాడు. జన్మతః ఇటలీ దేశస్తురాలైన సోనియాకు నెహ్రూ-గాంధి వారసురాలిగా ప్రధాని కాకూడదన్న భావం ఆయనకే కాకుండా మరి కొందరిలో కూడా ప్రస్ఫుటంగా కనిపించింది. మాట నెగ్గించుకోలేని పవార్, మాజీ లోక్ సభ సభాపతి సంగ్మాతో కలిసి "నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ" ని నెలకొల్పారు. స్థైర్యం కోల్పోని సోనియా, చాకచక్యంగా మన్మోహన్ సింగ్ ను తెర పైకి తెచ్చింది.

          ఎన్నికల అనంతరం యూపీయే ప్రభుత్వానికి సారధ్యం వహించడానికి ఆమె తిరస్కరించి, ఆయనను ప్రధానిని చేసింది. ప్రణబ్ కుమార్ ముఖర్జీ గతంలో కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించినప్పుడు, రిజర్వ్ బాంక్ గవర్నర్ గా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఆర్థిక మంత్రి హోదా రిజర్వ్ బాంక్ గవర్నర్ హోదాకంటే పెద్దే కాకుండా, రిపోర్టింగ్ అధికారిక స్థాయి కూడా. అదే ప్రణబ్ కుమార్ ముఖర్జీ మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పనిచేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ సీనియారిటీ, సోనియా నిర్ణయం ముందు పనికి రాలేదు. ఆయనకు ప్రధాని కావాలన్న ఆశా చావలేదు. అవకాశం వస్తే, ధిక్కరించగలిగితే, వదులుకునేవాడు కాదేమో? గతంలో రాజీవ్ గాంధి హయాంలో, ఇందిర హత్యానంతరం జరిగిన ఎన్నికల తర్వాత, నిర్లక్ష్యానికి గురై పార్టీని వీడి సొంత కుంపటి కూడా పెట్టుకున్నారు. తిరిగి పీవీ హయాంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా స్వగృహ ప్రవేశం చేసి, పార్టీకి-సోనియాకు విధేయుడిగా కొనసాగి, 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు లేవని ధృవీకరించుకుని, ప్రధాని పీఠం అధిష్టించే యోగం లేదని భావించి, రాష్ట్రపతి పదవిపై కన్నేసి, అనుకున్నది సాధించుకున్నాడు. ఆయనకే రాష్ట్రపతి ఇవ్వకపోతే, ఆయనలోని అలనాటి రాజీవ్ (నెహ్రూ-గాంధి) వ్యతిరేకత దేనికైనా దారితీసేదేమో! శరద్ పవార్ మనసు మార్చుకుని, సోనియా సారధ్యంలోకి పరోక్షంగా చేరినప్పటికీ ప్రధాని కావాలన్న కోరిక దేనికైనా దారితీయవచ్చు.

          తనకు మద్దతు ఇస్తూనే-ఇస్తున్నట్లు నటిస్తూనే, పరోక్షంగా, అవకాశం కొరకు ఎదురుచూస్తున్న పార్టీ లోని-యుపిఎ భాగస్వామ్య పక్షాలలోని సొంత మనుషుల వ్యవహారం సోనియాకు తెలియకుండా వుంటుందా? ప్రధాని పీఠంపై తనయుడు రాహుల్ గాంధీని కూచోబెట్టాలంటే, నామ మాత్రం వ్యతిరేకత కూడా లేకుండా జాగ్రత్త పడాలి. బయటపడి ఏదో ఒక కారణం చూపించి, సోనియా సూచనను పాటించని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లు ఆమెకు అసలైన శత్రువులు కారని ఆమెకూ తెలుసు. జగన్ లాంటి వారు జాతీయ స్థాయిలో సోనియాని అస్థిరపరిచలేరని కూడా అమెకు తెలుసు. వచ్చిన చిక్కల్లా "కంట్లో నలుసుల" తోనే. సోనియాకు కాంగ్రెస్ పార్టీని మరో మారు ఏదో ఒక రకంగా, అత్తగారి తరహాలో చీలిస్తేనో, లేక, ఏదో కారణాన జాతీయ స్థాయిలో ఆమెను వ్యతిరేకించేవారు చీలిపోతేనే మంచిది. నెహ్రు-గాంధీ వారసత్వం చెక్కు చెదరకుండా వుండాలంటే కాంగ్రెస్ పార్టీలో మరో ప్రక్షాళన జరగాల్సిందే. భారత జాతీయ కాంగ్రెస్(ఆర్-రాహుల్) కాని, భారత జాతీయ కాంగ్రెస్ (ఎస్-సోనియా) కాని ఆవిర్భవించవచ్చు. అనూహ్యంగా తెర పైకి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి కాంగ్రెస్ (పి-ప్రియాంక) స్థాపన జరిగినా ఆశ్చర్యం లేదు.

Saturday, July 21, 2012

రాహుల్ రావడమంటే నెహ్రూ-గాంధీ వారసత్వం కొనసాగింపే!: వనం జ్వాలా నరసింహారావు


రాహుల్ రావడమంటే నెహ్రూ-గాంధీ వారసత్వం కొనసాగింపే!
వనం జ్వాలా నరసింహారావు


వారసత్వ రాజకీయాల కొన సాగింపుకు మరో మారు రంగం సిద్ధమౌతోంది. ప్రస్తుతానికి అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే వున్న సోనియా తనయుడు, నెహ్రూ-గాంధీ కుటుంబ వారసత్వ పరంపరలో ఐదోతరంవాడైన రాహుల్ గాంధీకి పార్టీలో మరింత కీలక బాధ్యతలు-నిర్ణయాత్మకమైన బాధ్యతలు అప్పగించాలని ఆ పార్టీ సీనియర్ నేతలు క్యూ కట్టుకుని మరీ డిమాండు చేస్తున్నారు. వారిలో కొందరు నేతలు మరొక్క అడుగు ముందుకు వేసి, 2014 ఎన్నికలలో రాహుల్‌ను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కూడా అంటున్నారు. ఆ మాటకొస్తే దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి పలువురు రాష్ట్ర స్థాయి-జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులు వీలైనప్పుడల్లా రాహుల్ జపం చేస్తూనే వస్తున్నారు. నెహ్రూ-గాంధీ వారసత్వాన్ని పదిలంగా వుంచే ప్రయత్నాలు కొనసాగుతూనే వున్నాయి. 'రావాలి... రావాలి... రావాలి...' అని అందరూ ఆహ్వానిస్తుంటే ఎందుకు రాకూడదని అనుకున్నాడేమో ఏమో కాని, వచ్చేస్తున్నానంటూ బదులు పలకనే పలికాడు రాహుల్. డిమాండులకు తల్లి సోనియా పెదవి విప్పి, రావడం-రాకపోవడం తనయుడు రాహుల్ ఇష్టాయిష్టాలకు వదిలేస్తే, ఆ మర్నాడే, తనయుడు నోరు గట్టిగా విప్పి, ప్రభుత్వంలోను-పార్టీలోను క్రియాశీలక పాత్ర పోషించడానికి తాను సిద్ధం అని ప్రకటించాడు. తనను ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది తల్లి సోనియాకు, ప్రధాని మన్మోహన్‌కు వదిలేస్తున్నానని ఎంతో ఉదారంగా అన్నాడు. ఇలా రాహుల్ పెదవి విప్పాడో-లేదో, వెంటనే, మంత్రివర్గంలో ఆయన అప్పుడే చేరినట్లు, ఆయనకు ఫలానా పోర్టుఫోలియో కేటాయించనున్నట్లు ప్రచారాలు మొదలయ్యాయి. 1999 లో ఏ విధంగానైతే, పార్టీ అవసరాల దృష్ట్యా సోనియా గాంధీకి మొదలు సభ్యత్వం, ఆ తరువాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కట్టబెట్టారో, అదే తరహాలో, ఆమె వారసుడి ఎంపికకు కూడా రంగం సిద్ధమౌతోంది. వారసత్వ రాజకీయాలు, అందునా నెహ్రూ-గాంధీ వారసత్వ రాజకీయాలు భారత దేశానికి కొత్తేమీ కాదు.

రాజకీయాలలో వారసత్వంగా ఎదగ గలిగిన వారు అనేకమంది వున్నారు. దానికి కారణాలు అనేకం. ఎన్.టీ రామారావు లాంటి వారు పటేల్-పట్వారీ వ్యవస్థనైతే రద్దు చేయగలిగారు కాని, వారసత్వంగా ఎదుగుతున్న రాజకీయ పటేల్-పట్వారీలను ఆపు చేయలేకపోయారు. ఇదేదో ఒకరిద్దరి విషయంలోనో-లేక కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి విషయంలోనో జరుగుతే ఆశ్చర్యపడాల్నేమో కాని, భారత దేశ రాజకీయాల్లో సర్వ సాధారణ విషయమై పోయి, ప్రజాస్వామ్యానికే పెను సవాలుగా మారుతుంటే ఆశ్చర్యపడక తప్పదు. రాజకీయాల్లో కీలకమైన పదవులను పొంది, ఉన్నత స్థాయికి చేరుకున్న వారి బంధుగణం అతి పిన్న వయసులోనే, రాజకీయ ప్రవేశం చేసి, చకచకా ఎదగడం సంప్రదాయంగా మారుతోంది. మొదటి తరం నాయకులు, తమ సంతానాన్ని-సోదరీ, సోదరుల సంతానాన్ని, తమ్ముళ్లను, చెల్లెళ్లను, భార్యలను, వీలున్న బంధువులను వ్యూహాత్మకంగా రాజకీయాల్లోకి దింపి, వారసత్వ సంపదలాగా పదవులను దక్కించుకుంటున్నారు.

అసలు ప్రజాస్వామ్యమే వారసత్వంగా మారుతున్నదా? ఔననక తప్పదు. నెహ్రూ-గాంధీ కుటుంబం జాతీయ స్థాయిలో (మంచికో-చెడుకో) ఈ ప్రక్రియకు బీజాలు నాటితే, దేశవ్యాప్తంగా వాటి మొక్కలు పెరిగి, భారీ వట వృక్షాలుగా వూడలు పెంచి, పెకలించడానికి సాధ్యపడని స్థితికి చేరుకుంది. "వారసత్వం జన్మ హక్కు" అని వాదించే స్థాయికి చేరుకుంది. సుమారు తొంబై సంవత్సరాల క్రితం బ్రిటీష్ ఇండియాలో, న్యూఢిల్లీ నుంచి "సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ" కి ఆ కుటుంబం మొదటి తరం నాయకుడు మోతీలాల్ నెహ్రూ ఎన్నికైన తర్వాత, ఆ కుటుంబానికి సంబంధించిన దాదాపు అందరూ చట్ట సభల్లో అడుగు పెట్టారు. కాకపోతే, అందులో పలువురు వారి-వారి సామర్థ్యాన్ని బట్టే ఆ పదవులకు చేరుకుని వుండవచ్చు. కుటుంబ నేపధ్యం తప్పక ఉపయోగపడిందనాలి.

భారత రాజకీయ కుటుంబ వారసత్వ పరంపరలో మునిగి తేలుతున్నవారు కోకొల్లలు. మూడేళ్ల క్రితం జరిగిన సారస్వత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన-ఓడిన అభ్యర్థుల జాబితా చూస్తే చాలు, రాజకీయ వారసుల జాబితాలో ఎన్ని పేర్లున్నాయో తెలుసుకోవడానికి. కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసిన మురళి దేవరా కుమారుడు మిళింద దేవరా, సునీల్ దత్ కుమార్తె ప్రియా దత్, చగన్ భుజ బల్ అల్లుడు సమీర్ భుజ్ బల్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎస్.బి.చవాన్ అల్లుడు-ముఖ్యమంత్రి అశోక్ చవాన్ బావమరిది భాస్కర రావ్ పాటిల్, మాజీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కొడుకు ముకుల్ వాస్నిక్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి హెచ్. ఎన్. బహుగుణ కొడుకు ఉత్తరాంచల్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ (ఇతడి సోదరి యు.పి.సీ.సీ అధ్యక్షురాలుగా పనిచేసిన రిటా బహుగుణ-మరో కజిన్ బిసి.ఖండూరీ ఒక నాటి ఉత్తరాంచల్ ముఖ్యమంత్రి), ఆంధ్ర ప్రదేశ్ (దివంగత)ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి వారసులుగా ఎదుగుతున్న మరో తరం ప్రజాస్వామ్య భావితరం నాయకులు. ఆ మాటకొస్తే ఆంధ్ర ప్రదేశ్ మంత్రి బొత్సా సత్యనారాయణ కుటుంబానికి చెందిన నలుగురికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆయనకు, ఆయన తమ్ముడికి, అల్లుడికి ఎమ్మెల్యే టికెట్లు, భార్యకు ఎంపీ టికెట్ లభించింది. అందరూ గెలవడం విశేషం. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన ఉమాశంకర్ దీక్షిత్ కోడలు శీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా దశాబ్దం పైగా పనిచేస్తుంది. ఆమె తనయుడు సందీప్ దీక్షిత్ ను ఆమె అప్పుడే రాజకీయాల్లోకి తేవడం పార్లమెంట్ సభ్యుడుగా చేయడం జరిగిపోయింది. హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యుడుగా కూడా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు దీపీందర్ సింగ్ హుడా ఆయన వారసుడుగా ఎదుగుతున్నాడు. ఆయనిప్పుడు పార్లమెంటు సభ్యుడు. భూపిందర్ కన్నా ముందున్న ముఖ్యమంత్రి దేవీ లాల్ తనయుడు ఓం ప్రకాష్ చౌతాలా కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. సమాజ్ వాది పార్టీ నాయకుడు, మాజీ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులంతా వారసులుగా ఎదుగుతున్నవారే. కొడుకు అఖిలేష్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కాగా, ఆయన రాజీనామా చేసిన పార్లమెంట్ స్థానంలో పోటీ చేసిన కోడలు ప్రస్తుతం లోక్ సభ సభ్యురాలు.

నెహ్రూ-గాంధి కుటుంబ వారసుడిగా ఐదో తరం నాయకుడు-భావి భారత ప్రధానిగా పలువురు భావిస్తున్న రాహుల్ గాంధి, ఆయన తల్లి సోనియా గాంధి కాంగ్రెస్ అభ్యర్థులుగా వారసత్వ పరంపరలో పోటీ చేసి గెలవగా, సంజయ్ గాంధి కొడుకు వరుణ్-భార్య మేనకా గాంధి భారతీయ జనతా పార్టీ పక్షాన పోటీ చేసి గెలిచారు. ఒరిస్సా ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తనయుడు దిప్ గొగోయ్, మరో మాజీ ముఖ్య మంత్రి బిజూ పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్, మనీష్ తివారి, వినీత్ సింగ్ బిట్టు, కుమారి షెల్ జా, నాధు రాం మిర్ధా మనుమ రాలు జ్యోతి మిర్ధాలు కూడా వారి-వారి కుటుంబాలకు వారసులే. మోతీలాల్ ఓరా కొడుకుకు, అజిత్ జోగి భార్యకు, రాజస్థాన్ లో జగన్నాధ పహాడియా-సిస్ రామ్ ఓలా-నావల్ కిశోర్ శర్మ-గోవింద్ సింగ్ గుర్జార్ వాళ్ల పిల్లలకు వారసత్వ నాయకులుగా ఎదిగే అవకాశాలు దొరికాయి. జాతీయ స్థాయిలో నెహ్రూ-గాంధి కుటుంబ అడుగు జాడల్లోనే, ప్రాంతీయ స్థాయి నాయకులు కూడా నడుచుకోవడం విశేషం. వారసత్వ కుటుంబ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితం కాలేదు. ఎన్.సీ.పీ వ్యవస్థాపక నాయకుడు శరద్ పవార్ కూతురు తండ్రికి వారసురాలిగా ఎదగసాగింది. ఆమె ఇప్పుడు పార్లమెంట్ సభ్యురాలు. కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప పెద్దకొడుకు రాఘవేంద్ర, మాజీ ప్రధాని దేవెగౌడ ఇద్దరు కుమారులు (ఒక కొడుకు హెచ్. డి. కుమార గౌడ ఈ ఈపాటికే జె. డి-ఎస్ నాయకుడు మాత్రమే కాకుండా, కర్నాటక ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు), తమిళ నాడు ముఖ్యమంత్రి సంతానం: కొడుకు అజహగరి, కూతురు కణిమొజిహి, కొడుకు స్టాలిన్, మురసోలి మారన్ కొడుకు దయానిధి మారన్, మాజీ లోక సభ స్పీకర్ పీ. . సంగ్మా కూతురు అగాథ చురుగ్గా ఎదిగిన కొందరు కాంగ్రేసేతర వారసులు. వీరంతా చట్ట సభల్లో రంగ ప్రవేశం చేశారీ పాటికే. జమ్ము-కాశ్మీర్ లో షేక్ అబ్దుల్లా తనయుడు ఫరూక్ అబ్దుల్లా, ఆయన తనయుడు ఒమర్ అబ్దుల్లా...అందరూ నాయకులే. అంతా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రులైన వారే. కేంద్రంలో కీలక పదవులను అనుభవించిన వారే. వారి ప్రత్యర్థి పీ.డీ.పీ నాయకుడు ముఫ్టి మహమ్మద్ సయీద్ కూతురు మెహబూబా అప్పుడే నాయకురాలైంది. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్ టీ రామారావు అల్లుళ్లిద్దరు, ఒక కొడుకు, కూతురు రాజకీయాల్లో కీలకమైన స్థానాల్లో వున్నారు. చంద్రబాబు నాయుడు తమ్ముడు నాయకుడే. కొడుకు కూడా ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్నాడు. మహారాష్ట్ర శివసేన నాయకుడు బాల్ థాకరే కొడుకు నాయకుడే. అలానే కరుణాకరన్, నందినీ సత్ పథి, జగ్జీవన్ రాం వారసులూ ఎదిగారు. ఆర్.జే.డీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్, జెఎంఎం పార్టీ మహితో, మాజీ గుజరాత్ సీ. ఎం చిమన్ భాయి పటేల్ తమ అర్థాంగులను అందలం ఎక్కించారు.
          
ఒక తరం నుంచి మరో తరానికి రాజకీయాధికారం బదిలీ అవుతోందిలా. వారసత్వ రాజకీయాలు-కుటుంబ రాజకీయాలు దేశ భవిష్యత్ ను శాసించే దిశగా కదులుతున్నాయి. రాచరిక వ్యవస్థకు సంబంధించిన రాజకీయాలకు అలవాటు బడిన భారతీయులకు, అనాదిగా, రాజులు-మహారాజులు-చక్రవర్తులు తమ తమ కొడుకులను-కూతుళ్లను తమ తదనంతరం సింహాసనం అధిష్టింప చేసేందుకు పన్నే వ్యూహాల గురించిన కథలను విన్నారు. ప్రజాస్వామ్య మౌలిక సిద్ధాంతాలను ఇంకా సరిగ్గా అవగాహన చేసుకోలేని అమాయక భారతీయులు, బహుశా వర్తమాన రాజకీయాలలోనూ, వారసత్వంగా, తమ సంతానం నాయకత్వం చేపట్టడంలో తప్పులేదని భావిస్తుండవచ్చు. అలా మొదటి తరం నాయకులు తమ వారసులుగా సంతానాన్ని తేవడంలో అ నైతికం లేదనే వారి భావన కావచ్చు. అందుకే, స్థానిక సంస్థల నుంచి, ప్రధాన మంత్రి స్థాయి వరకు, వంశ పారంపర్యంగా కొన్ని కుటుంబాలకు చెందిన వారికే రాజకీయాధికారం లభిస్తోంది. ఒక్క సారి అధికారంలోకి రావడంతోనే, తమ సర్వ శక్తులను ఒడ్డి, బయట వారెవరినీ రాకుండా, తమ వారినే తమ వారసులుగా చేసే ప్రజాస్వామ్య రాచరిక వ్యవస్థ వేళ్లూనుకోసాగింది. దీని పర్యవసానం ఏంటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. దీనికి అడ్డు కట్ట వేయడం సాధ్యమేనా? భారత దేశంలోని రాజకీయ పార్టీలన్నీ, అవినీతిని ఉత్పత్తిచేసే, వంశపారంపర్య కుటుంబ వ్యవస్థలు. వీటిని పెంచి పోషించే వ్యక్తులు, తమ కుటుంబీకులను తప్ప, వెలుపల వారిని, తమ గుప్పిట్లో వుంచుకున్న పార్టీలోకి అడుగుబెట్టనివ్వరు. లోపలున్న వారి గొంతు నొక్కేసి, అసమ్మతి రాగాన్ని వినిపించకుండా జాగ్రత్త పడతారు. ఫలితంగా అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోవడం, ధన బలం-కండ బలం-కుల, మత బలం ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. ప్రజ్ఞా పాటవాలు-శక్తి సామర్థ్యాలున్న సాటి-తోటి పౌరులు, సమాజానికి ఎంతో సేవ చేయాలని వున్నా, దానికి కావాల్సిన రాజకీయ కుటుంబ నేపధ్యం లేకపోవడంతో, ఎన్నికల్లో పోటీ చేయలేక పోవడం, చేసినా, గెలిచి చట్ట సభల్లో ప్రవేశించలేక పోవడం కష్టమై పోతోంది. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే, భారత ప్రజాస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం లేనిది గాను-ప్రజల సాధికారత కొరవడేదిగాను కావడం తథ్యం. ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల సారధ్యంలో ఆయా రాజకీయ నాయకుల కుటుంబ పాలన కొనసాగి, "ప్రజాస్వామ్య సంస్థానాలు" ఆవిర్భవించే ప్రమాదం పొంచి వుంది.
          
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, వారసత్వ స్వామ్యంగా మార్పుచెందుతుందనడానికి సజీవ సాక్ష్యాలెన్నో--ఎన్నెన్నో వున్నాయి. ఆదిలో ముఖ్యమంత్రి పీఠాన్నెక్కిన బూర్గుల, నీలం, బెజవాడల తర్వాత మిగిలిన వారందరి వారసులు పదవులను పొందిన వారే. బ్రహ్మానందరెడ్డికి చెందిన కాసు కృష్ణారెడ్డి; పీవీ నరసింహా రావుకు చెందిన ఇద్దరు రాజేశ్వర రావులు, రంగారావు, మరో ఒకరిద్దరు కజిన్లు; జలగం వెంగళ్ రావు తమ్ముడు, కొడుకులు; మర్రి చెన్నారెడ్డి కొడుకు శశిధర రెడ్డి; అంజయ్య సతీమణి మణెమ్మ; ఎన్. జనార్ధన రెడ్డి సతీమణి రాజ్య లక్ష్మి; కోట్ల విజయభాస్కర రెడ్డి కొడుకు సూర్య ప్రకాశ్ రెడ్డి-కోడలు సుజాత; డాక్టర్ వై. ఎస్. రాజశేఖర రెడ్డి కొడుకు, భార్య; నాదెండ్ల భాస్కర రావు కొడుకు మనోహర్; ఎన్ టీ రామారావు కొడుకు, కూతురు, అల్లుళ్లు; చిరంజీవి తమ్ముళ్లు, బావమరిది; తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే సీ ఆర్ అల్లుడు, కొడుకు; ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఇంకా మిగిలి పోతారు. ఎంపీల, ఎమ్మెల్యేల, జిల్లా పరిషత్ అధ్యక్షుల, పార్టీల అధ్యక్షుల కుటుంబీకులనేక మంది వారసత్వ వరుసలో వున్నారు.

ఈ ప్రమాదానికి, వారసత్వ సంస్కృతికి కారకులెవరంటే, జవాబుగా కాంగ్రెస్ పార్టీ అని ఎవరైనా వెంటనే చెప్తారు. తండ్రి మోతీలాల్ నుంచి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని వారసత్వంగా పొందిన జవహర్లాల్ నెహ్రూ, వ్యూహాత్మకంగా-పకడ్బందీగా కుటుంబ వారసత్వ పాలనకు, ఆయన ప్రధానిగా వున్న కాలంలోనే పునాదులు వేశారు. కూతురు ఇందిర ప్రధాని కావాలని నెహ్రూ భావించారు. ఆయన కోరిక నెరవేరింది. ఇందిరా గాంధీ కూడా తండ్రి-తాత బాటలోనే పయనించింది. మొదట సంజయ్ గాంధీని, తర్వాత రాజీవ్ గాంధీని తెర పైకి తెచ్చింది తన వారసుడిగా. ఎమర్జెన్సీ ముందర, తర్వాత సంజయ్ గాంధీ ప్రభావం ఇందిరపై బాగా పనిచేసింది. విమాన ప్రమాదంలో సంజయ్ దుర్మరణం తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే. సంజయ్ వస్తాడనుకున్న స్థానాన్ని రాజీవ్, ఇందిర మరణం తర్వాత భర్తీ చేశాడు. ఆ తర్వాత, మకుటం లేని మహారాణిగా, సోనియా వారసత్వం స్వీకరించారు. ఇక ముందుంది రాహుల్ పర్వం. ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగింది కాదా? ఏమో! ఇలా...మోతీలాల్...దేవీ లాల్...భజన్ లాల్... కైరాన్... కరుణానిధి.. కరుణాకరన్..చరణ్ సింగ్...అర్జున్ సింగ్..బిజూ పట్నాయక్...దేవెగౌడ..శరద్ పవార్...బాల్ ఠాక్రే.. బహుగుణ.. నందిని సత్పథి...ఎవరైనా ఒకటే ! అందరి కోరికా తమ కుటుంబీకులే, తమ స్థానాల్లో పదవులలంకరించాలని. రాచరికంలో లేని వారసత్వం ప్రజాస్వామ్యంలో సుసాధ్యం చేసిన ఘనత మనదే! ప్రజాస్వామ్యాన్ని మించిన పాలనా విధానం లేనే లేదు. అధికారంలో తమ వాళ్ళే వుండిపోవాలన్న కాంక్షతో, కొందరు వ్యక్తులు "ప్రజాస్వామ్యాన్ని" "వారసత్వ స్వామ్యం" గా మలిచేశారు. ప్రజాస్వామ్యాన్ని-రాజకీయ వ్యవస్థను గేలి చేసి, హాస్యాస్పదం చేశారు. ప్రపంచంలో మనను చిన్న చూపు చూసే పరిస్థితి కలిగించారు. ఈ పాపంలో అన్ని రాజకీయ పార్టీలకు-నాయకులకు అంతో, ఇంతో భాగం వుంది. వారసత్వంగా ఎదిగిన-ఎదుగుతున్న వారిలో ఏ కొద్ది మందో తప్ప, చాలా మంది అలా ఎదగడానికి కేవలం రాజకీయ-కుటుంబ నేపధ్యమే కారణం అనక తప్పదు. ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయిందీ కారణాన.

Sunday, July 15, 2012

ఫిడల్ కాస్ట్రో-జులై తిరుగుబాటు: వనం జ్వాలా నరసింహారావు


ఫిడల్ కాస్ట్రో-జులై తిరుగుబాటు
వనం జ్వాలా నరసింహారావు

2006 లో శస్త్ర చికిత్స జరిగిన తరువాత, క్షీణించిన ఆరోగ్యం కారణాన, క్యూబన్ కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆ దేశపు ఉక్కు మనిషి ఫిడల్ కాస్ట్రో స్థానంలో ఆయన సోదరుడు రావుల్ కాస్ట్రో పార్టీ-పాలనా బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నాడు. ఫిబ్రవరి 19, 2008 న దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాస్ట్రో స్థానంలో 15 మంది సభ్యులతో, రావుల్ కాస్ట్రో నాయకత్వాన పోలిట్ బ్యూరో ఏర్పాటైంది. 1959 లో జరిగిన విప్లవం దరిమిలా, మొట్టమొదటి సారి, క్యూబాలో నాయకత్వ మార్పిడి జరిగి, ఒక చారిత్రాత్మక ఘట్టానికి తెరలేచిందని, న్యూయార్క్ టైమ్స్ వర్ణించింది. అన్నదమ్ములిరువురు ఒకరి పక్కన మరొకరు ఒకే వేదికపై ఉమ్మడిగా కనిపించిన ఆ సన్నివేశాన్ని కరతాళ ధ్వనులతో అక్కడ హాజరైన అసెంబ్లీ ప్రతినిధులు స్వాగతం పలికారు. "క్యూబాలో సామ్యవాద సిద్ధాంతాన్ని ఆచరణలో కాపాడుకుంటూ, రక్షించుకుంటూ, పదిలపరచుకుంటూ, బధ్రపరుచుకుంటూ, త్రికరణ శుద్ధిగా కొనసాగించడానికి, ఏ నాటికీ దేశం సామ్రాజ్యవాదం వైపు మొగ్గు చూపేందుకు అనుమతించకుండా వుండేందుకు నా పదవిని ఉపయోగించుకుంటాను" అని, ఆ సందర్భంగా అన్నాడు రావుల్.
కాస్ట్రోతో పాటు 50 సంవత్సరాల క్రితం తిరుగుబాటులో పాల్గొన్న దీర్ఘకాలిక పార్టీ సభ్యుడు రామొన్ మాషడోను, రావుల్ తన "నంబర్ టు" గా చేశాడు. ఆయన సహచర 15 మంది పోలిట్ బ్యూరో సభ్యులందరూ వయసు మీరిన వారే. అరవై ఏళ్ల పైబడిన వారిలో ఐదుగురు సైనిక జనరల్స్ కాగా, ఎక్కువమంది పురుషులే. అధికారాన్నైతే వదిలాడు కాని, క్యూబన్ రాజకీయాలలో, కాస్ట్రో గళం మాత్రం ఇంకా వినిపిస్తూనే వుంది. తన బ్లాగ్‍లో ఎప్పటికప్పుడు సమకాలీన రాజకీయాల మీద ఆయన వ్యాస పరంపర కొనసాగుతూనే వుందింకా. ఉదాహరణకు, అమెరికా అధ్యక్షుడు ఒబామా లిబియాలో ఇచ్చిన ఉపన్యాసం మీద చురకలు వేస్తూ, న్యూయార్క్ టైమ్స్ ఓపెన్ ఎడిట్ పేజీలో వ్యాసం రాస్తూ, ఆయనను విమర్శించాడు. ఒబామా చిన్నపిల్లలకు పని కొచ్చే కథలు రాసుకుంటూ జీవించటానికి పనికొస్తాడని పేర్కొన్నాడందులో. 2006 లో శస్త్ర చికిత్స జరిగిన తరువాత, యాక్టివ్ రాజకీయాలకు దూరమైనా, విదేశీ నాయకులను కలవడం మానలేదు. తన జాగింగ్ దుస్తుల్లో ఆయన వారిని కలిసేవాడు. "గ్రామా" అనే పత్రికకు అంతర్జాతీయ ఆర్థిక సమస్యల దగ్గరనుంచి, ప్రపంచ కప్పు వ్యవహారాల దాకా వ్యాసాలు పంపుతుండేవాడు. ప్రేమించినా-ద్వేషించినా, ఫిడల్ కాస్ట్రో లేని దేశంలో జీవించడాన్ని ఊహించలేదు చాలామంది క్యూబన్ పౌరులు. దానికి కారణం, అహర్నిశలూ, క్యూబాలో సామ్యవాదం కొనసాగేలా తన శాయశక్తులా కృషి చేస్తూ, ఆ వ్యవస్థను బలహీన పరిచేందుకు ఎవరు ప్రయత్నించినా వారిని నిర్దాక్షిణ్యంగా కాస్ట్రో అణచి వేయడమే!
అంతటి మహనీయుడైన కాస్ట్రో, ప్రపంచ దేశాలలో-అందునా అలీన దేశాలలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడం నేపధ్యంలో చాలా కృషి వుంది. జనవరి 7, 1959 న విజయ దుందుభి మ్రోగించుకుంటూ, క్యూబన్ రాజధాని హవానాలో అడుగిడిన ఫిడల్ కాస్ట్రో తిరుగుబాటు ప్రభుత్వాన్ని మొట్ట మొదటిసారి గుర్తించింది అమెరికా దేశమే! "కమ్యూనిస్ట్ భావాలకు దూరంగా వుంటూ, అమెరికా దేశంతో స్నేహ సంబంధాలు కలిగుండాలి క్యూబా" అన్న ఆశాభావాన్ని వ్యక్త పరిచింది ఆ సందర్భంగా అమెరికన్ ప్రభుత్వం. అది మూణ్ణాళ్ల ముచ్చటే ఐంది.
మీడియం సైజు ప్రత్యేక శైలి గడ్డంతో అనునిత్యం కనిపించే కాస్ట్రో, తన 30 వ ఏట, విజయ గర్వంతో, హవానాలో అడుగిడినప్పుడు ఆయనకు, అప్పటి వరకు పాలించిన బటిస్టాను పదవీచ్యుతుడిని చేసిన "హీరో" గా స్వాగతం పలికారు క్యూబన్లు. అధికారంలోకి వచ్చిన అచిర కాలంలోనే, నియంతృత్వ పాలనను ఏళ్ల తరబడి కొనసాగించిన బటిస్టా మద్దతు దార్లను అనేక మందిని, హవానాలోని చారిత్రాత్మక "లా కబానా" ఖిల్లా దగ్గర విచారణ జరిపించకుండానే వురి తీసింది ప్రభుత్వం. అప్పటిదాకా అమెరికన్ల ఆధీనంలో వుంటూ వస్తున్న ఆస్తులను-భూములను ప్రభుత్వం జప్తు చేసి తన అధీనంలోకి తెచ్చుకోవడంతో, అమెరికా దేశంలో ప్రజాభిప్రాయం కాస్ట్రోకి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయింది. ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించిన కాస్ట్రో, తన వ్యతిరేక దారులను ఉక్కుపిడికిలితో అణచివేశాడు. ఎప్పుడైతే తన ప్రభుత్వం మద్దతుకోసం కాస్ట్రో సోవియట్ యూనియన్ వైపు దృష్టి సారించాడో, స్నేహ హస్తం సారించాడో, అప్పుడే, ప్రపంచ పశ్చిమ భూభాగంలో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపింది. ఆ పరిణామంతో ఖంగుతిన్న అమెరికా, కాస్ట్రోను పదవీచ్యుతుడిని చేయాలన్న ఆలోచనలో పడవేసింది. అమెరికా దేశపు ఫ్లోరిడాకు కేవలం 90 మైళ్ల దూరంలోనే వున్న క్యూబాకు అమెరికాకు మధ్య సంబంధాలు చెడిపోసాగాయి. 1961 లో, 1962 లో, ఆ తరువాత మధ్య-మధ్య తమ దేశంపై అమెరికా చేసిన దాడులను, యుద్ధ వ్యూహంలో ఆరితేరిన కాస్ట్రో, తనకు అనుకూలంగా మలచుకున్నాడు. అమెరికా అధ్యక్షులైన ఫోర్డ్, కార్టర్, క్లింటన్‌లు ఏదో విధంగా కాస్ట్రోను లోబరచుకుని తమకు అనుకూలంగా తిప్పుకుంటామనుకున్నారు. అందుకే ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు చర్చలు జరిపారు. చర్చలకు అమెరికా చొరవ తీసుకున్న ప్రతిసారి, తన సహజమైన విప్లవాత్మక ధోరణిలో, ఆ చర్చలు విఫలమయ్యేట్లు చూశాడు. అమెరికా దేశాన్ని క్యూబన్ల దృష్టిలో శత్రువుగా చిత్రించి చూపి, క్యూబన్ల రక్షకుడుగా నిలిచాడు కాస్ట్రో. కమ్యూనిజాన్ని కౌగలించుకుని, అమెరికా వ్యతిరేకతను ప్రస్ఫుటంగా వ్యక్తపరుస్తూ, రెండింటినీ తాను అధికారంలో కొనసాగేటట్లు మలచుకున్నాడు.



ప్రపంచంలో క్వీన్ ఎలిజబెత్ తరువాత అధిక కాలం అధికారంలో వున్న వ్యక్తిగా ఫిడల్ కాస్ట్రో చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. లాటిన్ అమెరికాలో తిరుగులేని నాయకుడుగా ఎదిగాడు. చెరకు పండించే రైతు అక్రమ సంతానమైన కాస్ట్రో ఆగస్ట్ 13, 1926 న క్యూబాలో జన్మించాడు. చిన్న తనంనుంచే విప్లవ భావాలను పుణికిపుచ్చుకున్న కాస్ట్రో పదమూడేళ్ల వయస్సులోనే, తండ్రి వ్యవసాయ క్షేత్రంలో, సమ్మెను నిర్వహించాడు. తల్లిదండ్రులిరువురూ నిరక్షరాస్యులైనప్పటికీ, ఫిడల్‍ను బోర్డింగ్ పాఠశాలకు పంపారు. పాఠశాల క్రమశిక్షణ అంతగా నచ్చకపోయినా, అచిర కాలంలోనే, ఫిడల్ కాస్ట్రో తెలివైన-చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. పరుగు పందెంలోను, ఫుట్ బాల ఆటలోను, బేస్ బాల్ గేంలోను నైపుణ్యం సాధించాడు. 1944 లో పాఠశాల ఉత్తమ క్రీడాకారుడుగా బహుమతి పొందాడు కూడా. చదువు పూర్తైన తరువాత హవానాలో న్యాయవాదిగా జీవితం ప్రారంభించాడు. నిరంతరం బీద-పేదల కేసులే వాదించడానికి ఒప్పుకోవడం వలన, ఆర్థికంగా ఎదగలేక పోయాడు. ఈ నేపధ్యంలో క్యూబాలో నెలకొన్న ఆర్థిక అసమానతలను అర్థం చేసుకో సాగాడు. దేశాన్ని నియంత్రిస్తున్న అమెరికన్ వ్యాపార వేత్తల ఐశ్వర్యాన్ని, అంతస్తును అసహ్యించుకో సాగాడు. తిరుగుబాటు భావాలు పెరగ సాగాయి.
21 సంవత్సరాల వయస్సులో, 1947 లో, క్యూబన్ పీపుల్స్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడు కాస్ట్రో. అవినీతికి, అన్యాయానికి, బీదరికానికి, నిరుద్యోగానికి, చాలీ-చాలని జీతభత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఆ పార్టీ భావాలు ఆయనకు నచ్చాయి. ఐదేళ్ల లోనే, 1952 లో, ఆ పార్టీ పక్షాన ఎన్నికలలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికయ్యాడు. సహజంగా మంచి వాగ్ధాటి కలిగిన కాస్ట్రోకు పార్టీలోని యువకుల మద్దతు బాగా లభించింది. క్యూబన్ పీపుల్స్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్న తరుణంలో, జనరల్ ఫల్జెన్సియో బటిస్టా, సైన్యం తోడ్పాటుతో, అధికారాన్ని పూర్తిగా హస్తగతం చేసుకుని ఎన్నికలు జరగకుండా ఆపాడు. ఇక లాభం లేదనుకున్న కాస్ట్రో విప్లవం ద్వారానే క్యూబన్ ప్రజలకు విముక్తి లభిస్తుందని భావించాడు. 1953 లో 123 మంది స్త్రీ-పురుష విప్లవకారుల సహాయంతో, సైన్యం నివసించే మోంకాడా ప్రాంతంపై దాడి చేశాడు. బటిస్టాను పదవీచ్యుతుడిని చేయాలన్న వ్యూహం అప్పటికి బెడిసికొట్టింది. కాస్ట్రో అరెస్టు అయ్యాడు. అదృష్టవశాత్తు, కాస్ట్రోను వురితీయకుండా దగ్గర లోని పౌర జైలుకు పంపారు. జైలులో కూడా మరణానికి చేరువైన సందర్భాలున్నాయి. ఆపాటికే చోటుచేసుకున్న ప్రపంచ వ్యాప్త ప్రజాభిప్రాయ నేపధ్యంలో కాస్ట్రోను చంపించే ప్రయత్నం మానుకున్నాడు బటిస్టా. ముద్దాయిగా తనను విచారణ చేసిన అవకాశాన్ని ఉపయోగించుకున్న కాస్ట్రో, సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చి దేశం ఎదుర్కుంటున్న సమస్యలను ఏకరవు పెట్టాడు. ఆయన ఆనాడిచ్చిన ఉపన్యాసాన్ని తరువాత " హిస్టరీ విల్ అబ్సాల్వ్ మి" అనే పేరుతో పుస్తక రూపంలో ప్రచురించడం జరిగింది. కాస్ట్రోకు పదిహేనేళ్ల కారాగార శిక్ష విధించబడింది. పుస్తకం, విచారణ, జైలు శిక్ష లాంటివి క్యూబన్ల దృష్టిలో, ప్రపంచం దృష్టిలో కాస్ట్రోను హీరో చేశాయి. క్యూబన్ పౌరుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపధ్యంలో, రెండేళ్ల జైలు శిక్షను మాత్రమే అనుభవించిన కాస్ట్రోను ప్రభుత్వం విడుదల చేసింది. క్యూబా నుంచి మెక్సికోకు వెళ్లిన కాస్ట్రో, బటిస్టా ప్రభుత్వాన్ని కూల దోసేందుకు వ్యూహం పన్న సాగాడు.
యుద్ధ సామాగ్రిని సరిపోయినంత మోతాదులో సమకూర్చుకున్న అనంతరం, ఎనభై మంది విప్లవకారులతో కలిసి కాస్ట్రో, చి గువేరా, జాన్ ఆల్మీడా 1956 లో క్యూబాలోకి ప్రవేశించారు. మోంకాడా సైనిక స్థావరాల మీద దాడి చేసిన తేదీకి గుర్తుగా, ఈ బృందాన్ని "జులై 26 ఉద్యమం" గా పిలవ సాగారు. సియారా పర్వత శ్రేణిలో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని యుద్ధం కొనసాగించాలని ఆ బృందం ఎత్తుగడ వేసుకుంది. పర్వతాల దగ్గరకు చేరుకునే లోపునే ప్రభుత్వ సేనలు వారిపై దాడి చేశాయి. సియారాకు చేరుకునే సరికి కేవలం పదహారు మంది మాత్రమే మిగిలారు. వారి వద్ద వున్న ఆయుధాలు మొత్తం కలిపి పన్నెండే! తరువాత కొన్ని నెలల పాటు సమీపంలోని-చుట్టుపక్కల సైనిక స్థావరాలపై దాడి చేసి కాస్ట్రో బృందం తమ ఆయుధ సంపత్తిని పెంపొందించుకుంది. వారున్న ప్రాంతాన్ని ఆక్రమించుకుని స్వాధీనంలోకి తెచ్చుకున్న వెంటనే అక్కడి పేద రైతులకు భూమిని పంచారు. ఆ రైతుల మద్దతు వారికి పూర్తిగా లభించింది. కాస్ట్రో జాడ చెప్పమని పలువురిని హింసించ సాగారు. బటిస్టా ప్రభుత్వం చేయిస్తున్న అరాచకాలకు నిరసనగా ప్రజల మద్దతు కాస్ట్రోకు పెరగ సాగింది. 1958 లో నలబై ఐదు సంస్థలు సంయుక్తంగా ప్రభుత్వానికి రాసిన లేఖలో "జులై 26 ఉద్యమం" కు మద్దతు తెలిపాయి. న్యాయవాదుల, ఆర్కిటెక్టుల, దంతవైద్యుల, గణాంక నిపుణుల, సామాజిక కార్యకర్తలతో కూడిన జాతీయ స్థాయి సంస్థలవి. ఒకప్పుడు కేవలం పేద వారి మద్దతు మాత్రమే వుంటుందనుకున్న కాస్ట్రోకు పరపతిగల మధ్యతరగతి వారి మద్దతు కూడా పూర్తి స్థాయిలో లభించసాగింది.
ప్రభుత్వ సేనలపైన దెబ్బ మీద దెబ్బ తీసుకుంటూ ముందుకు సాగింది "జులై 26 ఉద్యమం". 1958 వేసవికాలంలో వేయి మందికి పైగా బటిస్టా సైనికులు చనిపోవడమో, గాయపడడమో జరిగింది. బటిస్టా సేనల మాదిరి కాకుండా, తమకు పట్టుబడిన ప్రభుత్వ సైనికులను గౌరవంగా చూడడం చేసేది "జులై 26 ఉద్యమం" బృందం. యుద్దంలో అనుకూలంగా లేని ప్రతిసారి బటిస్టా సేనలు కాస్ట్రో సేనలకు లొంగిపోవడానికి ఇది దోహదపడింది. క్రమేపీ సేనలు మొత్తం గొరిల్లాలతో కలవడం ప్రారంభమైంది. అమెరికా బటిస్టా ప్రభుత్వానికి మద్దతుగా అధునాతన ఆయుధాలను సరఫరా చేసింది. గొరిల్లాల ముందర అవి వాడడం తెలియని ప్రభుత్వ సేనలు అపజయం దిశగానే పోసాగారు. మార్చ్ 1958 లో బటిస్టా సేనల విఫలం చూసిన అమెరికా, ఆ దేశంలో ఎన్నికలు జరిపించమని సూచించింది. ఆ సూచనను పాటించి ఎన్నికలు జరపడం జరిగింది కాని, ఓటర్లు ఎన్నికలను పెద్ద ఎత్తున బహిష్కరించారు. ఎదురు దాడిలో బటిస్టాను ఓడించగలనన్న నమ్మకంతో కాస్ట్రో గొరిల్లాలు ప్రధాన నగరాల వైపుగా కదల సాగారు. అమెరికాను సంప్రదించిన బటిస్టా, దేశం వదిలి పారిపోవడానికి సన్నద్ధమయ్యాడు. మిగిలిన కొందరు సైనిక జనరల్స్ మిలిటరీ పాలన తేవాలని చేసిన ప్రయత్నాలను కాస్ట్రో తిప్పికొట్టాడు. ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా, దేశ వ్యాప్త కార్మిక-కర్షక-సకల జనుల సమ్మెకు పిలుపిచ్చాడు. పెద్ద సంఖ్యలో ఆ పిలుపుకు లభించిన స్పందనను గమనించిన మిలిటరీ వెనక్కు తగ్గింది. జనవరి 9, 1959 న కాస్ట్రో విజయ పథంవైపు దూసుకుంటూ, హవానా నగరం చేరుకుని క్యూబా నూతన నాయకుడుగా ప్రజల ముందుకొచ్చాడు.
కాస్ట్రో పాలన అమెరికాకు రుచించలేదు. క్యూబాలోని అమెరికన్ ఆస్తులను, టెలిఫోన్ కంపెనీని జాతీయం చేయడమే దీనికి కారణం. అమెరికా పట్ల తన వ్యతిరేకతను బాహాటంగానే ప్రదర్శించేవాడు కాస్ట్రో. తన దేశంలో పండిన చక్కెరను కొనడానికి అమెరికా అంగీకరించక పోవడంతో, సోవియట్ యూనియన్‍తోను, ఇతర తూర్పు యూరోప్ దేశాలతోను చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అమెరికా నిరాకరించిన ఆయుధ సామాగ్రిని, సాంకేతిక నిపుణులను, మెషినరీని ఇవ్వడానికి కూడా సోవియట్ యూనియన్ అంగీకరించింది. నాటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్హోవర్ కోపంతో కాస్ట్రోకి పాఠం చెపుదామనుకున్నాడు కాని, అది బెడసి కొట్టి, కాస్ట్రోను సోవియట్ యూనియన్‌కు మరింత చేరువ చేసింది. క్యూబా సోవియట్ యూనియన్ సైనిక స్థావరం అవుతుందేమోనన్న భయం కలగ సాగింది ఐసెన్హోవర్‍కు. క్యూబా వెలుపల గొరిల్లా సేనలను తయారు చేసి కాస్ట్రోను పదవీచ్యుతుడిని చేసే ప్రణాళిక సిద్ధం చేసింది అమెరికన్ ప్రభుత్వం. ఆయనను కనీసం ఇరవై పర్యాయాలన్నా మట్టుబెట్టే ప్రయత్నం చేసింది సిఐఏ. 1961 లో ఐసెన్హోవర్ స్థానంలో వచ్చిన జాన్.ఎఫ్.కెన్నెడీ మెడకు చుట్టుకుంది క్యూబన్ వ్యవహారం. కాస్ట్రోను తుదముట్టించడానికి కెన్నెడీ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. క్యూబా విషయంలో సరళంగా వ్యవహరించ దలిచిన కెన్నెడీకి, తనను కమ్యూనిస్ట్ పక్షపాతి అంటారేమోనన్న భయం పట్టుకుంది. ఎప్పుడైతే సోవియట్ యూనియన్ పెద్ద ఎత్తున క్యూబా పక్షాన నిలిచిందో, అప్పుడే, కెన్నెడీ ఆ దేశానికి పిర్యాదు చేయడం జరిగింది.
అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో, ప్రజాభిప్రాయం తనకు వ్యతిరేకంగా వుంటుందేమోనని భయపడ సాగాడు కెన్నెడీ. క్యూబాపై దాడి మోతాదును కుదించుదామనుకున్నాడు కెన్నెడీ. సోవియట్ యూనియన్ మరోవైపు తన క్యూబా మద్దతును ద్విగుణీకృతం చేసింది. అణుయుద్ధం జరిగే ప్రమాదం దిశగా అమెరికా-సోవియట్ యూనియన్ కదల సాగాయి. దీనికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలు మొదలయ్యాయి. రష్యా ప్రధాని నికితా కృశ్చేవ్ తన కోపాన్ని కెన్నెడీకి వరుస వుత్తరాల ద్వారా వ్యక్త పరిచాడు. క్యూబాపైన దాడికి దిగబోమని అమెరికా హామీ ఇస్తే, తాము తమ మిస్సైల్స్ ను ఉపసంహరించుకుంటామని కృశ్చేవ్ అన్నాడు. కెన్నెడీ ఆ ప్రతిపాదనకు అంగీకరించడంతో అప్పటికి అణు యుద్ధ ప్రమాదం తప్పింది. అమెరికా-సోవియట్ యూనియన్ల మధ్య అణుయుద్ధ ప్రమాదం సంభవించాల్సిన ఏకైక సన్నివేశం "క్యూబన్ మిస్సైల్ సంక్షోభం" ఆ విధంగా అప్పటికి సమసి పోయింది. ఇక అక్కడినుంచి ప్రచ్చన్న యుద్ధం మొదలైంది. సోవియట్ యూనియన్‌పై క్యూబా సైనిక సంపత్తి కోసం ఆధారపడడం కొనసాగింది. నికితా కృశ్చేవ్ తరువాత వచ్చిన ఆయన వారసులు బ్రెజ్నేవ్, యాండ్రపోవ్, చెర్నెంకో, గోర్బచేవ్‍లు ఆ ఆచారాన్ని కొనసాగించారు. సోవియట్ యూనియన్ పతనం తరువాత అది ఆగిపోయింది. జులై 31, 2006 న తన రాజకీయ బాధ్యతలను తమ్ముడు రావుల్‍కు బదలాయించాడు కాస్ట్రో. ఫిబ్రవరి 19, 2008 న తానిక భవిష్యత్‍లో దేశాధ్యక్షుడుగా కాని, సైనికాధికారిగా కాని వుండబోనని ప్రకటించాడు. 


Saturday, July 14, 2012

దక్షిణ చైనా సాగర సంక్షోభంతో మారుతున్న చైనా విదేశాంగ విధానం: వనం జ్వాలా నరసింహారావు


దక్షిణ చైనా సాగర సంక్షోభం
మారుతున్న చైనా విదేశాంగ విధానం
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (04-08-2012)
దక్షిణ చైనా సాగర సంక్షోభంపై జులై పదమూడున జరిగిన ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ శిఖరాగ్ర సభ అర్థాంతరంగా, ఏ నిర్ణయం తీసుకోకుండా ముగిసింది. సుమారు 45 సంవత్సరాల శిఖరాగ్ర సభల చరిత్రలో మొట్టమొదటి సారి సభ్యదేశాల ఉమ్మడి ప్రకటన వెలువడకుండా పోయింది. సింగపూర్ నుంచి తైవాన్ వరకూ వ్యాపించి వున్న దక్షిణ చైనా సాగర తీరం సుమారు 3,500,000 కిలోమీటర్లుంటుంది. ప్రపంచంలోని మూడోవంతు నౌకాయానం ఈ జలాలలోనే సాగుతుంటుంది. అంతేకాకుండా, ఈ ప్రాంతపు సాగరగర్భంలో అపారమైన గాస్, నూనె నిక్షేపాలున్నాయని అంచనా. ఉమ్మడి ప్రకటన వెలువడకపోవడానికి ప్రధాన కారణం చైనా ఆ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలే! ఆ దేశపు శత్రు పక్షమైన ఫిలిప్పీన్స్ అక్కడ జరిగిన వైఫల్యాలకు చైనాతో స్నేహం కలిపిన కాంబోడియాను తప్పుబట్టింది. ఆద్యతన భవిష్యత్‍లో అక్కడ సమస్య మరింత క్లిష్ట తరం కావడం ఖాయమని కూడా ఫిలిప్పీన్స్ హెచ్చరించింది. అక్కడి సాగర ప్రాంతంలో లభ్యమవుతుందని భావిస్తున్న గాస్, ఆయిల్ నిక్షేపాలకోసం చైనాతో పాటు వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాలు పోటీపడుతున్నాయి. చైనా-ఫిలిప్పీన్స్ దేశాల మధ్య, ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాల నేపధ్యంలో, చైనా దూకుడు వ్యవహారం, అంతర్జాతీయ సంబంధాల దిశగా ఒక నూతనాధ్యాయానికి నాంది పలికే సూచనలు కనపడుతున్నాయని, విదేశాంగ విధాన నిపుణులు భావిస్తున్నారు. ఆసియా దేశంలో పరిస్థితిని సమతుల్యం చేయాలని తపన పడుతున్న అమెరికాకు, చైనా-ఫిలిప్పీన్స్ సంవాదం, ఆ దేశ ప్రయోజనాలను కాపాడుకునే ఆలోచనలో దింపవచ్చు.



కొరియా యుద్ధం కాని, ఇండియా-చైనా యుద్ధం కాని, చైనా-వియత్నాం యుద్ధం కాని, చైనా యుద్ధ విదేశాంగ నీతి అమలులో ఎదుర్కుంటున్న సవాళ్ల తీరుతెన్నులను తెలియచేస్తాయి. ప్రచ్ఛన్న యుద్ధాల రోజులు ముగిసిన తరువాత, పొరుగు దేశాలతో కాని, మరే ఇతర దేశాలతో కాని చైనా కయ్యానికి కాలుదువ్వలేదు. కాకపోతే కొన్ని అడపాదడపా సంఘటనలలో చైనా తలదూర్చక తప్పలేదు. ఉదాహరణలుగా 1995-96 తైవాన్ సాగర కాలువ సంక్షోభం; 2010 నాటి శంకాకు-డయాయు ఐలాండులో చోటుచేసుకున్న చైనా-జపాన్ యుద్ధనౌక సంక్షోభం; 2001 ఇ-పి నౌక సంఘటన లేదా "హైనాన్ ఐలాండ్ సంఘటన" లను చెప్పుకోవచ్చు.
సెప్టెంబర్ 1949 లో అమల్లోకి వచ్చిన చైనా తాత్కాలిక రాజ్యాంగంలో ఆ దేశపు విదేశాంగ విధానం మౌలిక సూత్రాలను పేర్కొంది. దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారం, ప్రపంచ శాంతి-సహృద్భావం, ఇరుగు-పొరుగు దేశాలతో సహా అన్ని ప్రపంచ దేశాలతో మైత్రి, వలస వాద-సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకత ఆ సూత్రాలలో ప్రధానమైనవి. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా అవతరించిన తరువాత ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం విదేశాంగ విధానాన్ని మరింత వివరంగా పేర్కొంది. అందులో ప్రధానమైంది స్వతంత్ర విదేశాంగ విధానంతో కూడిన "పంచశీల సిద్ధాంతం". ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని-స్వతంత్ర ప్రతిపత్తిని గౌరవించడం; ఒకరిపై మరొకరు యుద్ధానికి దిగకుండా వుండడం; ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో తలదూర్చక పోవడం; ఒక దేశం మరొక దేశమంటే గౌరవంతో సమానత్వంతో మెలగడం; ఇతర దేశాలతో ఆర్థిక-సాంస్కృతిక వ్యవహారాల విషయంలో ఇచ్చి పుచ్చుకునే ధోరణితో మెలగడం-సత్సంబంధాలను కలిగి వుండడం ఆ ఐదు సిద్ధాంతాలు. సామ్రాజ్యవాదాన్ని, వలస వాదాన్ని, ఆధిపత్య విధానాన్ని నిరంతరం వ్యతిరేకించడం కూడా చైనా విదేశాంగ విధానంలో భాగమే. అణగారిన ప్రపంచ దేశాలకు, అణచి వేయబడుతున్న దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు, వారు తమ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడం కొరకు జరుపుతున్న న్యాయ పోరాటాలలో వారికి అండగా నిలిచి, వారి అభివృద్ధికి తోడ్పడం కూడా చైనా విదేశాంగ నీతిలో ఒక భాగమే! తద్వారా ప్రపంచ శాంతిని, మానవాభివృద్దిని కాంక్షిస్తున్నట్లు చైనా పేర్కొంది తన రాజ్యాంగంలో. దాదాపు వంద సంవత్సరాల పాటు సామ్రాజ్యవాద దురాక్రమణకు గురైన చైనా, 1949 లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా అవతరించిన తరువాత, అది సుదీర్ఘ పోరాట ఫలితంగా సంపాదించుకున్న స్వాతంత్ర్యాన్నే తన విదేశాంగ విధాన మౌలిక సిద్ధాంతంగా పరిగణిస్తుంది. యుద్ధ నివారణకు, ప్రపంచ వ్యాప్తంగా శాంతియుత వాతావరణం నెలకొనడానికి, చైనా ఎల్లప్పుడూ సిద్ధమే అని రాజ్యాంగంలో వుంది.
ప్రచ్ఛన్న యుద్ధ కాలంనుంచీ చైనా విదేశాంగ విధానంలో సంక్షోభ నియంత్రణ-నివారణ జరిగే పద్ధతి ఒక రకమైన పజిల్ లాగా వుంటుంది. దాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. ఉదాహరణకు, తైవాన్ సాగర కాలువ సంక్షోభం సందర్భంలో, ఆ దేశాధ్యక్షుడు 1995-96 లో కార్నెల్ విశ్వవిద్యాలయం సందర్శనకు వచ్చినప్పుడు, చైనా నాటకీయంగా అనుసరించిన విధానం చెప్పుకోవాలి. అదే విధంగా, 2001 లో ఇ. పి-3 వ్యవహారం. అప్పుడు చైనా ఎందుకు అమెరికాతో ఇచ్చి-పుచ్చుకునే పద్ధతిలో వ్యవహరించిందో అర్థం చేసుకోవాలి. అమెరికా నుంచి అస్పష్టంగా అందిన "క్షమాపణ" ఆధారంగా, ఆ దేశపు యుద్ధ నౌకను విడుదల చేసింది చైనా. విదేశాంగ విధానం సంక్షోభంలో పడిపోయినప్పుడు, చైనా, ఎప్పుడు రాజీపడుతుంది? ఎప్పుడు దూకుడుగా వ్యవహరిస్తుంది? అన్నది ప్రశ్నార్థకమైన నిర్ణయంగానే భావించాలి. చైనా విదేశాంగ విధానం సంక్షోభం తీరుతెన్నులను మూడు రకాలుగా పరిశీలించాలి-అంచనా వేయాలి. సంక్షోభం ఎంత తీవ్రమైంది అనేది మొదటిది. అది నిజంగా అత్యంత తీవ్రమైంది అయితే, చైనా దెబ్బతినే పరిస్థితులే కనపడితే, సవాళ్లు విషమించితే, సాధారణంగా చైనా వెనక్కు తగ్గే ప్రసక్తి రానేరాదు. చైనా ప్రభుత్వం నడిపే నేతల అధికారం ఎంత మోతాదులో వుందనేది కూడా ప్రధానమైందే. కమ్యూనిస్ట్ రాజకీయ-సైనిక అధికార స్వామ్య చట్రంలో ఇంకా ఇమడలేని నాయకులు, సంక్షోభ నివారణలో కొంచెం వెనుకబడిపోతారు. చివరగా చెప్పుకోవాల్సింది, అంతర్జాతీయ ఒత్తిడులు. ముఖ్యంగా అమెరికా-ఇతర అగ్ర రాజ్యాల పరోక్ష ఒత్తిడులు కూడా చైనా విదేశాంగ విధాన సంక్షోభ పరిష్కారంలో అప్పుడప్పుడూ కీలకమవుతాయి.
ఈ కారణాలే ఆ దేశ విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దుతాయి. నాయకుడు గట్టివాడైతే ఒక విధంగాను, బలహీనుడైతే మరొక విధంగాను నిర్ణయాలుంటాయి. గట్టివాడు ఇచ్చి-పుచ్చుకునే ధోరణిలోనో, పట్టు వీడని ధోరణిలోనో, సమయానుకూలంగా వ్యవహరించే అవకాశం వుంటుంది. చేతకాని వాడు, సంక్షోభాన్ని మరింత క్లిష్ట తరం చేసి, ఇంకొంచెం ఇబ్బందులకు గురిచేయవచ్చు. ఈ ఏడాది అటు అమెరికాలోను, ఇటు చైనాలోను, నాయకత్వ మార్పిడి జరిగే అవకాశాలు లేకపోలేదు. ఒక వేళ ఒబామా ఓడి, ఆయన ప్రత్యర్థి మిట్ రోమ్‌నీ గెలుస్తే, ఆయన చైనా విదేశాంగ విధానానికి అనుగుణంగా చైనా నడచుకోక తప్పదు. రాబోయే రోజుల్లో, సమయం-సందర్భాన్ని పట్టి చూస్తే, పూర్తిగా మంచి కాలం అన్నా కావచ్చు, చెడు కాలమన్నా కావచ్చు. ఇప్పుడే చెప్పలేం. 2008 నుంచి, చైనా విదేశాంగ విధానం తీరుతెన్నులను పరిశీలించి విశ్లేషించిన నిపుణులు, వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారం, ఆ దేశం కొంచెం ఆధిపత్య దిశగా సాగుతోందన్న అర్థం స్ఫురిస్తుంది. చైనా విధానాలకు అనుగుణంగా అమెరికా నడచుకోక తప్పదని కూడా వారి భావనలో గోచరిస్తుంది. గత శతాబ్దపు బూజుపట్టిన అమెరికా విధానాలను ఇంకా చైనా పట్ల అనుసరించడం అంత మంచిది కాదు. 21 వ శతాబ్దంలో అడుగిడిన చైనా విధానాలను అర్థం చేసుకుని, ఆ దేశం పట్ల అప్రమత్తతతో మెలగడం శ్రేయస్కరం.
ఇదిలా వుండగా, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్, చైనాపై వ్యూహాత్మక ఒత్తిడి తెచ్చేందుకు, దక్షిణ చైనా సాగర ప్రాంతంలోని దేశాలలో సుడిగాలి పర్యటన చేశారు. అమెరికా-చైనా దేశాల మధ్య సంబంధాలు సక్రమంగా కొనసాగడానికి కాని, ఆసియా అభివృద్ధికి కాని, ఇలాంటి ఒత్తిడులు మంచిదికాదని నిపుణుల అభిప్రాయం. తన పర్యటనలో భాగంగా ఆమె, ఆఫ్గానిస్తాన్, జపాన్, మంగోలియా, లావోస్, వియత్నాం, కాంబోడియా దేశాలకు దౌత్య పరమైన రీతిలో తిరిగి వచ్చారు. అక్కడి సమస్యను మరింత జటిలం చేసే తరహాలో, కొన్ని ఆగ్నేయ ఆసియా దేశాలకు మద్దతు ఇస్తున్నట్లుగా మాట్లాడారు. దక్షిణ చైనా సాగరంపై ఆ దేశానికి వున్న ఆసక్తిని కూడా పదే-పదే ప్రస్తావించింది క్లింటన్. గతంలో దక్షిణ చైనా సాగరం విషయంలో కొంత స్తబ్దత నెలకొని వుండేది. దానికి కారణం, సమస్యను సహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సంబంధిత దేశాలన్నీ కోరుకోవడం. ఎప్పుడైతే, రెండేళ్ల క్రితం జరిగిన ఆగ్నేయ ఆసియా విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన క్లింటన్, తమ దేశానికి ఆ ప్రాంతంపై ఆసక్తి వుందని ప్రకటించాడో, అప్పుడే సమస్య తీవ్రత మొదలైంది. ఫిలిప్పైన్స్, జపాన్, వియత్నాం దేశాల ఇటీవలి ధోరణి కూడా సమస్యను మరికొంత జటిలం చేసింది. "చెట్లు నిశ్శబ్దంగా వున్నప్పటికీ గాలి వీస్తూనే వుంటుంది" అన్న చైనా సామెత ప్రకారం, ఆ దేశం ఎప్పుడు ఏ విదేశాంగ సమస్య వచ్చినా ఆచి-తూచి మరీ అడుగులు వేస్తుంది. చైనా దౌత్య నీతిని అనుసరించి సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని ప్రయత్నించినప్పటికీ, కొన్ని దేశాలు, ముఖ్యంగా అమెరికా ప్రోద్బలంతో, చైనాపై సవాళ్లు విసరడం, దానికి ఆ దేశం ఎదురు తిరగడం జరుగుతుంటుంది.
ఇరాక్-ఆఫ్గానిస్తాన్ దేశాలలో యుద్ధం అనంతరం, సుమారు పది సంవత్సరాల విరామం తరువాత, అమెరికా విదేశాంగ విధానం, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొనడానికి దృష్టి సారిస్తే అభ్యంతరం లేదు. అలా కాకుండా స్వార్ధం కొరకు చేస్తే అది ప్రమాదానికి దారి తీయవచ్చు. శాంతి కొరకు చైనా ఆంతరంగిక విషయాలలో అమెరికా జోక్యం చేసుకోవడం ఆపు చేసి, ఆ దేశ సమస్యలను, చైనా ప్రభుత్వానికే వదిలెయ్యడం మంచిది. దానర్థం, చైనాలో జరగవచ్చని భావిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘన లాంటి సంఘటనల విషయంలో, అంతర్జాతీయ సమాజం నోరు మెదపరాదని కాదు. అంతర్జాతీయ మార్గదర్శకాలను పాటించేలా చైనాను ప్రోత్సహించవచ్చనే కాని, ఆంతరంగిక విషయాలలో బలవంతంగా జోక్యం చేసుకోవడం తగదు. కొందరు అమెరికన్ రాజకీయ వేత్తలు చీటికిమాటికి, చైనాకు-అమెరికాకు మధ్య శత్రుత్వం శాశ్వతమైంది గా చిత్రించి మాట్లాడుతుంటారు. అది కూడా తగని పనే. సహకారం అనేది అటు చైనానుంచి ఎంతగా కోరుకుంటామో, అంతే మోతాదులో, ఇటు అమెరికా నుంచి కూడా వుండాలి. చైనాను మనం శత్రువు అని భావిస్తే, అది నిజంగా శత్రుత్వంతోనే వుంటుందంటున్నారు దౌత్యవేత్తలు. అందుకే, ఆ దేశ విదేశాంగ విధానంలో పేర్కొన్న విధంగా, చైనాకు స్నేహ హస్తం చాటడం మంచిదేమో!



                

Friday, July 13, 2012

South China Sea Crisis and China's Foreign Policy: Vanam Jwala Narasimha Rao


South China Sea Crisis and China's Foreign Policy
Vanam Jwala Narasimha Rao
            
The Southeast Asian regional summit ended in bitterness on July 13 over China's assertive role in the strategic South China Sea, failing to agree on a concluding joint statement for the first time in its 45-year history. The South China Sea is a part of the Pacific Ocean, encompassing an area from the Singapore and Malacca Straits to the Strait of Taiwan of around 3,500,000 square kilometers. One-third of the world's shipping transits through its waters. It is also believed that the part holds huge oil and gas reserves beneath its seabed. The Philippines deplored ASEAN's failure to address the worsening row, and criticized Cambodia--a close ally of China--for its handling of the issue during the foreign ministers' meeting. Philippines also hinted at the risk of a serious conflict. The South China Sea has become Asia's biggest potential military flashpoint as Beijing's sovereignty claim over a huge, looping area has set it against Vietnam and the Philippines as the three countries race to tap possibly huge oil reserves.
This recent confrontation between China and the Philippines in the South China Sea has increased suspicions regarding the rise of China according to Kai He, visiting Fellow at the East-West Center in Washington and Assistant Professor in the Department of Political Science at Utah State University. He says that as the United States claims to “rebalance towards Asia,” the diplomatic and military crises between China and its neighbors will inevitably involve US interests in the Asia-Pacific.



Existing studies of Chinese crisis behavior focus mainly on military conflicts, such as the Korean War, the Sino-Indian War and the Sino-Vietnamese War. Moreover, since the end of the Cold War, China has not engaged in any overt military conflicts with another state. However, there have been sporadic “near crises” between China and other countries which had the latent potential to escalate further into military confrontations, such as the 1995-96 Taiwan canal Crisis, the Sino-Japanese boat collision in 2010 near the Senkaku / Diaoyu Islands and the 2001 EP-3 incident (The mid-air collision between a United States Navy "EP-3E ARIES II signals intelligence aircraft" and a People's Liberation Army Navy (PLAN) "J-8II interceptor fighter jet" on April 1, 2001, resulting in an international dispute between the United States of America and the People's Republic of China, known as the "Hainan Island incident").
The provisional constitution after it was adopted in September 1949, clearly stipulated that the basic principle of China's foreign policy was to guarantee independence, freedom and territorial integrity of the state, support protracted world peace and friendly cooperation among peoples of all countries in the world, and oppose imperialist policies of aggression and war. The Constitution of the People's Republic of China revised China's foreign policy as: "China adheres to an independent foreign policy as well as to the five principles of mutual respect for sovereignty and territorial integrity, mutual non-aggression, non-interference in each other's internal affairs, equality and mutual benefit, and peaceful coexistence in developing diplomatic relations and economic and cultural exchanges with other countries; China consistently opposes imperialism, hegemonyism and colonialism, works to strengthen unity with the people of other countries, supports the oppressed nations and the developing countries in their just struggle to win and preserve national independence and develop their national economies, and strives to safeguard world peace and promote the cause of human progress."
          Since China suffered imperialist aggression and oppression for over 100 years before the founding of the People's Republic in 1949, it regards the hard-earned right of independence as the basic principle of foreign policy. The pronounced common aspiration of the Chinese people as well as the people of the world is to maintain peace and to eliminate wars.
          The five principles of peaceful coexistence were put forward in line with the reality of a multipolar world. Respect to sovereignty is the most fundamental principle in a new type of international relations. Mutual non-aggression means to get rid of the threat of using arms and armed threat in the internal relations among countries. Non-interference in each other's international affairs is the most important principle in international relations to guarantee each country's right to take care of its own internal affairs and prevent any other country from interfering with any means. Equality and mutual benefit mean political equality, economic equality, cooperation, mutual benefit and supplement to each other's needs. Peaceful coexistence calls on all countries to seek common interests, reserve differences, respect each other, maintain friendly cooperation and live in harmony regardless of differences in their social systems and ideologies.
            There are puzzles in explaining the patterns of China’s foreign policy crisis management since the end of the Cold War. For example, why did China act so dramatically in response to Taiwanese President Lee Teng-hui’s visit to Cornell University during the 1995-96 Taiwan Strait Crisis? If military avoidance was the major goal, China’s multiple rounds of military exercises and missile tests actually reveal more weakness than strength.
On the other hand, why did China seek accommodation with the United States in the 2001 EP-3 incident and release the US crew after receiving a vaguely-worded “apology” from the then US Ambassador to China? What are the conditions that determine Chinese leaders’ decisions for coercion or compromise during a foreign policy crisis?
            China’s foreign policy crisis behavior is influenced by three integrated factors. The severity of the crisis is the first factor. If China is a victim of the crisis or its core interests are seriously challenged, it is difficult for China to back down, at least immediately. The authority of Chinese decision makers is another key factor in shaping China’s behavior. If a Chinese leader has not yet established his authority within the communist political and military bureaucracy, he may not be able to control the interests of other factions when coordinating a response.
            Last, but not least, international pressure— the status of China’s relations with the United States and other great powers—also plays a crucial role in influencing Chinese leaders’ foreign policy crisis behavior.
These factors frame Chinese leaders’ policy choices during crises in a very dynamic way. A domestically and internationally confident Chinese leader may choose an accommodative way to deal with a serious foreign policy crisis, such as the EP-3 incident. A weak leader may choose to escalate or even initiate an unnecessary crisis to divert domestic strife or consolidate domestic authority.
This year there will be a leadership transition in China, and maybe the election of a new president in the United States. The new Chinese political leadership will need time to consolidate their domestic authority, and if elected, Mitt Romney’s Chinese policy will take some time to unfold. Depending on circumstances, it may be “the best of times” or “the worst of times” in US-China relations.
            Some analysts suggest that since 2008 China’s foreign policy behavior has become more assertive. The United States needs to adjust its own policies toward China. It is not constructive to deal with China using policies from the last century. Today, because of China’s increased global standing, it has to more forcibly condemn and react to what it perceives as provocative unilateral actions towards Taiwan on behalf of the United States. US policy makers would be well-advised to consider developing a new China policy that is more considerate of China’s interests going into the 21st century.
            The United States should also avoid meddling in China’s domestic affairs and let China deal with its own domestic problems. This does not mean that the international community should ignore what Chinese leaders do to their people in their own country. Instead, the United States and other nations should encourage, rather than try to force, China to abide by global rules and norms, both diplomatically and strategically.
            The United States further needs to make use of Face Saving strategies to help shape Chinese leaders’ policy choices, especially during foreign policy crises. Some US politicians frequently claim in public that confrontation between the United States and China is inevitable. However, Chinese leaders are reluctant in public to claim rivalry or enmity with other countries. If US leaders can spare Chinese leaders’ from losing “face” in public without jeopardizing US interests, then Chinese leaders are more likely to cooperate within the realm of international affairs, especially during foreign policy crises.
            To quote Joseph Nye: “If we treat China as an enemy, it will definitely become one.” If the United States treats China as a friend, it may or may not become one that shares the same interests and values with the United States. However, Chinese leaders will at least behave more conciliatorily towards the United States, especially during future foreign policy crises.
(Source: "Understanding China’s Foreign Policy Crisis Behavior" by Kai He, visiting Fellow at the East-West Center in Washington published in Asia Pacific Bulletin in its July 11, 2012 issue)


Thursday, July 12, 2012

ఎవరికీ కాని పీవీ నరసింహారావు: వనం జ్వాలా నరసింహారావు


వనం జ్వాలా నరసింహారావు

బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పీవీ బాధ్యుడా? పీవీకి, నెహ్రూ-గాంధీ వారసత్వ కుటుంబానికి బేధాభిప్రాయాలున్నాయా? ఆయన భారతీయ జనతా పార్టీతోను, ఎన్డీయే తోను కుమ్మక్కయాడా? పీవీ మతతత్వ వాదా? ఎందుకు పీవీ ఎవరికీ కానివాడయ్యాడు? అసలు సోనియాకు పీవీకి ఎందుకు-ఎక్కడ చెడింది? పీవీ మంచోడా? చెడ్డోడా? అన్న విషయాలపై ఇటీవల మాజీ కేంద్రమంత్రి అర్జున్ సింగ్, సీనియర్ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ ఆత్మకథలలో పేర్కొన్న అంశాల ఆధారంగా ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. వారు రాసిన ఆత్మకథలు "ఏ గ్రెయిన్ ఆఫ్ శాండ్ ఇన్ ద అవర్‌గ్లాస్ ఆఫ్ టైమ్", "బియాండ్ ద లైన్స్" లలో పేర్కొన్న అంశాలలో వాస్తవికత ఎంత? ఇలాంటి విషయాలపై మాట్లాడడానికి మన మధ్య అర్జున్ సింగ్ కాని, పీవీ నరసింహారావు కాని, కులదీప్ నయ్యర్‍కు చెప్పిన మధు లిమాయే కాని బ్రతికి లేరు. చెప్పాల్సిన వారు, వారి సమకాలీనులే. అదే జరుగుతోందిప్పుడు. పీవీ ప్రధానిగా వున్నప్పుడు ఆయన మీడియా సలహాదారుడు గాను, ఆయనకు ఆంతరంగికుడు గాను పనిచేసిన మన రాష్ట్రానికి చెందిన మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి పీవీఆర్‍కె ప్రసాద్ ఆ పుస్తకాలలో పేర్కొన్న పలు వివాదాంశ అంశాలపై వివిధ ఛానళ్లలో మాట్లాడడమే కాకుండా, హైదరాబాద్‌లో పాత్రికేయ సంఘాలు నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కూడా వివరించారు.
జరుగుతున్నదంతా పీవీ పైన ఆశ్చర్యకరమైన, బాధాకరమైన ఆరోపణలనక తప్పదు. వాస్తవమేంటో, బాబ్రీ మసీదు కూల్చివేత నేపధ్యంలో అక్కడ పీవీ ఇంట్లో జరిగిందేంటో చెప్పాల్సిన బాధ్యత తన మీద వుందంటూ, జరిగిన విషయాలన్నీ పూస గుచ్చినట్లు బహిరంగ పరిచారు పీవీఆర్‍కె. దాని సారాంశమే వ్యాసం. అర్జున్ సింగ్, కులదీప్ నయ్యర్ చెప్పిన దాంట్లో రాజకీయ కోణాలున్నాయి. అసలా మాటకొస్తే ఇవేవీ కొత్తగా చేస్తున్న వ్యాఖ్యానాలు కానే కావు. కాకపోతే చేసే పద్ధతే మారింది. ఇందులో రెండు-మూడు విషయాలు ప్రధానంగా చెప్పుకోవాలి. అసలు చేస్తున్న వ్యాఖ్యానాలు వాస్తవాధారంగా వున్నాయా? లేనప్పటికీ చేశారంటే, ఏదో ఒక కారణం-ప్రణాళిక వుండి తీరాలి. ఇదేదో మామూలుగా జరుగుతున్న విషయంలాగా కనిపించడం లేదు. అర్జున్ సింగ్ కానీ, కులదీప్ నయ్యర్ కానీ సంఘటనా స్థలంలో (పీవీ ఇంట్లో) లేరప్పుడు. అక్కడ జరిగింది ప్రత్యక్షంగా ఇద్దరూ చూడలేదు. ఇద్దరు కూడా ఎవరో చెప్పారని మాత్రమే అంటున్నారు. పీవీకి తాను టెలిఫోన్ చేసానని, అందుబాటులోకి రాలేదని అంటున్నారు అర్జున్ సింగ్. ఆయనకు ప్రధాని పీవీ కార్యాలయంలో-ఇంట్లో పనిచేస్తున్న వారందరూ తెలుసు. అందరి పేర్లూ తెలిసే వుండాలి. ఆయన ఎవరితో మాట్లాడారో చెప్పకుండా డొంక తిరుగుడుగా పీవీ అందుబాటులోకి రాలేదంటే ఎలా? ఆయన ఉద్దేశం పీవీ దొరకలేదనే అంశాన్ని హై లైట్ చేయడమే తప్ప అసలు వాస్తవం-నిజం తెలియచేయడం కానే కాదు. కులదీప్ నయ్యర్ లాంటి సీనియ పాత్రికేయుడు-పెద్ద మనిషి కూడా అర్జున్ సింగ్ తరహాలోనే రాయడం విడ్డూరం.
బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన రోజు ఉదయం నుంచి, రాత్రి పొద్దు పోయేంతవరకూ, మీడియా సలహాదారు హోదాలో పీవీఆర్‍కె ప్రసాద్ ప్రధాని ఇంట్లోనే ఆయన సమక్షంలోనే అధికారిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ వున్నారు. పీవీ గదిలో తలుపులు వేసుకుని "నీరో” లా పూజలు చేస్తున్నారనడం అసత్య ఆరోపణ. బాబ్రీ మసీదు చివరి ఇటుక కూలేంతవరకూ, ఆ విషయం తలుపులు తీసుకుని ఆయన చెవిలో ఎవరో చెప్పేంతవరకూ పీవీ పూజ చేస్తూనే వున్నారట! ఇంతకన్నా కాకమ్మ కథ ఇంకోటి లేదు. ఆనాడు, ఆ టైమ్‌లో చోటు చేసుకున్న సంగతులు, జరిగిన వ్యవహారం, తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమం అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తే, పీవీ గదిలో కూర్చుని పూజ చేశాడో? వ్యవహారాలు చక్కదిద్దుతున్నాడో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. పీవీ నిరంతరం హోం కార్యదర్శి మాధవ్ గోడ్బోలేతోను, కాబినెట్ కార్యదర్శి తోను, ఆయన వ్యక్తిగత కార్యదర్శితోను మంతనాలు చేస్తూనే వున్నాడు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో వారి ద్వారా కాంటాక్ట్ లో వున్నాడు. ముందస్తు జాగ్రత్తగా కేంద్రం పంపిన బలగాల గురించి ఆరా తీసి, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని ఉత్తర్వులు కూడా ఇప్పించారు పీవీ. న్యాయ శాఖ కార్యదర్శి పీసీ రావు గారిని, ఇతర అధికారులను పిలిపించుకుని, ఒక వేళ పరిస్థితి అలానే కొనసాగితే, కేంద్రం ఏం చెయ్యాలనేది కూడా బేరీజు వేసుకుంటున్నారు. 


ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయలేమని చేతులెత్తేసి ఆ విషయాన్ని కేంద్రానికి తెలియచేసింది. రాష్ట్ర ప్రభుత్వం అడగకుండానే ముందస్తు జాగ్రత్తగా కేంద్రం పంపిన బలగాలను, బాబ్రీ మసీద్ కట్టడం దగ్గర కాకుండా, మూడు కిలోమీటర్ల ఆవల వుంచింది రాష్ట్ర ప్రభుత్వం. వాటిని అప్పుడు కదిలించమని ఉత్తర్వులు ఇవ్వడమంటే, వేలాదిమంది కరసేవకులను చంపుకుంటూ పోవడమే! దానికీ పీవీ గారే బాధ్యుడా? ఆయన ఒకదానికి మాత్రం బాధ్యుడు. ముందుగానే రాష్ట్రపతి పాలన విధించక పోవడానికి బాధ్యుడు! అదే జరిగి వున్నట్లయితే మసీదు కూలకపోయేదేమో! కాకపోతే పీవీ రాష్ట్రపతి పాలన విధించాలా? వద్దా? అన్నది చాలా "ట్రిక్కిష్" ప్రశ్న. రాష్ట్రపతి పాలన విధించడానికి కొన్ని నిబంధనలున్నాయి-నియమాలున్నాయి-రాజ్యాంగ విలువలున్నాయి. శాంతి-భద్రతల సమస్య క్లిష్టతరమైందా ఒక రోజు ముందర, అంటే, అలాంటిదేమీ జరగలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ స్వయంగా వచ్చి ప్రభుత్వానికి, ఎన్డీయేకు ఏమీ జరగదని నమ్మకంగా చెప్పాడు. ప్రధానికీ అలానే చెప్పాడు. సుప్రీం కోర్టు ముందు కూడా చెప్పాడు. శాంతి-బధ్రతలను కాపాడుతానని వాగ్దానం చేశాడు. తనతో పాటు బీజేపీ జాతీయ నాయకులను కూడా పీవీ దగ్గరకు తీసుకొచ్చి మరీ నమ్మబలికాడు కల్యాణ్ సింగ్.
అర్జున్ సింగ్ ఇప్పుడే మంటున్నాడు? పీవీ బిజెపిని నమ్మాడని! ఆయన అందరితో మంచిగా వుండాలని ప్రయత్నం చేశాడని! పీవీ చేసింది అందరితో మంచిగా వుండే ప్రయత్నం కన్నా రాజ్యాంగపరంగా ఏం చేస్తే మంచిదనేది. పీవీ అంతటితో ఆగలేదు. సమస్యను సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాడు. రాజ్యాంగపరంగా శాంతిబధ్రతలు రాష్ట్రం చూసుకోవాలి. కేంద్రం వెనుకనుంచి మద్దతు ఇస్తుంది. పరిస్థితుల నేపధ్యంలో, బాబ్రీ మసీదు కట్టడాన్ని కాపాడే బాధ్యతను కేంద్రానికి అప్పచెప్పాలని సుప్రీం కోర్టును కోరింది పీవీ ప్రభుత్వం. న్యాయ స్థానం దానికి అంగీకరించలేదు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దానికి బాధ్యత తీసుకుంటానంటే ఎందుకు కేంద్రానికి ఆతురత అని ప్రశ్నించింది. మరో అడుగు ముందుకు వేసి, ఒక కమీషన్‌ను ఏర్పాటు చేసి, పరిశీలకుడిని నియమించింది.  మరి, ఆ పరిశీలకుడు ఏం చేస్తున్నట్లు? కేంద్ర పంపిన బలగాలను వినియోగించుకోవడంలో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తతతో వ్యవహరించిందో ఆ పరిశీలకుడు ప్రశ్నించాడా? అందుకే, మొత్తం వ్యవహారంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్నన్నా తప్పు పట్టాలి, లేదా, పరిశీలకుడినన్నా తప్పు పట్టాలి. మధ్యలో పీవీ ఏం తప్పు చేశాడు? రాష్ట్రపతి పాలన విధించక పోవడమేనా?
రాష్ట్రపతి పాలన విధించాలంటే, శాంతిబధ్రతల వైఫల్యం వుండాలి. అలాంటిదేమీ లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ నాయకులు నమ్మకంగా చెప్పారు. కేవలం వారి మీద ఆధార పడకుండా గవర్నర్ నివేదిక ప్రామాణికంగా తీసుకున్నారు పీవీ. గవర్నర్ తన నివేదికలో అలాంటిదేమీ లేదని స్పష్టంగా తెలియచేశారు. చాలామంది కరసేవకులొచ్చారనీ, అంతా శాంతియుతంగా జరుగుతుందనీ, అప్పుడు గనుక కేంద్రం జోక్యం చేసుకుంటే-రాష్ట్రపతి పాలన విధించితే, గొడవలు జరిగే అవకాశం వుందనీ గవర్నర్ నివేదిక సారాంశం. మరి ఆ గవర్నర్ గారి "లాయల్టీ" ఎలాంటిదో! అది వేరే విషయం. కానీ, రాజ్యాంగపరంగా నిర్ణయం తీసుకోవాలంటే వీలు కాని పరిస్థితి. న్యాయ శాఖ కార్యదర్శి పీసీ రావుగారు రాష్ట్రపతి పాలన రాజ్యాంగ విరుద్ధ మన్నారు. ఈ విషయాలన్నీ కేవలం పీవీ ఒక్కడిదే కాదు-అర్జున్ సింగ్‌తో సహా అక్కడున్న యావత్తు మంత్రి మండలి తీసుకున్న సమిష్టి నిర్ణయం. ఆనాడు తలెత్తిన ప్రశ్నలకు ఎవరిదగ్గరా సమాధానాలు లేవు. పీవీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రధాని అయినంత మాత్రాన బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చాలని ఎక్కడా లేదు. ఆయనకు రాజ్యాంగం మీద ఎనలేని గౌరవం. ఆయన రాజ్యాంగాన్ని అనుసరించి నిర్ణయం తీసుకున్నాడన్న నింద మోపవచ్చు! పోనీ, కల్యాణ్ సింగ్ మోసం చేశాడందామా? నమ్మక ద్రోహం చేశాడందామా? ఇచ్చిన మాట నిలబెట్టుకోక పోవడానికి అనేక కారణాలుండవచ్చు! బహుశా బీజేపీకి కూడా అలా జరుగుతుందన్న సమాచారం వుండి వుండకపోవచ్చు! ఆ తరువాత పార్లమెంటులో వాజ్‌పేయి-ఇతర బీజేపీ నాయకులు మాట్లాడిన దానిని బట్టి చూస్తే, అదే అర్థం స్ఫురిస్తుంది. వాళ్లు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారని. చివరకు కల్యాణ్‌తో సహా వారి నాయకత్వం దెబ్బ తింది-పీవీని దెబ్బ కొట్టారు!
పీవీ దెబ్బ తినడానికి ప్రధాన కారణం ప్రతిపక్షాల వ్యాఖ్యానాల కంటే స్వపక్షం వారి దాడే! పీవీ ప్రధానిగా ఏదో మూణ్ణాళ్ల ముచ్చటగా-ఆపద్ధర్మ ప్రధానిగా మాత్రమే పదవిలో కొనసాగుతాడని భావించాడు అర్జున్ సింగ్. అయన తరువాత తానే ప్రధాని అవుతానని కలలు కన్నాడు. పీవీని దింపుదామంటే, ఆయనేమో పావులు చాకచక్యంగా కదిపి, ఏకు-మేకై కూర్చున్నాడు. పాతుకు పోయాడు. కాంగ్రెస్ పార్టీ వారందరూ కలిసి బీజేపీని నిందించడానికి మారుగా, సొంత మనిషి పీవీని నిందించడం ఎంతవరకు సబబు? అంతే కాకుండా, బీజేపీతో పీవీ జతకట్టాడు అనే దాకా వెళ్లాడు అర్జున్ సింగ్. ఆ వ్యవహారం ఎంతవరకు వెళ్లిందంటే: చివరకు, పదిహేను సంవత్సరాల అనంతరం కూడా, అదీ, లిబర్హాన్ కమీషన్ పీవీని నిర్దోషి అని తేల్చిన తరువాత కూడా, కాంగ్రెస్ నాయకుడైన అర్జున్  సింగ్ తన ఆత్మకథలో ఇలా రాయడం, దానికి కులదీప్ నయ్యర్ లాంటి వారు వంత పలకడం విడ్డూరం. బాబ్రీ మసీదు కూల్చివేతకు తన పార్టీ-తమ ప్రధాని బాధ్యుడనే స్థితికి దిగజారాడు అర్జున్ సింగ్. ఆయన మైండ్ సెట్, అజెండా, ఒక రకంగా పీవీ మీద ద్వేషం-మరొక రకంగా ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కకుండా పోవడం. ఆయన ఆర్థిక సంస్కరణలైనా, భూసంస్కరణలైనా, నెహ్రూ-గాంధీ విధానాలను కొనసాగించడమే కాని దానికి విరుద్ధమెలా అవుతుంది? పీవీ తీసుకున్న ప్రతి నిర్ణయం దేశం కోసం మాత్రమే. ఆయనే కనుక తనకోసం నిర్ణయం తీసుకుంటే, మరో మారు ప్రధాని కావడం ఏ మాత్రం కష్టమయ్యేది కానే కాదు.
సోనియా వ్యతిరేకత విషయం ప్రస్తావించిన అర్జున్ సింగ్ పీవీ "ఎమోషనల్ ఔట్ బరస్ట్" గురించి రాశాడు. పీవీ తత్వం అర్థం చేసుకున్న చాలామందికి ఆయనకసలు అలాంటి గుణమే లేదనే వాస్తవం తెలుసు. ఇవన్నీ సోనియాకు-పీవీకి సంబంధాలు చెడగొట్టే ప్రయత్నం చేయడమే! బ్రతికుండగా అర్జున్ అస్తమానం పీవీ మీద సోనియాకు పితుర్లు మోయడమే పనిగా పెట్టుకున్నాడు. ఇప్పటికీ అలానే చేస్తున్నాడు. పీవీకి లాయల్టీ అంటే, విధానాలకా? వ్యక్తులకా? లాయల్టీకి సైకోఫెన్సీకి తేడా తెలియని అర్జున్ సింగ్ అలా రాయడంలో ఆశ్చర్యం లేదు. అర్జున్ సింగ్ తన అవసరాలకొరకు, స్వలాభం కొరకు, పీవీకి సోనియాకి మధ్య అగాధం సృష్టించాడు. అసలు పీవీని సోనియా కాని, ఆ నాటి కాంగ్రెస్ పెద్దలు కాని ప్రధాని చేయడానికి కారణం ఆయనకు నెహ్రూ-గాంధీ కుటుంబంపై లాయల్టీ కాదా? ఇప్పుడిలా సమయం సందర్భం లేకుండా పుస్తకాలలో ఏదో రాసి, రాసింది అంతవరకే బహిర్గతం చేసి పీవీని బదనాం చేయడం ఎంతవరకు సబబు? అసలు పీవీకి ఇంట్లో పూజ గదే లేనప్పుడు పూజ చేయడమనే ప్రశ్నే ఉదయించదు! అసలా రోజున ప్రధానిగా పీవీ ఇంటికి ఎవరెవరు-ఎప్పుడెప్పుడు వచ్చింది మొత్తం రికార్డై వుంటుంది కదా! అదెందుకు పరిశీలించరు? మరి ఎందుకీ రాతలు?
ఈ మధ్య కాలంలో మన దేశం దౌర్భాగ్య స్థితిలోకి పోతోంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని ఒక వైపు, ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసిన పీవీ ప్రభుత్వాన్ని మరో వైపు పోల్చి చూపే ప్రక్రియ మొదలైంది. ఇదే మన్మోహన్, పీవీ హయాంలో అలా ఎలా చేయగలిగాడు? అన్న చర్చ మొదలైంది. ఇప్పుడాయన ప్రధాని ఐతే కూడా ఎందుకు పని చేయలేకపోతున్నాడన్న ప్రశ్న అడుగుతున్నారు. పీవీ చేసిన మంచి పనంతా బయటకొస్తుందేమోనన్న భయం పట్టుకుంది కొందరు కాంగ్రెస్ వారికి. నిజంగా కాంగ్రెస్‌కు సద్భుద్దే వుంటే, పీవీ పనితీరును చెప్పి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలచుకోవాలి! దురదృష్టం ప్రతిపక్షాలకంటే కూడా కాంగ్రెస్ పార్టీలోనే పీవీ వ్యతిరేకులు ఎక్కువమంది వుండడం. తర-తమ బేధం లేని పాములపర్తి వెంకట నరసింహారావు పేరు అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో వుంటుందో-లేదో చెప్పలేం కాని, భారత దేశ చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడడం ఖాయం. ఆయన పేరు చిర స్థాయిగా నిలవడం నిజం!