వనం జ్వాలా నరసింహారావు
బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా
కానీ పీవీ బాధ్యుడా? పీవీకి,
నెహ్రూ-గాంధీ వారసత్వ కుటుంబానికి బేధాభిప్రాయాలున్నాయా? ఆయన
భారతీయ జనతా పార్టీతోను, ఎన్డీయే తోను కుమ్మక్కయాడా? పీవీ మతతత్వ వాదా? ఎందుకు పీవీ ఎవరికీ కానివాడయ్యాడు?
అసలు సోనియాకు పీవీకి ఎందుకు-ఎక్కడ చెడింది? పీవీ
మంచోడా? చెడ్డోడా? అన్న విషయాలపై ఇటీవల
మాజీ కేంద్రమంత్రి అర్జున్ సింగ్, సీనియర్ పాత్రికేయుడు
కులదీప్ నయ్యర్ ఆత్మకథలలో పేర్కొన్న అంశాల ఆధారంగా ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది.
వారు రాసిన ఆత్మకథలు "ఏ గ్రెయిన్ ఆఫ్ శాండ్ ఇన్ ద అవర్‌గ్లాస్ ఆఫ్ టైమ్", "బియాండ్ ద
లైన్స్" లలో పేర్కొన్న అంశాలలో వాస్తవికత ఎంత? ఇలాంటి
విషయాలపై మాట్లాడడానికి మన మధ్య అర్జున్ సింగ్
కాని, పీవీ నరసింహారావు కాని, కులదీప్
నయ్యర్‍కు చెప్పిన మధు లిమాయే కాని బ్రతికి లేరు. చెప్పాల్సిన వారు, వారి సమకాలీనులే. అదే జరుగుతోందిప్పుడు. పీవీ ప్రధానిగా వున్నప్పుడు ఆయన
మీడియా సలహాదారుడు గాను, ఆయనకు ఆంతరంగికుడు గాను పనిచేసిన మన
రాష్ట్రానికి చెందిన మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి పీవీఆర్‍కె ప్రసాద్ ఆ
పుస్తకాలలో పేర్కొన్న పలు వివాదాంశ అంశాలపై వివిధ ఛానళ్లలో మాట్లాడడమే కాకుండా, హైదరాబాద్‌లో పాత్రికేయ సంఘాలు నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కూడా
వివరించారు.
జరుగుతున్నదంతా పీవీ పైన ఆశ్చర్యకరమైన, బాధాకరమైన
ఆరోపణలనక తప్పదు. వాస్తవమేంటో, బాబ్రీ మసీదు కూల్చివేత
నేపధ్యంలో అక్కడ పీవీ ఇంట్లో జరిగిందేంటో చెప్పాల్సిన బాధ్యత తన మీద వుందంటూ,
జరిగిన విషయాలన్నీ పూస గుచ్చినట్లు బహిరంగ పరిచారు పీవీఆర్‍కె. దాని
సారాంశమే వ్యాసం. అర్జున్ సింగ్, కులదీప్ నయ్యర్ చెప్పిన
దాంట్లో రాజకీయ కోణాలున్నాయి. అసలా మాటకొస్తే ఇవేవీ కొత్తగా చేస్తున్న
వ్యాఖ్యానాలు కానే కావు. కాకపోతే చేసే పద్ధతే మారింది. ఇందులో రెండు-మూడు విషయాలు
ప్రధానంగా చెప్పుకోవాలి. అసలు చేస్తున్న వ్యాఖ్యానాలు వాస్తవాధారంగా వున్నాయా?
లేనప్పటికీ చేశారంటే, ఏదో ఒక కారణం-ప్రణాళిక
వుండి తీరాలి. ఇదేదో మామూలుగా జరుగుతున్న విషయంలాగా కనిపించడం లేదు. అర్జున్ సింగ్
కానీ, కులదీప్ నయ్యర్ కానీ సంఘటనా స్థలంలో (పీవీ ఇంట్లో)
లేరప్పుడు. అక్కడ జరిగింది ప్రత్యక్షంగా ఇద్దరూ చూడలేదు. ఇద్దరు కూడా ఎవరో
చెప్పారని మాత్రమే అంటున్నారు. పీవీకి తాను టెలిఫోన్ చేసానని, అందుబాటులోకి రాలేదని అంటున్నారు అర్జున్ సింగ్. ఆయనకు ప్రధాని పీవీ
కార్యాలయంలో-ఇంట్లో పనిచేస్తున్న వారందరూ తెలుసు. అందరి పేర్లూ తెలిసే వుండాలి.
ఆయన ఎవరితో మాట్లాడారో చెప్పకుండా డొంక తిరుగుడుగా పీవీ అందుబాటులోకి రాలేదంటే ఎలా?
ఆయన ఉద్దేశం పీవీ దొరకలేదనే అంశాన్ని హై లైట్ చేయడమే తప్ప అసలు వాస్తవం-నిజం
తెలియచేయడం కానే కాదు. కులదీప్ నయ్యర్ లాంటి సీనియ పాత్రికేయుడు-పెద్ద మనిషి కూడా
అర్జున్ సింగ్ తరహాలోనే రాయడం విడ్డూరం.
బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన రోజు ఉదయం
నుంచి, రాత్రి పొద్దు పోయేంతవరకూ, మీడియా సలహాదారు హోదాలో పీవీఆర్‍కె
ప్రసాద్ ప్రధాని ఇంట్లోనే ఆయన సమక్షంలోనే అధికారిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ
వున్నారు. పీవీ గదిలో తలుపులు వేసుకుని "నీరో” లా పూజలు చేస్తున్నారనడం అసత్య
ఆరోపణ. బాబ్రీ మసీదు చివరి ఇటుక కూలేంతవరకూ, ఆ విషయం తలుపులు
తీసుకుని ఆయన చెవిలో ఎవరో చెప్పేంతవరకూ పీవీ పూజ చేస్తూనే వున్నారట! ఇంతకన్నా
కాకమ్మ కథ ఇంకోటి లేదు. ఆనాడు, ఆ టైమ్‌లో చోటు చేసుకున్న
సంగతులు, జరిగిన వ్యవహారం, తీసుకున్న
నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమం అవగతం చేసుకునే ప్రయత్నం
చేస్తే, పీవీ గదిలో కూర్చుని పూజ చేశాడో? వ్యవహారాలు చక్కదిద్దుతున్నాడో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. పీవీ
నిరంతరం హోం కార్యదర్శి మాధవ్ గోడ్బోలేతోను, కాబినెట్
కార్యదర్శి తోను, ఆయన వ్యక్తిగత కార్యదర్శితోను మంతనాలు
చేస్తూనే వున్నాడు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో వారి ద్వారా కాంటాక్ట్ లో వున్నాడు.
ముందస్తు జాగ్రత్తగా కేంద్రం పంపిన బలగాల గురించి ఆరా తీసి, వాటిని
సక్రమంగా వినియోగించుకోవాలని ఉత్తర్వులు కూడా ఇప్పించారు పీవీ. న్యాయ శాఖ
కార్యదర్శి పీసీ రావు గారిని, ఇతర అధికారులను పిలిపించుకుని,
ఒక వేళ పరిస్థితి అలానే కొనసాగితే, కేంద్రం ఏం
చెయ్యాలనేది కూడా బేరీజు వేసుకుంటున్నారు.
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయలేమని
చేతులెత్తేసి ఆ విషయాన్ని కేంద్రానికి తెలియచేసింది. రాష్ట్ర ప్రభుత్వం అడగకుండానే
ముందస్తు జాగ్రత్తగా కేంద్రం పంపిన బలగాలను, బాబ్రీ మసీద్ కట్టడం దగ్గర
కాకుండా, మూడు కిలోమీటర్ల ఆవల వుంచింది రాష్ట్ర ప్రభుత్వం.
వాటిని అప్పుడు కదిలించమని ఉత్తర్వులు ఇవ్వడమంటే, వేలాదిమంది
కరసేవకులను చంపుకుంటూ పోవడమే! దానికీ పీవీ గారే బాధ్యుడా? ఆయన
ఒకదానికి మాత్రం బాధ్యుడు. ముందుగానే రాష్ట్రపతి పాలన విధించక పోవడానికి బాధ్యుడు!
అదే జరిగి వున్నట్లయితే మసీదు కూలకపోయేదేమో! కాకపోతే పీవీ రాష్ట్రపతి పాలన
విధించాలా? వద్దా? అన్నది చాలా
"ట్రిక్కిష్" ప్రశ్న. రాష్ట్రపతి పాలన విధించడానికి కొన్ని
నిబంధనలున్నాయి-నియమాలున్నాయి-రాజ్యాంగ విలువలున్నాయి. శాంతి-భద్రతల సమస్య
క్లిష్టతరమైందా ఒక రోజు ముందర, అంటే,
అలాంటిదేమీ జరగలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ స్వయంగా వచ్చి ప్రభుత్వానికి,
ఎన్డీయేకు ఏమీ జరగదని నమ్మకంగా చెప్పాడు. ప్రధానికీ అలానే చెప్పాడు.
సుప్రీం కోర్టు ముందు కూడా చెప్పాడు. శాంతి-బధ్రతలను కాపాడుతానని వాగ్దానం చేశాడు.
తనతో పాటు బీజేపీ జాతీయ నాయకులను కూడా పీవీ దగ్గరకు తీసుకొచ్చి మరీ నమ్మబలికాడు
కల్యాణ్ సింగ్.
అర్జున్ సింగ్ ఇప్పుడే మంటున్నాడు? పీవీ బిజెపిని
నమ్మాడని! ఆయన అందరితో మంచిగా వుండాలని ప్రయత్నం చేశాడని! పీవీ చేసింది అందరితో
మంచిగా వుండే ప్రయత్నం కన్నా రాజ్యాంగపరంగా ఏం చేస్తే మంచిదనేది. పీవీ అంతటితో
ఆగలేదు. సమస్యను సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాడు. రాజ్యాంగపరంగా
శాంతిబధ్రతలు రాష్ట్రం చూసుకోవాలి. కేంద్రం వెనుకనుంచి మద్దతు ఇస్తుంది.
పరిస్థితుల నేపధ్యంలో, బాబ్రీ మసీదు కట్టడాన్ని కాపాడే
బాధ్యతను కేంద్రానికి అప్పచెప్పాలని సుప్రీం కోర్టును కోరింది పీవీ ప్రభుత్వం.
న్యాయ స్థానం దానికి అంగీకరించలేదు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దానికి బాధ్యత
తీసుకుంటానంటే ఎందుకు కేంద్రానికి ఆతురత అని ప్రశ్నించింది. మరో అడుగు ముందుకు
వేసి, ఒక కమీషన్‌ను ఏర్పాటు చేసి, పరిశీలకుడిని
నియమించింది. మరి, ఆ
పరిశీలకుడు ఏం చేస్తున్నట్లు? కేంద్ర పంపిన బలగాలను
వినియోగించుకోవడంలో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తతతో వ్యవహరించిందో ఆ
పరిశీలకుడు ప్రశ్నించాడా? అందుకే, మొత్తం
వ్యవహారంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్నన్నా తప్పు పట్టాలి, లేదా,
పరిశీలకుడినన్నా తప్పు పట్టాలి. మధ్యలో పీవీ ఏం తప్పు చేశాడు?
రాష్ట్రపతి పాలన విధించక పోవడమేనా?
రాష్ట్రపతి పాలన విధించాలంటే, శాంతిబధ్రతల
వైఫల్యం వుండాలి. అలాంటిదేమీ లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి, బీజేపీ
జాతీయ నాయకులు నమ్మకంగా చెప్పారు. కేవలం వారి మీద ఆధార పడకుండా గవర్నర్ నివేదిక
ప్రామాణికంగా తీసుకున్నారు పీవీ. గవర్నర్ తన నివేదికలో అలాంటిదేమీ లేదని స్పష్టంగా
తెలియచేశారు. చాలామంది కరసేవకులొచ్చారనీ, అంతా శాంతియుతంగా
జరుగుతుందనీ, అప్పుడు గనుక కేంద్రం జోక్యం
చేసుకుంటే-రాష్ట్రపతి పాలన విధించితే, గొడవలు జరిగే అవకాశం
వుందనీ గవర్నర్ నివేదిక సారాంశం. మరి ఆ గవర్నర్ గారి "లాయల్టీ"
ఎలాంటిదో! అది వేరే విషయం. కానీ, రాజ్యాంగపరంగా నిర్ణయం
తీసుకోవాలంటే వీలు కాని పరిస్థితి. న్యాయ శాఖ కార్యదర్శి పీసీ రావుగారు రాష్ట్రపతి
పాలన రాజ్యాంగ విరుద్ధ మన్నారు. ఈ విషయాలన్నీ కేవలం పీవీ ఒక్కడిదే కాదు-అర్జున్ సింగ్‌తో
సహా అక్కడున్న యావత్తు మంత్రి మండలి తీసుకున్న సమిష్టి నిర్ణయం. ఆనాడు తలెత్తిన
ప్రశ్నలకు ఎవరిదగ్గరా సమాధానాలు లేవు. పీవీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రధాని
అయినంత మాత్రాన బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చాలని ఎక్కడా లేదు. ఆయనకు రాజ్యాంగం మీద
ఎనలేని గౌరవం. ఆయన రాజ్యాంగాన్ని అనుసరించి నిర్ణయం తీసుకున్నాడన్న నింద మోపవచ్చు!
పోనీ, కల్యాణ్ సింగ్ మోసం చేశాడందామా? నమ్మక
ద్రోహం చేశాడందామా? ఇచ్చిన మాట నిలబెట్టుకోక పోవడానికి అనేక
కారణాలుండవచ్చు! బహుశా బీజేపీకి కూడా అలా జరుగుతుందన్న సమాచారం వుండి
వుండకపోవచ్చు! ఆ తరువాత పార్లమెంటులో వాజ్‌పేయి-ఇతర బీజేపీ నాయకులు మాట్లాడిన
దానిని బట్టి చూస్తే, అదే అర్థం స్ఫురిస్తుంది. వాళ్లు కూడా
దిగ్భ్రాంతికి గురయ్యారని. చివరకు కల్యాణ్‌తో సహా వారి నాయకత్వం దెబ్బ
తింది-పీవీని దెబ్బ కొట్టారు!
పీవీ దెబ్బ తినడానికి ప్రధాన కారణం
ప్రతిపక్షాల వ్యాఖ్యానాల కంటే స్వపక్షం వారి దాడే! పీవీ ప్రధానిగా ఏదో మూణ్ణాళ్ల
ముచ్చటగా-ఆపద్ధర్మ ప్రధానిగా మాత్రమే పదవిలో కొనసాగుతాడని భావించాడు అర్జున్
సింగ్. అయన తరువాత తానే ప్రధాని అవుతానని కలలు కన్నాడు. పీవీని దింపుదామంటే, ఆయనేమో
పావులు చాకచక్యంగా కదిపి, ఏకు-మేకై కూర్చున్నాడు. పాతుకు
పోయాడు. కాంగ్రెస్ పార్టీ వారందరూ కలిసి బీజేపీని నిందించడానికి మారుగా, సొంత మనిషి పీవీని నిందించడం ఎంతవరకు సబబు? అంతే
కాకుండా, బీజేపీతో పీవీ జతకట్టాడు అనే దాకా వెళ్లాడు అర్జున్
సింగ్. ఆ వ్యవహారం ఎంతవరకు వెళ్లిందంటే: చివరకు, పదిహేను
సంవత్సరాల అనంతరం కూడా, అదీ, లిబర్హాన్
కమీషన్ పీవీని నిర్దోషి అని తేల్చిన తరువాత కూడా, కాంగ్రెస్
నాయకుడైన అర్జున్ సింగ్ తన ఆత్మకథలో ఇలా
రాయడం, దానికి కులదీప్ నయ్యర్ లాంటి వారు వంత పలకడం
విడ్డూరం. బాబ్రీ మసీదు కూల్చివేతకు తన పార్టీ-తమ ప్రధాని బాధ్యుడనే స్థితికి
దిగజారాడు అర్జున్ సింగ్. ఆయన మైండ్ సెట్, అజెండా, ఒక రకంగా పీవీ మీద ద్వేషం-మరొక రకంగా ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కకుండా
పోవడం. ఆయన ఆర్థిక సంస్కరణలైనా, భూసంస్కరణలైనా, నెహ్రూ-గాంధీ విధానాలను కొనసాగించడమే కాని దానికి విరుద్ధమెలా అవుతుంది?
పీవీ తీసుకున్న ప్రతి నిర్ణయం దేశం కోసం మాత్రమే. ఆయనే కనుక తనకోసం నిర్ణయం
తీసుకుంటే, మరో మారు ప్రధాని కావడం ఏ మాత్రం కష్టమయ్యేది
కానే కాదు.
సోనియా వ్యతిరేకత విషయం ప్రస్తావించిన
అర్జున్ సింగ్ పీవీ "ఎమోషనల్ ఔట్ బరస్ట్" గురించి రాశాడు. పీవీ తత్వం
అర్థం చేసుకున్న చాలామందికి ఆయనకసలు అలాంటి గుణమే లేదనే వాస్తవం తెలుసు. ఇవన్నీ
సోనియాకు-పీవీకి సంబంధాలు చెడగొట్టే ప్రయత్నం చేయడమే! బ్రతికుండగా అర్జున్
అస్తమానం పీవీ మీద సోనియాకు పితుర్లు మోయడమే పనిగా పెట్టుకున్నాడు. ఇప్పటికీ అలానే
చేస్తున్నాడు. పీవీకి లాయల్టీ అంటే, విధానాలకా? వ్యక్తులకా? లాయల్టీకి సైకోఫెన్సీకి తేడా తెలియని
అర్జున్ సింగ్ అలా రాయడంలో ఆశ్చర్యం లేదు. అర్జున్ సింగ్ తన అవసరాలకొరకు, స్వలాభం కొరకు, పీవీకి సోనియాకి మధ్య అగాధం సృష్టించాడు.
అసలు పీవీని సోనియా కాని, ఆ నాటి కాంగ్రెస్ పెద్దలు కాని ప్రధాని చేయడానికి
కారణం ఆయనకు నెహ్రూ-గాంధీ కుటుంబంపై లాయల్టీ కాదా? ఇప్పుడిలా సమయం సందర్భం
లేకుండా పుస్తకాలలో ఏదో రాసి, రాసింది అంతవరకే బహిర్గతం చేసి
పీవీని బదనాం చేయడం ఎంతవరకు సబబు? అసలు పీవీకి ఇంట్లో పూజ
గదే లేనప్పుడు పూజ చేయడమనే ప్రశ్నే ఉదయించదు! అసలా రోజున ప్రధానిగా పీవీ ఇంటికి
ఎవరెవరు-ఎప్పుడెప్పుడు వచ్చింది మొత్తం రికార్డై వుంటుంది కదా! అదెందుకు
పరిశీలించరు? మరి ఎందుకీ రాతలు?
ఈ మధ్య కాలంలో మన దేశం దౌర్భాగ్య
స్థితిలోకి పోతోంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని ఒక వైపు, ఆయన ఆర్థిక
మంత్రిగా పనిచేసిన పీవీ ప్రభుత్వాన్ని మరో వైపు పోల్చి చూపే ప్రక్రియ మొదలైంది.
ఇదే మన్మోహన్, పీవీ హయాంలో అలా ఎలా చేయగలిగాడు? అన్న చర్చ మొదలైంది. ఇప్పుడాయన ప్రధాని ఐతే కూడా ఎందుకు పని
చేయలేకపోతున్నాడన్న ప్రశ్న అడుగుతున్నారు. పీవీ చేసిన మంచి పనంతా బయటకొస్తుందేమోనన్న
భయం పట్టుకుంది కొందరు కాంగ్రెస్ వారికి. నిజంగా కాంగ్రెస్‌కు సద్భుద్దే వుంటే,
పీవీ పనితీరును చెప్పి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలచుకోవాలి! దురదృష్టం
ప్రతిపక్షాలకంటే కూడా కాంగ్రెస్ పార్టీలోనే పీవీ వ్యతిరేకులు ఎక్కువమంది వుండడం.
తర-తమ బేధం లేని పాములపర్తి వెంకట నరసింహారావు పేరు అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో
వుంటుందో-లేదో చెప్పలేం కాని, భారత దేశ చరిత్రలో ఆయన పేరు
సువర్ణాక్షరాలతో లిఖించబడడం ఖాయం. ఆయన పేరు చిర స్థాయిగా నిలవడం నిజం!
Excellent sir.
ReplyDeleteThis article should be published in National papers. Let the rogue Sonia gang behind the mud-slinging on PV be exposed. Let these buffoons bash Kalyan Singh and LK Adwani if Babar is itching them so bad.
స్వర్గస్థులయైన శ్రీపాములపర్తి వేంకట నరసింహారావుగారు వెనక్కి వచ్చి తన తప్పేమీలేదని నిరూపించు కోలేరు. ఆయన ఢిల్లీ గద్దె నెక్కడమే మహాశ్చర్యం. సలక్షణంగా పదవిలో కుదురుకోవటం పరమాశ్చర్యం. అయితే ఇది మింగుడు పడని వాళ్ళకు మాత్రం కొదవలేదు నాడూ - నేడూ కూడా!
ReplyDeleteసమర్థులు నెహ్రూ- గాంధీ అధికార కుటుంబం బయట కూడా ఉండటాన్ని ఆ కుటుంబమూ దాని తాబేదారులూ యెప్పుడూ జీర్ణించుకోలేరు. అందుకే పీ.వీ పైన నిందల మీద నిందలు!
అవమానాల మీద అవమానాలు.
అందులోనూ పీ.వీ తెలుగువాడై పోయాడే. తెలుగు వాడిని గౌరవించటం అనేకులకు యేమాత్రం నచ్చదు.
తెలుగువాడికి అగౌరవం జరిగితే సాటి తెలుగు వాళ్ళకు అస్సలు పట్టదు! అదీ మన దౌర్భాగ్యం.
Thank You
Delete