"చేతులు" కాలుతున్న వేళ.... రాహుల్ మంతనాల ఆంతర్యం?
సూర్య
దినపత్రిక (06-07-2012)
వనం జ్వాలా నరసింహారావు
స్వర్గీయ పివి నరసింహా రావు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత
కూడా, ఆయన చిరకాల వాంఛ ఏంటని ఎవరైనా రహస్యంగా అడుగుతే, వచ్చిన
సమాధానం, మరొక్క సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి
కావాలని వున్నదని అట. దానికి కారణం ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి అర్ధాంతరంగా
తొలగించడమే. అలానే ప్రణబ్ ముఖర్జీని ఆయన చిరకాల వాంఛ ఏంటని ఎవరన్నా అడుగుతే ఠంఛన్‍గా
వచ్చే సమాధానం, ఏ నాటికైనా ప్రధాన మంత్రి పీఠం అధిష్టించాలని
వుందని. ఆ కోరిక ఇక తీరే అవకాశం లేదు. ఒక సారి రాష్ట్రపతి ఐన తరువాత ప్రధాని
అయ్యేందుకు కుదరదని తెలిసినా, ఆయన ఆ పదవిని ఎంచుకోవడానికి
కారణం, ఇప్పట్లో, కాంగ్రెస్ పార్టీ మరో
మారు అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు లేనందునే. ఆ విషయం బాగా అర్థం చేసుకున్న
ప్రణబ్, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే, తనకెలాగూ ప్రధాని అయ్యేందుకు వీలు కాదు అని భావించి రాష్ట్రపతి పదవికి
అంగీకరించారు. ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే, దేశంలోను,
రాష్ట్రంలోను 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు లేనట్లే. దీనికి
కారణాలు అనేకం. రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి కాయ కల్ప చికిత్స చేసినా, ఆంధ్రప్రదేశ్
చేయి జారిపోయినట్లే!
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు, ఒక వైపు జబ్బు
ముదురుతుండగా, మరోవైపు, రోగ లక్షణాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి.
రోజు-రోజుకూ ఇన్‌ఫెక్షన్ వేగంగా పాకుతుండడంతో, వ్యాధిని
నియంత్రించడం కష్ట తరమై పోతోంది. బహుశా నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్
రాష్ట్ర శాఖ పరిస్థితిని, ఇంతకంటే మంచిగా ఎవరూ
వర్ణించలేరేమో! స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచీ, ఆంధ్ర
ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచీ, కాంగ్రెస్ పార్టీకి
కంచుకోటగా వుంటూ వస్తోందీ దక్షిణ భారత ప్రాంతం. కాకపోతే మొట్ట మొదటిసారి 1983-89 లో, ఆ
తరువాత 1994-2004 మధ్యలో, ప్రాంతీయ
పార్టీ తెలుగుదేశం చేతిలో ఓటమి పాలైనప్పటికీ, అస్తిత్వాన్ని
మాత్రం ఏ నాడూ కోల్పోలేదు. 1983-89 లో అధికారాన్ని కోల్పోయినా, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి
సమర్ధవంతమైన నాయకత్వంలో 1989 ఎన్నికల్లో ఘన విజయం
సాధించింది. అదే విధంగా 1994-2004 మధ్య కాలంలో
అధికారంలో లేకపోయినా డాక్టర్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 2004 లో మళ్లీ పూర్వ
వైభవాన్ని పొంది 2009 లో మరో మారు
ఎన్నికల్లో గెలిచి ఇంతవరకూ అధికారంలో కొనసాగుతోంది. దురదృష్టవశాత్తు అలాంటి రాజకీయ
స్టాల్వార్ట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం, ఆద్యతన
భవిష్యత్‍లో అలాంటి వారు దొరుకుతారన్న నమ్మకం కుదరకపోవడం, పార్టీని
అపజయ పరంపరలకు గురిచేస్తోంది.
అలనాడు నీలం సంజీవరెడ్డి, ఆయన తరువాత ఆయన వారసుడుగా
వచ్చిన బ్రహ్మానందరెడ్డి, 1978-1989 ఎన్నికల్లో
విజయం సాధించి పెట్టిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, 2004-2009 ఎన్నికల్లో
విజయం సాధించి పెట్టిన డాక్టర్ రాజశేఖర రెడ్డి మినహా, ఈ
రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య మంత్రులుగా పనిచేసిన వారందరూ, "దిగుబడి సరుకే"!. అధిష్ఠానం నమ్మిన వారో,
అధిష్ఠానాన్ని నమ్మించిన వారో, అధిష్ఠానాన్ని
ఆ కట్టుకోగలిగిన వారో, లాబీయింగ్ చేయగలిగిన వారో మాత్రమే
ముఖ్యమంత్రులు కాగలిగారు. ఆ ఆచారం జవహర్లాల్ నెహ్రూ కాలం
నుంచి సోనియా హయాం వరకూ అలాగే కొనసాగుతూ వస్తోంది. దామోదరం
సంజీవయ్య గారి నుంచి నేటి కిరణ్ కుమార్ రెడ్డి వరకూ అదే వరస. వీరిలో సమర్ధులు లేరని కాని, "దిగుబడి"
కి సమర్ధత కొలమానం కాదని కాని ఈ వ్యాస రచయిత భావన కాదు. ఇదంతా ఒక ఎత్తైతే, కాంగ్రెస్ ఓట్ బాంక్ వ్యవహారం మరో
ఎత్తు. ఎన్టీ రామారావు ప్రభంజనంలో ఓడినప్పుడు కాని, ఆ తరువాత
చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం హయాంలో ఓడినప్పుడు కాని, త్రి
ముఖ పోటీ జరిగినప్పుడు కాని, కాంగ్రెస్ ఓటు బాంక్ 35-40 శాతానికి తగ్గకుండా
పదిలంగా వుంటూ వస్తుంది. మొట్టమొదటి సారిగా దానికి భారీ గండి పడింది. తెలంగాణ
ప్రాంతంలో తెరాస గండి కొడుతుంటే, సీమాంధ్రలో జగన్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్
ఆ పని చేసింది. ఓటింగు శాతం ఇరవైకి పడిపోయి ఘోర పరాజయం పాలైంది కాంగ్రెస్ పార్టీ.
డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014 లో ఎదురు కానున్న పరిస్థితి అగమ్య గోచరంగా కనిపించసాగింది.
2009 ఎన్నికల్లో
అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణ భూతుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి
హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణానికి గురైన దరిమిలా పార్టీకి ఈ దుస్థితి క్రమేపీ
ఏర్పడ సాగింది. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ,
భారతీయ జనతా పార్టీల సారధ్యంలో ఊపందుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర
ఏర్పాటు ఉద్యమం తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ను మట్టి కరిపిస్తుంటే, మరో పక్క కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ సీపీ సీమాంధ్ర
ప్రాంతంలో తిరుగులేని శక్తిగా ఎదగ సాగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీమాంధ్రలో
జగన్ విజయం, తెలంగాణలో తెరాస అభ్యర్థి విజయం కాంగ్రెస్ పార్టీని
ఖంగు తినిపించాయి. అధిష్ఠానానికి నెత్తి బొప్పి కట్టించేలా చేశాయి. నెత్తి మీద
కుంపటి దించుకున్న చందాన, చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని
కాంగ్రెస్ లో విలీనం చేసినా ఫలితం శూన్యం. కాకపోతే, చావు
తప్పి కన్నులొట్టపోయినట్లుగా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు
కాంగ్రెస్‌కు రెండు సీట్లిచ్చాయి. ఇదేదో తన ఘనతగా చాటుకుంటున్నాడు చిరంజీవి. ఆయన
తన సినీరంగ పలుకుబడితో జనాలను ఆకర్షించుకోగలడేమో కాని, ఓటర్లను
ఆకట్టుకోలేరనేది మరో మారు స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీకి తెలిసో-తెలియకో,
ప్రత్యక్ష జోక్యంతోనో-పరోక్ష ఒత్తిడితోనో, ఆ
పార్టీ రచించిన ప్రణాళికా వ్యూహం బెడిసికొట్టిందనాలి. జగన్మోహన్ రెడ్డి
అరెస్ట్-తదనంతర పరిణామాలు కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర ప్రతికూలతకు దారి తీశాయి.
మరి ఈ దుస్థితి నుంచి గట్టెక్కాలంటే, నాలుగో కృష్ణుడి రూపంలో,
జైపాల్ రెడ్డో-జానారెడ్డో-శషిధర రెడ్డో-డి. శ్రీనివాసో-లేదా,
మరో వ్యక్తో రావాలి. కాకపోతే ఆ వచ్చే వారికి కూడా ఇదే పరిస్థితి ఎదురు
కాదన్న నమ్మకం లేదు.
"టీ"-"జే" ల ఒత్తిడి మధ్య కొట్టు
మిట్టాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం నాలుగు రోడ్ల కూడలి
మధ్య వున్నట్లుంది. ఇదే పరిస్థితి దాదాపు జాతీయ స్థాయిలో కూడా నెలకొని వుంది. కళ్ల
ముందర, ఈ పరిస్థితిని అధిగమించడానికి, మార్గాలేవీ
కనిపించడం లేదు. గత ఎన్నికల్లో యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి
దోహదపడేందుకు, దేశంలోనే అధిక సంఖ్యలో-33 మంది ఎంపీలను సమకూర్చిన
రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ప్రభావం జాతీయ స్థాయిలో పార్టీ మీద పడక తప్పదు.
పార్టీ-యుపిఎ అధికారానికి దూరం కాక తప్పదు. ఈ నేపధ్యంలో, మన్మోహన్
సింగ్ నుంచి అత్యంత అలవోకగా ప్రధాని పదవిని తనయుడు రాహుల్ గాంధీకి బదలాయించాలని
తాపత్రయ పడుతున్న సోనియా గాంధీ ముందున్న సవాళ్లు ఏంటి? వాటిని
ఆమె ఏ విధంగా అధిగమించగలరు? కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలం
ఎదుర్కుంటుందన్నది వాస్తవం. సవాళ్లను సోనియా ఎదుర్కునే ముందర, రాష్ట్రంలో అందరికీ అర్థం అవుతున్న కొన్ని నగ్న సత్యాలను అధిష్ఠానం సహితం
అర్థం చేసుకుంటే మంచిదేమో! మంచికో-చెడ్డకో రోశయ్యను మార్చి కిరణ్ కుమార్ రెడ్డికి
ముఖ్యమంత్రి పదవిని అంటగట్టిన అధిష్ఠానం, ఏ నాడన్నా ఆయనకు
పరిపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చిందా? ఆయన మంత్రి వర్గాన్ని ఆయనే
ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చిందా? పదవుల పందేరం
చేయనిచ్చిందా? ఆయనకిష్ఠమైన వారిని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష
పదవికి ఎంపిక చేసుకునే వీలు కలిపించిందా? తన మంత్రివర్గంలో
అనునిత్యం తనను ఎదిరిస్తున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు కిరణ్ కుమార్
రెడ్డికి అవకాశం వుందా? ముందు వీటిపై దృష్టి సారించాల్సిన
అవసరం అధిష్ఠానానికి ఉంది.
బహుశా, తమిళనాడు తరహాలో, ఏదో ఒక
ప్రాంతీయ పార్టీతో అవగాహన కుదుర్చుకోక తప్పని పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా
కాంగ్రెస్‌కు తప్పదా? అలాంటప్పుడు, ఆ
ప్రాంతీయ పార్టీ ఎలాగూ తెలుగుదేశం కాదు కాబట్టి, తెరాసతోను-వైఎస్సార్ సీపీ తోను అవగాహన వుండే అవకాశాలున్నాయా? రాష్ట్ర
విభజన చేయక తప్పదా? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు
విషయంలో ఏదో ఒక నిర్ణయం ప్రకటించక తప్పదా?
2014 లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్‌ను సన్నద్ధం
చేసేందుకు-బలోపేతం చేసేందుకు, జాతీయ
స్థాయిలో పార్టీ అధి నాయకత్వం-అధిష్జ్ఠానం చేపడుతున్న
చర్యల్లో భాగంగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు
సోనియా గాంధీ కుమారుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, భావి భారత ప్రధానిగా భావించబడుతున్న
రాహుల్ గాంధీ, ముఖ్య భూమిక పోషించేందుకు సమాయత్తమౌతున్నారు.
యువ నాయకుడు రాహుల్ గాంధీ కాయ కల్ప చికిత్స
మొదలు పెట్టారంటున్నారు. అందులో
భాగంగానే, ఢిల్లీలో తల్లిని కలవడానికి వచ్చిన పెద్దా-చిన్నా పనిలో పనిగా రాహుల్ గాంధీని కూడా కలిసి పోతున్నారు. అంతే కాదు. రాహుల్ గాంధీనే స్వయంగా ఎంపిక చేసిన
కొందరికి ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. అధిష్ఠానానికి
తలనొప్పిగా మారిన తెలంగాణ అంశంపైన, వైఎస్‌ఆర్సీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ దూకుడు
పైన రాహుల్ ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు మీడియా కధనాలొచ్చాయి. రాష్ట్రంలోని
సీనియర్ నేతలు పలువురితో వ్యక్తిగతంగా మంతనాలు జరిపారు. ఇప్పటికే రాహుల్
రాష్ట్రానికి చెందిన ఏడుగురు ఎంపీలతో విడివిడిగా సమావేశమై పార్టీ వ్యవహారాలపై
సుదీర్ఘంగా చర్చించారంటున్నారు. అధినేత్రి సోనియా ఆదేశాలతోనే రాహుల్ రంగ ప్రవేశం చేశారా?
లేక స్వయంగా ఆయన తనంతట తానే చొరవ తీసుకుని ఇలా చేస్తున్నారా?
అనేది ఇంకా తేలాల్సిన విషయమే.
సీనియర్ పార్టీ నాయకుడు పాల్వాయి
గోవర్ధనరెడ్డికి రాహుల్ కబురు పంపి మరీ కలుస్తున్నాడు. ఈ
కలయిక వెనుక కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలన్న ఆశయముందా? లేక తాత్కాలికంగా నాయకత్వ మార్పు గురించిన ఆలోచన వుంటుందా? ఇప్పుడిప్పుడే ఏమీ చెప్పలేం. ఇటీవల కాలంలో పాల్వాయి
గోవర్ధన రెడ్డిని సంప్రదించడం కొంచెం ఎక్కువైపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒక వేళ నాయకత్వం మార్చే అవకాశం వుంటే, సీనియర్
నాయకుడైన ఈ తెలంగాణ ప్రాంత వ్యక్తికి కూడా అవకాశాలుండవచ్చేమో! ఏదేమైనా ప్రత్యేక తెలంగాణ
విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు మెరుగయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
అందులో భాగంగా, రాయల తెలంగాణాను ఏర్పాటు చేసి, తెరాసతో సంకీర్ణ
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, మిగిలిన సీమాంధ్ర ప్రాంతానికి
మొదలు ఢిల్లీ నుంచి ఒక నాయకుడిని దిగుమతి చేసి ముఖ్యమంత్రిని చేయడం, ఆ తరువాత చిరంజీవిని పీఠం ఎక్కించడం జరగొచ్చని భావిస్తున్నారు.
నాటి ముఖ చిత్రాన్ని ఇప్పుడే బాగా చెప్పేరు. రాష్ట్రంలో కేంద్రంలో జరగబోయే కాయకల్ప చికిత్సలేమీ గొప్పగా ఉండబోవు. ఇక రాహుల్ గాంధీ ఒక పెద్ద ఫ్లాప్ షో!
ReplyDelete