ప్రాంతీయ
పార్టీల జాతీయ ప్రభుత్వం
2009 లోక్ సభ
ఎన్నికల అనంతరం ఏర్పాటైన యుపిఎ లో, భాగస్వామ్య పక్షాలుగా
తృణమూల్ కాంగ్రెస్, డిఎంకె, ఎన్సీపి,
నేషనల్ కాన్ఫరెన్స్, జె ఎం ఎం, ముస్లింలీగ్, మజ్లిస్ లతో సహా మరో రెండు చిన్న
పార్టీలున్నాయి. వీరంతా కలిసి కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. సమాజ్ వాదీ పార్టీ బయట
నుంచి మద్దతు ఇచ్చింది. ఐతే తృణమూల్ కాంగ్రెస్ అలిగి
సంకీర్ణాన్ని విడిచి పెట్టిన తరువాత, మైనారిటీలో పడి పోయిన
ప్రభుత్వానికి, సమాజ్ వాదీ పార్టీతో పాటు, ఉత్తర ప్రదేశ్ కు చెందిన బహుజన సమాజ్ పార్టీ కూడా తన మద్దతును
ప్రకటించింది. ఆ తరువాత డిఎంకె కూడా ప్రభుత్వంపై అలక పూనింది.
మధ్యలో మజ్లిస్ కాంగ్రెస్ కు తన మద్దతును ఉపసంహరించుకుంది. ఐనప్పటికీ యుపిఎకి పెద్దగా సంఖ్యాపరమైన నష్టం కలగలేదు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఓటింగ్ తో కూడిన చర్చకు ప్రభుత్వం
అంగీకరించిన నేపధ్యంలో లోక్ సభలో బలాబలాలను అంచనా వేసిన విశ్లేషకులకు, యుపిఎ బలం 265 మంది సభ్యులని తేలింది. 22 మంది సభ్యులున్న సమాజ్ వాదీ, 21
మంది
సభ్యులున్న బహుజన సమాజ్ పార్టీ కూడా మద్దతిస్తే, దాని బలం 300 దాటుతుంది. కాకపోతే
రాజ్యసభలో కొంత ఇబ్బంది కలగవచ్చు. అధికార పక్షం పరిస్థితి ఇలా వుంటే, ప్రతిపక్ష పార్టీలు
ఐక్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేసే దశలో లేవు. అదే యుపిఎ ప్రభుత్వానికి శ్రీరామ రక్షగా మిగిలిపోయింది.
మరోవైపు బిజెపి సారధ్యంలోని ఎన్డీయే, మూడో, నాలుగో ఫ్రంటులు రాబోయే ఎన్నికల కోసం ఎవరి వ్యూహంలో వారున్నారు. ప్రస్తుతం
కాంగ్రెస్ పార్టీని-యుపిఎని వీడిన అలనాటి మిత్ర పక్షాలు కాని, ఇంకా కలిసి వున్న ఇతర చిన్న-చితకా పార్టీలు కాని రాబోయే లోక్ సభ ఎన్నికలలో
ఉమ్మడిగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా వున్నట్లు కనిపించడం
లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా అవి తనతో కలిసి ఎన్నికల ముందు అవగాహన కుదుర్చుకుని
పోటీ చేసే కంటే, అవి వేరుగా పోటీ చేసి, వీలై నన్ని స్థానాలు గెల్చుకుని, ఎన్నికల అనంతరం
సంకీర్ణంగా ఏర్పడితే మంచిదన్న ఆలోచనలో వుంది. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం
కాంగ్రెస్ పార్టీ, యుపిఎ ప్రభుత్వం "యాంటీ ఇన్‍కంబెన్సీని"
తట్టుకోవాల్సిన పరిస్థితిలో పడిపోయింది. దానికి తోడు అవినీతి ఆరోపణలు కూడా
వున్నాయి. తన పార్టీకి ఎలాగూ గతంలో వచ్చి నన్ని స్థానాలు వచ్చే అవకాశం లేదని ఆ
పార్టీ భావనలాగా కనిపిస్తోంది. తనతో కలిసి పోటీ చేసి తన మైలను భాగస్వామ్య పక్షాలు
అంటించుకునేకంటే, విడిగా పోటీ చేసి మంచి పేరుతో కొన్ని
స్థానాలు గెలవడం మంచిదన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా వుంది. అదే జరుగబోతుంది. ఈ
నేపధ్యంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగబోతోంది అని పలువురు విశ్లేషకులు
భావిస్తున్నారు.
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి, నేటిదాకా,
గత ఆరు దశాబ్దాల కాలంలో, రాజకీయాలలో గణనీయమైన
మార్పులు వచ్చాయి. ఆ మార్పులను వివిధ కోణాలనుంచి పరిశీలన చేయవచ్చు. ఆ మార్పులలో
ప్రధానంగా గమనించాల్సిన విషయం, ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యత
పెరగడం. ఒకప్పుడు ఏ ఒకటో-రెండో రాష్ట్రాలకే పరిమితమైన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు
దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ వేళ్ల్లూనుకు పోయి, పార్లమెంటులో
తమ బలాన్ని చాటుకుంటున్నాయి. గత రెండు-మూడు సార్వత్రిక ఎన్నికలలో ప్రాంతీయ
పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని గమనిస్తే, జాతీయ పార్టీలకంటే
అవి అధికంగా వున్నాయి. అంటే జాతీయ పార్టీల ప్రాముఖ్యత జాతీయ స్థాయిలో తగ్గుకుంటూ
పోతుంటే, ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరుక్కుంటూ పోతోంది.
భారత్ దేశ రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న మరో ప్రధానాంశం, వోటు
వేసే వారిలో అధిక శాతం మంది బలహీన వర్గాలకు, అణగారిన
వర్గాలకు చెందిన వారు కావడం. మహిళలు కూడా పెద్ద ఎత్తున పురుషులకంటే అధికంగా ఓటింగ్‌లో
పాల్గొనడం విశేషం. వీటన్నిటి ప్రభావం ఏ మేరకు రాబోయే సార్వత్రిక ఎన్నికలపై
పడుతుందో విశ్లేషించాలంటే, ప్రాంతీయ పార్టీల గురించి మరింత
లోతుగా అధ్యయనం చేయాలి. ఈ నేపధ్యంలో ఇక్కడ కొన్ని మౌలికాంశాలను పరిగణలోకి
తీసుకోవాలి.
ఒకవైపు ప్రాంతీయ పార్టీలు బలంగా పాతుకు పోతుంటే, మరొక
వైపు, జాతీయ పార్టీలు బలహీన పడిపోవడంతో, పార్లమెంటులో మెజారిటీ స్థానాలను సంపాదించుకోవడం ఏ ఒక్క జాతీయ పార్టీకి
సాధ్యపడదు. మెజారిటీకి దగ్గరగా రావడం కూడా కష్టమే. ఎప్పుడైతే, ఏ ఒక్క జాతీయ పార్టీ మెజారిటీ స్థానాలను సంపాదించుకోలేదో, ఇప్పటి లాగే, ప్రాంతీయ పార్టీలతో కలిసి కేంద్రంలో
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం మినహా గత్యంతరం లేదు. అలాంటప్పుడు ప్రాంతీయ
పార్టీలతో అవగాహన ఎన్నికల ముందా? తరువాతా? అన్న ప్రశ్న ఉదయించక మానదు. ఉదాహరణకు 2009 ఎన్నికలే తీసుకుంటే, ఎన్నికల
ముందు ఎక్కువగా కలిసి కట్టుగా-ఉమ్మడిగా పోటీ చేయడం జరగలేదు. ఎన్నికల అనంతరమే అవగాహన
కొచ్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అలా అని ప్రాంతీయ పార్టీలు,
జాతీయ పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేయలేదని అర్థం కాదు. ఎన్నికల
ముందు అవగాహన వుంటే సంకీర్ణాలు మనుగడ సాగించడం సులభం. ఎన్నికల అనంతరం అవగాహనకు
వస్తే, బెదిరింపుల మధ్య, సంకీర్ణ
ప్రభుత్వం మనుగడ కష్టం అవుతుంది. 1999-2004 మధ్య అధికారంలో వున్న బీజేపీ సారధ్యంలోని
ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వమైనా, 2004-2009 మధ్య అధికారంలో వున్న
కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని యుపిఎ ప్రభుత్వమైనా, అస్థిరత-స్థిరత్వం మధ్య ఊగిసలాడినప్పటికీ, పూర్తికాలం పాటు కొనసాగాయి. అది ఒక విధంగా గొప్ప విషయమే. ఇక 2009 తరువాత అధికారంలో
కొచ్చిన యుపిఎ సంకీర్ణ ప్రభుత్వం అహర్నిశలూ బెదిరింపులను ఎదుర్కుంటూనే మనుగడ
సాగిస్తోంది. వస్తున్న బెదిరింపులన్నీ ప్రాంతీయ పార్టీల నుంచే కావడం విశేషం.
సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో, పార్లమెంటులో
ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల సంఖ్య లెక్కకు మించి పోయింది. సభలో జరిగే చర్చలలో
నాణ్యత లోపించడంతో పాటు, సభ నిర్వహణ కష్ట సాధ్యమై పోయి,
వాయిదాపడడం సర్వసామాన్యమైన విషయంగా మారిపోయింది. రకరకాల పార్లమెంటరీ
తీర్మానాలతో సభ ఏనాడూ సజావుగా సాగనీయడం లేదు ప్రతిపక్షాలు. అధికార పక్షంలోని
భాగస్వామ్య పార్టీలకు చెందిన ప్రాంతీయ పార్టీ వారు కూడా ప్రభుత్వాన్ని ఇరుకున
పెట్టే అనేక చర్యలకు పాలపడుతున్నారు. పర్యవసానంగా సభలో చర్చించి సభ ఆమోదం
పొందాల్సిన అనేక బిల్లులు ప్రవేశపెట్టడానికి కూడా నోచుకోక పోవడం దురదృష్టం.
ప్రవేశపెట్టిన ఎన్నో బిల్లులు చర్చ జరగకపోవడంతో చాలా కాలంపాటు పెండింగ్‌లో పడిపోతున్నాయి.
పార్టీల సంఖ్య పెరగడంతో పార్లమెంటరీ ప్రక్రియకే ముప్పు వాటిల్లడంతో పాటు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారిపోయింది.
ఆరు దశాబ్దాల భారతదేశ రాజకీయ రంగంలో గణనీయమైన మార్పులు రావడంతోను, ప్రాంతీయ
పార్టీలు అధికసంఖ్యలో ఆవిర్భవించడంతోను, ఎన్నికల ముఖ చిత్రమే
పూర్తిగా మారిపోయింది. ఒక్కో ఎన్నిక జరిగే కొద్దీ, పోటీలో
వుండే పార్టీల సంఖ్య పెరగ సాగింది. 1952 లోక్ సభ ఎన్నికలలో కేవలం 55 పార్టీలు మాత్రమే రంగంలో వుంటే, 2009 ఎన్నికల కల్లా వాటి సంఖ్య 370 కి చేరుకుంది. ఇంతవరకు
జరిగిన అన్ని ఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే, 1957 లో మాత్రమే అతి తక్కువగా కేవలం 16 పార్టీలు మాత్రమే పోటీలో వుండగా, అత్యంత అధిక సంఖ్యలో 2009 లో పోటీకి దిగాయి. వీటి సంఖ్య రాబోయే ఎన్నికలలో ఇంకా పెరగొచ్చు.
మొదటి ఎన్నికలలో పోటీ చేసిన 55 పార్టీలలో, 18 రాష్ట్ర స్థాయి పార్టీలు, 29 రిజిస్టర్డ్ పార్టీలు కాగా జాతీయ పార్టీల సంఖ్య కేవలం
8 మాత్రమే! వాటి సంఖ్య 2004 లో 6 కు పడి పోయింది. కాగా
అదే ఎన్నికలలో పోటీలో వున్న 230 పార్టీలలో,
36 ప్రాంతీయ
పార్టీలు, 188 రిజిస్టర్డ్ పార్టీలు
వున్నాయి. దానర్థం ఒకవైపు ప్రాంతీయ-రిజిస్టర్డ్ పార్టీల సంఖ్య పెరుగుతూ పోతుంటే, జాతీయ
పార్టీల సంఖ్య తగ్గుకుంటూ పోతోంది. అదే విధంగా 1952 లోక్ సభ
ఎన్నికల అనంతరం పార్లమెంటులో 22 పార్టీలకు ప్రాతినిధ్యం లభించగా, 2009 ఎన్నికల అనంతరం 37 పార్టీలకు ప్రాతినిధ్యం లభించింది. అత్యంత తక్కువగా కేవలం 12 పార్టీలకు మాత్రమే
ప్రాతినిధ్యం లభించింది
1957 ఎన్నికల అనంతరం. ఏ విధంగా పార్టీల సంఖ్య, అవి
పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించే వాటి సంఖ్య పెరుగుకుంటూ పోతుందో ఈ లెక్కలు
తెలియచేస్తాయి.
ప్రాంతీయ పార్టీల సంఖ్య పెరగడమంటే, రాజకీయ పోటీ తత్వంలో
మార్పుల రావడమే. మొదట్లో, రాష్ట్ర శాసన సభలలో జాతీయ
పార్టీలకు పోటీగా వున్న ప్రాంతీయ పార్టీలు దరిమిలా పార్లమెంటులో జాతీయ పార్టీలను శాసించే
స్థాయికి చేరుకున్నాయి. ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో ప్రాంతీయ
పార్టీకి ప్రజల మద్దతు-ఓటర్ల మద్దతు లభిస్తున్న తీరుతెన్నులను పరిశీలిస్తే,
వారు పూర్తిగా జాతీయ పార్టీలను మరిచిపోతున్నారే మో అనిపిస్తోంది.
కొన్ని రాష్ట్రాలలో ప్రధాన పోటీ ఒక ప్రాంతీయ పార్టీకి, ఏదో
ఒక జాతీయ పార్టీకి మధ్యన వుంటే, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఆ పోటీ ఒక ప్రాంతీయ పార్టీకి, మరో ప్రాంతీయ పార్టీకి మధ్యనే వుంటోంది. ఎన్నికల రంగంలో ఆ రాష్ట్రాలలో
జాతీయ పార్టీలు మూడు-నాలుగు స్థానానికి పరిమితమై పోవడం కూడా కష్టమవుతోంది.
ప్రాంతీయ పార్టీలతో పోల్చి చూస్తే, దేశం మొత్తం మీద జాతీయ
పార్టీలకు పోలైన ఓట్ల శాతం తగ్గుకుంటూ వస్తోంది. ప్రధానంగా 1996 ఎన్నికల తరువాత ఈ
పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఒకవైపు గెలిచిన స్థానాల సంఖ్యను పెంచుకుంటూ
పోతున్న ప్రాంతీయ పార్టీలు, మరో పక్క ఓటింగ్ శాతాన్ని కూడా పెంచుకుంటున్నాయి. 1984 లో ప్రాంతీయ
పార్టీలన్నిటికీ కలిపి
11.2% ఓట్లు రాగా, 2009 ఎన్నికల
నాటికి 28.4% కి
పెరిగింది. రాబోయే ఎన్నికలలో 30% దాటినా ఆశ్చర్య పోనక్కరలేదు. దానర్థం జాతీయ పార్టీలకు కనీసం రెండు
వందల స్థానాలన్నా రావడం కష్టమే! ఎక్కువమంది ఓటర్లలో
జాతీయ పార్టీలకంటే ప్రాంతీయ పార్టీలే మంచివన్న అభిప్రాయం వుండి వుండాలి. రాష్ట్రాల
పాలన ప్రాంతీయ పార్టీల చేతుల్లో వుండాలని కోరుకోవడంతో పాటు, రాష్ట్ర
ప్రభుత్వాల అవసరాలకు అనుగుణంగా కేంద్రం నడుచుకోవాలంటే, పార్లమెంటులో
కూడా వాటికి గణనీయమైన స్థానాలను గెలిపించాలని ఓటర్లు భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో రానున్న లోక్ సభ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలదే హవా
కానుంది. ఎన్నికల అనంతరం యుపిఎ, ఎన్డీఏ లలో ఎవరు ఎక్కువగా ప్రాంతీయ పార్టీలను
ఆకర్షించుకోగలరో వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు. ముఖ్యంగా డిఎంకె,
అన్నా డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ, బహుజన సమాజ్ పార్టీ, తెలుగు దేశం, ఎన్సీపి, జనతాదళ్,
శివ సేన, అకాలీదళ్, బిజూ
జనతాదళ్, రాష్ట్రీయ జనతాదళ్, తెలంగాణ
రాష్ట్ర సమితి, వైఎస్సార్సీపి లాంటి పార్టీల మద్దతు
కీలకమవుతుంది. వీటిలో చాలా వరకు, ప్రస్తుతానికి యుపిఎ,
ఎన్డీఏ లలో ఏదో ఒక దాంట్లో భాగస్వాములుగా వున్న ఈ పార్టీలు అన్నీ
కలిసి సుమారు 200-250 స్థానాలు
గెల్చుకునే అవకాశం వుంది. వీరంతా కలిసి ఒక ప్రాంతీయ పార్టీల ఫ్రంట్‌గా ఏర్పడితే
జాతీయ పార్టీల పరిస్థితి డోలాయమానంలో పడినట్లే! అందుకే రాబోయే ది ప్రాంతీయ
పార్టీల జాతీయ ప్రభుత్వం. తస్మాత్ జాగ్రత్త!